Vedanta
-
మార్కెట్ రికార్డుల హ్యాట్రిక్
ముంబై: స్టాక్ సూచీల రికార్డుల జోరు మూడో రోజూ కొనసాగింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, టెలికం షేర్లు రాణించడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల అంశాలు కలిసొచ్చాయి. సెన్సెక్స్ 52 పాయింట్లు పెరిగి 80,717 వద్ద ముగిసింది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 24,613 వద్ద స్థిరపడింది. ముగింపు స్థాయిలు సూచీలకు సరికొత్త రికార్డు. ఉదయ లాభాలతో మొదలైన సూచీలు.., అధిక వాల్యుయేషన్ల ఆందోళనల తో పరిమిత శ్రేణిలో కదలాడాయి. అయినప్పటికీ.., ఒక దశలో సెన్సెక్స్ 233 పాయింట్లు బలపడి 80,862 వద్ద, నిఫ్టీ 133 పాయింట్లు ఎగసి 24,635 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. ఫైనాన్షియల్ సరీ్వసెస్, యుటిలిటీ, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.⇒ మొహర్రం సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు నేడు సెలవు. ట్రేడింగ్ జరగదు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లలో మాత్రం సాయంత్రంసెషన్‌లో ట్రేడింగ్ జరుగుతుంది.వేదాంతా క్విప్ ధర రూ. 461 వేదాంతా అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ (క్విప్)కి తెరతీసింది. షేరుకి రూ. 461.26 ఫ్లోర్ ధరలో రూ. 8,500 కోట్లు సమీకరించనుంది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనుంది. సోమవారం ముగింపు ధర రూ. 459.4తో పోలిస్తే ఫ్లోర్ ధర స్వల్ప ప్రీమియం. వేదాంతా షేరు బీఎస్ఈలో 1% నీరసించి రూ. 456 వద్ద ముగిసింది. -
హిందుస్తాన్ జింక్ విభజనకు కేంద్రం నో...
న్యూఢిల్లీ: ప్రమోటర్ గ్రూప్.. వేదాంతా ప్రతిపాదిత హిందుస్తాన్ జింక్ కంపెనీ విభజనకు గనుల శాఖ నో చెప్పింది. హిందుస్తాన్ జింక్‌ను రెండు విభిన్న సంస్థలుగా విడదీసేందుకు వేదాంతా గ్రూప్ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు మైన్స్ సెక్రటరీ వీఎల్ కాంతారావు తాజాగా వెల్లడించారు. వాటాదారుగా కంపెనీ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యంగా లేదని తెలియజేశారు. వెరసి విభజన ప్రతిపాదనను అంగీకరించలేదని స్పష్టం చేశారు. కంపెనీలో ప్రభుత్వం 29.54 శాతం వాటాతో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను పెంచుకునే బాటలో జింక్, సిల్వర్‌సహా బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకు హిందుస్తాన్ జింక్ ఇంతక్రితం ప్రతిపాదించింది. కాగా.. బిజినెస్‌ల విభజనకు సలహాదారు సంస్థను నియమించుకునే యోచనలో ఉన్నట్లు గతంలో హిందుస్తాన్ జింక్ ప్రకటించింది. కంపెనీ విలువను మెరుగుపరచేందుకు కార్పొరేట్ నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. జింక్, లెడ్, సిల్వర్, రీసైక్లింగ్ బిజినెస్‌లను రెండు చట్టబద్ధ కంపెనీలుగా ఏర్పాటు చేయనున్నట్లు ఇంతక్రితం నియంత్రణ సంస్థలకు తెలియజేసింది. -
బాండ్ల పునర్వ్యవస్థీకరణకు వేదాంత బాండ్‌హోల్డర్ల ఓకే
న్యూఢిల్లీ: నాలుగు సిరీస్‌ల బాండ్లను పునర్వ్యవస్థీకరించేందుకు బాండ్హోల్డర్లు సమ్మతించినట్లు వేదాంత గ్రూప్ మాతృ సంస్థ వేదాంత రిసోర్సెస్ తెలిపింది. ఈ బాండ్ల సిరీస్‌లో చెరి 1 బిలియన్ డాలర్ల విలువ చేసే రెండు ఇష్యూలు, 1.2 బిలియన్ డాలర్లది ఒకటి, 600 మిలియన్ డాలర్లది మరొకటి ఉన్నాయి. ఇవి 2024 నుంచి 2026 మధ్య మెచ్యూర్ అవుతాయి. తాజా పరిణామం నేపథ్యంలో తదుపరి ప్రణాళిక గురించి చర్చించేందుకు జనవరి 4న వేదాంత ఇన్వెస్టర్ల సమావేశం నిర్వహించనుంది. భారీ రుణభారాన్ని తగ్గించుకునే దిశగా వేదాంత రిసోర్సెస్ నాలుగు సిరీస్‌ల బాండ్ల పునర్వ్యవస్థీకరణను తలపెట్టింది. -
జపాన్ సహకారంతో వేదాంత సెమీకండక్టర్ ప్లాంట్!
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెమీకండక్టర్ ప్లాంటు కోసం జపాన్ టెక్నాలజీ కంపెనీలతో సహకారాన్ని అన్వేషిస్తున్నట్లు వేదాంత గ్రూప్ తెలిపింది. గుజరాత్లో సెమీకండక్టర్ ఫ్యాబ్‌ను నెలకొల్పుతున్నట్టు వేదాంత ఇప్పటికే ప్రకటించింది. జపాన్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ రోడ్‌షో సందర్భంగా వేదాంత సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్ గ్లోబల్ ఎండీ ఆకర్ష్ కె హెబ్బార్ మాట్లాడారు. గుజరాత్‌లోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న కంపెనీలకు ఇది 80 బిలియన్ డాలర్ల అవకాశం అని చెప్పారు. దేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్‌ను నిర్మించడంలో సహాయం చేయడానికి భాగస్వామ్యం కావాలని జపాన్ కంపెనీలను ఈ సందర్భంగా ఆహ్వానించినట్టు వేదాంత తెలిపింది. భారత సెమీకండక్టర్, గ్లాస్ డిస్ప్లే తయారీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని ప్రోత్సహించడానికి వేదాంత గ్రూప్‌నకు చెందిన అవన్‌స్ట్రేట్ ఇంక్ గత ఏడాది చివర్లో 30 జపనీస్ టెక్నాలజీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. -
వేదాంతా ఐరన్, స్టీల్ బిజినెస్ షురూ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్‌ల విడదీత ప్రణాళికల్లో భాగంగా వేదాంతా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ పేరుతో పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. రూ. 1 ముఖ విలువగల లక్ష ఈక్విటీ షేర్ల అధీకృత మూలధనంతో సంస్థకు తెరతీసింది. గత నెల 29న ప్రకటించిన బిజినెస్‌ల విడదీత ప్రణాళికలకు అనుగుణంగా ఐరన్, స్టీల్ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసినట్లు వేదాంతా వెల్లడించింది. విభిన్న విభాగాలైన అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్ తదితరాలను 5 కంపెనీలుగా విడదీసేందుకు గత నెలలో వేదాంతా నిర్ణయించిన విషయం విదితమే. తద్వారా వాటాదారులకు మరింత విలువ చేకూర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇనుము, స్టీల్ బిజినెస్ నిర్వహణకు తాజాగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే బుధవారం వేదాంతా బేస్ మెటల్స్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థకు తెరతీసిన సంగతి తెలిసిందే. -
కోవర్టు లాబీయింగ్ చేశాయి
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ ప్రమోటర్లపై ఆరోపణలు గుప్పించిన ఓసీసీఆర్పీ తాజాగా పారిశ్రామిక దిగ్గజం అనిల్ అగర్వాల్‌కి చెందిన కంపెనీలు వేదాంత, కెయిర్న్ ఇండియాను టార్గెట్ చేసింది. పర్యావరణ చట్టాలను అనుకూలంగా మార్చుకునేందుకు వేదాంత కోవర్టు లాబీయింగ్ నడిపినట్లు కొత్తగా మరో నివేదికలో ఆరోపించింది. ప్రభుత్వం కూడా ప్రజలను సంప్రదించకుండా నిబంధనల మార్పులను ఆమోదించి, ‘అక్రమ పద్ధతుల్లో’ అమలు చేసినట్లు పేర్కొంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్టు (ఓసీసీఆర్పీ) విడుదల చేసిన నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు.. ► కొత్తగా పర్యావరణ అనుమతుల అవసరం లేకుండా దేశీయంగా ఉత్పత్తిని 50% వరకు పెంచుకునేందుకు మైనింగ్ కంపెనీలకు అనుమతినిస్తే ఆర్థిక వ్యవస్థ రికవరీ మరింత వేగవంతం కాగలదని 2021 జనవరిలో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ అప్పటి పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు లేఖ రాశారు. ► ‘‘2022 తొలినాళ్లలో పలు దఫాల సమావేశాల అనంతరం పర్యావరణ శాఖ నిబంధనలను సడలించింది. ప్రజాభిప్రాయాల సేకరణ నిర్వహించాల్సిన అవసరం లేకుండా మైనింగ్ కంపెనీలు 50 శాతం వరకు ఉత్పత్తిని పెంచుకునేందుకు అనుమతించింది’’ అని ఓసీసీఆర్పీ తెలిపింది. ► వేదాంత తరహాలోనే దాని అనుబంధ సంస్థ కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా వ్యవహరించింది. చమురు అన్వేషణ ప్రాజెక్టుల కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిబంధనను ఎత్తివేసేందుకు లాబీయింగ్ చేసింది. ► అధికార బీజేపీకి వేదాంత గణనీయంగా విరాళాలు కూడా ఇచి్చనట్లు (2016–2020 మధ్య కాలంలో రూ.43.5 కోటు)్ల ఆధారాలు ఉన్నాయని ఓసీసీఆర్పీ తెలిపింది. వేదాంత స్పందన ఇదీ.. ఓసీసీఆర్పీ ఆరోపణలను నిర్దుష్టంగా ఖండించకుండా వేదాంత స్పందించింది. ‘దిగుమతులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి అనుకూలమైన విధానాల్లో దేశీయంగా ఉత్పత్తిని పెంచాలనేది మా లక్ష్యం. దానికి అనుగుణంగా దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, సహజ వనరుల విషయంలో భారత్ స్వావలంబన సాధించడంలో తోడ్పాటు అందించే ఉద్దేశంతో ప్రభుత్వ పరిశీలన కోసం పలు విజ్ఞప్తులు చేశాము‘ అని సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. -
రూ.1,440 కోట్ల డీల్, వేదాంత చేతికి మీనాక్షి ఎనర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఉన్న మీనాక్షి ఎనర్జీని రూ.1,440 కోట్లకు కొనుగోలు చేసేందుకు వేదాంత తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ నుంచి ఆమోదం పొందింది. రుణ భారంతో ఉన్న మీనాక్షి ఎనర్జీని విక్రయించడానికి పిలిచిన టెండర్లలో విజయవంతమైన బిడ్డర్‌గా వేదాంతను ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో మీనాక్షి ఎనర్జీకి 1,000 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు ఉంది. ఈ పవర్ ప్లాంట్‌ను స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుగా నిర్వహించాలని వేదాంత యోచిస్తోంది. అలాగే వినియోగదారులతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోనుంది. కొనుగోలు ప్రక్రియలో భాగంగా రుణదాతలకు ముందస్తుగా రూ.312 కోట్లను వేదాంత చెల్లించనుంది. -
భారత్‌లో సెమీకండక్టర్ల తయారీకి కంపెనీలు పోటాపోటీ
గాంధీనగర్: భారత్‌లో సెమీకండక్టర్ల తయారీపై దేశ, విదేశ కంపెనీలు పోటీపడుతున్నాయి. సెమీకాన్ సదస్సు వేదికగా తమ ప్రణాళికలను వెల్లడించాయి. తాము తలపెట్టిన చిప్ ఫ్యాక్టరీ తొలి దశ రెండున్నరేళ్లలో సిద్ధమవుతుందని వేదాంత చీఫ్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు. ఇప్పటికే భాగస్వాములను ఎంపిక చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. తొలి దశపై 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ‘రెండున్నరేళ్లలో 2.5 ఏళ్లలో వేదాంత తయారు చేసిన మేడిన్ ఇండియా చిప్‌ను అందించబోతున్నాం‘ అని అగర్వాల్ చెప్పారు. 20 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ల ప్లాంటు కోసం వేదాంతతో కుదుర్చుకున్న జాయింట్ వెంచర్ నుంచి తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్ తప్పుకున్న నేపథ్యంలో అగర్వాల్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. అటు భారత్‌లో చిప్‌ల తయారీ వ్యవస్థలోకి ప్రవేశించాలంటే ’అత్యంత సాహసికులై’ ఉండాలని ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు పేర్కొన్నారు. వేదాంత జాయింట్ వెంచర్ గురించి ప్రస్తావించకుండా, ఇక్కడ ఎదురయ్యే ప్రతి అనుభవం.. కంపెనీలను మరింత దృఢంగా మారుస్తాయని ఆయన చెప్పారు. ఏఎండీ డిజైన్ సెంటర్.. మరోవైపు, వచ్చే అయిదేళ్లలో భారత్‌లో 400 మిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు అమెరికన్ చిప్ తయారీ దిగ్గజం అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ (ఏఎండీ) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మార్క్ పేపర్‌మాస్టర్ తెలిపారు. బెంగళూరులో తమ కంపెనీకి సంబంధించి అతి పెద్ద డిజైన్ సెంటర్‌ను 5,00,000 చ.అ. విస్తీర్ణంలో ఈ ఏడాది ఆఖరు నాటికి ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అయిదేళ్ల వ్యవధిలో 3,000 పైచిలుకు ఇంజనీరింగ్ ఉద్యోగాలను కల్పించనున్నట్లు పేపర్‌మాస్టర్ పేర్కొన్నారు. కొత్త క్యాంపస్ ఏర్పాటుతో భారత్‌లో తమ కార్యకలాపాలు పది ప్రాంతాలకు విస్తరించినట్లవుతుందని చెప్పా రు. భారత్‌లో ప్రపంచ స్థాయి సెమీకండక్టర్ డిజైన్, ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించడంలో ఏఎండీ ప్రణాళికలు కీలకపాత్ర పోషించగలవని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్లో ట్వీట్ చేశారు. చిప్ ప్లాంటుకు జోరుగా కసరత్తు: మైక్రాన్ గుజరాత్లో తమ చిప్ ప్లాంటు ఏర్పాటుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు అమెరికన్ సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్ సంజయ్ మెహరోత్రా తెలిపారు. దీనితో రాబోయే రోజుల్లో ప్రత్యక్షంగా 5,000, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించగలదని ఆయన పేర్కొన్నారు. -
సెమీకండక్టర్ ప్లాంటు.. వారి ప్రతిపాదనలు వేర్వేరుగా పరిశీలిస్తాం...
న్యూఢిల్లీ: భారత్‌లో సెమీకండక్టర్ ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి వేదాంత, ఫాక్స్‌కాన్ సంస్థలు వేర్వేరుగా ప్రతిపాదనలను సమర్పించేంత వరకు ప్రభుత్వం వేచి చూస్తుందని, తర్వాత తగు విధంగా వాటిని మదింపు చేస్తుందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. గతంలో ఇరు సంస్థలు జాయింట్ వెంచర్‌గా ప్రతిపాదనలు ఇచ్చాయని, ప్రస్తుతం అవి వేర్వేరుగా ప్రపోజల్స్ ఇచ్చే యోచనలో ఉన్నాయని పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా అధునాతన సెమీకండక్టర్ టెక్నాలజీల ఎగ్జిబిషన్ ప్రారంభంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. సెమీకండక్టర్ రంగంలో 70 ఏళ్లలో లేనంత పురోగతిని గత 15 నెలల్లో సాధించగలిగామని పేర్కొన్నారు. -
అనిల్ అగర్వాల్‌కు మరో దెబ్బ? టాటా గ్రూపుతో ఫాక్స్‌కాన్ చర్చలు?
తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ రూ.1.6 లక్షల కోట్ల(19.5 బిలియన్ల డాలర్ల) ప్రాజెక్టును వెనక్కి తీసుకుని చైర్మన్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూపునకు భారీ షాక్ ఇచ్చింది. భారతదేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తి కోసం జాయింట్ వెంచర్ (జేవీ) నుండి వైదొలగాలని సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించిన సంస్థ దేశీయంగా మరో టాప్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టాటా గ్రూప్‌తో సంభావ్య టై-అప్ కోసం ఫాక్స్‌కాన్ అన్వేషిస్తోందని సీఎన్‌బీసీ ఆవాజ్ రిపోర్ట్ చేసింది. ముఖ్యంగా, టాటా గ్రూప్ ఇటీవలి సెమీకండక్టర్ ప్రయత్నాలలో ఉంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రాజెక్టుకు ఫాక్స్‌కాన్ కట్టుబడి ఉందనీ, దేశం ఒక బలమైన సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థను విజయవంతంగా స్థాపించాలని చూస్తోందని ఫాక్స్‌కాన్ మంగళవారం మరోసారి స్పష్టం చేసింది. సరైన భాగస్వాముల కోసం సమీక్షిస్తున్నామని, దేశీయ, అంతర్జాతీయ వాటాదారులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించి అప్లికేషన్‌ను సమర్పించే దిశగా పని చేస్తోందని ప్రకటించడం ఈ వార్తలు ఊతమిస్తోంది. (వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్ ) తరువాతి తరం వృద్ధిని ప్రారంభించే క్రమంలో దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన ఈ మెగా ప్రాజెక్టును కోసం వేదాంత ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకునేందుకు ఫాక్స్ కాన్-వేదాంత జాయింట్ వెంచర్‌గా గుజరాత్ లో సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావించాయి. అయితే పరస్పర అంగీకారంతో ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్టు ఫాక్స్‌కాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (90 శాతం ఉద్యోగాలు ఫట్: సిగ్గూ, శరం, మానవత్వం లేదా? సీఈవోపై పైర్) -
వేదాంత చిప్ ప్లాంటుకు బ్రేక్
న్యూఢిల్లీ: భారత్‌లో సెమీకండక్టర్ల ప్లాంటు నెలకొల్పేందుకు దేశీ దిగ్గజం వేదాంతతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ (జేవీ) నుంచి హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) తప్పుకుంది. మరిన్ని వైవిధ్యమైన అవకాశాలను అన్వేషించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘పరస్పర అంగీకారం మేరకు, వేదాంతతో జాయింట్ వెంచర్ విషయంలో ముందుకు సాగరాదని నిర్ణయించుకున్నాం. వేదాంత యాజమాన్యంలోని సంస్థకు మాకు ఎటువంటి సంబంధం ఉండదు. మా పేరును జోడించి ఉంచడం వల్ల గందరగోళానికి దారి తీస్తుంది కాబట్టి దాన్ని తొలగించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం‘ అని ఫాక్స్‌కాన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, భారత ప్రభుత్వ మేకిన్ ఇండియా ఆకాంక్షల సాకారానికి పూర్తి తోడ్పాటు అందిస్తామని, స్థానిక అవసరాల మేరకు భాగస్వామ్యాలు కుదుర్చుకుంటామని పేర్కొంది. తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్ ఎల్రక్టానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్, వేదాంత .. గుజరాత్లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దేశీయంగా తొలి సెమీకండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు గతేడాది జేవీ కుదుర్చుకున్నాయి. ఏడాది పైగా దీనిపై కసరత్తు చేశాయి. సాంకేతిక భాగస్వామిగా యూరప్ సంస్థ ఎస్టీ మైక్రోఎలక్ట్రానిక్స్‌తో జట్టు కట్టేందుకు ప్రయత్నించినా చర్చలు ముందుకు సాగలేదు. దీంతో ప్రస్తుతం వేదాంత–ఫాక్స్‌కాన్ జేవీకి బ్రేక్ పడింది. ఫోన్లు, ఫ్రిజ్‌లు, కార్లలో ఉపయోగించే చిప్‌లు కేవలం కొన్ని దేశాల్లోనే తయారవుతున్నాయి. భారత్ కూడా చిప్‌ల తయారీలోకి ప్రవేశించడంపై దృష్టి పెట్టి ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీనికి స్పందనగా వేదాంత–ఫాక్స్‌కాన్, ఐఎస్ఎంసీ, ఐజీఎస్ఎస్ దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, వేదాంత జేవీ మినహా మిగతా రెండింటి విషయంలో పెద్దగా పురోగతి లేదు. ప్రాజెక్టుకు కట్టుబడి ఉన్నాం.. కాగా సెమీకండక్టర్ ప్రాజెక్టుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని వేదాంత స్పష్టం చేసింది. చిప్ ప్లాంటు ఏర్పాటులో భాగస్వాములయ్యేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ‘సెమీకండక్టర్ల విషయంలో ప్రధాని విజన్‌ను సాకారం చేసేందుకు, మరింతగా కృషి చేస్తాం’ అని వేదాంత పేర్కొంది. సైయంట్ డీఎల్ఎం లిస్టింగ్ భళా ఎల్రక్టానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్విసుల కంపెనీ సైయంట్ డీఎల్ఎం భారీ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 265తో పోలిస్తే బీఎస్ఈలో 51 శాతం ప్రీమియంతో రూ. 401 వద్ద లిస్టయ్యింది. ఆపై ఒక దశలో 61% దూసుకెళ్లి రూ. 426ను అధిగమించింది. చివరికి 59 శాతం(రూ. 156) లాభంతో రూ. 421 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో సైతం రూ. 403 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 427 వరకూ ఎగసి చివరికి రూ. 422 వద్ద స్థిరపడింది. వెరసి రూ. 157 లాభంతో ముగిసింది. భారత్ లక్ష్యాలపై ప్రభావం ఉండదు వేదాంతతో జేవీ నుంచి ఫాక్స్‌కాన్ వైదొలగడమనేది భారత్ నిర్దేశించుకున్న చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఏర్పాటు లక్ష్యాలపై ప్రభావం చూపబోదు. – రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర ఐటీ మంత్రి -
ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం: లక్షల కోట్ల ప్రాజెక్ట్ నుంచి వెనక్కి
తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ ఫాక్స్‌కాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ మెటల్స్-టు-ఆయిల్ వేదాంత కంపెనీతో 19.5 బిలియన్ డాలర్ల సెమీ కండక్టర్ జాయింట్ వెంచర్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు ఫాక్స్‌కాన్ నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఈ మేరకు సంస్థ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది దీనికి గల కారణాలను వివరించలేదు. (మ్యారేజ్ డే ఏమోగానీ, 24 లక్షల ఉబెర్ బిల్లు చూసి గుడ్లు తేలేసిన జంట) గ్లోబల్ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్‌కాన్ , వేదాంత గత ఏడాది గుజరాత్లో సెమీకండక్టర్. డిస్ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లను నిర్మించడానికి సుమారు రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కానీ ప్రాజెక్ట్‌పై ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పనిచేసినప్పటికీ ఈ జాయింట్ వెంచర్‌ను ముగించాలని ఇరుపక్షాలు పరస్పరం నిర్ణయించుకున్నాయన్న తాజా ప్రకటన సంచలనం రేపుతోంది. ఆ కంపెనీతో ఫాక్స్‌కాన్‌కు ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్‌లో భాగస్వాములు ఎలాంటి గందరగోళానికి గురవ్వకుండా ఒరిజినల్ పేరునే కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు హోన్ హయ్ టెక్నాలజీ గ్రూప్ (ఫాక్స్‌కాన్) ప్రకటించింది. ఈ ఒప్పందం 'మేక్ ఇన్ ఇండియా' పుష్‌కు ఖచ్చితంగా ఎదురుదెబ్బ అని కౌంటర్‌పాయింట్‌లోని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ షా వ్యాఖ్యానించారు. (ITR Filing: గడువు సమీపిస్తోంది! ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ జాగ్రత్తలు, లాభాలు) కాగా 2026 నాటికి సెమీకండక్టర్ మార్కెట్ విలువ 63 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేస్తున్న కేంద్రం, గతేడాది 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకం కింద ప్లాంట్ల ఏర్పాటుకు మూడు దరఖాస్తులు అందుకుంది. ఇందలో వేదాంత-ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ ఒకటి, సింగపూర్‌కు చెందిన IGSS వెంచర్స్ , టవర్ సెమీకండక్టర్‌ను టెక్ భాగస్వామిగా పరిగణించే గ్లోబల్ కన్సార్టియం ఐఎస్ఎంసీ నుండి వచ్చాయి. -
వేదాంతా చేతికి ట్విన్ స్టార్ బిజ్
న్యూఢిల్లీ: సహచర సంస్థ ట్విన్ స్టార్ టెక్నాలజీస్ లిమిటెడ్ (టీఎస్‌టీఎల్) నుంచి సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్‌లను సొంతం చేసుకోనున్నట్లు వేదాంతా లిమిటెడ్ వెల్లడించింది. తద్వారా సమీకృత సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్‌లు కలిగిన తొలి కంపెనీగా వేదాంతా ఆవిర్భవించనుంది. వేదాంతాకు అల్టిమేట్ హోల్డింగ్ కంపెనీ అయిన టీఎస్‌టీఎల్.. వోల్కన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పూర్తి అనుబంధ సంస్థకావడం గమనార్హం! కాగా.. షేర్ల బదిలీ ద్వారా టీఎస్‌టీఎల్ సెమీకండక్టర్, డిస్ప్లే బిజినెస్ యూనిట్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వేదాంతా వెల్లడించింది. దీంతో వేదాంతా డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోకు సెమీకండక్టర్, డిస్ప్లే గ్లాస్ బిజినెస్ జత కలవనున్నాయి. -
చిప్ ప్లాంట్‌కు వేదాంత ఫాక్స్‌కాన్ మళ్లీ దరఖాస్తు
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లకు సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను ప్రకటించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా తమ దరఖాస్తును మళ్లీ దాఖలు చేసినట్లు వేదాంత ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచర్ సంస్థ వెల్లడించింది. 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభించేలా రూ. 1.5 లక్షల కోట్లతో ఎలక్ట్రానిక్ చిప్ ప్లాంటును నెలకొల్పనున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయంగా చిప్ తయారీని ప్రోత్సహించే దిశగా సెమీకండక్టర్ ఫ్యాబ్‌ల ఏర్పాటుకు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకాలను కేంద్రం 30 శాతం నుంచి 50 శాతానికి ఇటీవల పెంచింది. దీంతో గతంలో సమర్పించిన దరఖాస్తును ఉపసంహరించుకుని వేదాంత ఫాక్స్‌కాన్ తాజాగా మరోసారి దాఖలు చేసింది. 2027 ప్రథమార్ధంలో 5,000 వేఫర్లతో ప్రారంభించి .. నెలకు 40,000 వేఫర్ల స్థాయికి ఉత్పత్తిని పెంచుకోనున్నట్లు వేదాంత ఫాక్స్‌కాన్ సంస్థ సీఈవో డేవిడ్ రీడ్ వెల్లడించారు. -
విబేధాలే కారణమా? గుజరాత్లో 1.54 లక్షల కోట్ల ప్రాజెక్ట్‌కు అడ్డంకి!
మైనింగ్ కంపెనీ వేదాంతా లిమిటెడ్‌కు భారీ షాక్ తిగిలింది.సెమీకండక్టర్ల తయారీ కోసం వేదాంతాతో కదుర్చుకున్న ఒప్పందం నుంచి తైవాన్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఫాక్స్‌కాన్ తప్పుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రెండేళ్ల క్రితం ఫాక్స్‌కాన్ భారత్‌లో సెమీ కండక్టర్ తయారీ విభాగంలో అడుగు పెట్టాలని అనుకుంది. ఇందుకోసం వేదాంతాతో చేతులు కలిపింది. 67శాతం షేరుతో వేదాంత - ఫాక్స్‌కాన్ జాయింట్ వెంచ్ర్లో గుజరాత్ దోలేరా ప్రాంతంలో వెయ్యి ఎకరాల్లో రూ.1.54 లక్షల కోట్లతో సెమీకండక్టర్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి. తాజాగా, ఫాక్స్కాన్క, వేదాంతా సెమీ కండక్టర్ ప్రాజెక్ట్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఇరు సంస్థల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా సెమీ కండక్టర్ల తయారీ కోసం వేదాంతాను వద్దనుకొని కొత్త భాగస్వామి కోసం ఫాక్స్‌కాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేదాంత గ్రూప్ ఆర్థిక ఇబ్బందులతో ఫాక్స్‌కాన్ వేరే భాగస్వామిని చూసుకోవాలని సూచించిందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. దీంతో, ఫాక్స్‌కాన్ మరో భాగస్వామికోసం ఇప్పటికే అనధికారిక చర్చలు జరిపినట్లు సమాచారం. వాటిల్లో రెండు కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ రెండు కంపెనీలు ఏంటీ? ఫాక్స్‌కాన్‌కు, వేదాంతాల మధ్య ఎందుకు విబేధాలు తలెత్తాయనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి👉 భారత్‌లో ఆఫీస్‌ను అమ్మేస్తున్న ఇంటెల్.. వేలాది మంది ఉద్యోగుల్ని.. -
వేదాంతా భారీ పెట్టుబడులు: ఏకంగా రూ. 14,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో 1.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 14,000 కోట్లు) పెట్టుబడులు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. వివిధ బిజినెస్‌ల సామర్థ్య విస్తరణకు నిధులు వినియోగించనున్నట్లు గతేడాది(2022–23)కి విడుదల చేసిన వార్షిక నివేదికలో కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. వృద్ధి లక్ష్యంగా గతేడాది ఆస్తులు, ఉత్పత్తిపై 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెచి్చంచినట్లు తెలియజేశారు. ఈ బాటలో ప్రస్తుత ఏడాదిలోనూ వృద్ధికి వీలుగా 1.7 బిలియన్ డాలర్లను వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అల్యూమినియం, జింక్ ఉత్పత్తి సామర్థ్యాల విస్తరణను చేపట్టినట్లు ప్రస్తావించారు. (Global Chess League 2023 ఆనంద్ VS ఆనంద్: మహీంద్ర ట్వీట్ వైరల్) చమురు, గ్యాస్‌పై ప్రస్తుతం దేశీ ఉత్పత్తిలో నాలుగో వంతు ఆక్రమిస్తున్న చమురు, గ్యాస్ కార్యకలాపాల వాటాను 50 శాతానికి చేర్చాలని ప్రణాళికలు వేసినట్లు అనిల్ తెలియజేశారు. ఈ బాటలో నిల్వలు(రిజర్వులు), వనరుల(రిసోర్సెస్) పోర్ట్‌ఫోలియోను వివిధీకరిస్తున్నట్లు వార్షిక నివేదికలో పేర్కొన్నారు. గతేడాది క్లిష్టమైన, అనిశ్చిత స్థూల ఆర్థిక వాతావరణంలో కంపెనీ కార్యకలాపాలు కొనసాగినట్లు తెలియజేశారు. భౌగోళిక, రాజకీయ వివాదాలు, వీటితో తలెత్తిన ఇంధన సంక్షోభం, కేంద్ర బ్యాంకులు అవలంబించిన కఠిన పరపతి విధానాలు సవాళ్లు విసిరినట్లు వివరించారు. అయినప్పటికీ కంపెనీ అత్యుత్తమ పనితీరును ప్రదర్శించినట్లు ప్రస్తావించారు. ఆదాయం రూ. 1,45,404 కోట్లను తాకగా.. రూ. 35,241 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించినట్లు పేర్కొన్నారు. రూ. 18,077 కోట్ల నికర ఫ్రీక్యాష్ ఫ్లోను సాధించినట్లు తెలియజేశారు. (ఈ ఫోటో ఎవరిదో గుర్తు పట్టగలరా? టాప్ హీరోయిన్ అయితే కాదు!) ‘మెయిటీ- నాస్కామ్ సీవోఈ’తో వేదాంత గ్రూప్ జట్టు అంకుర సంస్థలు అభివృద్ధి చేసే కొత్త డిజిటల్ టెక్నాలజీలను వేగవంతంగా వినియోగంలోకి తేవడంపై వేదాంత గ్రూప్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా స్పార్క్ ప్రోగ్రాం కింద కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మెయిటీ)- పరిశ్రమల సమాఖ్య నాస్కామ్‌కి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్)/ వర్చువల్ రియాలిటీ (వీఆర్) మొదలైన టెక్నాలజీల ఆధారిత ఆవిష్కరణలను వేదాంత గ్రూప్ సంస్థల్లో వినియోగించే అవకాశాలను పరిశీలిస్తారు. దీర్ఘకాలికంగా పర్యావరణ, సామాజిక, ఆరి్థక స్థిరత్వానికి దోహదపడే పరిష్కార మార్గాలను కనుగొనాలన్నది తమ లక్ష్యంగా వేదాంత లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రియా అగర్వాల్ హెబ్బర్ తెలిపారు. వేదాంత స్పార్క్ ప్రోగ్రాం కింద 80 పైచిలుకు స్టార్టప్‌లతో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. -
బాల్కో లిస్టింగ్‌పై ప్రభుత్వ దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ సంస్థ భారత్ అల్యూమినియం కంపెనీ(బాల్కో)లో మిగిలిన 49 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. అంతేకాకుండా సంస్థ ప్రమోటర్ గ్రూప్ వేదాంతా చేపట్టిన ఆర్బిట్రేషన్‌ను ఉపసంహరింప చేయాలని చూస్తున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. ఇందుకు వీలుగా వేదాంతాతో గనుల శాఖ, దీపమ్ ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు తెలియజేశారు. మిగిలిన వాటా విషయంలో అధిక విలువ వివాదంపై 2009లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాల్కో ఆర్బిట్రేషన్ కేసును దాఖలు చేసింది. కాగా.. బాల్కో ప్రమోటర్లతో ప్రాథమిక చర్చలు చేపట్టినట్లు పాండే వెల్లడించారు. ఈ విషయంలో మరింత లోతుగా చర్చించనున్నట్లు తెలియజేశారు. కంపెనీని స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయాలంటే ఆర్బిట్రేషన్ కేసును వెనక్కి తీసుకోవలసి ఉన్నట్లు వివరించారు. ఇందుకు ప్రమోటర్లు ఒప్పుకుంటే పబ్లిక్ ఇష్యూకి సన్నాహాలు ప్రారంభిస్తామని తెలియజేశారు. వాటా విక్రయం ఇలా 2001లో ప్రభుత్వం మెటల్ పీఎస్‌యూ.. బాల్కోలో 51 శాతం వాటాను స్టెరిలైట్ ఇండస్ట్రీస్‌కు విక్రయించింది. వేదాంతా గ్రూప్ అనుబంధ కంపెనీ స్టెరిలైట్ ఇందుకు రూ. 551 కోట్లు వెచ్చించింది. మిగిలిన 49 శాతం వాటా ప్రభుత్వం వద్దే ఉంది. ఒప్పందంలోని కాల్ ఆప్షన్ ప్రకారం 2004లో స్టెరిలైట్ మిగిలిన 49 శాతం వాటా కోసం ప్రభుత్వానికి రూ. 1,099 కోట్లు ఆఫర్ చేసింది. అయితే వాటా విలువ అంతకంటే అధికమని కాగ్ నివేదిక పేర్కొనడంతో ప్రభుత్వం ఆఫర్‌ను తిరస్కరించింది. దీంతో 2009లో ప్రమోటర్ వేదాంతా గ్రూప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. బాల్కో ఆర్బిట్రేషన్ అంశం హిందుస్తాన్ జింక్ కేసు(2009)ను పోలి ఉన్నట్లు ఈ సందర్భంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే 2021 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఓపెన్ మార్కెట్ విక్రయానికి ప్రభుత్వాన్ని అనుమతించింది. తద్వారా 29.5 శాతం వాటాను విక్రయించేందుకు ప్రభుత్వానికి వీలు చిక్కింది. 2022లో ప్రమోటర్ సంస్థ వేదాంతా ఆర్బిట్రేషన్‌ను ఉపసంహరించడంతో ప్రభుత్వం హిందుస్తాన్ జింక్‌లో వాటాను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది. -
మరింత తగ్గిన వేదాంత రుణ భారం
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంత మాతృసంస్థ వేదాంత రిసోర్సెస్ (వీఆర్ఎల్) మరో 400 మిలియన్ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించింది. మే, జూన్‌లో మెచ్యూర్ అయ్యే రుణాలు, బాండ్లను మొత్తం చెల్లించేసినట్లు కంపెనీ తెలిపింది. దీంతో స్థూల రుణభారం 6.4 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు వివరించింది. (ఇదీ చదవండి: సెయిల్ చైర్మన్‌గా ప్రకాష్ బాధ్యతలు స్వీకరణ) 2022 మార్చి నుంచి ఇప్పటివరకు 3.3 బిలియన్ డాలర్లు తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం మిగతా వ్యవధిలో మరిన్ని రుణాలను చెల్లిస్తామని, అంతిమంగా సున్నా స్థాయికి తగ్గించుకుంటామని ఒక ప్రకటనలో వేదాంత తెలిపింది. అయితే, ఇందుకోసం నిర్దిష్ట గడువేదీ వెల్లడించలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2.1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి రానుండగా.. నిధులు సమీకరించేందుకు షేర్లను తనఖా పెట్టడం సహా వీఆర్ఎల్కు పలు మార్గాలు ఉన్నాయని క్రెడిట్‌సైట్స్ సంస్థ తెలిపింది. -
వేదాంత కెయిర్న్ ఆయిల్ సీఈవోగా నిక్ వాకర్
న్యూఢిల్లీ: వేదాంతకు చెందిన కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ నూతన సీఈవోగా నిక్ వాకర్‌ను నియమించుకుంది. జనవరి 5 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్టు ప్రకటన విడుదల చేసింది. దీనికి ముందు వరకు నిక్ వాకర్ యూరప్‌కు చెందిన ప్రముఖ అన్వేషణ, ఉత్పత్తి కంపెనీ అయిన లండిన్ ఎనర్జీకి సీఈవో, ప్రెసిడెంట్‌గా పనిచేశారు. -
అల్యూమినియం కంపెనీల డైలమా
అల్యూమినియం రంగ దిగ్గజాలు వేదాంతా, నోవెలిస్ పెట్టుబడి వ్యయాలపై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దేశీ దిగ్గజం హిందాల్కో మాత్రం విస్తరణ ప్రణాళికలను అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివరాలు చూద్దాం.. ముంబై: తయారీ వ్యయాలు పెరిగిపోవడానికితోడు.. అంతర్జాతీయంగా అల్యూమినియం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో దిగ్గజ కంపెనీలు పెట్టుబడి ప్రణాళికలపై వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2022–23) పెట్టుబడి వ్యయాలపై కొంతమేర కోతలు అమలు చేస్తున్నాయి. వెరసి ప్రణాళికలను తిరిగి సమీక్షిస్తున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) కాలానికి ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తూ వేదాంతా అల్యూమినియం, విద్యుత్ విభాగంపై పెట్టుబడి వ్యయాల్లో 40 శాతం కోతను అమలు చేయనున్నట్లు ఇన్వెస్టర్లకు తెలియజేసింది. దీంతో ఈ ఏడాదికి తొలుత అనుకున్న 100 కోట్ల డాలర్ల(సుమారు రూ. 8,250 కోట్లు) వ్యయాలకుగాను 60 కోట్ల డాలర్లనే వెచ్చించనుంది. ఫలితంగా 2 బిలియన్ డాలర్లస్థానే 1.6 బిలియన్ డాలర్లకే మొత్తం పెట్టుబడులు పరిమితంకానున్నాయి. నోవెలిస్ సైతం ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో విదేశీ అనుబంధ సంస్థ నోవెలిస్ సైతం పెట్టుబడి వ్యయాలను పునఃసమీక్ష చేయనుంది. యూఎస్‌లో ప్యాకేజింగ్, ఆటోమోటివ్, కన్స్ట్రక్షన్ రంగాలకు ప్రొడక్టులను సరఫరా చేస్తున్న కంపెనీ పెట్టుబడి వ్యయాలను 30–37 శాతం స్థాయిలో తగ్గించుకోనుంది. 1.3– 1.6 బిలియన్ డాలర్లకు బదులుగా 0.9–1 బిలియ న్ డాలర్లనే వెచ్చించనుంది. ఇందుకు అధిక ఇంధన ధరలు, గ్లోబల్ స్థాయిలో నీరసించిన అల్యూమినియం ధరలు కారణమని కంపెనీ ప్రస్తావిస్తోంది. 40 శాతం డౌన్ అల్యూమినియం ధరలు ఈ ఏడాది మార్చిలో టన్నుకి 4,000 డాలర్లను తాకగా.. నవంబర్‌కల్లా 40 శాతం పతనమయ్యాయి. ఎల్‌ఎంఈలో టన్ను 2,400 డాలర్లకు చేరింది. మరోపక్క ఊపందుకున్న ఇంధన ధరలు పలు ప్రాథమిక లోహ(బేస్ మెటల్) కంపెనీల జులై–సెప్టెంబర్(క్యూ2) లాభదాయకతను దెబ్బతీశాయి. అయితే పలు మెటల్ రంగ కంపెనీల యాజమాన్యాల తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో మార్జిన్లు బలపడనున్నాయి. లాభాలు పుంజుకోనున్నాయి. తయారీ వ్యయాలు తగ్గడం తదితర అంశాలు ఇందుకు సహకరించనున్నట్లు పరిశ్రమ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. హిందాల్కో సై ఈ ఏడాదికి దేశీ బిజినెస్‌పై హిందాల్కో రూ. 3,000 కోట్ల పెట్టుబడులు వెచ్చిస్తోంది. కంపెనీ వివరాల ప్రకారం కొన్ని ప్రాజెక్టుల పరికరాలకు అనుమతులు ఆలస్యమవుతున్నప్పటికీ ఇప్పటికే రూ. 2,500 కోట్లు వినియోగించింది. దేశీయంగా పటిష్ట డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో పెట్టుబడి వ్యయాలు కొనసాగుతున్నట్లు హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ పేర్కొన్నారు. యూఎస్‌లోనూ ప్రధానంగా అల్యూమినియం పానీయాల క్యాన్లకు డిమాండ్ కనిపిస్తున్నట్లు తెలియజేశారు. ఇక వచ్చే ఏడాది(2023–24) ద్వితీయార్ధానికల్లా 3 మిలియన్ టన్నుల అల్యూమినియం తయారీ సామర్థ్యాన్ని అందుకోనున్నట్లు వేదాంతా సీఈవో సునీల్ దుగ్గల్ వెల్లడించారు. ప్రస్తుత 2.4 ఎంటీపీఏ సామర్థ్యాన్ని ప్రణాళికలకు అనుగుణంగా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. మరోవైపు ఒడిషాలోని ఝార్సిగూడా యూనిట్లో చేపట్టిన 1.8 ఎంటీపీఏ సామర్థ్యం ఇటీవలే పూర్తయిన విషయాన్ని ప్రస్తావించారు. -
వేదాంత డివిడెండ్ రూ.17.50
న్యూఢిల్లీ: మైనింగ్ కంపెనీ వేదాంత లిమిటెడ్ మరోసారి భారీ డివిడెండ్‌ను వాటాదారులకు ప్రకటించింది. ఒక్కో షేరుకు రూ.17.50 చొప్పున 2022–23 సంవత్సరానికి మూడో మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని మంగళవారం నాటి బోర్డు సమావేశంలో నిర్ణయించింది. ఈ రూపంలో కంపెనీ రూ.6,505 కోట్లను చెల్లించనుంది. సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ స్థూల రుణ భారం రూ.58,597 కోట్లుగా ఉంది. రుణాలు తీర్చడానికి బదులు వాటాదారులకు భారీ మొత్తంలో డివిడెండ్ ఇవ్వడానికి కంపెనీ ప్రాధాన్యం ఇవ్వడం గమనించాలి. ఎందుకంటే కంపెనీలో ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో వాటా ఉంది. దీంతో డివిడెండ్ రూపంలో ప్రమోటర్లకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరనున్నాయి. డివిడెండ్ చెల్లింపునకు రికార్డ్ తేదీగా నవంబర్ 30ని ప్రకటించింది. వేదాంత లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొదటి మధ్యంతర డివిడెండ్ కింద రూ.31.50, రెండో మధ్యంతర డివిడెండ్ కింద రూ.19.50 చొప్పున ఇవ్వడం గమనించాలి. ఈ మొత్తం కలిపి చూస్తే ఏడాది కాలంలో రూ.68.50 వరకు డివిడెండ్ కింద ఇచ్చినట్టయింది. -
‘జాక్ పాట్ ఎవరికో’, దేశంలో ఐఫోన్ల తయారీ..రంగంలోకి మరో దిగ్గజ సంస్థ!
దేశీయంగా యాపిల్ ఐఫోన్లను తయారు చేసేందుకు దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఐఫోన్ల తయారీకి టాటా కంపెనీ సంప్రదింపులు కొనసాగిస్తుండగా.. తాజాగా మెటల్ దిగ్గజం వేదాంత సైతం ఐఫోన్ల ఉత్పత్తికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత వారం వేదాంత, తైవాన్‌కు చెందిన ఐఫోన్ల సరఫరా సంస్థ ఫాక్స్‌కాన్‌లు సంయుక్తంగా రూ.1.54లక్షల కోట్లతో తొలి సెమీ కండక్టర్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. గుజరాత్లో నిర్మించనున్న ఈ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ విషయంలో ఇరు సంస్థల మధ్య ఒప్పొందాలు జరిగాయి. నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతమయ్యాయి. ఈ క్రమంలో వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహరాష్ట్రలో మ్యానిఫ్యాక్చరింగ్ హబ్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్లులో ఐఫోన్లతో పాటు టీవీలో ఉపయోగించే పరికరాల్ని తయారు చేయనున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికే టాటా గ్రూప్ ఇప్పటికే తైవాన్ సంస్థతో కలిసి ఐఫోన్ల తయారు చేయబోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు వేదాంత ఎంటర్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. విస్ట్రాన్‌తో టాటా గ్రూప్ యాపిల్ సంస్థ దేశీయంగా ఐఫోన్లను తయారు చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా చైనాలో ఫోన్ల తయారీ నిలిపివేయాలని భావిస్తుంది. చైనా నుంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చిన తర్వాత భారత్‌లో ఐఫోన్ 14 సిరీస్‌లను ఉత్పత్తి చేయాలని అనుకుంటున్నట్లు బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది. ఆ కథనాల్ని ఊటంకిస్తూ టాటా గ్రూప్ భారత్‌లో ఐఫోన్లను తయారు చేసేందుకు ఫాక్స్‌కాన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఐఫోన్ల ఉత్పత్తి, సప్లయ్ చైన్, అసెంబుల్ విషయంలో ఇరు సంస్థలు ఏకాభిప్రాయానికి వస్తే.. ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. టాటాతో జత.. ఐదురెట్ల అవుట్‌పుట్ తైవాన్ హ్యాండెసెట్ తయారీ దిగ్గజ సంస్థలైన విస్ట్రాన్ చైనాలో.. ఫాక్స్‌కాన్ (చెన్నై) భారత్‌లో కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాయి. యాపిల్ సంస్థ ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదర్చుకుని చెన్నై కేంద్రంగా ఐఫోన్లను తయారు చేస్తుంది. వాటి అమ్మకాల్ని యాపిల్ నిర్వహిస్తుంది. అదే దేశీయ సంస్థలు ఫోన్ల తయారీలో భాగస్వామ్యం సంస్థకు లాభదాయకంగా ఉంటుందని యాపిల్ సీఈవో టిమ్‌కుక్ అభిప్రాయ పడుతున్నారు. టాటా గ్రూప్.. విస్ట్రాన్‌తో భాగస్వామ్యంలో దేశీయంగా ఐఫోన్లను ఐదురెట్లు కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘లక్ష రూపాయల ల్యాప్‌టాప్..రూ.40వేలకే ఇవ్వొచ్చు’!
వేదాంత రిసోర్సెస్..దేశంలో మెటల్ తయారీలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. స్టీల్, కాపర్, అల్యూమీనియం తయారీలో దూసుకుపోతోంది. దేశంలో యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోన్న కంపెనీల్లో ఇది ఒకటి. కిక్కిరిసిన జనం మధ్యన ట్యాక్సీలో చేసిన ప్రయాణం, అప్పుడు వినిపించిన మహ్మద్ రఫి గొంతుతో..వో కోన్సీ ముష్కిల్ హై (సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు) అనే పాట స్ఫూర్తి వేదాంత ప్రస్థానానికి నాందిగా నిలిచింది. ఇప్పుడు ఆ సంస్థ చిప్ సెట్లు, డిస్ప్లే తయారీ రంగంలోకి అడుగు పెట్టింది. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది వేదాంతా, తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్ కలిసి దేశంలో తొలి సెమీకండక్టర్ ప్లాంటును రూ.1.54 లక్షల కోట్లతో గుజరాత్లో నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, ఈ ప్లాంటులో ఫాక్సాకాన్ వాటా 38శాతం ఉండగా.. మిగిలిన సింహభాగం వేదాంతాదే. ఈ నేపథ్యంలో వేదాంతా గ్రూప్ ఛైర్మన్ ఓ మీడియా ఇంటర్వ్యూలో అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ..చిప్ సెట్లు, డిస్ప్లే తయారీ ప్రారంభమైతే దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గుతాయి. ‘ప్రస్తుతం మనం ల్యాప్ ట్యాప్ తీసుకుంటే దాని ధర రూ.లక్ష ఉంటే..డిస్ప్లే, చిప్ సెట్లను దేశీయంగా తయారు చేస్తే అదే ల్యాప్ ట్యాప్ ధర రూ.40వేలు అంతకంటే తక్కువే ఉండొచ్చు’ అని పేర్కొన్నారు. -
వేదాంత దూకుడు: గుజరాత్లో సెమీకండక్టర్ ప్లాంటు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెమీకండక్టర్ ప్లాంటును గుజరాత్లో ఏర్పాటు చేయాలని పారిశ్రామిక దిగ్గజం వేదాంత నిర్ణయించింది. అహ్మదాబాద్‌లో తలపెడుతున్న ఈ ప్రాజెక్టులో డిస్ప్లే, సెమీకండక్టర్ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై వేదాంత ప్రతినిధులు కానీ, ఫాక్స్‌కాన్ వెంటనే స్పందించ లేదు. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌తో కలిసి 20 బిలియన్ డాలర్ల జాయింట్ వెంచర్‌గా వేదాంత తలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు కోసం తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక కూడా పోటీపడ్డాయి. కానీ ఇటీవల ముగిసిన తుది చర్చల్లో మహారాష్ట్రను పక్కకు నెట్టి గుజరాత్ ఆ ప్రాజెక్టును దక్కించుకుంది. కాగా భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2020లో 15 బిలియన్ డాలర్లనుంచి 2026 నాటికి 63 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
ఖనిజాల అన్వేషణ: ఏఐ, ఆటోమేషన్‌ను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: దేశీయంగా వివిధ లోహాలు, ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించిన విధానాలను సరళీకరించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక దిగ్గజం వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. మన దగ్గర లోహాలు, ఖనిజాల నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటిని దిగుమతి చేసుకునేందుకు భారీగా వెచ్చించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉత్పత్తి పెరిగితే అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం మనపై అంతగా ఉండదని, దేశీయంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు.. గణనీయంగా ఉద్యోగాలు కల్పించేందుకు ఇది తోడ్పడగలదని అగర్వాల్ చెప్పారు. దిగుమతి చేసుకునే ధరలో పావు వంతుకే భారత్‌లో ముడిచమురును ఉత్పత్తి చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కమోడిటీల రేట్లు పెరగడం, రూపాయి మారకం విలువ పతనమవడం వంటి కారణాలతో క్రూడాయిల్ తదితర దిగుమతుల భారం పెరిగిన నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంధనాలు, ఖనిజాల అన్వేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి కొత్త టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. -
షాకిచ్చిన వేదాంతు, వందల మంది ఉద్యోగుల తొలగింపు!
న్యూఢిల్లీ: ఎడ్టెక్ కంపెనీ వేదాంతు 424 మంది ఉద్యోగులను తొలగించింది. రెండు వారాల క్రితం 200 మందికి ఉద్వాసన పలకడంతోపాటు కొత్తగా 1,000 మందిని చేర్చుకోనున్నట్టు కంపెనీ ప్రకటించడం గమనార్హం. కఠినమైన బాహ్య వాతావరణం, మాంద్యం భయం ఈ నిర్ణయానికి కారణమని సంస్థ తెలిపింది. ‘ఐరోపాలో యుద్ధం, రాబోయే మాంద్యం భయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుదలలు..వెరశి ప్రపంచవ్యాప్తంగా, అలాగే భారత స్టాక్ మార్కెట్లో భారీ దిద్దుబాటుతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీశాయి. ఈ వాతావరణాన్ని బట్టి రాబోయే త్రైమాసికాల్లో మూలధనం కొరతగా ఉంటుంది’ అని వేదాంతు కో–ఫౌండర్, సీఈవో వంశీ కృష్ణ తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 5,900 మంది పనిచేస్తున్నారు. -
కళ్లలో నీళ్లు.. మోముపై నవ్వు.. ఆ క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను
గత కొంత కాలంగా వేదాంత చైర్మన్ అనిల్‌అగర్వాల్ తన జీవిత అనుభవాలను ప్రజలతో పంచుకుంటున్నారు. బిజినెస్‌మేన్‌గా ఎదిగే క్రమంలో పడిన ఇబ్బందులు, ఎదురైన ఆటుపోట్లు ప్రజలకు వివరిస్తున్నారు. అందులో భాగంగా ముంబైలో అడుగుపెట్టినప్పుడు తాను కన్న కల నిజమైన క్షణాల్లో తాను పొందిన భావోద్వేగాన్ని ఆయన పంచుకున్నారు. ఇంగ్లీష్ రాదు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల బాటలోనే పయణిస్తున్నారు అనే కంటే ఫ్యూయల్ సెక్టార్లో వాళ్లిద్దరికి గట్టి పోటీ ఇస్తున్నారు బిజినెస్‌మేన్ అనిల్ అగర్వాల్. వేదాంత కంపెనీ యజమానిగా గ్రీన్ ఎనర్జీ, రియల్ ఎస్టేట్, మెటల్, పవర్ జనరేషన్, ఆయిల్ ఇలా ఒకటేమిటి అనేక రంగాల్లో అడుగుపెట్టి విజయం సాధించాయన. పాట్నాను వదిలి ముంబైకి వచ్చినప్పుడు యస్, నో తప్ప మరో ముక్క ఇంగ్లీష్ ఆయనకు రాదు. కానీ నేడు రూ. 33.60 వేల కోట్లకు అధిపతి. చేతిలో చిల్లిగవ్వ లేని దశలో తన జీవితాన్ని మలుపు తిప్పిన ఓ సంఘటనను అనిల్ అగర్వాల్ ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. స్క్రాప్‌తో మొదలు అనిల్ అగర్వాల్ స్వస్థలం పాట్నా. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ అనిల్ అగర్వాల్ ఒకే స్కూలు, ఒకే కాలేజీ. కానీ వంశపార్యంపరంగా వస్తున్న వ్యాపారం వదులకుని తన కలలు నిజం చేసుకునేందుకు ముంబైలో అడుగు పెట్టాడు అనిల్. కేబుల్ తయారీ కంపెనీల్లో మిగిలిపోయిన స్క్రాప్‌ను అమ్మే వ్యాపారంతో తన జీవితం ప్రారంభించాడు. షంషేర్ కావాలనే కల ఆ రోజుల్లో ముంబైలో కేబుల్ వ్యాపారంలో షంషేర్ స్టెర్లింగ్ కేబుల్ కంపెనీ చాలా ఫేమస్. ఆ కంపెనీకి సంబంధించిన స్క్రాప్‌ను అనిల్ అగర్వాల్ అమ్మేవాడు. ఎప్పుడైనా ఇలాంటి కంపెనీకి యజమాని కావాలనే కలలు కనేవాడు. ఈ క్రమంలో ఈ కంపెనీ బ్యాంకు రుణం చెల్లించలేక దివాళా తీయబోతుందనే సమాచారం అందింది అనిల్‌కి. షంషేర్ త్వరలో అమ్మకానికి వస్తుందని తెలిసినా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ డబ్బులు లేవని నిరాశ చెందలేదు అనిల్. ప్రతీరోజు బ్యాంకు దగ్గరికి, ఈ దిశాల కేసు చూస్తున్న లాయర్ దగ్గరికి, ఇంకా ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరిని అనిల్ కలిసేవాడు. అలా రోజుల తరబడి చేసిన ప్రయత్నంతో షంషేర్ కంపెనీ కొనాలంటే తక్కువలో తక్కువ రూ.16 లక్షలు కావాలనే సమాచారం సేకరించగలిగాడు. అంత డబ్బు తన జీవితంలో ఎప్పుడు చూడలేదు. కానీ చేతిలో డబ్బు లేదనే సాకుతో ప్రయత్నం ఆపదలచుకోలేదు. నిద్రలేని రాత్రులు కంపెనీకి సంబంధించిన సమస్త సమాచారం తెలిసిన తర్వాత అతను కంటున్న కలలు అతనికి నిద్రను దూరం చేశాయి. మెలకవుతో కలలు కంటూనే ప్రణాళికలు రూపొందించాడు. రెగ్యులర్‌గా బ్యాంకు అధికారులను కలుస్తూ కొంత రుణం వచ్చేలా చేసుకోగలిగాడు. బ్యాంకు రుణం వస్తుందనే నమ్మకంతో బంధువుల దగ్గర అప్పు తెచ్చాడు. అలా కిందా మీద పడుతూ సొంతగా ఒక్క రూపాయి లేకపోయినా మొత్తానికి రూ.16 లక్షలు కూడబెట్టాడు అనిల్ అగర్వాల్. టర్నింగ్ పాయింట్ తెలిసిన అన్ని మార్గాల ద్వారా పోగు చేసిన రూ. 16 లక్షల రూపాయల సొమ్ముతో 1976 మేలో షంషేర్ స్టెర్లింగ్ కంపెనీని సొంతం చేసుకున్నాడు అనిల్ అగర్వాల్. ఈ సందర్భంగా సంతకాలు చేస్తున్న సమయంలో కళ్ల వెంట నీళ్లు వచ్చాయని అదే సమయంలో విజయ గర్వంతో నవ్వు కూడా ఆపుకోలేకపోయానంటూ ఆనాటి ఉద్వేగభరిత క్షణాలను పంచుకున్నారు అనిల్ అగర్వాల్. When you move forward, new doors open and you meet new people who come to help you. I discovered that when you try, really try to reach your dreams, then the universe works in mysterious ways to make it happen…(4/6) — Anil Agarwal (@AnilAgarwal_Ved) March 21, 2022 ప్రయత్నిస్తేనే అద్భుతాలు మనం ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తే తప్పకుండా కొత్త మార్గాలు కనిపిస్తాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు మన ప్రయత్నాలకు తమ వంతు సాయం అందిస్తారు. నా విషయంలో ఇది జరిగింది. మీరు ప్రయత్నించండి ప్రతికూల పరిస్థితుల మధ్య పట్టుదలతో వ్యవహరిస్తే మన కలను సాకారం చేసేందుకు ఊహించని పద్దతిలో ప్రకృతి కూడా సాయం చేస్తుంది. కాబట్టి కలలను నిజం చేసుకోండంటూ నేటి యువతలో ఆయన స్ఫూర్తి నింపుతున్నారు. చదవండి: అంబానీ, అదానీలు అలా.. వేదాంత అనిల్ తీరు ఇలా.. -
వేదాంతా లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ2(జులై–సెప్టెంబర్)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 4,615 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 838 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 21,758 కోట్ల నుంచి రూ. 31,074 కోట్లకు జంప్ చేసింది. అధిక కమోడిటీ ధరలు, బలపడిన మార్జిన్లు, వివిధ విభాగాల అమ్మకాల్లో వృద్ధి కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదం చేశాయి. క్యూ2లో రూ. 7,232 కోట్లమేర నికర రుణభారాన్ని తగ్గించుకున్నట్లు వేదాంతా సీఈవో సునీల్ దుగ్గల్ వెల్లడించారు. వాటాదారులకు షేరుకి రూ. 18.5 చొప్పున బోర్డు మధ్యంతర డివిడెండును ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో వేదాంతా షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 304 వద్ద ముగిసింది. -
Vedanta : కరోన రహిత గ్రామాల కోసం...
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం వేదాంత రిసోర్సెస్ వచ్చే అయిదేళ్లలో సామాజిక కార్యకలాపాలపై రూ. 5,000 కోట్లు వెచ్చించనుంది. 1,000 గ్రామాల్లో వైద్యసేవల కల్పన కోసం ఉద్దేశించిన ’స్వస్థ్ గావ్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ఈ విషయాలు వెల్లడించారు. రూ. 5,000 కోట్లతో సామాజిక కార్యకలాపాల్లో భాగంగా పౌష్టికాహారం, మహిళా.. శిశు అభివృద్ధి, హెల్త్‌కేర్, జంతు సంరక్షణ, క్షేత్రస్థాయి క్రీడల అభివృద్ధితో పాటు వివిధ రాష్ట్రాల్లో కరోనా రహిత గ్రామాల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం తదితర అంశాలకు ఈ రూ. 5,000 కోట్లు వినియోగించనున్నట్లు అగర్వాల్ వివరించారు. ఈ భారీ కార్యక్రమాన్ని అనిల్ అగర్వాల్ ఫౌండేషన్ నిర్వహించనుండగా .. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. చదవండి : కరోనా కాలంలోనూ కరెంట్ ఖాతా మిగులు -
ఉత్తమ్ గాల్వా ఎవరి పరం?
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీని టేకోవర్ చేయడానికి పలు కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులను విక్రయించడం ద్వారా మంచి పేరు సాధించిన ఈ కంపెనీ ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రుణాల చెల్లింపుల్లో విఫలం కావడంతో ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. టేకోవర్ బిడ్లకు సంబంధించిన గడువు గత నెల ముగిసింది. ఈ కంపెనీ టేకోవర్‌కు సంబంధించి సాక్షి బిజినెస్ స్పెషల్ స్టోరీ... ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ టేకోవర్ పోరు రసవత్తరంగా ఉండనున్నది. లోహ దిగ్గజ కంపెనీలు ఈ కంపెనీని టేకోవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. లోహ కుబేరులు–లక్ష్మీ మిట్టల్, జిందాల్ సోదరులు(సజ్జన్, నవీన్ జిందాల్‌లు), వేదాంత కంపెనీ అనిల్ అగర్వాల్ ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీని టేకోవర్ రేసులో ఉన్నారని సమాచారం. 2018లో దివాలా ప్రక్రియ ద్వారా ఈఎస్ఎల్ స్టీల్‌ను వేదాంత కంపెనీ టేకోవర్ చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారానే వేదాంత కంపెనీ టేకోవర్ బిడ్‌ను వేదాంత సమర్పించిందని సమాచారం. ఈ లోహ కుబేరులతో పాటు కోటక్ మహీంద్రాకు చెందిన ఫీనిక్స్అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ(ఏఆర్సీ) కూడా ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీపై కన్నేసింది. అయితే టేకోవర్ వార్తలపై ఈ సంస్థలు స్పందించడానికి నిరాకరించాయి. విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు... ఉత్తమ్ గాల్వా కంపెనీని రాజేంద్ర మిగ్లాని స్థాపించారు. వాహనాలు, విమానాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమల్లో ఉపయోగించే విలువాధారిత ఉక్కు ఉత్పత్తులు తయారు చేసే పెద్ద కంపెనీల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి తొలి ఆర్నెల్లలో రూ.277 కోట్ల ఆదాయంపై రూ.140 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. 2020 మొదట్లో ఉత్తమ్ గాల్వా స్టీల్స్ కంపెనీ 67 లక్షల డాలర్ల విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) చెల్లింపుల్లో విఫలమైంది. దీంతో ఈ కంపెనీపై దివాలా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ 2020 మార్చిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)లో ఒక పిటీషన్‌ను దాఖలు చేసింది. ఆరు నెలల తర్వాత ఎస్బీఐ పిటీషన్‌ను ఎన్సీఎల్టీ స్వీకరించింది. దివాలా ప్రక్రియను నిర్వహించడానికి కేఎమ్డీఎస్ అండ్ అసోసియేట్స్‌కు చెందిన మిలింద్ కసోద్కర్ను నియమించింది. అగ్ర భాగంలో ఆర్సెలర్ మిట్టల్... ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ టేకోవర్ పోరులో లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకే అధిక అవకాశాలున్నాయని సమాచారం. ఉత్తమ్ గాల్వా కంపెనీకి అత్యధికంగా అప్పులిచ్చింది లక్ష్మీ మిట్టల్ కంపెనీయే. ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ మొత్తం రుణ భారం రూ.9,742 కోట్లుగా ఉంది. దీంట్లో ఆర్సెలర్ మిట్టల్ సంస్థల(ఆర్సెలర్ మిట్టల్ ఇండియా, ఏఎమ్‌ఎన్‌ఎస్ లగ్జెంబర్గ్) వాటాలే రూ.7,922 కోట్లుగా ఉన్నాయి. రుణదాతలకున్న మొత్తం ఓటింగ్ రైట్స్‌లో ఈ రెండు సంస్థలకు కలిపి 87.2% వాటా ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు ఉత్తమ్ గాల్వా స్టీల్ కంపెనీ చెల్లించాల్సిన రుణాలను ఈ సంస్థలను చెల్లించి, ఆ మేరకు అప్పుల్లో వాటాను తీసుకున్నాయి. ఒకప్పు డు ఉత్తమ్ గాల్వాలో ఒక ప్రమోటర్‌గా ఆర్సెలర్ మిట్టల్ ఉండేది. దివాలా తీసిన ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేయడానికి గాను ఉత్తమ్ గాల్వా స్టీల్ నుంచి ఆర్సెలర్ మిట్టల్ వైదొలగింది. ఎస్సార్ స్టీల్‌ను టేకోవర్ చేసి ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియాగా పేరు మార్చింది. -
సుప్రీంకోర్టులో వేదాంతకు ఊరట
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని రవ్వ చమురు, గ్యాస్ క్షేత్ర వ్యయాల రికవరీ అంశంలో వివాదానికి సంబంధించి వేదాంతకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వేదాంత 499 మిలియన్ డాలర్లు రికవర్ చేసుకునేలా మలేషియా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటీషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. మలేషియా ట్రిబ్యునల్ ఉత్తర్వులతో భారత ప్రభుత్వ విధానాలకు భంగమేమీ కలగబోదని పేర్కొంది. వివరాల్లోకి వెడితే .. ప్రస్తుతం వేదాంతలో విలీనమైన కెయిర్న్ ఇండియా గతంలో.. రవ్వ క్షేత్రాల అభివృద్ధికి సంబంధించి కాంట్రాక్టు దక్కించుకుంది. ఉత్పత్తిలో వాటాల ఒప్పందం (పీఎస్సీ) ప్రకారం దీని అభివృద్ధి వ్యయాలను 198.5 మిలియన్ డాలర్లకు పరిమితం చేయాల్సి ఉంది. దానికి అనుగుణంగానే ఇంధనాల ఉత్పత్తి ద్వారా వ్యయాలను రికవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, దీనికి విరుద్ధంగా వేదాంత ఏకపక్షంగా ఏకంగా 499 మిలియన్ డాలర్లు రాబట్టుకుందని, దీనితో ఖజానాకు న ష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఆర్బిట్రేషన్ కోసం ఇరు పక్షాలు మలేషియా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా వేదాంతకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కేంద్రం దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా మలేషియా ట్రిబ్యునల్ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించినా అక్కడా కేంద్రానికి చుక్కెదురైంది. -
మూడేళ్లలో వేదాంత రూ. 60,000 కోట్ల పెట్టుబడి
ముంబై: వేదాంత కంపెనీ రానున్న 2–3 ఏళ్లలో రూ.60,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. రానున్న 4– 5 ఏళ్లలో 3,000– 4,000 కోట్ల డాలర్ల మేర ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పారు. ఇదే కాలానికి 1,000 కోట్ల డాలర్ల నికర లాభం సాధించడం లక్ష్యమని వివరించారు. ఇక్కడ జరిగిన ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్ 2019లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మరిన్ని ప్రభుత్వ కంపెనీలను కొంటాం.... భారత్‌లో ఇప్పటిదాకా 3,500 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశానని అనిల్ అగర్వాల్ తెలిపారు. గత పదేళ్లలో హిందుస్తాన్ జింక్, బాల్కో, సెసగోవా, కెయిర్న్ తదితర మొత్తం 13 కంపెనీలను కొనుగోలు చేశామని చెప్పారు. ఈ కంపెనీల కార్యకలాపాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని ప్రభుత్వ రంగ కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం విదేశీయులపై కాకుండా తమలాంటి స్వదేశీ పారిశ్రామికవేత్తలపైనే ఆధారపడాలని ఆయన సూచించారు. విదేశీయులు లాభాపేక్షతోనే వ్యవహరిస్తారని, తమలాంటి స్వదేశీ పారిశ్రామికవేత్తలు మాత్రం దేశాభివృద్ధికి తోడ్పాటునందిస్తారని చెప్పారు. ప్రభుత్వం తమపై ఆధారపడితే విదేశీ పెట్టుబడులు కూడా తేగలమని పేర్కొన్నారు. గ్లాస్, ఆప్టికల్ ఫైబర్, కేబుల్ పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నామని ఈ సందర్భంగా చెప్పారాయన. గత ఆరేళ్లలో వివిధ పన్నుల రూపేణా ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్లు చెల్లించామని తెలిపారు. -
ఆయిల్, చమురు బ్లాక్‌ల వేలం...
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ఇండియా, ఓఎన్ జీసీతోపాటు అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ తాజాగా ముగిసిన చమురు, గాయ్స్ బ్లాక్‌ల వేలంలో టాప్–3గా నిలిచాయి. రెండో దశ ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) కింద 14 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లు, మూడో దశ ఓఏఎల్‌పీ కింద మరో 18 ఆయిల్, గ్యాస్, 5 కోల్బెడ్ మీథేన్ బ్లాక్‌లను కేంద్రం ప్రభుత్వం వేలానికి ఉంచింది. వీటిల్లో ఆయిల్ ఇండియాకు 12, ఓఎన్ జీసీకి 9, వేదాంతకు తొమ్మిది చొప్పున మొత్తం 30 బ్లాక్‌లు ఈ మూడు కంపెనీలకే దక్కనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్–బీపీ సంయుక్తంగా కృష్టా గోదావరి బేసిన్ (కేజీ బేసిన్ )లో ఓ బ్లాక్‌ను దక్కించుకోనున్నాయి. ఈ బ్లాక్‌ను ఓఎన్ జీసీ కంటే మించి బిడ్ చేయడం ద్వారా రిలయన్స్–బీపీలు దక్కించుకోవడం విశేషం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స వివిధ కంపెనీలు సమర్పించిన బిడ్లను పరిశీలన పూర్తి చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో ఓఎన్ జీసీ, వేదాంత తొమ్మిది బ్లాకుల్లో టాప్ బిడ్డర్లుగా, 12 బ్లాక్‌ల్లో ఆయిల్ ఇండియా టాప్‌లో ఉన్నట్టు చెప్పాయి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం అనంతరం విజేతలను ప్రకటించనున్నట్టు తెలిపాయి. 2017 జూలైలో కేంద్రం నూతనంగా ఓఏఎల్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద కంపెనీలు తమంతట తామే ఫలానా ప్రాంతంలో అన్వేషణ, ఉత్పత్తి విషయంలో ఆసక్తిని తెలియజేయవచ్చు. -
ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల రుణం!
న్యూఢిల్లీ: వేదాంత లిమిటెడ్ అధినేత అనిల్ అగర్వాల్ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు కీలక సూచనలు చేశారు. దేశంలో దాగి ఉన్న వనరులను వెలికి తీయాలని, ప్రభుత్వరంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని, ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి ముద్రా యోజన కింద రూ.2లక్షల చొప్పున రుణం ఇవ్వాలని సూచించారు. దీనివల్ల ప్రభుత్వరంగ సంస్థలు 3 రెట్లు గొప్పగా పనిచేయగలవన్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించొచ్చని, ఉద్యోగాలను సృష్టించొచ్చని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగాసూచించారు. భారత పరిస్థితిని ‘మదర్ ఇండియా’ సినిమాతో పోల్చారు. ‘‘ఆ సినిమాలో రైతు 100 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే 80 క్వింటాళ్లను రుణమిచ్చిన వారు పట్టుకుపోతారు. అలాగే, భారత్‌లోనూ 50% ఆదాయాలను దిగుమతులపైనే ఖర్చు చేస్తున్నాం. ఆ తర్వాత వడ్డీలకు చెల్లింపులు పోగా మిగిలేది ఏమీ లేదు’’ అని అగర్వాల్ పేర్కొన్నారు. సహజవనరులు, ఎలక్ట్రానిక్స్ రంగాలకు భారీ ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. మినరల్స్, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను మరింత పెద్ద ఎత్తున వెలికితీయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. -
ఆయిల్, గ్యాస్ బ్లాక్ కోసం ఆర్ఐఎల్, బీపీ పోటీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామి బ్రిటిష్ పెట్రోలియం (బీపీ పీఎల్సీ) ఎనిమిదేళ్ల విరామం తర్వాత తొలిసారిగా ఓ చమురు, సహజ వాయువు బ్లాక్ కోసం బిడ్ దాఖలు చేశాయి. వేదాంత 30 బ్లాక్‌ల కోసం బిడ్లు వేయగా, ఓఎన్జీసీ 20 బ్లాక్‌లకు బిడ్లు వేసింది. ఓపెన్ యాకరేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) రౌండ్– 2 కింద 14 బ్లాక్‌లు, ఓఏఎల్‌పీ– 3 కింద 18 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లతోపాటు 5 కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచింది. గతేడాది ఓఏఎల్‌పీ–1 కింద జరిగిన 55 బ్లాక్‌ల వేలంలో అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ 41 బ్లాక్‌లను సొంతం చేసుకోగా, ఈ విడత 30 బ్లాక్‌ల కోసం బిడ్లు వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, ఓఎన్జీసీ 20 బ్లాక్‌లు, ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) 15 బ్లాక్‌లకు, ఐవోసీ, గెయిల్, సన్ పెట్రో ఒక్కోటీ రెండేసి బ్లాక్‌లకు పోటీపడినట్టు వెల్లడించాయి. కృష్ణా గోదావరి బేసిన్లో ఒక బ్లాక్ కోసం ఆర్ఐఎల్, బీపీ సంయుక్తంగా బిడ్ వేసినట్టు తెలిపాయి. 2011లో బీపీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టగా, అన్వేషణ బ్లాక్ కోసం పోటీపడడం ఇదే మొదటిసారి. ముకేశ్ అంబానీకి చెందిన ఆర్ఐఎల్ చివరిగా తొమ్మిదో విడత నూతన అన్వేషణ లైసెన్సింగ్ పాలసీలో భాగంగా ఆరు బ్లాక్‌లకు సొంతంగా బిడ్లు వేసినప్పటికీ ఒక్కటీ దక్కించుకోలేదు. ఆ తర్వాత ఎన్ఈఎల్పీ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఓఏఎల్‌పీని తీసుకొచ్చింది. ఓఏఎల్‌పీ పాలసీ దేశంలో 2.8 మిలియన్ల చదరపు కిలోమీటర్ల పరిధిలో వెలుగు చూడని చమురు, గ్యాస్ నిక్షేపాలకు గాను, దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు ఓఏఎల్‌పీని కేంద్రం తీసుకొచ్చింది. దీనికింద ప్రస్తుతం ఉత్పత్తి, అన్వేషణ దశలో భాగం కాని ఏ ఇతర ప్రాంతానికి సంబంధించి అయినా ఆసక్తి వ్యక్తీకరించేందుకు కంపెనీలకు అవకాశం ఉంటుంది. తాము ఫలానా ప్రాంతంలో అన్వేషణ, ఉత్పత్తి పట్ల ఆసక్తిగా ఉన్నామం టూ కంపెనీల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం సమీక్షించాక ఆయా ప్రాంతా లను వేలానికి ఉంచుతుంది. అప్పుడు కంపెనీలు వాటికి బిడ్లు వేయాల్సి ఉంటుంది. -
వేదాంత లాభం 34% డౌన్
న్యూఢిల్లీ: లోహ, మైనింగ్ దిగ్గజం వేదాంత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018–19) నాలుగో త్రైమాసిక కాలంలో 34 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017–18) క్యూ4లో రూ.3,956 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,615 కోట్లకు తగ్గిందని వేదాంత తెలిపింది. ఆదాయం తక్కువగా రావడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వేదాంత లిమిటెడ్ చైర్మన్ నవీన్ అగర్వాల్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.28,547 కోట్ల నుంచి 12 శాతం క్షీణించి రూ.25,096 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు కూడా రూ. 22,824 కోట్ల నుంచి రూ.20,992 కోట్లకు తగ్గాయని వివరించారు. ఎబిటా 20 శాతం తగ్గి రూ.6,135 కోట్లకు, ఎబిటా మార్జిన్ 1.7 శాతం తగ్గి 26.1 శాతానికి చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి పునర్వ్యవ స్థీకరణ జోరుగా జరిగిందని, ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నాయని, వాటాదారులకు పరిశ్రమలోనే ఏ కంపెనీ ఇవ్వనంతటి రాబడులు ఇచ్చామని అగర్వాల్ పేర్కొన్నారు. తాము కొనుగోలు చేసిన ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ కంపెనీని విజయవంతంగా లాభాల బాట పట్టించామని తెలిపారు. విభిన్నమైన సహజ వనరుల వ్యాపారాలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీల్లో ఒకటిగా అవతరించామని కంపెనీ సీఈఓ శ్రీనివాసన్ వెంకటకృష్ణన్ చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీ స్థూల రుణ భారం రూ.8,066 కోట్లు పెరిగి రూ.66,225 కోట్లకు ఎగసిందని శ్రీనివాసన్ వివరించారు. నికర రుణ భారం రూ.5,000 కోట్లు పెరిగి రూ.26,956 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత వేదాంత కంపెనీ ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. బీఎస్ఈలో వేదాంత షేర్ 2 శాతం నష్టంతో రూ.163 వద్ద ముగిసింది. -
‘13 మంది రక్తం తాగిన పళనిస్వామి ప్రభుత్వం’
సాక్షి, చెన్నై: పళనిస్వామి ప్రభుత్వం రక్తం రుచి మరిగిందని డీఎంకే నాయకురాలు కనిమొళి మండిపడ్డారు. తూత్తుకుడి (ట్యూటికోరిన్)లో వేదాంత గ్రూపునకు చెందిన స్టెరిలైట్ పరిశ్రమ విస్తరణను అడ్డుకోవడానికి స్థానికులు, పర్యావరణ కార్యకర్తలు మంగళవారం నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన కారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. వారికి సంతాపం ప్రకటిస్తూ కనిమొళి ఆధ్వర్యంలో శుక్రవారం తూత్తుకుడిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. డీఎంకేతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్న కనిమొళితో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. స్టెరిలైట్ పరిశ్రమ వల్ల తమ బతుకులు బుగ్గిపాలవుతున్నాయని ఎదురు తిరిగిన అమాయకులను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 13 మందిని పొలీసుల తూటాలు బలితీసుకుంటే ఆత్మరక్షణ కోసం జరిగిన కాల్పుల్లో వారు మృతి చెందారని ముఖ్యమంత్రి ప్రకటించడం సిగ్గుచేటని కనిమొళి మండిపడ్డారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపులోనే ఉంది.. తూత్తుకుడిలో ప్రజా ఆందోళనలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ మురళీ రాంబ తెలిపారు. పరిస్థితిలో అదుపులోనే ఉందనీ.. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు పట్టణంలో సరిపడా బలగాలను మోహరించామని అన్నారు. కాగా, ప్రజల ఆందోళనల నేపథ్యంలో పర్యావరణ హితం కోరి స్టెరిలైట్ పరిశ్రమ విస్తరణను నిలిపి వేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ‘ప్రభుత్వం స్టెరిలైట్ పరిశ్రమపై తీసుకునే చర్యలపై ఒక స్పష్టత వచ్చింది. పరిశ్రమను అడ్డుకునేందుకు ప్రభుత్వం సిధ్దంగా ఉంది’అని తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సందీప్ నండూరి తెలిపారు. టీఎన్పీసీబీ అనుమతులను రెన్యువల్ చేయకుండానే పరిశ్రమను నడపాలని చూస్తున్నారని కాలుష్య నియంత్రణ బోర్డు ఆరోపించింది. -
ఎందుకు తూత్తుకూడి రక్తసిక్తం?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకూడిలో కాలుష్యానికి కారణమవుతున్న వేదాంత స్టెరిలైట్ కాపర్ కంపెనీని 1996లో ఏర్పాటు చేశారు. రోజుకు 1200 టన్నుల అనోడ్స్ (విద్యుత్ గ్రాహక రాగి రాడ్లు)ను ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతమున్న ఈ సామర్థ్యాన్ని కంపెనీ రెండింతలు చేయాలనుకుంటోంది. దీని వల్ల అధిక సాంద్రత గల అక్కడి జనాభాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. కంపెనీకి పది కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో ఎనిమిది పట్టణాలు, 27 గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 4.6 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కంపెనీ నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, రేణువులు కాలుష్యానికి కారణం అవుతున్నాయని ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావం అంచనా నివేదిక 2015 సంవత్సరంలోనే వెల్లడించింది. కంపెనీ కారణంగా నీరు, వాయు కాలుష్యం ఏర్పడుతోందని గత రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కొన్నేళ్ల వరకు కంపెనీ నుంచి కాలుష్యం ప్రభావాన్ని తాము అంచనా వేయలేకపోయామని, కొన్నేళ్ల క్రితం నుంచే ఆ ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్యం కారణంగా ప్రతి ఇంటిలో కనీసం ఇద్దరు అస్వస్థులవుతున్నారని, ముఖ్యంగా పిల్లలపై కాలుష్యం ప్రభావం ప్రాణాంతకంగా ఉంటోందని వారు చెబుతున్నారు. కంపెనీని మరింత విస్తరిస్తున్నట్లు సమీపంలోని కుమారెడ్యార్పురం గ్రామస్థులకు ముందుగా తెల్సింది. మొదట చిన్న స్థాయిలో ప్రజల నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అవి ఊపందుకున్నాయి. మంగళవారం నాడు తూత్తుకూడిలో వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శన జరిపారు. అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టాలని నెల రోజుల క్రితమే నిర్ణయించామని, ఈ విషయం కలెక్టర్‌కు తెలిసి ఆయన ఆదివారం నాడు తమతో శాంతి చర్చలు జరిపారని సెల్వరాజ్ అనే స్థానికుడు తెలిపారు. తమకు కావాల్సింది శాంతి కాదని, కంపెనీ విస్తరణను అడ్డుకోవడమే ముఖ్యమంటూ తాము కలెక్టర్‌కు కూడా స్పష్టం చేశామని సుందరరామమూర్తి అనే మరో గ్రామస్థుడు తెలిపారు. ఆదివారం నాడు కలెక్టర్ శాంతి సమావేశాన్ని నిర్వహించిన తర్వాత కూడా మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలియజేయాలని గ్రామస్థులు నిర్ణయించారని వారు తెలిపారు. అందుకు కలెక్టర్ కార్యాలయంలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమావేశం అయ్యేందుకు కూడా ముందుగా కలెక్టర్ కార్యాలయం అనుమతి ఇచ్చిందని వారు తెలిపారు. ఆ తర్వాత అనూహ్యంగా సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారని వారు తెలిపారు. శాంతియుతంగానే తాము కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లాలని అనుకున్నామని, హింసాకాండకు దిగాలన్న ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని వారు చెప్పారు. కలెక్టర్ కార్యాలయానికి పది కిలోమీటర్ల దూరంలోనే పిల్లాపాపలతో సహా వేలాది మంది ప్రజలు గుమిగూడారని, అక్కడి నుంచే పోలీసు బారికేడ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతోనే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని, అది చివరకు పోలీసు కాల్పులదాకా వెళ్లిందని గ్రామస్థులు వివరించారు. వారు కాల్పుల్లో మరణించిన వారి ఫొటోలను మీడియాకు చూపించారు. వారిలో ఎక్కువ మందికి కడుపులో, పొత్తి కడుపులో బుల్లెట్లు దిగిన గాయాలున్నాయి. ప్రస్తుతం అక్కడ వాడవాడలా పోలీసు బందోబస్తు కనిపిస్తోంది. కలెక్టర్‌గానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ మీడియాకు అందుబాటులో లేరు. -
తూత్తుకుడి విషాదం : వేదాంత షేరు ఢమాల్
సాక్షి,ముంబై: తమిళనాడులోని తూత్తుకుడిలో కాల్పుల ఉదంతంతో వేదాంత షేరు భారీ పతనాన్ని నమోదు చేసింది. వేదాంతకు చెందిన స్టెరిలైట్ కాపర్ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ ప్రజలు చేపట్టిన ఆందోళన కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో గురువారం నాటి మార్కెట్లో వేదాంతా కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. 5.5 శాతానికిపైగా క్షీణించి 10 నెలల కనిష్టాన్ని నమోదుచేసింది. జూలై 5, 2017 నాటి స్థాయికి పడిపోయింది. తమిళనాడును అట్టుడికించిన తూత్తుకూడి ఘటనపై స్టెరిలైట్ కంపెనీ సీఈవో రామనాధ్ స్పందించారు. ఈ విధ్వంసం వెనుక కరుడుగట్టిన శక్తులు ఉన్నాయని విమర్శించారు. ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి పర్యావరణ కాలుష్యం సహా, ఇతర అన్ని నిబంధనలకనుగుణంగానే తాము పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో తదుపరి వాదనలు జూన్ 6వతేదీన ఉన్నాయని చెప్పారు. -
వేదాంత ఆదాయం 24,934 కోట్లు
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంత ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.2,173 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.2,133 కోట్లు)తో పోల్చితే 2 శాతం వృద్ధి సాధించామని వేదాంత తెలిపింది. ఆదాయం అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని వేదాంత సీఈఓ కుల్దీప్ కౌర్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.21,405 కోట్ల నుంచి 19 శాతం వృద్ధి చెంది రూ.24,934 కోట్లకు పెరిగిందని వివరించారు. అల్యూమినియమ్ వ్యాపారం పునర్వ్యవస్థీకరణ, జింక్ ఇంటర్నేషనల్ విక్రయాలు అధికంగా ఉండడం తదితర అంశాల కారణంగా ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. క్యూ4లో మరింత జోరు.. కంపెనీ ఆర్థిక స్థితిగతులను పటిష్టంగా కొనసాగిస్తున్నామని, మూలధన కేటాయింపుల ప్రణాళికకు కట్టుబడి ఉన్నామని కుల్దీప్ పేర్కొన్నారు. నాలుగో క్వార్టర్లో మరింత మెరుగైన ఫలితాలను సాధించనున్నామని, మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో నగదు నిల్వలు పుష్కలంగా ఉండనున్నాయని వివరించారు. ఈ క్యూ3లో ఇబిటా 13 శాతం వృద్ధితో రూ.6,780 కోట్లకు పెరిగిందని, కమోడిటీ ధరలు అధికంగా ఉండటం కలసివచ్చిందని తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి స్థూల రుణ భారం రూ.55,218 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. నికర రుణ భారం రూ.16,295 కోట్లుగా ఉందని, క్వార్టర్ ఆన్ క్వార్టర్‌తో పోల్చితే పెరిగిందని తెలిపారు. అవాన్స్ట్రాటే కంపెనీని కొనుగోలు చేశామని, అయితే ఈ క్యూ3లో నగదు నిల్వలు పటిష్టంగా ఉండడంతో ఈ కంపెనీ కొనుగోలు ప్రభావం ఒకింత తగ్గిందని వివరించారు. నిర్వహణ మార్జిన్ 30.2 శాతం నుంచి 27.8 శాతానికి తగ్గిందని తెలిపారు. ఇనుప ఖనిజం వ్యాపార ఆదాయం 42 శాతం తగ్గగా, అల్యూమినియమ్ వ్యాపారం ఆదాయం 69 శాతం, రాగి వ్యాపార ఆదాయం 8 శాతం చొప్పున పెరిగాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో వేదాంత షేర్ 0.2 శాతం నష్టంతో రూ.340 వద్ద ముగిసింది. -
కెయిర్న్ ఎనర్జీకి ఐటీ షాక్
♦ రూ.2,150 కోట్లు జప్తు చేసిన ఆదాయపన్ను శాఖ ♦ వేదాంతలో ఉన్న 9.8 శాతం వాటా త్వరలో స్వాధీనం ♦ రూ.10,247 కోట్ల పన్ను విషయంలో కఠిన చర్యలు న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ విషయంలో ఆదాయపన్ను శాఖ కఠిన చర్యలకు దిగింది. రూ.10,247 కోట్ల రెట్రోస్పెక్టివ్ పన్ను విషయంలో ఇన్నాళ్లూ వేచి చూసే ధోరణి అనుసరించిన ఆదాయపన్ను శాఖ తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో దూకుడు ప్రదర్శించింది. వేదాంత లిమిటెడ్ నుంచి కెయిర్న్ ఎనర్జీకి వెళ్లాల్సిన రూ.650 కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని జప్తు చేసింది. అలాగే, పన్ను రిఫండ్ రూపంలో కెయిర్న్ ఎనర్జీకి వెళ్లాల్సిన రూ.1,500 కోట్లను కూడా రూ.10,247 కోట్ల పన్నులో భాగంగా జమకట్టుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ట్రిబ్యునల్‌లోనూ చుక్కెదురు కెయిర్న్ ఎనర్జీ తన భారతీయ విభాగమైన కెయిర్న్ ఇండియాలో మెజారిటీ వాటాను వేదాంత లిమిటెడ్‌కు విక్రయించగా, అనంతరం కెయిర్న్ ఇండియా వేదాంతలో విలీనమైన విషయం తెలిసిందే. ఈ డీల్‌కు సంబంధించి రూ.10,247 కోట్ల పన్ను చెల్లించాలని ఆదాయపన్ను శాఖ కెయిర్న్ ఎనర్జీని ఎప్పటి నుంచో కోరుతోంది. దీన్ని కెయిర్న్ ఎనర్జీ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేసింది. ఇక, పన్ను వసూలులో భాగంగా భారతదేశ ఆదాయపన్ను శాఖ ఎటువంటి నిర్బంధ చర్యలు చేపట్టకుండా, వేదాంత నుంచి రావాల్సిన డివిడెండ్‌ను నిలువరించకుండా చూడాలని కోరుతూ మరోసారి ఇటీవలే ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌కు వెళ్లింది. కాగా, దీన్ని ట్రిబ్యునల్ తోసిపుచ్చినట్టు సమాచారం. వెంటనే చర్యలు... ట్రిబ్యునల్‌లో కెయిర్న్‌కు చుక్కెదురు కావడంతో ఆదాయపన్ను శాఖ వెంటనే తదుపరి చర్యలకు ఉపక్రమించింది. కెయిర్న్‌కు చెల్లించాల్సిన డివిడెండ్ రూ.650 కోట్లను ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయాలని వేదాంత లిమిటెడ్‌ను ఆదేశిస్తూ ఐటీ చట్టంలోని సెక్షన్226(3) కింద ఈ నెల 16న నోటీసు జారీ చేసింది. వేదాంతలో కెయిర్న్‌కు 9.8 శాతం వాటా ఉంది. ఈ వాటా కింద గత రెండు సంవత్సరాలుగా చెల్లించాల్సిన డివిడెండ్‌ను పన్ను వివాదం నేపథ్యంలో వేదాంత లిమిటెడ్ నిలిపి ఉంచింది. ఇక వేదాంతలో కెయిర్న్‌కు ఉన్న వాటాను సైతం ఆదాయపన్ను శాఖ స్వాధీనం చేసుకోనుంది. చట్ట ప్రకారం పన్ను వసూలుకు అసెసింగ్ అధికారి సర్టిఫికెట్‌ను రూపొందిస్తున్నారని, ఇందులో భాగంగా కెయిర్న్‌కు వేదాంతలో ఉన్న వాటాను స్వాధీనం చేసుకుని విక్రయించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎల్ఐసీ లేదా వేదాంత లిమిటెడ్ ఈ రెండు సంస్థల్లో రేటు ఎక్కువ కోట్ చేసిన వారికి వాటాను విక్రయించే అవకాశమున్నట్టు వెల్లడించాయి. న్యాయపోరాటం కొనసాగిస్తాం: కెయిర్న్ ఆదాయపన్ను శాఖ తాజా చర్యలను కెయిర్న్ ఎనర్జీ ధ్రువీకరించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌లో రెట్రోస్పెక్టివ్ పన్ను విషయంలో తన పోరాటం కొనసాగిస్తామని, కేసుపై తమకు విశ్వాసం ఉందని పేర్కొంది. -
అంచనాలను బీట్ చేసిన వేదాంత
ముంబై: ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్ క్యూ4 లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. అనిల్ అగర్వాల్ గ్రూప్ డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంత కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,988 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది రూ.21,104కోట్ల నష్టాలతో పోలిస్తే , మార్చి 31 తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 466.09 మిలియన్ డాలర్లుగా నమోదైంది. కమోడిటీ ధరలు, జింక్ వాల్యూములు పుంజుకున్న నేపథ్యంలో విశ్లేషకులు అంచనాలను బీట్ చేసింది. ముఖ్యంగా కైయిర్న్ ఇండియా లిమిటెడ్ కొనుగోలు తర్వాత రూ. 2,667 కోట్ల లాభాన్ని ఆర్జించనుందని విశ్లేషకులు అంచనా వేశారు. మొత్తం ఆదాయం సైతం 40 శాతం పెరిగి రూ. 23,691 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ఆదాయం 35 శాతం పెరిగి రూ .24,612 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 7,350 కోట్లు కాగా మార్జిన్లు 32.7 శాతంగా నమోదయ్యాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 1410 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం బీఎస్ఈలో వేదాంతా షేరు 2 శాతం లాభపడింది. -
వేదాంతా మధ్యంతర డివిడెండ్
ముంబై: మెటల్స్ అండ్ మైన్స్ మేజర్, అనిల్ అగర్వాల్ గ్రూప్ దిగ్గజం వైదాంతా లిమిటెడ్ రెండవ మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. కెయిర్న్ ఇండియా సహా తమ వాటాదారులకు రూ. 6.580 కోట్ల మేర ఈ డివిడెండ్ చెల్లించనున్నట్టు తెలిపింది. ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకి రూ. 17.70 వాటాదారులకు ప్రత్యేక డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ కంపెనీ బోర్డు డైరెక్టర్ల ఆమోదం లభించినట్టు బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. కెయిర్న్ ఇండియీ, వేదంతా విలీనానికి నాన్ రెసిడెన్షియల్ వాటాదారులకు ప్రాధాన్య వాటాల జారీపై ఆర్బీఐ ఆమోదం తప్ప, రెగ్యులేటరీ ఆమోదం లభించినట్టు వెల్లడించింది. ఈ విలీన ప్రక్రియ పూర్తయిన తరువాత రికార్డ్ డేట్ ను ఖరారు చేయనున్నట్టు తెలిపింది. వేదాంతా వాటాదారులకు ఏప్రిల్ 12 రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 1.6 శాతం లాభపడింది. ఇటీవల హిందుస్తాన్ జింక్ భారీ డివిడెండ్ ప్రకటించడంతో లో వేదాంతాకు మెజారిటీ వాటా ఉండటంతో సుమారు రూ. 7000 కోట్లమేర డివిడెండ్‌ను అందుకోవడం తన వాటాదారులకు కూడా ఈ ప్రత్యేక డివిడెండ్ ప్రకటించింది. -
వేదాంత లాభం17 శాతం వృద్ధి
• క్యూ2లో రూ.1,251 కోట్లుఆదాయంలో తగ్గుదల • స్టీల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు సిద్ధమని ప్రకటన న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ సెప్టెంబర్ త్రైమాసికంలో 1,251 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.1,069 కోట్లతో పోలిస్తే లాభంలో 17 శాతం వృద్ధి నమోదైంది. నిర్వహణ పనితీరు మెరుగుపడడం లాభాల వృద్ధికి కారణమైంది. ఆదాయం మాత్రం రూ.18,898 కోట్ల నుంచి రూ.18,029 కోట్లకు పడిపోయింది. భవిష్యత్తులో స్టీల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు సిద్ధమని కంపెనీ ప్రకటించింది. నిర్వహణ పనితీరు కారణంగానే అధిక లాభం వచ్చినట్టు వేదాంత ప్రెసిడెంట్ (ఫైనాన్స్), గ్రూపు సీఎఫ్‌వో జీఆర్ అరుణ్‌కుమార్ వెల్లడించారు. అధిక ఇబిటా, మంచి ధరలు కూడా కలసివచ్చినట్టు చెప్పారు. కాగా, భారత్‌లో భవిష్యత్తులో స్టీల్ డిమాండ్ పెరిగితే తమ వ్యాపారానికి అదనపు విలువ చేకూర్చేందుకు వీలుగా ఆ అవకాశాలను పరిశీలిస్తామని వేదాంత లిమిటెడ్ సీఈవో టామ్ ఆల్బనీస్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం తమ ఐరన్‌వోర్ వ్యాపారం చాలా బలంగా ఉందని, ఈ దృష్ట్యా ఇతర అవకాశాలను కూడా పరిశీలిస్తామన్నారు. భారత్ 8-9 శాతం వృద్ధిని పదేళ్లపాటు నమోదుచేస్తే పెద్దఎత్తున స్టీల్‌ను వినియోగించే దేశంగా మారుతుందని వివరించారు. -
కర్ణాటక గనుల వేలంకు స్పందన కరువు
న్యూఢిల్లీ: కర్ణాటకలోని ఇనుప ఖనిజ గనుల ఈ–వేలం పాటకు ప్రైవేటు సంస్థల నుంచి ఆశించినంత స్పందన రాకపోవడంతో మిగిలిపోయిన గనుల్ని కలిపి వేలం పాట వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీంతోపాటు ఈ అంశానికి సంబంధించి త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ వేలం పాట రెండవ దశలో మొత్తం 14 మైనింగ్ గనులకు గాను ఎన్ఎండీసీ, జిందాల్, వేదాంత సంస్థలతో మరికొన్ని సంస్థలు ఏడు మైనింగ్ గనులను దక్కించుకోగా ఏడు మైనింగ్ గనులు మిగిలిపోయాయి. అయితే ఆ మైనింగ్ గనుల్లో తగినంత ఇనుప ఖనిజం నిల్వలు లేకపోవడంతోపాటు తక్కువ నాణ్యత కారణంగానే ఏ సంస్థలు వాటిపట్ల ఆసక్తి చూపించలేదని ఓ ప్రభుత్వాధికారి వెల్లడించారు. దీనికి పరిష్కారంగా కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రైవేటు కంపెనీలకు అనుగుణంగా ఈ ఏడు మైనింగ్ గనుల్ని కలిపి మొత్తం 14 మైనింగ్ గనులకు ఒకేసారి వేలం పాట వేసేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇదే సమయంలో ఈ అంశానికి సంబంధించి కేంద్ర మైనింగ్ మంత్రిత్వశాఖతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. -
కెయిర్న్ విలీనానికి లైన్ క్లియర్
వేదాంత వాటాదారుల ఆమోదం న్యూఢిల్లీ: వేదాంతలో కెయిర్న్ ఇండియా విలీనానికి మరో అడుగు ముందుకు పడింది. కెయిర్న్ ఇండియా విలీనానికి వేదాంత లిమిటెడ్ వాటాదారులు, రుణదాతలు ఆమోదం తెలిపారు. ఈ వారం మొదట్లో వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ వేదాంత రీసోర్సెస్ వాటాదారులు సైతం ఈ విలీనానికి ఆమోదం తెలిపారు. కానీ, వచ్చే వారం సెప్టెంబర్ 12న జరిగే కెయిర్న్ ఇండియా వాటాదారుల సమావేశం కీలకం కానుంది. ఎందుకంటే సవరించిన షేర్ల మార్పిడి నిష్పత్తి ప్రకారం వేదాంత టేకోవర్‌కు కెయిర్న్ ఇండియా వాటాదారులు అంగీకారం తెలపాల్సి ఉంది. సవరించిన డీల్ ప్రకారం కెయిర్న్ వాటాదారులకు రూ.10 ముఖ విలువ గలిగిన ఒక షేరుకు గాను రూ.1 ముఖ విలువ కలిగిన వేదాంత షేరుతోపాటు నాలుగు ప్రిఫరెన్స్ షేర్లను 18 నెలల కాలానికి 7.5% వడ్డీ రేటుతో జారీ చేస్తుంది. కెయిర్న్ ఇండియాలో ఎల్ఐసీకి 9.06%, మాజీ ప్రమోటర్ కెయిర్న్ ఎనర్జీకి 9.82% వాటాలు ఉన్నాయి. కాగా, నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న కెయిర్న్ విలీనం, భారీ రుణ భారాన్ని మోస్తున్న వేదాంతకు లభించనుంది. వేదాంతకు రూ.77,952 కోట్ల రుణాలు ఉండగా, కెయిర్న్ ఇండియా రిజర్వ్ నిధులు రూ.23,290 కోట్లను రుణాలను తీర్చివేసేందుకు ఉపయోగించాలని అనుకుంటున్నట్టు వేదాంత ఇప్పటికే తెలిపింది. -
వేదాంత, కెయిర్న్ మెర్జర్ కు షేర్ హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్
ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్..కెయిర్న్ ఇండియా విలీనానికి షేర్ హోల్డర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విలీన ప్రతిపాదనకు మదుపర్లు, సెక్యూర్డు, అన్సెక్యూర్డ్ రుణదాతలు అంగీకారం తెలిపారు. ఈ విషయాన్నివేదాంత రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం తెలిపింది. గోవాలో గురువారం జరిగిన ప్రతిపాదన ఓటింగ్‌కు వేదాంత లిమిటెడ్ మదుపర్లు అనుమతినిచ్చారని తెలిపింది. ఈ మెర్జర్ ద్వారా దేశంలో అతిపెద్ద విభిన్నమైన సహజ వనరులను సంస్థగా అవతరించాలనేది అగర్వాల్ ప్రణాళిక. సవరించిన ఆఫర్ ప్రకారం10 రూపాయల ముఖ విలువ గల షేర్ కు నాలుగు ప్రిఫరెన్షియల్ షేర్లను మైనారిటీ వాటాదారులకు అందించనుంది. అయితే వేదాంత అసలు పరీక్షను సెప్టెంబర్ 12న ఎదుర్కోనుంది. విలీన ఒప్పందంపై స్టేక్ హోల్డర్ల అభిప్రాయం తెలుసుకునేందుకు కెయిర్న్ ఇండియా ఆరోజునే సమావేశం నిర్వహించనుంది. అక్కడ అంగీకారం లభిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. కోటీశ్వరుడు అనిల్ అగర్వాల్ నేతృత్వంలో ముందుకు సాగుతున్న ఈ వ్యవహారంలో ఇటీవల వేదాంత రిసోర్సెస్, వేదాంత లిమిటెడ్ మాతృ సంస్థ యొక్క వాటాదారులు మెర్జర్ ను అనుమతించిన విషయం తెలిసిందే. -
బళ్లారిలో వేదాంతా స్టీల్ ప్లాంట్
న్యూఢిల్లీ: ఏడాదికి 5 మిలియన్ టన్నుల సామర్థ్యంగల స్టీల్ ప్లాంట్‌ను కర్ణాటకలోని బళ్లారిలో ఏర్పాటు చేయాలని వేదాంతా గ్రూప్ భావిస్తోంది. ఇందుకు రూ. 30,000 కోట్లను ఇన్వెస్ట్‌చేసే ప్రణాళికలు వేసింది. ఈ దిశలో ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదిక(ఫీజిబిలిటీ స్టడీ) కోసం ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భాగస్వామ్యం ద్వారా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. అయితే భాగస్వామి కోసం చర్చలింకా మొదలుపెట్టలేదని తెలిపాయి. దేశ ఇనుము, ఉక్కు రంగంలో విస్తరించేందుకు వీలుగా అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని వేదాంతా భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. బళ్లారి స్టీల్ ప్లాంట్‌పై కంపెనీ అత్యంత ఆసక్తిని చూపుతున్నదని, ఇక్కడ 700 ఎకరాలను కలిగి ఉన్నదని వివరించాయి. ఆగస్ట్ 1న లండన్‌లో నిర్వహించనున్న కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో ఈ ప్లాంట్ విషయమై ఒక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలిపాయి. 2011లో రూ. 220 కోట్లు వెచ్చించడం ద్వారా బళ్లారి స్టీల్ అండ్ అల్లాయ్స్(బీఎస్ఏఎల్) ఆస్తులను వేదాంతా సొంతం చేసుకుంది. 5 లక్షల టన్నుల సామర్థ్యంతో సమీకృత స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని బీఎస్ఏఎల్ ప్రణాళికలు వేసినప్పటికీ, రుణ భారం కారణంగా విఫలమైంది.