న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్‌ఇండియా, ఓఎన్ జీసీతోపాటు అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత లిమిటెడ్ తాజాగా ముగిసిన చమురు, గాయ్స్ బ్లాక్‌ల వేలంలో టాప్–3గా నిలిచాయి. రెండో దశ ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ (ఓఏఎల్‌పీ) కింద 14 ఆయిల్, గ్యాస్ బ్లాక్‌లు, మూడో దశ ఓఏఎల్‌పీ కింద మరో 18 ఆయిల్, గ్యాస్, 5 కోల్‌బెడ్ మీథేన్ బ్లాక్‌లను కేంద్రం ప్రభుత్వం వేలానికి ఉంచింది. వీటిల్లో ఆయిల్ ఇండియాకు 12, ఓఎన్ జీసీకి 9, వేదాంతకు తొమ్మిది చొప్పున మొత్తం 30 బ్లాక్‌లు ఈ మూడు కంపెనీలకే దక్కనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్–బీపీ సంయుక్తంగా కృష్టా గోదావరి బేసిన్ (కేజీ బేసిన్ )లో ఓ బ్లాక్‌ను దక్కించుకోనున్నాయి.
ఈ బ్లాక్‌ను ఓఎన్ జీసీ కంటే మించి బిడ్ చేయడం ద్వారా రిలయన్స్–బీపీలు దక్కించుకోవడం విశేషం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స వివిధ కంపెనీలు సమర్పించిన బిడ్లను పరిశీలన పూర్తి చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో ఓఎన్ జీసీ, వేదాంత తొమ్మిది బ్లాకుల్లో టాప్ బిడ్డర్లుగా, 12 బ్లాక్‌ల్లో ఆయిల్ ఇండియా టాప్‌లో ఉన్నట్టు చెప్పాయి. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం అనంతరం విజేతలను ప్రకటించనున్నట్టు తెలిపాయి. 2017 జూలైలో కేంద్రం నూతనంగా ఓఏఎల్‌పీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద కంపెనీలు తమంతట తామే ఫలానా ప్రాంతంలో అన్వేషణ, ఉత్పత్తి విషయంలో ఆసక్తిని తెలియజేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment