
ఐవోసీ ఓఎఫ్‌ఎస్ ధర రూ.387
న్యూఢిల్లీ : ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో సోమవారం విక్రయించ బోయే షేర్లకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) కనీస ధరను రూ.387గా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు 5 శాతం డిస్కౌంటు పోను... ఐవోసీలో 24.28 కోట్ల షేర్ల విక్రయం ద్వారా ఖజానాకు సుమారు రూ. 9,302 కోట్లు రాగలవని అంచనా. శుక్రవారం బీఎస్‌ఈలో ఐవోసీ స్టాక్ ముగింపు ధర రూ. 394.45తో పోలిస్తే ఓఎఫ్‌ఎస్‌కి నిర్ణయించిన రేటు సుమారు 1.8 శాతం తక్కువ. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఐవోసీలో కేంద్రం తనకున్న 68.6 శాతం వాటాల్లో 10 శాతం వాటాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
సోమవారం ఉదయం 9.15 గం.లకు మొదలయ్యే ఆఫర్ ఫర్ సేల్ అదే రోజు సాయంత్రం 3.30 గం.లకు ముగుస్తుంది. ఆఫర్‌లో దాదాపు 20 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించడం జరిగింది.