
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్)కు తొలి రోజు భారీ డిమాండ్ నెలకొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి గురువారం ఏకంగా రూ. 6,500 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీలో 3 శాతం వాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్‌ఎస్ చేపట్టింది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. గురువారం(1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రారంభమైంది, నేడు(శుక్రవారం) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విండో ఓపెన్ కానుంది.
తొలి రోజు ప్రభుత్వం 8.31 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 28.76 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అంటే 3.46 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్ లభించింది. ఓఎఫ్‌ఎస్‌లో భాగంగా కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్లకుపైగా షేర్లను విక్రయించనుంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వానికి రూ. 4,158 కోట్లు అందనున్నాయి. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2023–24)లో తొలి పీఎస్‌యూలో డిజిన్వెస్ట్‌మెంట్‌కు తెరలేచింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13% వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే.
ఓఎఫ్‌ఎస్ నేపథ్యంలో గురువారం కోల్ ఇండియా షేరు బీఎస్‌ఈలో 4.4 శాతం పతనమై రూ. 231 వద్ద ముగిసింది. బుధవారం ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్‌లో ప్రభుత్వం ఓఎఫ్‌ఎస్‌ను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment