మనకేదైనా ఆరోగ్య సమస్య ఎదురైన వెంటనే డాక్టర్ల దగ్గరకు పరుగెత్తుకెళ్లి్ ట్రీట్మెంట్ చేయించుకుని వారు చెప్పిన విధంగా మందులు వాడతాం. ఒకసారి సమస్య తీరితే అక్కడితో ఆవిషయాన్ని మర్చిపోతాం. బెంగళూరుకు చెందిన 25 ఏళ్ల విభా హరీష్ మాత్రం అలా చేయలేదు. తనకు వచ్చిన ఆరోగ్య సమస్యకు డాక్టర్లు ఇచ్చిన మందులు ఎలా పనిచేస్తున్నాయో జాగ్రత్తగా పరిశీలించి, వాటి పనితీరు నచ్చడంతో ఏకంగా ఒక మందుల తయారీ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడుపుతోంది. దీంతో తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన ఏసియా అండర్ 30 జాబితాలో విభా హరీష్‌కు చోటు దక్కింది.
విభా హరీష్ ఇంటర్మీడియట్ చదువుతుండ గా తనకి పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పీసీఓఎస్ నుంచి బయటపడేందుకు ఆయుర్వేద మెడిసిన్ బాగా పనిచేస్తుందని విభా వాళ్ల అమ్మ చెప్పడంతో.. ఆయుర్వేద మందులు వాడడం ప్రారంభించి అవి ఎలా పనిచేస్తున్నాయో చాలా జాగ్రత్తగా పరిశీలించేది. ఈ క్రమంలో తన పీసీఓఎస్ సమస్య పూర్తిగా నయం అయిన తరువాత.. ఆయుర్వేద మెడిసిన్స్ గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి విభాకు కలగడంతో..∙వివిధ రకాల సమస్యలకు ఆయుర్వేద మందులు ఎలా పనిచేస్తున్నాయో తన మీదే ప్రయోగించి తెలుసుకునేది. అలా ఆయుర్వేద ప్రాముఖ్యాన్ని గుర్తించి ‘కాస్మిక్స్’ అనే ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది.
జీర్ణ వ్యవస్థ, కాలేయం, చర్మం, నిద్రలేమి, కేశ సంరక్షణకు సంబంధించి ఎనిమిది రకాల హెర్బల్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. కాస్మిక్స్ ప్రారంభించిన ఏడాది కాలంలోనే రెండు కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఇంజినీరింగ్ చదువుతోన్న విభా మూలికా వైద్యం గురించి మరింత తెలుసుకోవడానికి ఆయుర్వేద ఔషధాలపై అధ్యయనం చేస్తోంది. విభా తన తల్లి ప్రోత్సాహంతో కాస్మిక్స్ సంస్థను విజయపథంలో నడిపిస్తోంది. విభా తల్లి హోమియోపతిలో శిక్షణ తీసుకోవడం వల్ల కాస్మిక్స్‌లో తయారయ్యే ఉత్పత్తులను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విభా తన కంపెనీకి వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మంచి ఆహారాన్ని అందించేందుకు ఖర్చు చేస్తుండడం విశేషం.
విభా మాట్లాడుతూ..‘‘నాకు పీసీఓఎస్ ఎదురైనప్పుడు దానినుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేశాను. ఇందులో భాగంగా ..పీసీఓస్ గురించిన సమాచారం కోసం నెట్‌లో తీవ్రంగా వెదికేదాన్ని. ఆ సమయంలో చాలా మంది ఏం తినాలి? ఎటువంటి వ్యాయామాలు చేయాలి అనే దానిపై విభిన్న అభిప్రాయాలను చదివాను. వాటిలో ఏది కరెక్ట్, మనకు కచ్చితంగా పనిచేసేది ఏంటో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. రకరకాల ప్రయత్నాల తరువాత మా అమ్మ సలహా మేరకు ఆయుర్వేదం మందులు వాడాను.
అవి నాకు బాగా పనిచేశాయి. దీంతో నాలాగా ఇబ్బంది పడుతున్నవారికి ఇవి అందించాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో నేను ఆయుర్వేద మూలికలు గురించి లోతుగా తెలుసుకుని నాకు ఆయుర్వేదంపై ఒక అవగాహన వచ్చిన తరువాత కాస్మిక్స్ సంస్థను ప్రారంభించాను. పూర్తిగా ప్రకృతిసిద్ధమైన ఉత్పత్తులు కావడంతో మంచి స్పందన వచ్చింది. ఒక సంవత్సర కాలంలోనే కాస్మిక్స్ ఈ స్థాయికి చేరుకుంది. ఫోర్బ్స్ ఏసియా అండర్ 30 జాబితాలో నా పేరు కూడా ఉండడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని విభా చెప్పింది.
అమ్మాయిల్లో విభిన్నం.. ఈ విభా!
Published Sat, Apr 24 2021 2:59 AM | Last Updated on Sat, Apr 24 2021 11:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment