under 30
-
Sanket Jadia: సంకేత చిత్రం
‘నరజాతి చరిత్ర సమస్తం – రణరక్త ప్రవాహసిక్తం’ అంటూ నిట్టూర్పుకే పరిమితం కాలేదు ఈ యంగ్ ఆర్టిస్ట్. చరిత్రలోని రణరంగాలను కాగడా పెట్టి వెదికాడు. సంక్లిష్టమైన చారిత్రక సందర్భాలను తన చిత్రాల్లోకి తర్జుమా చేశాడు సంకేత్ జాడియ.... సంకేత్ జాడియ తల్లి బొమ్మలు గీసేది. ఆమెకు ఆ విద్య ఎవరు నేర్పించారో తెలియదుగానీ ‘అద్భుతం’ అనిపించేలా గీసేది. అలా బొమ్మలపై చిన్నప్పటి నుంచే సంకేత్‌కు అభిమానం ఏర్పడింది. అమ్మ చనిపోయింది. అయితే సంకేత్ బొమ్మలు వేస్తున్నప్పుడు ఆమె లేని లోటు కనిపించదు. పక్కన కూర్చొని సలహాలు చెబుతున్నట్లుగానే ఉంటుంది. అందుకే తనకు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. అమ్మ తనతో పాటు ఉంటుంది కదా! ‘పెద్దయ్యాక ఆర్టిస్ట్ కావాలి’ అని చిన్నప్పుడే బలంగా అనుకున్నాడు సంకేత్. పెద్దయ్యాక...కుమారుడి ఛాయిస్ ఆఫ్ కెరీర్ తండ్రికి నచ్చలేదు. అలా అని అడ్డుకోలేదు. ఒక ఆర్టిస్ట్ సక్సెస్‌ను ఏ ప్రమాణాలతో చూడాలనే విషయంలో గందరగోళ పడే ఎంతోమందిలో అతను కూడా ఒకరు. సూరత్‌లోని ‘సౌత్ గుజరాత్ యూనివర్శిటీ’లో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నాడు సంకేత్. దిల్లీ అంబేడ్కర్ యూనివర్శిటీలో విజువల్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన రోజుల్లో ఒక సంచలన ఘటన జరిగింది. ఫ్రెంచ్ సెటైరికల్ న్యూస్‌పేపర్ ‘చార్లీ హెబ్డో’పై దాడి జరిగింది. పన్నెండు మందిని చంపేశారు. ఇది తనను బాగా కదిలించింది. ‘ఎందుకు ఇలా?’ అని తీవ్రంగా ఆలోచించేలా చేసింది. ఆర్టిస్ట్‌లకు ఉన్న అదృష్టం ఏమిటంటే గుండె బరువును తమ సృజనాత్మక రూపాల ద్వారా దించుకోవచ్చు. సంకేత్ అదే చేశాడు. ‘చరిత్ర అనేది కథల్లో కాదు చిత్రాల్లో కనిపించాలి’ అనే ప్రసిద్ధ మాట తనకు ఇష్టం. అందుకే చిత్రం కోసం చరిత్రను ఇష్టపడ్డాడు. హింస మూలాల్లోకి వెళ్లాడు. స్వాతంత్య్రానంతర భారత్‌లోని హింసాత్మకమైన చారిత్రక ఘటనలకు తన కుంచెతో రూపు ఇవ్వాలనుకున్నాడు. నెరటీవ్స్, కౌంటర్ నెరటీవ్స్పై ఆసక్తి పెంచుకొని, చరిత్రకు సంబంధించిన సంక్లిష్టమైన సందర్భాలను చిత్రాల్లోకి ఎలా అనువాదం చేయాలనే విషయంలో రకరకాల కసరత్తులు చేసి సక్సెస్ అయ్యాడు. తనదైన నిర్మాణాన్ని సృష్టించుకున్నాడు. ఖాళీ బుర్రతో చూస్తే సంకేత్ చిత్రాలు అర్థం కాకపోవచ్చు. సమాజ ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను నిశితంగా గమనించేవారికి మాత్రం అవి సులభంగా అర్థం అవుతాయి. లోతైన ఆలోచన చేసేలా చేస్తాయి. ‘లోతైన భావాల సమ్మేళనం సంకేత్ చిత్రాలు. కనిపించని రాజకీయాలు కూడా అందులో కనిపిస్తాయి’ అంటాడు ముంబైలోని ఛటర్జీ అండ్ లాల్ ఆర్ట్స్ గ్యాలరీ కో–ఫౌండర్ ఛటర్జీ. ఏ ఫ్యూచర్ అండర్ కన్స్ట్రక్షన్, ది ఆర్ట్ డికేడ్, ఇండియన్ సమ్మర్ ఫెస్టివల్... మొదలైన గ్రూప్ షోలలో సంకేత్ చిత్రాలకు మంచి పేరు వచ్చింది. శిల్పాల రూపకల్పనలోనూ తనదైన ప్రతిభ చూపుతున్న సంకేత్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. ఒకప్పుడు జీవిక కోసం గ్రాఫిక్ డిజైనర్, ఆర్ట్ టీచర్‌గా పనిచేసిన సంకేత్‌కు ఇప్పుడు ఆర్టే జీవితం. ఆనందం. సమస్తం. -
అమ్మాయిల్లో విభిన్నం.. ఈ విభా!
మనకేదైనా ఆరోగ్య సమస్య ఎదురైన వెంటనే డాక్టర్ల దగ్గరకు పరుగెత్తుకెళ్లి్ ట్రీట్మెంట్ చేయించుకుని వారు చెప్పిన విధంగా మందులు వాడతాం. ఒకసారి సమస్య తీరితే అక్కడితో ఆవిషయాన్ని మర్చిపోతాం. బెంగళూరుకు చెందిన 25 ఏళ్ల విభా హరీష్ మాత్రం అలా చేయలేదు. తనకు వచ్చిన ఆరోగ్య సమస్యకు డాక్టర్లు ఇచ్చిన మందులు ఎలా పనిచేస్తున్నాయో జాగ్రత్తగా పరిశీలించి, వాటి పనితీరు నచ్చడంతో ఏకంగా ఒక మందుల తయారీ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడుపుతోంది. దీంతో తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన ఏసియా అండర్ 30 జాబితాలో విభా హరీష్‌కు చోటు దక్కింది. విభా హరీష్ ఇంటర్మీడియట్ చదువుతుండ గా తనకి పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పీసీఓఎస్ నుంచి బయటపడేందుకు ఆయుర్వేద మెడిసిన్ బాగా పనిచేస్తుందని విభా వాళ్ల అమ్మ చెప్పడంతో.. ఆయుర్వేద మందులు వాడడం ప్రారంభించి అవి ఎలా పనిచేస్తున్నాయో చాలా జాగ్రత్తగా పరిశీలించేది. ఈ క్రమంలో తన పీసీఓఎస్ సమస్య పూర్తిగా నయం అయిన తరువాత.. ఆయుర్వేద మెడిసిన్స్ గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి విభాకు కలగడంతో..∙వివిధ రకాల సమస్యలకు ఆయుర్వేద మందులు ఎలా పనిచేస్తున్నాయో తన మీదే ప్రయోగించి తెలుసుకునేది. అలా ఆయుర్వేద ప్రాముఖ్యాన్ని గుర్తించి ‘కాస్మిక్స్’ అనే ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. జీర్ణ వ్యవస్థ, కాలేయం, చర్మం, నిద్రలేమి, కేశ సంరక్షణకు సంబంధించి ఎనిమిది రకాల హెర్బల్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. కాస్మిక్స్ ప్రారంభించిన ఏడాది కాలంలోనే రెండు కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఇంజినీరింగ్ చదువుతోన్న విభా మూలికా వైద్యం గురించి మరింత తెలుసుకోవడానికి ఆయుర్వేద ఔషధాలపై అధ్యయనం చేస్తోంది. విభా తన తల్లి ప్రోత్సాహంతో కాస్మిక్స్ సంస్థను విజయపథంలో నడిపిస్తోంది. విభా తల్లి హోమియోపతిలో శిక్షణ తీసుకోవడం వల్ల కాస్మిక్స్లో తయారయ్యే ఉత్పత్తులను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విభా తన కంపెనీకి వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మంచి ఆహారాన్ని అందించేందుకు ఖర్చు చేస్తుండడం విశేషం. విభా మాట్లాడుతూ..‘‘నాకు పీసీఓఎస్ ఎదురైనప్పుడు దానినుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేశాను. ఇందులో భాగంగా ..పీసీఓస్ గురించిన సమాచారం కోసం నెట్లో తీవ్రంగా వెదికేదాన్ని. ఆ సమయంలో చాలా మంది ఏం తినాలి? ఎటువంటి వ్యాయామాలు చేయాలి అనే దానిపై విభిన్న అభిప్రాయాలను చదివాను. వాటిలో ఏది కరెక్ట్, మనకు కచ్చితంగా పనిచేసేది ఏంటో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. రకరకాల ప్రయత్నాల తరువాత మా అమ్మ సలహా మేరకు ఆయుర్వేదం మందులు వాడాను. అవి నాకు బాగా పనిచేశాయి. దీంతో నాలాగా ఇబ్బంది పడుతున్నవారికి ఇవి అందించాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో నేను ఆయుర్వేద మూలికలు గురించి లోతుగా తెలుసుకుని నాకు ఆయుర్వేదంపై ఒక అవగాహన వచ్చిన తరువాత కాస్మిక్స్ సంస్థను ప్రారంభించాను. పూర్తిగా ప్రకృతిసిద్ధమైన ఉత్పత్తులు కావడంతో మంచి స్పందన వచ్చింది. ఒక సంవత్సర కాలంలోనే కాస్మిక్స్ ఈ స్థాయికి చేరుకుంది. ఫోర్బ్స్ ఏసియా అండర్ 30 జాబితాలో నా పేరు కూడా ఉండడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని విభా చెప్పింది. -
శక్తివంతమైన యువతి సంప్రీతి..!
ముఫ్పై ఏళ్లు కూడ నిండని ఆమె... అత్యంత ప్రతిభావంతుల జాబితాలో నిలిచింది. అండర్ వాటర్ డ్రోన్స్ ను అభివృద్ధి పరచి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. జీపీఎస్ పని చేయని సముద్రాంతర భాగాల్లో కూడ సులభంగా తిరుగుతూ అక్కడి విశేషాలను అన్వేషించే చిన్నపాటి పరికరాన్ని సృష్టించి ఫోర్బ్స్ టాప్ 30 శక్తివంతుల్లో ఒకతెగా పేరు సంపాదించింది. కోల్ కతాకు చెందిన 28ఏళ్ళ సంప్రీతి భట్టాచార్య మసాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పీహెచ్ డీ చేసింది. అత్యంత సులభంగా అన్వేషించే చిన్నపాటి డ్రోన్ ను కనిపెట్టి ప్రపంచంలోనే ప్రతిభావంతుల సరసన చేరింది. జీపీఎస్ పనిచేయని ప్రదేశాల్లో, సముద్రంలోని నీటి అడుగు భాగంలో అన్వేషణ చేయడంతోపాటు, డేటాను మ్యాప్ చేసే డ్రోన్ ను రూప కల్పన చేసి అత్యంత శక్తివంతమైన యువతిగా పేరు తెచ్చుకుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండి, సుమారు ఫుడ్ బాల్ పరిమాణంలో ఉండే ఓ చిన్న స్వయం ప్రతిపత్తి కలిగిన డ్రోన్ ను మార్కెట్లోకి కొత్తగా విడుదల చేసి వార్తల్లోకెక్కింది. కోల్ కతాలోని సెయింట్ థామస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాలయంనుంచి ఇంజనీరింగ్ అభ్యసించిన సంప్రీతి... తరువాత ఓహియోస్టేట్ యూనివర్శిటీ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అనంతరం ఎంఐటీలో రోబోటిక్స్ పై అధ్యయనం చేసింది. ప్రస్తుతం సముద్రాంతరాల్లో, నీటి అడుగు భాగంలో చమురు, పర్యావరణ పర్యవేక్షణ, అన్వేషణా కార్యకలాపాలను అధ్యయనం చేసేందుకు అటానమస్ అండర్ వాటర్ వెహికిల్ (AUV) అనే చాలా ఖరీదైన మిషన్ ఆధారిత పరికరాన్ని వినియోగిస్తున్నారు. పైగా ఆ అతి పెద్ద మెషీన్ తో సముద్రంలోని రోజువారీ విషయాలను, పర్యావరణాన్నిఅధ్యయనం చేసే అవకాశం కూడ ఉండదు. ఇదే విషయాన్ని గమనించిన సంప్రీతి సముద్రాల్లో సులభంగా తిరిగి అక్కడి ప్రతివిషయాన్నీ పరిశీలించే అతి చిన్న డ్రోన్ ను అభివృద్ధి పరిచింది. దీని ద్వారా భవిష్యత్ తరాల్లో మార్పును సముద్రాంతరాల్లో డేటాను సేకరించడం సులభమౌతుందని చెప్తోంది. అండర్ వాటర్ నేవిగేషన్ అనేక సంవత్సరాల క్రితమే అమల్లోకి వచ్చిందని, అయితే ఆధునిక పరిశోధనల ద్వారా రూపొందించిన తన డ్రోన్ గూగుల్ మ్యాప్ లా త్వరితగతిన విషయాన్ని సేకరించే అవకాశం ఉంటుందని సంప్రీతి చెప్తోంది. అంతేకాక అతి చిన్న, సూక్ష్మమైన వస్తువులను, జీవులను కూడ ఇది గుర్తిస్తుందని, దీంతో నీటి అడుగుభాగాన ఉండే కాలుష్యాన్ని కూడ గుర్తించే అవకాశం ఉందని చెప్తోంది. జలజీవితాన్ని అధ్యయనం చేయడంలో ఈ డ్రోన్లు గంటకు వంద చదరపు కిలోమీటర్ల వరకు కవర్ చేస్తాయని, లోతైన సముద్రాల్లో కూడ అపారమైన ఒత్తిడిని తట్టుకుని, ఈతకొడుతూ విషయాలను గుర్తిస్తాయని వెల్లడించింది. తన డ్రోన్ ను వ్యాపారాత్మకం చేసే ఉద్దేశ్యంలో ఉన్న సంప్రీతి ఓ సంస్థను ప్రారంభించాలనుకుంది. అందులో భాగంగానే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఎంఐటి 100కె. డాలర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పోటీలో టాప్ 8 గా నిలిచి, 15,000 డాలర్లను ప్రైజ్ గా కూడ గెలుచుకుంది. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, చిన్న వయసులోనే ప్రయోగాలను నిర్వహిస్తున్న సంప్రీతి యువలోకానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.