‘నరజాతి చరిత్ర సమస్తం – రణరక్త ప్రవాహసిక్తం’ అంటూ నిట్టూర్పుకే పరిమితం కాలేదు ఈ యంగ్ ఆర్టిస్ట్. చరిత్రలోని రణరంగాలను కాగడా పెట్టి వెదికాడు.
సంక్లిష్టమైన చారిత్రక సందర్భాలను తన చిత్రాల్లోకి తర్జుమా చేశాడు సంకేత్ జాడియ....
సంకేత్ జాడియ తల్లి బొమ్మలు గీసేది. ఆమెకు ఆ విద్య ఎవరు నేర్పించారో తెలియదుగానీ ‘అద్భుతం’ అనిపించేలా గీసేది. అలా బొమ్మలపై చిన్నప్పటి నుంచే సంకేత్‌కు అభిమానం ఏర్పడింది. అమ్మ చనిపోయింది. అయితే సంకేత్ బొమ్మలు వేస్తున్నప్పుడు ఆమె లేని లోటు కనిపించదు.
పక్కన కూర్చొని సలహాలు చెబుతున్నట్లుగానే ఉంటుంది.
అందుకే తనకు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. అమ్మ తనతో పాటు ఉంటుంది కదా!
‘పెద్దయ్యాక ఆర్టిస్ట్ కావాలి’ అని చిన్నప్పుడే బలంగా అనుకున్నాడు సంకేత్.
పెద్దయ్యాక...కుమారుడి ఛాయిస్ ఆఫ్ కెరీర్ తండ్రికి నచ్చలేదు. అలా అని అడ్డుకోలేదు. ఒక ఆర్టిస్ట్ సక్సెస్‌ను ఏ ప్రమాణాలతో చూడాలనే విషయంలో గందరగోళ పడే ఎంతోమందిలో అతను కూడా ఒకరు.
సూరత్‌లోని ‘సౌత్ గుజరాత్ యూనివర్శిటీ’లో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాడు సంకేత్. దిల్లీ అంబేడ్కర్ యూనివర్శిటీలో విజువల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన రోజుల్లో ఒక సంచలన ఘటన జరిగింది. ఫ్రెంచ్ సెటైరికల్ న్యూస్‌పేపర్ ‘చార్లీ హెబ్డో’పై దాడి జరిగింది. పన్నెండు మందిని చంపేశారు. ఇది తనను బాగా కదిలించింది.
‘ఎందుకు ఇలా?’ అని తీవ్రంగా ఆలోచించేలా చేసింది.
ఆర్టిస్ట్‌లకు ఉన్న అదృష్టం ఏమిటంటే గుండె బరువును తమ సృజనాత్మక రూపాల ద్వారా దించుకోవచ్చు. సంకేత్ అదే చేశాడు.
‘చరిత్ర అనేది కథల్లో కాదు చిత్రాల్లో కనిపించాలి’ అనే ప్రసిద్ధ మాట తనకు ఇష్టం. అందుకే చిత్రం కోసం చరిత్రను ఇష్టపడ్డాడు.
హింస మూలాల్లోకి వెళ్లాడు. స్వాతంత్య్రానంతర భారత్‌లోని హింసాత్మకమైన చారిత్రక ఘటనలకు తన కుంచెతో రూపు ఇవ్వాలనుకున్నాడు.
నెరటీవ్స్, కౌంటర్ నెరటీవ్స్‌పై ఆసక్తి పెంచుకొని, చరిత్రకు సంబంధించిన సంక్లిష్టమైన సందర్భాలను చిత్రాల్లోకి ఎలా అనువాదం చేయాలనే విషయంలో రకరకాల కసరత్తులు చేసి సక్సెస్ అయ్యాడు. తనదైన నిర్మాణాన్ని సృష్టించుకున్నాడు.
ఖాళీ బుర్రతో చూస్తే సంకేత్ చిత్రాలు అర్థం కాకపోవచ్చు. సమాజ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను నిశితంగా గమనించేవారికి మాత్రం అవి సులభంగా అర్థం అవుతాయి. లోతైన ఆలోచన చేసేలా చేస్తాయి.
‘లోతైన భావాల సమ్మేళనం సంకేత్ చిత్రాలు. కనిపించని రాజకీయాలు కూడా అందులో కనిపిస్తాయి’ అంటాడు ముంబైలోని ఛటర్జీ అండ్ లాల్ ఆర్ట్స్ గ్యాలరీ కో–ఫౌండర్ ఛటర్జీ.
ఏ ఫ్యూచర్ అండర్ కన్‌స్ట్రక్షన్, ది ఆర్ట్ డికేడ్, ఇండియన్ సమ్మర్ ఫెస్టివల్... మొదలైన గ్రూప్ షోలలో సంకేత్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. శిల్పాల రూపకల్పనలోనూ తనదైన ప్రతిభ చూపుతున్న సంకేత్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు.
ఒకప్పుడు జీవిక కోసం గ్రాఫిక్ డిజైనర్, ఆర్ట్ టీచర్‌గా పనిచేసిన సంకేత్‌కు ఇప్పుడు ఆర్టే జీవితం. ఆనందం. సమస్తం.
Sanket Jadia: సంకేత చిత్రం
Published Fri, Nov 25 2022 12:27 AM | Last Updated on Fri, Nov 25 2022 6:56 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment