చిప్ స్థానంలో ‘మినీ బ్రెయిన్స్’
ఏఐకి మానవ మస్తిష్క బలం
స్విట్జర్లాండ్‌లో ప్రయోగాలు
కంప్యూటర్ చిప్‌ల స్థానంలో మానవ మస్తిష్కంలోని కణ సముదాయాలను (మినీ బ్రెయిన్స్) ఉంటే.. మన జీవశక్తితో కంప్యూటర్లు పనిచేయడం మొదలుపెడితే.. అసాధ్యం అనిపిస్తోంది కదూ! కానీ, ఇది సాధ్యం కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదే జరిగితే జీవశక్తితో కంప్యూటర్లు నడుస్తాయి. దీన్నే ‘బయోకంప్యూటింగ్’ లేదా ‘వెట్‌వేర్’ అంటున్నారు. స్విట్జర్లాండ్, వెవీలోని ‘ఫైనల్‌స్పార్క్’ స్టార్టప్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు.. మినీ బ్రెయిన్స్ సజీవంగా ఉంచటానికి అవసరమైన పోషకాలతో కూడిన ద్రవాన్ని తయారు చేయటంతో ఈ పరిశోధనలో మరొక ముందడుగు పడింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
జీవమున్న ‘మినీ బ్రెయిన్స్’ను ప్రాథమిక కంప్యూటర్ ప్రాసెసర్‌లుగా ఉపయోగించటానికి అవి ‘బతికి’ ఉండటం ఎంతో అవసరం. మినీ బ్రెయిన్స్ నిర్జీవం అయిపోతే ల్యాప్‌టాప్‌లోని ప్రాసెసర్‌ల మాదిరిగా వాటిని రీబూట్ చేయలేం. అయితే వీటిని ల్యాబ్‌లో అనంతంగా పునరుత్పత్తి చేయగల అవకాశం ఉండటం ‘వెట్‌వేర్’పై పనిచేస్తున్న శాస్త్రవేత్తల్లో ఆశలు రేకెత్తిస్తోంది.
వెట్‌వేర్‌ను ఎలా సృష్టిస్తారు?
అజ్ఞాత మానవ దాతల చర్మం నుంచి మూల కణాలు కొనుగోలు చేసి న్యూరాన్‌లుగా మారుస్తారు. చర్మ కణాలను మిల్లీ మీటరు వెడల్పులో ‘బ్రెయిన్ ఆర్గానాయిడ్‌లు’ అనే సమూహాలుగా సేకరిస్తారు. అవి ‘పండు ఈగ’ లార్వా మెదడు ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటాయి. ప్రయోగశాలలో ఈ ఆర్గానాయిడ్‌లకు ఎలక్ట్రోడ్‌లు (విద్యుత్ వాహకాలు) జత చేస్తారు. ఇవి ఆర్గనాయిడ్‌ల పనితీరును అధ్యయనం చేస్తాయి. ఆర్గనాయిడ్‌లను కొద్దిపాటి విద్యుత్తుతో ప్రేరేపిస్తారు. అవి స్పందిస్తే సంప్రదాయ కంప్యూటింగ్ విధానమైన ‘1’,గానూ, స్పందించకపోతే ‘0’గానూ గుర్తిస్తారు. అంటే కంప్యూటర్‌లకు జీవం వచి్చనట్లే! ‘ఫైనల్ స్పార్క్’ చెబుతున్న ప్రకారం ఆర్గానాయిడ్‌లు ఆరు నెలల వరకు జీవిస్తాయి.
‘ఏఐ’కి ఏనుగు బలం!
చాట్‌జీపీటీ వంటి భారీ ఏఐ ఇంజిన్‌లను నడిపిస్తున్న సూపర్ కంప్యూటర్‌లు.. మానవ మెదడులోని కణాలను, నాడీ వ్యవస్థను పోలిన సిలికాన్ సెమీ కండక్టర్‌లను ఉపయోగించటం తెలిసిందే. అయితే మెదడు కణాలను లేదా ‘మినీ బ్రెయిన్స్’ను ఉపయోగించి తయారు చేసే ప్రాసెసర్‌లు ఏదో ఒక రోజు, ప్రస్తుతం కృత్రిమ మేధ విజృంభణకు శక్తిని ఇస్తున్న చిప్‌ల స్థానాన్ని ఆక్రమిస్తాయని ఫైనల్‌స్పార్క్ ల్యాబ్ సహ–వ్యవస్థాపకులు ఫ్రెడ్ జోర్డాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. ఏఐ వల్ల పర్యావరణ కాలుష్యమూ తగ్గిపోతుంది.
‘వెట్‌వేర్’ సాధ్యమేనా!
ఆర్గానాయిడ్‌లతో ప్రాసెసర్‌ను సృష్టించటం అసంభవమని కొందరు శాస్త్రవేత్తలు వాది స్తున్నారు. ‘మానవ మెదడులోని 10,000 కోట్ల న్యూరాన్‌లతో పోలిస్తే ఆర్గానాయిడ్‌లో ఉండేవి పది వేల న్యూరాన్లే. పైగా వీటిల్లో ‘నొప్పి గ్రాహకాలు’ ఉండవు. అలాగే మాన వ మెదడు.. ‘స్పృహ’ను ఎలా కలిగిస్తోందనే విషయం, ఇంకా మెదడు పనితీరుకు సంబంధించిన అనేక అంశాలు నేటికీ మిస్టరీగానే ఉన్నాయి’ అనేది వారి వాదన.
ప్రపంచ వ్యాప్తంగా.. ఫైనల్‌స్పార్క్ సృష్టించిన ఆర్గానాయిడ్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా 10 వర్సిటీలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లోని పరిశోధకులు.. ఒక ఆర్గానాయిడ్‌ను రోబో మెదడుగా ఉపయోగించి బ్రెయిలీ అక్షరాల మధ్య తేడాను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలోని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆటిజం, అల్జీమర్స్ వంటి సమస్యలతో బాధపడేవారి మెదడు పనితీరును తెలుసుకునేందుకు, తద్వారా వాటికి కొత్త ట్రీట్‌మెంట్లు కనుక్కునేందుకు ఫైనల్‌స్పార్క్ ఆర్గానాయిడ్స్‌నే ఉపయోగించారు.
హార్డ్‌వేర్
కంప్యూటర్‌లలో: లోహ భాగాలు, చిప్స్
మానవులలో: మెదడు కణాలు, నాడీ వ్యవస్థ
సాఫ్ట్‌వేర్
కంప్యూటర్‌లలో : ప్రోగ్రామ్‌లు, యాప్‌లు
మానవులలో: ఆలోచనలు,జ్ఞాపకాలు, అభ్యాసం
వెట్‌వేర్
కంప్యూటర్‌లలో : ఇంకా తయారు కాలేదు.
మానవులలో : సేంద్రియ, జీవమున్నహార్డ్‌వేర్
వెట్‌వేర్ ప్రయోజనాలు
రోగ నిర్ధారణ : శరీరంలో నిర్దిష్ట రకాల కణాల గుర్తింపు.
ప్రోస్థెటిక్స్: కృత్రిమ అవయవాల సృష్టిలో తోడ్పాటు
డేటా నిల్వ: డీఎన్‌ఏ దీర్ఘకాలిక డేటా నిల్వకు స్థిరమైన ఏర్పాటు.
హైబ్రిడ్ బయో ఎలక్ట్రానిక్ పరికరాలు: ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్‌తో కలపటం ద్వారా కొత్త బయో పరికరాల సృష్టి


