
‘ఆ.. మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలయ్యా! ఉత్తికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది?’– ‘ముత్యాలముగ్గు’ సినిమాలో కాంట్రాక్టరు పాత్రధారి రావు గోపాలరావు పలికిన అమృతవాక్కులివి. ముళ్లపూడి వెంకటరమణ కలం నుంచి తూటాల్లా వెలువడిన మాటలివి. తెలుగునాట అమిత జనాదరణ పొందిన పది సినిమా డైలాగుల జాబితాను ఎవరైనా రూపొందిస్తే, ఈ డైలాగుకు అందులో తప్పకుండా చోటు దక్కి తీరుతుంది.
నిజమే! ఊరకే తిని తొంగున్నట్లయితే, మనిషికీ గొడ్డుకూ ఏమాత్రం తేడా ఉండదు. గొడ్డుకు లేని బుద్ధి మనిషికి ఉంది. మనిషిని ఇతర జంతుతతి నుంచి వేరు చేసేది ఆలోచనా శక్తి మాత్రమే! ఆలోచనకు పదునుపెట్టే సాధనం సృజనాత్మకత. మనిషిలోని సృజనాత్మకతకు ఫలితాలే కళలు.
కొందరికి జన్మతః కళాభినివేశం ఉంటుంది. అలాంటివారు సునాయాసంగా కళలను కైవసం చేసుకోగలుగుతారు. ఇంకొందరు అభిరుచితో సాధన చేసి కళల్లో రాణిస్తారు. అభినివేశం, సాధన లేకున్నా, చాలామంది కళలను ఆస్వాదిస్తారు. కలిగిన ఆసాములు కళలను ఆదరిస్తారు. కళలు అరవై నాలుగు అని వాత్సా్యయనుడు చెప్పాడు. వీటిలో చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నృత్యం, కవిత్వం అనే అయిదు కళలూ లలితకళలుగా గుర్తింపు పొందాయి.
లలితకళలు మనుషుల భావోద్వేగాల అభివ్యక్తికి అందమైన సాధనాలు. మనుషులు తమ ఆలోచనలను, ఆనంద విషాదాది భావోద్వేగాలను; తమ కాల్పనిక ఊహాజగత్తులోని విశేషాలను, తమ సృజనాత్మకతను ఇతరులతో పంచుకోవడానికి కళలను ప్రదర్శిస్తారు. పురాతన నాగరికతలు ఊపిరి పోసుకోక మునుపటి నుంచే మనుషులు కళల ద్వారా తమ ఉద్వేగాలను చాటుకోవడం మొదలుపెట్టారు.
మాటలాడటం ఇంకా నేర్చుకోని ఆనాటి మానవులు బొమ్మల ద్వారా తమ ఆలోచనలను వెల్లడించేవారు. పాతరాతి యుగం మానవులు రాతిగుహల గోడల మీద చిత్రించిన చిత్రాలే ఇందుకు ఆనవాళ్లు. నాగరికతలు మొదలైన నాటి నుంచి నేటి వరకు కళలకు– ముఖ్యంగా లలితకళలకు జనాదరణ ఉంది.
కళలు ఏవైనా సరే, వాటి ప్రయోజనం ఒక్కటే – ఆత్మప్రక్షాళన. ‘దైనందిన జీవితంలో మన ఆత్మలపై పేరుకున్న ధూళిని శుభ్రం చేయడమే కళ ప్రయోజనం’ అంటాడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో. కళలు భావోద్వేగాల ప్రసారమాధ్యమాలు మాత్రమే కాదు, ఆత్మప్రక్షాళనకు ఉపకరించే సాధనాలు కూడా! కళలు మనుషుల జీవితాలను సౌందర్యభరితం చేస్తాయి.
కళలు విలువలు నేర్పుతాయి. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లతో అలజడికి గురైన మనసుకు సాంత్వన నిస్తాయి. కళలు జీవితాన్ని చైతన్యవంతం చేస్తాయి. ఇంతేకాదు, కళలు సామాజిక అన్యాయాలను ఎత్తి చూపుతాయి. ఆలోచన రేకెత్తిస్తాయి. ఆత్మవిమర్శ దిశగా మనుషులను ప్రేరేపి స్తాయి. కళలు సమాజాన్ని మరింత నాగరికంగా, ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. సమాజంలోని రకరకాల సంస్కృతులకు చెందిన సమూహాల గుండెచప్పుడును వినిపిస్తాయి. కళలు సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.
‘కళ చాలా విశాలమైనది. మనుషుల తెలివి చాలా ఇరుకైనది’ అంటాడు ఇంగ్లిష్ కవి అలెగ్జాండర్ పోప్. ప్రపంచం తీరుతెన్నులను చూస్తుంటే, ఆయన మాట నిజమేననిపిస్తుంది. సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనికొచ్చే లక్షణం కళలకు ఎంతో కొంత ఉన్నమాట వాస్తవమే అయినా, ప్రపంచవ్యాప్తంగా కళాకారులు అసంఖ్యాకంగా కళాసృజన కొనసాగిస్తూ వస్తున్నా, ఈ ప్రపంచం మారాల్సిన పద్ధతిలో ఇంకా మారలేదు. మనుషుల కురచ బుద్ధులు కూడా మారలేదు. బహుశా, జనాభాలోని అత్యధికులు కళలను ఒంటబట్టించుకోకపోవడమే ఇందుకు కారణం కావచ్చు.
కళలకు ఆదరణలేని దేశాలు నిరంతరం అలజడులు, అశాంతితో అలమటించే పరిస్థితులను చూస్తూనే ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ నాయకులు సంగీత ప్రదర్శనలపై నిషేధాజ్ఞలు విధించారు. అక్కడి పరిస్థితులు మనకు తెలియనివి కావు. చిత్రకళా ప్రదర్శనలపై నానా రకాల ఆంక్షలు ఉన్న ఉత్తర కొరియా పరిస్థితులు కూడా మనకు తెలిసినవే! స్వేచ్ఛ లేనిచోట కళలకు ఊపిరాడదు. ఇక స్వేచ్ఛే ఊపిరిగా బతికే కళాకారుల పరిస్థితి ఆంక్షలున్న చోట ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. నియంతృత్వ దేశాల్లో మాత్రమే కాదు, ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకుంటున్న చాలా దేశాల్లోనూ కళాకారులు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్న పరిస్థితులు లేవు.
కళలన్నీ కళాకారుల ఆత్మావిష్కరణలే! అందుకే, ‘అన్ని కళలూ కళాకారుల ఆత్మకథలే! ముత్యం ఆల్చిప్ప ఆత్మకథ’ అంటాడు ఇటాలియన్ దర్శకుడు ఫెడెరికో ఫెలినీ. ఆంక్షలు లేనిచోట మాత్రమే కళాకారుల ఆత్మావిష్కరణకు అవకాశాలు అపరిమితంగా ఉంటాయి. కాల ప్రవాహంలో ప్రపంచంలోని మిగిలిన మార్పులతో పాటే కళలు కూడా మారుతూ వస్తున్నాయి. కళల్లో ప్రాచీన కళ, ఆధునిక కళ అనేవి కాలానికి సంబంధించిన కొండగుర్తులు మాత్రమే! కళల అస్తిత్వం నిరంతరం.
స్వేచ్ఛలేని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల, ఆధునిక జీవనశైలిలోని తీరిక దొరకని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల మనుషులు కళలకు దూరమవుతున్నారు. దొరికే కొద్దిపాటి తీరిక సమయాన్ని టీవీ, స్మార్ట్‌ఫోన్ వంటివి అందించే యాంత్రిక వినోదంతో సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, కళాస్వాదన, కళా సాధనల వల్ల మనుషుల్లో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇటీవల బ్రిటిష్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మరందుకే మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల! లేకపోతే బతుకులు గొడ్డుదేరిపోవూ!