computer chips
-
తెరపైకి తెలివైన బుర్ర
సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ల నుంచి స్మార్ట్ పరికరాల దాకా ఏది పనిచేయాలన్నా కంప్యూటర్ చిప్‌లు కంపల్సరీ. అందులోనూ కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) పరికరాల కోసం వేగవంతమైన, సమర్థవంతమైన మైక్రో ప్రాసెసర్లు అవసరం. వాటి ని తగిన విధంగా ఉపయోగించుకోవడానికి, కృత్రిమ మేధను అనుసంధానం చేయడానికి లాంగ్వేజ్ మోడల్స్ కావాలి. ఇప్పుడు వీటన్నింటినీ దేశీయంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు కూడా ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. స్మార్ట్ టెక్నాలజీపై కసరత్తు చేస్తున్నాయి. మైక్రో చిప్స్‌ను, అత్యంత శక్తివంతమైన సెమీ కండక్టర్లను రూపొందించి ఏఐ మేధోశక్తికి అనుసంధానం చేస్తున్నాయి. 2027 నాటికి అంతరిక్ష, వైద్య, విద్య, న్యాయ రంగాల్లో శరవేగంగా నాణ్యమైన సేవల ందించే ఏఐ ఆధారిత మాడ్యూల్స్ కూడా రూపొందుతున్నాయి. ఊపిరిపోస్తున్న పరిశోధనలు చిప్‌ల అభివృద్ధి, కృత్రిమ మేధ రంగంలో దిగ్గజ కంపెనీలే కాదు.. మన దేశంలో ఐఐటీ విద్యార్థులు, అంతరిక్ష పరిశోధకులు కూడా రంగంలోకి దిగారు. మద్రాస్ ఐఐటీ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్తంగా ‘శక్తి’ పేరిట చిప్‌ను, దాని ఆధారంగా పనిచేసే మైక్రో ప్రాసెసర్లను రూపొందించాయి. ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న ఈ ప్రాసెసర్లు అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయని, అంతరిక్ష రంగంలో అద్భుత సాంకేతికత వినియోగానికి వీలుకల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. లాంగ్వేజ్ మాడ్యూల్స్తోనూ.. కృత్రిమ మేధలో కీలకమైన మైక్రో అండ్ స్మాల్ లాంగ్వేజ్ మాడ్యూల్స్‌ను ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా వంటి సంస్థలు రూపొందిస్తున్నాయి. నేరాల దర్యాప్తు, న్యాయ విభాగాలకు సంబంధించి ఇవి అద్భుతాలు సృష్టించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు పదేళ్లుగా కనిపించకుండా పోయిన వ్యక్తి.. చిన్ననాటి ఫోటో ఆధారంగా ఇప్పుడెలా ఉన్నాడు? ఆ వ్యక్తి ఏయే ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది? అనే అంశాలను ఏఐ ఆధారంగా అంచనా వేయవచ్చు. కోట్లాది మంది వ్యక్తుల కదలికలను పసిగట్టి, గుర్తించగల టెక్నాలజీని ఇందులో పొందుపరుస్తున్నారు. ఇక ఏదైనా కేసులో న్యాయమూర్తి తీర్పు చెప్పే ముందు అలాంటి కేసుకు సంబంధించిన గతంలోని జడ్జిమెంట్లను క్రోడీకరించి అందించే మాడ్యూల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు వైద్య రంగంలో శస్త్ర చికిత్సల సమయంలో స్మార్ట్ లాంగ్వేజ్ ద్వారా కణజాలాల స్థాయిలో స్కానింగ్ చేసి విలువైన సమాచారం ఇవ్వగల మాడ్యూల్ అందుబాటులోకి రానుంది. చికిత్స వంద శాతం విజయవంతంగా పూర్తయ్యేందుకు అవి సహకరించనుంది. మరింత మేధోమథనం జరగాలి.. ఏఐలో కీలకమైన చిప్స్ తయారీ, లాంగ్వేజ్ మాడ్యూల్స్‌కు సంబంధించి తెలంగాణలో మరింత కృషి జరగాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకాలం సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులు చేసిన విద్యార్థులు.. ఎలక్ట్రానిక్స్ కోర్సులను చిన్నచూపు చూశారని, సెమీ కండక్టర్స్‌ను, ఏఐ ఆధారిత చిప్స్‌ను ఇప్పటికీ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని గుర్తు చేస్తున్నారు. 2026 నాటికి మైక్రో చిప్స్, మినీ మైక్రో చిప్స్ అవసరం 60 శాతం పెరుగుతుందని, ఇప్పటి అవసరాల్లో భారత్ కేవలం 20 శాతమే సమకూర్చుకుంటోందని అంటున్నారు. అమెరికా ఆంక్షలు, చైనా డీప్‌సీక్ వ్యవహారం తర్వాత సొంతంగా మాడ్యూల్స్, మైక్రో చిప్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏఐ, మారుతున్న టెక్నాలజీల నేపథ్యంలో తెలంగాణలో ఇంజనీరింగ్ సిలబస్‌లో మార్పులు అవసరమని ఉన్నత విద్యా మండలి భావిస్తోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సెమీకండక్టర్స్ రూపకల్పనపై దృష్టిపెట్టాలి సాఫ్ట్వేర్ బూమ్ కారణంగా మనవాళ్లు సెమీ కండక్టర్లు, చిప్‌ల తయారీపై ఇంతకాలం దృష్టి పెట్టలేదు. ఇప్పుడా అవసరం ఏర్పడింది. ఏఐకి డేటా అందించే కమాండ్ సెన్సర్ల తయారీ వ్యవస్థలో ఎలక్ట్రానిక్స్ విద్యార్థుల పాత్ర కీలకం. ప్రభుత్వాలు కూడా సెమీ కండక్టర్ల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. స్మార్ట్ ఎల్రక్టానిక్స్ రూపకల్పనకు అవసరమైన తోడ్పాటు అందించి.. యువతరాన్ని ప్రోత్సహించాలి. ఏఐ దూసుకొస్తున్న వేళ మన విద్యార్థుల పరిశోధనకు మంచి అవకాశం కల్పించాలి. – డాక్టర్ కేపీ సుప్రీతి, కంప్యూటర్ సైన్స్ విభాగం అధికారి, జేఎన్టీయూహెచ్ తోడ్పాటుకు ‘ఏఐ’ సరే.. తుది నిర్ణయం సరికాదు న్యాయవ్యవస్థలో కొత్త సాంకేతికత ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే దానికి పరిమితులు ఉండాలి. సాక్ష్యం, నేర దర్యాప్తు, పాత తీర్పుల తోడ్పాటు వంటి అంశాలకే ఏఐ పరిమితం అవ్వాలి. కేసుకు సంబంధించిన పూర్తి విచారణ, తీర్పులో మానవ మేధోశక్తి మాత్రమే పనిచేయాలి. అప్పుడే తీర్పులు వాస్తవికతకు అద్దం పడతాయి. ఏఐ ఎంత శక్తివంతమైంది అయినా దాన్ని న్యాయ వ్యవస్థలో పరిమితంగానే వాడాలి. – జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, మాజీ న్యాయమూర్తి -
అచ్చం ఇస్మార్ట్ శంకర్ సినిమాలోలా..
మీకు యాదుంది కదా...ఇస్మార్ట్ శంకర్ సినిమాలో సీబీఐ ఆఫీసర్ అరుణ్‌ను చంపేస్తరు. ఎవరు చంపారు? ఎందుకు చంపారు....మొదలైన విషయాలను తెలుసుకోవడానికి పోలీసులు న్యూరోసైంటిస్ట్ సారా (హీరోయిన్) సహాయంతో సీబీఐ ఆఫీసర్ ‘మెమోరీ’ని చిప్ రూపంలో కాంట్రాక్ట్ కిల్లర్ శంకర్ (మన హీరో) పుర్రెలో సెట్ చేస్తారు. క్రిమినల్ శంకర్ కాస్త í సీబీఐ సిన్సియర్ ఆఫీసర్ అరుణ్‌లా ప్రవర్తిస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. అది సినిమా కదా...ఇక నిజజీవితంలోకి వద్దాం. ‘కోతులు కూడా ఇక ముందు వీడియోగేమ్స్ ఆడతాయి’ అని ప్రకటించాడు స్పేస్ ఎక్స్ సీయివో ఎలాన్ మాస్క్. ఆయన స్టార్టప్ కంపెనీ ‘న్యూరోలింక్’ కోతి పుర్రెలో ‘చిప్’ను సెట్ చేయడానికి రెడీ అయింది. ఆతరువాత కోతిగారు మనలాగే వీడియో గేమ్స్ ఆడతారన్నమాట. (ఇది జస్ట్ ప్రారంభమేనట. ఇంకా చాలాచాలా చేస్తారట) ‘కంప్యూటర్ చిప్ కోతిపుర్రెలో ఉన్న ఆనవాలు ఏదీ ఎవరికీ కనిపించదు’ అంటున్నాడు మాస్క్. అదిసరే...కోతి ‘మెమోరీ’ చిప్‌ను మన పుర్రెలో సెట్ చేస్తే ఏందీ పరిస్థితి? నాయనా మాస్కు, మా మీద కాస్త దయచూపు! -
చిప్స్ కింగ్‌కు శాంసంగ్ చెక్
సియోల్ : కంప్యూటర్ చిప్స్ విభాగంలో అగ్రగామిగా, రెండు దశాబ్దాలకు పైగా తన హవా చాటుతున్న సిలికాన్ సెమీకండక్టర్ ఇంటెల్‌కు దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ చెక్ పెట్టింది. కంప్యూటర్ చిప్స్ విభాగంలో ఇంటెల్‌ను వెనక్కి నెట్టేసి శాంసంగ్ రారాజుగా నిలిచింది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో శాంసంగ్ లాభాలు రికార్డు స్థాయిలో జంప్ చేశాయి. దీంతో ఇంటెల్‌కు శాంసంగ్ చెక్ పెట్టినట్టు విశ్లేషకులు చెప్పారు. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ఇంటెల్‌ను శాంసంగ్ పక్కకు నెట్టేసినట్టు పేర్కొన్నారు. శాంసంగ్ మొత్తం 17.6 ట్రిలియన్(రూ.1,01,284కోట్ల) రెవెన్యూల నిర్వహణ ఆదాయాల్లో సెమికండక్టర్ బిజినెస్‌ల నుంచే 8 ట్రిలియన్లు(రూ.46,157కోట్లకు పైగా) వచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఇంటెల్ కూడా నేడే ఫలితాలను ప్రకటించనుంది. కానీ దీని క్వార్టర్లీ రెవెన్యూలు 14.4 బిలియన్ డాలర్లుగానే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అంటే రూ.92,314 కోట్లు మాత్రమేనని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. వార్షికంగా ఇంటెల్ విక్రయాలను శాంసంగ్ అధిగమించినట్టు అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మొబైల్ డివైజ్‌లు, డేటాలో శాంసంగ్ ఆధిపత్య స్థానంలో ఉంది. ఈ కంపెనీ చీఫ్ జైలుకి వెళ్లినప్పటికీ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ శాంసంగ్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా తన హవా కొనసాగిస్తూనే ఉంది. గతేడాది గెలాక్సీ నోట్7 దెబ్బతో భారీ నష్టాలను ఎదుర్కొని, పరువు ప్రతిష్టలు కోల్పోయిన ఈ సంస్థ మళ్లీ రికవరీ అయింది. దశాబ్దం పైన నుంచి శాంసంగ్, ఇంటెల్ సెమీకండక్టర్ మార్కెట్లో తమదైన శైలిలో దూసుకెళ్తున్నాయి. పర్సనల్ కంప్యూటర్లకు ప్రాసెసర్లను అందించడంలో ఇంటెల్ కంపెనీనే ఆధిపత్యంలో ఉంది. 1992 నుంచి ఈ కంపెనీనే ప్రపంచపు అతిపెద్ద సెమీ కండక్టర్ కంపెనీగా వెలుగొందుతోంది. ప్రస్తుతం ఆ స్థానాన్ని శాంసంగ్ లాగేసుకున్నట్టు తెలిసింది. కంప్యూటర్లకు బదులు టాబ్లెట్లు, పీసీలు, స్మార్ట్ఫోన్లను ఎక్కువగా వాడుతుండటంతో, శాంసంగ్ లాంటి కంపెనీలు పైకి ఎగుస్తున్నట్టు ఓ సీనియర్ విశ్లేషకుడు చెప్పారు. -
‘అక్రమ’ సిలికా.. నీరు ఊరదిక..
గూడూరు, న్యూస్‌లైన్: సిలికా పేరు చెప్పగానే గుర్తొచ్చేది గూడూరు ప్రాంతం. గిరాకీ పెరిగి సిరులు కురుపిస్తుండటంతో సిలికా అడ్డగోలు తవ్వకాలు ఇటీవల అధికమయ్యాయి. మైన్ య జమానుల స్వార్థం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ ప్రాంతంలో జీవనదుల్లా ఉన్న సొనకాలువలు ఇంకిపోయి కనుమరుగవుతున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట సాగు పశ్నార్థకం గా మారింది. ఏటా మూడు పంటలు పండే పొ లాలు.. పాలకుల నిర్లక్ష్యంతో ప్రస్తుతానికి ఒక కారుకే పరిమితమయ్యాయి. ఆ ప్రాంతాల్లో ప ర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటోంది. నియోజకవర్గంలోని చిల్లకూరు, కోట మండలాల్లో సుమారు 2వేల ఎకరాల్లో సిలికా భూములు ఉన్నాయి. కోట మండలంలోని కర్లపూడి, సిద్ధవరం, కొత్తపట్నం పంచాయతీల పరిధినూ, చిల్లకూరు మండంలోని బల్లవోలు, తూర్పుకనుపూరు, చింతవరం, వరగలి, మోమిడి, ఏరూరు, వేళ్లపాళెం, ఆద్దేపూడి, కొమరావారిపాళెం, మన్నేగుంట తదితర గ్రామాల్లో సిలికా గనులు విస్తారంగా ఉన్నాయి. సిలికాను ఉపయోగించి ఉక్కు, గాజు, కంప్యూటర్ చిప్స్‌ను తయారు చేస్తుండటంతో సిలికాకు మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో సిలికా తవ్వకాలకు అనుమతి కొంతైతే, అక్రమంగా తరలించేది కొండంత. గనుల శాఖాధికారుల నుంచి అనుమతులు పొందిన గనుల యజమానులకు హద్దులను నేటికీ చూపలేదు. అనుమతులు పొందిన భూముల పక్కనే ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండటంతో అక్రమార్కులు తమ భూముల్లోని సిలికాను పక్కన పెట్టి ముందుగా ప్రభుత్వ భూముల్లోని సిలికాను తవ్వేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని బల్లవోలు, మన్నేగుంట, తూర్పుకనుపూరు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సర్వేనంబరు 1లో ఉన్న ప్రభుత్వ భూముల గుండా సిలికాను అడ్డగోలుగా తవ్వుతూ రాత్రికి రాత్రే లారీల్లో తరలిస్తున్నా మైనింగ్ శాఖ నిద్రపోతోంది. కోట, చిల్లకూరు మండలాల్లో 72 గనులకు ఆ శాఖాధికారులు అనుమతులిచ్చారు. వాటిలో 10 గనులకు 2013వ సంవత్సరంతోనే లీజుదారులకు అనుమతుల కాలపరిమితి ముగిసింది. అయినా ఇప్పటికీ తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు. ఐదువేల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకమే... నిబంధనలకు విరుద్ధంగా సిలికాను యంత్రాలతో తవ్వేస్తుండటంతో సొనకాలువ ఎండిపోయి కోట, చిల్లకూరు మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం కానున్నాయి. గతంలో సొనకాలువను ఆధారంగా చేసుకుని ఈ భూముల్లో వరి, వేరుశనగ, పుచ్చ తదితర పంటలను కాలానుగుణంగా మూడు కార్లు పండించే వారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సిలికాను 10 అడుగుల మేర మాత్రమే తవ్వాల్సి ఉన్నా యంత్రాలతో సుమారు 30 అడుగుల వరకు తవ్వుతున్నారు. సిలికా అడ్డగోలు తవ్వకాలతో సొనకాలువల్లో నీరు ఉండకపోవడంతో కేవలం ఒక్కకారు మాత్రమే పండుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సిలికా తవ్వకాలు యంత్రాలతో సాగితే భవిష్యత్‌లో పంటలు పండేది అనుమానమే. కోర్టు ఆదేశాలూ బేఖాతర్.. సిలికా గనుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగిస్తుండటంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తడంతోపాటు కాలుష్యంబారిన పడుతున్నామని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సిలికా గనుల్లో అక్రమ తవ్వకాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టడంతోపాటు, కాలుష్య నివారణకుఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలు ఇవ్వాలని కోర్టు మైనింగ్ శాఖను ఆదేశించింది. కాలుష్యానికి కారణాలైన సిలికా అక్రమ తవ్వకాలను, రవాణాను అడ్డుకుని మైనింగ్ అధికారులు నివేదిక సమర్పించాల్సిందిపోయి, సిలికా గనుల యజమానులకు పర్మిట్ల మంజూరులో మాత్రమే కోత విధించి చేతులు దులుపుకున్నారు. దీంతో సిలికా అక్రమ రవాణా కొనసాగుతోంది. అక్రమ సిలికా తరలింపుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. అయితే తమకు ముడుపులు అందుతుండటంతో గనుల శాఖ అధికారులు అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది.