ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ 2040 నాటికి తన ఉత్పత్తుల తయారీలో ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా ప్రయత్నాలు చేపట్టింది. అందుకోసం రూ.25,000 కోట్ల పెట్టుబడితో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ రంజిత్ రాత్ తెలిపారు.
ఈ సందర్భంగా రంజిత్ రాత్ మాట్లాడుతూ..‘క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌లు, బయోగ్యాస్, ఇథనాల్ ప్లాంట్‌లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాం. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలున్నాయి. దాంతో నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల టన్నుల ముడి చమురు ఉత్పత్తి చేశాం. 2025-26 నాటికి ఇది 90 లక్షల టన్నులకు చేరుతుంది. అస్సాంలోని రవాణా, పరిశ్రమలకు ఉపయోగపడే ద్రవ ఇంధనాల స్థానంలో సహజ వాయువులు వాడేందుకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి 80 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే అస్సాంలో 640 మెగావాట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో మరో 150 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని చెప్పారు.
ఇదీ చదవండి: వంటనూనె ధరలు పెంపు..?
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అన్ని విభాగాల్లో 2046 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా నిర్ణయించుకుంది. చమురు, గ్యాస్ ఉత్పత్తిదారైన ఓఎన్‌జీసీ 2038 నాటికి అదే లక్ష్యాన్ని సాధించడానికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), గెయిల్ ఇండియా లిమిటెడ్ తమ కార్యకలాపాల్లో నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించడానికి 2040 లక్ష్యంగా పెట్టుకున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) 2046 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment