offer for sale
-
హెక్సావేర్ టెక్నాలజీస్ ఐపీవో 12న
న్యూఢిల్లీ: డిజిటల్, టెక్నాలజీ సర్వీసుల సంస్థ హెక్సావేర్ టెక్నాలజీస్ ప్రతిపాదిత పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఫిబ్రవరి 12న ప్రారంభమై 14న ముగియనుంది. షేరు ధర శ్రేణి రూ. 674–708గా ఉంటుంది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉండే ఈ ఇష్యూ కింద ప్రమోటరు సీఏ మాగ్నమ్ హోల్డింగ్స్ రూ. 8,750 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనుంది. ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం కార్లైల్ గ్రూప్‌లో భాగమైన మ్యాగ్నంకు ప్రస్తుతం కంపెనీలో 95.03 శాతం వాటాలు ఉన్నాయి. అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం చూస్తే హెక్సావేర్ విలువ రూ. 43,000 కోట్లుగా ఉంటుంది. ఐటీ సరీ్వసుల రంగంలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఇది భారీ ఐపీవో కానుంది. అప్పట్లో టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్ రూ. 4,700 కోట్లు సమీకరించింది. హెక్సావేర్ ప్రధానంగా డేటా..ఏఐ, క్లౌడ్ సరీ్వసులు తదితర అయిదు రకాల సేవలు అందిస్తోంది. కంపెనీని గత ప్రమోటరు బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా 2020లో డీలిస్ట్ చేసింది. దాదాపు సంవత్సరం తర్వాత 2021లో హెక్సావేర్‌లో బేరింగ్ వాటాలను కార్లైల్ గ్రూప్ కొనుగోలు చేసింది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల వ్యవధిలో కంపెనీ నికర లాభం రూ. 853 కోట్లు. -
రేపటి నుంచి బిగ్ అప్‌గ్రేడ్ సేల్ ప్రారంభం
ఫ్లిప్‌కార్ట్ బిగ్ అప్‌గ్రేడ్ సేల్ ఈనెల 9 నుంచి ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టీజర్ ఇప్పటికే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో ప్రత్యేక్షమైంది. వారం రోజుల పాటు సాగే ఈ సేల్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా పలు ప్రముఖ ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. ఫ్లిఫ్‌కార్ట్ అధికారిక సైట్ బిగ్ అప్డేట్ సేల్ పేజ్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఐఫోన్ 15 ఈ సేల్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ హాట్ డివైజ్ ప్రస్తుతం రూ.72,999కి లభించనుంది. ఇదీ చదవండి: బంగారం ధర ఆల్టైమ్హైకు చేరనుందా..? ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, రియల్‌మి 12 ప్రొ+, వివో టీ2 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 5జీ, మోటో జీ34 5జీ, రెడ్మి 12, పోకో ఎం6 ప్రొ, రియల్‌మి సీ53, పోకో ఎం6, రెడ్మి 13సీ, పోకో సీ51, మోటో జీ54, రియల్‌మి 11ఎక్స్ వంటి ఫోన్లపైనా ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. -
2023లో క్విప్ నిధుల జోరు
న్యూఢిల్లీ: ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2023)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) జోరుమీదుంది. కంపెనీలు నిధుల సమీకరణకు క్విప్‌ను అత్యధికంగా ఆశ్రయిస్తున్నాయి. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకూ క్విప్ ద్వారా రూ. 50,218 కోట్లు సమకూర్చుకున్నాయి. ఇది గతేడాది(2022) నమోదైన రూ. 8,196 కోట్లతో పోలిస్తే ఆరు రెట్లు అధికంకావడం గమనార్హం! ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపడం సానుకూల ప్రభావం చూపుతోంది. ఇక రైట్స్, ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలోనూ నిధుల సమీకరణ సైతం 2022తో పోలిస్తే భారీగా ఎగసింది. ఎన్ఎస్ఈ వివరాల ప్రకారం 2023లో రైట్స్ ఇష్యూల ద్వారా రూ. 8,017 కోట్లు అందుకున్నాయి. గతేడాది ఇవి రూ. 3,646 కోట్లుకాగా.. ఓఎఫ్ఎస్ ద్వారా 44 శాతం అధికంగా రూ. 15,959 కోట్లు లభించాయి. 2022లో ఇవి రూ. 11,110 కోట్లు మాత్రమే. కారణాలివీ క్విప్ ద్వారా నిధుల సమీకరణ వృద్ధికి ప్రధానంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలంగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్లు లాభాల బాటలో కొనసాగుతున్నంతకాలం ఇన్వెస్టర్లకు రిటర్నులు లభిస్తుంటాయని తెలియజేశారు. అందులోనూ వేగవంతంగా పెట్టుబడుల సమీకరణకు వీలుండటంతో కంపెనీలు క్విప్ చేపట్టేందుకు ప్రాధాన్యత ఇస్తుంటాయని వివరించారు. లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడి వ్యయాల కోసం, పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనల అమలు కోసం సాధారణంగా కంపెనీలు క్విప్‌నకు తెరతీస్తుంటాయని విశ్లేషకులు తెలియజేశారు. లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే వీలున్న క్విప్ ద్వారా సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వేగంగా నిధులను అందుకునేందుకు వీలుండటం మరొక సానుకూల అంశమని తెలియజేశారు. దిగ్గజాలు సై ఈ ఏడాది క్విప్ ద్వారా ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ రూ. 8,800 కోట్లు అందుకుంది. ఈ బాటలో యూనియన్ బ్యాంక్(యూబీఐ) రూ. 5,000 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) రూ. 4,500 కోట్లు చొప్పున సమీకరించాయి. బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం క్విప్ ద్వారా రూ. 2,305 కోట్లు సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! ఈ జాబితాలో చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చేరాయి. రైట్స్, ఎఫ్‌పీవో తదితరాలతో పోలిస్తే.. తక్కువ సమయం, సులభ నిబంధనల కారణంగా క్విప్ చేపట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. -
ఐఆర్ఎఫ్సీ నుంచి ఓఎఫ్ఎస్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్(ఐఆర్ఎఫ్సీ) ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపట్టనుంది. కంపెనీలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) నిబంధన అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఆరి్థక సంవత్సరం(2023–24)లో 11శాతానికిపైగా వాటాను విక్రయించే వీలున్నట్లు అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం రైల్వే రంగ ఫైనాన్సింగ్ కంపెనీలో ప్రభుత్వం 86.36 శాతం వాటా ను కలిగి ఉంది. దీపమ్, రైల్వే శాఖల సీనియర్ అధికారులతో ఏర్పాటైన అంతర్‌మంత్రివర్గ గ్రూప్ ఎంతమేర వాటా విక్రయించాలనే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సెబీ ఎంపీఎస్ నిబంధనలో భాగంగా ప్రభుత్వం 11.36 శాతం వాటాను ఆఫర్ చేయవలసి ఉంటుంది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో 2021 జనవరిలో లిస్టయిన కంపెనీ ఐదేళ్లలోపు ఎంపీఎస్‌ను అమలు చేయవలసి ఉంది. అయితే వాటా విక్రయ అంశంపై ఇన్వెస్టర్ల ఆసక్తిని గమనిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. బీఎస్ఈలో ఐఆర్ఎఫ్ఎస్ షేరు దాదాపు రూ. 51 వద్ద కదులుతోంది. ఈ ధరలో 11.36 శాతం వాటాకుగాను ప్రభుత్వం రూ. 7,600 కోట్లు అందుకునే వీలుంది. కాగా.. ప్రభుత్వం కొంతమేర వాటాను విక్రయించనుండగా.. మరికొంత తాజాగా జారీ చేయనున్నట్లు అంచనా. ఓఎఫ్ఎస్ వార్తల నేపథ్యంలో ఐఆర్ఎఫ్సీ షేరు బీఎస్ఈలో తొలుత రూ. 52.7 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది. చివరికి 0.6 శాతం బలపడి రూ. 51.2 వద్ద ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ షేరు 38 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! -
పతంజలి ఫుడ్స్‌లో జీక్యూజీ పెట్టుబడి
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్‌లో యూఎస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్ 5.96 శాతం వాటాను కొనుగోలు చేసింది. కంపెనీ చేపట్టిన ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగంగా 2,15,64,517 షేర్లను సొంతం చేసుకుంది. ఇది కంపెనీ ఈక్విటీలో 5.96 శాతం వాటాకాగా.. బుధవారం షేరు ధర దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 1,332.75 వద్ద ముగిసింది. ఈ ధరలో చూస్తే జీక్యూజీ పెట్టుబడి విలువ రూ. 2,900 కోట్లకు చేరింది. కాగా.. గత వారం ఓఎఫ్ఎస్ను చేపట్టిన పతంజలి ఫుడ్స్ షేరుకి రూ. 1,000 ఫ్లోర్ ధరలో 2.53 కోట్ల షేర్ల(7 శాతం వాటా)ను ఆఫర్ చేసింది. తద్వారా కంపెనీలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధన అమలుకు మాతృ సంస్థ పతంజలి ఆయుర్వేద తెరతీసింది. దీంతో పతంజలి ఫుడ్స్‌లో పతంజలి ఆయుర్వేద వాటా 80.82 శాతం నుంచి 73.82 శాతానికి దిగివచ్చింది. ఇంతక్రితం జూన్‌లో జీక్యూజీ పార్ట్‌నర్స్‌తోపాటు ఇతర విదేశీ సంస్థలు.. అదానీ గ్రూప్ కంపెనీలలోనూ బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
పతంజలి ఫుడ్స్ ఓఎఫ్ఎస్ సక్సెస్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్ చేపట్టిన ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విజయవంతమైంది. శుక్రవారం ముగిసిన ఇష్యూకి రెండు రెట్లు సబ్స్క్రిప్షన్ లభించింది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 3 రెట్లు, సంస్థాగత వర్గాల నుంచి 2 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. ప్రమోటర్ సంస్థ పతంజలి ఆయుర్వేద్ ఓఎఫ్ఎస్ ద్వారా పతంజలి ఫుడ్స్‌లో 7 శాతం వాటాను విక్రయానికి ఉంచింది. తద్వారా కంపెనీలో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధన అమలుకు తెరతీసింది. ఓఎఫ్ఎస్లో 25,33,964 షేర్లను ఆఫర్ చేయగా.. 76,34,567 షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. రిటైలేతర ఇన్వెస్టర్లకు గురువారమే 2.28 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 4.56 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 2,53,39,640 షేర్లను విక్రయానికి ఉంచింది. ఇందుకు షేరుకి రూ. 1,000 ఫ్లోర్ ధరను పతంజలి ఆయుర్వేద్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజా ఇష్యూతో ప్రస్తుతం కంపెనీలో 19.18 శాతంగా ఉన్న పబ్లిక్ వాటా 25 శాతానికిపైగా చేరనుంది. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో పతంజలి ఫుడ్స్ షేరు బీఎస్ఈలో 5% జంప్‌చేసి రూ. 1,225 వద్ద ముగిసింది. -
ఈ నెల 17 నుంచి నెట్వెబ్ ఐపీవో
న్యూఢిల్లీ: దేశీ సర్వర్ల తయారీ సంస్థ నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) జూలై 17న ప్రారంభమై 20న ముగియనునంది. ఇష్యూలో భాగంగా రూ. 206 కోట్ల విలువ చేసే ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుండగా, 85 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. సంజయ్ లోధా, వివేక్ లోధా, నవీన్ లోధా, నీరజ్ లోధా, అశోకా బజాజ్ ఆటోమొబైల్స్ .. ఓఎఫ్ఎస్ ద్వారా షేర్లను విక్రయించనున్నారు. షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధుల్లో సుమారు రూ. 33 కోట్లను పెట్టుబడి వ్యయాలకు, రూ. 128 కోట్లను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ. 22.5 కోట్లను రుణాల చెల్లింపు తదితర అవసరాల కోసం వినియోగించుకోనున్నారు. దేశీయంగా ఉన్న అతి కొద్ది సర్వర్ల తయారీ సంస్థల్లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌కు చెందిన నెట్వెబ్ టెక్నాలజీస్ కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకానికి కూడా ఎంపికైంది. -
పతంజలి ఫుడ్స్‌లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: లిస్టింగ్ నిబంధనలకు అనుగుణంగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్‌లో ప్రమోటర్ సంస్థ పతంజలి ఆయుర్వేద్ 7 శాతం వాటాను విక్రయించనుంది. కంపెనీలో పబ్లిక్ వాటాను 25 శాతానికి పెంచే బాటలో స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపట్టనున్నట్లు పతంజలి ఫుడ్స్ పేర్కొంది. తద్వారా పతంజలి ఆయుర్వేద్ 2.53 కోట్ల షేర్లను( 7 శాతం వాటా) విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు షేరుకి రూ. 1,000 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు(13న) ప్రారంభంకానున్న ఓఎఫ్ఎస్ శుక్రవారం(14న) రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి రానుంది. వాటా విక్రయం ద్వారా పతంజలి ఆయుర్వేద్ కనీసం రూ. 2,530 కోట్లు అందుకోనుంది. ప్రస్తుతం పతంజలి ఫుడ్స్‌లో పబ్లిక్కు 19.18 శాతం వాటా ఉంది. కాగా.. డిమాండు ఆధారంగా పతంజలి ఆయుర్వేద్ అదనంగా 2 శాతం వాటా(72.4 లక్షల షేర్లు)ను విక్రయించనుంది. వెరసి 9 శాతం వరకూ వాటాను తగ్గించుకునే యోచనలో ఉంది. ఓఎఫ్ఎస్ వార్తల నేపథ్యంలో పతంజలి ఫుడ్స్ షేరు బీఎస్ఈలో 1.3 శాతం లాభంతో రూ. 1,228 వద్ద ముగిసింది. -
కోల్ ఇండియా ఆఫర్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)కు తొలి రోజు భారీ డిమాండ్ నెలకొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి గురువారం ఏకంగా రూ. 6,500 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. కంపెనీలో 3 శాతం వాటా విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓఎఫ్ఎస్ చేపట్టింది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. గురువారం(1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రారంభమైంది, నేడు(శుక్రవారం) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విండో ఓపెన్ కానుంది. తొలి రోజు ప్రభుత్వం 8.31 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 28.76 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అంటే 3.46 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ లభించింది. ఓఎఫ్ఎస్లో భాగంగా కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్లకుపైగా షేర్లను విక్రయించనుంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వానికి రూ. 4,158 కోట్లు అందనున్నాయి. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం(2023–24)లో తొలి పీఎస్యూలో డిజిన్వెస్ట్మెంట్కు తెరలేచింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13% వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో గురువారం కోల్ ఇండియా షేరు బీఎస్ఈలో 4.4 శాతం పతనమై రూ. 231 వద్ద ముగిసింది. బుధవారం ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్లో ప్రభుత్వం ఓఎఫ్ఎస్ను ప్రకటించింది. -
కోల్ ఇండియా @ రూ. 225
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం కోల్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు రూ. 225 ఫ్లోర్ ధరను నిర్ణయించింది. నేడు(జూన్ 1)న సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం(2న) రిటైలర్లకు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)ను చేపడుతోంది. ప్రతిపాదన ప్రకారం ప్రభుత్వం తొలుత 1.5 శాతం వాటాకు సమానమైన 9.24 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఆఫర్‌కు అత్యధిక స్పందన లభిస్తే మరో 1.5 శాతం వాటాను సైతం విక్రయించేందుకు గ్రీన్ షూ ఆప్షన్ ఎంచుకుంది. వెరసి కంపెనీ ఈక్విటీలో 3 శాతం వాటాకు సమానమైన మొత్తం 18.48 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఆఫర్ ధర ప్రకారం ప్రభుత్వం విక్రయిస్తున్న వాటాకు రూ. 4,158 కోట్లు లభించనున్నాయి. వెరసి ఈ ఏడాది(2023–24) తొలిసారి పీఎస్యూలో ప్రభుత్వం వాటాను విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 66.13 శాతం వాటా ఉంది. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం రూ. 51,000 కోట్ల సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్న విషయం విదితమే. బీఎస్ఈలో బుధవారం కోల్ ఇండియా షేరు 1.3 శాతం నష్టంతో రూ. 241 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే 6.7 శాతం డిస్కౌంట్లో ఓఎఫ్ఎస్ ప్రారంభంకానుంది. -
హెచ్ఏఎల్ ఓఎఫ్‌ఎస్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: రక్షణ రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) షేర్ల విక్రయానికి తొలి రోజు 4.5 రెట్లు అధిక స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 3.5 శాతం వాటా(1.17 కోట్ల షేర్లు)ను విక్రయానికి ఉంచగా.. సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ డిమాండ్ కనిపించింది. శుక్రవారం రిటైల్ ఇన్వెస్టర్లు బిడ్ చేసేందుకు వీలున్న నేపథ్యంలో ప్రభుత్వం గ్రీన్ షూ ఆప్షన్‌ను వినియోగించుకోనుంది. షేరుకీ రూ. 2,450 ధరలో ఓఎఫ్ఎస్ ద్వారా ప్రభుత్వం తొలుత 1.75% ఈక్విటీని(58.51 లక్షల షేర్లు) విక్రయానికి ఉంచింది. అధిక సబ్స్క్రిప్షన్ లభిస్తే మరో 1.75% వాటాను సైతం అమ్మివేయనుంది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,867 కోట్లు లభించనున్నాయి. బుధవారం ముగింపు ధర రూ. 2,625తో పోలిస్తే 6.7% (రూ. 175) డిస్కౌంట్లో ప్రభుత్వం ఫ్లోర్ ధరను నిర్ణయించిన సంగతి తెలిసిందే. కంపెనీలో ప్రస్తుతం ప్రభుత్వానికి 75.15 శాతం వాటా ఉంది. ఓఎఫ్ఎస్ నేపథ్యంలో హెచ్ఏఎల్ షేరు బీఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 2,497 ఎగువన నిలిచింది. -
ఎఫ్‌పీవో యోచన లేదు: పతంజలి ఫుడ్స్
న్యూఢిల్లీ: కంపెనీలో పబ్లిక్ వాటాను పెంచేందుకు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కి (ఎఫ్‌పీవో) వచ్చే యోచనేదీ లేదని స్టాక్ ఎక్సే్చంజీలకు పతంజలి ఫుడ్స్ తెలిపింది. అయితే, ఆఫర్ ఫర్ సేల్, క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) వంటి మార్గాలు పరిశీలిస్తున్నట్లు వివరించింది. పతంజలి ఫుడ్స్‌లో తమ వాటాలను నిర్దేశిత స్థాయిలోపునకు తగ్గించుకోనందుకు గాను 21 ప్రమోటర్ సంస్థల షేర్లను స్టాక్ ఎక్సే్చంజీలు స్తంభింపచేసిన సంగతి తెలిసిందే. దివాలా తీసిన రుచి సోయా ఇండస్ట్రీస్‌ను 2019లో పతంజలి గ్రూప్ కొనుగోలు చేసింది. అప్పట్లో గ్రూప్‌నకు 98.87 శాతం వాటాలు ఉండేవి. తర్వాత ఎఫ్‌పీవోకి వచ్చాక పబ్లిక్ వాటా 19.18 శాతానికి పెరగ్గా.. ప్రమోటర్ల వాటా 80.82 శాతానికి తగ్గింది. నిబంధనల ప్రకారం 2022 డిసెంబర్ 18 నాటికి పబ్లిక్ వాటాను 25 శాతానికి చేర్చాల్సి ఉన్నప్పటికీ అలా చేయకపోవడంతో ప్రమోటర్ల షేర్లను స్టాక్ ఎక్సే్చంజీలు స్తంభింపచేశాయి. -
ఐపీవోకు నోవా అగ్రిటెక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్యరక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ నోవా అగ్రిటెక్ ఐపీవోకు రానుంది. ఐపీవోలో భాగంగా రూ.140 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్ నూతలపాటి వెంకట సుబ్బారావు 77.58 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నారు. అయితే ఓఎఫ్ఎస్ ద్వారా ఒక్కో షేరును ఎంతకు ఆఫర్ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. కంపెనీలో ఆయనకున్న మొత్తం వాటా 11.9 శాతం విక్రయించనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ కంపెనీ నోవా అగ్రి సైన్సెస్ ద్వారా కొత్త ఫార్ములేషన్ ప్లాంటు ఏర్పాటుకు వెచ్చిస్తారు. అలాగే ఇప్పటికే ఉన్న ప్లాంటు విస్తరణకు సైతం ఖర్చు చేస్తారు. కంపెనీ షేర్లను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్ చేయనుంది. -
ఐఆర్సీటీసీలో వాటా విక్రయం
న్యూఢిల్లీ: రైల్వే రంగ పీఎస్‌యూ దిగ్గజం ఐఆర్సీటీసీలో ప్రభుత్వం 5 శాతంవరకూ వాటాను విక్రయించనుంది. ఇందుకు షేరుకి రూ. 680 ఫ్లోర్ ధరను ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)లో భాగంగా 2.5 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఇన్వెస్టర్ల నుంచి అధిక స్పందన లభిస్తే మరో 2.5 శాతం వాటాను సైతం ఆఫర్ చేయనుంది. వెరసి 4 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా ప్రభుత్వానికి రూ. 2,700 కోట్లు సమకూరే వీలుంది. కాగా.. బుధవారం ముగింపు ధర రూ. 735తో పోలిస్తే ఇది 7.5 శాతం డిస్కౌంట్. నేడు సంస్థాగత ఇన్వెస్టర్లకు, శుక్రవారం రిటైలర్లకు ఓఎఫ్ఎస్ అందుబాటులోకి రానుంది. వాటా విక్రయ నిధులు ప్రభుత్వానికి డిజిన్వెస్ట్‌మెంట్‌కింద జమకానున్నాయి. -
ఓఎన్జీసీ ఓఎఫ్ఎస్కి భారీ స్పందన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 1.5 శాతం వాటాల విక్రయానికి భారీ స్పందన లభిస్తోంది. బుధవారం తొలి రోజున సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. వారికి 8.49 కోట్ల షేర్లను కేటాయించగా 3.57 రెట్లు అధికంగా 30.35 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. షేరు ఒక్కింటికి ప్రతిపాదించిన రూ. 159 రేటు ప్రకారం వీటి విలువ రూ. 4,854 కోట్లుగా ఉంటుంది. రెండు రోజుల పాటు కొనసాగే ఓఎఫ్ఎస్ కింద ఓఎన్జీసీలో 1.5 శాతం వాటాల (9.43 కోట్ల షేర్లు) విక్రయం ద్వారా కేంద్రం సుమారు రూ. 3,000 కోట్లు సమీకరించనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 94.35 లక్షల షేర్లను కేటాయించారు. ఈ విభాగం ఓఎఫ్ఎస్ గురువారం ప్రారంభమవుతుంది. ఆఫర్ ఫర్ సేల్కు నాన్–రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే.. ట్వీట్ చేశారు. షేరు 5 శాతం డౌన్.. ఓఎఫ్ఎస్ కోసం షేరు ధరను మంగళవారం నాటి ముగింపు రేటు రూ. 171.05తో పోలిస్తే 7 శాతం డిస్కౌంటుతో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బుధవారం బీఎస్ఈలో ఓఎన్జీసీ షేరు 5 శాతం క్షీణించి రూ. 162.25 వద్ద ముగిసింది. ఫలితంగా రూ. 11,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది. -
రూ. 480 కోట్ల సమీకరణలో హెచ్ఎంఏ ఆగ్రో
న్యూఢిల్లీ: ఫ్రోజెన్ మాంసం ఎగుమతిదారు హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ .. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 480 కోట్లు సమీకరించనుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. కొత్తగా షేర్ల జారీ ద్వారా రూ. 150 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ప్రమోటర్ల షేర్ల విక్రయం ద్వారా దాదాపు రూ. 330 కోట్లు సమీకరించనున్నట్లు సంస్థ పేర్కొంది. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఓఎఫ్ఎస్లో భాగంగా ప్రమోటర్లయిన వాజిద్ అహ్మద్ రూ. 120 కోట్లు విలువ చేసే షేర్లు, గుల్జార్ అహ్మద్, మెహ్మూద్ ఖురేషి తదితరులు తలో రూ. 49 కోట్లు విక్రయించనున్నారు. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 135 కోట్లను .. వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ దాదాపు 40 దేశాలకు మాంసం ఎగుమతి చేస్తోంది. ఆదాయంలో 90 శాతం వాటా ఎగుమతులదే ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 1,720 కోట్లు కాగా రూ. 73 కోట్ల లాభం నమోదు చేసింది. -
విజయా డయాగ్నొస్టిక్ ఐపీవో @ రూ. 522–531
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెల్త్‌కేర్ సేవల సంస్థ విజయా డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 1న ప్రారంభమై 3న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ఒక్కింటి ధర శ్రేణిని రూ. 522–531గా సంస్థ నిర్ణయించింది. కనీస బిడ్ లాట్ 28 షేర్లుగా ఉంటుంది. ఈ ఇష్యూ ద్వారా విజయా డయాగ్నోస్టిక్ దాదాపు రూ. 1,895 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఉండే ఈ ఐపీవోలో ప్రమోటరు ఎస్ సురేంద్రనాథ్ రెడ్డితో పాటు ఇన్వెస్టర్లయిన కారకోరం లిమిటెడ్, కేదార క్యాపిటల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్–కేదార క్యాపిటల్ ఏఐఎఫ్ 1 దాదాపు 3.56 కోట్ల దాకా షేర్లను విక్రయించనున్నాయి. సురేంద్రనాథ్ రెడ్డి 50.98 లక్షల షేర్లు, కారకోరం 2.95 కోట్లు, కేదార క్యాపిటల్ 11.02 లక్షల షేర్లు విక్రయిస్తాయి. దీంతో ప్రమోటర్లు, ప్రస్తుత షేర్‌హోల్డర్ల వాటా 35 శాతం మేర తగ్గనుంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌నకు 59.78 శాతం, కారకోరం లిమిటెడ్‌కు 38.56 శాతం, కేదారకు 1.44 శాతం వాటాలు ఉన్నాయి. విస్తరణ ప్రణాళికలు .. ప్రస్తుతం తమకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతో పాటు కోల్‌కతా, నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో మొత్తం 80 పైచిలుకు డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నాయని సంస్థ సీఈవో సుప్రీతా రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరించనున్నట్లు వివరించారు. దక్షిణాదిన హైదరాబాద్‌కి 4–5 గంటల ప్రయాణ దూరంలో ఉండే చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తూర్పున కోల్‌కతా తదితర ప్రాంతాలపై మరింతగా దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. -
ఎన్ఎఫ్ఎల్లో వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఎరువుల రంగ పీఎస్‌యూ సంస్థ నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్)లో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా 20 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా ఓఎఫ్ఎస్ను నిర్వహించేందుకు మర్చంట్ బ్యాంకర్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల సంస్థలు మార్చి 2లోగా బిడ్స్‌ను దాఖలు చేయవలసి ఉంటుందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వాహక శాఖ(దీపమ్) తాజాగా పేర్కొంది. ఇందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం చూస్తే ఎన్ఎఫ్ఎల్లో 20 శాతం వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 400 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ఐపీఓకు ఇండియా పెస్టిసైడ్స్ నిధుల సమీకరణకు మరో సంస్థ సిద్ధమైంది. ఆగ్రో కెమికల్ టెక్నాలజీస్ కంపెనీ ఇండియా పెస్టిసైడ్స్ ఐపీఓ ద్వారా రూ.800 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇందుకు కోసం సెబీకి బుధవారం ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.100 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను విడుదల చేయనుంది. అలాగే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీ ప్రధాన ప్రమోటర్ అగర్వాల్‌తో పాటు ఇతర ప్రమోటర్లు రూ.700 కోట్ల షేర్లను విక్రయించునున్నట్లు కంపెనీ తెలిపింది. -
ఆర్సీఎఫ్లో 10% విక్రయం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని మరో సంస్థ రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్ఎల్)లో 10 శాతం వాటాలను విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ ప్రక్రియ నిర్వహణ కోసం మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. మర్చంట్ బ్యాంకర్లు జనవరి 28 నాటికి, లీగల్ అడ్వైజర్లు 29 నాటికి బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్సీఎఫ్ఎల్లో కేంద్రానికి 75 శాతం వాటాలు ఉండగా, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో 10 శాతాన్ని విక్రయించాలని భావిస్తోంది. శుక్రవారం నాటి ఆర్సీఎఫ్ షేరు ముగింపు ధర రూ. 54 ప్రకారం ఈ వాటాల విలువ సుమారు రూ. 300 కోట్లుగా ఉంటుంది. బీఈఎంఎల్లో వాటాల విక్రయానికి బిడ్ల ఆహ్వానం ప్రభుత్వ రంగ దిగ్గజం బీఈఎంఎల్లో 26 శాతం వాటాల విక్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా బిడ్లను ఆహ్వానించింది. బిడ్డర్లు మార్చి 1 లోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) దాఖలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) వెల్లడించింది. శుక్రవారం బీఈఎంఎల్ షేరు ధర రూ. 974 ప్రకారం ఈ వాటాల విలువ సుమారు రూ. 1,000 కోట్లుగా ఉంటుంది. డిఫెన్స్, రెయిల్, విద్యుత్, మైనింగ్, ఇన్ఫ్రా తదితర రంగాల్లో బీఈఎంఎల్ కార్యకలాపాలు సాగిస్తోంది. 2020 మార్చి 31 నాటికి రూ. 9,795 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి. సంస్థలో కేంద్రానికి 54.03 శాతం వాటాలు ఉండగా.. కొనుగోలుదారులకు 26 శాతం వాటాలతో పాటు యాజమాన్య హక్కులు కూడా బదలాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. -
జోరుగా ఐఆర్సీటీసీ వాటా విక్రయం!
