జలాంతర మెట్రో.. హూగ్లీ నదిపై నేడే ప్రారంభం | India first ever underwater metro service to open in Kolkata: PM Modi set to inaugurate on March 6 | Sakshi
Sakshi News home page

జలాంతర మెట్రో.. హూగ్లీ నదిపై నేడే ప్రారంభం

Published Wed, Mar 6 2024 4:17 AM | Last Updated on Wed, Mar 6 2024 11:07 AM

India first ever underwater metro service to open in Kolkata: PM Modi set to inaugurate on March 6 - Sakshi

నేడే కోల్‌కతాలో నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభం 

ఆధునిక భారత రైల్వే చరిత్రలో నూతన అధ్యాయానికి అండర్‌ వాటర్‌ మెట్రో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. అత్యంత లోతైన హౌరా మెట్రో స్టేషన్‌ గుండా నీటి అడుగున మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు కోల్‌కతాలోని ఈస్ట్‌–కోస్ట్‌ మెట్రో కారిడార్‌ వేదికగా మారనుంది. ఈ కారిడార్‌లోని హౌరా మైదాన్‌– ఎస్‌ప్లానేడ్‌ సెక్షన్‌లో ఈ అండర్‌ వాటర్‌ మెట్రో సేవలు ప్రయాణికులకు అద్భుత అనుభూతిని పంచనున్నాయి. దేశంలోనే మొట్టమొదటిదైన ఈ అండర్‌వాటర్‌ మెట్రో సేవలను బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. హూగ్లీ నది జలాల కింద ఈ మెట్రో ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.  

విశేషాలు ఇవే...
► ఈస్ట్‌–వెస్ట్‌ మెట్రో మొత్తం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా అందులో 10.8 కిలోమీటర్లమేర విస్తరించిన కారిడార్‌లో రైలు భూగర్భంలో ప్రయాణించనుంది. 
► ఇందులో పూర్తిగా నదీజలాల కింద నుంచి 520 మీటర్లమేర రైలు పరుగులుపెట్టనుంది. 45 సెకన్లపాటు సాగే ఈ నదీగర్భ ప్రయాణం మెట్రో రైలు ప్రయాణికులకు అనిర్వచనీయ అనుభూతి ఇవ్వనుంది 
► దేశంలో తొలిసారిగా నది అడుగున నిర్మించిన తొలి రవాణా టన్నెల్‌ కూడా ఇదే కావడం విశేషం.  

► కోల్‌కతా పరిధిలోని జంట నగరాలుగా పేరొందిన హౌరా, సాల్ట్‌ లేక్‌లను కలుపుతూ ఈ మెట్రో రైల్వే సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. 
​​​​​​​► 16.6 కిలోమీటర్లలో 4.8 కిలోమీటర్ల మార్గం కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ సిటీ ఐదో సెక్టార్, సెల్డాలోని కీలకమైన ఐటీ హబ్‌కు ఎంతో దోహదపడనుంది.   
​​​​​​​► హూగ్లీ నది అడుగున నిర్మించిన తొలి మెట్రో సొరంగ మార్గంగా ఇది రికార్డులకెక్కనుంది.  

​​​​​​​► ‘కోల్‌కతా మెట్రో’కు సంబంధించి 2023 ఏప్రిల్‌ నెల ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆ నెలలో నదీ అడుగున 32 మీటర్ల మేర ప్రయోగాత్మక మెట్రో రైలును విజయవంతంగా నడిపి చూశారు. 

​​​​​​​► నేడు ( బుధవారం) ప్రధాని మోదీ ఈ రైల్వే సేవలను లాంఛనంగా ప్రారంభించాక గురువారం నుంచి సాధారణ పౌరులను ప్రయాణాలకు అనుమతిస్తామని కోల్‌కతా మెట్రో అధికారి కౌశిక్‌ మిత్రా చెప్పారు. కవి సుభాష్ –హిమంత ముఖోపాధ్యాయ్, తారాతలా–మాజెర్హాట్‌ మెట్రో సెక్షన్లను మోదీ ప్రారంభిస్తారు. 
​​​​​​​► ఈ మెట్రో సెక్షన్‌లో మొత్తంగా ఆరు స్టేషన్లు ఉంటాయి. వీటిలో మూడింటిని భూగర్భంలోనే కట్టారు. అయినా సరే ప్రయాణికులు భూగర్భం లోపలికి, బయటకు వేగంగా వచి్చపోయేందుకు వీలుగా నిర్మించారు.  

​​​​​​​► అత్యంత రద్దీ, కాలుష్యమయ కోల్‌కతాలో పర్యావరణ అనుకూల ప్రయాణానికి భరోసానిస్తూ ఈ మెట్రోను ఇలా భూగర్భంలో డిజైన్‌చేశారు. దీంతో కాలుష్య తగ్గడంతోపాటు ప్రయాణికులకు ప్రయాణసమయమూ కలిసిరానుంది. 
​​​​​​​► ఈస్ట్‌–వెస్ట్‌ మెట్రో కారిడార్‌ పనులు 2009లోనే మొదలయ్యాయి. హూగ్లీ నది అంతర్భాగ పనులు మాత్రం 2017లో ఊపందుకున్నాయి 
​​​​​​​► 2019 ఆగస్ట్‌లో భూగర్భంలో కొన్ని చోట్ల భూగర్భ జలాలు ఉబికిరావడం, భూమి కుంగడం వంటి ఘటనలతో అండర్‌వాటర్‌ మెట్రో పనుల్లో ఆలస్యం చోటుచేసుకుంది. 2022లో వాటర్‌ లీకేజీ ఘటనలూ ఎదురైనా అన్ని బాలారిష్టాలను దాటుకుంటూ ఎట్టకేలకు ఈ మెట్రో నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. 

ప్రపంచంలో ఎన్నెన్నో 
19వ శతాబ్దిలోనే ఇంగ్లిష్‌ ఇంజనీర్లు భూగర్భ రైల్వే సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంలోనే పురాతన భూగర్భ రైల్వే నెట్‌వర్క్‌గా థేమ్స్‌ టన్నెల్‌ను చెప్పుకోవచ్చు. 1843లోనే రోథర్‌హీట్, ర్యాపింగ్‌ పట్టణాల మధ్య ఈ మార్గాన్ని నిర్మించారు. ఇప్పుడిది లండన్‌లో కీలక రైలు మార్గాల్లో ఒకటి. దీని పొడవు కేవలం 400 మీటర్లు. జపాన్‌లోని సీకెల్‌ టన్నెల్‌ ప్రఖ్యాతిగాంచిన అండర్‌వాటర్‌ రైల్వే టన్నెల్‌గా పేరొందింది. దీని పొడవు ఏకంగా 53.85 కిలోమీటర్లు. హోన్‌షూ, హోకైడో ద్వీపాల మధ్య సుగారు జలసంధి కింద దీనిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే లోతైన, పొడవైన రైల్వే టన్నెల్‌గా రికార్డుసృష్టించింది. తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో బోస్ఫోరస్‌ జలసంధి కింద అండర్‌వాటర్‌ టన్నెల్‌ నిర్మించారు. ఇది ఇస్తాంబుల్‌లోని ఆసియా, యూరప్‌ భూభాగాలను కలుపుతుంది. ఈ రైల్వే టన్నెల్‌ పొడవు దాదాపు 14 కి.మీ.లు.
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement