IOC
-
ఐదు దేశాలు దాటి ఒలింపిక్స్ వరకు...
పారిస్: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నేతృత్వంలోని శరణార్థి జట్టు తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ప్రతికూల పరిస్థితుల మధ్య పోరాటం, పట్టుదలతో విశ్వ క్రీడలకు వెళ్లాలని ప్రయతి్నంచే వారి ప్రయాణం అసాధారణం. ఇలాంటి వారిలో అఫ్గానిస్తాన్‌కు చెందిన సిబ్గతుల్లా అరబ్ ఒకడు. ఈ ఒలింపిక్స్‌లో అతను జూడో (81 కేజీల విభాగం)లో బరిలోకి దిగాడు. 2021లో అఫ్గానిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయాక అక్కడి పరిస్థితులు మారిపోవడంతో అరబ్ ఆ దేశం నుంచి పారిపోయాడు. అప్పటికి 19 ఏళ్ల వయసులో ఉన్న అతను అఫ్గాన్ జాతీయ జూడో జట్టులోకి ఎంపికయ్యాడు కూడా. అక్కడి నుంచి బయల్దేరి తొమ్మిది నెలల పాటు ఎన్నో కష్టాలకు ఓర్చి ఇరాన్, టర్కీ, గ్రీస్, బోస్నియా అండ్ స్లొవేనియాలలో తలదాచుకుంటూ చివరకు జర్మనీ చేరాడు. డార్ట్మండ్ సమీపంలోని శరణార్ధి శిబిరంలో తనలాగే ఇరాన్ నుంచి వచి్చన కోచ్ ఆధ్వర్యంలో జూడోలో శిక్షణ కొనసాగించాడు. అక్కడే ఆటలో రాటుదేలిన అరబ్... యూరోపియన్ ఓపెన్ తదితర టోరీ్నల్లో రాణించి ఎట్టకేలకు ఐఓసీ శరణార్ధి టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఇప్పటికీ అరబ్ కుటుంబం అఫ్గానిస్తాన్‌లో ఉంటోంది. తన తల్లి, సోదరుడితో మాట్లాడుతుంటానని... భవిష్యత్తులో తన పరిస్థితి మెరుగవుతుందని అరబ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
2024 ప్యారిస్ ఒలింపిక్స్: స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ
రిలయన్స్ ఫౌండేషన్, నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, ఛైర్మన్ నీతా అంబానీ 2024 పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పారిస్‌లో జరుగుతున్న 142వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సెషన్‌కు నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నుంచి ఘనస్వాగతం లభించింది. ముఖ్యంగా నీతా అంబానీ సాదరంగా ఆహ్వానించిన మాక్రాన్ ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ కూడా నీతాకు శుభాకాంక్షలు తెలిపారు.ఫ్రాన్స్ రాజధాని నగరంలో జరిగిన లూయిస్ విట్టన్ ఫౌండేషన్‌లో జరిగిన 142వ ఐఓసీ షన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నీతా అంబానీ ఎంబ్రాయిడరీతో తీర్చిదిద్దిన ఎరుపు రంగు సూట్‌ను ధరించారు. గోల్డెన్ థ్రెడ్‌వర్క్ డ్రెస్‌లో చాలా నిరాడంబరమైన ఆభరణాలతో నీతా అందంగా, హుందాగా కనిపించారు..కాగా 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు శుక్రవారం, జూలై 26న జరగనున్నాయి. అధికారిక ప్రారంభోత్సవానికి ముందు జూలై 24న కొన్ని క్రీడలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఒలింపిక్స్‌లో 206 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10,500 మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 ఆగస్టు 11న ముగుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా చాలా పాపులర్. ఇటీవల తన చిన్నకుమారుడు అనంత్ అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. -
ఐవోసీ లాభం సగానికి డౌన్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) నికర లాభం సగానికి పైగా క్షీణించింది. రూ. 4,838 కోట్లకు పరిమితమైంది. సమీక్షాకాలంలో ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.21 లక్షల కోట్లకు తగ్గింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ రూ. 7 తుది డివిడెండ్ ప్రకటించింది. రూ. 5 మధ్యంతర డివిడెండ్‌కు ఇది అదనం. పూర్తి సంవత్సరానికి రికార్డు లాభాలు.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ చరిత్రలోనే అత్యధిక లాభాలను ఐవోసీ ప్రకటించింది. రూ. 39,619 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇక ఆదాయం రూ. 9.41 లక్షల కోట్ల నుంచి రూ. 8.71 లక్షల కోట్లకు తగ్గింది. ముడి చమురు శుద్ధికి సంబంధించి ప్రతి బ్యారెల్‌పై వచ్చే స్థూల రిఫైనింగ్ మార్జిన్ 19.52 డాలర్ల నుంచి 12.05 డాలర్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినా దేశీయంగా ఇంధనాల ధరలను తగ్గించకుండా దాదాపు రెండేళ్ల పాటు అదే స్థాయిలో కొనసాగించడమనేది ఐవోసీ వంటి కంపెనీలకు లాభించింది. -
ఐవోసీ.. లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌లో నష్టాలను వీడి దాదాపు రూ. 12,967 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. వెరసి ఒక ఏడాదికి కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఆర్జించిన లాభాల్లో సగానికిపైగా తాజా త్రైమాసికంలో సాధించింది. ఇక గతేడాది (2022–23) ఇదే కాలంలో రూ. 272 కోట్ల నికర నష్టం ప్రకటించింది. చమురు శుద్ధి మార్జిన్లతోపాటు మార్కెటింగ్ మార్జిన్లు మెరుగుపడటంతో లాభదాయకత పుంజుకుంది. ఈ కాలంలో ముడిచమురు ధరలు క్షీణించినప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం ఇందుకు సహకరించింది. దీంతో పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాల ద్వారా రూ. 17,756 కోట్ల పన్నుకుముందు లాభం సాధించింది. గత క్యూ2లో రూ. 104 కోట్ల నిర్వహణ నష్టం నమోదైంది. ఆదాయం డౌన్ ప్రస్తుత సమీక్షా కాలంలో ఐవోసీ ఆదాయం రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.02 లక్షల కోట్లకు క్షీణించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 5 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఐవోసీ రూ. 26,718 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 2021–22 ఏడాదికి సాధించిన రికార్డ్ నికర లాభం రూ. 24,184 కోట్లకంటే అధికంకావడం విశేషం! తొలి ఆరు నెలల్లో ఒక్కో బ్యారల్ స్థూల చమురు శుద్ధి మార్జిన్లు(జీఆర్ఎం) 13.12 డాలర్లుగా నమోదైంది. ఈ కాలంలో ఎగుమతులతో కలిపి మొత్తం 47.65 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్టులను విక్రయించినట్లు కంపెనీ చైర్మన్ ఎస్ఎం వైద్య వెల్లడించారు. క్యూ2లో ఐవోసీ ఇంధనాల ఉత్పత్తి 16.1 ఎంటీ నుంచి 17.72 ఎంటీకి బలపడ్డాయి. ఫలితాల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం బలపడి రూ. 90 వద్ద ముగిసింది. -
ఇంధన ఉత్పత్తిలో భారత్ కీలక ముందడుగు.. ఇకపై దిగుమతి అక్కర్లేదు!
ఇంధన ఉత్పత్తిలో భారత్ ముందడుగు వేసింది. ఆటోమొబైల్ పరిశ్రమకు కీలకమైన సూచన ఇంధనాన్ని (రెఫరెన్స్ ఫ్యూయల్) ఆవిష్కరించింది. ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) సహకారంతో తన మొదటి రెఫరెన్స్ ఇంధనాన్ని ప్రారంభించింది. రెఫరెన్స్ ఫ్యూయల్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయనున్న మూడవ దేశంగా భారత్ అవతరించింది. దీంతో ఇక రెఫరెన్స్ ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధాపడాల్సిన అవసరం ఉండదు. మనం సాధారణంగా 1,000 కిలోలీటర్ల రెఫరెన్స్ ఇంధనం దిగుమతి చేసుకుంటున్నామని, కానీ వినియోగం కేవలం 150 కిలోలీటర్లు మాత్రమేనని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. త్వరలో ఈ ఇంధనం దిగుమతులను ఆపివేసి, మనం కూడా ప్రధాన ఎగుమతిదారుగా మారనున్నామని ఆయన పేర్కొన్నారు. ఏమిటీ రెఫరెన్స్ ఫ్యూయల్? రెఫరెన్స్ ఫ్యూయల్ అనేది ఆటోమొబైల్ పరిశ్రమకు చాలా కీలకం. వాహన తయారీదారులు, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT), ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వంటి ఏజెన్సీలు వాహనాలను క్రమాంకనం చేయడానికి, పరీక్షించడానికి 'రిఫరెన్స్' ఇంధనాలను ఉపయోగిస్తాయి. చాలా డబ్బు ఆదా రెఫరెన్స్ ఇంధనాన్ని ఇండియన్ ఆయిల్ పారాదీప్ , పానిపట్ రిఫైనరీలు ఉత్పత్తి చేయనున్నాయి. దిగుమతి చేసుకున్న రిఫరెన్స్ ఫ్యూయల్ లీటరు ధర రూ. 800 నుంచి రూ.850 ఉంటోంది. అదే మన దేశంలోనే ఉత్పత్తి చేయడం వల్ల లీటరు దాదాపు రూ. 500 లోపే వచ్చే అవకాశం ఉంటుంది. -
బీపీసీఎల్, ఐఓసీకి రూ.3కోట్లు ఫైన్!
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)..భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు రూ.2కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు రూ.1కోటి మేర జరిమానా విధించింది. తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు జరిమానా విధించినట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలు వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని రిటైల్ అవుట్లెట్లలో వేపర్ రికవరీ సిస్టమ్స్ (వీఆర్ఎస్) ఇన్స్టాల్ చేయనందుకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీసీబీ నుంచి ఆదేశాలు అందినట్లు ఐఓసీ తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు పెట్రోల్ స్టేషన్లలో వీఆర్ఎస్లను ఏర్పాటు చేయనందుకు ఈ ఫైన్ విధించలేదని స్పష్టం చేసింది. వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరై వాతావరణంలోకి వెళుతుంది. ఈ ఆవిరిలో బెంజీన్, టోలీన్, క్సైలీన్ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పెట్రోల్ ఆవిరి బయటకు రాకుండా ఇంధన స్టేషన్లలో వీర్‌ఎస్‌ని అమర్చాలని 2016లో పెట్రోల్ పంపులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు, సీపీసీబీ నిర్దేశించిన సమయంలో వీఆర్ఎస్ను ఇన్స్టాల్ చేయనందుకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసు అందుకున్నట్లు బీపీసీఎల్ ప్రకటన విడుదల చేసింది. -
రంగుల ఒలింపిక్స్ స్వప్నం
ఎప్పటి నుంచో వింటున్నదే... తెర వెనుక జోరుగా ప్రయత్నాలు సాగుతున్నదే... ఇప్పుడు అధికారి కంగా ఖరారైంది. 128 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ మళ్ళీ విశ్వక్రీడల్లో పునఃప్రవేశం చేయనుంది. మరో అయిదేళ్ళలో రానున్న 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఈ ‘జెంటిల్మెన్ క్రీడ’ సహా స్క్వాష్, బేస్‌బాల్/ సాఫ్ట్‌బాల్, లక్రాస్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ ఆటలు అయిదింటిని అదనంగా ప్రవేశపెట్టనున్నారు. భారత్‌లో 50 ఓవర్ల ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతున్న వేళ ఈ ప్రకటన రావడం విశేషం. ముంబయ్‌లో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ, భారత్‌లో 2036 నాటి ఒలింపిక్స్ నిర్వహణకు మన ప్రధాని బాహాటంగా ఉత్సుకతను వ్యక్తం చేశారు. ఆ వెంటనే రెండు రోజులకే ఒలింపిక్ కార్యక్రమ సంఘం అధ్యక్షుడు కార్ల్ స్టాస్ క్రికెట్‌కు ఒలింపియాడ్‌లో స్థానాన్ని ప్రకటించడం ఉత్సాహం నింపింది. కాలానికి తగ్గట్టు మారే ఈ ప్రయత్నం అభినందనీయమే. అదే సమయంలో ఇది పలు సవాళ్ళపై చర్చ రేపింది. ఎప్పుడో 1900లోనే తొలిసారిగా ప్యారిస్ ఒలింపిక్స్‌లోనే క్రికెట్ భాగమైంది. తర్వాత ఇన్నేళ్ళకు లాస్ ఏంజెల్స్‌లో మళ్ళీ తెరపైకి వస్తోంది. స్క్వాష్ సహా మిగతా 4 ఆటలకు విశ్వ క్రీడాంగణంలో ఇదే తెరంగేట్రం. ప్రపంచంలోని అతి పెద్ద క్రీడా సంరంభం నుంచి ఇన్నేళ్ళుగా క్రికెట్‌ను దూరంగా ఉంచడం దురదృష్టకరమే! ఇప్పుడు టీ–20 క్రికెట్ విస్తృత ప్రాచుర్యం పొందడమే కాక మును పెన్నడూ లేని విధంగా ప్రపంచంలోని అనేక దేశాలు ఆ ఫార్మట్ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో టీ–20 క్రికెట్‌కు కూడా చోటివ్వడం ప్రజాస్వామ్యబద్ధమైన ఆలోచన. తద్వారా ఒలింపిక్స్ మరింత చేరువవుతుంది. ఫుట్‌బాల్ తర్వాత ప్రపంచంలో అత్యధికులు అనుసరించే క్రీడగా క్రికెట్ ప్రసార, ప్రచార హక్కులతో ఒలింపిక్ సంఘానికి వచ్చే ఆదాయం, అటు నుంచి భారత్‌కు లభించే వాటా సరేసరి. అందుకే, ఐఓసీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చాలా లెక్కలే ఉన్నాయి. అయితే చిన్న తిరకాసుంది. క్రికెట్ సహా కొత్తగా చేరే ఆటలన్నీ 2028 ఒలింపిక్స్‌కే పరిమితం. వాటిని తర్వాత కొనసాగించాలా లేదా అన్నది ఆపైన 2032లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే బ్రిస్బేన్ నిర్ణయిస్తుంది. నిజానికి, కామన్వెల్త్ దేశాలే కాక, ప్రపంచమంతా ఆడే విశ్వక్రీడగా క్రికెట్ విస్తరించాల్సి ఉంది. ఐఓసీ గుర్తింపు పొందిన 206 దేశాల్లో ప్రస్తుతం 50 శాతాని కన్నా తక్కువ చోట్లే క్రికెట్ ఆడుతున్నారు. కనీసం 75 శాతం చోట్ల క్రికెట్ తన ఉనికిని చాటాల్సి ఉంది. అది ఓ సవాలు. కొన్ని ఐఓసీ సభ్యదేశాలు చేస్తున్న ఈ వాదన సబబే. అలాగే, కొత్తగా ఒలింపియాడ్లోకి వస్తున్న అయిదింటిలో నాలుగు... టీమ్ స్పోర్ట్స్. కాబట్టి, క్రీడాగ్రామంలో ఆటగాళ్ళ సంఖ్య అంగీకృత కోటా 10,500 కన్నా 742 మేర పెరుగుతుంది. గేమ్స్ విలేజ్‌పై భారం తగ్గించడానికి ఇతర ఆటల్లో అథ్లెట్ల కోటా తగ్గించడం, కొన్ని మెడల్ ఈవెంట్లను ఈసారికి పక్కనపెట్టడమే మార్గం. అది కొంత నిరాశే! అలాగే, ఒలింపిక్స్‌లోకి క్రికెట్ పునఃప్రవేశం బాగానే ఉంది కానీ, అగ్ర క్రికెటర్లు ఆ క్రీడాసంరంభంలో కాలుమోపుతారా అన్న అనుమానం పీడిస్తోంది. ఇటీవలి ఏషియన్ గేమ్స్ అనుభవమే అందుకు సాక్ష్యం. ఆసియా ఖండంలోని అధిక భాగం అగ్రశ్రేణి జట్లు ప్రధాన ఆటగాళ్ళను అక్కడకు పంపనే లేదు. అదేమంటే, దగ్గరలోనే 50 ఓవర్ల ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఉందన్నాయి. ఇండియా అయితే ఏషియాడ్కి క్రికెట్ జట్టునే పంపకూడదనుకుంది. ఆఖరు క్షణంలో క్రికెట్ బోర్డ్ మనసు మార్చుకుంది. వచ్చే 2028 నాటి అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ఇంకా ఖరారు కాలేదు గనక, ఆ ఏడాది జూలైలో 16 రోజుల పాటు సాగే ఒలింపిక్స్‌లో అగ్రతారలు ఆడేందుకు వీలుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షెడ్యూల్‌ను ఖరారు చేస్తుందని ఒలింపిక్ సంఘం ఆశాభావంలో ఉంది. గతంలో యూ23 అవతారంలో ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్ ప్రయోగం చేశారు. కానీ, ఆదరణ, ఆదాయం అంతంతే! టెన్నిస్, గోల్ఫ్లను చేర్చుకున్నా, ప్రథమశ్రేణి పేర్లు కనపడలేదు. ఇక, వరు ణుడి కరుణపై ఆధారపడడం క్రికెట్‌కు మరో తలనొప్పి. తాజా ఏషియాడ్‌లో వాన వల్ల మ్యాచ్ రద్దయి, టీ20 ర్యాంకింగ్‌ను బట్టి స్వర్ణపతక విజేతను నిర్ణయించిన ప్రహసనం చూశాం. ఇక, 2036 ఒలింపిక్స్‌ను భారత్‌లో నిర్వహించేలా సర్వశక్తులూ ఒడ్డుతామని మోదీ ప్రకటించడం సంతోషమే అయినా, సాధ్యాసాధ్యాలపై అనుమానాలున్నాయి. జీ20 సదస్సు, ఏషియాడ్‌లో పతకాల శతకం తెచ్చిన ఉత్సాహంలో ప్రధాని దీన్ని ‘140 కోట్ల ప్రజల స్వప్నం’గా పేర్కొన్నారు. కానీ, వేల కోట్లతో స్టేడియమ్‌లు నిర్మించేకన్నా సామాన్యులకు కూడుగూడుపై దృష్టి పెట్టాలనే వాదనని విస్మరించలేం. భారీ ఖర్చు రీత్యా 2026 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడానికి సైతం ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. ఇక, 2010లో మన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అప్పట్లో భారత ఒలింపిక్ అసోసియేషన్‌ను 14 నెలలు ఐఓసీ బహిష్కరించింది. అవన్నీ మనం మర్చి పోరాదు. 2035 నాటికి భారత్ 6 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ అవుతుందనీ, 2047కి అగ్రరాజ్యంగా అవతరిస్తామనీ జబ్బలు చరుస్తున్న వేళ ఒలింపిక్స్ స్వప్నం వసతులు పెంచుకోవడానికీ, క్రీడా ప్రతిభను పెంచిపోషించుకోవడానికీ ఉపయుక్తమే! దాని వెంటే ఉన్న సవాళ్ళతోనే సమస్య. తలసరి ఆదాయంలో మనల్ని ఎంతో మించిన లండన్, టోక్యో, ప్యారిస్, సియోల్లకున్న సహజ మైన సానుకూలత మనకుందా? సంబరం ముగిశాక ఏథెన్స్, రియో లాంటి ఆతిథ్య దేశాలకు ఐరావతాలుగా మారి క్రీడాంగణాల్ని వాడుకొనే ప్రణాళిక ఉందా? పేరుప్రతిష్ఠలతో పాటు ప్రజలకూ పనికొచ్చేలా వ్యూహరచన చేస్తేనే ఎంత రంగుల కలకైనా సార్థకత. -
రిలయన్స్ గ్యాస్‌కు టాప్ బిడ్డరుగా ఐవోసీ
న్యూఢిల్లీ: కేజీ–డీ6 గ్యాస్ విక్రయానికి సంబంధించి రిలయన్స్–బీపీ నిర్వహించిన వేలంలో వరుసగా రెండోసారి ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) టాప్ బిడ్డరుగా నిల్చింది. మే నెలలో రోజుకు 5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను వేలం వేయగా 2.5 ఎంసీఎండీని దక్కించుకుంది. అంతకు ముందు ఏప్రిల్‌లో కూడా రిలయన్స్-బీపీ 6 ఎంసీఎండీ గ్యాస్‌ను వేలం వేయగా దాదాపు అందులో సగభాగాన్ని ఐవోసీ కొనుగోలు చేసింది. తాజాగా మూడేళ్ల పాటు సరఫరా కోసం గత నెల 19 నుంచి 23 వరకు కేజీ–డీ6 గ్యాస్ ఈ–వేలం నిర్వహించగా మొత్తం 16 సంస్థలు కొనుగోలు చేశాయి. యూనిట్ (ఎంబీటీయూ) ఒక్కింటికి సగటున దాదాపు 10 డాలర్ల చొప్పున రేటు పలికినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
పెట్ బాటిళ్లతో దుస్తులు.. శ్రీకారం చుట్టిన ఐవోసీ
బెంగళూరు: చమురు రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వాడి పడేసిన పెట్ బాటిళ్లను ఏటా రీసైకిల్ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ ద్వారా పర్యావరణ అనుకూల వస్త్రాలను తయారు చేస్తారు. ఇందుకు ప్రతి సంవత్సరం 10 కోట్ల బాటిళ్లను రీసైకిల్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. పెట్రోల్ పంపులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీల సిబ్బందికి ఈ వస్త్రంతో అన్బాటిల్డ్ పేరుతో యూనిఫాం తయారు చేస్తారు. సౌర శక్తితో సైతం పనిచేసే వంటింటి స్టవ్‌లను ఐవోసీ రూపొందించింది. సూర్యుడు లేని సమయంలో ఎల్పీజీ, పైప్డ్ గ్యాస్‌తో స్టవ్ పనిచేస్తుంది. అన్బాటిల్డ్ యూనిఫాం, స్టవ్‌ను ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సమీప భవిష్యత్తులో 3 కోట్ల గృహాలకు ఈ స్టవ్‌లు చేరతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్బాటిల్డ్ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దది అని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. చమురు విక్రయ కంపెనీల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఇతర సంస్థలు, రిటైల్ విక్రయాల కోసం యూనిఫాంలు తయారు చేస్తామన్నారు. యుద్ధానికి కాకుండా ఇతర సమయాల్లో వేసుకునేలా సాయుధ దళాల కోసం దుస్తులు సైతం రూపొందిస్తారు. -
ఆయిల్ కంపెనీలకు ఉపశమనం.. రూ.30,000 కోట్లు కేటాయింపు
ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 10 నెలలుగా పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను సవరించకుండా నష్టపోయిన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ కోసం రూ.30,000 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. అంతర్జాతీయంగా ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, 2021 ఏప్రిల్ 6 నుంచి ఈ సంస్థలు ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. బ్యారెల్ చమురు ధర 116 డాలర్లకు వెళ్లిన సమయంలో వాటికి ఎక్కువ నష్టం వచ్చింది. ఆ తర్వాత చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్‌పై లాభం వస్తుండగా, డీజిల్‌పై ఇప్పటికీ నష్టపోతున్నాయి. 2022–23లో ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు ఉమ్మడిగా రూ.21,200 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. పైగా వీటికి రెండేళ్లుగా ఎల్పీజీ సబ్సిడీ చెల్లింపులు కూడా చేయలేదు. దీంతో రూ.50,000 కోట్లను ఇవ్వాలని అవి కోరగా, ప్రభుత్వం రూ.30,000 కోట్లను కేటాయించింది. చదవండి: ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు! -
దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశ ఇంధన చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. తాజాగా ఏవియేషన్ గ్యాస్ (ఏవీ గ్యాస్) ఎగుమతులు ప్రారంభించింది. 80 బ్యారెళ్ల తొలి కన్సైన్మెంట్ను (ఒక్కో బ్యారెల్ 16 కిలోలీటర్లు) జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ నుంచి పపువా న్యూ గినియాకు పంపినట్లు సంస్థ తెలిపింది. నికరంగా ఇంధనాలను దిగుమతి చేసుకునే భారత్ .. ఇలా ఏవీ గ్యాస్‌ను ఎగుమతి చేయడం ఇదే ప్రథమం. దీనితో అంతర్జాతీయంగా 2.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న ఏవీ గ్యాస్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు సంస్థ తెలిపింది. మానవరహిత ఏరియల్ వాహనాలు (యూఏవీ), ఫ్లయింగ్ స్కూల్స్ నడిపే చిన్న విమానాలు మొదలైన వాటిల్లో ఏవీ గ్యాస్‌ను ఉపయోగిస్తారు. పెద్ద వాణిజ్య విమానాల్లో ఉపయోగించే ఇంధనాన్ని ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)గా వ్యవహరిస్తారు. ఏవీ గ్యాస్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయడం వల్ల విదేశీ మారకం ఆదా కావడంతో పాటు ఔత్సాహిక పైలట్లకు ఫ్లయింగ్ స్కూల్స్‌లో శిక్షణ వ్యయభారం కూడా తగ్గుతుందని ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య చెప్పారు. అలాగే రక్షణ బలగాలు ఉపయోగించే యూఏవీల నిర్వహణ వ్యయాలు కూడా భారీగా తగ్గగలవని పేర్కొన్నారు. దీన్ని దేశీయంగా ఐవోసీ మాత్రమే తయారు చేస్తోంది. గుజరాత్‌లోని వడోదరలో గత సెప్టెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ఈ ప్లాంటు సామర్థ్యం 5,000 టన్నులుగా ఉంది. చదవండి: ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: 7.1 మిలియన్ల వ్యూస్‌తో మహిళ వైరల్ స్టోరీ -
ఐవోసీ పెట్రోల్ బంకులకు జియో సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) తమ పెట్రోల్ బంకుల అనుసంధానం కోసం రిలయన్స్ జియో మేనేజ్డ్ నెట్వర్క్ సర్వీసులను వినియోగించుకోనుంది. వచ్చే అయిదేళ్లలో 7,200 రిటైల్ అవుట్‌లెట్స్‌లో జియో ఇన్ఫోకామ్‌లో భాగమైన జియో బిజినెస్ సంస్థ తమ ఎస్డీ–డబ్ల్యూఏఎన్ (సాఫ్ట్వేర్ డిఫైన్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్)ను ఏర్పాటు చేయనుంది. ఐవోసీకి ఉన్న మొత్తం బంకుల్లో ఇది అయిదో వంతు. పేమెంట్ ప్రాసెసింగ్, రోజువారీ ధరల అప్డేషన్, రిమోట్ డెస్క్‌టాప్ ప్రోటోకాల్ (ఆర్డీపీ)సాఫ్ట్వేర్, 24 గంటల పాటు సపోర్ట్ మొదలైనవి ఈ సర్వీసులో భాగంగా ఉంటాయని ఐవోసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే 2,000 పైచిలుకు రిటైల్ అవుట్‌లెట్స్‌ను ఎస్డీ–డబ్ల్యూఎన్ సెటప్‌లోకి చేర్చినట్లు రిలయన్స్ జియో హెడ్ (ఎంటర్ప్రైజ్) ప్రతీక్ తెలిపారు. -
ఆట మారుతుందా?
బరిలో ఆట కన్నా బాసు హోదాలో సీటు ముఖ్యమని పేరుబడ్డ మన క్రీడాసంస్థల్లో మార్పు వస్తోందంటే అంతకన్నా ఇంకేం కావాలి! ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడోత్సవాల లాంటి అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించే అథ్లెట్లను ఎంపిక చేసే ప్రతిష్ఠా త్మక క్రీడాసంఘానికి క్రీడా నిపుణులే సారథ్యం వహిస్తున్నారంటే సంతోషమేగా! ఎప్పుడో 95 ఏళ్ళ క్రితం ఏర్పాటైన పేరున్న క్రీడాసంఘం ‘ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్’ (ఐఓఏ)కు తొలి సారిగా ఓ మహిళా క్రీడాకారిణి పగ్గాలు చేపట్టనుండడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గతంలో పలు వివాదాలకు గురైన ఐఓఏకు డిసెంబర్ 10న ఎన్నికలు. నామినేషన్ల తుది గడువు ఆదివారం ముగిసేసరికి, ప్రసిద్ధ మాజీ అథ్లెట్ పీటీ ఉష ఒక్కరే అధ్యక్ష పదవికి బరిలో ఉండడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈసారి ఐఓఏ కార్యవర్గంలో ఈ పరుగుల రాణితో పాటు ప్రసిద్ధ ఆటగాళ్ళ ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. భారత క్రీడాంగణంలో ఇది నూతన ఉషోదయం అనిపిస్తోంది. అవినీతి, ఆశ్రితపక్షపాతం, రాజకీయ పార్టీలకు ఆలవాలంగా మన దేశంలోని క్రీడాసమాఖ్యలు అపకీర్తిని సంపాదించుకున్నాయి. ఆ కుళ్ళు కంపుతో, అందరూ ప్రక్షాళనకు ఎదురుచూస్తున్న వేళ ఐఓఏకు తొలిసారిగా ఒక మహిళ, ఒక ఒలింపిక్ ప్లేయర్, ఒక అంతర్జాతీయ పతక విజేత పగ్గాలు చేపట్టడం నిజంగానే చరిత్ర. వాస్తవానికి, పాలనాపరమైన అంశాలను తక్షణం పరిష్కరించుకోవా లనీ, లేదంటే సస్పెన్షన్ వేటు తప్పదనీ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) సెప్టెంబర్‌లోనే ఐఓఏకు తుది హెచ్చరిక చేసింది. డిసెంబర్ లోగా ఎన్నికలు జరపాలని గడువు పెట్టింది. గతంలో పదేళ్ళ క్రితం ఐఓసీ ఇలాగే సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. తాజా హెచ్చరికల పర్యవసానమే ఈ ఎన్నికలు. కొత్తగా కనిపిస్తున్న మార్పులు. ఆసియా క్రీడోత్సవాల్లో నాలుగుసార్లు ఛాంపియన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలైన 58 ఏళ్ళ ఉషకు ఇప్పుడు ఈ కిరీటం దక్కడం ముదావహం. ఈసారి ఐఓఏ కార్యవర్గ (ఈసీ) ఎన్నికల నామినేషన్లలో ఆసక్తికరమైన అంశాలేమిటంటే – గడచిన ఈసీలో ఉన్నవారెవరూ ఈసారి నామినేషన్ వేయలేదు. అలాగే, ఈసీలో సగం మందికి పైగా క్రీడాకారులున్నారు. మొత్తం 15 మంది సభ్యుల ప్యానెల్లో పీటీ ఉష కాక లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతక విజేత – షూటర్ గగన్ నారంగ్ (ఉపాధ్యక్షుడు) సహా మరో అరడజను మంది ఆటగాళ్ళకు చోటు దక్కింది. మల్లయోధుడు యోగేశ్వర్ దత్, విలువిద్యా నిపుణురాలు డోలా బెనర్జీ, అథ్లెట్ల నుంచి బాక్సింగ్ రాణి మేరీ కోమ్, అంతర్జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ తాజా ప్యానెల్లో ఉండడం విశేషం. డిసెంబర్ 10న ఎన్నికలతో కార్యవర్గం తుదిరూపు తేలనుంది. స్వయంగా క్రీడాకారులూ, ఆటల్లో నిపుణులూ ఈసారి ఐఓఏ కార్యవర్గానికి అభ్యర్థులు కావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. రేపు ఎన్నికైన తర్వాత వారి ఆటలో నైపుణ్యం, అనుభవం భారత క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పనికొస్తాయి. అనేక దశాబ్దాలుగా ఏదో ఒక పదవిలో కూర్చొని సంస్థను ఆడిస్తున్న బడాబాబులకూ, 70 ఏళ్ళు దాటిన వృద్ధ జంబూకాలకూ ఐఓఏ రాజ్యాంగంలో సవరణల పుణ్యమా అని ఈసారి కార్యవర్గంలో చోటు లేకుండా పోయింది. చివరకు సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అండగా నిలిచిన వర్గానికి సైతం బరిలో నిలిచిన కొత్త ఈసీ ప్యానెల్లో స్థానం దక్కకపోవడం విశేషమే. నిజానికి, ఆటల విషయంలో నిర్ణయాత్మకమైన క్రీడా సంఘాల్లో అథ్లెట్లకు ప్రధానంగా స్థానం కల్పించాలని కోర్టులు చిరకాలంగా చెబుతున్నాయి. జాతీయ క్రీడా నియమావళి, ఐఓసీ నియమా వళి సైతం సంఘాల నిర్వహణలో ఆటగాళ్ళకే పెద్దపీట వేయాలని చెబుతున్నాయి. దేశంలోని క్రీడా సంఘాలకు పెద్ద తలకాయ లాంటి ఐఓసీలో ఇప్పటి దాకా అలాంటి ప్రయత్నాలు జరిగిన దాఖలాలు లేవు. సుప్రీమ్ కోర్ట్ మాజీ జడ్జి ఎల్. నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఈసారి ఐఓసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక సంఘానికి ఆయన కొత్త రాజ్యాంగం సిద్ధం చేశారు. ఇక, ఈ సంఘంలోని మొత్తం 77 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజ్‌లో దాదాపు 25 శాతం మాజీ అథ్లెట్లే. వారిలోనూ పురుషుల (38) సంఖ్య కన్నా స్త్రీల (39) సంఖ్య ఎక్కువ కావడం విశేషం. అందివచ్చిన అవకాశాన్ని పరుగుల రాణి ఉష, బృందం ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారో? రానున్న రోజుల్లో ఐఓఏ రోజువారీ నిర్వహణలో వీరందరి మాటా మరింతగా చెల్లుబాటు కానుంది. అయితే, అధికారంతో పాటు అపారమైన బాధ్యతా వీరి మీద ఉంది. అథ్లెట్లకు అండగా నిలుస్తూ, దేశంలో క్రీడాసంస్కృతిని పెంచి పోషించాల్సిందీ వారే. అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో తలమునకలైన దేశ అత్యున్నత క్రీడాసంఘంలో అది అనుకున్నంత సులభం కాదు. విభిన్న వర్గాలుగా చీలి, వివాదాల్లో చిక్కుకొన్న వారసత్వం ఐఓఏది. అలాగే దేశంలో ఇతర జాతీయ క్రీడా సమాఖ్యలు, పాత ఐఓఏ సభ్యులు, కొత్త రాజ్యాంగంలో ఓటింగ్ హక్కులు కోల్పోయిన రాష్ట్ర శాఖలతో తలనొప్పి సరేసరి. వీటన్నిటినీ దాటుకొని రావాలి. అనేక ఆటలతో కూడిన ప్రధాన క్రీడోత్సవాలకు ఎంట్రీలు పంపే పోస్టాఫీస్‌లా తయారైన సంఘాన్ని గాడినపెట్టాలి. మరో ఏణ్ణర్ధంలో జరగనున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌కు భారత ఆటగాళ్ళను సిద్ధం చేయాలి. ఉష అండ్ టీమ్ ముందున్న పెను సవాలు. కేంద్రం, క్రీడాశాఖ అండదండలతో ఈ మాజీ ఆటగాళ్ళు తమ క్రీడా జీవితంలో లాగానే ఇక్కడా అవరోధాలను అధిగమించి, అద్భుతాలు చేస్తారా? -
చరిత్రలో తొలిసారి ప్రభుత్వ చమురు కంపెనీలకు వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఉమ్మడిగా రూ. 2,749 కోట్ల నికర నష్టాలు ప్రకటించాయి. అయితే తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఇవి మరింత అధికమై రూ. 21,201 కోట్లకు చేరాయి. ఇందుకు పెట్రోల్, డీజిల్ తదితర ప్రొడక్టులను తయారీ వ్యయాలకంటే తక్కువ ధరలో విక్రయించడం ప్రభావం చూపింది. అయితే క్యూ2లో ప్రభుత్వం ఎల్పీజీ విక్రయాలపై వీటికి ఉమ్మడిగా రూ. 22,000 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది. దీంతో క్యూ1(ఏప్రిల్–జూన్)తో పోలిస్తే క్యూ2లో చమురు పీఎస్‌యూల నష్టాలు పరిమితమయ్యాయి. వెరసి చమురు పీఎస్‌యూల చరిత్రలో తొలిసారి వరుసగా రెండు త్రైమాసికాలలో నికర నష్టాలు ప్రకటించిన రికార్డు నమోదైంది. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) మెరుగుపడినప్పటికీ 7 నెలలుగా ధరలను సవరించకపోవడంతో నష్టాలు వాటిల్లినట్లు ప్రభుత్వ దిగ్గజాలు పేర్కొన్నాయి. కాగా.. క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,197 కోట్ల నికర నష్టాన్ని హెచ్‌పీసీఎల్ ప్రకటించింది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,263 కోట్లు, ఐవోసీ రూ. 1,995 కోట్లు చొప్పున నష్టాలు నమోదు చేయడం గమనార్హం! ఎల్పీజీ సబ్సిడీ ఇలా ప్రభుత్వం ప్రకటించిన ఎల్పీజీ విక్రయాల సబ్సిడీని చమురు పీఎస్‌యూలు క్యూ2 ఫలితాలలో పరిగణనలోకి తీసుకున్నాయి. ఐవోసీ అత్యధికంగా రూ. 10,800 కోట్లు అందుకోగా.. హెచ్‌పీసీఎల్‌కు రూ. 5,617 కోట్లు, బీపీసీఎల్‌కు రూ. 5,582 కోట్లు చొప్పున లభించాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు వీలుగా పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టలేదని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. దీంతో ఇంధన రంగ పీఎస్‌యూలకు సబ్సిడీ చెల్లింపుల ద్వారా ఆర్థిక శాఖ నుంచి మద్దతును కోరినట్లు తెలియజేశారు. -
కంపెనీలను మించిన వెంకన్న సంపద
న్యూఢిల్లీ: వడ్డీ కాసులవాడైన తిరుపతి గోవిందుడి సంపద .. ఇంతింతై .. అన్నట్లుగా ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో వ్యాపార దిగ్గజ కంపెనీలను కూడా వెనక్కు నెట్టేస్తోంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన గణాంకాలను బట్టి చూస్తే ఈ విషయంలో ఐటీ సేవల దిగ్గజం విప్రో, ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఓఎన్జీసీ, ఐవోసీ మొదలైనవి కూడా వెంకన్న ముందు దిగదుడుపే. టీటీడీ గణాంకాల ప్రకారం ఆయన సంపద విలువ రూ. 2.5 లక్షల కోట్లు. వీటిలో 10.25 టన్నుల బంగారం డిపాజిట్లు, 2.5 టన్నుల బంగారు ఆభరణాలు, రూ. 16,000 కోట్ల డిపాజిట్లు, దేశవ్యాప్తంగా 960 ప్రాపర్టీలు ఉన్నాయి. తిరుమల బాలాజీ సంపద నికర విలువ .. పలు దేశీ బ్లూ చిప్ కంపెనీల వేల్యుయేషన్ (ప్రస్తుత ట్రేడింగ్ ధరల ప్రకారం) కన్నా అధికం. స్టాక్ ఎక్ఛేంజీలో శుక్రవారం నాటి ముగింపు డేటా బట్టి చూస్తే విప్రో మార్కెట్ క్యాప్ రూ. 2.14 లక్షల కోట్లు కాగా అల్ట్రాటెక్ సిమెంట్‌ది రూ. 1.99 లక్షల కోట్లుగా ఉంది. స్విస్ బహుళజాతి దిగ్గజం నెస్లే భారత విభాగం మార్కెట్ విలువ రూ. 1.96 లక్షల కోట్లు. అటు ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) విలువ కూడా బాలాజీ ట్రస్టు సంపద కన్నా తక్కువే. రెండు డజన్ల కంపెనీలకు మాత్రమే ఇంతకు మించిన మార్కెట్ వేల్యుయేషన్ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 17.53 లక్షల కోట్లు), టీసీఎస్ (రూ. 11.76 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ. 8.34 లక్షల కోట్లు), ఐటీసీ (రూ. 4.38 లక్షల కోట్లు) మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,100 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రకారం బ్యాంకుల్లోని నగదు డిపాజిట్లపై రూ. 668 కోట్లు, హుండీ ఆదాయం రూ. 1,000 కోట్ల వరకూ ఉంటుందని టీటీడీ అంచనా వేసింది. -
నష్టాల్లోనే ఐవోసీ క్యూ2లో రూ. 272 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిరుత్సాహకర ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లోనూ లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. రూ. 272 కోట్లకుపైగా నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,360 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఉత్పత్తి వ్యయాలకంటే తక్కువ ధరల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. ఏప్రిల్–జూన్(క్యూ1)లోనూ కంపెనీ దాదాపు రూ. 1,993 కోట్ల నికర నష్టం ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి వరుసగా రెండో క్వార్టర్లలో నష్టాలు నమోదు చేసిన రికార్డు సొంతం చేసుకుంది. కాగా.. ప్రస్తుత క్యూ2లో మొత్తం ఆదాయం మాత్రం రూ. 1.69 లక్షల కోట్ల నుంచి రూ. 2.28 లక్షల కోట్లకు ఎగసింది. కాగా.. ప్రభుత్వం ఈ నెల 12న వన్‌టైమ్ గ్రాంట్‌కింద మూడు పీఎస్‌యూ ఇంధన దిగ్గజాలకు ఉమ్మడిగా రూ. 22,000 కోట్లు కేటాయించింది. వీటిలో ఐవోసీకి రూ. 10,081 కోట్లు లభించాయి. ఈ సబ్సిడీని తాజా త్రైమాసికంలో పరిగణించినప్పటికీ నష్టాలు ప్రకటించడం గమనార్హం! మార్జిన్లు అప్ క్యూ2లో బ్యారల్‌కు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు 6.57 డాలర్ల నుంచి 25.49 డాలర్లకు ఎగశాయి. ఇన్వెంటరీ ప్రభావాన్ని మినహాయిస్తే 22.19 డాలర్లుగా నమోదయ్యాయి.పెట్రోలియం ప్రొడక్టుల అమ్మకాలు 18.93 మిలియన్ టన్నుల నుంచి 21.56 ఎంటీకి పుంజుకున్నాయి. అయితే ఎగుమతులు 1.24 ఎంటీ నుంచి 0.86 ఎంటీకి తగ్గాయి. ఈ కాలంలో 16.09 ఎంటీ ముడిచమురును శుద్ధి చేసింది. గత క్యూ2లో ఇవి 15.27 ఎంటీ మాత్రమే. -
సవరించని అమ్మకాల ధరలు, ఆయిల్ కంపెనీలకు భారీ షాక్!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. వాటి విక్రయ ధరలను సవరించకుండా నిలిపివేయడం వల్ల ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ లాభాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభావం పడుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ద్రవ్యోల్బణం లక్ష్యిత స్థాయికు మించి పరుగులు తీస్తుండడంతో కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాల మేరకు.. నాలుగు నెలలుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించడం లేదు. కానీ, ఇదే కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పెరిగినందున లాభాలపై ప్రభావం పడుతుందని ఫిచ్ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల క్రెడిట్ మెట్రిక్స్ బలహీనపడతాయని పేర్కొంది. చదవండి👉పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు! అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశాల నేపథ్యంలో 2023–24 నుంచి మెరుగుపడొచ్చని అంచనా వేసింది. సమీప కాలంలోచమురు ధరలు అన్నవి.. ప్రభుత్వ ద్రవ్య అవసరాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వ జోక్యం మరింత కాలంపాటు కొనసాగి, చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాలకు దారితీస్తే వాటి రేటింగ్‌పై ప్రభావం పడొచ్చని తెలిపింది. -
World Biofuel Day: 8 ఏళ్లు.. రూ. 50 వేల కోట్లు..
పానిపట్: పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించడం వల్ల గత 7–8 ఏళ్లలో రూ. 50,000 కోట్ల మేర విదేశీ మారకం ఆదా అయ్యిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రైతులకు ఆ స్థాయిలో లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఐవోసీ పానిపట్‌లో నెలకొల్పిన రెండో తరం ఇథనాల్ ప్లాంటును ప్రపంచ బయో ఇంధన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతికి అంకితం చేసిన మోదీ ఈ విషయాలు తెలిపారు. దాదాపు రూ. 900 కోట్లతో ఏర్పాటైన ఈ ప్లాంటుతో.. వ్యవసాయ క్షేత్రాల్లో గడ్డిదుబ్బును తగులబెట్టే సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం కూడా లభించగలదని అన్నారు. హర్యానా, ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి కూడా ఈ ప్లాంటు దోహదపడగలదని ప్రధాని చెప్పారు. గత 8 ఏళ్లలో ఇథనాల్ ఉత్పత్తి 40 కోట్ల లీటర్ల నుండి 400 కోట్ల లీటర్లకు పెరిగినట్లు వివరించారు. 2023 ఏప్రిల్ నుంచి 20% ఇథనాల్ మిశ్రమం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 20% ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్‌ను ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా సరఫరా చేయనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ పురి తెలిపారు. 2025 నాటికి దేశమంతటా దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇది 10 శాతం స్థాయిలో ఉంటోంది. -
అదే నా కల, ఐఓఏతో చేతులు కలిపిన రిలయన్స్
ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ క్రీడా రంగంలో తనదైన పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ తో చేతులు కలిపింది. రిలయన్స్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్లు సంయుక్తంగా దీర్ఘకాలికా భాగస్వామైనట్లు ప్రకటించాయి. తద్వారా భారతీయ అథ్లెట్లను ప్రోత్సహించడం, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు మద్దతు ఇవ్వడం, ప్రపంచ క్రీడా దేశంగా భారత్‌ను నిలబెట్టేలా లక్ష్యాలను నిర్దేశించింది. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ నీతా అంబానీ మాట్లాడుతూ, “ప్రపంచ క్రీడా రంగంలో భారత దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పడమే మా కల. భవిష్యత్తులో ఒలింపిక్ క్రీడలను భారత్‌లో నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. 2024లో పారిస్ ఒలింపిక్ క్రీడలలో మొట్టమొదటిసారిగా ఇండియా హౌస్‌ని నిర్వహించేందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దేశం యెక్క అపారమైన ప్రతిభను, సామర్థ్యాన్ని, ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇదొక గొప్ప అవకాశమని నీతా అంబానీ కొనియాడారు. -
మోటో వ్లాగర్లకు శుభవార్త..ఐఓసీ అదిరిపోయే బిజినెస్ ఐడియా!
న్యూఢిల్లీ: ఇంధన రిటైలింగ్‌లో పోటీ తీవ్రమవుతుండటంతో ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) కొత్త అవకాశాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హిమాలయాలకు బైక్‌లపై సాహసయాత్రలు చేసే పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బైకర్స్ కేఫ్‌లను ఏర్పాటు చేస్తోంది. సిమ్లాలో తొలి కేఫ్‌ను ప్రారంభించామని, త్వరలో చండీగఢ్–మనాలీ రూట్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తామని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సిమ్లా శివార్లలోని షోగి దగ్గర్లో ఒక పెట్రోల్ బంకులో ఖాళీ స్థలం ఉండటంతో దాన్ని బైకర్స్ కేఫ్‌గా మార్చినట్లు పేర్కొన్నారు. ఇందులో వైఫైతో పాటు బైకర్లు విశ్రాంతి తీసుకునేందుకు, మోటర్‌సైకిళ్లను పార్కింగ్ చేసుకునేందుకు, చిన్నపాటి రిపేర్లు మొదలైన వాటికోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. అలాగే, లిప్ గార్డ్, సన్‌స్క్రీన్ లోషన్, గ్లవ్స్, రెయిన్ కోట్లు, టార్పాలిన్ మొదలైన వాటిని కూడా విక్రయిస్తున్నట్లు అధికారి పేర్కొన్నారు. సాధారణంగా బైకర్ల యాత్రలు ఢిల్లీ నుంచి లడఖ్ వరకూ వివిధ మార్గాల్లో ఏటా జూన్ తొలి వారంలో మొదలై అక్టోబర్ ప్రథమార్ధం వరకూ కొనసాగుతుంటాయి. -
చమురు కంపెనీలకు భారీ నష్టాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు (ఓఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసే అవకాశముంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) కలిపి రూ.10,700 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అంచనా వేసింది. తయారీ వ్యయం కన్నా పెట్రోల్, డీజిల్‌ను తక్కువ రేటుకు విక్రయించాల్సి రావడమే ఇందుకు కారణమని తెలిపింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ మార్కెట్లో ఈ మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 90 శాతం దాకా వాటా ఉంది. ముడిచమురును ఇంధనాలుగా మార్చే రిఫైనరీలు కూడా వీటికి ఉన్నాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో క్రూడాయిల్ రేట్లు భారీగా ఎగియడంతో ఈ సంస్థల రిఫైనింగ్ మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఆయా సంస్థల మార్కెటింగ్ విభాగాలు మాత్రం నష్టాలు మూటగట్టుకున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 12–14 మేర నష్టపోతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. దీంతో రిఫైనింగ్ మార్జిన్లపరంగా వచ్చిన ప్రయోజనం దక్కకుండా పోతోందని వివరించింది. పటిష్టంగా జీఆర్ఎం.. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు (జీఆర్ఎం) పటిష్టంగా బ్యారెల్‌కు 17–18 డాలర్ల స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. అలాగే రికవరీ, తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా అమ్మకాల పరిమాణం కూడా 17–20 శాతం పెరగవచ్చని తెలిపింది. కానీ పెట్రోల్, డీజిల్పరమైన రిటైల్ నష్టాల వల్ల ఓఎంసీలు క్యూ1లో రూ. 10,700 కోట్ల మేర నికర నష్టం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు వివరించింది. గత 2–3 రోజులుగా క్రూడాయిల్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో మార్జిన్లు దిగిరావచ్చని, అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్పరమైన నష్టాలు కూడా కాస్త తగ్గొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు, క్యూ1లో ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ పటిష్టమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేయొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అత్యధికంగా రూ. 24,400 కోట్ల మేర నికర లాభం (77 శాతం వృద్ధి) ప్రకటించవచ్చని వివరించింది. అయితే, ఇంధనాల ఎగుమతులపై జూలై 1 నుంచి అధిక సుంకాల విధింపుతో మిగతా తొమ్మిది నెలల కాలంలో కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపింది. -
ఐవోసి మాస్టర్ ప్లాన్.. అంబానీ, అదానీలకు పోటీగా..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), ఇంజనీరింగ్, మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ, పునరుత్పాదక ఇంధన రంగంలోని రెన్యూ పవర్.. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో గ్రీన్ హైడ్రోజన్ తయారీపై భారీ ప్రణాళికలను ప్రకటించిన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూపునకు ఈ జాయింట్ వెంచర్ గట్టీ పోటీనివ్వనుంది. సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అభివృద్ధికి గాను ఒప్పందంపై ఈ మూడు సంస్థలు సంతకాలు చేశాయి. అలాగే, ఐవోసీ, ఎల్అండ్టీ విడిగా మరో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా అవి గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన ఎలక్ట్రోలైజర్లను తయారు చేయనున్నాయి. ఐవోసీ–ఎల్అండ్టీ–రెన్యూపవర్ ఐవోసీకి చెందిన మధుర, పానిపట్ రిఫైనరీల వద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారిస్తాయని సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో అవి పేర్కొన్నాయి. గ్రీన్ హైడ్రోజన్ తయారీకి అవసరమైన పునరుత్పాదక ఇంధనాన్ని రెన్యూ పవర్ సరఫరా చేసే అవకాశం ఉంది. ‘‘మూడు సంస్థల మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటు వల్ల.. ప్రాజెక్టుల డిజైన్, నిర్మాణంలో ఎల్అండ్టీకి ఉన్న అనుభవం, పెట్రోలియం రిఫైనరీలో ఐవోసీకి ఉన్న అనుభవం, ఇంధన చైన్ పట్ల అవగాహన, పునరుత్పాదక ఇంధనంలో రెన్యూపవర్కు ఉన్న అనుభవం కలసివస్తాయి’’ అని ఈ ప్రకటన తెలియజేసింది. చదవండి: గ్రీన్ ఎనర్జీలో దూసుకుపోతున్న రిలయన్స్.. మరో కీలక నిర్ణయం -
ఒకేరోజు డీజిల్‌పై రూ.75, పెట్రోల్‌పై రూ.50 పెంపు.. బతికేది ఎలా?
గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ - రష్యా మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమరు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో, అనేక దేశాలు తమ దేశాలలో ఇంధన ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా శ్రీలంకలోని చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఎల్ఐఓసీ) నేడు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను భారీగా పెంచింది. ఎల్ఐఓసీ సంస్థ ఒక నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడవసారి. డీజిల్ రిటైల్ ధరను లీటరుకు రూ.75, పెట్రోల్‌పై లీటరుకు రూ.50 పెంచినట్లు ఎల్ఐఓసీ ప్రకటించింది. శ్రీలంక రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా సంస్థ పేర్కొంది. ఈ ధరల పెరుగుదలతో శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర రూ.254, డీజిల్ ధర రూ.214కు లభిస్తుంది. గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభం చిక్కుకోవడంతో ఇంధన ధరలు మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి. శ్రీలంక రూపాయి ఏడు రోజుల వ్యవధిలో యుఎస్ డాలరుతో పోలిస్తే రూ.57 క్షీణించింది. ఆ ప్రభావం ఇప్పుడు నేరుగా చమురు, గ్యాసోలిన్ ఉత్పత్తుల మీద పడింది. దీంతో ఆ చమురు, గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. "రష్యాను ఏకాకిని చేయడానికి, అమెరికాతో సహ ఇతర పాశ్చాత్య దేశాలు మాస్కో మీద అనేక ఆంక్షలు విధించడం వల్ల చమురు & గ్యాస్ ధరలు పెరుగుదలకు కారణం" అని ఎల్ఐఓసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా తెలిపారు. శ్రీలంక ప్రభుత్వం నుంచి ఎల్ఐఓసీ ఎటువంటి సబ్సిడీని అందుకోదని.. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశంలో ధరలు పెంచాల్సి వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో చమురు, గ్యాస్ ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదు అని మనోజ్ గుప్తా పేర్కొన్నారు. ధరలను భారీగా పెంచిన సంస్థకు నష్టాలు తప్పడం లేదు గుప్తా అన్నారు. ఎల్ఐఓసీకి ప్రధాన పోటీదారుడు సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇప్పటివరకు ఎలాంటి ధరల పెంపును ప్రకటించకపోవడం విశేషం. (చదవండి: రైల్వే ప్రయాణీకులకు అదిరిపోయే శుభవార్త..!) -
రష్యాకు భారీ షాక్.. ఫుట్‌బాల్ ప్రపంచకప్ నుంచి బహిష్కరణ
ఉక్రెయిన్ పై సైనిక దాడులు చేస్తున్న రష్యాకు దెబ్బ మీద దెబ్బ తగలుతుంది. ఇప్పటికే అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. అదే విధంగా రష్యా దుశ్చర్యకు గురి అవుతున్న ఉక్రెయిన్‌కు క్రీడాలోకం కూడా మద్దతుగా నిలుస్తోంది. తాజాగా ఈ ఏడాది జరగనున్న ఫిఫా ప్రపంచకప్ నుంచి రష్యాపై ఫిఫా బహిష్కరణ వేటు వేసింది. ఫిఫా ప్రపంచకప్-2022తో పాటు అన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్ఏ సంయుక్త సమావేశంలో వెల్లడించాయి. ఈ ఏడాది చివర్లో ఖతార్‌లో జరిగే ప్రపంచ కప్ కోసం రష్యా పురుషుల జట్టు మార్చిలో క్వాలిఫైయింగ్ ప్లే-ఆఫ్‌లలో పోలాండ్‌తో ఆడాల్సి ఉంది. పోలాండ్ ఫుట్‌బాల్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో రష్యాతో ఆడేది లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా ఇంగ్లాండ్‌లో జూలైలో జరగనున్న యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో రష్యా మహిళల జట్టు ఆడనుంది. ఫుట్‌బాల్ జట్లపై ఫిఫా, యూఈఎఫ్ఏ నిషేధం విధించడం రష్యాకు పెద్ద ఎదరుదెబ్బ తగిలినట్లైంది. అదే విధంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కూడా రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. చదవండి: రష్యా, బెలారస్లను వెలివేయండి: ఐఓసీ -
ఈ సామీప్యం వెనుక మతలబు ఏంటి?
చైనాపై తాను పూర్తిగా ఆధారపడటం ద్వారా అంతర్జాతీయంగా ఏకాంతవాసం నుంచి బయటపడటం సాధ్యపడదని పాక్ అర్థం చేసుకుంటోంది. దీనివల్లే పాక్ స్వరంలో గణనీయ మార్పు రావడమే కాకుండా భారత్‌తో తన సంబంధాలు కూడా కాస్త మృదురూపం తీసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ఒంటరితనంలో చిక్కుకున్న పాకిస్తాన్ అదే సమయంలో చైనాకు మరింత దగ్గర కావడాన్ని అటు అమెరికా కానీ ఇటు భారత్ కానీ కోరుకోవడం లేదు. హిందూమహాసముద్రంలో, దక్షిణ చైనా సముద్రంలో, పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాధాన్యతపై భారత్ వ్యూహాత్మక అంచనా, అంతర్జాతీ యంగా పాక్ ఒంటరి కావడం అనేవే భారత్, పాక్ మధ్య ఇటీవలి పరిణామాలకు దోహదపడ్డాయని చెప్పాలి. వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల పొడవునా కాల్పుల విరమణకు కట్టుబడటం ద్వారా శాంతిని నెలకొల్పవలసిన అవసరాన్ని నొక్కి చెబుతూ భారత్, పాకిస్తాన్‌లు ఫిబ్రవరి 25న సంయుక్త ప్రకటన చేశాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు తూట్లు పడి ఎంతో కాలం కాలేదు. అయినప్పటికీ ఈ అసాధారణ పరిణామానికి దారితీసిన కారణాలను అంచనా వేయడానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకించి పుల్వామా దాడులు, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత్, పాక్ దేశాల మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిన నేపథ్యంలో ఈ సరికొత్త పరిణామాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా పాకిస్తాన్ అంతర్జాతీయ ఏకాంతవాసాన్ని ఎదుర్కొంటూ వస్తోంది. మధ్యప్రాచ్యంలో పాకిస్తాన్ ప్రాధాన్యత మసకబారిపోతోంది. చారిత్రకంగా చూస్తే యూఏఈ, సౌదీ అరేబియా దేశాలతో పాకిస్తాన్ సన్నిహిత సంబంధాలు కలిగిఉండేది. పైగా కశ్మీర్ సమస్యపై ఈ రెండు దేశాలను పాక్ బాగా ఉపయోగించుకునేది. ఎమెన్తో సౌదీ గొడవలకు సంబంధించి తటస్థంగా ఉండాలని పాకిస్తాన్ నిర్ణయించుకోవడంతో సౌదీ– పాక్ బంధాలు కాస్త గడ్డకట్టుకుపోయాయి. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో భారత్ ఆర్థిక, జనాభాపరమైన ప్రభావం ఎక్కువ కావడంతో సౌదీ అరేబియా, యూఏ ఈలతో భారత్ సంబంధం మెరుగుపడుతూ వచ్చింది. దీంతో సౌదీ అరేబియా, యూఏఈలు కశ్మీర్ సమస్యపై తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఇది పాకిస్తాన్‌ని బాగా ఇబ్బందిపెట్టింది. అందుచేత, 2020 నవంబర్‌లో ఓఐసీ (ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్) దేశాల సమితిలో కశ్మీర్ అంశాన్ని కీలక ఎజెండాగా పాకిస్తాన్ ప్రతిపాదించినప్పుడు యూఏఈ, సౌదీ రెండు దేశాలూ దాన్ని వ్యతిరేకించాయి. దీంతో కశ్మీర్ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి సౌదీని విమర్శించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింతగా బీటలు వారిపోయాయి. పైగా తాను గతంలో పాకిస్తాన్‌కు ఇచ్చిన 3 బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించేయాలని సౌదీ నిగ్గదీసింది. పైగా మధ్యప్రాచ్య రాజకీయాల్లో కీలక బిందువుగా మారుతున్న ఇజ్రాయెల్‌ను గుర్తించడానికి తిరస్కరించినందున పాకిస్తాన్ ఈ ప్రాంతంలో తన ప్రాముఖ్యతను కోల్పోతోంది. ఇకపోతే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై పశ్చిమ దేశాలు ఒత్తిడి చేస్తూనే వస్తున్నాయి. అందుకే ఫిబ్రవరి 25న కూడా ఆర్థిక కార్యాచరణపై టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో ఉంచేసింది. అంటే ఉగ్రవాదులకు నిధులు ఇవ్వడాన్ని నిలిపివేయడంలో పాకిస్తాన్ విఫలమైతే తీవ్రమైన ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని దీనర్థం. పైగా భారత్‌తో అమెరికా సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకుంది. చైనాకు వ్యతిరేకంగా భౌగోళిక రాజకీయపరంగా, ఆర్థికంగా భారత్ కీలకస్థానంలో ఉండటం, ఉగ్రవాదులను స్పాన్సర్ చేయడాన్ని అరికట్టడంలో పాకిస్తాన్ విఫలం చెందడం దీనికి కారణాలు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పనిచేసిన ప్రారంభ సంవత్సరాల్లో ఈ ధోరణి మరింత వేగం పుంజుకుంది. దీంతో అమెరికాకు పాకిస్తాన్ మరింత దూరం జరగడం, చైనాపై పాక్ ఆధారపడటం పెరగడం మొదలైంది. ఇక దక్షిణాసియాలో కూడా పాక్ మిత్రదేశాలైన శ్రీలంక, నేపాల్, మాల్దీవులు పాక్‌తో సంబంధాలపై భారత్ ఆందోళన పట్ల మరింత జాగ్రత్తతో ఉంటున్నాయి. ఫలితంగా ఇటీవలే శ్రీలంక పర్యటనకు వచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ షెడ్యూల్ ప్రకారం పార్లమెంటును ఉద్దేశించి చేయవలసిన ప్రసంగాన్ని శ్రీలంక రద్దు చేసింది. అదేసమయంలో భారత్‌ను అవమానపర్చే క్యాంపెయిన్‌ను పాక్ పునరాలోచించుకోవాలని పాకిస్తాన్‌ను కోరుతూనే కశ్మీర్‌పై భారత్ విధానాన్ని మాల్దీవులు బలపర్చడం విశేషం. మరోవైపు భూటాన్, బంగ్లాదేశ్, అప్గానిస్తాన్ దేశాలు కూడా పాకిస్తాన్‌పై సదభిప్రాయం కలిగి లేవు. భారత్ ప్రయోజనాలు, దాని భద్రతాపరమైన సమస్యలకు ప్రాధాన్యమిస్తూ భూటాన్ తన విదేశీ విధానాన్ని రూపొందించుకుంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఆమెకు చెందిన అవామీ లీగ్ పార్టీ భారత్‌తో సంబంధాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాయి. పైగా, అప్గానిస్తాన్ కూడా ఉగ్రవాదాన్ని, తాలిబన్లను ప్రోత్సహిస్తున్న పాక్‌ను దుయ్యబట్టడం కొనసాగిస్తూనే ఉంది. దౌత్యపరమైన ఈ వెనుకంజలతో పాకిస్తాన్ టర్కీ, ఇరాన్, రష్యా, చైనా దేశాలతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ కొత్త సంబంధాలు కూడా పాక్‌ని ఏకాంతం నుంచి బయటపడవేయలేదు. ఇస్లామిక్ ప్రపంచానికి తామే నాయకులమని భావిస్తున్న టర్కీ, ఇరాన్ ఈ క్రమంలో సౌదీ అరేబియా పాత్రను నిరంతరం ప్రశ్నిస్తూ వస్తున్నాయి. అందుచేత ఈ రెండుదేశాలతో పాక్ సన్నిహితంగా మెలి గితే అది సౌదీ, యూఏఈ దేశాలను బాగా ఇబ్బంది పెడుతుంది. మరోవైపున పాకిస్తాన్‌తో వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకుంటున్న రష్యా.. భారత్‌కు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి పాక్‌తో మరీ అంటకాగడంపై ఆలోచిస్తోంది. ఇక స్నేహం ప్రాతిపది కన ఏర్పడిన పాక్–చైనా బంధం ఇప్పుడు పాకిస్తాన్‌కు వేరేమార్గం లేకుండా తప్పనిసరి పరిస్థితిలోకి నెట్టివేసింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఎంత ఎక్కువగా వేరుపడిపోతే అంతే స్థాయిలో అది చైనాపై ఆధారపడటం పెరిగిపోతుంది. అప్పులిచ్చి గుప్పిట్లో పెట్టుకునే చైనా దౌత్యం గురించి పాకిస్తాన్‌కు బాగానే తెలుసు. చైనాపై ఆధారపడటం వల్ల తన భద్రతా విధానాలు ఎంతగా ప్రభావితమవుతున్నాయో పాకిస్తాన్ అర్థం చేసుకుంటోంది. చైనా–పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌లో తన పెట్టుబడుల ప్రాధాన్యతను గుర్తించిన చైనా గిల్గిత్ బాలిస్తాన్ను తన అయిదో ప్రావిన్స్‌గా మార్చాలని పాక్‌పై ఒత్తిడి చేస్తోంది. దీంతో చైనాపై తాను పూర్తిగా ఆధారపడటం, అలా చేయడం ద్వారా అంతర్జాతీయంగా ఏకాంతవాసం నుంచి బయటపడటం సాధ్యపడదని పాక్ అర్థం చేసుకుంటోంది. అందుకనే తన దౌత్యపరమైన, వ్యూహాత్మక సమాన స్థాయిని వేగవంతం చేయడంపై పాక్ మల్ల గుల్లాలు పడుతోంది. దీనిఫలితంగానే ట్రంప్ పాలన మలిదశలో యూఎస్–తాలిబన్ శాంతి చర్చలు ఫలప్రదం కావడంలో పాక్ ముఖ్యమైన పాత్రను పోషించింది. దీనివల్ల దానికి రెండు ఫలితాలు సిద్ధిం చాయి. యూఏఈతో కోల్పోయిన స్థాయిని అది తిరిగి పెంచుకుంది. ఇక రెండోది ఏమిటంటే అప్గానిస్తాన్‌లో అంతర్గత పరిణామాల ప్రభావంతో పాశ్చాత్య దేశాలు అక్కడినుంచి త్వరగా వెనక్కు తిరగాలని భావిస్తున్నాయి. రెండోది ఏమిటంటే, తాలిబాన్‌ను బలోపేతం చేయడం ద్వారా అప్గానిస్తాన్‌లో తనపట్ల వ్యతిరేకత ప్రదర్శించని ప్రభుత్వాన్ని ఏర్పర్చాలని పాక్ కోరుకుంటోంది. అలాగైనా అంతర్జాతీయంగా తనకెదురవుతున్న ఒంటరితనానికి దూరం కావచ్చని పాక్ భావన. దీనివల్లే పాక్ స్వరంలో గణనీయ మార్పు రావడమే కాకుండా భారత్‌తో ఇటీవలి పరిణామాలు కూడా కాస్త మృదురూపం తీసుకుం టున్నాయి. ఈ వ్యూహాత్మక అంచనా కారణంగానే భారత్ కూడా తన స్వరంలో కాస్త మార్పు తీసుకొస్తోంది. దక్షిణాసియా ప్రాంతంలో చైనా పెరుగుతున్న ప్రభావం, ఇటీవలి సరిహద్దు ఘర్షణల కారణంగా పాకిస్తాన్‌తో సంబంధాల సాధారణీకరణ కోసం భారత్ కూడా ప్రయత్నించాల్సి వస్తోంది. అంతిమంగా అంతర్జాతీయంగా ఒంటరితనంలో చిక్కుకున్న పాకిస్తాన్ అదే సమయంలో చైనాకు మరింత దగ్గర కావడాన్ని అటు అమెరికా కానీ ఇటు భారత్ కానీ కోరుకోవడం లేదు. హిందూమహాసముద్రంలో, దక్షిణ చైనా సముద్రంలో, పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాధాన్యత గురించి భారత్ వ్యూహాత్మక అంచనా, అంతర్జాతీయంగా పాక్ ఒంటరి కావడం అనేవే ఈ రెండు దేశాల మధ్య ఇటీవలి పరిణామాలకు దోహదపడ్డాయని చెప్పాలి. ఆదిత్య గౌడర శివమూర్తి వ్యాసకర్త విదేశీ వ్యవహారాల నిపుణులు (‘ది స్టేట్స్‌మన్’ సౌజన్యంతో)