Commonwealth Games 2022: ‘త్రివర్ణాలు’ | Commonwealth Games 2022: India Wins Gold, Silver and Bronze Medals | Sakshi
Sakshi News home page

Commonwealth Games 2022: ‘త్రివర్ణాలు’

Published Sun, Jul 31 2022 5:30 AM | Last Updated on Sun, Jul 31 2022 7:21 AM

Commonwealth Games 2022: India Wins Gold, Silver and Bronze Medals - Sakshi

బరువులెత్తడంలో భారత్‌ భళా అనిపించింది. కామన్వెల్త్‌ గేమ్స్‌ రెండో రోజు వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శనతో స్వర్ణ, రజత, కాంస్యాలు మన ఖాతాలో చేరాయి. ఒలింపిక్స్‌ రజతధారి మీరాబాయి చాను తన స్థాయిని ప్రదర్శిస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో స్వర్ణం సాధించింది. యువ ఆటగాడు సంకేత్‌ సర్గార్‌ రజతంతో ఈ క్రీడల్లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టగా... సీనియర్‌ గురురాజ కంచు మోత మోగించి వరుసగా రెండో క్రీడల్లోనూ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు వరుసగా రెండో రోజు కూడా మన షట్లర్లు, బాక్సర్లు తమదైన ఆటతో దూసుకుపోవడం శనివారం పోటీల్లో విశేషం.

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌ ఒకే రోజు మూడు వేర్వేరు పతకాలతో తమ ముద్రను ప్రదర్శించింది. అందరిలోకి మహిళల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతక ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి 49 కేజీల కేటగిరీలో అలవోకగా, ప్రత్యర్థులకు అందనంత బరువెత్తి మొదటి స్థానంలో నిలిచింది. మణిపూర్‌కు చెందిన మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది.

మేరీ హనిత్రా (మారిషస్‌; 172 కేజీలు), హన్‌ కమిన్‌స్కీ (కెనడా; 171 కేజీలు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్‌ మహదేవ్‌ సర్గార్‌ రజత పతకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన సంకేత్‌ స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 135 కేజీలు (మొత్తం 248 కేజీలు) బరువెత్తిన అతను రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో మొహమ్మద్‌ అనీఖ్‌ కస్‌దమ్‌ (మలేసియా)కు స్వర్ణ పతకం దక్కింది.

అతను 107+142 (మొత్తం 249 కేజీలు) స్వర్ణం సాధించగా, ఇసురు కుమార (శ్రీలంక; మొత్తం 225 కేజీలు)కు కాంస్యం దక్కింది. పురుషుల 61 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్‌ గురురాజ పుజారికి కాంస్యం లభించింది. కర్ణాటకకు చెందిన గురురాజ స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 151 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌లో మొహమ్మద్‌ అజ్నిల్‌ (మలేసియా; 285 కేజీలు), బరు మొరియా (పపువా న్యూగినియా; 273 కేజీలు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు.  

మూడో ప్రయత్నంలో విఫలమై...
స్నాచ్‌ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది.

మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన సంకేత్, స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో 107, 111, 113 కిలోల బరువులెత్తి అగ్ర స్థానం సాధించాడు. రెండో స్థానంలో ఉన్న ప్రత్యర్థి బిన్‌కస్‌దమ్‌కంటే అతను 6 కిలోల ఆధిక్యంలో నిలిచాడు. క్లీన్‌ అండ్‌ జర్క్‌లో మొదటి ప్రయత్నంలో సంకేత్‌ 135 కిలోలు ఎత్తగా, బిన్‌కస్‌దన్‌ 138 కిలోలతో పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత సంకేత్‌ను దురదృష్టం వెంటాడింది.

రెండో ప్రయత్నంలో 139 కిలోలు ఎత్తే లక్ష్యంతో బరిలోకి దిగి విఫలమైన అతను... స్వర్ణమే లక్ష్యంగా మూడో ప్రయత్నంలో మరింత ఎక్కువ బరువును (141 కేజీ) ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరింతగా ఇబ్బంది పడిన సంకేత్‌ వెయిట్‌ను ఒక సెకన్‌ కూడా లిఫ్ట్‌ చేయలేక వదిలేశాడు. ఈ క్రమంలో అతని చేతికి గాయం కూడా అయింది.

చివరకు 1 కేజీ తేడాతో స్వర్ణం సంకేత్‌ చేజారింది.  2018 క్రీడల్లో రజతం గెలిచిన గురురాజ ఈసారి కాంస్యంతో ముగించాడు. అప్పుడు 56 కేజీల విభాగంలో పతకం గెలిచిన అతను ఒలింపిక్స్‌ లక్ష్యంగా కేటగిరీ మార్చుకొని 61 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు. బర్మింగ్‌హామ్‌ వచ్చిన తర్వాత కూడా జ్వరంతో బాధపడుతుండటంతో సరైన విధంగా సాధన సాగలేదు. ఈవెంట్లో ఒకదశలో కాంస్యం చేజారేలా అనిపించినా పట్టుదలగా నిలిచిన అతను ఒక కేజీ తేడాతో కెనడా లిఫ్టర్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంతో ముగించాడు.

బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌
బ్యాడ్మింటన్‌లో భారత జట్టు తొలి లక్ష్యం పూర్తయింది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో వరుసగా రెండో విజయంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకుంది. గ్రూప్‌ ‘ఎ’ రెండో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 5–0తో శ్రీలంక జట్టును ఓడించింది.   

ఫైనల్లో శ్రీహరి
స్విమ్మింగ్‌ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో భారత స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో శ్రీహరి 54.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్నాడు.  

హుసాముద్దీన్, లవ్లీనా శుభారంభం
పురుషుల బాక్సింగ్‌లో తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ (57 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి, మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్‌ (70 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో హుసాముద్దీన్‌ 5–0తో అమ్జోలెలె (దక్షిణాఫ్రికా)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో లవ్లీనా 5–0తో అరియాన్‌ నికోల్సన్‌ (న్యూజిలాండ్‌)పై గెలిచారు.  

మహిళల టీటీ జట్టుకు షాక్‌
టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో మహిళల టీమ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ పోరాటం క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 2–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. 2018 గోల్డ్‌కోస్ట్‌ గేమ్స్‌లో క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో ఓడిపోయిన మలేసియా ఈ గేమ్స్‌లో భారత్‌ను ఓడించి బదులు తీర్చుకుంది.

పాక్‌తో భారత్‌ పోరు...
కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల టి20 క్రికెట్‌ ఈవెంట్‌లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్‌ మధ్య గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌ జరగనుంది. తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్‌ ఓడిపోవడంతో సెమీఫైనల్‌ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement