London Olympics
-
పతకాల పందెం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా..
మొనాకో: లండన్ ఒలింపిక్స్ (2012) జరిగి ఓ పుష్కర కాలం పూర్తయ్యింది. ఈలోపు రియో (2016), టోక్యో (2020), పారిస్ (2024) ఒలింపిక్స్ క్రీడలు కూడా ముగిశాయి. అయితే లండన్ విశ్వక్రీడల్లో మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో పతకాల పందెం ఇంకా.. ఇంకా కొనసాగుతోంది.ఈసారి డోపీగా తేలిన రష్యా రన్నర్ తాత్యానా తొమషోవా పతకం (కాంస్యం) కోల్పోతే, అమెరికా రన్నర్ షానన్ రోబెరి అందుకోనుంది. ఈ ఈవెంట్లో మూడు రంగులు (స్వర్ణం, రజతం, కాంస్యం) మారడం మరో విశేషం. అలా ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పుడిదీ నిలిచిపోనుంది. 12 ఏళ్ల క్రితం టర్కీ అథ్లెట్లు అస్లి కాకిర్ అల్ప్టెకిన్, గమ్జే బులుట్ వరుసగా స్వర్ణం, రజతం గెలుపొందారు.కానీ వీరిద్దరు ఇదివరకే డోపీలుగా తేలి అనర్హత వేటుకు గురయ్యారు. ఈ క్రమంలో ఇథియోపియాలో జన్మించిన బహ్రైనీ మరియం యూసఫ్ జమాల్‌కు గోల్డ్(మూడో స్థానం), ఇథియోపియాకే చెందిన అబెబా అరెగవీకి సిల్వర్(ఐదో స్థానం) మెడల్ దక్కాయి.అదేవిధంగా.. ఐదో స్థానంలో ఉన్న తొమషొవాకు కాంస్యం లభించింది. అయితే, ఇప్పుడు ఆమె కూడా డోపీ కావడంతో ఆరో స్థానంలో ఉన్న అమెరికన్ రోబెరి కాంస్య పతకం అందుకోనుంది. టర్కీ, రష్యా అథ్లెట్లపై ప్రపంచ అథ్లెటిక్స్ నిషేధం విధించింది. మారిన పతకాలను ప్రపంచ చాంపియన్‌షిప్ లేదంటే భవిష్యత్‌లో జరిగే ఒలింపిక్స్‌లో ప్రదానం చేస్తారు. క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీసాక్షి, హైదరాబాద్: రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ శుభారంభం చేశాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ 6–4, 6–3తో డానియల్ మసూర్–అలెక్సీ వటుటిన్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బాలాజీ జోడీ ఏడు ఏస్‌లు సంధించింది. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌లో నాలుగుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకొని... ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. -
రష్యా రిలే జట్టు ఒలింపిక్ రజతం వెనక్కి
మాస్కో: ఇప్పటికే డోపింగ్ ఉచ్చులో పీకల్లోతు మునిగిన రష్యాకు మరో చేదు ఫలితం ఎదురైంది. లండన్ ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లు నెగ్గిన మహిళల 4X400 మీటర్ల రిలే రజతాన్ని నిర్వాహకులు వెనక్కి తీసుకోనున్నారు. ఈ రిలే ఈవెంట్లో మిగతా ముగ్గురితో కలిసి పోటీపడిన రష్యా అథ్లెట్ అంటోనినా క్రివోషప్క నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో రజతం వెనక్కి తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది. దీంతో కాంస్యం నెగ్గిన జమైకాకు రజతం, నాలుగో స్థానంలో ఉన్న ఉక్రెయిన్‌కు కాంస్యం ప్రకటించింది. ఇందులో అమెరికా స్వర్ణం గెలిచింది. లండన్ ఈవెంట్లో పోటీపడిన అథ్లెట్ల రక్త, మూత్ర నమూనాలను తిరిగి పరీక్షించగా కొందరి క్రీడాకారులవి పాజిటివ్ రిపోర్ట్లు వస్తున్నాయి. -
యోగేశ్వర్ కు కాంస్యమా.. రజతమా?
న్యూఢిల్లీ: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ లండన్ ఒలింపిక్స్ పతకంపై స్పష్టత కరువైంది. 2012 లండన్ ఒలింపిక్స్ లో యోగేశ్వర్ కాంస్య పతకం నెగ్గగా.. తాజాగా ఆ పతకంపై కొన్ని పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రష్యాకు చెందిన రెజ్లర్ బేసిక్ కుదుకోవ్ శాంపిల్స్ పాజిటీవ్ గా తేలడంతో యోగేశ్వర్ పతకం కాంస్యం నుంచి రజతానికి అప్ గ్రేడ్ అవుతుందని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయంపై భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) మంగళవారం నాడు బాంబు పేల్చింది. ఓ వైపు దేశమంతా యోగేశ్వర్ కు రజత పతకం వస్తుందని ఆనందంలో మునిగి తేలుతుండగా, సంబంధిత క్రీడా సమాఖ్య మాత్రం విచిత్రంగా వ్యవహరిస్తోంది. అసలు తమకు లండన్ ఒలింపిక్స్ లో యోగేశ్వర్ పతకానికి సంబంధించి జరుగుతున్న తాజా పరిణామాలపై తమ వద్ద ఎలాంటి సమాచార లేదని డబ్ల్యూఎఫ్ఐ తెలిపింది. లండన్ ఒలింపిక్స్ లో కుదుకోవ్ చేతిలోనే యోగేశ్వర్ ఓటమిపాలు కాగా, ఆ తర్వాత అతడు ఫైనల్ కు వెళ్లడంతో యోగేశ్వర్ దశ తిరిగి కాంస్యం సాధించాడు. ఒలింపిక్స్ పతకాలపై దర్యాప్తు చేయడం, విచారణ చేసి ఆటగాళ్ల పతకాలపై నిర్ణయం తీసుకునే అధికారం అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ)కి ఉంది. అయితే ఐఓసీ మాత్రం కుదుకోవ్ విషయాన్ని తేలికగా తీసుకుని దర్యాప్తును ఆపివేయాలని యోచిస్తుండటం గమనార్హం. డోపీగా తేలిన రష్యా రెజ్లర్ కుదుకోవ్ 2013లో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. -
అస్గరోవ్ డోపీ కాదు యోగేశ్వర్‌కు రజతమే
న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ సాధించిన కాంస్య పతకం ఏకంగా స్వర్ణం కాబోతుందని ఇటీవల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ గేమ్స్ 60కేజీ ఫ్రీస్టరుుల్ విభాగంలో విజేతగా నిలిచిన టొగ్రుల్ అస్గరోవ్ (అజెర్బైజాన్) డోపీగా తేలినందుకు యోగికి ఈ అదృష్టం దక్కుతుందనేది కొందరి వాదన. అరుుతే తాజాగా ఈ పుకార్లకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యుడబ్ల్యు) తెర దించింది. అసలు అస్గరోవ్ ఎప్పుడు కూడా డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలలేదని స్పష్టం చేసింది. ‘అస్గరోవ్ యూడబ్ల్యుడబ్ల్యు డోపింగ్ నిరోధక పాలసీని ఎప్పుడూ అతిక్రమించలేదు. అతడిపై కథనాల్లో నిజం లేదు’ అని ట్వీట్ చేసింది. మరోవైపు కుడుఖోవ్ డోపీగా తేలడంతో యోగేశ్వర్ కాంస్య పతకం రజతంగా మారే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. -
స్వర్ణ యోగం కాదు..!
‘లండన్ ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్యం రజతంగా మారి మూడు రోజులు కూడా కాలేదు... అప్పుడే ఆ రజతం స్వర్ణంగా మారిపోతోంది... పసిడి సాధించిన రెజ్లర్ కూడా డోపింగ్‌లో పట్టుబడటంతో మన యోగేశ్వర్ దత్ బంగారు పతకాన్ని అందుకోబోతున్నాడు...’ శుక్రవారం భారత క్రీడాభిమానులను ఆనందంలో ముంచెత్తిన వార్త ఇది. అరుుతే వాస్తవం వేరుగా ఉంది. మరో ఆటలో అయితే స్వర్ణ విజేత పట్టుబడితే రజతం ఆటోమెటిక్‌గా స్వర్ణంగా మారిపోయేదేమో కానీ... ఇక్కడ అది సాధ్యం కాదు. యోగేశ్వర్‌తో పాటు మరో పార్శ్వంనుంచి కాంస్యం సాధించిన అమెరికా రెజ్లర్ కొలెమాన్ స్కాట్‌ను ఆ అదృష్టం వరించనుంది. 2012లో స్వర్ణం గెలిచిన అస్గరోవ్ డోపీగా తేలడంతో ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. * యోగేశ్వర్‌కు రజత పతకమే * కొలెమాన్ స్కాట్‌కు పసిడి! * ఒలింపిక్స్ పతకంలో మరో మార్పు * డోపింగ్‌లో పట్టుబడ్డ అస్గరోవ్ న్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం జరిగిన లండన్ ఒలింపిక్స్ 60 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో భారత ఆటగాడు యోగేశ్వర్‌దత్ కాంస్య పతకం గెలుచుకున్నాడు. అయితే ఈ పోటీల్లో రజతం సాధించిన కుదుఖోవ్ (రష్యా) డోపింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో అతని పతకాలు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రద్దు చేసింది. దాంతో యోగేశ్వర్ పతకం కంచునుంచి వెండిగా మారింది. అయితే తాజా డోపింగ్ పరీక్షల్లో నాడు స్వర్ణం సాధించిన ఆటగాడు కూడా పట్టుబడ్డాడు. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) నిర్వహించిన పరీక్షల్లో అజర్‌బైజాన్‌కు చెందిన తోగ్రుల్ అస్గరోవ్ పాజిటివ్‌గా తేలాడు. ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) ఇంకా దీనిని అధికారికంగా ఖరారు చేయలేదు. అస్గరోవ్ పతకాన్ని వెనక్కి తీసుకుంటే యోగేశ్వర్‌కు స్వర్ణ యోగం పట్టవచ్చని వినిపించింది. ఎందుకు కాదు? కాంస్యాలు సాధించిన యోగేశ్వర్, కొలెమాన్ స్కాట్ రెండు వేర్వేరు పార్శ్వాలలో ఆడారు. పై పార్శ్వంనుంచి సెమీస్‌కు చేరిన స్కాట్... అక్కడ అస్గరోవ్ (స్వర్ణవిజేత) చేతిలో ఓడాడు. అనంతరం కాంస్య పతక పోరులో యుమొటో (జపాన్)ను ఓడించి పతకం సాధించాడు. దిగువ భాగంలో ప్రిక్వార్టర్లో ఓడిన యోగి...ఆ తర్వాత రెండు రెపిచేజ్ మ్యాచ్‌లతో పాటు జాంగ్ మ్యోంగ్ (ఉత్తర కొరియా)పై గెలిచి కంచు పతకం అందుకున్నాడు. రజతం సాధించిన కుడుఖోవ్... యోగేశ్వర్ ఉన్న పార్శ్వంలోనే న్నాడు. అందుకే అతని పతకం రద్దు కాగానే అదే వైపునుంచి కాంస్యం సాధించిన యోగి పతకం అప్‌గ్రేడ్ అయింది. ఇదే నిబంధనను వర్తింపజేస్తే అస్గరోవ్, స్కాట్ ఒకే పార్శ్వంలో ఉన్నారు. కాబట్టి అస్గరోవ్ స్వర్ణం స్కాట్‌కు అందేందుకే అవకాశం ఉంది. నేరుగా రజతంనుంచి స్వర్ణంగా మారేందుకు స్కాట్‌తో పోలిస్తే యోగేశ్వర్‌కు అదనపు అర్హత ఏమీ లేదు. ఇద్దరూ కాంస్య విజేతలుగా సమాన స్థాయిలోనే ఉన్నారు. అవకాశాలు ఏమిటి? ఈ అంశంపై ప్రస్తుతానికి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అయితే నిబంధనల ప్రకారం ఎలా చూసినా యోగేశ్వర్‌కు స్వర్ణం లభించడం సాధ్యం కాకపోవచ్చు. వరుసగా రెండు బౌట్లు నెగ్గి నేరుగా సెమీ ఫైనల్‌కు చేరిన స్కాట్ ప్రదర్శనే ఒలింపిక్స్‌లో యోగికంటే మెరుగ్గా ఉంది. ఈ విషయంలో భారత రెజ్లర్కంటే అతని వైపు మొగ్గు ఉంది. పతకం కోసం యోగేశ్వర్ రెండు రెపిచేజ్ రౌండ్లు కూడా ఆడగా... స్కాట్ వాటి అవసరం లేకుండా నేరుగా కాంస్య పోరులో తలపడ్డాడు. ఇప్పటికే యోగేశ్వర్ పతకం అప్‌గ్రేడ్ అయింది కాబట్టి మరో కాంస్య విజేతగా కొలెమాన్కు కూడా ఇదే అవకాశం ఉంది. పూర్తిగా అతడిని పక్కన పెట్టేసి యోగేశ్వర్‌నే మరో మెట్టు ఎక్కించేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదు. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే... అస్గరోవ్ చేతిలో ఓడిన కొలెమాన్కే స్వర్ణం దక్కవచ్చు. లేదంటే అతడికి కూడా రజతం ఇవ్వవచ్చు. ఇద్దరు రెజ్లర్లకు రజతాలు ఇచ్చి ఈ ఈవెంట్‌కు సంబంధించి స్వర్ణాన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా ఉంది. భారతీయుడిగా స్వర్ణం కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కానీ అది అంత ఏకపక్షంగా మాత్రం సాధ్యం కాదు! నాకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే నాకున్న అవగాహన ప్రకారం నాకు రజతం మాత్రమే లభిస్తుంది. మేమిద్దరం కాంస్యాలు గెలుచుకున్నాం. నేను రెపిచేజ్ ద్వారా అర్హత పొంది సిల్వర్ మెడలిస్ట్ చేతిలో ఓడాను. అయితే స్కాట్ మాత్రం చాంపియన్ చేతిలో ఓడాడు. కాబట్టి స్వర్ణం అతనికే దక్కాలి. నాకు తెలిసి నా పతకం స్వర్ణంగా మారదు. - యోగేశ్వర్‌దత్ -
ఆ రజతం వాళ్ల దగ్గరే ఉంచండి
► రెజ్లర్ కుదుఖోవ్ మరణంతో అతని కుటుంబం బాధలో ఉంది ► భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ అభ్యర్థన న్యూఢిల్లీ: లండన్ ఒలింపిక్స్‌లో తాను గెలిచిన కాంస్య పతకంతో సంతృప్తిగా ఉన్నానని... రష్యా దివంగత రెజ్లర్ బెసిక్ కుదుఖోవ్ డోప్ పరీక్షలో విఫలమైనప్పటికీ... అతని రజత పతకం వెనక్కి తీసుకొని తనకు ఇవ్వాల్సిన అవసరం లేదని భారత స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యూడబ్ల్యూ), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధికారులకు విజ్ఞప్తి చేశాడు. మానవతా దృక్పథంతో వ్యవహరించి కుదుఖోవ్ కుటుంబ సభ్యుల వద్దే ఈ రజత పతకం ఉండేలా చూడాలని 2012 లండన్ ఒలింపిక్స్‌లో 60 కేజీల విభాగంలో కాంస్యం నెగ్గిన యోగేశ్వర్ దత్ అన్నాడు. ‘రజత పతకం వెనక్కి తీసుకుంటే కుదుఖోవ్ కుటుంబానికి బాధ కలుగుతుంది. పతకం రూపంలోనైనా కుదుఖోవ్ తల్లిదండ్రులకు తమ కుమారుడి జ్ఞాపకాలు మిగిలి ఉంటారుు. 2013 డిసెంబరులో కుదుఖోవ్ కారు ప్రమాదంలో చనిపోయాడని తెలిసింది. ఒకవేళ అతను బతికిఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ అతను ఈ లోకంలో లేడు. నిన్ననే అతని కుటుంబసభ్యులు, తల్లిదండ్రుల గురించి ఆలోచించాను. కేవలం తమ కుమారుడి జ్ఞాపకాలతోనే వారు జీవిస్తున్నారు. కుదుఖోవ్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడనేది అనవసరం. కొడుకు సాధించిన పతకం జ్ఞాపకంతో జీవిస్తున్న ఆ కుటుంబం నుంచి నేను దానిని తీసుకోదల్చుకోలేదు. రజత పతకం వారి వద్దే ఉండటం సబబుగా ఉంటుంది’ అని యోగేశ్వర్ దత్ అభిప్రాయపడ్డాడు. ‘డోప్ పరీక్షలో కుదుఖోవ్ విఫలమయ్యాక నేను సాధించిన కాంస్యం రజతం అవుతున్న వార్త విని అంతగా సంతోషపడలేదు. కుదుఖోవ్ నాకు మంచి మిత్రుడు. లండన్ ఒలింపిక్స్‌కంటే ముందు రష్యాలో నేను రెండు నెలలు ప్రాక్టీస్ చేశాను. నా కాంస్యం నా వద్దే ఉంది. ఇప్పుడు ఏ పతకమున్నా పెద్దగా తేడా ఉండదు’ అని హరియాణా పోలీసు విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న యోగేశ్వర్ అన్నాడు. యోగేశ్వర్ శాంపిల్‌నూ పరీక్షిస్తారు... లండన్ ఒలింపిక్స్ సందర్భంగా యోగేశ్వర్ దత్ వద్ద సేకరించిన డోప్ పరీక్షల ఫలితాలు క్లీన్‌గా వస్తేనే అధికారికంగా అతనికి రజత పతకం ఖరారు చేస్తారు. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) కొత్త నిబంధనల ప్రకారం అంతర్జాతీయ టోర్నీలలో క్రీడాకారుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను 10 ఏళ్లపాటు డీప్‌ఫ్రీజ్‌లో పెడుతున్నారు. తాజా టెక్నాలజీని ఉపయోగించి బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లలో క్రీడాకారుల నుంచి సేకరించిన నమూనాలను మళ్లీ పరీక్షిస్తున్నారు. ఈ పరీక్షల ద్వారానే కుదుఖోవ్ లండన్ ఒలింపిక్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడని తేలింది. -
యోగేశ్వర్ దత్ ఎంతో హుందాగా ప్రవర్తించాడు!
భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ ఎంతో హుందాతనంతో ప్రవర్తించాడు. మంచి ఆటగాడిగానే కాదు మంచి మనసున్న వ్యక్తిగానూ ఈ రెజ్లర్ నిరూపించుకున్నాడు. డోపింగ్ ఫలితాలలో పాజిటీవ్ అని తేలిన రెజ్లర్ ప్రస్తుతం మన మధ్య లేనందున.. ఇప్పటికే బాధపడుతున్న ఆ కుటుంబానికి సాంత్వన చేకూర్చేలా ప్రవర్శించాడు రెజ్లర్ యోగేశ్వర్. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తను సాధించిన కాంస్యం.. నాలుగేళ్ల తర్వాత రజతంగా మారిన విషయం తెలిసిందే. ఆ గేమ్స్‌లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్ ఫలితం రావడంతో ఆ పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో యోగేశ్వర్‌కు రజతం దక్కింది. ఈ విషయంపై యోగేశ్వర్ దత్ తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. రష్యా రెజ్లర్ బేసిక్ కుదుఖోవ్ మంచి వస్తాదు అని కితాబిచ్చాడు. 'ఇప్పటికే ఆ రెజ్లర్‌ను కోల్పోయి కుదుఖోవ్ కుటుంబం ఎంతో బాధలో ఉండి ఉంటుంది. అందుకే ఆ రెజ్లర్ సాధించిన పతకాన్ని అతడి గౌరవార్థం ఆ కుటుంబం వద్దనే ఉండాలి. అయితే చనిపోయిన తర్వాత డోపింగ్ టెస్టులో విఫలమవడం దురదృష్టకరం. ఈ సమయంలో మనం మానవతాదృక్పథంతో నడుచుకోవాలి'అని తన ట్వీట్లలో వెల్లడించాడు. Besik Kudukhov शानदार पहलवान थे। उनका मृत्यु के पश्चात dope test में fail हो जाना दुखद हैं। मैं खिलाड़ी के रूप में उनका सम्मान करता हूँ। — Yogeshwar Dutt (@DuttYogi) 31 August 2016 अगर हो सके तो ये मेडल उन्ही के पास रहने दिया जाए। उनके परिवार के लिए भी सम्मानपूर्ण होगा। मेरे लिए मानवीय संवेदना सर्वोपरि है। — Yogeshwar Dutt (@DuttYogi) 31 August 2016 -
కాంస్యం... రజతంగా మారింది
* లండన్ ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో యోగేశ్వర్‌కు రజతం * 2012లో కాంస్యం సాధించిన భారత స్టార్ * రష్యా రెజ్లర్ డోపింగ్‌లో దొరకడంతో యోగేశ్వర్‌కు వెండి పతకం న్యూఢిల్లీ: భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్‌కు అదృష్టం కలిసొచ్చింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో తను సాధించిన కాంస్యం... నాలుగేళ్ల తర్వాత రజతంగా మారింది. ఆ గేమ్స్‌లో రజతం సాధించిన రష్యా రెజ్లర్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో పాజిటివ్ ఫలితం రావడంతో తన పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో యోగేశ్వర్‌కు రజతం దక్కింది. లండన్ ఒలింపిక్స్ పురుషుల 60 కేజీ ఫ్రీస్టయిల్ విభాగం ప్రి కార్టర్ ఫైనల్లో రష్యా రెజ్లర్ బెసిక్ కుదుఖోవ్ చేతిలో యోగేశ్వర్ ఓటమి పాలయ్యాడు. కాగా, కుదుఖోవ్ ఫైనల్‌కు చేరడంతో యోగేశ్వర్‌కు రెప్‌చేజ్ అవకాశం దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న భారత రెజ్లర్ కాంస్య పతకం సాధించాడు. మరోవైపు ఫైనల్లో కుదుఖోవ్ ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. అయితే ఇటీవల అంతర్జాతీయ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) నిర్వహించిన డోపింగ్ పరీక్షలో ఈ రష్యా అథ్లెట్ నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు తేలింది. లండన్ ఒలింపిక్స్‌కు ముందు తీసుకున్న అతడి శాంపిల్‌ను మరోసారి పరీక్షించగా ఈ విషయం నిర్ధారణయియంది. దీంతో అతడు సాధించిన రజతాన్ని వెనక్కి తీసుకుని మూడో స్థానంలో నిలిచిన యోగేశ్వర్‌కు అప్డేట్ చేయనున్నారు. అయితే నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, బీజింగ్ గేమ్స్‌లో కాంస్యం సాధించిన కుదుఖోవ్ 2013లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం విషాదం. మరోవైపు తన పతకం మారిన విషయాన్ని రెజ్లర్ యోగేశ్వర్ ధృవీకరించాడు. ‘నేను ఒలింపిక్స్‌లో సాధించిన కాంస్యాన్ని రజత పతకానికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు మంగళవారం ఉదయం సమాచారం అందింది. ఈ పతకాన్ని కూడా దేశ ప్రజలకు అంకితమిస్తున్నాను’ అని యోగేశ్వర్ ట్వీట్ చేశారు. అయితే యోగేశ్వర్‌కు మెడల్ అప్‌గ్రేడ్ చేసే అంశాన్ని యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో పాటు భారత రెజ్లింగ్ సమాఖ్య అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. తాజాగా రియోలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో యోగేశ్వర్ 65 కిలోల విభాగంలో తొలి రౌండ్లోనే ఓడి నిరాశపరిచాడు. లండన్ గేమ్స్‌లోనే మరో రెజ్లర్ సుశీల్ కుమార్ కూడా రజతం సాధించాడు. భారత రెజ్లింగ్ చరిత్రలో ఇప్పటివరకూ ఇదే అత్యుత్తమ పతకం. -
'నాకు రజతం ఖాయమైంది'
లండన్: లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్.. ఇప్పడు రజత పతక విజేతగా మారాడు. ఈ విషయాన్ని యోగేశ్వర్ తాజాగా ధృవీకరించాడు. తనకు రజత పతకం ఖాయమైందంటూ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. 2012 ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన రష్యా బాక్సర్ బెసిక్ కుదుఖోవ్ శాంపిల్స్ కు తాజాగా చేసిన పరీక్షల్లో అతను డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది. దీంతో ఆ ఒలింపిక్స్‌లో రజతం సాధించిన కుదుఖోవ్ పతకాన్నివెనక్కు తీసుకోనున్నారు. లండన్ ఒలింపిక్స్ 60 కేజీల ఫ్రీస్టయిల్లో భాగంగా కాంస్య పతకం కోసం జరిగిన పోరులో యోగేశ్వర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియకు చెందిన రి జాంగ్ యాంగ్‌పై గెలిచి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. అంతకుముందు ప్రి కార్టర్ ఫైనల్లో రష్యా బాక్సర్ బెసిక్ కుదుఖోవ్ చేతిలో యోగేశ్వర్ ఓటమి పాలయ్యాడు. కాగా, కుదుకోవ్ ఫైనల్ కు చేరడంతో యోగేశ్వర్ రెప్ చేజ్ ద్వారా కాంస్య పతకం సాధించాడు. అయితే ఇప్పుడు కుదుఖోవ్ శాంపిల్స్ పాజిటివ్ రావడంతో అతని పతకం యోగేశ్వర్ ఖాతాలో చేరింది. కొంతమంది రియో విన్నర్లకు తిరిగి పరీక్షలు నిర్వహించడానికి రష్యా డోపింగ్ ఉదంతమే ప్రధాన కారణం. గత కొంతకాలంగా రష్యా అథ్లెట్లు భారీ స్థాయిలో డోపింగ్‌లో పట్టుబడి యావత్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపారు. దీంతో అత్యధిక శాతం రష్యా క్రీడాకారులు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనలేకపోయారు. ఈ నేపథ్యంలో గత ఒలింపిక్స్ల్లో పాల్గొన్న క్రీడాకారుల శాంపిల్స్‌ను కూడా భద్ర పరిచి, ప్రస్తుతం అత్యాధునికి టెక్నాలజీ సాయంతో ఆ శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నారు. కాగా 2013లో జరిగిన రోడ్డుప్రమాదంలో కుదుస్కోవ్ మరణించిన విషయం తెలిసిందే. -
కోతిలా ఉన్నావంటూ అవమానించారు..!
ఒకప్పుడు ఆమెను అందరూ చాలా చులకనగా చూశారు. అంతకుమించి చెప్పాలంటే.. నువ్వు కోతిలా ఉన్నావు. నువ్వు కూడా ఒలింపిక్స్ లో పాల్గొంటావా అంటూ హేళన చేశారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో పాల్గొని ఒట్టి చేతులతో స్వదేశానికి తిరిగొచ్చింది. ఆమె పతకంతో తిరిగిరాలేదు.. కానీ, పతకం సాధించాలన్న కసితో ఎగిసిన కెరటంలా తన ప్రతాపం చూపించింది. ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్‌కు తొలి స్వర్ణాన్ని అందించింది. దేశం గర్వపడేలా, తన దేశ క్రీడాకారులందరూ తలెత్తుకునేలా చేసింది. ఆమె మరోవరో కాదు.. జూడోలో స్వర్ణం సాధించిన రాఫీలా సిల్వ. రియో ఒలింపిక్స్ జూడోలో మహిళల 57 కేజీల విభాగంలో బరిలోకి దిగిన రాఫీలా.. ఏకంగా స్వర్ణాన్ని కొల్లగొట్టింది. ఇందులో భాగంగా ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్, మంగోలియాకు సుమియా డార్జుసురెన్ ను కూడా ఓడించింది. 'జూడో నా కెరీర్, జీవితం. సొంతగడ్డపై స్వర్ణాన్ని సాధించడం మరిచిపోలేని అనుభూతి. సొంత అభిమానుల మద్ధతు ఉండటంతో నా విజయం సాధ్యమైంది. వారికి ధన్యవాదాలు' అని స్వర్ణం సాధించిన రాఫీలా ఉద్వేగానికి లోనైంది. రియోలో ఇప్పటివరకూ బ్రెజిల్ సాధించిన ఏకైక స్వర్ణం గతంలో జాతి వివక్షకు గురైన ఆమె సాధించనదే కావడం గమనార్హం. లండన్ 2012లో రూల్స్ ఉల్లంఘించిన కారణంగా కొన్ని రౌండ్లలోనే ఇంటి దారి పట్టింది. ఆమె కోతిలా ఉందని, ఇలాంటి వారు జూలో ఉంటారని సిల్వపై అప్పట్లో చాలా రకాల కామెంట్లు చేశారు. బ్రెజిల్ లోని అతిపెద్ద మురికివాడ ఫవేలా నుంచి వచ్చిన ఆమె.. 2013లో మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ గా అవతరించిన దేశ తొలి క్రీడాకారిణిగా నిలిచింది. బోనులో ఉండాల్సిన కోతి లండన్ కు వచ్చిందంటూ అప్పట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తాను నేడు స్వదేశంలో స్వర్ణంతో సమాధానం చెప్పాను అని రాఫీలా తన మనసులోని బాధను వెల్లడించింది. జాత్యహంకారంతో వివక్ష చూపితే ఎంత కష్టంగా ఉంటుందో మాటల్లో చెప్పలేమంటూ కన్నీటి పర్యంతమయింది. -
‘టాప్’ కమిటీలో గోపీచంద్
న్యూఢిల్లీ: భారత దేశ జనాభా వంద కోట్లకు పైగా చేరుకున్నా క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత అంతంతమాత్రమే. ఒలింపిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలకు వెళితే పట్టుమని పది పతకాలు కూడా సాధించలేని పరిస్థితి. క్రితం సారి లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు వచ్చిన పతకాల సంఖ్య కేవలం ఆరు. తాజాగా ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 2016, 2020 ఒలింపిక్స్ల్లో పతకాల సంఖ్య పెంచేందుకు మెరికల్లాంటి ఆటగాళ్లను తయారుచేయాలనే ఉద్దేశంతో క్రీడా శాఖ కొత్తగా ‘టార్గెట్ మిషన్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్)’ అనే పథకాన్ని ప్రవేశపెట్టనుంది. దీన్ని జాతీయ క్రీడా అభివృద్ధి నిధి ద్వారా ప్రమోట్ చేస్తారు. దీంట్లో భాగంగా దేశంలోని నైపుణ్యం కలిగిన ఆటగాళ్లను గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. దీంట్లో క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, ప్రముఖ షూటర్ అభినవ్ బింద్రా, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పి.గోపీచంద్‌లతో పాటు సాయ్ డెరైక్టర్ జనరల్, మిట్టల్ చాంపియన్స్ ట్రస్ట్ సీఈవో మనీష్ మల్హోత్రా, కన్వీనర్‌గా అమ్రిత్ మాథుర్ ఉండనున్నారు. వీరికి బీజేపీ ఎంపీ, భారత ఒలింపిక్ సంఘం ఎగ్జిక్యూటివ్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ నేతృత్వం వహిస్తారు. 2016లో క్రితంసారి కన్నా రెట్టింపు, 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో 20 పతకాలను సాధించే లక్ష్యంతో 75 నుంచి 100 మంది వరకు అథ్లెట్లను గుర్తించి వారికి అత్యంత ఆధునిక శిక్షణను ఇవ్వనున్నారు. ముఖ్యంగా అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాక్సింగ్, రెజ్లింగ్, షూటింగ్ క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మేజర్ టోర్నీల్లో ఈ విభాగాల నుంచే భారత్ అత్యధిక పతకాలు దక్కించుకుంటోంది. -
ఫెల్ప్స్‌కు ‘తొలి’ పతకం
చార్లోట్: లండన్ ఒలింపిక్స్‌తో స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అమెరికా దిగ్గజం ఫెల్ప్స్... ఇటీవల మళ్లీ మనసు మార్చుకుని ఈత కొలనులోకి దిగిన సంగతి తెలిసిందే. తన పునరాగమనం చేసిన నెల రోజుల్లోనే ఈ స్టార్ స్విమ్మర్ తొలి పతకం సాధించాడు. చార్లోట్ గ్రాండ్ ప్రి 100మీ. బటర్‌ఫ్లయ్ విభాగంలో తను విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన పోటీలో తను 52.13సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. పావెల్ సంకోవిచ్ (బెలారస్, 52.72సె.), జోసెఫ్ స్కూలింగ్ (సింగపూర్, 52.95సె.) తర్వాత స్థానాల్లో నిలిచారు. -
