sanket
-
Sanket Jadia: సంకేత చిత్రం
‘నరజాతి చరిత్ర సమస్తం – రణరక్త ప్రవాహసిక్తం’ అంటూ నిట్టూర్పుకే పరిమితం కాలేదు ఈ యంగ్ ఆర్టిస్ట్. చరిత్రలోని రణరంగాలను కాగడా పెట్టి వెదికాడు. సంక్లిష్టమైన చారిత్రక సందర్భాలను తన చిత్రాల్లోకి తర్జుమా చేశాడు సంకేత్ జాడియ.... సంకేత్ జాడియ తల్లి బొమ్మలు గీసేది. ఆమెకు ఆ విద్య ఎవరు నేర్పించారో తెలియదుగానీ ‘అద్భుతం’ అనిపించేలా గీసేది. అలా బొమ్మలపై చిన్నప్పటి నుంచే సంకేత్‌కు అభిమానం ఏర్పడింది. అమ్మ చనిపోయింది. అయితే సంకేత్ బొమ్మలు వేస్తున్నప్పుడు ఆమె లేని లోటు కనిపించదు. పక్కన కూర్చొని సలహాలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. అందుకే తనకు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. అమ్మ తనతో పాటు ఉంటుంది కదా! ‘పెద్దయ్యాక ఆర్టిస్ట్ కావాలి’ అని చిన్నప్పుడే బలంగా అనుకున్నాడు సంకేత్. పెద్దయ్యాక...కుమారుడి ఛాయిస్ ఆఫ్ కెరీర్ తండ్రికి నచ్చలేదు. అలా అని అడ్డుకోలేదు. ఒక ఆర్టిస్ట్ సక్సెస్‌ను ఏ ప్రమాణాలతో చూడాలనే విషయంలో గందరగోళ పడే ఎంతోమందిలో అతను కూడా ఒకరు. సూరత్‌లోని ‘సౌత్ గుజరాత్ యూనివర్శిటీ’లో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాడు సంకేత్. దిల్లీ అంబేడ్కర్ యూనివర్శిటీలో విజువల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన రోజుల్లో ఒక సంచలన ఘటన జరిగింది. ఫ్రెంచ్ సెటైరికల్ న్యూస్‌పేపర్ ‘చార్లీ హెబ్డో’పై దాడి జరిగింది. పన్నెండు మందిని చంపేశారు. ఇది తనను బాగా కదిలించింది. ‘ఎందుకు ఇలా?’ అని తీవ్రంగా ఆలోచించేలా చేసింది. ఆర్టిస్ట్‌లకు ఉన్న అదృష్టం ఏమిటంటే గుండె బరువును తమ సృజనాత్మక రూపాల ద్వారా దించుకోవచ్చు. సంకేత్ అదే చేశాడు. ‘చరిత్ర అనేది కథల్లో కాదు చిత్రాల్లో కనిపించాలి’ అనే ప్రసిద్ధ మాట తనకు ఇష్టం. అందుకే చిత్రం కోసం చరిత్రను ఇష్టపడ్డాడు. హింస మూలాల్లోకి వెళ్లాడు. స్వాతంత్య్రానంతర భారత్‌లోని హింసాత్మకమైన చారిత్రక ఘటనలకు తన కుంచెతో రూపు ఇవ్వాలనుకున్నాడు. నెరటీవ్స్, కౌంటర్ నెరటీవ్స్పై ఆసక్తి పెంచుకొని, చరిత్రకు సంబంధించిన సంక్లిష్టమైన సందర్భాలను చిత్రాల్లోకి ఎలా అనువాదం చేయాలనే విషయంలో రకరకాల కసరత్తులు చేసి సక్సెస్ అయ్యాడు. తనదైన నిర్మాణాన్ని సృష్టించుకున్నాడు. ఖాళీ బుర్రతో చూస్తే సంకేత్ చిత్రాలు అర్థం కాకపోవచ్చు. సమాజ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను నిశితంగా గమనించేవారికి మాత్రం అవి సులభంగా అర్థం అవుతాయి. లోతైన ఆలోచన చేసేలా చేస్తాయి. ‘లోతైన భావాల సమ్మేళనం సంకేత్ చిత్రాలు. కనిపించని రాజకీయాలు కూడా అందులో కనిపిస్తాయి’ అంటాడు ముంబైలోని ఛటర్జీ అండ్ లాల్ ఆర్ట్స్ గ్యాలరీ కో–ఫౌండర్ ఛటర్జీ. ఏ ఫ్యూచర్ అండర్ కన్స్ట్రక్షన్, ది ఆర్ట్ డికేడ్, ఇండియన్ సమ్మర్ ఫెస్టివల్... మొదలైన గ్రూప్ షోలలో సంకేత్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. శిల్పాల రూపకల్పనలోనూ తనదైన ప్రతిభ చూపుతున్న సంకేత్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. ఒకప్పుడు జీవిక కోసం గ్రాఫిక్ డిజైనర్, ఆర్ట్ టీచర్‌గా పనిచేసిన సంకేత్‌కు ఇప్పుడు ఆర్టే జీవితం. ఆనందం. సమస్తం. -
Commonwealth Games 2022: ‘త్రివర్ణాలు’
బరువులెత్తడంలో భారత్ భళా అనిపించింది. కామన్వెల్త్ గేమ్స్ రెండో రోజు వెయిట్‌లిఫ్టర్ల ప్రదర్శనతో స్వర్ణ, రజత, కాంస్యాలు మన ఖాతాలో చేరాయి. ఒలింపిక్స్ రజతధారి మీరాబాయి చాను తన స్థాయిని ప్రదర్శిస్తూ సంపూర్ణ ఆధిపత్యంతో స్వర్ణం సాధించింది. యువ ఆటగాడు సంకేత్ సర్గార్ రజతంతో ఈ క్రీడల్లో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టగా... సీనియర్ గురురాజ కంచు మోత మోగించి వరుసగా రెండో క్రీడల్లోనూ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు వరుసగా రెండో రోజు కూడా మన షట్లర్లు, బాక్సర్లు తమదైన ఆటతో దూసుకుపోవడం శనివారం పోటీల్లో విశేషం. బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఒకే రోజు మూడు వేర్వేరు పతకాలతో తమ ముద్రను ప్రదర్శించింది. అందరిలోకి మహిళల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతక ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి 49 కేజీల కేటగిరీలో అలవోకగా, ప్రత్యర్థులకు అందనంత బరువెత్తి మొదటి స్థానంలో నిలిచింది. మణిపూర్‌కు చెందిన మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. మేరీ హనిత్రా (మారిషస్; 172 కేజీలు), హన్ కమిన్స్కీ (కెనడా; 171 కేజీలు) తర్వాతి స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం గెలుచుకున్నారు. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ మహదేవ్ సర్గార్ రజత పతకం సాధించాడు. మహారాష్ట్రకు చెందిన సంకేత్ స్నాచ్‌లో 113 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 135 కేజీలు (మొత్తం 248 కేజీలు) బరువెత్తిన అతను రెండో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో మొహమ్మద్ అనీఖ్ కస్‌దమ్ (మలేసియా)కు స్వర్ణ పతకం దక్కింది. అతను 107+142 (మొత్తం 249 కేజీలు) స్వర్ణం సాధించగా, ఇసురు కుమార (శ్రీలంక; మొత్తం 225 కేజీలు)కు కాంస్యం దక్కింది. పురుషుల 61 కేజీల కేటగిరీలో భారత లిఫ్టర్ గురురాజ పుజారికి కాంస్యం లభించింది. కర్ణాటకకు చెందిన గురురాజ స్నాచ్‌లో 118 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 151 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 269 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్లో మొహమ్మద్ అజ్నిల్ (మలేసియా; 285 కేజీలు), బరు మొరియా (పపువా న్యూగినియా; 273 కేజీలు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. మూడో ప్రయత్నంలో విఫలమై... స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన సంకేత్, స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో 107, 111, 113 కిలోల బరువులెత్తి అగ్ర స్థానం సాధించాడు. రెండో స్థానంలో ఉన్న ప్రత్యర్థి బిన్కస్దమ్కంటే అతను 6 కిలోల ఆధిక్యంలో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్‌లో మొదటి ప్రయత్నంలో సంకేత్ 135 కిలోలు ఎత్తగా, బిన్కస్దన్ 138 కిలోలతో పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత సంకేత్‌ను దురదృష్టం వెంటాడింది. రెండో ప్రయత్నంలో 139 కిలోలు ఎత్తే లక్ష్యంతో బరిలోకి దిగి విఫలమైన అతను... స్వర్ణమే లక్ష్యంగా మూడో ప్రయత్నంలో మరింత ఎక్కువ బరువును (141 కేజీ) ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. అయితే మరింతగా ఇబ్బంది పడిన సంకేత్ వెయిట్‌ను ఒక సెకన్ కూడా లిఫ్ట్ చేయలేక వదిలేశాడు. ఈ క్రమంలో అతని చేతికి గాయం కూడా అయింది. చివరకు 1 కేజీ తేడాతో స్వర్ణం సంకేత్ చేజారింది. 2018 క్రీడల్లో రజతం గెలిచిన గురురాజ ఈసారి కాంస్యంతో ముగించాడు. అప్పుడు 56 కేజీల విభాగంలో పతకం గెలిచిన అతను ఒలింపిక్స్ లక్ష్యంగా కేటగిరీ మార్చుకొని 61 కేజీల విభాగంలో పోటీ పడ్డాడు. బర్మింగ్‌హామ్ వచ్చిన తర్వాత కూడా జ్వరంతో బాధపడుతుండటంతో సరైన విధంగా సాధన సాగలేదు. ఈవెంట్లో ఒకదశలో కాంస్యం చేజారేలా అనిపించినా పట్టుదలగా నిలిచిన అతను ఒక కేజీ తేడాతో కెనడా లిఫ్టర్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానంతో ముగించాడు. బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో భారత్ బ్యాడ్మింటన్‌లో భారత జట్టు తొలి లక్ష్యం పూర్తయింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వరుసగా రెండో విజయంతో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5–0తో శ్రీలంక జట్టును ఓడించింది. ఫైనల్లో శ్రీహరి స్విమ్మింగ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో శ్రీహరి 54.55 సెకన్లలో గమ్యానికి చేరి నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. హుసాముద్దీన్, లవ్లీనా శుభారంభం పురుషుల బాక్సింగ్‌లో తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి, మహిళల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ (70 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో హుసాముద్దీన్ 5–0తో అమ్జోలెలె (దక్షిణాఫ్రికా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో లవ్లీనా 5–0తో అరియాన్ నికోల్సన్ (న్యూజిలాండ్)పై గెలిచారు. మహిళల టీటీ జట్టుకు షాక్ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో మహిళల టీమ్ డిఫెండింగ్ చాంపియన్ భారత్ పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–3తో మలేసియా చేతిలో ఓడిపోయింది. 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో క్వార్టర్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన మలేసియా ఈ గేమ్స్‌లో భారత్‌ను ఓడించి బదులు తీర్చుకుంది. పాక్‌తో భారత్ పోరు... కామన్వెల్త్ గేమ్స్ మహిళల టి20 క్రికెట్ ఈవెంట్లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ జరగనుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ ఓడిపోవడంతో సెమీఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. మధ్యాహ్నం గం. 3:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
కథనం హైలైట్
‘పైసామే పరమాత్మ’ అన్నది సామెత. ఇప్పుడు ‘పైసా పరమాత్మ’ అనే పేరుతో ఓ సినిమా రూపొందింది. సంకేత్, సుధీర్, క్రిష్ణ తేజ, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష ముఖ్య తారలుగా విజయ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. కిరణ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. కథపై నమ్మకంతో తెరకెక్కించాం. నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా విజయ్ కిరణ్ చక్కగా తీశారు. మా సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘యూత్, ఫ్యామిలీస్ మెచ్చే ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథనం హైలైట్‌గా ఉంటుంది. రామ్ పైడిశెట్టి సాహిత్యం, కనిష్క్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి’’ అని విజయ్ కిరణ్ అన్నారు. -
ఈజీ మనీ కోసం...
‘‘పైసా పరమాత్మ’ టైటిల్, పోస్టర్ చాలా బాగున్నాయి. కథను దర్శకుడు విజయ్ నాకు చెప్పారు. చాలా కొత్తగా ఉందనిపించింది. ప్రతిభ ఉన్నవారు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు రావాలి. కొత్త కంటెంట్‌తో డిఫరెంట్‌గా తీస్తే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. ఆ విషయం ‘గూఢచారి’ చిత్రంతో మరోసారి రుజువైంది’’ అని నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు. సంకేత్, సుధీర్, కృష్ణతేజ, రమణ, అనూష, ఆరోహి నాయుడు, బనీష ప్రధాన పాత్రల్లో విజయ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పైసా పరమాత్మ’. లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై విజయ్ జగత్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ని రాజ్ కందుకూరి విడుదల చే శారు. విజయ్ కిరణ్ మాట్లాడుతూ –‘‘ఈజీ మనీ కోసం దొంగతనాలు, మోసాలు చేస్తోన్న ఓ నలుగురు కుర్రాళ్లు, ఇద్దరు యువతులు అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటారు. ఆ సమస్య నుంచి వారు బయట పడ్డారా? లేదా? అన్నది ముఖ్య కథాంశం’’ అన్నారు. -
సాకేత్ నిష్ర్కమణ
సింగిల్స్, డబుల్స్‌లో ఓటమి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ కర్షి (ఉజ్బెకిస్థాన్): ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని ప్రస్థానం ముగిసింది. సింగిల్స్‌లో క్వార్టర్స్‌తోపాటు డబుల్స్‌లో సెమీఫైనల్లో ఓటమిపాలై టోర్నీ నుంచి సాకేత్ నిష్ర్కమించాడు. గురువారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 1-6, 2-6 తేడాతో నికొలజ్ బసిలాష్విలి చేతిలో ఓడాడు. ఆ తరువాత జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్ మైనేని-జేమ్స్ క్లస్కీ (ఐర్లాండ్) జోడి సెర్గీ బెటోవ్-అలెగ్జాండర్ బురీ చేతిలో ఓడింది. ఇక తమిళనాడుకు చెందిన జీవన్ నెడున్‌చెజియాన్ తన కెరీర్లో తొలిసారిగా ఈ టోర్నీలో సెమీస్‌కు చేరాడు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జీవన్ 6-3, 6-2 తేడాతో రష్యాకు చెందిన మైఖేల్ లెదోవ్స్కిను ఓడించాడు. -
సెమీస్‌లో సాకేత్, విష్ణు ద్వయాలు
కోల్‌కతా: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్‌లు తమ భాగస్వాములతో కలిసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జంట 6-3, 6-3తో లుకాస్ పౌలీ (ఫ్రాన్స్)-గో సొయెదా (జపాన్) జోడిని ఓడించగా... విష్ణువర్ధన్-దివిజ్ శరణ్ (భారత్) ద్వయం 6-3, 7-6 (7/4)తో సియెన్ యిన్ పెంగ్-సుంగ్ హువా యాంగ్ (చైనీస్ తైపీ) జోడిపై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (భారత్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... యూకీ బాంబ్రీ (భారత్) ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సోమ్‌దేవ్ 6-3, 6-3తో కుద్రయెత్సెవ్ (రష్యా)పై నెగ్గగా... యూకీ బాంబ్రీ 3-6, 4-6తో డాన్స్కాయ్ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు.