యోగేశ్వర్ కు కాంస్యమా.. రజతమా?
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్ పతకంపై స్పష్టత కరువైంది. 2012 లండన్ ఒలింపిక్స్ లో యోగేశ్వర్ కాంస్య పతకం నెగ్గగా.. తాజాగా ఆ పతకంపై కొన్ని పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రష్యాకు చెందిన రెజ్లర్ బేసిక్ కుదుకోవ్ శాంపిల్స్ పాజిటీవ్ గా తేలడంతో యోగేశ్వర్ పతకం కాంస్యం నుంచి రజతానికి అప్ గ్రేడ్ అవుతుందని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) మంగళవారం నాడు బాంబు పేల్చింది.
ఓ వైపు దేశమంతా యోగేశ్వర్ కు రజత పతకం వస్తుందని ఆనందంలో మునిగి తేలుతుండగా, సంబంధిత క్రీడా సమాఖ్య మాత్రం విచిత్రంగా వ్యవహరిస్తోంది. అసలు తమకు లండన్ ఒలింపిక్స్ లో యోగేశ్వర్ పతకానికి సంబంధించి జరుగుతున్న తాజా పరిణామాలపై తమ వద్ద ఎలాంటి సమాచార లేదని డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. లండన్ ఒలింపిక్స్ లో కుదుకోవ్ చేతిలోనే యోగేశ్వర్ ఓటమిపాలు కాగా, ఆ తర్వాత అతడు ఫైనల్ కు వెళ్లడంతో యోగేశ్వర్ దశ తిరిగి కాంస్యం సాధించాడు.
ఒలింపిక్స్ పతకాలపై దర్యాప్తు చేయడం, విచారణ చేసి ఆటగాళ్ల పతకాలపై నిర్ణయం తీసుకునే అధికారం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ)కి ఉంది. అయితే ఐఓసీ మాత్రం కుదుకోవ్ విషయాన్ని తేలికగా తీసుకుని దర్యాప్తును ఆపివేయాలని యోచిస్తుండటం గమనార్హం. డోపీగా తేలిన రష్యా రెజ్లర్ కుదుకోవ్ 2013లో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు.