british scientists
-
కలాపోసన
‘ఆ.. మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాలయ్యా! ఉత్తికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది?’– ‘ముత్యాలముగ్గు’ సినిమాలో కాంట్రాక్టరు పాత్రధారి రావు గోపాలరావు పలికిన అమృతవాక్కులివి. ముళ్లపూడి వెంకటరమణ కలం నుంచి తూటాల్లా వెలువడిన మాటలివి. తెలుగునాట అమిత జనాదరణ పొందిన పది సినిమా డైలాగుల జాబితాను ఎవరైనా రూపొందిస్తే, ఈ డైలాగుకు అందులో తప్పకుండా చోటు దక్కి తీరుతుంది. నిజమే! ఊరకే తిని తొంగున్నట్లయితే, మనిషికీ గొడ్డుకూ ఏమాత్రం తేడా ఉండదు. గొడ్డుకు లేని బుద్ధి మనిషికి ఉంది. మనిషిని ఇతర జంతుతతి నుంచి వేరు చేసేది ఆలోచనా శక్తి మాత్రమే! ఆలోచనకు పదునుపెట్టే సాధనం సృజనాత్మకత. మనిషిలోని సృజనాత్మకతకు ఫలితాలే కళలు.కొందరికి జన్మతః కళాభినివేశం ఉంటుంది. అలాంటివారు సునాయాసంగా కళలను కైవసం చేసుకోగలుగుతారు. ఇంకొందరు అభిరుచితో సాధన చేసి కళల్లో రాణిస్తారు. అభినివేశం, సాధన లేకున్నా, చాలామంది కళలను ఆస్వాదిస్తారు. కలిగిన ఆసాములు కళలను ఆదరిస్తారు. కళలు అరవై నాలుగు అని వాత్సా్యయనుడు చెప్పాడు. వీటిలో చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నృత్యం, కవిత్వం అనే అయిదు కళలూ లలితకళలుగా గుర్తింపు పొందాయి.లలితకళలు మనుషుల భావోద్వేగాల అభివ్యక్తికి అందమైన సాధనాలు. మనుషులు తమ ఆలోచనలను, ఆనంద విషాదాది భావోద్వేగాలను; తమ కాల్పనిక ఊహాజగత్తులోని విశేషాలను, తమ సృజనాత్మకతను ఇతరులతో పంచుకోవడానికి కళలను ప్రదర్శిస్తారు. పురాతన నాగరికతలు ఊపిరి పోసుకోక మునుపటి నుంచే మనుషులు కళల ద్వారా తమ ఉద్వేగాలను చాటుకోవడం మొదలుపెట్టారు. మాటలాడటం ఇంకా నేర్చుకోని ఆనాటి మానవులు బొమ్మల ద్వారా తమ ఆలోచనలను వెల్లడించేవారు. పాతరాతి యుగం మానవులు రాతిగుహల గోడల మీద చిత్రించిన చిత్రాలే ఇందుకు ఆనవాళ్లు. నాగరికతలు మొదలైన నాటి నుంచి నేటి వరకు కళలకు– ముఖ్యంగా లలితకళలకు జనాదరణ ఉంది. కళలు ఏవైనా సరే, వాటి ప్రయోజనం ఒక్కటే – ఆత్మప్రక్షాళన. ‘దైనందిన జీవితంలో మన ఆత్మలపై పేరుకున్న ధూళిని శుభ్రం చేయడమే కళ ప్రయోజనం’ అంటాడు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో. కళలు భావోద్వేగాల ప్రసారమాధ్యమాలు మాత్రమే కాదు, ఆత్మప్రక్షాళనకు ఉపకరించే సాధనాలు కూడా! కళలు మనుషుల జీవితాలను సౌందర్యభరితం చేస్తాయి. కళలు విలువలు నేర్పుతాయి. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లతో అలజడికి గురైన మనసుకు సాంత్వన నిస్తాయి. కళలు జీవితాన్ని చైతన్యవంతం చేస్తాయి. ఇంతేకాదు, కళలు సామాజిక అన్యాయాలను ఎత్తి చూపుతాయి. ఆలోచన రేకెత్తిస్తాయి. ఆత్మవిమర్శ దిశగా మనుషులను ప్రేరేపి స్తాయి. కళలు సమాజాన్ని మరింత నాగరికంగా, ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. సమాజంలోని రకరకాల సంస్కృతులకు చెందిన సమూహాల గుండెచప్పుడును వినిపిస్తాయి. కళలు సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి.‘కళ చాలా విశాలమైనది. మనుషుల తెలివి చాలా ఇరుకైనది’ అంటాడు ఇంగ్లిష్ కవి అలెగ్జాండర్ పోప్. ప్రపంచం తీరుతెన్నులను చూస్తుంటే, ఆయన మాట నిజమేననిపిస్తుంది. సామాజిక మార్పులకు ఉత్ప్రేరకాలుగా పనికొచ్చే లక్షణం కళలకు ఎంతో కొంత ఉన్నమాట వాస్తవమే అయినా, ప్రపంచవ్యాప్తంగా కళాకారులు అసంఖ్యాకంగా కళాసృజన కొనసాగిస్తూ వస్తున్నా, ఈ ప్రపంచం మారాల్సిన పద్ధతిలో ఇంకా మారలేదు. మనుషుల కురచ బుద్ధులు కూడా మారలేదు. బహుశా, జనాభాలోని అత్యధికులు కళలను ఒంటబట్టించుకోకపోవడమే ఇందుకు కారణం కావచ్చు. కళలకు ఆదరణలేని దేశాలు నిరంతరం అలజడులు, అశాంతితో అలమటించే పరిస్థితులను చూస్తూనే ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ నాయకులు సంగీత ప్రదర్శనలపై నిషేధాజ్ఞలు విధించారు. అక్కడి పరిస్థితులు మనకు తెలియనివి కావు. చిత్రకళా ప్రదర్శనలపై నానా రకాల ఆంక్షలు ఉన్న ఉత్తర కొరియా పరిస్థితులు కూడా మనకు తెలిసినవే! స్వేచ్ఛ లేనిచోట కళలకు ఊపిరాడదు. ఇక స్వేచ్ఛే ఊపిరిగా బతికే కళాకారుల పరిస్థితి ఆంక్షలున్న చోట ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. నియంతృత్వ దేశాల్లో మాత్రమే కాదు, ప్రజాస్వామ్య దేశాలుగా చెప్పుకుంటున్న చాలా దేశాల్లోనూ కళాకారులు పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్న పరిస్థితులు లేవు.కళలన్నీ కళాకారుల ఆత్మావిష్కరణలే! అందుకే, ‘అన్ని కళలూ కళాకారుల ఆత్మకథలే! ముత్యం ఆల్చిప్ప ఆత్మకథ’ అంటాడు ఇటాలియన్ దర్శకుడు ఫెడెరికో ఫెలినీ. ఆంక్షలు లేనిచోట మాత్రమే కళాకారుల ఆత్మావిష్కరణకు అవకాశాలు అపరిమితంగా ఉంటాయి. కాల ప్రవాహంలో ప్రపంచంలోని మిగిలిన మార్పులతో పాటే కళలు కూడా మారుతూ వస్తున్నాయి. కళల్లో ప్రాచీన కళ, ఆధునిక కళ అనేవి కాలానికి సంబంధించిన కొండగుర్తులు మాత్రమే! కళల అస్తిత్వం నిరంతరం.స్వేచ్ఛలేని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల, ఆధునిక జీవనశైలిలోని తీరిక దొరకని పరిస్థితుల వల్ల కొన్నిచోట్ల మనుషులు కళలకు దూరమవుతున్నారు. దొరికే కొద్దిపాటి తీరిక సమయాన్ని టీవీ, స్మార్ట్‌ఫోన్ వంటివి అందించే యాంత్రిక వినోదంతో సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, కళాస్వాదన, కళా సాధనల వల్ల మనుషుల్లో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇటీవల బ్రిటిష్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మరందుకే మడిసన్నాక కూసింత కలాపోసన ఉండాల! లేకపోతే బతుకులు గొడ్డుదేరిపోవూ! -
కేన్సర్‌ను ‘కత్తి’లా పసిగట్టేస్తుంది..!
లండన్: బ్రిటన్ శాస్త్రవేత్తలు కొత్తగా అభివృద్ధి చేసిన ఇంటెలిజెంట్ సర్జికల్ నైఫ్ (ఐనైఫ్) గర్భాశయ కేన్సర్‌ను సెకండ్లలో పసిగట్టేస్తోంది. కేన్సర్ చికిత్సలను త్వరితగతిని అందించి ఎందరో మహిళల ప్రాణాలను కాపాడే అవకాశం ఐనైఫ్ ద్వారా వచ్చిందని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో వైద్య నిపుణులు చెప్పారు. సాధారణంగా మహిళల్లో వచ్చే ఎండోమెట్రియల్ కేన్సర్‌ను గుర్తించడం ఆలస్యం అవడం వల్ల దుష్ప్రభావాలు అధికం. అయితే ఈ ఐనైఫ్తో సెకండ్లలో కేన్సర్‌ను గుర్తించగలుగుతున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. వివరాలను జర్నల్ కేన్సర్స్‌లో ప్రచురించారు. గర్భాశయ కేన్సర్‌తో బాధపడుతున్నట్టు అనుమానం ఉన్న 150 మంది మహిళల టిష్యూ శాంపిల్స్‌ను సర్జికల్ కత్తితో పరీక్షిస్తే సెకండ్లలోనే ఫలితాలు వచ్చాయి. ఇప్పటివరకు అనుసరిస్తున్న సాధారణ పద్ధతిలో చేసిన ఫలితాలతో పోల్చి చూస్తే 86% ఫలితాలు సరిగ్గా ఉన్నాయని ఆ అధ్యయనం వివరించింది. -
Super Tomatoes: ఇవి మామూలు టొమాటోలు కావు.. కోడిగుడ్డు కంటే ఎక్కువే!
టొమాటోలు సహజసిద్ధంగానే కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. టొమాటోల్లోని పోషకాలు మరింత సమర్థంగా పనిచేసేలా బ్రిటిష్ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి ద్వారా రూపొందించారు. జన్యుమార్పిడి ద్వారా పండించిన ఈ టొమాటోలను వారు ‘సూపర్ టొమాటోలు’ అని అంటున్నారు. 👉🏾ఈ సూపర్ టొమాటోల విశేషమేమిటంటే, వీటిలో కోడిగుడ్ల కంటే రెట్టింపు స్థాయిలో విటమిన్–డి3 ఉంటుంది. 👉🏾సాధారణ టొమాటోల్లో ఉండే ‘ప్రో విటమిన్’ కొంత కొలెస్ట్రాల్‌గా రూపాంతరం చెందుతుంది. 👉🏾‘సీఆర్ఐఎస్పీఆర్’ అనే జీన్ ఎడిటింగ్ పద్ధతిలో, ‘ప్రో విటమిన్’ కొలెస్ట్రాల్‌గా రూపాంతరం చెందేలా చేసే జన్యువులో మార్పు తీసుకొచ్చారు. 👉🏾ఫలితంగా ‘ప్రోవిటమిన్’ మరింత విటమిన్–డి3గా మారేలా చేశారు. 👉🏾నార్విచ్‌లోని జాన్ ఇన్నెస్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించారు. 👉🏾విటమిన్–డి3 పుష్కలంగా ఉండే ఈ టొమాటోలు డెమెన్షియా, పార్కిన్సన్, కేన్సర్ వంటి వ్యాధులను సమర్థంగా నివారించగలవని వారు చెబుతున్నారు. చదవండి👉🏾Heart Can Repair Itself: భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! -
ఆ చికెన్ తిన్నారో.. అంతే!
బ్రిటిష్ దుకాణాల్లో ఉన్న తాజా చికెన్ అని చెబుతున్న దాన్ని తింటే అంతే సంగతులని హెచ్చరిస్తున్నారు. దాదాపు మూడింట రెండొంతుల చికెన్‌లో అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి సూపర్ బగ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంటుందని తెలిపారు. ఇంగ్లండ్‌లోని ప్రముఖ దుకాణాల్లో అమ్ముతున్న చికెన్‌లో 78 శాతం ఈ-కోలి బ్యాక్టీరియా కలిగి ఉందట. అదే స్కాట్లండ్‌లో 53 శాతం, వేల్స్లో 41 శాతం చికెన్‌లో ఈ-కోలి ఉందన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా వల్ల ఒక్క ఇంగ్లండ్‌లోనే ఏడాదికి 5,500 మంది చనిపోతున్నారు. ఈ కోలి బ్యాక్టీరియా వల్ల కేవలం డయేరియా లేదా వాంతులు కావడం మాత్రమే కాదని, అది పెద్దప్రేవుల్లో కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయి ప్రాణాంతకంగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా ఈ బ్యాక్టీరియా శరీరంలో చేరితే.. ఇక ఏ రకమైన యాంటీబయాటిక్ మందులు వాడినా అవి పనిచేయవు. ఈ ఏడాది ప్రారంభంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కూడా.. చాలావరకు ప్రముఖ సూపర్ మార్కెట్లలో కొన్ని చికెన్‌లో ఈ-కోలి ఉన్నట్లు తేలింది. అయితే తాజాగా చేసిన పరిశోధనలలో మాత్రం ఇంతకు ముందు కంటే దీని తీవ్రత, వ్యాప్తి చాలా ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని దశాబ్దాలుగా కోళ్లకు ఉపయోగిస్తున్న మేతలో యాంటీ బయాటిక్ మందులను ఎక్కువ మోతాదులో కలపడం వల్లే ఈ సూపర్ బగ్ తయారైందని చెబుతున్నారు. కోడి పిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకూడదన్న ముందు జాగ్రత్తతో అవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాటికి యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు. దాంతో వాటికి యాంటీ బయాటిక్ మందులు పనిచేయక.. చివరకు మనుషుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. -
ఇక మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లు అస్సలు పగలవ్!
లండన్: మొబైల్ చేతిలో ఉన్నంత సేపు చాలా సరదాగా ఉంటుంది. అది కాస్త జారి కిందపడిందో గుండె బేజారి పోతుంది. ఎందుకంటే మనం ఎంతో ఇష్టపడే హ్యాండ్ సెట్ స్క్రీన్ పగిలిపోతుంది. ఫలితంగా జేబుకు చిల్లుపడుతోంది. పోని కొత్త టచ్ స్క్రీన్ వేయించుకుందామంటే ఇప్పుడొస్తున్న స్మార్ట్ ఫోన్ల స్క్రీన్ ల ధరలు ఆ ఫోన్ లో కనీసం పదో వంతు ఉంటాయి. దీంతో అసలు పగిలిపోయిన సెల్ ఫోన్ కు టచ్ స్క్రీన్ లు వేయించకుండానే ఉపయోగించుకునే వారు ఎంతో మంది. ఈ క్రమంలో వృధా అయ్యే సొమ్ముకూడా చాలా ఎక్కువంట. అయితే, ఇలాంటి ఆందోళనకు, భయానికి చెక్ పెట్టే తరుణం వచ్చేసింది. బ్రిటన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఎట్టకేలకు మొబైల్ కిందపడిపోయినా పగలని స్క్రీన్ గార్డులను తయారుచేశారు. వీటిని 2018లో అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ప్రస్తుతం లభిస్తున్న వాటికన్నా చౌకగా ఇవి లభించనున్నాయి. ఒక్క మొబైల్ ఫోన్లకే కాకుండా టీవీలకు, ట్యాబ్‌లకు, ల్యాప్‌టాప్‌లకు ఈ టచ్ స్క్రీన్ లు, గార్డులను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం లభిస్తున్న టచ్ స్క్రీన్లన్నీ కూడా ఇడియం టిన్ ఆక్సైడ్(ఐటీవో) ద్వారా తయారు చేస్తున్నారు.. ఇవి బాగా ధర ఎక్కువ కూడా. ఐటీవో ద్వారా తయారుచేసినవి కూడా పగిలిపోతుండటంతో ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన ఎం సాల్వ్ మైక్రో ఎలక్ట్రానిక్ సంస్థతో కలిసి యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్తలు కొత్త పదార్థం కోసం వేట మొదలుపెట్టి విజయం సాధించారు. సిల్వర్ నానో వైర్స్ అండ్ గ్రాఫిన్ తో కొత్త హైబ్రిడ్ ఎలక్ట్రోడ్స్ను రూపొందిచి టచ్ స్క్రీన్లుగా మలచనున్నారు. ఈ నానో వైర్స్ ఒకటి ఓ వెంట్రుకలో పదివేలవంతు ఉంటుందట. సో.. 2018 తర్వాత ఏ స్మార్ట్ ఫోన్ కూడా పగిలిపోదని నిశ్చింతగా ఉండొచ్చన్న మాట. -
మెదడు బలం కాళ్లలోనే...
పరిపరి శోధన తెలివితక్కువ దద్దమ్మలను హేళన చేయడానికి ‘వాళ్లకు మెదడు మోకాల్లో ఉంది’ అంటుంటారు గానీ, మెదడు బలం కాళ్లలోనే ఉందంటున్నారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. అంటే, కాళ్లు బలంగా ఉంటేనే మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని వారు చెబుతున్నారు. రోజూ నడక, గుంజీలు తీయడం వంటి వ్యాయామాలు చేసేవారికి కాళ్లు బలంగా తయారవుతాయని, అలాంటి వారిలో మెదడు పనితీరు అద్భుతంగా ఉంటుందని తమ పరిశోధనల్లో తేలినట్లు లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు చెబుతున్నారు. పదేళ్ల పాటు 324 మంది కవలలపై విస్తృతంగా అధ్యయనం నిర్వహించి, ఈ నిర్ధారణకు వచ్చినట్లు అంటున్నారు. ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసిన కవలల్లో కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేసేవారి మెదడు పనితీరు, అలాంటి వ్యాయామాలు చేయని వారి కంటే మెరుగ్గా ఉందని ‘గ్యారంటాలజీ’ జర్నల్ ద్వారా వారు వెల్లడించారు. -
కళ్లు మూసుకున్నా కనిపిస్తుంది
లండన్: పోయిన కంటిచూపును తెప్పించడంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారు మాంచెస్టర్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు రే ఫ్లిన్కు చూపు తెప్పించారు. ఎనిమిదేళ్ల క్రితం కంటిచూపు పోయి కష్టపడుతున్న ఫ్లిన్కు కృత్రిమ రెటినాను అమర్చి, దానికి కంప్యూటర్, వీడియో కెమెరాను అనుసంధానించి సరికొత్త పద్ధతిలో కంటిచూపు తెప్పించారు. అందుకోసం వీడియో కెమెరాతో కూడిన ప్రత్యేక కళ్లజోడు తయారు చేయించారు. అది ఎలా పనిచేస్తుందంటే... కళ్లజోడు మధ్యనున్న ఓ చిన్న వీడియో కెమెరా మన ముందున్న దృశ్యాలను చిత్రీకరించి వాటిని వెంట వెంటనే మెడలో వేలాడే చిన్న కంప్యూటర్‌కు పంపిస్తుంది. ఆ కంప్యూటర్ వాటిని విద్యుత్ ప్రచోదనాలు (ఎలక్ట్రికల్ ఇంపల్సెస్)గా మార్చి వాటిని కనుగుడ్డు పక్కన అమర్చిన చిన్న యాంటెన్నాకు కేబుల్ అక్కర్లేకుండానే పంపుతుంది. అక్కడి నుంచి చిన్న కేబుల్ ద్వారా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కాస్తా ఎలక్ట్రోడ్స్గా మారి, కంటి రెటినా ఉపరితలం పైకి వెళ్లి, అక్కడ వీడియో దృశ్యాలను ప్రతిబింబిస్తాయి. అలాగే, ఎలక్ట్రోడ్స్ రెటీనా కణాలను ప్రేరేపిస్తాయి. తద్వారా మెదడు వీడియో గ్రాహక చిత్రాలను గుర్తిస్తుంది. రెటీనా దెబ్బతిన్న ఓ వృద్ధుడికి ఇలా చూపు తెప్పించడం ప్రపంచంలో ఇదే మొదటి సారని, ఇలాంటి ప్రయోగం చేయడం కూడా మొదటిసారేనని మాంచెస్టర్ రాయల్ ఐ హాస్పటల్ సర్జన్స్ తెలియజేస్తున్నారు. మొన్నటివరకు ఎవరో ఒకరి సహాయం లేకుండా బయటకు వెళ్లలేక పోయిన ఫ్లిన్ ఇప్పుడు ఎవరి సహాయం లేకుండానే చక్కగా పార్క్‌కు వెళ్లి వాకింగ్ చేస్తున్నానని చెబుతున్నారు. మరీ వీడియోలో రికార్డయినంత స్పష్టంగా దృశ్యాలను చూడలేమని, ఏ వస్తువునైనా పోల్చుకోగలమని, ఔట్లైన్స్ను బట్టి పేపర్ కూడా చదవొచ్చని ఆస్పత్రి ఆప్తల్మాలజిస్ట్ ప్రొఫెసర్ పావులో స్టాంగ్ తెలిపారు. కళ్లు మూసుకున్నా కంటి ముందు వస్తువులు కనిపించడం ఈ చూపులోవున్న విశిష్టతని ఆయన వివరించారు. ఎందుకంటే మూసుకున్నది కళ్లుగానీ వీడియో కెమెరా కన్ను కాదు కదా! పుట్టుకతో గుడ్డివాళ్లకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చూపు తెప్పించడం ఎలా అన్న అంశంపై తాము పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు. -
హైబీపీనా... నోటెన్షన్
తేలికపాటి శస్త్ర చికిత్సతో బీపీకి చెక్ రక్తపోటు పెంచే ‘కరోటిడ్’ అవయవాల గుర్తింపు వాటిని తొలగిస్తే.. నియంత్రణలోకి రక్తపోటు ఎలుకలపై ప్రయోగం విజయవంతం మూడేళ్లలోగా అందుబాటులోకి మీరు ‘అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్)’తో బాధపడుతున్నారా? ఎన్ని మందులు వాడుతున్నా రక్తపోటు నియంత్రణలో ఉండడం లేదా? మీలాంటి వారికి ఓ శుభవార్త. ‘అధిక రక్తపోటు’ను శాశ్వతంగా నియంత్రణలో ఉంచే సరికొత్త చికిత్సా విధానం అందుబాటులోకి రానుంది. ‘అధిక రక్తపోటు’కు కారణమైన ‘కరోటిడ్’ అవయవాలను బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. గుండె నుంచి మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలపై బియ్యపు గింజ పరిమాణంలో ఉండే ఈ రెండు అతిచిన్న అవయవాలను తొలగిస్తే.. ‘రక్తపోటు’ నియంత్రణలో వస్తుందని వారు చెబుతున్నారు. ఇప్పటికే ప్రయోగశాలలో ఎలుకలపై విజయవంతమైన ఈ చికిత్సను.. 20 మంది మనుషులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మూడేళ్లలోగా ఈ చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ‘కరోటిడ్’ రక్తనాళాలపై బియ్యపు గింజ పరిమాణంలో ఉండే రెండు అతిచిన్న అవయవాలు ‘అధిక రక్తపోటు’కు కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దవడల కింద, గొంతుకు రెండు వైపులా ఉండే ఈ అవయవాల్లో కొన్ని నాడులు కలిసి క్లస్టర్‌గా ఏర్పడి ఉంటాయి. వీటి ద్వారా ఎక్కువ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి రక్తంలోని ఆక్సిజన్, కార్బన్‌డయాక్సైడ్‌ల స్థాయిని పరిశీలిస్తూ మెదడుకు సంకేతాలు పంపుతుంటాయి. అయితే ఒక్కోసారి ఈ ‘కరోటిడ్’ అవయవాలు ఆక్సిజన్, కార్బన్‌డయాక్సైడ్‌ల స్థాయిపై మెదడుకు తప్పుడు సంకేతాలను పంపుతున్నట్లుగా గుర్తించినట్లు పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జూలియన్ పాటన్ చెప్పారు. ఈ తప్పుడు సంకేతాల కారణంగా మెదడు శరీరంలో రక్తపోటును అధిక స్థాయిలో ఉంచేలా ఆదేశిస్తుందని తెలిపారు. తొలుత రెండు ‘కరోటిడ్’ అవయవాల్లో ఒకదానిని మాత్రమే తొలగించి పరిశోధన చేస్తున్నామన్నారు. మందులు, జీవన విధానంలో మార్పులతో రక్తపోటు నియంత్రణలోకి రానివారికి ఒక చిన్న శస్త్ర చికిత్స ద్వారా ‘కరోటిడ్’ అవయవాలను తొలగిస్తే చాలు అని జూలియన్ పేర్కొన్నారు.