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఓఎఫ్‌ఎస్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఐఆర్సీటీసీలో 20 శాతం వాటాను ఆఫర్ ఫర్‌సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయిస్తోంది. గురువారం ఇష్యూ మొదలైన రోజునే ఈ ఓఎఫ్ఎస్ 1.98 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. నేడు (శుక్రవారం) రిటైల్ ఇన్వెస్టర్లు తమ బిడ్లను దాఖలు చేసుకోవచ్చు. ఈ ఓఎఫ్‌ఎస్‌కు ఫ్లోర్ధరను రూ.1,367గా కంపెనీ నిర్ణయించింది. రూ.4,374 కోట్ల నిధులు.... ఓఎఫ్ఎస్లో భాగంగా 15% వాటాకు సమానమైన 2.4 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నది. అదనంగా సబ్‌స్క్రైబ్ కావడంతో మరో 5% వాటా(80 లక్షల షేర్లను) గ్రీన్ షూ ఆప్షన్(అదనంగా బిడ్లు వస్తే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు)గా అట్టేపెట్టుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 4,374 కోట్లు సమకూరుతాయని అంచనా. ప్రస్తుతం ఐఆర్సీటీసీలో కేంద్ర ప్రభుత్వానికి 87.40 శాతం వాటా ఉంది. పబ్లిక్ హోల్డింగ్ నిబంధనలను పాటించాలంటే ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంటుంది. భారత రైల్వేలకు ఐఆర్సీటీసీ కంపెనీ కేటరింగ్ సర్వీసులను అందిస్తోంది. ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయిస్తోంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను విక్రయిస్తోంది. ఈ కంపెనీ 2019, అక్టోబర్‌లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా రూ.645 కోట్లు సమీకరించింది. ఓఎఫ్ఎస్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఆర్సీటీసీ షేర్ 10 శాతం నష్టంతో రూ.1,452 వద్ద ముగిసింది. -
ఐఆర్సీటీసీలో మరింత వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీలో మరికొంత వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించనున్నది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్(ఐఆర్సీటీసీ)లో కొంత వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయిస్తామని పేర్కొంది. ఈ విక్రయ ప్రక్రియను నిర్వహించడానికి మర్చంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మర్చంట్ బ్యాంకర్లు తమ దరఖాస్తులను వచ్చే నెల 10లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీలో కేంద్రానికి ప్రస్తుతం 87.40 శాతం వాటా ఉంది. సెబీ నిర్దేశించిన కనీస పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ప్రకారం ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంది. గతేడాది ఈ కంపెనీలో కొంత వాటాను ఐపీఓ ద్వారా కేంద్రం విక్రయించి రూ.690 కోట్లు సమీకరించింది. కాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.10 లక్షల కోట్లు సమీకరిం చాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీంట్లో భాగంగా ఎల్ఐసీలో కొంత వాటాను ఐపీఓ ద్వారా విక్రయించనున్నది. వాటా విక్రయ వార్తలతో ఐఆర్సీటీసీ 1% నష్టంతో రూ.1,347 వద్ద ముగిసింది. -
హెచ్డీఎఫ్సీ ఏఎంసీలో వాటా విక్రయం
హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో వాటాను ప్రమోటర్ సంస్థలో ఒకటైన స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో బుధ, గురువారాల్లో మొత్తం 2.82శాతం వాటాకు సమానమైన 60లక్షల ఈక్విటీ షేర్ల అమ్మకానికి సిద్ధమైంది. ఈ ఆఫర్ ఫర్ సేల్కు ఫ్లోర్ ధర రూ.2,362గా నిర్ణయించింది. ఈ విక్రయం ద్వారా స్టాండర్డ్ లైఫ్ మొత్తం రూ.1417 కోట్లను సమీకరించనుంది. హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్లో మార్చి 31 నాటికి స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్స్, హెచ్‌డీఎఫ్‌సీలకు విడివిడిగా 26.89శాతం వాటాను కలిగి ఉన్నాయి. ‘‘డిమాండ్‌కు అనుగుణంగా ఆఫర్ ఫర్ సేల్ ఇష్యూ ద్వారా ప్రమోటర్ సంస్థ స్టాండర్డ్ లైఫ్ ఇన్వెస్ట్మెంట్ జూన్ 17-18తేదిల్లో మొత్తం 1.12 కోట్ల ఈక్విటీ షేర్లకు సమానమైన మొత్తం 5.64శాతం వాటాను ను విక్రయించనుంది. ఈ మొత్తం విక్రయంలో తొలుత 2.82శాతం వాటాను సమానమైన 60లక్షల షేర్లకు విక్రయించనుంది. తదుపరి డిమాండ్ అనుగుణంగా మరో 2.82శాతం వాటాను సైతం విక్రయించనుంది.’’ అని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. వాటా విక్రయ నేపథ్యంలో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో హెచ్డీఎఫ్సీ అసెట్మేనేజ్మెంట్ నిన్నటి ముగింపు(రూ.2537.65)తో పోలిస్తే 2.50శాతం నష్టంతో రూ.2477 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.1784.15లు, రూ.3844.00గా నమోదయ్యాయి. -
ఐఆర్సీటీసీ ఐపీఓ అదుర్స్!
