ఫరా, కిప్లాగత్ రికార్డు | Mo Farah can cement his greatness by winning golds in Moscow | Sakshi
Sakshi News home page

ఫరా, కిప్లాగత్ రికార్డు

Published Sun, Aug 11 2013 12:58 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM

Mo Farah can cement his greatness by winning golds in Moscow

మాస్కో (రష్యా): ఊహించిన ఫలితాలతోనే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. పురుషుల 10 వేల మీటర్ల రేసులో లండన్ ఒలింపిక్స్ చాంపియన్ మహ్మద్ ఫరా (బ్రిటన్) స్వర్ణ పతకం సాధించగా... మహిళల మారథాన్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ ఎద్నా కిప్లాగత్ టైటిల్ నిలబెట్టుకుంది. 10 వేల మీటర్ల రేసును ఫరా 27 నిమిషాల 21.71 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో అథ్లెటిక్స్ చరిత్రలో కెనెనిసా బెకెలె (ఇథియోపియా) తర్వాత ఒలింపిక్స్‌లోనూ, ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ 5 వేల, 10 వేల మీటర్ల రేసుల్లో స్వర్ణాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా ఫరా రికార్డు నెలకొల్పాడు. ఫరా గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో 5 వేల, 10 వేల మీటర్ల రేసుల్లో విజేతగా నిలిచాడు. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 5 వేల మీటర్లలో స్వర్ణం నెగ్గి, 10 వేల మీటర్లలో రజతం సాధించాడు.
 
 మరోవైపు మహిళల మారథాన్ రేసులో కిప్లాగత్ 2 గంటల 25 నిమిషాల 44 సెకన్లలో గమ్యానికి చేరుకొని పసిడి పతకాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో కిప్లాగత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో వరుసగా రెండు స్వర్ణాలు నెగ్గిన మారథాన్ రన్నర్‌గా చరిత్ర సృష్టించింది. 2011 డేగూలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ కిప్లాగత్ స్వర్ణం సాధించింది.
 
 సుధా సింగ్‌కు నిరాశ
 భారత్ విషయానికొస్తే... తొలి రోజు నిరాశే మిగిలింది. 2010 గ్వాంగ్‌జూ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత సుధా సింగ్ మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమైంది. 14 మంది పాల్గొన్న తొలి హీట్‌లో సుధా 9 నిమిషాల 51.05 సెకన్లలో గమ్యానికి చేరుకొని 12వ స్థానంలో నిలిచింది.
 
 100 మీటర్ల సెమీస్‌లో బోల్ట్
 పురుషుల 100 మీటర్ల విభాగంలో ఒలింపిక్ చాంపియన్ ఉసేన్ బోల్ట్ (జమైకా) సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. శనివారం జరిగిన ఏడు హీట్స్‌లలో చివరిదాంట్లో పోటీపడిన బోల్ట్ 10.07 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. ఏడు హీట్స్ నుంచి మొత్తం 24 మంది సెమీఫైనల్‌కు అర్హత పొందారు. ఆదివారం సాయంత్రం సెమీఫైనల్స్, రాత్రి ఫైనల్ జరుగుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement