మెదడు బలం కాళ్లలోనే...
పరిపరి శోధన
తెలివితక్కువ దద్దమ్మలను హేళన చేయడానికి ‘వాళ్లకు మెదడు మోకాల్లో ఉంది’ అంటుంటారు గానీ, మెదడు బలం కాళ్లలోనే ఉందంటున్నారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. అంటే, కాళ్లు బలంగా ఉంటేనే మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుందని వారు చెబుతున్నారు. రోజూ నడక, గుంజీలు తీయడం వంటి వ్యాయామాలు చేసేవారికి కాళ్లు బలంగా తయారవుతాయని, అలాంటి వారిలో మెదడు పనితీరు అద్భుతంగా ఉంటుందని తమ పరిశోధనల్లో తేలినట్లు లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు చెబుతున్నారు.
పదేళ్ల పాటు 324 మంది కవలలపై విస్తృతంగా అధ్యయనం నిర్వహించి, ఈ నిర్ధారణకు వచ్చినట్లు అంటున్నారు. ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసిన కవలల్లో కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేసేవారి మెదడు పనితీరు, అలాంటి వ్యాయామాలు చేయని వారి కంటే మెరుగ్గా ఉందని ‘గ్యారంటాలజీ’ జర్నల్ ద్వారా వారు వెల్లడించారు.