emissions
-
కాలుష్య కట్టడికి రూ.25 వేలకోట్లు
ప్రభుత్వ ఆధీనంలోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ 2040 నాటికి తన ఉత్పత్తుల తయారీలో ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల కాకుండా ప్రయత్నాలు చేపట్టింది. అందుకోసం రూ.25,000 కోట్ల పెట్టుబడితో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్ రంజిత్ రాత్ తెలిపారు.ఈ సందర్భంగా రంజిత్ రాత్ మాట్లాడుతూ..‘క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బయోగ్యాస్, ఇథనాల్ ప్లాంట్లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశాం. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ప్రణాళికలున్నాయి. దాంతో నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 65 లక్షల టన్నుల ముడి చమురు ఉత్పత్తి చేశాం. 2025-26 నాటికి ఇది 90 లక్షల టన్నులకు చేరుతుంది. అస్సాంలోని రవాణా, పరిశ్రమలకు ఉపయోగపడే ద్రవ ఇంధనాల స్థానంలో సహజ వాయువులు వాడేందుకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి 80 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇప్పటికే అస్సాంలో 640 మెగావాట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో మరో 150 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: వంటనూనె ధరలు పెంపు..?ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అన్ని విభాగాల్లో 2046 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా నిర్ణయించుకుంది. చమురు, గ్యాస్ ఉత్పత్తిదారైన ఓఎన్జీసీ 2038 నాటికి అదే లక్ష్యాన్ని సాధించడానికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), గెయిల్ ఇండియా లిమిటెడ్ తమ కార్యకలాపాల్లో నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించడానికి 2040 లక్ష్యంగా పెట్టుకున్నాయి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) 2046 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించింది. -
స్వచ్ఛ ప్రపంచం కోసం ఏటా కావాలో...రూ.2.24 కోట్ల కోట్లు!
కర్బన, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు. ప్రస్తుతం ప్రపంచ మానవాళికి పెను ప్రమాదంగా పరిణమించిన పెను సమస్యలు. పర్యావరణం పట్ల మనిషి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. వాటిని ఎలాగైనా తగ్గించాలన్న ప్రతినలు, లక్ష్యాలు కాగితాలకే పరిమితమ వుతున్నాయి. భావితరాల భద్రత పట్ల మన జవాబుదారీతనాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ప్రస్తుత లెక్కల్లో 2050 నాటికి ఉద్గారాలను పూర్తిగా (నెట్ జీరో స్థాయికి) తగ్గించాలంటే ప్రపంచ స్థాయిలో ఇప్పటి నుంచీ ఏటా కనీసం 2.24 కోట్ల కోట్ల రూపాయలు (2.7 లక్షల కోట్ల డాలర్లు) వెచి్చంచాల్సి ఉంటుందట! అలాగైతేనే ఈ శతాబ్దాంతానికల్లా అంతర్జాతీయ సగటు ఉష్ణోగ్రతలు కూడా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పరిమితిని దాటకుండా ఉంటాయట. కానీ ఉద్గారాలకు ప్రధాన కారణంగా ఉన్న చాలా దేశాలు తామే స్వయంగా నిర్దేశించుకున్న 2030 లక్ష్యాల సాధనకే అల్లంత దూరంలో ఉన్నాయనీ తాజా నివేదిక ఒకటి వాపోతోంది! ఈ పరిస్థితుల్లో వాటి నుంచి 2050 లక్ష్యాల పట్ల చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణను ఆశించడం అత్యాశేనని పర్యావరణవేత్త లు అంటున్నారు. మరోవైపు సముద్రాలకు ముప్పు కూడా నానాటికీ మరింతగా పెరిగిపోతోందని గ్రీన్ పీస్ నివేదిక హెచ్చరిస్తోంది. చేపల వేట విచ్చలవిడిగా సాగుతోందని, గత నాలుగేళ్లలో 8.5 శాతం దాకా పెరిగిందని అది పేర్కొంది! లక్ష్యాలు ఘనమే కానీ... ► కర్బన ఉద్గారాల కట్టడికి ప్రస్తుతం అన్ని దేశాలూ కలిపి ఏటా 1.9 లక్షల కోట్ల డాలర్లు వెచి్చంచాలన్నది లక్ష్యం. కానీ ఇదీ ఒక్క ఏడాది కూడా జరగడం లేదు. ► పలు కీలక సంపన్న దేశాలు ఈ విషయంలో చేస్తున్న గొప్ప ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. ► అవి పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. ► అవిలాగే దాటవేత ధోరణి కొనసాగిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 2050 కల్లా ఏకంగా 2.5 డిగ్రీలు పెరగడం, మానవాళి మనుగడ పెను ప్రమాదంలో పడటం ఖాయమని స్వయంగా ఐక్యరాజ్యసమితే తాజాగా హెచ్చరించింది. సముద్రాలకు ’మహా’ ముప్పు మహా సముద్రాలలో విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటపై అంతర్జాతీయ పర్యావరణ సంస్థ గ్రీన్ పీస్ తాజా నివేదిక తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది... ► 2018తో పోలిస్తే 2022 నాటికి సముద్రాల్లో చేపల వేట 8.5 శాతం పెరిగింది. ప్రత్యేక రక్షిత ప్రాంతాలైన సున్నిత సముద్ర జలాల్లోనైతే ఏకంగా 23.5 శాతం పెరిగింది. ► నిర్దిష్ట అంతర్జాతీయ సముద్ర జలా లను చేపల వేటను నిషేధించాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి గ్రీన్ పీస్ చేసిన కృషి ఫలించి ఎట్టకేలకు గత మార్చిలో ఒప్పందంగా రూపుదాల్చాయి. జూన్‌లో ఐరాస కూడా దానికి ఆమోదముద్ర వేసింది. ► కానీ ఏ దేశమూ ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదని నివేదిక వాపోతోంది. ► విచ్చలవిడిగా వేట దెబ్బకు అరుదైన సముద్ర జీవరాశులు దాదాపుగా అంతరించిపోతున్నాయి. ► ఉదాహరణకు పసిఫిక్ బ్లూఫిన్ ట్యూనా చేప జాతి గత మూడు దశాబ్దాల్లోనే ఏకంగా 90 శాతానికి పైగా క్షీణించిపోయింది. ► ’30 బై 30’ లక్ష్య సాధనకు దేశాలన్నీ ఇప్పటికైనా నడుం బిగిస్తే మేలని గ్రీన్ పీస్ నివేదిక పేర్కొంది. ► ప్రపంచంలోని భూ, జలవనరులను 2030 కల్లా కనీసం 30 శాతమన్నా సంపూర్ణంగా సురక్షితంగా తీర్చిదిద్ద డమే ‘30 బై 30’ లక్ష్యం. నెట్ జీరో అంటే.. ► కర్బన ఉద్గారాలను దాదాపుగా సున్నా స్థాయికి తగ్గించడం. ► కాస్తో కూస్తో మిగిలే ఉద్గారాలను మహా సముద్రాలు, అడవుల వంటి ప్రాకృతిక వనరులు శోషించుకుంటాయన్నది సిద్ధాంతం. ► ఇందుకు ఉద్దేశించిన నిధుల్లో మూడొంతులు కీలకమైన ఇంధన, మౌలిక రంగాలపై వెచి్చంచాలన్నది లక్ష్యం. మిగతా లక్ష్యాలు ఏమిటంటే... ► రవాణా రంగాన్ని వీలైనంతగా విద్యుదీకరించడం. ► గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ‘1.5 డిగ్రీ ఉష్ణోగ్రత లక్ష్య సాధన అత్యంత పెను సవాలేనని చెప్పాలి. ఈ దశాబ్దంలో మిగిలి ఉన్న ఆరేళ్లలో ఆ దిశగా ఎంత చిత్తశుద్ధితో ప్రయతి్నస్తామన్న దానిపైనే ప్రపంచ భవిష్యత్తు చాలావరకు ఆధారపడి ఉంటుంది‘ – సైమన్ ఫ్లవర్స్ సీఈఓ, చీఫ్ స్ట్రాటజిస్ట్, వుడ్ మెకంజీ సంస్థ ‘లక్ష్యాల మాట ఎలా ఉన్నా చమురు, సహజ వాయువు పాత్ర అంతర్జాతీయ స్థాయి లో కనీసం మరి కొన్నేళ్ల పాటు కీలకంగానే ఉండనుంది‘ – ప్రకాశ్ శర్మ వైస్ ప్రెసిడెంట్, వుడ్ మెకంజీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓఎన్జీసీ రూ. లక్ష కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ 2030 నాటికి ఇంధన పరివర్తన ప్రాజెక్టులపై రూ. 1 లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 2038 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ (కర్బన ఉద్గారాల విడుదల, తగ్గింపు మధ్య సమతౌల్యం పాటించడం) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. తద్వారా నెట్ జీరో ఎమిషన్స్‌కు మార్గదర్శ ప్రణాళికలను వేసుకుంటున్న తోటి సంస్థలు ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్), గెయిల్, భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) మొదలైన వాటి సరసన చేరనుంది. కంపెనీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ ఈ విషయాలు వెల్లడించారు. తాము అంతర్గతంగా నెట్–జీరోపై కసరత్తు చేసి 2038 లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. 2030 నాటికి పునరుత్పాదక వనరుల ద్వారా విద్యుదుత్పత్తిని 189 మెగావాట్ల నుంచి 1 గిగావాట్లకు పెంచుకోవాలని ఓఎన్జీసీ నిర్దేశించుకుంది. ఇప్పటికే రాజస్థాన్‌లో 5 గిగావాట్ల ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉండగా.. అదే స్థాయిలో మరో ప్రాజెక్టును నెలకొల్పే అంశం పరిశీలనలో ఉన్నట్లు సింగ్ వివరించారు. మంగళూరులో వార్షికంగా 1 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ప్లాంటును ఏర్పాటు చేయడంపైనా దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటికీ మొత్తం మీద రూ. 1 లక్ష కోట్ల వరకు పెట్టుబడులు ఉంటాయని సింగ్ వివరించారు. ఆయిల్ ఉత్పత్తి అప్.. 2022–23లో ఓఎన్జీసీ 19.584 మిలియన్ టన్నుల (ఎంటీ) చమురు ఉత్పత్తి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 21.263 ఎంటీకి, తదుపరి 21.525 ఎంటీ, ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో 22.389 ఎంటీకి చేరనుంది. 2021–22లో చమురు ఉత్పత్తి 19.545 ఎంటీగా నమోదైంది. మరోవైపు సహజ వాయువు ఉత్పత్తి 2022–23లో 20.636 బీసీఎం (బిలియన్ ఘనపు మీటర్లు)గా ఉండగా, 2023–24లో 23.621 బీసీఎం, తర్వాత ఏడాది 26.08 బీసీఎం, 2025–26లో 27.16 బీసీఎంకు చేరనుంది. తూర్పు, పశ్చిమ తీరాల్లోని ప్రాజెక్టుల్లో ఉత్పాదకతను పెంచుకోవడంతో పాటు కొత్త నిక్షేపాలను కూడా అభివృద్ధి చేస్తుండటంతో ఉత్పత్తి పెరగడానికి దోహదపడుతోంది. ఇదీ చదవండి: ఆర్‌క్యాప్ నష్టాలు తగ్గాయ్ -
ఎస్‌యూవీలతో పర్యావరణ ముప్పు
బెర్లిన్: పెద్ద కార్లతో పర్యావరణానికి సమస్య పెరుగుతోంది. కర్బన ఉద్గారాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే ఇందుకు కారణం’ అని ప్యారిస్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ఎస్యూవీ సగటు సైజు తగ్గించడం, బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యాలు పెంచడం, వినూత్న బ్యాటరీ సాంకేతికతల్లో పెట్టుబడులు ఇందుకు పరిష్కారమని స్పష్టం చేసింది. ‘2022లో ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) 100 కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వెదజల్లాయి. ఇది జర్మనీ వంటి పారిశ్రామిక దేశ వార్షిక ఉద్గారాల కంటే ఎక్కువ. పెద్ద కార్ల వైపు మార్కెట్ మళ్లడం, తక్కువ ఇంధన సామర్థ్యం గల సంప్రదాయ వాహనాలతో చమురు డిమాండ్‌తోపాటు కర్బన ఉద్గారాలు అధికం అవుతాయి. ఎస్‌యూవీలు మినహా సంప్రదాయ కార్లు వినియోగించిన చమురు 2021, 2022లో దాదాపు సమానం. ఎస్‌యూవీల విషయంలో చమురు వాడకం రోజుకు 5 లక్షల బ్యారెల్స్ దూసుకెళ్లింది. 2022 అమ్మకాల్లో చిన్న కార్లు 10 లక్షల యూనిట్లు, ఎస్‌యూవీలు 10 లక్షల యూనిట్లు తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు రెండింతలై 1 కోటి యూనిట్లకు చేరాయి. గతేడాది ఎలక్ట్రిక్ నాన్–ఎస్‌యూవీలు 53 లక్షల యూనిట్లు అమ్ముడైతే, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు 55 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. పెరుగుతున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్‌తో బ్యాటరీ సరఫరా వ్యవస్థపై అదనపు ఒత్తిడి ఉంటుంది. బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన క్లిష్ట ఖనిజాల కోసం డిమాండ్‌ను మరింత పెంచుతుంది’ అని ఏజెన్సీ వివరించింది. -
Hyderabad: ద్విచక్ర వాహనాలే టాప్.. మెట్రోకు ఆదరణ అంతంతే !
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఇప్పటికీ ప్రజా రవాణాలో సింహభాగం వాటా ద్విచక్ర వాహనాలదే కావడం విశేషం. నిత్యం సిటీలో వ్యక్తిగత వాహనాలపై రాకపోకలు సాగించే వారు 39 శాతం ఉండగా.. బస్సుల్లో జర్నీ చేసే వారు 34 శాతం ఉన్నారు. ఇక ఆటోలు, క్యాబ్‌ల్లో రాకపోకలు సాగించేవారు 17 శాతం మంది.. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో జర్నీ చేసేవారు కేవలం 10 శాతం మించకపోవడం గమనార్హం. నగరంలో కాలుష్యాన్ని, కర్బన ఉద్గారాల కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మెట్రో ప్రజల ఆదరణను చూరగొనలేకపోయింది. ఇవే శాపం.. ► నగర మెట్రో నిర్మాణ, నిర్వహణ వ్యయాలు తడిసి మోపెడవుతున్నాయి. ఒక కిలోమీటరు మేర ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేయాలంటే సుమారు రూ.272 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. ప్రస్తుతం నగర మెట్రో నిత్యం రూ.కోటి నష్టంతో నెట్టుకొస్తోంది. మెట్రో డిపోలు, స్టేషన్లు, రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతాలు, సాంకేతిక నష్టాలను అరికట్టేందుకు ఎక్కువ వ్యయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ► ఇక రెండో దశ మెట్రో ఏర్పాటుకు అవసరమైన రూ.8,400 కోట్లు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఆ స్థాయిలో నిధులు విడుదల చేసే పరిస్థితులో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రెండో దశ మెట్రో మార్గాన్ని పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టేందుకు ఏ సంస్థ ముందుకొస్తుందన్న అంశంపై పలు అనుమానాలు నెలకొంటున్నాయి. మెట్రోతో కాలుష్యం తగ్గిందిలా.. ► గతేడాది సరాసరి లెక్కను పరిశీలిస్తే సుమారు 3.8 కోట్ల కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు నగర వాతావరణంలో చేరకుండా మెట్రో నివారించడం విశేషం. నగర మెట్రో రైళ్లు విద్యుత్ ఆధారంగా పని చేస్తున్న విషయం విదితమే. స్టేషన్లలో విద్యుత్ అవసరాలకు సౌర విద్యుత్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. మెట్రో రైళ్లు గతేడాది సుమారు 1.6 కోట్ల లీటర్ల ఇంధనాన్ని సైతం ఆదా చేసినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ► మూడు బోగీలుండే మెట్రో రైలులో ఏకకాలంలో 975 మంది ప్రయాణించవచ్చు. ఇక కాలుష్య ఉద్గారాల విషయానికి వస్తే 30 కిలోమీటర్లు మెట్రోలో జర్నీ చేస్తే కేవలం 190 కిలోల కార్బన్ డయాక్సైడ్ కాలుష్యం విడుదల అవుతుంది. అదే బస్సులో కేవలం 50 మంది ప్రయాణించవచ్చు. కాగా.. ఒక మెట్రో రైలులో ప్రయాణించేవారి సంఖ్య 20 సిటీ బస్సులతో సమానం. వీటిలో జర్నీ చేస్తే ఏకంగా 405 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలై పర్యావరణ హననం జరుగుతోంది. ► ద్విచక్ర వాహనంపై ఇద్దరు జర్నీ చేసే వీలుంది. సుమారు 975 మంది జర్నీ చేయాలంటే 488 వాహనాలు అవసరం. వీటిపై 30 కిలోమీటర్లు జర్నీ చేస్తే 730 కిలోల సీఓ 2 కాలుష్యం విడుదల అవుతుంది. కారులో నలుగురు వ్యక్తులు జర్నీ చేయవచ్చు. 975 మంది 30 కి.మీ మేర జర్నీ చేసేందుకు 244 కార్లు అవసరం అవుతాయి. ఇన్ని కార్లలో జర్నీ చేస్తే ఏకంగా 1200 కిలోల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు చెబుతున్నాయి. అంటే బస్సు, కారు, ద్విచక్రవాహనాలతో సిటీ కిక్కిరిసిపోయి.. పొగచూరుతుండగా.. మెట్రోతో కాలుష్యం గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. (క్లిక్ చేయండి: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ) -
శతమానం భారతి: అభివృద్ధి వెంటే అనర్థమూ.. భూతాపమూ అలాంటిదే!
అభివృద్ధి వెంటే అనర్థమూ ఉంటుంది. భూతాపం అలాంటి అనర్థమే. ప్రస్తుతం భూమి ఉష్ణోగ్రత 13.9 సెల్సియస్ డిగ్రీలు. ఈ వేడిమి కనుక ఇంకో 1.5 డిగ్రీలు పెరిగితే మనం ఇంకో గ్రహం వెతుక్కోవలసిందే. అంతకన్నా తేలికైన పని.. అభివృద్ధిని ఎలాగూ ఆపుకోలేం కనుక.. అనర్థాలను తగ్గించుకోవడం. స్కాట్లాండ్లోని గ్లాస్కోలో గత ఏడాది ‘కాప్ 26’ సదస్సు జరిగింది ఇందుకే. అందులో మన దేశం కూడా పాల్గొంది. కాప్ అంటే ‘కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్’. 26 అంటే ఇరవై ఆరవ సదస్సు అని. వాతావరణ మార్పుల నిరోధానికి 1992లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక ఒప్పందం కుదిరింది. దానికి అనుగుణంగా మళ్లీ 2015లో ప్యారిస్‌లో ఒక ఒప్పందం జరిగింది. కర్బన ఉద్గారాలు తగ్గించగలిగితే భూమి వేడినీ తగ్గించవచ్చని సమితి ఆలోచన. 2050 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గిస్తానని భారత్ ఆ సదస్సులో మాటైతే ఇచ్చింది కానీ, ఎలా తగ్గించాలనేదే పెద్ద సమస్య. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడం అంటే అభివృద్ధిని తక్కించుకోవడమే. అయినా భూమి కంటే అభివృద్ధి ముఖ్యం కాదు కదా. కూర్చున్న కొమ్మను కాపాడుకుంటేనే మనుగడ అనే సత్యాన్ని స్వతంత్ర భారత్‌కు తెలియంది కాదు. అందుకనే నిర్ణయాత్మకంగా అడుగులు వేస్తోంది. 2047 నాటికి ఆ అడుగులు భూతాపాన్ని తగ్గించే దిశగా దేశాన్ని ఎక్కడి వరకు చేరుస్తాయో చూడాలి. -
మేలుకోకపోతే ఆహార సంక్షోభమే!
ఈ ఏడాది భూతాపం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయనీ, అందువల్ల రానున్న రోజుల్లో ఆహార సంక్షోభం తలెత్తవచ్చుననీ ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదిక సమీప భవిష్యత్తులో మానవాళి భవిష్యత్తు మనుగడ పట్ల ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భూ ఉష్ణాన్ని రాబోయే 10 ఏళ్లల్లో కనీసం 2 డిగ్రీలు తగ్గించాలని దాదాపు 8 ఏళ్ల క్రితం పారిస్‌లో రూపొందించిన ‘వాతావరణ విధాన పత్రం’ ఓ చిత్తు కాగితంగా మారిన ఫలితంగానే ఈ సమస్య ముంచుకొచ్చింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే శిఖరాగ్ర సదస్సులలో చేసే తీర్మానాలకు సభ్యదేశాలు కట్టుబడకుండా వాటిని ఉల్లంఘించడం ఓ రివాజుగా మారింది. ఉమ్మడి ప్రయోజనాలను తాకట్టుపెట్టి సొంత ప్రయోజనాలకే అగ్ర దేశాలు మొగ్గుచూపడం వల్ల ప్రపంచంలో జీవ వైవిధ్యం, వాతావరణ సమతుల్యత అదుపుతప్పాయి. వ్యవసాయ రంగానికి చేటు చేసే గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలో మితి మీరిన మోతాదులో పెరిగిపోయాయి. భూమి మీద పర్యావరణ సమతుల్యత కాపాడడానికి అనేక రకాలైన మొక్కలు, జీవులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు నిర్దిష్ట సంఖ్యలో ఉండాలి. చిన్న, పెద్ద వృక్ష సంతతి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ప్రాణవాయు వును సృష్టిస్తాయి. బ్యాక్టీరియా నీటిలోని లవణ సాంద్రతను కాపాడు తుంది. నదీ ప్రాంతాల అడవులు వరదల్ని నిరోధించి నీటి ప్రవాహ వేగాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. వాతావరణంలో ఉండవలసిన ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ పరిమాణాలను సమపాళ్లలో నియంత్రించే శక్తి జీవ వాతావరణానికి ఉంటుంది. అయితే నత్రజని, మీథేన్, క్లోరోఫోరో కార్బన్లు తదితర గ్రీన్హౌస్ వాయువులు వాతావరణంలోకి ప్రవేశించి పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉష్ణోగ్రతలు అనూ హ్యంగా పెరిగిపోయి, అకాల వర్షాలు పడుతున్నాయి. కాలం కాని కాలంలో తుఫానులు సంభవిస్తున్నాయి. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో కోతకు సంబంధించి లక్ష్యాల సాధనలో అగ్రదేశాలు దారుణంగా విఫలం అయ్యాయి. 1997లో వాయు ఉద్గారాలను అంతకుముందుకంటే దాదాపు 5 శాతం తగ్గించు కోవాలని లక్ష్యంగా ఏర్పరచుకొన్నారు. దానినే ‘క్యోటో ప్రోటోకాల్’గా పిలుచుకోవడం జరిగింది. అగ్రదేశాలైన అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా తదితర దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలకు విఘాతం కలుగుతుందనే సాకుతో తమ పారిశ్రామిక ఉత్పత్తుల నియంత్రణపై జాగ్రత్తలు పాటించలేదు. ఆ తర్వాత పర్యావరణంపై జరిగిన ‘కోపెన్ హాగన్’ సదస్సు, పారిస్‌లో జరిగిన ‘కాప్’ సదస్సులలో సైతం పాత కథే పునరావృతం అయింది. ప్రస్తుత పర్యావరణ సంక్షోభానికి ఏదో ఒక్క దేశమే కారణమని చెప్పలేనప్పటికీ ఆ దుష్ఫలితాలు భారత్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మన దేశానికి సంబంధించినంత వరకూ అంతర్జాతీయ పరిస్థితులతోపాటు దేశంలో రసాయనిక ఎరు వులు, క్రిమిసంహా రకాలు, డీడీటీల వాడకం; గనుల తవ్వకం... రోడ్డు, రైలు మార్గాల నిర్మాణం వంటి అవసరాల కోసం భారత్‌లో జీవ వైవిధ్యాన్ని సమూలంగా నాశనం చేయడం జరుగుతోంది. ఫలితంగా ఏటా సగటున 10 నుంచి 15 మీటర్ల వరకు హిమనీ నదాలు కరిగిపోతున్నట్లు వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ‘అంటార్కిటికా’పై శాస్త్రీయ పరిశోధన జరిపిన కమిటీ వెలువరించిన నివేదిక... 2100 సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు 1.4 మీటర్లు పెరిగే ప్రమాదం ఉందనీ... దానివల్ల తీరప్రాంత నగరాలైన చెన్నె, ముంబయి, కోల్‌కతా వంటి నగరాలతోపాటు ఇతర సముద్ర తీర ప్రాంతాలూ మునగడం ఖాయమనీ స్పష్టం చేసింది. ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరిగితే వరి, గోధుమ, చెరకు వంటి పంటల దిగుబడి 15 శాతం మేర తగ్గిపోతుందని పలు శాస్త్రీయ నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఇంట ర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) విశ్లేషణ ప్రకారం... వరి వెన్ను పుష్పించే సమయంలో వాతావరణ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినట్లయితే, ఆ వెన్ను పనికి రాకుండా పోతుంది. ‘యూనివర్సల్ ఎకొలాజికల్ ఫండ్’ నివేదిక ప్రకారం ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలో ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తున్న భారత్‌లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే రాబోయే దశాబ్దాల కాలంలో వ్యవసాయ దిగుబడుల్లో రమారమి 20 శాతం క్షీణత నమోదవుతుంది. ఉత్పత్తులు ఆ మేరకు తగ్గుతూ ఉంటే వ్యవసాయం గిట్టుబాటుగాక రైతాంగం ఇతర వృత్తులకు తరలిపోయే ప్రమాదం త్వరలోనే ఏర్పడవచ్చు. ఒకవైపు జనాభా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకనుగుణంగా ఆహార ధాన్యాలలో వృద్ధిని కాపాడుకోలేనట్లయితే, అది ఆహార సంక్షో భానికి దారి తీస్తుంది. ఒక అంచనా ప్రకారం... కరోనా వంటి ఉత్పాతం, అదేవిధంగా మలేరియా, టీబీ, ఎయిడ్స్ వంటి ప్రాణాం తక వ్యాధుల బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కంటే ఆకలి చావులతో చనిపోతున్న వారి సంఖ్యే అధికంగా ఉండవచ్చు. ప్రతి యేటా ప్రపంచ వ్యాప్తంగా పోషకాహార లోపంతో చనిపోతున్న 5 ఏళ్ల లోపు పిల్లల సంఖ్య 50 లక్షలుగా ఉన్నదని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 9 మందిలో ఒకరికి ఆహార భద్రత ఇప్పటికే లేదు. ఇంత నాగరిక సమాజంలో కూడా ఆకలి చావులు సంభవించడానికి కారణం అందరికీ ఆహార భద్రత కల్పించే ప్రణాళికలు లోపించడమే. వాస్తవానికి, ఆహారం పొందడం మానవుని హక్కుగా ప్రపంచం లోని దాదాపు అన్ని దేశాలూ గుర్తించాయి. ప్రజలందరికీ ఆహార ధాన్యాలు అందుబాటులో ఉంచడం తమ బాధ్యతగా ప్రభుత్వాలు స్వీకరించాలనీ, ఆకలి రహిత సమాజాన్ని ఆవిష్కరించాలనీ ఐక్యరాజ్యసమితి చాలా కాలం క్రితమే పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలలో ఒకటైన ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ఏర్పరుచుకొన్న లక్ష్యాలలో ప్రధానమైనది 2050 నాటికల్లా ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ దిగుబడులు 50 శాతం మేర పెంచాలన్నది! అప్పుడే పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత చేకూరుతుంది. కానీ, ఈ లక్ష్యాల సాధనకు శరవేగంగా విస్తరిస్తున్న వాతావరణ మార్పులు ప్రతిబంధకాలుగా మారాయి. (క్లిక్: అధికారులు ‘ఛాన్స్’ తీసుకోవడం లేదు!) ఈ నేపథ్యంలో భారత్ వీలయినంత మేర అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తూనే... ఇంకోవైపు వాతావరణ, ఆహార సంక్షోభ సమస్యను తనకు తానుగానే పరిష్కరించుకోవడానికి తగిన వ్యూహాలతో కార్యాచరణ రూపొందించుకొనడమేగాక, చిత్తశుద్ధితో అమలు చేయగలగాలి. పర్యావరణంపై రైతాంగానికి అవగాహన కల్పించడం ద్వారా దేశంలో పంట నష్టాలను గణనీయంగా తగ్గించ వచ్చు. దేశంలో ఉన్న 7 వాతావరణ జోన్లకు అనుగుణంగానూ, అదే విధంగా రుతుపవనాల గమనం ఆధారంగానూ పంటల సాగు జరగాలి. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని రైతాం గానికి కచ్చితమైన సమాచారాన్ని అందించాలి. పర్యావరణానికి సంబంధించి దేశీయ వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న సవాళ్లపై విస్తృతమైన చర్చలు, గోష్ఠులు నిర్వహించి నిపుణల సలహాలు, సూచనలు స్వీకరించి వాటిని ఆచరణలోకి తేవాలి. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం సహజ అటవీ సంపదను కాపాడుకోవాలి. రసాయనిక, క్రిమి సంహారక మందుల వాడకాన్ని నియంత్రించాలి. వాతావరణంలో ప్రవేశించే కర్బన ఊద్గారాలను తగ్గించడానికి బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ‘సౌరశక్తి’ని విస్తృతంగా వినియోగంలోకి తేవాలి. వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగాన్ని మరింత తగ్గించాలి. తరుముకొస్తున్న వాతావరణ ఆహార సంక్షోభాన్ని నివారించడానికి బహుముఖమైన కార్యాచరణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా సమన్వయంతో కృషి చేయాలి. (క్లిక్: పాలనలో టెక్నాలజీ కొత్తేమీ కాదు!) - డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్ -
అదంతా నాన్సెన్స్: ఎలన్ మస్క్
Fewer Kids Environment Theory: స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో తెర మీదకు వచ్చాడు. పర్యావరణం బాగుండాలంటే.. తక్కువ సంతానం కలిగి ఉండాలంటూ వినిపించే వాదనను ఆయన తోసిపుచ్చాడు. ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే.. అది వాతావరణానికి హాని అని అంటుంటారు. అందుకే తక్కువ మంది కనమని సలహాలిస్తుంటారు. అదంతా నాన్సెన్స్. జనాభా ఎంత పెరిగినా.. పర్యావరణానికి వచ్చిన నష్టం ఏం ఉండదు’’ అని ఆయన ఆల్ఇన్ సమ్మిట్( All-In Summit)లో వీడియో కాల్ ద్వారా వ్యాఖ్యానించారు. కనీసం మన సంఖ్యను కాపాడుకుందాం. అలాగని నాటకీయంగా జనాభాను పెంచాల్సిన అవసరం ఏమీ లేదు అని వ్యాఖ్యానించాడు ఏడుగురు బిడ్డల తండ్రైన ఎలన్ మస్క్. ఉదాహరణకు.. జపాన్‌లో జనన రేటు చాలా తక్కువ. కానీ, నాగరికతను కొనసాగించాలంటే.. జనాభా అవసరం ఎంతైనా ఉంది. దానిని మనం తగ్గించలేం అంటూ ఎలన్ మస్క్ వ్యాఖ్యలు చేశారు. అయితే జపాన్ పరిస్థితి ఇంతకు ముందు మస్క్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జపాన్ జనాభా తగ్గిపోవడం ఆందోళనకరమైన అంశంగా పేర్కొన్న ఆయన.. జనాభా రేటులో మార్పుతేకుంటే ఆ దేశం ఉనికికే ప్రమాదని హెచ్చరించారు కూడా. అభివృద్ధి చెందిన దేశాల్లో.. పిల్లలను తక్కువగా కలిగి ఉండడం వల్ల కార్బన ఉద్గారాల విడుదల తక్కువగా ఉంటుందని, ఒక కుటుంబంలో ఒక బిడ్డ తక్కువగా ఉంటే.. 58.6 మెట్రిక్ టన్నుల ఉద్గారం వెలువడకుండా ఉంటుందంటూ ఓ థియరీ ఈ మధ్య చక్కర్లు కొడుతోంది. అయితే.. మారుతున్న లైఫ్ స్టైల్, ప్రొ క్లైమాటిక్ పాలసీలతో ఆ ప్రభావాన్ని(కార్బన్ ఉద్గారాల వెలువడడం) తగ్గించొచ్చని ప్రత్యేకంగా ఓ నివేదిక వెల్లడైంది. "Some people think that having fewer kids is better for the environment. Environment's gonna be fine even if we doubled the population. Japan had lowest birth rate. Having kids is essential for maintaining civilization. We can't let civilization dwindle into nothing." — @elonmusk pic.twitter.com/i03zytLDTJ— Pranay Pathole (@PPathole) May 20, 2022 -
Sailcargo: ఈ నౌకకు ఇంధనం అక్కరలేదట! కేవలం గాలితోనే...
చిన్న చిన్న పడవలైతే గాలివాలుకు అలా ముందుకు సాగిపోతాయి గాని, భారీ నౌకలు సముద్రంలో ముందుకు సాగాలంటే ఇంధనం కావాలి కదా! కేవలం గాలితో ఇంత పెద్ద నౌక సముద్రంలో ఎలా ప్రయాణం సాగించగలుగుతుందనేగా మీ అనుమానం? ఇందులో అణుమాత్రమైనా అనుమానానికి ఆస్కారం లేదు. ఫొటోలో కనిపిస్తున్న ఈ నౌక పూర్తిగా గాలి ఆధారంగానే నడుస్తుంది. కెనడాకు చెందిన ‘కేఫ్ విలియమ్’ తన అంతర్జాతీయ కాఫీ రవాణా కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ నౌక పూర్తిగా పవనశక్తినే ఇంధనంగా మార్చుకుని, సముద్రంలో ప్రయాణిస్తుంది. ‘కేఫ్ విలియమ్’ కోసం ‘సెయిల్ కార్గో’ సంస్థ ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నౌక 2023లో తొలి సముద్రయానం చేయనుంది. చదవండి: Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే.. -
కాలుష్య నియంత్రణ వ్యయమూ పెట్టుబడే!
పంచభూతాలపైన అందరికీ సమాన హక్కు, సమాన బాధ్యత ఉండాలి. మనిషి మనుగడకు కీలకమైన గాలి కలుషితమైనాక జీవి మనుగడ ప్రశ్నార్థకమే కదా. శీతాకాలంలో భారతీయ నగరాల్లో జీవించడం ప్రమాదకరం. ఇవాళ ఢిల్లీ వాయు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఇది ఏ ఒక్క నగరానికో సంబంధించిన సమస్య కాదు. గ్లాస్గోలో జరిగిన కాప్ 26 శిఖరాగ్ర సమావేశ నేపథ్యంలో, విషపూరిత వాయు కాలుష్య స్థాయులను నియంత్రించడంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యత ఉంది. చైనా, అమెరికా, ఐరోపా కూటమి తర్వాత భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద కార్బన్ డయాక్సైడ్ ఉద్గారకం. 2070 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను నికర సున్నాకి తగ్గిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నికర సున్నా ఉద్గారాలు అంటే మానవ నిర్మిత గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలన్నీ వాతా వరణం నుండి తొలగించబడి, తద్వారా భూమి సహజ వాతావరణ సమతుల్యతను తిరిగిపొందడం. యూకే ఆధారిత నాన్–ప్రాఫిట్ క్లీన్ ఎయిర్ ఫండ్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రకారం, వాయు కాలుష్యం భారతీయ వ్యాపారాలకు సాలీనా తొంభై ఐదు బిలియన్ డాలర్ల నష్టం చేకూరుస్తోంది. దేశ జీడీపీలో దాదాపు మూడు శాతం వాయు కాలుష్య పర్యవసానాల్ని ఎదుర్కోవడానికి ఖర్చవుతుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. 2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రూపొందాలనే భారతదేశ ఆకాంక్షను ఈ పరిణామాలు అడ్డుకునే ప్రమాదం లేకపోలేదు. (చదవండి: క్రిప్టో కరెన్సీ నియంత్రణకు సమయం ఇదే!) మానవుల శ్రేయస్సు, తద్వారా ఆర్థికవ్యవస్థపై వాయుకాలుష్య ప్రతికూల ప్రభావాల దృష్ట్యా, వాయు కాలుష్య నిర్వహణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎయిర్ క్వాలిటీ సూచిక రెండు వందల ఒకటి నుంచి మూడువందల పాయింట్ల మధ్య ఉంటే ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ వ్యాధీలేని సాధారణ మానవులు సైతం అనారోగ్య సమస్యలుఎదుర్కొనే అవ కాశం ఉంటుంది. మూడువందల పాయింట్లు మించితే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సి ఉంటుంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సుమారు ఐదు వందలు పాయింట్లు తాకడం గమనార్హం. ‘శీతాకాల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా ఢిల్లీలో ధూళి నియంత్రణ, పూసా బయో– డికంపోజర్‌ను ఉపయోగించడం, స్మోగ్ టవర్లను ఏర్పాటు చేయడం, గ్రీన్ వార్ రూమ్‌లను బలోపేతం చేయడం, వాహనాల ఉద్గారాలను తనిఖీ చేయడంపై దృష్టి సారించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు కొయ్యకాళ్ళు కాల్చడం వల్ల సమస్య మరింత జఠిల మైంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అక్టో బర్ 24 నుంచి నవంబర్ 8 వరకు ఢిల్లీ కాలుష్య కారకాల్లో సగం వాహనాలే ఉన్నాయని పేర్కొంది. (చదవండి: తీరప్రాంత రక్షణలో మన ఐఎన్ఎస్ విశాఖపట్టణం) ఈ సంవత్సరం కర్ణాటక, ఢిల్లీ, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌ఘఢ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు దీపావళి బాణసంచా పేల్చడంపై ఆంక్షలు విధించాయి. దేశంలోని అన్ని నగరాలు నవంబర్ మాసంలో వాయు కాలుష్య కోరల్లో చిక్కుకొని నివాస యోగ్యం కాని ప్రాంతాలుగా మారుతున్నాయి. పర్యావరణ ప్రమాదాలకు గురయ్యే అవకాశం వున్న నగరాలు మొత్తం ఆసియాలోనే ఉండటం గమనార్హం. వరదలతో సతమతమవుతున్న జకార్తా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ తర్వాతి స్థానంలో ఉంది. చెన్నై, ఆగ్రా, కాన్పూర్, జైపూర్, లక్నో, ముంబై వాయు కాలుష్య పరంగా అత్యంత కలుషితమైన నగరాలు. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం) పంటవ్యర్థాలతో వాయుకాలుష్యానికి ఆస్కారం లేకుండా ‘టకాచార్’ వంటి యంత్రాల ద్వారా ఉపయో గకరమైన ఇంధనంగా మలచవచ్చు. దీంతో వాయు నాణ్యత, రైతుల ఆదాయం పెరగటమేకాక నిరుద్యో గులకు ఉపాధి దొరకుతుంది. కాలుష్య నియంత్రణ ప్రణాళికకు తోడ్పడే వ్యవస్థీకృత జ్ఞానం అభివృద్ధి చెంద వల్సి వుంది. నాన్–బయోడీగ్రేడబుల్ వ్యర్థాల రీసైక్లింగ్, అప్ సైక్లింగ్‌ను ప్రోత్సహించాలి. బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను బయోగ్యాస్‌గా మార్చడానికి బలమైన కార్యాచరణ కావాలి. కాప్ 26లో ఉద్ఘాటించిన విధంగా 2030 నాటికి భారతదేశం తన శక్తి అవసరాల్లో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చుకోగలిగితే తప్పకుండా వాయు ఉద్గారాలను గణనీయంగా నియంత్రించ గలుగుతుంది. వాయు కాలుష్య నియంత్రణ అనేది ఒక వ్యయం కాదు, దేశ భవిష్యత్తుకు అవసరమైన పెట్టుబడి. – డా. సృజన కత్తి ఐసీఎస్ఎస్ఆర్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చర్, పాండిచ్చేరి విశ్వవిద్యాలయం -
2070 నాటి కల్లా భారత్ కార్బన్ న్యూటల్ దేశంగా మారాలి: నితిన్ గడ్కరీ
Nitin Gadkari Said We All Must Be Aligned to Be Carbon Neutral Country by 2070: ఇటీవల COP-26 శిఖరాగ్ర సమావేశంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన నిబద్ధతకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అంతేకాదు 2070 నాటికి ఎటువంటి ఉద్గారాలు లేని లేదా కార్బన్-న్యూట్రల్ దేశంగా మార్చాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా భారత్ కృషి చేయాలన్నారు. ఐసీసీకి చెందిన ఏజీఎం అండ్ వార్షిక సెషన్లో భారత్ @ 75 ''ఎంపవరింగ్ ఇండియా: టుమారో ఫర్ టుమారో''పై మంత్రి ప్రసంగిస్తూ, అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు డిజిటలైజేషన్‌ను వంటి వాటితో దేశంలో సుస్థిరమైన అభివృద్ధి జరుగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రయాణంలో మన ప్రభుత్వం రేపటిని నిర్మించే దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్న మలుపులో మేము నిలబడి ఉన్నాం. ఇది మన నేటి కంటే చాలా శక్తివంతమైనది. ఆత్మనిర్భర్ ఈ వాతావరణాన్ని తట్టుకోగలదు." అని అన్నారు. అంతేకాదు ప్రభుత్వం గ్రీన్ హైవే మిషన్ కింద జాతీయ రహదారుల వెంబడి చెట్ల పెంపకం గొప్ప సరికొత్త మార్పిడిగా అభివర్ణించారు. అయితే మౌలిక సదుపాయాల కల్పనలో భారీ పెట్టుబడుల ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు అని చెప్పారు. ఈ మేరకు కారిడార్‌లో లాజిస్టిక్స్ పార్కులు, స్మార్ట్ సిటీలు, ఇండస్ట్రియల్ పార్కులను నిర్మించడంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టవచ్చని అన్నారు. అంతేకాక భారతమాల ఫేజ్ 1, 2 కింద 65,000 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలిపారు. భారత్‌మాల ఫేజ్-1 కింద సుమారు 35,000 కి.మీ హైవేలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ఉందని, మొత్తం మూలధన వ్యయం ₹. 10 లక్షల కోట్లు అని వెల్లడించారు. పైగా 20 వేల కి.మీ.లు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయన్నారు. అయితే 2025 నాటి కల్లా 2 లక్షల కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోందంటూ గడ్కరీ చెప్పుకొచ్చారు. -
మరో గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేసిన హీరో మోటోకార్ప్...!
భారత అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ.. హీరో మోటోకార్ప్ ఇంటర్నేషనల్ జీరో ఎమిషన్స్(ఉద్గారాలు) దినోత్సవాన్ని పురస్కరించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేసింది. 'లార్జెస్ట్ ఆన్లైన్ఫోటో ఆల్భమ్’ పేరిట హీరో మోటోకార్ప్ ప్రపంచరికార్డును ఆవిష్కరించింది. కర్భన ఉద్గారాలను తగ్గించడం కోసం హీరో మోటోకార్ప్ తన వంతుగా ‘హీరో గ్రీన్ డ్రైవ్’ ద్వారా దేశవ్యాప్తంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. చదవండి: టెస్లా ఎలక్ట్రిక్ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్ బ్రేకర్’ హీరో గ్రీన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా సుమారు 1,37,775 మొక్కలను నాటే ఫోటోలతో ‘లార్జెస్ట్ ఆన్లైన్ఫోటో ఆల్భమ్’తో హీరో మోటార్‌కార్ప్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది. కంపెనీ గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేయడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ హెడ్ మాలో లే మాసన్ మాట్లాడుతూ.. "100 మిలియన్ అమ్మకాల మైలురాయితో ఈ ఏడాది కంపెనీ మరింత ఉత్సాహంగా ప్రారంభమైందని తెలిపారు. అంతేకాకుండా ఒకే రోజులో లక్ష యూనిట్ల విక్రయాలను హీరో మోటోకార్ప్ జరిపినట్లు గుర్తుచేశారు. ‘హీరో గ్రీన్ డ్రైవ్’ కార్యక్రమంతో జీరో ఎమిషన్స్‌పై కంపెనీ కట్టుబడి ఉందని వెల్లడించారు. గత నెలలో 'అతిపెద్ద మోటార్‌సైకిల్ లోగో' సృష్టించినందుకుగాను హీరో మోటోకార్ప్ గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ అరుదైన ఫీట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు హీరో మోటోకార్ప్ ప్లాంట్‌లో అతిపెద్ద మోటార్సైకిల్లోగోను సుమారు 1845 స్ప్లెండర్ ప్లస్ బైక్స్నుపయోగించి గిన్నిస్ రికార్డును ఆవిష్కరించింది. చదవండి: జేమ్స్‌బాండ్-007 భాగస్వామ్యంతో స్పెషల్ ఎడిషన్ బైక్..! -
ఈ కొత్త ఆవిష్కరణతో ఇంధనం మరింత ఆదా...!
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు కొండేక్కుతున్నాయి. పెట్రోలు, డిజీల్ ధరలు పెరగడంతో సామాన్యుడి నెత్తిమీద మరింత భారంపడనుంది. సుమారు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటింది. కాగా వాహనాల్లో ఇంధన వాడకం, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి హైదరాబాద్‌కు చెందిన డేవిడ్ ఎష్కోల్ సరికొత్త ఆవిష్కరణ రూపొందించారు. అందుకోసం ‘5M మైలేజ్ బూస్టర్’ను ఆవిష్కరించారు. ఈ వ్యవస్థతో ఇంజిన్ నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా వెహికిల్ మైలేజీను కూడా పెంచుతుంది. 5M మైలేజ్ బూస్టర్‌లో ముఖ్యంగా ఐదు రకాల ప్రయోజనాలను కల్పించే వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఈ బూస్టర్‌ను వాహనాలకు అమర్చడంతో.. అధిక మైలేజీను, అధిక పిక్ అప్ను, స్మూత్ డ్రైవింగ్, అధిక టార్క్‌ను, పొందవచ్చునని డేవిడ్ తెలిపారు. తక్కువ మోతాదులో కర్బన ఉద్గారాలను వెలువడేలా చేస్తుంది. 5M మైలేజ్ బూస్టర్ ఇంజిన్‌కు అమర్చనున్నారు. బైక్ సీసీ పవర్ ఆధారంగా నిర్దిష్ట సమయంలో అల్ట్రా సోనిక్ తరంగాలను, గ్యాస్ రూపంలోని ప్లాస్మాను మైలేజ్ బూస్టర్‌తో ఇంజిన్‌కు పంపిస్తారు. కాగా ఇప్పటివరకు సుమారు 8 వేల వాహనాలకు 5M మైలేజ్ బూస్టర్‌ను అమర్చారు. 100సీసీ నుంచి 10,000 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్ లకు మైలేజ్ బూస్టర్‌ను ఏర్పాటుచేయవచ్చునని డేవిడ్ పేర్కొన్నారు. కాగా ఏదైనా ఆటోమొబైల్ కంపెనీ తో జతకడితే ఈ టెక్నాలజీను సామాన్యులకు అందుబాటులో వస్తోందని డేవిడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
నయా సవాల్: గెలిస్తే రూ. 730 కోట్లు
వాషింగ్టన్: సాంకేతికత పెరిగిన కొద్ది కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అభివృద్ది మోజులో పడి ముందు ప్రకృతిని పట్టించుకోము. పూడ్చలేని నష్టం వాటిల్లిన తర్వాత కళ్లు తెరిచి.. పరిష్కారం గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం ప్రపంచ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కర్భన ఉద్గారాలు. అభివృద్ధి పెరిగిన కొద్ది ఉద్గారాలు ఎక్కువవుతున్నాయి. దాంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు.. అతివృష్టి, అనావృష్టి తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అధినేత, బిలియనీర్ ఎలన్ మస్క్ ఓ నయా సవాల్‌ని తెర మీదకు తెచ్చారు. అంతే కాదండోయ్ గెలిచిన వారికి 100 మిలియన్ డాలర్ల(7,30,05,50,000 రూపాయలు) భారీ ప్రైజ్ మనీని కూడా ప్రకటించారు. ఇంతకు చాలెంజ్ ఏంటంటే.. కర్భన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేయాలి. వాతావరణ మార్పులను అదుపులో ఉంచే అనేక ప్రణాళికలలో భూమిని వేడేక్కించే ఉద్గారాలను సంగ్రహించడం చాలా కీలకమైనదిగా మారుతోంది. కాని ఈ రోజు వరకు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో వెనకబడే ఉన్నాం. గాలి నుంచి కార్బన్‌ను బయటకు తీయడం కంటే ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ తన ట్విట్టర్ వేదికగా.. ‘‘కర్భన ఉద్గారాలను సంగ్రహించే అత్యుత్తమ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని అందిస్తాను. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వచ్చే వారం ప్రకటిస్తాను’’ అంటూ ట్వీట్ చేశారు. (చదవండి: ఔను.. భారత్‌కు వస్తున్నాం..!) Am donating $100M towards a prize for best carbon capture technology — Elon Musk (@elonmusk) January 21, 2021 ఇక గతేడాది చివర్లో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దేశాలు గనుక నికర సున్నా ఉద్గారలను చేరుకోవాలంటే వాటిని సంగ్రహించే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. -
కరోనా కారణంగా తగ్గిన కర్బన ఉద్గారాలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న 2020లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గడం కీడులో కలిసొచ్చిన మేలుగా భావించవచ్చు. 2019లో ఈ సమయంలో వాతావరణంలో ఉద్గారాలతో 2020లో ఇదే సమయానికి ప్రపంచ వాతావరణంలో ఉన్న కర్బన ఉద్గారాలను పోల్చి చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా సరాసరి ఏడు శాతం కర్బన ఉద్గారాలు తగ్గిపోయాయి. ఇక్కడ ఏడు శాతమంటే 240 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గాయన్న మాట. అన్ని దేశాలకన్నా బ్రిటన్‌లో 13 శాతం తగ్గగా, అమెరికాలో 12 శాతం, యూరోపియన్ కూటమి దేశాల్లో 11 శాతం కర్బన ఉద్గారాలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 34 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలుస్తాయి. ఒక్క గిగా టన్ను అంటే వంద కోట్ల టన్నులు. బ్రిటన్‌లో ఏకంగా 13 శాతం కర్బన ఉద్గారాలు తగ్గడానికి ప్రధాన కారణం రవాణా రంగమే. జాతీయ లాక్డౌన్లను రెండుసార్లు అమలు చేయడం వల్ల ప్రధాన రవాణా రంగం దాదాపు నిలిచిపోయింది. యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా, యూనివర్శిటీ ఆఫ్ ఎక్స్టర్ లండ్ గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2019, డిసెంబర్ నెలలో రోడ్డు రవాణా రంగం నుంచి వెలువడిన కర్బన ఉద్గారాలతో 2020, డిసెంబర్లో వెలువడుతున్న కర్బన ఉద్గారాలను పోల్చి నట్లయితే ప్రపంచవ్యాప్తంగా పది శాతం తగ్గాయి. విమానయాన రంగం నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు దాదాపు 40 శాతం తగ్గాయి.కరోనా వైరస్ ఆవిర్భవించినట్లు భావిస్తున్న చైనాలో ఆదిలో తగ్గినప్పటికీ మళ్లీ పెరిగాయి. గతేడాదితో పోలిస్తే అక్కడ 1.7 శాతం పెరిగాయి. -
2030 నాటికి అన్నీ ఎలక్ట్రిక్ కార్లే!
సాక్షి, న్యూఢిల్లీ/ కాలిఫోర్నియా : అమెరికన్ క్యాబ్ సేవల సంస్థ లిఫ్ట్ కార్పొరేషన్ జీరో-ఎమిషన్ వాహనాలకు మారే ప్రణాళికలను ప్రకటించింది. 2030 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలతో సేవలను అందించనున్నామని తెలిపింది. కొత్త విధానాలకు అనుగుణంగా కరోనా, లాక్ డౌన్ సంక్షోభ కాలాన్ని ఒక అవకాశంగా తీసుకుని సరికొత్తగా ముందుకు వెళుతున్నామని కంపెనీ ప్రకటించింది. అయితే ఉద్గార నిబంధనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు వీలుగా డ్రైవర్లకు దీనికి విధాన రూపకర్తలు , వాహన తయారీదారులు ఆర్థిక ప్రోత్సాహకాలందించాలని కోరింది. కరోనా మహమ్మారి ప్రేరిత విపత్తునుంచి బయటకు రావాలని భావిస్తున్నట్టు లిఫ్ట్ సహ వ్యవస్థాపకుడు జాన్ జిమ్మెర్ తాజాగా వెల్లడించారు. అద్దె కార్ల కంపెనీలు, లక్షల మంది డ్రైవర్లను అందిస్తున్న స్వతంత్ర కాంట్రాక్టర్ల సమన్వయంతో పనిచేయనున్నామని తెలిపారు. తద్వారా లక్షల మెట్రిక్ టన్నుల కాలుష్య కారకాలను వాతావరణంలోకి రాకుండా నిరోధించవచ్చని కంపెనీ అభిప్రాయపడింది. బలమైన ఛార్జింగ్ నెట్వర్క్, అన్నింటికంటే ముఖ్యంగా డ్రైవర్ల సహకారం అవసరమన్నారు. అలాగే ఇ-వాహనాల వినియో డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందివ్వనున్నట్టు తెలిపారు. క్యాబ్ సేవల సంస్థలు సగటు ప్రయాణికుల కంటే 50 శాతం ఎక్కువ కాలుష్య కారకాలను వెదజల్లుతున్నాయని ఆరోపిస్తూ, ఉద్గారాలను తగ్గించేందుకు కొత్త నిబంధనలను తీసుకురానున్నట్టు కాలిఫోర్నియా రెగ్యులేటరీ నిర్ణయించింది. ఈ నిబంధనలు లిఫ్ట్ కు ప్రతికూలంగా మారనున్నాయని విశ్లేషకులు అంచనా . దీంతో సంస్థ తాజా నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19, లాక్ డౌన్ కారణంగా క్యాబ్ సేవల కంపెనీలు సంక్షోభంలో పడిపోయాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఈ క్రమంలో లిప్ట్ కూడా 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ప్రస్తుతం 1 శాతం కంటే తక్కువ ఎలక్ట్రిక్ కార్లను లిఫ్ట్ నడుపుతోంది. -
తొలి కాలుష్యరహిత నగరం ‘యోర్క్’
లండన్ : కరోనా వైరస్ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా కాలుష్యం గణనీయంగా తగ్గిన విషయం తెల్సిందే. బ్రిటన్‌లో పర్యాటక ప్రాంతంగా మంచి గుర్తింపు పొందిన యోర్క్ నగరం ఈ అంశాన్ని స్ఫూర్తిగా తీసుకొని నగరంలో కేవలం సైకిళ్లు, ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అనుమతించాలని నిర్ణయించింది. కరోనా కట్టడి భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన నాటి నుంచి ప్రజా రవాణాలకు ఈ రెండింటిని మాత్రమే అనుమతించాలని నగర కౌన్సిల్ నిర్ణయించింది. నగరంలో సైకిళ్లను ప్రోత్సహించేందుకు రవాణా మంత్రి గ్రాండ్ షాప్స్ ఏకంగా రెండు బిలియన్ పౌండ్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. చారిత్రక కట్టడాలు కలిగిన యోర్క్ నగరంలో కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా 2023 సంవత్సరం నుంచి ప్రైవేటు కార్లను నిషేధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేశాక సైకిళ్లు, ఎలక్ట్రిక్ కార్లను మినహా మరే ఇతర వాహనాలను అనుమతించరాదని నిర్ణయించింది. ( కరోనాతో లింక్ ఉన్న మరో వ్యాధి బట్టబయలు ) బ్రిటన్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక నగరం ఇదే! బ్రిటన్ మొత్తం మీద కాలుష్య రహిత నగరంగా ఇదే చరిత్రకెక్కనుందని కౌన్సిలర్లు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో అత్యవసరంగా ప్రజలు నగరంలో సైకిళ్లపై తిరగడం చూస్తే ఎంతో ముచ్చటేస్తోందని లిబరల్ డెమోక్రట్ కౌన్సిలర్ పావులా విడ్డోసన్ వ్యాఖ్యానించారు. ఈ నగరాన్ని ఏడాది 70 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారు. ( కరోనా: బుర్జ్ ఖలీఫా..12 లక్షల భోజనాలు! ) -
కాలుష్యానికి ఓట్లకు లింకేమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటన్న విషయం తెల్సిందే. శీతాకాలంలో వచ్చే దీపావళి సందర్భంగా కాల్చే టపాసుల వల్ల నగర కాలుష్యం మరింత పెరుగుతుందన్న విషయమూ తెల్సిందే. అందుకనే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ‘గ్రీన్’గా పేర్కొన్న టపాసులే కాల్చాలని, అది ఆరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య కాల్చాలని సుప్రీం కోర్టు సూచించడం, ఆ సూచనలను నగర వాసులు పాటించకపోవడం, వారిపై నగర పోలీసులు చర్యలు తీసుకోకపోవడమూ తెల్సిందే. ఫలితంగా ఏం జరిగిందీ? దీపావళికి ముందు రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో నమోదైన కాలుష్యం 400, 500 మార్కు నుంచి దీపావళి మరుసటి రోజుకు 999 మార్కుకు చేరుకుంది. కాలుష్యం కొలమానం సూచికలో కాలుష్యం 400 దాటితే ప్రమాదకరంగాను, 500 దాటితే అత్యంత ప్రమాదరకంగాను పేర్కొంటారు. అలాంటి దీపావళి మరుసటి రోజు నగరంలో పలు ప్రాంతాల్లో 999 మార్కును చేరుకుందంటే ఎంత ప్రమాదరకమో! ఊహించవచ్చు. అయినా ఈ విషయం పాలకులకుగానీ, ప్రజలకుగానీ అంతగా ఎందుకు పట్టడం లేదు? 2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం భారత్‌లో ప్రతి ఏటా ఇంటి లోపల, ఇంటి వెలుపల ఉండే వాయు కాలుష్యం వల్ల లక్ష మందికిపైగా ఐదేళ్ల పిల్లలు మరణిస్తున్నారు. ఏటా లక్ష మందిలో 66.6 శాతం పిల్లలు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. బాలికల విషయంలో ఇది మరింత ప్రమాదరకరంగా మారింది. ప్రతి లక్ష మంది బాలికల్లో 74. 3 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. పామాయిల్ ఫ్లాంటేషన్ కోసం అడవులను అడ్డంగా నరికి తగులబెడుతున్న ఇండోనేషియాలో కూడా కాలుష్యానికి ఇంత మంది బలవడం లేదు. ఆ దేశంలో ప్రతి ఏటా లక్ష మందిలో 35.6 శాతం ఐదేళ్లలోపు బాలికలు మరణిస్తుంటే ఐదేళ్లలోపు బాలలు 35.2 శాతం మంది మరణిస్తున్నారు. చైనాలో ప్రతి లక్ష మంది ఐదేళ్లలోపు బాలికల్లో 12.5 శాతం మరణిస్తుంటే 13.8 శాతం బాలలు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. ఇక ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల బాలికల్లో భారత్‌లో ప్రతి లక్ష మందికి 3.4 శాతం మంది బాలకులు, 2.3 శాతం బాలలు మరణిస్తున్నారు. కాలుష్యం అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల జెనీవాలో నిర్వహించిన సదస్సులో భారత్‌కున్న ముప్పుపై తీవ్రంగా హెచ్చరించింది. పిల్లల్లో నిమోనియా, అస్తమా, క్యాన్సర్‌కు కూడా కాలుష్యమే కారణమవుతోందని చెప్పింది. రోగాల తర్వాత ఎక్కువ మంది కాలుష్యం కారణంగానే మరణిస్తున్నారని పేర్కొంది. గర్బిణీ స్త్రీలపై కూడా కాలుష్యం ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది. కాలుష్యం రాజకీయ అంశం కాకపోవడం వల్ల దేశంలో ఏ ప్రభుత్వం కూడా కాలుష్యం నియంత్రణకు సరైన చర్యలు తీసుకోలేక పోతోంది. మరో విధంగా ఇది రాజకీయ అంశమేనని చెప్పవచ్చు. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు, ప్యాక్టరీ చిమ్నీల నుంచి వెలువడే పొగ, నిర్మాణా నుంచి వెలువడే దుమ్ము, వరి దుబ్బులను తగులబెట్టడంతో వెలువడే పొగ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి వాడుతున్న వంట చెరకు కాలుష్యానికి ప్రధాన కారకాలు. వీటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటే కాలుష్యానికి కారణమవుతున్న ఇన్ని వర్గాల ప్రజల ఓట్లు దూరం అవుతాయన్నది రాజకీయ పార్టీల బెంగ. అది ఒక విధంగా ఓట్ల రాజకీయమే గదా! 2019లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున అప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కాలుష్యం గురించి పెద్దగా మాట్లాడదు. -
కర్బన ఉద్గారాల తగ్గింపునకు చర్యలు
లోక్‌సభలో పొంగులేటి ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూఢిల్లీ: దేశంలో 1301.21 మిలియన్ టన్నుల కార్బన్ డయాకై్సడ్కు సమానమైన గ్రీన్హౌస్ ఉద్గారాలు ఉన్నాయని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ అంశంపై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఆ పార్టీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. మొత్తం ఉద్గారాల్లో 67 శాతం ఇంధన రంగం నుంచి, 23 శాతం వ్యవసాయ రంగం నుంచి, 6 శాతం పరిశ్రమల నుంచి, 4 శాతం వ్యర్థ రంగం నుంచి వెలువడుతున్నాయని తెలిపారు. దేశంలో ఈ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని వివరించారు. 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇందులో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్, 60 వేల మెగావాట్ల పవన విద్యుత్ ఉన్నట్లు వివరించారు.