ఆ చికెన్ తిన్నారో.. అంతే!
ఆ చికెన్ తిన్నారో.. అంతే!
Published Mon, Nov 21 2016 3:09 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
బ్రిటిష్ దుకాణాల్లో ఉన్న తాజా చికెన్ అని చెబుతున్న దాన్ని తింటే అంతే సంగతులని హెచ్చరిస్తున్నారు. దాదాపు మూడింట రెండొంతుల చికెన్‌లో అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి సూపర్ బగ్ ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంటుందని తెలిపారు. ఇంగ్లండ్‌లోని ప్రముఖ దుకాణాల్లో అమ్ముతున్న చికెన్‌లో 78 శాతం ఈ-కోలి బ్యాక్టీరియా కలిగి ఉందట. అదే స్కాట్లండ్‌లో 53 శాతం, వేల్స్‌లో 41 శాతం చికెన్‌లో ఈ-కోలి ఉందన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ-కోలి బ్యాక్టీరియా వల్ల ఒక్క ఇంగ్లండ్‌లోనే ఏడాదికి 5,500 మంది చనిపోతున్నారు.
ఈ కోలి బ్యాక్టీరియా వల్ల కేవలం డయేరియా లేదా వాంతులు కావడం మాత్రమే కాదని, అది పెద్దప్రేవుల్లో కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోయి ప్రాణాంతకంగా మారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా ఈ బ్యాక్టీరియా శరీరంలో చేరితే.. ఇక ఏ రకమైన యాంటీబయాటిక్ మందులు వాడినా అవి పనిచేయవు. ఈ ఏడాది ప్రారంభంలో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కూడా.. చాలావరకు ప్రముఖ సూపర్ మార్కెట్లలో కొన్ని చికెన్‌లో ఈ-కోలి ఉన్నట్లు తేలింది. అయితే తాజాగా చేసిన పరిశోధనలలో మాత్రం ఇంతకు ముందు కంటే దీని తీవ్రత, వ్యాప్తి చాలా ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
కొన్ని దశాబ్దాలుగా కోళ్లకు ఉపయోగిస్తున్న మేతలో యాంటీ బయాటిక్ మందులను ఎక్కువ మోతాదులో కలపడం వల్లే ఈ సూపర్ బగ్ తయారైందని చెబుతున్నారు. కోడి పిల్లలకు ఎలాంటి వ్యాధులు సోకకూడదన్న ముందు జాగ్రత్తతో అవి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాటికి యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు. దాంతో వాటికి యాంటీ బయాటిక్ మందులు పనిచేయక.. చివరకు మనుషుల ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి.
Advertisement
Advertisement