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) సూపర్ హిట్ అయింది. గురువారం ముగిసిన ఈ ఐపీఓ 112 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. మందగమనం ఉన్నప్పటికీ, కంపెనీ పై భవిష్యత్తు అంచనాలు ఆశావహంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన లభించిందని నిపుణులంటున్నారు. ఈ ఐపీఓలో భాగంగా 12.6 శాతానికి సమానమైన 2 కోట్ల షేర్లను కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించింది. రూ.317–320 ప్రైస్‌బ్యాండ్‌తో ఈ ఐపీఓ ద్వారా కేంద్రానికి రూ.645 కోట్లు లభిస్తాయని అంచనా. ఈ నెల 14న ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్టవుతాయి. రూ.150–200 రేంజ్లో లిస్టింగ్ లాభాలు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 225 కోట్ల షేర్లకు దరఖాస్తులు... మొత్తం 2 కోట్ల షేర్లకు గాను 225 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. అంటే మొత్తం సమీకరణ విలువ రూ.645 కోట్లు కాగా... దాదాపు రూ.72,000 కోట్ల విలువైన దరఖాస్తులు వెల్లువెత్తాయి. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల(క్విబ్)కు కేటాయించిన వాటా 109 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల వాటా 355 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 14.65 రెట్లు చొప్పున ఓవర్ సబ్‌స్క్రైబయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాబోతున్న రెండో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో అత్యంత విజయవంతమైన ఐపీఓ ఇదే. క్విబ్, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల, ఉద్యోగుల వాటాల విషయంలో అత్యధిక బిడ్లు వచ్చాయి. రైల్వేలకు కేటరింగ్ సర్వీసులు అందించే ఏకైక కంపెనీ.. ఐఆర్‌సీటీసీయే. ఆన్లైన్ రైల్వే టికెట్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ను ఈ కంపెనీ విక్రయిస్తోంది. -
నేటి నుంచి యాక్సిస్ బ్యాంక్ ఓఎఫ్ఎస్
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్న తన వాటాలో కొంత భాగాన్ని నేటి(మంగళవారం)నుంచి ప్రభు త్వం విక్రయిస్తోంది. ఎస్‌యూయూటీఐ(ద స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)ద్వారా ఉన్న వాటాలో 3% వరకూ వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నది. ఇందులో భాగంగా 1.98% వాటాకు సమానమైన 5.07 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది. దీంట్లో 10% వాటా షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మరో 1.02% వాటాకు సమానమైన 2.63 కోట్ల ఈక్విటీ షేర్లను కూడా విక్రయించే అవకాశముంది. ఈ షేర్ల విక్రయానికి ఫ్లోర్ ధరగా రూ.689.52ను నిర్ణయించారు. ఇది సోమవారం ముగింపు ధర (రూ.710.35) కంటే 3% తక్కువ. వాటా విక్రయం సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు(మంగళవారం), రిటైల్ ఇన్వెస్టర్లకు బుధవారం జరుగుతుంది. -
ఇండిగో బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ ఎయిర్‌లైనర్ ఇండిగో విమాన ప్రయాణీకులకు తీపికబురు అందించింది. తన విమానాల్లో పరిమిత కాలానికి రూ 999కు వన్‌వే జర్నీని అందిస్తూ సోమవారం నుంచి మూడు రోజుల పాటు పది లక్షల ప్రమోషనల్ సీట్లను అమ్మకానికి ఉంచింది. సోమవారం నుంచి నాలుగు రోజుల ఫెస్టివ్ సేల్ కింద టికెట్లు బుక్ చేసుకునే వారు ఈనెల 18 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకూ ప్రయాణ వ్యవధిలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కింద మొబైల్ వ్యాలెట్ మొబిక్విక్ ద్వారా బుక్ చేసుకునేవారికి రూ 600 సూపర్ క్యాష్ అమౌంట్‌ను ఇండిగో ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్ 3 నుంచి 6 వరకూ తాము ప్రకటించిన నాలుగు రోజుల ఫెస్టివ్ సేల్ ఆఫర్లో రూ 999 నుంచి విమాన చార్జీలు అందుబాటులో ఉంటాయని, కస్టమర్లకు ఇది మంచి అవకాశమని ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ చెప్పారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇండిగో ఈ తరహా ఆఫర్లతో వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. 160 విమానాలు కలిగి ఉన్న ఇండిగో రోజుకు ఎనిమిది అంతర్జాతీయ, 52 దేశీయ గమ్యస్ధానాలకు ప్రయాణీకులను చేరవేస్తోంది. -
ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయానికి మంచి స్పందన
♦ నేడు రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయం ♦ కట్ ఆఫ్ ధర లో 5 శాతం డిస్కౌంట్ న్యూఢిల్లీ: ఎన్‌హెచ్‌పీసీ వాటా విక్రయానికి మంచి స్పందన లభించింది. ఈ ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి కంపెనీలో 11.36 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో ప్రభుత్వం విక్రయానికి పెట్టింది. వ్యవస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా షేర్లు మూడు గంటలలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యాయి. వ్యవస్థాగత ఇన్వెస్టర్లకు కేటాయించిన 100.61 కోట్ల షేర్లకు గాను 1.58 రెట్లు అంటే 156.79 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. ఈ బిడ్స్ విలువ రూ.3,410 కోట్లు. అత్యధిక బిడ్లు ఎల్ఐసీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చాయని సమాచారం. గురువారం మిగిలిన 25.15 కోట్ల షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు విక్రయిస్తారు. ఆఫర్‌కు ఫ్లోర్‌ప్రైస్ రూ. 21.75కాగా, రిటైల్ ఇన్వెస్టర్లకు కట్ ఆఫ్ ధరకు 5 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. కాగా ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,700 కోట్ల నిధులు లభిస్తాయని అంచనా. వాటా విక్రయ నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ 5.8 శాతం నష్టపోయి రూ.21.70 వద్ద ముగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం పీఎస్‌యూల్లో తొలి డిజిన్వెస్ట్‌మెంట్ ఇది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయం ద్వారా రూ.56,500 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
దిలిప్ బిల్డ్ కాన్ ఐపీఓకు సెబీ ఓకే
కనీసం రూ.430 కోట్లు సమీకరణ న్యూఢిల్లీ: మౌలిక రంగ కంపెనీ దిలిప్ బిల్డ్‌కాన్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా దిలిప్ బిల్డ్‌కాన్ కనీసం రూ.430 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓ ద్వారా రూ.430 కోట్ల విలువైన తాజా షేర్లను, మరో 11.36 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) కింద జారీ చేయనున్నారు. ఈ కంపెనీ రహదారులు ప్రధానంగా ఈపీసీ కాంట్రాక్టు కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఐపీఓకు రావాలని ప్రయత్నించడం ఈ కంపెనీకి ఇది రెండోసారి. -
హెచ్ సీజీ ఐపీఓ ధరల శ్రేణి రూ.205-212
ఈ నెల16-18 మధ్య ఐపీఓ ముంబై: క్యాన్సర్ కేర్ నెట్వర్క్ సంస్థ హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ (హెచ్‌సీజీ) తన ఐపీఓకు ధరల శ్రేణిని రూ.205-212గా నిర్ణయించింది. ఈ నెల 16న నుంచి ప్రారంభమయ్యే ఈ ఐపీఓ 18న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా 1.16 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను, 1.82 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో జారీ చేయనున్నారు. ఈ కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్అవుతాయి. ధరల శ్రేణిలోని ఎగువ ధర ప్రకారం ఈ ఐపీఓ ద్వారా హెచ్‌సీజీ రూ.650 కోట్ల నిధులు సమీకరిస్తుందని అంచనా. క్లుప్తంగా... ♦ క్రాంప్టన్ గ్రీవ్స్: భారత్ వెలుపలి ట్రాన్సిమిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్(టీ అండ్ డీ) వ్యాపారాన్ని అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, ఫస్ట్ రిజర్వ్ ఇంటర్నేషనల్‌కు రూ.851 కోట్లకు విక్రయించింది. ♦ యస్ బ్యాంక్: విదేశీ పెట్టుబడి పరిమితిని 41 శాతం నుంచి 74 శాతానికి పెంచుకోవడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహాక బోర్డ్(ఎఫ్ఐపీబీ) అనుమతినిచ్చింది. ♦ క్యాడిలా హెల్త్‌కేర్: కేన్సర్ చికిత్సలో ఉపయోగపడే క్లోఫరబైన్ ఇంజెక్షన్‌కు అమెరికా ఎఫ్‌డీఏ నుంచి తాత్కాలిక ఆమోదం పొందింది. -
నేటి నుంచి కాంకర్లో 5% వాటా విక్రయం
ఆఫర్ ధర రూ.1,195; రిటైలర్లకు 5% డిస్కౌంట్ న్యూఢిల్లీ: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)లో 5% వాటా విక్రయం నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నది. రూ.1,195 ధరకు 97,48,710 షేర్లను ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయిస్తుంది. మంగళవారం బీఎస్ఈలో ఈ షేర్ ముగిసిన ధర(రూ.1,227)తో పోల్చితే ఇది 2.58% తక్కువ. బుధవారం సంస్థాగత ఇన్వెస్టర్లకు, గురువారం రిటైల్ ఇన్వెస్టర్లకు షేర్లు విక్రయిస్తారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం ఆఫర్ చేసే ధరలో 5% డిస్కౌంట్ లభిస్తుంది. మొత్తం 5% వాటాలో 20% వాటా రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మొత్తం ఈ 5% వాటా విక్రయం కారణంగా ప్రభుత్వానికి రూ.1,165 కోట్లు సమకూరుతాయని అంచనా. మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు మినహా మరే ఇతర సంస్థ కూడా మొత్తం ఆఫర్లో 25 శాతానికి మించి బిడ్ చేయడానికి వీలు లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం విక్రయిస్తున్న ఏడో ప్రభుత్వ రంగ వాటా విక్రయం ఇది. రైల్వేల నిర్వహణలో ఉన్న కంటైనర్ కార్పొరేషన్లో ప్రభుత్వ వాటా 61.8%గా ఉంది. -
ఐవోసీ ఓఎఫ్ఎస్ ధర రూ.387
న్యూఢిల్లీ : ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో సోమవారం విక్రయించ బోయే షేర్లకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) కనీస ధరను రూ.387గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంటు పోను... ఐవోసీలో 24.28 కోట్ల షేర్ల విక్రయం ద్వారా ఖజానాకు సుమారు రూ. 9,302 కోట్లు రాగలవని అంచనా. శుక్రవారం బీఎస్ఈలో ఐవోసీ స్టాక్ ముగింపు ధర రూ. 394.45తో పోలిస్తే ఓఎఫ్ఎస్కి నిర్ణయించిన రేటు సుమారు 1.8 శాతం తక్కువ. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఐవోసీలో కేంద్రం తనకున్న 68.6 శాతం వాటాల్లో 10 శాతం వాటాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం 9.15 గం.లకు మొదలయ్యే ఆఫర్ ఫర్ సేల్ అదే రోజు సాయంత్రం 3.30 గం.లకు ముగుస్తుంది. ఆఫర్లో దాదాపు 20 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించడం జరిగింది. -
ఎల్ అండ్ టీకి అధిక వ్యయాల దెబ్బ
33 శాతం తగ్గిన నికర లాభం ముంబై : ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం ఎల్ అండ్ టీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో 37 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.967 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.606 కోట్లకు తగ్గిపోయిందని ఎల్ అండ్ టీ పేర్కొంది. వ్యయాలు అధికమవడం, కొన్ని ప్రాజెక్టుల కార్యకలాపాలు నెమ్మదించడం నికర లాభం క్షీణతకు ప్రధాన కారణాలని తెలిపింది. నికర అమ్మకాలు రూ.18,975 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.20,252 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.26,376 కోట్ల కొత్త ఆర్డర్లు సాధించామని, వీటిల్లో అంతరాజీయ ఆర్డర్లు రూ.8,110 కోట్లని ్ల(31 శాతమని) వెల్లడించింది. జూన్ చివరి నాటికి తమ గ్రూప్ ఆర్డర్ బుక్ విలువ 22 శాతం వృద్ధితో రూ.2,38,973 కోట్లకు ఎగసిందని వివరించింది. దీంట్లో అంతర్జాతీయ ఆర్డర్ల వాటా 26 శాతమని పేర్కొంది. ఎల్ అండ్ టీ గ్రూప్ టెక్నాలజీ, ఇంజినీరింగ్,నిర్మాణ, తయారీ, ఆర్థిక సేవల రంగాల్లో దాఆపు 30 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంపెనీ వార్షిక ఆదాయం 1,500 కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని అంచనా. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ ఐపీఓ ఎల్ అండ్ టీ సంస్థ తన ఐటీ విభాగం, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్‌ను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనుంది. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్లో 15 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించాలన్న ప్రతిపాదన శుక్రవారం జరిగిన ఎల్ అండ్ టీ బోర్డ్ సమావేశంలో ఆమోదం పొందింది. ఈ వాటా విక్రయం ద్వారా రూ.2,500 కోట్లు నిధులు వస్తాయని అంచనా. దీనికి సంబంధించిన పత్రాలను ఎల్ అండ్ టీ వచ్చే నెల మూడో వారంలో సెబీకి సమర్పింస్తుందని సమాచారం. కాగా ఈ ఐపీఓకు కోటక్, సిటిబ్యాంక్, బార్క్లేస్లు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 9 డెలివరీ సెంటర్లతో షెవ్రాన్, హిటాచి, శాన్యో, లఫార్జే తదితర దిగ్గజ సంస్థలకు ఐటీ సేవలనందిస్తోంది. -
ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్ రూ.30,000 కోట్లే..!
న్యూఢిల్లీ : పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఏడాది రూ.30,000 కోట్లుకు మించి ప్రభుత్వానికి ఆదాయం రాకపోవచ్చని డిజిన్వెస్ట్‌మెంట్ (డీఓడీ) శాఖ ఆర్థికమంత్రిత్వశాఖకు నివేదించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.69,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి మార్కెట్ ఒడిదుడుకుల పరిస్థితులే కారణమని వివరించింది. మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా భారీ లక్ష్య సాధన వ్యూహం తగిన ఫలితాలను ఇవ్వదని తెలిపింది. ఇటీవలి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ఘనవిజయం సాధించి, ఖజానాకి రూ.1,600 కోట్లు జమ అయినప్పటికీ డీఓడీ తాజా అంచనాలు ఆసక్తిగా మారాయి. ఆర్ఈసీ నుంచి కేంద్రం రూ.1,550 కోట్లు సమీకరించింది. -
నేడు పీఎఫ్‌సీలో 5% వాటా విక్రయం
షేరు కనీస ధర రూ. 254గా నిర్ణయం.. న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ)లో కేంద్రం నేడు(సోమవారం) 5% వాటాను విక్రయించనుంది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా చేపట్టనున్న ఈ వాటా అమ్మకంలో ఒక్కో షేరుకి కనీస ధర(ఫ్లోర్ ప్రైస్)ను రూ.254గా ఖరారు చేశారు. ఎక్స్ఛేం జీలకు వెల్లడించిన సమాచారంలో పీఎఫ్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. శుక్రవారం నాటి ముగింపు ధర రూ.259.55(బీఎస్ఈలో)తో పోలిస్తే ఫ్లోర్ ప్రైస్ 2.14 శాతం తక్కువ కింద లెక్క. కాగా, ప్రస్తుతం పీఎఫ్‌సీలో ప్రభుత్వానికి 72.8 శాతం వాటా ఉంది. 5 శాతం వాటా అమ్మకం ద్వారా రూ.1,600 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఖజానాకు వస్తాయని అంచనా. -
రేపే పీఎఫ్‌సీలో వాటాల విక్రయం
షేరు ధర రూ. 254 న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)లో 5 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో జూలై 27న (సోమవారం) కేంద్రం విక్రయించనుంది. ఇందుకోసం షేరు కనీస ధరను మార్కెట్ రేటుతో పోలిస్తే 2 శాతం డిస్కౌంటుతో రూ. 254గా నిర్ణయించింది. ఫ్లోర్ ప్రైస్ ప్రకారం పీఎఫ్‌సీలో 6.60 కోట్ల షేర్ల విక్రయం ద్వారా కేంద్రానికి రూ. 1,600 కోట్లు రాగలవని అంచనా. సంస్థలో కేంద్రానికి ప్రస్తుతం 72.80 శాతం వాటాలు ఉన్నాయి. డిజిన్వెస్ట్‌మెంట్ తర్వాత వాటాలు 67.80 శాతానికి తగ్గుతాయి. రెండు ట్రేడింగ్ పనిదినాలు కాకుండా రెండు బ్యాంకింగ్ పని దినాలకు ముందు వాటాల విక్రయ యోచనలు వెల్లడించే వీలు కల్పిస్తూ ఓఎఫ్ఎస్ నిబంధనలు మార్చిన తర్వాత షేర్ల విక్రయం జరుపుతున్న తొలి కంపెనీ పీఎఫ్‌సీనే. -
ఓఎఫ్ఎస్ ద్వారా
రూ.77 వేల కోట్లు న్యూఢిల్లీ: భారత కంపెనీలు ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో భారీగా నిధులు సమీకరించాయి. 2012, ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ 129 కంపెనీలు ఓఎఫ్ఎస్ విధానంలో రూ.77,023 కోట్ల నిధులు సమీకరించాయని ఒక నివేదిక వెల్లడించింది. దీంట్లో ప్రభుత్వ రంగ సంస్థల వాటా రూ.63,576 కోట్లు(82 శాతం)గా ఉంది. కేంద్రప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు బాగా ఉపయోగపడిన ఈ ఓఎఫ్ఎస్ విధానాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2012, ఫిబ్రవరిలో అందుబాటులోకి తెచ్చింది. -
కోల్ ఇండియా వాటా విక్రయం సక్సెస్
రూ. 22,557 కోట్ల సమీకరణ; కొత్త రికార్డు * ఆఫర్ ఫర్ సేల్కు 1.07 రెట్ల స్పందన * అతిపెద్ద కొనుగోలుదారు ఎల్ఐఎసీ.. న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బొగ్గు దిగ్గజం కోల్ ఇండియాలో (సీఐఎల్) వాటాల విక్రయానికి శుక్రవారం నిర్వహించిన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విజయవంతమైంది. 10 శాతం వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ఖజానాకు రూ. 22,557.3 కోట్లు లభించాయి. ప్రభుత్వ రంగానికే చెందిన మరో దిగ్గజం ఎల్ఐఎసీ ఏకంగా మూడింట ఒక వంతు షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. స్టాక్ ఎక్స్చేంజీల వద్ద గణాంకాల ప్రకారం మొత్తం 63.16 కోట్ల షేర్లకు గాను 67.52 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. తద్వారా ఇష్యూ 1.07 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయినట్లయింది. అత్యంత భారీ ఇష్యూ కింద కోల్ ఇండియా తన రికార్డును తానే మరోసారి బద్దలు కొట్టింది. ఇటు ప్రైవేట్, అటు ప్రభుత్వ రంగంలో చూసినా ఏ సంస్థా కూడా ఇప్పటిదాకా ఇంత భారీ ఇష్యూ తలపెట్టలేదు. 2010లో పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు సీఐఎల్ ఏకంగా రూ. 15,000 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూ సక్సెక్స్తో కాగా, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు సగభాగం వచ్చినట్లే అవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 43,425 కోట్లు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఇన్వెస్టర్ల విశ్వాసం వెల్లడైంది..: కోల్ ఇండియా షేర్ల విక్రయానికి లభించిన స్పందనను చూస్తే సంస్కరణల విషయంలో ప్రభుత్వ నిబద్ధతపై ఇన్వెస్టర్లకున్న విశ్వాసం వెల్లడైనట్లు భావించవచ్చని బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ చెప్పారు. ఎల్ఐసీ ఏకంగా రూ. 7,000 కోట్ల మేర విలువ చేసే షేర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. 5% డిస్కౌంటు లభించిన రిటైల్ ఇన్వెస్టర్లు రూ. 1,852.55 కోట్ల విలువ చేసే షేర్లకు బిడ్లు వేశారు. మరోవైపు, డిజిన్వెస్ట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తూ కార్మిక సంస్థలు కంపెనీకి చెందిన కొన్ని యూనిట్ల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. బీఎస్ఈలో శుక్రవారం కోల్ ఇండియా షేరు ధర 3.81 శాతం క్షీణించి రూ. 360.85 వద్ద ముగిసింది. -
నెలాఖర్లో సెయిల్ డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: ఈ నెల 24-26 మధ్య ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్‌లో డిజిన్వెస్ట్‌మెంట్ జరిగే అవకాశముందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. దీనిలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో ప్రభుత్వం 5% వాటాకు సమానమైన 20.65 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు తెలిపారు. బీఎస్ఈలో మంగళవారంనాటి ముగింపు ధర రూ. 77.15 ప్రకారం చూస్తే డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి రూ. 1,600 కోట్లు లభించే అవకాశముంది. ఇందుకు ఇప్పటికే రోడ్‌షోలు పూర్తయినట్లు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. వెరసి సెయిల్ ద్వారా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు ఊపునివ్వనున్నట్లు పేర్కొన్నారు. నిజానికి సెయిల్‌లో 10.82% వాటాను విక్రయించేందుకు 2012 జూలైలోనే కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిలో భాగంగా 2013 మార్చిలో తొలి దశకింద 5.82% వాటాను అమ్మివేసింది కూడా. లక్ష్యంవైపు చూపు ఈ ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూలు) వాటాల విక్రయం ద్వారా రూ. 43,425 కోట్లను సమీకరించాలని బడ్జెట్లో ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. దీనిలో 30% వరకూ అంటే రూ. 18,000 కోట్లను ఒక్క ఓఎన్జీసీ ఇష్యూ ద్వారానే సమకరించేందుకు అవకాశముంది. కాగా, డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం సెయిల్, ఓఎన్‌జీసీలతోపాటు, కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ, పీఎఫ్సీ, ఆర్‌ఈసీలలో వాటాలను విక్రయించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్కు ఓఎఫ్ఎస్ మార్గాన్ని ఎంచుకుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు అధిక అవకాశాలను కల్పించే బాటలో ప్రభుత్వం రిటైల్ కోటాను పెంచడమేకాకుండా ఆఫర్ ధరలో డిస్కౌంట్‌ను సైతం అందిస్తోంది. సాధారణంగా ఓఎఫ్‌ఎస్‌కు ధరను ఒక రోజు ముందు మాత్రమే ప్రకటిస్తోంది. ఇక ఇష్యూ తేదీని రెండు రోజుల ముందు ప్రకటించనుంది. సెబీ ఓకే ఓఎఫ్ఎస్ ద్వారా షేర్ల విక్రయాన్ని చేపట్టేందుకు టాప్-100 కంపెనీలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2013 జనవరిలో అనుమతించింది. ఓఎఫ్ఎస్లో భాగంగా లిస్టెడ్ కంపెనీలు షేర్ల అమ్మకాన్ని వేలం ద్వారా నిర్వహిస్తాయి. మరోవైపు పబ్లిక్కు కనీసం 25% వాటా కల్పించేందుకు వీలుగా ఓఎఫ్ఎస్ను చేప్టేందుకు పీఎస్‌యూలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.