రిటైర్మెంట్ ఆలోచన వచ్చింది
- కానీ లక్ష్యాలు మిగిలే ఉన్నాయి - మేరీకామ్ వ్యాఖ్య న్యూఢిల్లీ: బాక్సింగ్‌కు ఇక గుడ్‌బై చెప్పాలన్న ఆలోచన కలుగుతోందని భారత మహిళా బాక్సర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీ కామ్ తెలిపింది. ఏడాది కాలంగా బాక్సింగ్‌కు దూరంగా ఉండి మూడో బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం కామన్వెల్త్ క్రీడల కోసం ఆమె తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా మేరీ కామ్ మాట్లాడుతూ, ‘రిటైర్మెంట్ ఆలోచన చాలాసార్లు వచ్చింది. కానీ, సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయి. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే ప్రధాన లక్ష్యం’ అని వివరించింది. 2008లో తొలిసారి తల్లి అయ్యేందుకు బాక్సింగ్ నుంచి విరామం తీసుకున్న మేరీ కామ్ ఆ తరువాత రింగ్‌లోకి అడుగు పెడుతూనే ప్రపంచ టైటిల్‌ను గెలుచుకుంది. తాజా విరామంతో కూడా తనకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదని, నెల రోజుల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టానని ఆమె పేర్కొంది. -
టైసన్ గే డోపి
ఒలింపిక్ పతకం వెనక్కి ఏడాది నిషేధం కొలరాడో స్ప్రింగ్స్: అమెరికా అథ్లెటిక్స్‌కు మరో మచ్చ. స్ప్రింట్ స్టార్ టైసన్ గే డోపింగ్‌లో పట్టుబడ్డాడు. పోటీలు లేనప్పుడు (రాండమ్ అవుట్ ఆఫ్ కాంపిటిషన్) జరిపిన రెండు టెస్టులతో పాటు ఓ ఈవెంట్ సందర్భంగా చేసిన మరో డోప్ టెస్టులోనూ అతను నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అమెరికా యాంటీ డోపింగ్ అసోసియేషన్ (యూఎస్‌ఏడీఏ) అతనిపై ఏడాది పాటు నిషేధం విధించింది. అలాగే లండన్ ఒలింపిక్స్‌లో టైసన్ గే గెలిచిన రజత పతకాన్ని యూఎస్ ఒలింపిక్ కమిటీ వెనక్కి తీసుకుంది. గతేడాది జూన్ 23న యూఎస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్ సందర్భంగా యూఎస్‌ఏడీఏ, ఐఏఏఎఫ్లు సంయుక్తంగా టైసన్ గే మూత్ర నమూ నాలను సేకరించాయి. ఆ చాంపియన్‌షిప్‌లోనే అతను డోపింగ్‌కు పాల్పడినట్లుగా గుర్తించి నిషేధాన్ని అప్పట్నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. -
భూపతితో కలిసి ఆడేదిలేదు
అతనివల్లే ‘లండన్’లో ప్రతికూల ఫలితం 2016 రియో ఒలింపిక్స్‌లో ఆడతా పేస్ వ్యాఖ్య న్యూఢిల్లీ: మహేశ్ భూపతి కారణంగానే 2012 లండన్ ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయానని భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ లియాండర్ పేస్ అన్నాడు. రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం తన జీవితంలోనే అత్యంత గొప్ప గౌరవమన్న పేస్.. తన కెరీర్లో లండన్ ఒలింపిక్స్ వివాదం అత్యంత విచారకరమైనదన్నాడు. తన కెరీర్ గురించి, రానున్న 2016 రియో డి జనీరో ఒలింపిక్స్ క్రీడల గురించి పేస్ అభిప్రాయాలు అతని మాటల్లోనే.. లండన్ ఒలింపిక్స్‌లో నాతో కలిసి ఆడనని భూపతి మొండి వైఖరి కారణంగా పతకం సాధించే అవకాశం చేజారింది. దేశం కూడా ఓ పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అదంతా గతం. అయితే భవిష్యత్తులో మళ్లీ భూపతితో జతకట్టే అవకాశమే లేదు. 2016లో జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం. ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉన్నందున అందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. సెర్బియాతో డేవిస్ కప్ టోర్నీలో ఆడాల్సిందిగా అఖిల భారత టెన్నిస్ సంఘం కోరితే అందుకు సిద్ధంగా ఉన్నాను. భూపతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న టెన్నిస్ లీగ్‌కు బిజీ షెడ్యూల్లో ఐపీఎల్ మాదిరిగా రెండు, మూడు వారాల సమయం లభించడం కష్టం. అంతర్జాతీయ టాప్స్టార్లు ఈ లీగ్‌లో ఆడేది అనుమానమే. ఫెడరర్, షరపోవా వంటి వారు ఇంకా సంతకం చేయలేదు. నా లీ ఇప్పటికే తప్పుకుంది. ప్రజల తరపున పోరాడేందుకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే సిద్ధమే. -
సైనా, గగన్‌లకు యూపీ ప్రభుత్వ సన్మానం
సైఫాయీ: లండన్ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకాలు సాధించిన ఆటగాళ్లను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ‘సైఫాయీ మహోత్సవ్’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, అగ్రశ్రేణి షూటర్ గగన్ నారంగ్‌లకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రూ.25 లక్షల నజరానా అందించారు. వీరితో పాటు కాంస్య పతకాలు గెలుపొందిన మేరీకామ్, యోగేశ్వర్ దత్‌లకు కూడా అంతే మొత్తం అందించారు. రజతం గెలిచిన రెజ్లర్ సుశీల్ కుమార్, షూటర్ విజయ్ కుమార్‌లకు రూ. 50 లక్షల నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ కూడా పాల్గొన్నారు. -
ధీమా పెరిగింది
గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో ఎన్నడూలేని విధంగా ఆరు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులు ఈ సంవత్సరం కూడా తమ జోరు కొనసాగించారు. విశ్వ క్రీడా వేదికపై తమదైన ముద్ర వేశారు. ఆర్చరీ నుంచి రెజ్లింగ్ దాకా ప్రతి క్రీడాంశంలో మనోళ్లు మెరిశారు. భారత క్రీడాకారులు ఈ విజయనామ సంవత్సరంలో విజయాలు మోసుకొచ్చారు. కొన్నేళ్ల క్రితం వరకు అంతర్జాతీయ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం కోసమే వెళ్లేవారు ఇపుడు పతకాలతో తిరిగి వస్తున్నారు. వివాదాలు వెంటాడుతున్నా... అంచనాలను అందుకుంటూ... ఆశలను నేరవేరుస్తూ... క్రీడలను కూడా కెరీర్‌గా ఎంచుకోవచ్చనే ధీమాను పెంచుతూ... అద్వితీయ విజయాలతో క్రీడా ప్రపంచంలో మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది భారత క్రీడారంగంలో గుర్తుంచుకోదగిన క్షణాల సమాహారం... సాక్షి పాఠకుల కోసం. లేటు వయసులో మేటి ఫలితాలు (టెన్నిస్) ఉత్సాహం, పట్టుదల ఉంటే లేటు వయసులోనూ మేటి ఫలితాలు సాధించొచ్చని లియాండర్ పేస్ నిరూపించాడు. రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)తో కలిసి ఈ కోల్‌కతా యోధుడు 40 ఏళ్ల ప్రాయంలో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గాడు. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన పెద్ద వయస్కుడిగా పేస్ చరిత్ర లిఖించాడు. వేర్వేరు భాగస్వాములతో కలిసి రోహన్ బోపన్న రెండు డబుల్స్ టైటిల్స్‌ను... మహేశ్ భూపతి ఒక టైటిల్‌ను నెగ్గారు. డబుల్స్‌కే పరిమితమైన హైదరాబాద్ స్టార్ సానియా మీర్జాకు ‘గ్రాండ్‌స్లామ్’ విజయం దక్కకపోయినా స్థిరమైన ప్రదర్శనతో ఐదు టైటిల్స్ సాధించింది. బెథానీ మాటెక్ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్, దుబాయ్ ఓపెన్‌లో... జెంగ్ జీ (చైనా)తో కలిసి న్యూ హవెన్ ఓపెన్‌లో... కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి టోక్యో ఓపెన్, బీజింగ్ ఓపెన్లలో సానియా డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. గురి అదిరింది (ఆర్చరీ) లండన్ ఒలింపిక్స్‌లో వైఫల్యాన్ని మరిపిస్తూ ఈ ఏడాది భారత ఆర్చర్లు తీపి జ్ఞాపకాలు మిగిల్చారు. దీపిక కుమారి, బొంబేలా దేవి, రిమిల్ బురిలీలతో కూడిన భారత జట్టు పోలండ్, కొలంబియాలలో జరిగిన రెండు ప్రపంచకప్‌లలో స్వర్ణ పతకాలు గెలిచింది. ఈ క్రమంలో భారత బృందం ఒలింపిక్ చాంపియన్ దక్షిణ కొరియాను, చైనా జట్లను బోల్తా కొట్టించింది. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో భారత జట్టు ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఇక మంగోలియాలో జరిగిన ఆసియా గ్రాండ్‌ప్రి టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వై.చరణ్ రెడ్డి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు. ఉడుంపట్టు (రెజ్లింగ్) గతేడాది లండన్ ఒలింపిక్స్‌లో స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ విజయాల స్ఫూర్తితో... ఈసారి ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. సెప్టెంబరులో హంగేరిలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో తొలిసారి భారత రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఫ్రీస్టయిల్లో అమిత్ కుమార్ (55 కేజీలు) రజతం నెగ్గగా... బజరంగ్ (60 కేజీలు) కాంస్యం సాధించాడు. గ్రీకో రోమన్ విభాగంలో సందీప్ తులసీ యాదవ్ (66 కేజీలు) కాంస్యం రూపంలో తొలిసారి భారత్‌కు పతకాన్ని అందించాడు. ఈ ‘త్రయం’ ప్రదర్శనతో తొలిసారి భారత్ వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ‘పంచ్’ పదును అదుర్స్ (బాక్సింగ్) మనోళ్లపై అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) సస్పెన్షన్ కొనసాగుతున్నా... ఈ ప్రభావం భారత బాక్సర్లపై పడలేదు. జూలైలో జోర్డాన్‌లో జరిగిన ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో శివ థాపా (56 కేజీలు) స్వర్ణం నెగ్గగా... మన్దీప్ జాంగ్రా (69 కేజీ), దేవేంద్రో సింగ్ (49 కేజీ)లకు రజతాలు, మనోజ్ కుమార్ (64 కేజీలు) కాంస్యం లభించాయి. కజకిస్థాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఐదుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. సెర్బియా టోర్నీలో ఏపీ బాక్సర్ లలితా ప్రసాద్ (49 కేజీలు) పసిడి పతకం సాధించగా... సెప్టెంబరులో బల్గేరియాలో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (54 కేజీలు) రజతం గెల్చుకుంది. ‘రాకెట్’తో రఫ్ ఆడించారు (బ్యాడ్మింటన్) బ్యాడ్మింటన్ ప్రపంచంలో తెలుగు తేజం పి.వి.సింధు కొత్త రాకెట్లా దూసుకొచ్చింది. మేలో మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన 18 ఏళ్ల సింధు అదే జోరును కొనసాగించి చైనాలో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. తద్వారా మహిళల సింగిల్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. కేంద్ర క్రీడాపురస్కారం ‘అర్జున అవార్డు’ పొందిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి డిసెంబరులో మకావు గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలోనూ విజేతగా నిలిచింది. దిగ్గజం ప్రకాశ్ పదుకొనే నుంచి బ్యాడ్మింటన్ భవిష్యత్ తారగా ప్రశంసలందుకుంది. గత ఐదేళ్లుగా భారత బ్యాడ్మింటన్‌కు పర్యాయపదంగా నిలిచిన సైనా నెహ్వాల్‌కు ఈ ఏడాది ఏదీ కలసిరాలేదు. ఆడిన 14 టోర్నమెంట్లలో ఆమె ఒక్కదాంట్లోనూ ఫైనల్‌కు చేరుకోలేదు. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ ఆశాకిరణంలా ఎదిగాడు. జూన్‌లో థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన ఈ గుంటూరు జిల్లా క్రీడాకారుడు ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ రూపంలో మరో భారత ప్లేయర్ సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ టైటిల్ నెగ్గాడు. తెలుగు కుర్రాడు సిరిల్ వర్మ ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్-15 చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా నిలిచాడు. ఐపీఎల్ తరహాలో బ్యాడ్మింటన్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైంది. సైనా నెహ్వాల్ సభ్యురాలిగా ఉన్న ‘పీవీపీ హైదరాబాద్ హాట్‌షాట్స్’ తొలి ఏడాది చాంపియన్‌గా అవతరించింది. బుల్లెట్ దిగింది (షూటింగ్) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ ప్రపంచకప్ ఫైనల్స్‌లో సంచలనం సృష్టించింది. నవంబరులో జర్మనీలో జరిగిన సీజన్ ముగింపు టోర్నీలో ఈ పంజాబ్ అమ్మాయి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పసిడి పతకాన్ని నెగ్గింది. పిస్టల్ ఈవెంట్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా చరిత్ర సృష్టించింది. పతకం నెగ్గే క్రమంలో హీనా ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ గువో వెన్జున్ (చైనా), ప్రపంచ చాంపియన్ అరునోవిచ్ జొరానా (సెర్బియా), రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన కొస్టెవిచ్ (ఉక్రెయిన్)లను ఓడించింది. ‘లిఫ్ట్’ చేస్తే పతకాలే... (వెయిట్‌లిఫ్టింగ్) భారత వెయిట్లిఫ్టింగ్కు ఈ ఏడాది కలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్ యువ లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ భవిష్యత్‌పై ఆశలు పెంచాడు. ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో, ఆసియా యూత్ క్రీడల్లో, కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లలో అతను స్వర్ణ పతకాల పంట పండించాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన శిరీషా రెడ్డి, దీక్షిత కూడా కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాలు అందించారు. -
మళ్లీ కలిసి బరిలోకి...
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాడు, డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బోపన్న తన మాజీ భాగస్వామి ఐసాముల్ హక్ ఖురేషీ (పాకిస్థాన్)తో మళ్లీ జత కట్టనున్నాడు. 2014 సీజన్ నుంచి డబుల్స్‌లో వీరిద్దరు కలిసి బరిలోకి దిగుతారు. 2011 వరకు నాలుగేళ్ల పాటు జంటగా ఆడిన ఈ భారత్-పాక్ ద్వయం గతంలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. ఈ జోడి 2010 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ కూడా చేరింది. అయితే 2012 లండన్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఖురేషీతో విడిపోయి మహేశ్ భూపతితో బోపన్న కొన్ని టోర్నీలు ఆడాడు. ఆ తర్వాతి నుంచి వీరిద్దరు వేర్వేరు భాగస్వాములతోనే కలిసి ఆడుతున్నారు. బోపన్న ప్రస్తుతం ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు. ‘కోర్టులో, కోర్టు బయట కూడా నాకు, ఐసామ్కు మధ్య మంచి సమన్వయం ఉంది. పాత మిత్రుడితో మళ్లీ జత కట్టడం సంతోషంగా అనిపిస్తోంది’ అని బోపన్న వ్యాఖ్యానించాడు. భారత్, పాక్ మధ్య వైరం ఉన్నా...‘స్టాప్ వార్...స్టార్ట్ టెన్నిస్ క్యాంపెయిన్’ అంటూ క్రీడా స్ఫూర్తి చాటిన బోపన్న, ఖురేషీ జంటకు ఆర్థర్ యాష్ హ్యుమనిటేరియన్ అవార్డు, చాంపియన్స్ ఫర్ పీస్ అవార్డు కూడా దక్కడం విశేషం. -
రియోలోనూ ఆడతా..
ముంబై: బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జరిగే 2016 ఒలింపిక్స్‌లోనూ బరిలోకి దిగుతానని భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ స్పష్టం చేశాడు. గత లండన్ ఒలింపిక్స్ సమయంలో జట్టు ఎంపికలో నెలకొన్న వివాదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో పేస్‌తో కలిసి డబుల్స్ ఆడేందుకు మహేశ్ భూపతి, రోహన్ బోపన్న నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో పేస్‌కు జతగా హైదరాబాదీ విష్ణువర్ధన్‌ను అఖిల భారత టెన్నిస్ సమాఖ్య ఎంపిక చేసింది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియాతో బరిలోకి దిగాడు. ‘చివరి ఒలింపిక్స్ కారణంగా నా మనసు గాయపడింది. ఇంకా అది నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ కారణమే రియోకి వెళ్లడానికి ప్రేరణగా నిలుస్తోంది. మరోవైపు భారత క్రీడలు సందిగ్ధావస్థలో ఉన్నాయి. భారత ఒలింపిక్ సంఘంపై వేటు కారణంగా మన అథ్లెట్లు జాతీయ పతాకం చేతబూని పాల్గొనే వీలుండదు. అయితే అప్పటిలోగా అన్ని సమస్యలు సమసిపోతాయని అనుకుంటున్నాను’ అని పేస్ అన్నాడు. గంగూలీ, పేస్‌కు త్వరలో సన్మానం కోల్‌కతా: సౌరవ్ గంగూలీ, లియాండర్ పేస్‌లను జీవిత సాఫల్య పురస్కారంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సన్మానించనుంది. ఈనెల 28న ఈ కార్యక్రమం జరుగుతుంది. -
అమిత్ కుమార్‌కు రజతం
అంతర్జాతీయ రెజ్లింగ్ యవనికపై మరో భారత రెజ్లర్ మెరిశాడు. లండన్ ఒలింపిక్స్‌లో సహచరులు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ మెరిస్తే... వారితో కలిసి సాధన చేసే యువ రెజ్లర్ అమిత్ కుమార్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో ఈ హర్యానా రెజ్లర్ ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. బుడాపెస్ట్ (హంగేరి): అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత యువ రెజ్లర్ అమిత్ కుమార్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 55 కేజీల విభాగంలో 20 ఏళ్ల అమిత్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ఈ ఆసియా చాంపియన్ అమిత్ 1-2 పాయింట్ల తేడాతో హసన్ ఫర్మాన్ రహీమి (ఇరాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. తొలి రోజున భారత్ నుంచి ముగ్గురు రెజ్లర్లు బరిలోకి దిగగా... అమిత్‌కు పతకం లభించింది. ఇతర రెజ్లర్లు అరుణ్ కుమార్ (66 కేజీలు), సత్యవర్త్ (96 కేజీలు) నిరాశపరిచారు. అరుణ్ తొలి రౌండ్లో ఓడిపోగా... సత్యవర్త్ రెండో రౌండ్లో పరాజయం పాలయ్యాడు. మొత్తం 34 మంది రెజ్లర్లు పాల్గొన్న 55 కేజీల విభాగంలో అమిత్ ఫైనల్ మినహా మిగతా అన్ని రౌండ్స్‌లో ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. తొలి రౌండ్లో ఈ హర్యానా రెజ్లర్ 10-2తో యాసుహిరో ఇనాబా (జపాన్)పై గెలుపొందగా... రెండో రౌండ్లో 8-0తో జోహైర్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్లో అమిత్ 6-0తో ఎంజెల్ ఎస్కొబెడో (అమెరికా)ను చిత్తు చేయగా... సెమీఫైనల్లో 8-0తో సెజార్ అక్గుల్ (టర్కీ)ను ఓడించి ఫైనల్ పోరుకు అర్హత సాధించాడు. 1967 తర్వాత... తాజా ప్రదర్శనతో అమిత్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన ఎనిమిదో భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 1967లో బిషంబర్ సింగ్ (57 కేజీలు) తర్వాత ఈ మెగా ఈవెంట్లో రజత పతకం సాధించిన తొలి రెజ్లర్‌గా అమిత్ నిలిచాడు. 2010 ఈవెంట్లో సుశీల్ కుమార్ (66 కేజీలు) స్వర్ణ పతకం సంపాదించగా... 2009 ఈవెంట్లో రమేశ్ కుమార్ (74 కేజీలు), 1961 ఈవెంట్లో ఉదయ్ చంద్ (67 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో 2012 ఈవెంట్లో గీత (55 కేజీలు), బబిత (51 కేజీలు), 2006 ఈవెంట్లో అల్కా తోమర్ (59 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. -
అమిత్, గీతలపైనే ఆశలు
బుడాపెస్ట్ (హంగేరి): ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ను కొనసాగించాలనే నిర్ణయం వచ్చాక నూతనోత్సాహంతో 22 మంది సభ్యులుగల భారత బృందం ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగనుంది. సోమవారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్ వారం రోజులపాటు జరుగుతుంది. 16 నుంచి 18 వరకు ఫ్రీస్టయిల్ విభాగంలో; 18 నుంచి 20 వరకు మహిళల విభాగంలో; 20 నుంచి 22 వరకు గ్రీకో రోమన్ విభాగంలో బౌట్లు ఉంటాయి. గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత రెజ్లర్లు అలాంటి ఫలితాన్నే ఇక్కడా పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. బరిలో 22 మంది రెజ్లర్లు ఉన్నా భారత ఆశలన్నీ ఇద్దరిపైనే ఉన్నాయి. పురుషుల విభాగంలో డిఫెండింగ్ ఆసియా చాంపియన్ అమిత్ కుమార్ (55 కేజీలు)... మహిళల విభాగంలో గీత పోగట్ (59 కేజీలు) పతకాలు నెగ్గే అవకాశాలున్నాయి. గత ఏడాది కెనడాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గీత కాంస్య పతకాన్ని గెలిచింది. లండన్ ఒలింపిక్స్‌లో రజత, కాంస్య పతకాలు సాధించిన స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ గాయాల కారణంగా ఈ పోటీల్లో పాల్గొన డంలేదు. సోమవారం తొలి రోజున పురుషుల ఫ్రీస్టయిల్ కేటగేరిలో 55 కేజీలు, 66 కేజీలు, 96 కేజీల విభాగాల్లో ప్రిలిమినరీ రౌండ్స్‌తోపాటు ఫైనల్స్ ఉంటాయి. తొలి రౌండ్లో యాసుహిరో (జపాన్)తో అమిత్; 66 కేజీల తొలి రౌండ్లో రోషన్ (శ్రీలంక)తో అరుణ్ కుమార్; 96 కేజీల తొలి రౌండ్లో గామిని (శ్రీలంక)తో సత్యవర్త పోటీపడతారు. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు స్వర్ణం, రజతంతోపాటు ఐదు కాంస్య పతకాలు సాధించింది. రష్యాలో జరిగిన 2010 ఈవెంట్లో సుశీల్ కుమార్ భారత్‌కు ఏకైక స్వర్ణ పతకాన్ని అందించాడు. -
‘హ్యాట్రిక్’ కొట్టాలి: బోల్ట్
జ్యూరిచ్: లండన్ ఒలింపిక్స్‌లో తాను సాధించిన మూడు స్వర్ణ పతకాలను 2016 రియోడిజనిరో ఒలింపిక్స్‌లో నిలబెట్టుకోవాలని భావిస్తున్నట్లు అథ్లెటిక్స్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ చెప్పాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 100మీ., 200మీ., 4 x100 మీ. రిలేలో స్వర్ణాలు నెగ్గిన బోల్ట్ గత ఏడాది లండన్‌లోనూ వాటిని నిలబెట్టుకున్నాడు. ‘రియోలో ఆ మూడు మెడల్స్ గెలిస్తే అదో పెద్ద ఘనత అవుతుంది. ప్రస్తుతం నా దృష్టి కూడా దానిపైనే ఉంది. అయితే ఈ మూడు మినహా నాలుగో ఈవెంట్లో పాల్గొనే ఆలోచన మాత్రం నాకు లేదు’ అని బోల్ట్ స్పష్టం చేశాడు. జ్యూరిచ్ డైమండ్ లీగ్‌లో పాల్గొనేందుకు జ్యురిచ్ వచ్చిన బోల్ట్ ఫిఫా అధ్యక్షుడు బాట్లర్ను కలిశారు. ఈ సందర్భంగా బోల్ట్ పేరుతో ఉన్న 9వ నంబర్ ఫుట్‌బాల్ జెర్సీని అతనికి బ్లాటర్ బహుమతిగా అందజేశారు. -
ఫరా, కిప్లాగత్ రికార్డు
మాస్కో (రష్యా): ఊహించిన ఫలితాలతోనే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. పురుషుల 10 వేల మీటర్ల రేసులో లండన్ ఒలింపిక్స్ చాంపియన్ మహ్మద్ ఫరా (బ్రిటన్) స్వర్ణ పతకం సాధించగా... మహిళల మారథాన్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ ఎద్నా కిప్లాగత్ టైటిల్ నిలబెట్టుకుంది. 10 వేల మీటర్ల రేసును ఫరా 27 నిమిషాల 21.71 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అథ్లెటిక్స్ చరిత్రలో కెనెనిసా బెకెలె (ఇథియోపియా) తర్వాత ఒలింపిక్స్‌లోనూ, ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ 5 వేల, 10 వేల మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా ఫరా రికార్డు నెలకొల్పాడు. ఫరా గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో 5 వేల, 10 వేల మీటర్ల రేసుల్లో విజేతగా నిలిచాడు. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 5 వేల మీటర్లలో స్వర్ణం నెగ్గి, 10 వేల మీటర్లలో రజతం సాధించాడు. మరోవైపు మహిళల మారథాన్ రేసులో కిప్లాగత్ 2 గంటల 25 నిమిషాల 44 సెకన్లలో గమ్యానికి చేరుకొని పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో కిప్లాగత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో వరుసగా రెండు స్వర్ణాలు నెగ్గిన మారథాన్ రన్నర్‌గా చరిత్ర సృష్టించింది. 2011 డేగూలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ కిప్లాగత్ స్వర్ణం సాధించింది. సుధా సింగ్‌కు నిరాశ భారత్ విషయానికొస్తే... తొలి రోజు నిరాశే మిగిలింది. 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత సుధా సింగ్ మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమైంది. 14 మంది పాల్గొన్న తొలి హీట్‌లో సుధా 9 నిమిషాల 51.05 సెకన్లలో గమ్యానికి చేరుకొని 12వ స్థానంలో నిలిచింది. 100 మీటర్ల సెమీస్‌లో బోల్ట్ పురుషుల 100 మీటర్ల విభాగంలో ఒలింపిక్ చాంపియన్ ఉసేన్ బోల్ట్ (జమైకా) సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. శనివారం జరిగిన ఏడు హీట్స్లలో చివరిదాంట్లో పోటీపడిన బోల్ట్ 10.07 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. ఏడు హీట్స్ నుంచి మొత్తం 24 మంది సెమీఫైనల్‌కు అర్హత పొందారు. ఆదివారం సాయంత్రం సెమీఫైనల్స్, రాత్రి ఫైనల్ జరుగుతాయి. -
ఫరా, కిప్లాగత్ రికార్డు
మాస్కో (రష్యా): ఊహించిన ఫలితాలతోనే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. పురుషుల 10 వేల మీటర్ల రేసులో లండన్ ఒలింపిక్స్ చాంపియన్ మహ్మద్ ఫరా (బ్రిటన్) స్వర్ణ పతకం సాధించగా... మహిళల మారథాన్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ ఎద్నా కిప్లాగత్ టైటిల్ నిలబెట్టుకుంది. 10 వేల మీటర్ల రేసును ఫరా 27 నిమిషాల 21.71 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అథ్లెటిక్స్ చరిత్రలో కెనెనిసా బెకెలె (ఇథియోపియా) తర్వాత ఒలింపిక్స్‌లోనూ, ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ 5 వేల, 10 వేల మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా ఫరా రికార్డు నెలకొల్పాడు. ఫరా గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో 5 వేల, 10 వేల మీటర్ల రేసుల్లో విజేతగా నిలిచాడు. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 5 వేల మీటర్లలో స్వర్ణం నెగ్గి, 10 వేల మీటర్లలో రజతం సాధించాడు. మరోవైపు మహిళల మారథాన్ రేసులో కిప్లాగత్ 2 గంటల 25 నిమిషాల 44 సెకన్లలో గమ్యానికి చేరుకొని పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో కిప్లాగత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో వరుసగా రెండు స్వర్ణాలు నెగ్గిన మారథాన్ రన్నర్‌గా చరిత్ర సృష్టించింది. 2011 డేగూలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ కిప్లాగత్ స్వర్ణం సాధించింది. సుధా సింగ్‌కు నిరాశ భారత్ విషయానికొస్తే... తొలి రోజు నిరాశే మిగిలింది. 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత సుధా సింగ్ మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమైంది. 14 మంది పాల్గొన్న తొలి హీట్‌లో సుధా 9 నిమిషాల 51.05 సెకన్లలో గమ్యానికి చేరుకొని 12వ స్థానంలో నిలిచింది. 100 మీటర్ల సెమీస్‌లో బోల్ట్ పురుషుల 100 మీటర్ల విభాగంలో ఒలింపిక్ చాంపియన్ ఉసేన్ బోల్ట్ (జమైకా) సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. శనివారం జరిగిన ఏడు హీట్స్లలో చివరిదాంట్లో పోటీపడిన బోల్ట్ 10.07 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. ఏడు హీట్స్ నుంచి మొత్తం 24 మంది సెమీఫైనల్‌కు అర్హత పొందారు. ఆదివారం సాయంత్రం సెమీఫైనల్స్, రాత్రి ఫైనల్ జరుగుతాయి.