రూ. 63వేల కోట్లు చెల్లించిన ప్రభుత్వ రంగ సంస్థలు
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్‌ఈ) నుంచి ఖజానాకు బడ్జెట్ అంచనాలను మించిన స్థాయిలో డివిడెండ్లు అందాయి. 2023–24లో కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, గెయిల్ వంటి దిగ్గజాలు ఏకంగా రూ. 63,000 కోట్లు చెల్లించాయి. సవరించిన బడ్జెట్ అంచనాలకన్నా ఇది 26 శాతం అధికం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం 2023–24లో సీపీఎస్‌ఈల నుంచి రూ. 50,000 కోట్ల డివిడెండ్లు రావొచ్చని అంచనాలను సవరించారు. అయితే, పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపమ్ వెబ్‌సైటు ప్రకారం కేంద్రానికి మొత్తం రూ. 62,929.27 కోట్లు వచ్చాయి.
అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో (2022–23)లో డివిడెండ్ వసూళ్లు రూ. 59,952.84 కోట్లకు పరిమితమయ్యాయి. మార్చి నెలలో ఓఎన్‌జీసీ రూ. 2,964 కోట్లు, కోల్ ఇండియా రూ. 2,043 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూ. 2,149 కోట్లు, ఎన్‌ఎండీసీ రూ. 1,024 కోట్లు, హెచ్‌ఏఎల్ రూ. 1,054 కోట్లు, గెయిల్ రూ. 1,863 కోట్లు చెల్లించాయి. సీపీఎస్‌ఈలు అధిక మొత్తంలో డివిడెండ్ల చెల్లించడమనేది వాటి పటిష్టమైన పనితీరును ప్రతిబింబిస్తుంది. ఇది రిటైల్, సంస్థాగత వాటాదారులకు లబ్ధి చేకూర్చడంతో పాటు ఆయా సంస్థల షేర్లపై ఆసక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడగలదు.
Comments
Please login to add a commentAdd a comment