మొనాకో: లండన్ ఒలింపిక్స్ (2012) జరిగి ఓ పుష్కర కాలం పూర్తయ్యింది. ఈలోపు రియో (2016), టోక్యో (2020), పారిస్ (2024) ఒలింపిక్స్ క్రీడలు కూడా ముగిశాయి. అయితే లండన్ విశ్వక్రీడల్లో మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో పతకాల పందెం ఇంకా.. ఇంకా కొనసాగుతోంది.
ఈసారి డోపీగా తేలిన రష్యా రన్నర్ తాత్యానా తొమషోవా పతకం (కాంస్యం) కోల్పోతే, అమెరికా రన్నర్ షానన్ రోబెరి అందుకోనుంది. ఈ ఈవెంట్‌లో మూడు రంగులు (స్వర్ణం, రజతం, కాంస్యం) మారడం మరో విశేషం. అలా ఒలింపిక్స్ చరిత్రలో ఇప్పుడిదీ నిలిచిపోనుంది. 12 ఏళ్ల క్రితం టర్కీ అథ్లెట్లు అస్లి కాకిర్ అల్ప్‌టెకిన్, గమ్జే బులుట్ వరుసగా స్వర్ణం, రజతం గెలుపొందారు.
కానీ వీరిద్దరు ఇదివరకే డోపీలుగా తేలి అనర్హత వేటుకు గురయ్యారు. ఈ క్రమంలో ఇథియోపియాలో జన్మించిన బహ్రైనీ మరియం యూసఫ్ జమాల్‌కు గోల్డ్(మూడో స్థానం), ఇథియోపియాకే చెందిన అబెబా అరెగవీకి సిల్వర్(ఐదో స్థానం) మెడల్ దక్కాయి.
అదేవిధంగా.. ఐదో స్థానంలో ఉన్న తొమషొవాకు కాంస్యం లభించింది. అయితే, ఇప్పుడు ఆమె కూడా డోపీ కావడంతో ఆరో స్థానంలో ఉన్న అమెరికన్ రోబెరి కాంస్య పతకం అందుకోనుంది. టర్కీ, రష్యా అథ్లెట్లపై ప్రపంచ అథ్లెటిక్స్ నిషేధం విధించింది. మారిన పతకాలను ప్రపంచ చాంపియన్‌షిప్ లేదంటే భవిష్యత్‌లో జరిగే ఒలింపిక్స్‌లో ప్రదానం చేస్తారు.
క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీ
సాక్షి, హైదరాబాద్: రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ శుభారంభం చేశాడు. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ 6–4, 6–3తో డానియల్ మసూర్–అలెక్సీ వటుటిన్ (జర్మనీ) జంటపై విజయం సాధించింది.
63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బాలాజీ జోడీ ఏడు ఏస్‌లు సంధించింది. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌లో నాలుగుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకొని... ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment