16 పీఎస్యూల్లో డిజిన్వెస్ట్మెంట్కు రెడీ
♦ ఈ ఏడాది విక్రయ జాబితా సిద్ధం చేసిన ఆర్థిక శాఖ
♦ లిస్టులో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా
♦ ఖజానాకు రూ.40 వేల కోట్లు వచ్చే అవకాశం
న్యూఢిల్లీ: ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల్లో వాటా విక్రయాల(డిజిన్వెస్ట్‌మెంట్)కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం 16 కంపెనీల జాబితాను రూపొందించింది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో వీటి షేర్ల విలువ ఆధారంగా ఈ వాటా అమ్మకాల ద్వారా రూ. 40 వేల కోట్లు వస్తుందని అంచనా. లిస్టులో ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఎన్‌ఎండీసీ, ఎంఓఐఎల్, ఎంఎంటీసీ, నేషనల్ ఫెర్టిలైజర్స్, ఎన్‌హెచ్‌పీసీ, నాల్కో, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితర కంపెనీలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీటిలో చాలా కంపెనీల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ను గత ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టాలని భావించినా.. స్టాక్‌మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా జాప్యం జరిగింది. కొన్ని కంపెనీలకు సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా లభించింది. మరోపక్క, భారీగా నగదు నిల్వలు ఉన్న కంపెనీల నుంచి షేర్ల బైబ్యాక్ ఆప్షన్‌ను కూడా పరిశీలించే అవకాశం ఉందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 10 శాతం చొప్పున వాటా అమ్మకాల ద్వారా కోల్ ఇండియా నుంచి రూ.18,000 కోట్లు, ఎన్‌ఎం డీసీ నుంచి రూ.3,800 కోట్లు, నాల్కో నుంచి రూ.1,000 కోట్లు లభించే అవకాశం ఉంది. ఇక ఓఎన్‌జీసీలో 5% వాటా విక్రయం ద్వారా రూ.9,000 కోట్లు ఖజానాకు సమకూరనుంది. ఈ ఏడాది బడ్జెట్‌లో 2016-17 డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని కేంద్రం రూ.56,500 కోట్లుగా నిర్ధేశించుకుంది. పీఎస్‌యూల్లో మైనారిటీ వాటా అమ్మకంతో రూ. 36,000 కోట్లు.. లాభాల్లో అదేవిధంగా నష్టజాతక కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయాల రూపంలో రూ.20,500 కోట్లు సమకూర్చుకోవాలనేది ప్రణాళిక.