‘అక్రమ’ సిలికా.. నీరు ఊరదిక..
Published Tue, Jan 28 2014 3:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
గూడూరు, న్యూస్‌లైన్: సిలికా పేరు చెప్పగానే గుర్తొచ్చేది గూడూరు ప్రాంతం. గిరాకీ పెరిగి సిరులు కురుపిస్తుండటంతో సిలికా అడ్డగోలు తవ్వకాలు ఇటీవల అధికమయ్యాయి. మైన్ య జమానుల స్వార్థం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ ప్రాంతంలో జీవనదుల్లా ఉన్న సొనకాలువలు ఇంకిపోయి కనుమరుగవుతున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట సాగు పశ్నార్థకం గా మారింది. ఏటా మూడు పంటలు పండే పొ లాలు.. పాలకుల నిర్లక్ష్యంతో ప్రస్తుతానికి ఒక కారుకే పరిమితమయ్యాయి. ఆ ప్రాంతాల్లో ప ర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటోంది.
నియోజకవర్గంలోని చిల్లకూరు, కోట మండలాల్లో సుమారు 2వేల ఎకరాల్లో సిలికా భూములు ఉన్నాయి.
కోట మండలంలోని కర్లపూడి, సిద్ధవరం, కొత్తపట్నం పంచాయతీల పరిధినూ, చిల్లకూరు మండంలోని బల్లవోలు, తూర్పుకనుపూరు, చింతవరం, వరగలి, మోమిడి, ఏరూరు, వేళ్లపాళెం, ఆద్దేపూడి, కొమరావారిపాళెం, మన్నేగుంట తదితర గ్రామాల్లో సిలికా గనులు విస్తారంగా ఉన్నాయి.
సిలికాను ఉపయోగించి ఉక్కు, గాజు, కంప్యూటర్ చిప్స్‌ను తయారు చేస్తుండటంతో సిలికాకు మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో సిలికా తవ్వకాలకు అనుమతి కొంతైతే, అక్రమంగా తరలించేది కొండంత.
గనుల శాఖాధికారుల నుంచి అనుమతులు పొందిన గనుల యజమానులకు హద్దులను నేటికీ చూపలేదు. అనుమతులు పొందిన భూముల పక్కనే ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండటంతో అక్రమార్కులు తమ భూముల్లోని సిలికాను పక్కన పెట్టి ముందుగా ప్రభుత్వ భూముల్లోని సిలికాను తవ్వేస్తున్నారు.
చిల్లకూరు మండలంలోని బల్లవోలు, మన్నేగుంట, తూర్పుకనుపూరు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సర్వేనంబరు 1లో ఉన్న ప్రభుత్వ భూముల గుండా సిలికాను అడ్డగోలుగా తవ్వుతూ రాత్రికి రాత్రే లారీల్లో తరలిస్తున్నా మైనింగ్ శాఖ నిద్రపోతోంది.
కోట, చిల్లకూరు మండలాల్లో 72 గనులకు ఆ శాఖాధికారులు అనుమతులిచ్చారు. వాటిలో 10 గనులకు 2013వ సంవత్సరంతోనే లీజుదారులకు అనుమతుల కాలపరిమితి ముగిసింది. అయినా ఇప్పటికీ తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు.
ఐదువేల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకమే...
నిబంధనలకు విరుద్ధంగా సిలికాను యంత్రాలతో తవ్వేస్తుండటంతో సొనకాలువ ఎండిపోయి కోట, చిల్లకూరు మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం కానున్నాయి. గతంలో సొనకాలువను ఆధారంగా చేసుకుని ఈ భూముల్లో వరి, వేరుశనగ, పుచ్చ తదితర పంటలను కాలానుగుణంగా మూడు కార్లు పండించే వారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సిలికాను 10 అడుగుల మేర మాత్రమే తవ్వాల్సి ఉన్నా యంత్రాలతో సుమారు 30 అడుగుల వరకు తవ్వుతున్నారు. సిలికా అడ్డగోలు తవ్వకాలతో సొనకాలువల్లో నీరు ఉండకపోవడంతో కేవలం ఒక్కకారు మాత్రమే పండుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సిలికా తవ్వకాలు యంత్రాలతో సాగితే భవిష్యత్‌లో పంటలు పండేది అనుమానమే.
కోర్టు ఆదేశాలూ బేఖాతర్..
సిలికా గనుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగిస్తుండటంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తడంతోపాటు కాలుష్యంబారిన పడుతున్నామని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సిలికా గనుల్లో అక్రమ తవ్వకాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టడంతోపాటు, కాలుష్య నివారణకుఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలు ఇవ్వాలని కోర్టు మైనింగ్ శాఖను ఆదేశించింది.
కాలుష్యానికి కారణాలైన సిలికా అక్రమ తవ్వకాలను, రవాణాను అడ్డుకుని మైనింగ్ అధికారులు నివేదిక సమర్పించాల్సిందిపోయి, సిలికా గనుల యజమానులకు పర్మిట్ల మంజూరులో మాత్రమే కోత విధించి చేతులు దులుపుకున్నారు. దీంతో సిలికా అక్రమ రవాణా కొనసాగుతోంది. అక్రమ సిలికా తరలింపుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. అయితే తమకు ముడుపులు అందుతుండటంతో గనుల శాఖ అధికారులు అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement