శక్తివంతమైన యువతి సంప్రీతి..!
ముఫ్పై ఏళ్లు కూడ నిండని ఆమె... అత్యంత ప్రతిభావంతుల జాబితాలో నిలిచింది. అండర్ వాటర్ డ్రోన్స్ ను అభివృద్ధి పరచి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. జీపీఎస్ పని చేయని సముద్రాంతర భాగాల్లో కూడ సులభంగా తిరుగుతూ అక్కడి విశేషాలను అన్వేషించే చిన్నపాటి పరికరాన్ని సృష్టించి ఫోర్బ్స్ టాప్ 30 శక్తివంతుల్లో ఒకతెగా పేరు సంపాదించింది.
కోల్ కతాకు చెందిన 28ఏళ్ళ సంప్రీతి భట్టాచార్య మసాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పీహెచ్ డీ చేసింది. అత్యంత సులభంగా అన్వేషించే చిన్నపాటి డ్రోన్ ను కనిపెట్టి ప్రపంచంలోనే ప్రతిభావంతుల సరసన చేరింది. జీపీఎస్ పనిచేయని ప్రదేశాల్లో, సముద్రంలోని నీటి అడుగు భాగంలో అన్వేషణ చేయడంతోపాటు, డేటాను మ్యాప్ చేసే డ్రోన్ ను రూప కల్పన చేసి అత్యంత శక్తివంతమైన యువతిగా పేరు తెచ్చుకుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండి, సుమారు ఫుడ్ బాల్ పరిమాణంలో ఉండే ఓ చిన్న స్వయం ప్రతిపత్తి కలిగిన డ్రోన్ ను మార్కెట్లోకి కొత్తగా విడుదల చేసి వార్తల్లోకెక్కింది.
కోల్ కతాలోని సెయింట్ థామస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాలయంనుంచి ఇంజనీరింగ్ అభ్యసించిన సంప్రీతి... తరువాత ఓహియోస్టేట్ యూనివర్శిటీ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అనంతరం ఎంఐటీలో రోబోటిక్స్ పై అధ్యయనం చేసింది. ప్రస్తుతం సముద్రాంతరాల్లో, నీటి అడుగు భాగంలో చమురు, పర్యావరణ పర్యవేక్షణ, అన్వేషణా కార్యకలాపాలను అధ్యయనం చేసేందుకు అటానమస్ అండర్ వాటర్ వెహికిల్ (AUV) అనే చాలా ఖరీదైన మిషన్ ఆధారిత పరికరాన్ని వినియోగిస్తున్నారు. పైగా ఆ అతి పెద్ద మెషీన్ తో సముద్రంలోని రోజువారీ విషయాలను, పర్యావరణాన్నిఅధ్యయనం చేసే అవకాశం కూడ ఉండదు. ఇదే విషయాన్ని గమనించిన సంప్రీతి సముద్రాల్లో సులభంగా తిరిగి అక్కడి ప్రతివిషయాన్నీ పరిశీలించే అతి చిన్న డ్రోన్ ను అభివృద్ధి పరిచింది. దీని ద్వారా భవిష్యత్ తరాల్లో మార్పును సముద్రాంతరాల్లో డేటాను సేకరించడం సులభమౌతుందని చెప్తోంది. అండర్ వాటర్ నేవిగేషన్ అనేక సంవత్సరాల క్రితమే అమల్లోకి వచ్చిందని, అయితే ఆధునిక పరిశోధనల ద్వారా రూపొందించిన తన డ్రోన్ గూగుల్ మ్యాప్ లా త్వరితగతిన విషయాన్ని సేకరించే అవకాశం ఉంటుందని సంప్రీతి చెప్తోంది. అంతేకాక అతి చిన్న, సూక్ష్మమైన వస్తువులను, జీవులను కూడ ఇది గుర్తిస్తుందని, దీంతో నీటి అడుగుభాగాన ఉండే కాలుష్యాన్ని కూడ గుర్తించే అవకాశం ఉందని చెప్తోంది.
జలజీవితాన్ని అధ్యయనం చేయడంలో ఈ డ్రోన్లు గంటకు వంద చదరపు కిలోమీటర్ల వరకు కవర్ చేస్తాయని, లోతైన సముద్రాల్లో కూడ అపారమైన ఒత్తిడిని తట్టుకుని, ఈతకొడుతూ విషయాలను గుర్తిస్తాయని వెల్లడించింది. తన డ్రోన్ ను వ్యాపారాత్మకం చేసే ఉద్దేశ్యంలో ఉన్న సంప్రీతి ఓ సంస్థను ప్రారంభించాలనుకుంది. అందులో భాగంగానే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఎంఐటి 100కె. డాలర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పోటీలో టాప్ 8 గా నిలిచి, 15,000 డాలర్లను ప్రైజ్ గా కూడ గెలుచుకుంది. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, చిన్న వయసులోనే ప్రయోగాలను నిర్వహిస్తున్న సంప్రీతి యువలోకానికి స్ఫూర్తిగా నిలుస్తోంది.