!['నాకు రజతం ఖాయమైంది'](/styles/webp/s3/article_images/2017/09/4/81472543549_625x300.jpg.webp?itok=ybXaMY54)
'నాకు రజతం ఖాయమైంది'
లండన్: లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకంతో మెరిసిన భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్.. ఇప్పడు రజత పతక విజేతగా మారాడు. ఈ విషయాన్ని యోగేశ్వర్ తాజాగా ధృవీకరించాడు. తనకు రజత పతకం ఖాయమైందంటూ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. 2012 ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన రష్యా బాక్సర్ బెసిక్ కుదుఖోవ్ శాంపిల్స్ కు తాజాగా చేసిన పరీక్షల్లో అతను డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది. దీంతో ఆ ఒలింపిక్స్లో రజతం సాధించిన కుదుఖోవ్ పతకాన్నివెనక్కు తీసుకోనున్నారు.
లండన్ ఒలింపిక్స్ 60 కేజీల ఫ్రీస్టయిల్లో భాగంగా కాంస్య పతకం కోసం జరిగిన పోరులో యోగేశ్వర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియకు చెందిన రి జాంగ్ యాంగ్పై గెలిచి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు ప్రి కార్టర్ ఫైనల్లో రష్యా బాక్సర్ బెసిక్ కుదుఖోవ్ చేతిలో యోగేశ్వర్ ఓటమి పాలయ్యాడు. కాగా, కుదుకోవ్ ఫైనల్ కు చేరడంతో యోగేశ్వర్ రెప్ చేజ్ ద్వారా కాంస్య పతకం సాధించాడు. అయితే ఇప్పుడు కుదుఖోవ్ శాంపిల్స్ పాజిటివ్ రావడంతో అతని పతకం యోగేశ్వర్ ఖాతాలో చేరింది.
కొంతమంది రియో విన్నర్లకు తిరిగి పరీక్షలు నిర్వహించడానికి రష్యా డోపింగ్ ఉదంతమే ప్రధాన కారణం. గత కొంతకాలంగా రష్యా అథ్లెట్లు భారీ స్థాయిలో డోపింగ్లో పట్టుబడి యావత్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపారు. దీంతో అత్యధిక శాతం రష్యా క్రీడాకారులు రియో ఒలింపిక్స్లో పాల్గొనలేకపోయారు. ఈ నేపథ్యంలో గత ఒలింపిక్స్ల్లో పాల్గొన్న క్రీడాకారుల శాంపిల్స్ను కూడా భద్ర పరిచి, ప్రస్తుతం అత్యాధునికి టెక్నాలజీ సాయంతో ఆ శాంపిల్స్ను పరీక్షిస్తున్నారు. కాగా 2013లో జరిగిన రోడ్డుప్రమాదంలో కుదుస్కోవ్ మరణించిన విషయం తెలిసిందే.