Mining Department
-
వచ్చేనెల 11 నుంచి ఉచిత ఇసుక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త ఇసుక విధానాన్ని వచ్చేనెల 11 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు.. దీని బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇసుకకు సంబంధించిన ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 18005994599, ఈ మెయిల్ dmgapsandcomplaints@yahoo.comను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఇసుక విధానంపై బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఉచిత ఇసుక విధానంపై అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. ఇసుక రవాణ ఛార్జీలను నిర్ణయించి ఆ వివరాలను ప్రజలకు తెలిసేలా చేయాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్లు రోజూ నివేదికలివ్వాలి..ఇక ఉచిత ఇసుక సరఫరాపై ప్రతిరోజూ జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇవ్వాలని, అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడిచేసే బాధ్యత వారిదేనని చంద్రబాబు స్పష్టంచేశారు. ఇసుక వినియోగదారుల బుకింగ్, రవాణా వ్యవస్థలను మరింత సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధంచేయాలని, స్టాక్ పాయింట్ల వద్ద రద్దీని నివారించాలన్నారు. బుకింగ్ ఇన్వాయిస్ లేకుండా లారీలు స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్లకుండా చూడాలని.. వాటి తనిఖీ కోసం స్టాక్ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.వెంటనే మార్గదర్శకాలు జారీ : సీఎస్ ఇక నూతన ఇసుక విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే జారీచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు. సీఎం సమీక్షకు ముందు ఆయన జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకం, రవాణాకు సంబంధించిన ధరలను కలెక్టర్లు నిర్ధారించాలని, అంతకుమించి విక్రయించినట్లు ఫిర్యాదులొస్తే సహించేదిలేదని ఆయన స్పష్టంచేశారు. అంతేగాక.. ఆన్లైన్లో బుకింగ్ చేసిన వాహనాలకు ఏ తేదీన ఏ సమయంలో ఇసుకను తీసుకువెళ్లాలనేది స్పష్టంగా స్లాట్లు కేటాయించాలన్నారు.ఇసుక వాహనాలకు ప్రత్యేక నెంబరు..గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. గురువారం జిల్లాల్లోని ట్రాన్సుపోర్టర్లు అందరినీ పిలిచి ఇసుక రవాణాకు వినియోగించే వాహనాలకు ఒక ప్రత్యేక యూనిక్ నంబరును కేటాయించాలని చెప్పారు. ఆ వాహనాలు మాత్రమే ఇసుక రవాణాకు ఉపయోగించాలని స్పష్టంచేశారు. అలాగే, ప్రతి రీచ్ వద్ద పోలీస్ చెక్‌పోస్టును ఏర్పాటుచేయాలని ఎస్పీలను ఆదేశించారు. ఇసుక విధానానికి జేసీని కంట్రోలింగ్ అధికారిగా నియమించాలన్నారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ మైనింగ్ వంటివి ఎక్కడ జరిగినా అందుకు ఆయా జిల్లా కలెక్టర్, ఎస్పీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ముకేశ్‌కుమార్ మీనా స్పష్టంచేశారు. -
ఎర్ర మట్టి దిబ్బల తవ్వకాలు.. గనుల శాఖ షోకాజ్ నోటీసులు
సాక్షి, విశాఖపట్నం: ఎర్ర మట్టి దిబ్బల తవ్వకాలపై మైనింగ్ శాఖ స్పందించింది. తవ్వకాలపై గనులు శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 280 ఎకరాల ఎర్ర మట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. తవ్వకాలపై పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రమట్టి దిబ్బల అక్రమ లే ఔట్ కోసం 39,454 క్యూబిక్ మీటర్ల కంకర ఉపయోగించారని మైనింగ్ అధికారులు తేల్చారు.ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్-1966ను ఉల్లంఘించినట్లు గుర్తించిన గనుల శాఖ.. పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ జారీ చేసింది. వివరణ ఇవ్వకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ మైనింగ్ శాఖ నోటీసులో పేర్కొంది.ఇది చదవండి: మట్టి దిబ్బలు మటాష్ -
తమ్ముళ్లే ఇసుకాసురులై..!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ పెద్దలే ఇసుకాసురుల అవతారమెత్తారు. ఎన్టీఆర్ జిల్లాలోని స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలను యథేచ్ఛగా తోడేస్తున్నారు. టీడీపీ శ్రేణుల వాహనాల్లో మాత్రమే ఇసుక లోడ్ చేస్తూ కాసులు దండుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కానర్ వద్ద తిష్టవేసి భవన నిర్మాణదారులకు ఇసుక దొరకనివ్వడం లేదు. స్టాక్ పాయింట్లలో స్కానర్లు పని చేయడం లేదని బుకాయిస్తూ సామాన్యులకు ఇసుక దొరక్కుండా చేస్తున్నారు. ఇదేమని ఉద్యోగులు ప్రశ్నిస్తే.. ఉద్యోగం చేయాలంటే తాము చెప్పింది వినాలని, లేకపోతే ఉద్యోగం ఉండదని బెదిరిస్తున్నారు. దీంతో అక్కడ పనిచేస్తున్న రెవెన్యూ, మైనింగ్ శాఖల కిందిస్థాయి ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహించలేమని వాపోతున్నారు. రవాణా వాహనాలూ వారివేనందిగామ సమీపంలోని కీసర స్టాక్ యార్డు పూర్తిగా నందిగామ మండల టీడీపీ నేత చేతుల్లో ఉంది. అక్కడ ఇసుక లోడుచేసే జేసీబీలు మొదలు ఇసుక రవాణాచేసే వాహనాలన్నీ టీడీపీ నేతలవే ఉండేలా పెత్తనం చేస్తున్నారు. వాస్తవానికి కూపన్ తీసుకున్నా.. అనధికారికంగా ప్రొక్లెయిన్ ఉపయోగించి రూ.700 వసూలు చేస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల నుంచి వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్నారు. తాము చెప్పిన వారికే ఇసుకపోయాలని అక్కడి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి పరిస్థితే అనుమంచిపల్లె స్టాకు యార్డు వద్ద నెలకొంది. గ్రామస్థులు కొందరు మహిళలకు కూలీ ఇచ్చి క్యూలో నిలబెట్టి కూపన్లు పొందుతున్నారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కీసర స్టాక్ యార్డు నుంచి భారీ ఎత్తున ఇసుకను లోడ్ చేసి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారు.ఒకే బిల్లుపై మూడు ట్రిప్పులుటీడీపీ నేతలు స్టాక్ పాయింట్ల వద్ద తిష్టవేసి ఉదయం 20 వేల టన్నులకు ఒక బిల్లు తీసుకుంటున్నారు. ఆ బిల్లుతో ఇసుకను లోడ్ చేయించుకుని విజయవాడ పరిసర ప్రాంతాలకు మూడుసార్లు రవాణా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. 20 టన్నులకు బదులు 36 టన్నుల వరకు లోడ్ చేసుకుని ఇసుకను లూటీ చేస్తున్నారు. టీడీపీ నేతలు, ప్రొక్లెయిన్ యజమాని కలసి ఒక్కో లారీ టిప్పర్‌కు అదనంగా ఇసుకను లోడ్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డుల వద్ద నిల్వ ఉంచిన ఇసుకను టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. 47 వేల టన్నులకు పైగా విక్రయంఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 7న ఉచిత ఇసుక ప్రారంభం కాగా.. అప్పటికి 5,54,361 టన్నుల ఇసుక నిల్వలు ఉండేవి. ఇప్పటికే దాదాపు 47 వేల టన్నులకు పైగా స్టాక్ యార్డుల నుంచి తరలించేశారు. రోజుకు 8 వేల నుంచి 9 వేల టన్నుల ఇసుక జిల్లాలోని యార్డుల నుంచి తరలిపోతోంది. ప్రస్తుత ఇసుక నిల్వలు కేవలం 30 నుంచి 40 రోజుల మాత్రమే సరిపోతాయి. వర్షాకాలంలో నది నుంచి ఇసుక తీసేందుకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ లోపు సిల్ట్ లేదా ఓపెన్ రీచ్‌లను గుర్తించకపోతే ఇసుక కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ నేతలు ముందస్తుగానే యార్డుల నుంచి ఇసుకను డంప్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలో 8 స్టాకు యార్డులున్నాయి. కృష్ణా జిల్లా స్టాకు యార్డులో ఇసుక నిల్వలు లేవు. ఎన్టీఆర్ జిల్లా నుంచే కృష్ణా జిల్లాకు ఇసుక తీసుకెళ్లాల్సి వస్తోంది.‘అక్రమ ఇసుక’లో మా వాటా ఏదీ?» శ్రీకాకుళం జిల్లా పెద్దసవళాపురంలో టీడీపీ సీనియర్ల ఆక్రోశం » వంశధార నదిలో కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు» అక్రమ ఇసుక రవాణా అవకాశం చోటామోటా కార్యకర్తలకు అప్పగింత » తమకూ వాటా ఇవ్వాలంటూ నాయకులపై సీనియర్ల ఒత్తిళ్లు సాక్షి, టాస్క్‌ఫోర్స్: అక్రమ ఇసుక తవ్వకాలు, వసూళ్లు, రవాణాలో తమకు వాటా ఇవ్వడం లేదంటూ టీడీపీ సీనియర్ కార్యకర్తలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి టీడీపీకి సేవ చేసిన తమను పక్కనపెట్టి.. ఎన్నికలకు నెల రోజుల ముందు పార్టీలో చేరిన చోటామోటా కార్యకర్తలకు అవినీతిలో భాగస్వామ్యం కల్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక దందాలో తమకూ వాటా ఇవ్వాలంటూ నాయకులపై ఒత్తిడి చేస్తున్నారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని పెద్దసవళాపురం వద్ద ఉన్న వంశధార నదిలో నుంచి ఎలాంటి అనుమతి లేకుండా టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఈ ఇసుకను ప్రతి రోజూ దాదాపు 20 ట్రాక్టర్ల ద్వారా.. వెన్నెలవలస వద్ద గల ఆశ్రమ పాఠశాల సమీప ప్రదేశానికి తరలించి నిల్వ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఆ ఇసుకను ఇష్టారీతిన అమ్మేస్తున్నారు. ఇసుక కోసం వచ్చే ప్రతి ట్రాక్టర్ నుంచి రూ.100, టైరు బండ్ల నుంచి రూ.50 చొప్పున టీడీపీ కార్యకర్తలు వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక దందా, రవాణాను నెల రోజుల కిందట పార్టీలో చేరిన వారికి అప్పగించారంటూ స్థానిక టీడీపీ సీనియర్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య లుకలుకలు వచ్చి.. ఈ వ్యవహారం బయటపడింది. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు సమాచారం ఇవ్వడంతో ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి పోలీసులు మంగళవారం ఉదయం ఇసుక ర్యాంపు వద్దకు చేరుకున్నారు. కానీ అప్పటికే సమాచారం లీక్ అవ్వడంతో తెలుగు తమ్ముళ్లు ఇసుక రవాణా నిలిపేశారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ రమేశ్‌బాబును ప్రశ్నించగా.. ప్రతి రోజు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. మండలంలో ఇసుక ర్యాంపుల నిర్వహణకు ఇప్పటివరకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.పెనుమూడి రేవులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు»రెవెన్యూ మంత్రి అండతో రెచ్చిపోతున్న కూటమి నేతలు» చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులురేపల్లె రూరల్: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుమూడి రేవులో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అండదండలతో కూటమి నేతలు అక్రమార్జనకు తెగబడుతున్నారు. అనుమతి లేకుండా రేవు లోపలకు చొరబడి పడవల ద్వారా ఇసుకను తీసుకొచ్చి ట్రాక్టర్లలో లోడ్ చేసి పరిసర ప్రాంతాల్లో యథేచ్ఛగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. మూడు రోజులుగా అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. రేవు వద్ద ట్రాక్టర్లలో లోడ్ చేసినందుకు రూ.1500 నగదు, రేవు వద్ద నుంచి రేపల్లె పట్టణానికి చేరవేస్తే రూ.2500 నుంచి రూ.3000 వరకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తే దూరాన్ని బట్టి మరింత నగదు వసూలు చేస్తున్నారు. ఒక పక్క ఉచిత ఇసుక విధానం అంటూనే మరో వైపు పెనుమూడి రీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వి అమ్ముకుంటున్నారని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని అరికట్టాల్సిన రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటంలేదని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తహసీల్దార్ రవీంద్ర వివరణ ఇస్తూ పెనుమూడి ఇసుక రీచ్‌లో అక్రమంగా ఇసుక తవ్వుతున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. రీచ్ వద్ద తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే గ్రామ రెవెన్యూ అధికారిని ఆదేశించామని తెలిపారు. తవ్వకాలను అడ్డుకోవటంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు. -
ఈనాడు కథనంపై ఏపీ గనుల శాఖ ఆగ్రహం
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై ఈనాడు దినపత్రిక ఇచ్చిన కథనంపై ఏపీ రాష్ట్ర గనుల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఒక పారదర్శక విధానం రూపొందించి అమలు చేస్తుంటే.. అపోహ, అసత్య కథనాన్ని ఈనాడు ఇచ్చిందని పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర గనులశాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ఏపీ ఇసుక ఆపరేషన్స్‌పై ‘‘ఇసుకకు టెండరు పెట్టింది సీఎంవోనా?’’ అనే శీర్షికన ఓ కథనం ఈనాడులో ప్రచురితమైంది. అయితే అందులో ఉన్నవి అవాస్తవాలేనని వీజీ వెంకటరెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే పలు జిల్లాల్లో అక్రమ దందా అంటూ అర్థం లేని రాతలు రాయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇసుక విధానాన్ని పారదర్శకంగా రూపొందించి మరీ అమలు చేస్తోందని, పొంతనలేని అంశాలతో ఈనాడు అసత్య కథనాన్ని వండివార్చిందని అన్నారాయన. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఇసుకకు గతంలో టెండర్లు నిర్వహించాం. ఈ టెండర్లలో జెపీ సంస్థ సక్సెస్ ఫుల్ బిడ్డర్ గా ఎంపికయ్యింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ఇసుక ఆపరేషన్స్ జరిగాయి. తిరిగి టెండర్లు నిర్వహించే వరకు ఇదే సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ చేస్తోంది. మరోవైపు కేంద్రప్రభుత్వరంగ సంస్థ MSTC ద్వారా ఇసుక ఆపరేషన్స్ కోసం మరోసారి టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నాం. ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. అప్పటి వరకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్ జరుగుతాయి. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాం. .. వర్షాకాలంలో ఇసుక ఆపరేషన్స్ నిలిచిపోయాయి. ఎండాకాలంలో జేపీ సంస్థ ద్వారా తవ్వి, స్టాక్ యార్డ్‌లలో నిల్వ చేసిన ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయి. అలాగే తిరిగి ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా అనుమతి ఉన్న రీచ్‌ల్లో పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఇసుక తవ్వకాలకు సిద్దమవుతోంది. కానీ, దీనంతటిని వక్రీకరిస్తూ.. బయటి వ్యక్తులు ఎవరో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, సీఎంవో నుంచి మాకు అనుమతి ఉందని వారు చెబుతున్నారంటూ ఈనాడు దినపత్రిక కథనాన్ని ప్రచురించడం ఎంత వరకు సమంజసం?’’ అని ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. .. ‘ఇసుక ఆపరేషన్స్‌కు గనులశాఖ నుంచి అనుమతులు మంజూరవుతాయి. మైనింగ్ రంగంలో ఉన్నప్రతి ఒక్కరికీ ఇది తెలుసు. అటువంటిది సీఎంవో అనుమతితో ఇసుక తవ్వుతున్నామని ఎలా అంటారు?. ఒక అంశంపై వార్తాకథనం ప్రచురించే సందర్భంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఇటువంటి అసత్య కథనాలను ఎలా ప్రచురిస్తారు? ’అని ఈనాడుపై ఆయన మండిపడ్డారు. ‘‘గతంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకుంది. ఆరోజు ఈనాడు దినపత్రికకు ఆ అక్రమాలు కనిపించలేదా? జగన్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఇసుక విధానంను తీసుకువచ్చారు. ప్రజలకు అందుబాటు ధరలో.. పైగా వర్షాకాలంలోనూ ఇసుక కొరత లేకుండా ఇసుకను అందిస్తున్నారు. ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా కేంద్రప్రభుత్వ రంగ సంస్థ, మినిరత్న గా గుర్తింపు పొందిన MSTC ద్వారా ఇసుక టెండర్లు నిర్వహణ జరగుతోంది. ఆసక్తి ఉన్న ఎవరైనా సరే ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. అయితే వాస్తవాలు ఇలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని, పులివెందుల నేత సోదరుల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, జిల్లా కో ఇంఛార్జిని నియమించారని.. ఈనాడు పత్రిక తన ఊహలన్నింటినీ పోగు చేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించింది. ఇకనైనా మరోసారి ఇలాంటి కథనాలు ఇస్తే.. ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ప్రకటనలో రాష్ట్ర గనులశాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు. -
గ్రానైట్ గనుల లీజులకు ఈ వేలం కరెక్టే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న తరహా ఖనిజాల తవ్వకాల లీజులను వేలం ద్వారా మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త మైనింగ్ విధానాన్ని హైకోర్టు సమర్ధించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణలను గ్రానైట్ ఖనిజానికి వర్తింపజేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించి, గ్రానైట్ గనులకు వేలం నిర్వహించకుండా ఆదేశాలివ్వాలన్న ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ అభ్యర్థనను తోసిపుచ్చింది. వేలం ద్వారా లీజులు మంజూరు చేయడం వల్ల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుందని, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్న సుప్రీం కోర్టు తీర్పును హైకోర్టు గుర్తు చేసింది. కేంద్రం తీసుకొచ్చిన గ్రానైట్ నిబంధనలు, రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన చిన్న తరహా ఖనిజాల వేలం నిబంధనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్న ఫెడరేషన్ వాదనను హైకోర్టు తిరస్కరించింది. ‘మైనింగ్ లీజు ఎలా ఇవ్వాలన్న విషయాన్ని గ్రానైట్ నిబంధనలు చెప్పడంలేదు. మొదట వచ్చిన వారికి మొదట అన్న సూత్రం ప్రకారం లీజు మంజూరు గురించి ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ చెబుతున్నాయి. ఈ నిబంధనల ప్రకారమే గ్రానైట్ లీజు మంజూరు చేస్తూ వచ్చారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వేలం ద్వారా చిన్న తరహా ఖనిజాల లీజు మంజూరు నిబంధనలు కేంద్రం గ్రానైట్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు తీర్పు వెలువరించారు. వేలం ద్వారా మైనింగ్ లీజులు కేటాయించేలా ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలను ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ, సాయి దుర్గా మినరల్స్ హైకోర్టులో సవాలు చేశాయి. గ్రానైట్ లీజుకు కొత్త వేలం నిబంధనలు వర్తించవని, అందువల్ల వేలం వేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని కోరాయి. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు తీర్పునిచ్చారు. ‘ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ రూల్స్ 2022 అమల్లోకి రావడానికి ముందు మైనింగ్ లీజు కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నీ చెల్లుబాటు కావన్న కొత్త వేలం నిబంధనల్లోని రూల్ 12(5)(డీ)పై పిటిషనర్లు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ నిబంధన కేంద్రం తీసుకొచ్చిన గ్రానైట్ రూల్స్‌కు విరుద్ధమని చెబుతున్నారు. ఈ వాదన సరికాదు. కొత్త వేలం నిబంధనలు కేంద్ర ప్రభుత్వ గ్రానైట్ రూల్స్‌కు ఎంతమాత్రం విరుద్ధం కాదు. దరఖాస్తులను ఈ విధంగా చెల్లుబాటు కావని చెప్పే నిబంధన ఏదీ కేంద్ర గ్రానైట్ రూల్స్‌లో లేదు. రాష్ట్ర ప్రభుత్వ కొత్త వేలం నిబంధనల్లోని రూల్ 12(5)(హెచ్)(9)(ఐ) ప్రకారం గ్రానైట్ క్వారీ లీజు గడువు గరిష్టంగా 20 ఏళ్లు. అదే కేంద్ర గ్రానైట్ నిబంధనల్లోని రూల్ 6 ప్రకారం లీజు గడువు 30 ఏళ్లు. అంతేకాక గ్రానైట్ రూల్స్‌లో రెన్యువల్‌కు అవకాశం ఉంది. ఆ అవకాశం కొత్త వేలం నిబంధనల్లో లేదు. ఒకే అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ఉన్నప్పుడు అందులో కేంద్ర ప్రభుత్వ నిబంధనలే చెల్లుబాటు అవుతాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూల్ 12(5)(హెచ్)(9)(ఐ) గ్రానైట్ క్వారీ లీజుకు వర్తించదు. గ్రానైట్ రూల్స్ ప్రకారం లీజు మంజూరు ప్రాంతంలో గ్రానైట్ ఉన్నట్లు ప్రభుత్వం తగిన ఆధారాలు చూపాలి. ఈ నిబంధన కొత్త వేలం నిబంధనల్లో లేదు. ఈ విషయంలో ప్రభుత్వం గ్రానైట్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే బాధిత వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు’ అని జస్టిస్ రఘునందన్‌రావు తన తీర్పులో పేర్కొన్నారు. -
Madakasira: తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత!
మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 40 కలర్ గ్రానైట్, మెటల్ క్వారీలు ఉన్నాయి. అన్నీ కర్ణాటక సరిహద్దుల్లోనే ఉండడం నిర్వాహకులకు కలిసివస్తోంది. రాత్రికి రాత్రే సులభంగా విలువైన ఖనిజాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. అగళి మండలం పీ బ్యాడిగెర క్వారీల్లో తీసిన కలర్ గ్రానైట్ దిమ్మెలకు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే ఈ గ్రానైట్ చాలా నాణ్యమైంది. ఈ క్వారీల నిర్వాహకులు నెలకు రూ.కోట్లల్లో విలువ చేసే కలర్ గ్రానైట్ తరలిస్తారు. ఇందులో దాదాపు 50 శాతం అక్రమంగా రవాణా అవుతోంది. ఇక.. రొళ్ల మండలం హొట్టేబెట్ట వద్ద బుడ్డప్ప అనే వ్యక్తికి ప్రభుత్వం 3.09 ఎకరాల భూమికి డీపట్టా ఇచ్చింది. ఇందులో ఇతను ఎలాంటి అనుమతి పొందకుండా క్వారీ ప్రారంభించాడు. కర్ణాటకకు చెందిన వ్యక్తికి లీజుకిచ్చి కొన్ని నెలల పాటు అక్రమంగా కలర్ గ్రానైట్ దిమ్మెలు తీసి కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు వెళ్లి పనులను నిలిపివేశారు. మైనింగ్ అధికారులు మాత్రం ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. మైనింగ్ చేయడానికి నిర్వాహకులు ముందుగానే గనులశాఖ నుంచి అనుమతి పొందాలి. అధికారులు క్యూబిక్ మీటర్ల ప్రకారం తవ్వకాలకు అనుమతి ఇస్తారు. హద్దులు కూడా నిర్ణయిస్తారు. ఆ ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి మైనింగ్ చేసుకోవాలి. అయితే క్వారీ నిర్వాహకులు వందల క్యూబిక్ మీటర్లకు అనుమతి పొంది వేల క్యూబిక్ మీటర్లలో మైనింగ్ చేసిన సంఘటనలు ఇటీవల సీజ్ చేసిన క్వారీల్లో వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మడకశిర కలర్ గ్రానైట్ చాలా నాణ్యంగా ఉంటుంది. దీంతో దీనికి చాలా డిమాండ్. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మడకశిర గ్రానైట్ చాలా ప్రసిద్ధి. ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. రూ.కోట్లలో క్వారీ నిర్వాహకులకు ఆదాయం లభిస్తుంది. దీంతో అందరి కన్ను మడకశిర గ్రానైట్‌పైనే పడుతోంది. మడకశిర ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి ఇటీవల అమరావతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక మైనింగ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఎమ్మెల్యే వారి దృష్టికి తీసుకెళ్లారు. విలువైన గ్రానైట్ సరిహద్దులు దాటుతున్నా మైనింగ్ శాఖ పత్తా లేదు. అక్రమ మైనింగ్‌పై స్థానిక పోలీసులే ఎక్కువ కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో మైనింగ్‌శాఖ అధికారులు పెద్దగా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో మడకశిర ప్రాంతంలోని క్వారీలపై మైనింగ్‌శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న క్వారీలను సీజ్ చేసి రూ.కోట్లలో రాయల్టీ విధించారు. ప్రస్తుతం రూ. కోట్లల్లో అక్రమ రవాణా సాగుతున్నా, అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మా దృష్టికి వస్తే చర్యలు మడకశిర ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. సరిహద్దుల్లో ఉన్న క్వారీలపై ప్రత్యేక నిఘా పెట్టాం. అక్రమంగా మైనింగ్ చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. క్వారీల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. – బాలసుబ్రమణ్యం, ఏడీ, గనులశాఖ -
చిన్నతరహా ఖనిజాల లీజులకు ఈ–వేలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని చిన్నతరహా ఖనిజాల లీజులకు ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్లైన్ వేలం జరగనుంది. ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా గనుల శాఖ వేలం ప్రక్రియ నిర్వహించనుంది. తొలివిడతగా ఈ నెలలో 200 లీజులకు ఈ–వేలం నిర్వహించి అనుమతులు మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేశారు. గనుల రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా చిన్నతరహా ఖనిజాలకు ఈ–వేలం ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆసక్తి గల వ్యక్తులు, సంస్థలు ఎవరైనా ఈ–వేలంలో పాల్గొనేందుకు వీలుగా గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ–వేలం నిర్వహించే లీజుల వివరాలు, అవసరమైన టెండర్ పత్రాలు ఈ నెల 11వ తేదీ నుంచి ఈ–ప్రొక్యూర్మెంట్ పోర్టల్ https://tender.apeprocurement.gov.inలో అందుబాటులో ఉంచుతారు. లీజులకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.mines.ap. gov.in/ miningportal లద్వారా తెలుసుకోవచ్చు. ఈ–వేలంలో ఎక్కువ మొత్తానికి బిడ్ కోట్ చేస్తారో ఆ బిడ్డర్ (ప్రిఫర్డ్ బిడ్డర్) తాను కోట్ చేసిన మొత్తాన్ని 15 రోజుల్లో గనుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్ము చెల్లించిన వెంటనే వారికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేస్తారు. ఆ తర్వాత బిడ్డర్ తాను కోట్ చేసిన క్వారీకి సంబంధించిన మైనింగ్ ప్లాన్, పర్యావరణ అనుమతి, సీఎఫ్ఈ సమర్పించిన వెంటనే లీజులు మంజూరు చేస్తారు. అనవసర జాప్యం ఉండదు తొలివిడతలో 200 లీజులకు ఈ–వేలం ద్వారా అనుమతులు మంజూరు చేస్తాం. ఎక్కడా అనవసర జాప్యం లేకుండా, పారదర్శకంగా లీజుల జారీ ప్రక్రియ ఉంటుంది. ఇప్పటివరకు మైనింగ్ రంగంలోకి రావాలనే ఆసక్తి ఉండి, అవకాశాలు దక్కని వారు ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానం ద్వారా మైనింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఎక్కువ మైనింగ్ క్వారీలను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ లభిస్తుంది. అదే సమయంలో రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలకు ఖనిజాలను అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. మైనింగ్ కార్యక్రమాల వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – వీజీ వెంకటరెడ్డి, డైరెక్టర్, గనుల శాఖ -
చంద్రబాబు సీఎం గా ఉన్నపుడే భారీ అక్రమ మైనింగ్
-
‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే భారీగా అక్రమ మైనింగ్’
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హయాంలో భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే భారీగా అక్రమ మైనింగ్ జరిగిందని వెల్లడించారు. దానివల్ల రూ.230 కోట్లకుపైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని, 2014 నుంచి 2019 వరకు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ తెరలేపారని అన్నారు. ఆండ్రూస్ మైనింగ్ సంస్థ అక్రమ మైనింగ్ చేసినట్లు ప్రాథమిక నిర్ధారణ అయిందని తెలిపారు. టీడీపీ నేతలతో ఆండ్రూస్ మైనింగ్ సంస్థకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. అక్రమంగా 2లక్షల టన్నుల మైనింగ్ చేసినట్టు నిర్ధారించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆండ్రూస్ మైనింగ్ సంస్థకు రూ.12.5 కోట్ల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. వేదాంత, విదేశాలకు సరఫరా చేయడంతో బాక్సైట్ తవ్వినట్లు భావిస్తున్నామని, ఇప్పటివరకు డీఎంఎల్ విచారణ చేశామని తెలిపారు. ఇప్పుడు మైనింగ్ జరిగిన ప్రాంతంలో విచారిస్తున్నామని, డ్రోన్ ద్వారా సర్వే మొదలుపెట్టామని పేర్కొన్నారు. వందల కోట్లు అక్రమాలు జరిగాయని, వాటన్నింటి పైనా ఇప్పుడు చర్యలు తీసుకుంటామన్నారు. తమ శాఖ అధికారుల పాత్ర ఉన్నా సరే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చదవండి: లేటరైట్ కొండలను పరిశీలించిన విశాఖ కలెక్టర్ -
మైనింగ్ శాఖలో సంస్కరణలపై సీఎం జగన్ సమీక్ష
అమరావతి: మైనింగ్ శాఖపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. మైనింగ్ శాఖలో సంస్కరణలపై చర్చించారు. ఈ– ఆక్షన్ ద్వారా మైనర్ మినరల్స్ అమ్మాలని.. సీనరేజీ ఫీజు వసూలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించాలని అధికారులు సీఎం జగన్‌కు సూచించారు. గ్రానైట్ మైనింగ్‌లో సైజు (పరిమాణం) పద్దతిలో కాకుండా బరువు ఆధారంగా సీనరేజీ నిర్ణయించాలని తెలిపారు. ఇకపై ఎన్ని టన్నులు బరువు ఉంటే.. ఆమేరకు సీనరేజీ ఫీజు వసూలు చేయాలని అధికారులు తెలిపారు. దీనివల్ల కనీసం 35 నుంచి 40శాతం ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. లీజులు పొంది, గనులు నిర్వహించని చోట కొత్తగా ఈ వేలం నిర్వహించాలని.. దీని వల్ల ప్రభుత్వానికి మరో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచాన వేశారు. ఈ నిర్ణయాలకు సీఎం ఆమోదం తెలిపారు. సెప్టెంబరు నుంచి కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తాయన్నారు అధికారులు. మైనింగ్ శాఖలో నిఘా, అమలు విభాగం పటిష్టంగా ఉండాలని.. ఆదాయాలకు గండి పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షాలు వచ్చేలోగా కనీసం 60 నుంచి 79 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వర్షాలు వల్ల రీచ్‌లు మునిగిపోయే అవకాశం ఉంటుంది. మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకూడదు అన్నారు. అందుకనే సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మైనింగ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, భూగర్భగనుల శాఖ డైరెక్టర్ (డిఎంజి) విజి.వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: మానవత్వాన్ని చాటుకున్న మంత్రి పెద్దిరెడ్డి -
‘వజ్రం’ దొరికిందని.. వేట మొదలెట్టేశారు!
కోహిమా: ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగుతారని వింటుంటాం. అదే వజ్రమే దొరికితే ఎవరైనా తీసుకోకుండా ఉంటారా..? అదే జరిగితే ఒక్కరోజులోనే కోటీశ్వరులం అయిపోవచ్చని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఇందుకోసం ఎంత కష్టాన్నైనా భరించేందుకు సిద్ధపడతారు. అలాంటి ఆలోచనతోనే నాగాలాండ్ ప్రజలు ఇప్పుడో వేట మొదలు పెట్టారు. అదే వజ్రాల వేట... తాజాగా ఓ రైతుకు వజ్రాన్ని పోలిన రాయి దొరకడంతో, ఇప్పుడు కొండ ప్రాంతంలో అనేక మంది ప్రజలు చెట్టు చేమ అని చూడకుండా తవ్వడం మొదలు పెట్టారు. దొరికితే అదృష్టమే అన్నట్టుగా తవ్వుతున్న ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం ఆ రాయి అసలు వజ్రమో కాదో కనుక్కునే పనిని భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు అప్పజెప్పింది. (చదవండి: తీరంలో కొనసాగుతున్న ‘పసిడి’ వేట) అబెంతంగ్ లోథా, లంగారికబా, కెనైలో రెగ్మా, డేవిడ్ లుఫోనియాలను త్వరగా రిపోర్ట్ అందించాలని నాగాలాండ్ జియాలజీ, మైనింగ్ డైరెక్టర్ మనేన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాంతంలో పూర్వం నుంచి వజ్రాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించనందున ఆ రాయి అసలు వజ్రమని బృందం నమ్మడం లేదు. వీరు నవంబర్ 30న లేదా డిసెంబర్ 1న అక్కడికి చేరుకొని పరిశోధనలు చేపట్టనున్నారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను ఆపేయాలని, ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపేవేయాలని బృందం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. -
గనుల శాఖ డైరెక్టర్‌గా రొనాల్డ్ రోస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి డి.రొనాల్డ్ రోస్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అలాగే వెయింటింగ్‌లో ఉన్న మరో నలుగురు ఐఏఎస్‌లకు పోస్టింగులిస్తూ మరో ఉత్తర్వు జారీచేశారు. అనితా రామచంద్రను పశుసంవర్ధక, మత్స్య శాఖ కార్యదర్శిగా, బి.విజయేంద్రను రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, ఎమ్‌ఆర్‌ఎమ్ రావును రవాణా శాఖ కమిషనర్‌గా, ఎం.ప్రశాంతిను అటవీ శాఖ జాయింట్ సెక్రటరీగా నియమించారు. -
నిర్మాణాలకు నిరంతరాయంగా ఇసుక
సాక్షి, అమరావతి: ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అదే సమయంలో సామాన్య ప్రజల ఇళ్ల నిర్మాణాలు, ముఖ్యమైన ఇతర పనులకు ఇసుక కొరత లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడంతోపాటు సామాన్యులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వానికి రాబడి వచ్చే విధంగా కొత్త ఇసుక పాలసీ తీసుకురావాలని సర్కారు తాజాగా నిర్ణయించిన విషయం విదితమే. 15 రోజుల్లో కొత్త పాలసీ తెస్తామని, ఇది వచ్చేవరకూ ఇసుక తవ్వకాలు, రవాణాను నిలిపివేస్తామని భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. కొత్త పాలసీ వచ్చేవరకూ ఇసుక తవ్వకాలు, రవాణాను నిలిపివేస్తే మాఫియా దీన్ని సాకుగా చూపించి, ఇసుక కొరత సృష్టించి, ధరలు పెంచే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఇదే జరిగితే ఇళ్లు నిర్మించుకునే సామాన్యులతోపాటు ఇతర నిర్మాణ పను లకు ఇసుక అత్యవసరమైన వారికి ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం పున:సమీక్షించుకుని, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించింది. కొరత రానివ్వొద్దు రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా కట్టుదిట్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళికకు ప్రభుత్వం బుధవారమే శ్రీకారం చుట్టింది. ముఖ్యమైన నిర్మాణాలకు, సాధారణ ప్రజల ఇళ్ల నిర్మాణం, ఇతర ముఖ్యమైన అవసరాలకు ఇసుక కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో నిర్మాణ పనులకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించింది. పర్యావరణ అనుమతి ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి ప్రాధాన్యాన్ని బట్టి పనులకు, నిరుపేదల ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతించాలని గనుల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనరేష్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాలకు మెమో జారీ చేశారు. నోడల్ అధికారులుగా జిల్లా కలెక్టర్లు కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకూ ఎవరికీ ఇసుక కొరత రానివ్వరాదు. బ్లాక్ మార్కెటింగ్ చేసి ధరలు పెంచేందుకు ఆస్కారం ఇవ్వరాదు. ఇందుకోసం కంటింజెంట్ ప్లాన్ అమలుకు కలెక్టర్లు నోడ ల్ అధికారులుగా వ్యవహరించాలని మెమోలో స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడినా, రవాణా చేసినా నిల్వ ఉంచుకున్నా కఠిన చర్యలు తీసుకోవాలని, సరఫరాలో మధ్యవర్తులు, మాఫియా పాత్ర ఉన్నట్లు తేలితే కఠినంగా వ్యవహరించాలని, ఇసుక రాష్ట్ర సరిహద్దులు దాటి తరలిపోకుండా చూడాలని, పట్టా భూముల్లో తవ్వకాలకు అనుమతి తీసుకున్న వారికి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తేల్చిచెప్పారు. ఇసుక కావాలంటే. ఇకపై ఇసుక అవసరమైన వారు తొలుత తహసీల్దార్లకు అర్జీ పెట్టుకోవాలి. కలెక్టర్ అనుమతితో ఇసుక తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇసుక దొరకదని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భూగర్భ గనుల శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇసుక కావాల్సిన వారు ఆ విషయాన్ని వివరిస్తూ అర్జీలు పెట్టుకుని అనుమతులు తీసుకుని ఉచితంగా తీసుకెళ్లవచ్చని తెలిపారు. -
15 రోజుల్లో కొత్త ఇసుక పాలసీ
సాక్షి, అమరావతి: వచ్చే జులై ఒకటో తేదీ నుంచి నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత ఇసుక ముసుగులో టీడీపీ నాయకులు ఐదేళ్లపాటు సాగించిన దోపిడీకి తక్షణమే అడ్డుకట్ట వేస్తున్నట్లు ప్రకటించింది. పారదర్శక ఇసుక విధానం తెస్తామని రాష్ట్ర మంత్రివర్గ తొలి సమావేశం నిర్ణయించిన మరుసటి రోజే ఈ దిశగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో మంగళవారం ఆయన భూగర్భ గనుల శాఖ, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షించారు. ‘ప్రజలపై ఎలాంటి భారం పడకుండా సర్కారు రాబడి పెంచేలా కొత్త ఇసుక విధానాన్ని రూపొందించాలి. సర్కారుకు ఆదాయం రావాలేగానీ ఇసుక మాఫియా నేతలకు కాదు. ఇందుకు అనుగుణంగా విధివిధానాలు తయారుచేసి సమర్పించండి. కొత్త పాలసీ రూపకల్పనకు ఎంత సమయం కావాలో చెప్పండి. అప్పటివరకూ ఇసుక తవ్వకాలు, రవాణా నిలిపేద్దాం. సర్కారు ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా ఇసుక తవ్వినా, రవాణా చేసినా వారిపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడి) చట్టం కింద కేసులు పెట్టి అరెస్టు చేయండి. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను నిరోధించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంటుంది’.. అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. 15 రోజుల్లో కొత్త ఇసుక విధానానికి సంబంధించి విధివిధానాలు సమర్పిస్తామని అధికారులు మంత్రికి తెలిపారు. దీంతో అప్పటివరకూ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా నిలిపివేయాలని మంత్రి ఆదేశించారు. 15 రోజులు ఓపిక పట్టండి : పెద్దిరెడ్డి సచివాలయం 2వ బ్లాక్‌లోని సమావేశ మందిరంలో గనుల శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం మంగళవారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై 15 రోజులపాటు నిషేధం విధించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం 15 రోజుల్లో నూతన మైనింగ్ పాలసీని తీసుకువస్తుందన్నారు. అప్పటివరకు ప్రజలు కొంచెం ఓపిక పట్టాలని కోరారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్, ఇసుక స్మగ్లింగ్‌కు ఫుల్స్టాప్ పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ఆదాయంలో 20–25 శాతం భూగర్భ గనుల శాఖ ద్వారా సాధిస్తామని చెప్పారు. ‘భూగర్భ ఖనిజ శాఖలో అక్రమాలను అరికట్టి సర్కారు రాబడి పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని పెద్దిరెడ్డి చెప్పారు. నూతన పాలసీని రూపొందించే వరకు ఎక్కడా ఇసుక తవ్వకాలు, రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా అవి జరిగితే జిల్లా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే పీడీ చట్టం కింద కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ పాలసీలను అధికారులు అధ్యయనం చేస్తున్నారని.. ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయోగకరమైన ఉత్తమ పాలసీని రూపొందిస్తారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి ఐ. శ్రీనివాస శ్రీ నరేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపైనా సమీక్ష మరోవైపు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతోనూ మంత్రి పెద్దిరెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. రెండు శాఖల కమిషనర్ కార్యాలయం, స్వచ్ఛ భారత్ (గ్రామీణ), పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగాల వారీగా సమీక్షించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మంత్రికి ఆయా శాఖల స్వరూపం, శాఖల పరిధిలో పనుల పురోగతిని ఆయా విభాగాల అధిపతులు, అధికారులు వివరించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. -
గాడిన పడిన గ్రానైట్
చీమకుర్తి: జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దానితో పాటు విదేశీ మార్కెట్‌కు డిమాండ్ వచ్చింది. ఇప్పటి వరకు ప్రధాన ఎగుమతి దేశంగా చైనా మాత్రమే ఉండేది. ఇటీవల ఈజిప్ట్, వియత్నాం, బంగ్లాదేశ్ దేశాలకు కూడా గ్రానైట్ ఎగుమతి చేస్తున్నారు. రెండేళ్ల కిందటి వరకు రూ.67 నుంచి రూ.68 ఉండే డాలర్ రేటు ఏడాదిగా రూ.71 నుంచి రూ.72 మధ్య ఉంటుంది. దాని వలన క్యూబిక్ మీటర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ గ్రానైట్ రాయి 1000 డాలర్ల వరకు పలుకుతోంది. ఇది ఇండియన్ కరెన్సీలో సరాసరి రూ.72 వేల ధర పలుకుతోంది. లోకల్ గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా ఇటీవల అధికం కావడం, లోకల్ మార్కెట్ డిమాండ్ పెరిగింది. అదను కుదరటంతో ప్రభుత్వం కూడా గ్రానైట్ నుంచి రావలసిన రాయల్టీని ముక్కుపిండి వసూలు చేస్తోంది. దీంతో జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఏడాదికి రూ.200 కోట్లు పైనే ఆదాయం సమకూరుతోంది. ఏటా పెరుగుతున్న రాయల్టీ ఆదాయం.. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ నుంచి మూడేళ్లుగా తీసిన రాళ్ల పరిమాణం కూడా పెరుగుతున్నట్టు మైన్స్ కార్యాలయం నుంచి సేకరించిన గణాంకాలను పరిశీలిస్తే అవగతమవుతోంది. వాటి మీద వచ్చే రాయల్టీ ఆదాయం ఏటికేడు పెరుగుతున్నట్లు గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. 2016–17లో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌ను 4.09 లక్షల క్యూబిక్ మీటర్లు రాయిని క్వారీ నుంచి తీయగా, 2017–18లో 4.5 లక్షల క్యూబిక్ మీటర్లు రాయిని తీశారు. ఈ ఆర్ధిక సంవత్సరం అంటే 2018–19లో జనవరి నాటికే 3.9 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి తీశారు. ఇంకా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 80 వేల క్యూబిక్ మీటర్లు తీసే అవకాశం ఉంది. దానితో ఈ సంవత్సరం 4.71 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి వస్తుంది. తీసిన రాయిపై ప్రభుత్వం వసూలు చేసే రాయల్టీ ప్రకారం 2016–17లో రూ.131 కోట్లు, 2017–18లో రూ.135 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 2018–19లో ఇప్పటికే గడిచిన జనవరి నాటికి రూ.122 కోట్లు ఆదాయం వచ్చింది. నెలకు సరాసరిన రూ.14 కోట్లు ఆదాయం వస్తున్నందున మిగిలిన రెండు నెలలకు కలిపితే మొత్తం రూ.150 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన గత మూడేళ్లతో పోల్చుకుంటే ఒక్క బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ద్వారానే రూ.131 కోట్ల నుంచి ఏకంగా రూ.150 కోట్లకు ఆదాయం పెరిగింది. ఇక బ్లాక్ గ్రానైట్ ద్వారా రూ.17 కోట్లు, కలర్ గ్రానైట్ ద్వారా రూ.25 కోట్లు ఆదాయం వస్తోంది. మూడు రకాల గ్రానైట్ల నుంచి రూ.192 కోట్లు ఆదాయం సమకూరుతోంది. ఇక ఖాళీగా ఉన్న గ్రానైట్ భూములను లీజులకు ఇచ్చిన వాటి నుంచి డెడ్‌రెంట్ వసూలు చేస్తారు. క్వారీలకు ఇచ్చిన భూములు, రోడ్డు మెటల్, గ్రావెల్ నుంచి డెడ్‌రెంట్ ద్వారా కనీసం రూ.10 కోట్లు ఆదాయం వస్తున్నట్లు మైన్స్ అధికారుల ద్వారా గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. అన్ని కలిపితే జిల్లాలోని గ్రానైట్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.200 కోట్లు పైనే ఆదాయం కేవలం రాయల్టీ ద్వారా వస్తున్నట్టు స్పష్టమవుతోంది. బ్లాకుల వారీగా రాయల్టీ రేట్లు.. గ్రానైట్ రాళ్లకు వాటి పరిమాణాన్ని బట్టి రాయల్టీని వసూలు చేస్తారు. సూపర్ గ్యాంగ్సా, మినీ గ్యాంగ్సా, కట్టర్‌సైజ్, ఖండాస్ అనే నాలుగు రకాలుగా విభజిస్తారు. బ్లాక్ గెలాక్సీ, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ రాళ్లకు వేర్వేరుగా రాయల్టీని చెల్లించాల్సి వుంటుంది. ఇప్పుడు వసూలు చేసే రాయల్టీ ధరలను 2015 నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. వాస్తవానికి రాయల్టీ ధరలను ప్రతి మూడేళ్లకు ఒకసారి సమీక్షించాల్సి ఉంటుంది. అమలు చేస్తున్న ధరలు మూడేళ్లయిలైనా వాటిని అలాగే అమలు చేస్తున్నారు. -
గనుల శాఖలో బయటపడిన ‘కట్టల’ పాము
లాకర్లలో రూ.కోట్ల కట్టలు.. వాటర్ క్యాన్‌లోనూ లక్షలకు లక్షలు.. కోట్ల విలువైన బంగారు నిధి.. విశాఖ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో భారీ భవంతులు.. పక్క జిల్లాల్లో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు.. వెరసి రూ.50 కోట్లకుపైగా అక్రమాస్తులు..రోజూ కాలం చెల్లిన పాత బజాజ్ స్కూటర్‌పై రైల్వేస్టేషన్‌కు వెళ్లి.. అక్కడి నుంచి రైలులో తను పనిచేసే అనకాపల్లికి వెళ్లే ఓ అధికారి ఇన్ని భారీ ఆస్తులు సంపాదించారంటే ఎవరైనా సరే.. నమ్మరేమో!..కానీ గురువారం ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో బయటపడిన అవినీతి గని.. దీన్ని నమ్మక తప్పదని చెబుతోంది.. ఆ అవినీతి ‘గను’డు.. అనకాపల్లి కేంద్రంగా పని చేస్తున్న గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గుండు శివాజీ.టెక్నికల్ అసిస్టెంట్‌గా 1993లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఈయన ఈ పాతికేళ్లలో ఏడీ స్థాయికి ఎదిగిన క్రమంలోనే ఎడాపెడా అక్రమార్జనకు పాల్పడ్డారు. అవనీతి సంపాదనతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ భూములు, ఇళ్లు, ఇళ్లస్థలాలు, బంగారు నగలు సమకూర్చుకొని కోట్లకు పడగెత్తారు. ఈయనగారి అక్రమాలపై అందిన ఫిర్యాదులతో ఆరునెలల నుంచే ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. అదను చూసి గురువారం దాడులు చేశారు. బృందాలుగా విడిపోయి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనకాపల్లిలోని అతని కార్యాలయం, విశాఖ ఎంవీపీ కాలనీలోని నివాసంతోపాటు పీఎంపాలెంలోనే అతని బావమరిది అయిన ఓ కానిస్టేబుల్ ఇంటిలోనూ సోదాలు జరిపారు. విజయగనం జిల్లాలోని అతని స్వగ్రామంతోపాటు పలువురు బంధువుల నివాసాల్లో జరిపిన సోదాల్లో అక్రమా ఆస్తులకు సంబంధించి కళ్లుచెదిరే వివరాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.2.50 కోట్లు అని అంచనా వేసినప్పటికీ.. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.50 కోట్ల పైమాటేనని అధికారులే చెబుతున్నారు. లాకర్లు, ఇళ్లలో ఉన్న నగదులో అధిక శాతం 2000, 500 నోట్ల కట్టలే ఉండటం విశేషం. సీతమ్మధార(విశాఖ ఉత్తర): అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అందినకాడికి దోచుకుని కోట్ల రూపాయలు కూడబెట్టిన అవినీతి ఘని ఏసీబీ అధికారులకు చిక్కింది. 25 సంవత్సరాల కిందట సాధారణ టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి రూ.50కోట్లకుపైగా కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో జియాలజీ అండ్ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గుండు శివాజీ, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. విజయనగరంం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లిలోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి అక్రమార్జన గుట్టు విప్పారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... గురువారం ఉదయం 6 గంటల నుంచి ఎంవీపీ కాలనీ సెక్టార్ – 3లోని శివాజీ ఇంటిలో సోదాలు చేపట్టారు. అదే సమయంలో అతని సోదరుడు బాలాజీ ఇల్లు, పీఎంపాలెంలోని బావమరిది ఇల్లు, స్వగ్రామం బంటుపల్లిలోని ఇల్లు, అనకాపల్లిలోని కార్యాలయంలో సోదాలు చేపట్టారు. భోగాపురంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించారు. గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.2.50కోట్లు ఉంటుందని, బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.50కోట్లపైనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ అధికారులు గణేష్, రమేష్, గఫూర్, మూర్తి, అప్పారావు, ఉమామహేశ్వరరావు సిబ్బందితో బృందాలుగా ఏర్పాడి సోదాలు నిర్వహించారు. గుర్తించిన ఆస్తులివే ♦ శివాజీ ఇంటిలో 240 గ్రాముల బంగారం, 3.3 కిలోల వెండి, రూ.9.5లక్షలు గుర్తించారు. ♦ శివాజీ భార్య శారదామణి పేరిట ఎంవీపీ సెక్టార్ –6లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలోని లాకర్లో రూ.39.50 లక్షలు నగదు (అన్నీ రూ.2 వేలు, రూ.500ల నోట్లు) గుర్తించారు. ♦ ఎంవీపీ సెక్టార్ – 10లోని ఎస్బీఐ లాకర్ 34.50 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. అందులోనే 1358 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ♦ కాపులుప్పాడలో 267 గజాల స్థలం. ♦ ఎంవీపీ కాలనీలో మూడు అంతస్తుల భవనం. (దీని విలువ సుమారు రూ.2కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.) ♦ విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మాణంలో ఉన్న జీ ప్లస్ వన్ భవనం. ♦ భోగాపురంలోని 25 సెంట్ల వ్యవసాయ భూమి. ♦ స్వగ్రామం బంటుపల్లిలో వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ♦ ఇంకా కొన్ని లాకర్లలో నగదు, బంగారం ఉందని, ఫిక్సిడ్ డిపాజిల్లు ఉన్నాయని... అవన్నీ పరిశీలిస్తున్నామని డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. శివాజీని అరెస్ట్ చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించామని, శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. స్వగ్రామంలోని ఇంటిలో... డెంకాడ(నెల్లిమర్ల): విశాఖ జిల్లా అనకాపల్లి మైన్స్ ఏడీగా పని చేస్తున్న గుండు శివాజీ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై అవినీతినిరోధక శాఖ అధికారులు ఆయన ఇళ్లపై గురువారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. దీనిలో భాగంగా శివాజీ స్వగ్రామమైన విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని బంటుపల్లి గ్రామంలోని ఆయన స్వగృహంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ గఫూర్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఇక్కడ సోదాల్లో వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులకు సంబంధించిన భూమి పత్రాలను గుర్తించామని, కొత్తగా ఏమీ ఇక్కడ లభ్యం కాలేదని ఏసీబీ ఇన్స్పెక్టర్ గఫూర్ ‘సాక్షి’కి తెలిపారు. వీటన్నింటినీ నమోదు చేసుకుని, రెవెన్యూ అధికారుల నుంచి కూడా వీటిపై సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు. కానిస్టేబుల్ చంద్రశేఖర్ నివాసంలో... పీఎం పాలెం(భీమిలి): పీఎం పాలెం ఆఖరు బస్టాపునకు సమీపంలోని ఓ అపార్టుమెంట్లో నివసిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కూరాకుల చంద్రశేఖర్ నివాసంపై ఏసీబీ సీఐ రామారావు సిబ్బందితో దాడులు నిర్వహించారు. అవినీతి ఘని మైన్స్ ఏడీ శివాజీకి చంద్రశేఖర్ స్వయానా బావమరింది. ఇంటిలో క్షుణ్ణంగా పరిశీలించామని, అయితే శివాజీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యం కాలేదని సీఐ రామారావు తెలిపారు. ఆరు నెలలుగా నిఘాపెట్టి మైన్స్ ఏడీ శివాజీ అక్రమార్జనపై సమాచారం అందడంతో అవినీతి నిరోధక శాక అధికారులు అతని కార్యాలయం, ఇల్లు, తదితరాలపై గడిచిన ఆరు నెలలుగా నిఘా ఉంచారు. రోజూ ఇంటి నుంచి స్కూటర్‌పై రైల్వేస్టేషన్‌కు వెళ్లి... అక్కడ పార్కు చేసి రైలులో అనకాపల్లిలోని కార్యాలయానికి వెళ్తుండేవాడని అధికారులు గుర్తించారు. వాటర్ క్యాన్‌లో నోట్ల కట్టలు కూలింగ్ వాటర్ క్యాన్‌లో లక్షలాది రూపాయల నోట్ల కట్టలు దాచిపెట్టి తన పడక గదిలో శివాజీ ఉంచుకున్నాడు. తనిఖీల్లో వాటర్ క్యాన్‌లో సుమారు రూ.10 లక్షలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. పేరు : గుండు శివాజీ ఉద్యోగంలో చేరింది : 1993లో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరిక ప్రస్తుత హోదా : జియాలజీ అండ్ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్గాఅనకాపల్లిలో విధుల నిర్వహణ 25 ఏళ్లలో సంపాదన : బహిరంగ మార్కెట్లో రూ.50కోట్లకుపైనే ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టిన ప్రదేశాలు ♦ అనకాపల్లిలోని మైన్స్ ఏడీ కార్యాలయం ♦ విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలం బంటుపల్లి గ్రామంలోని శివాజీ స్వగృహంలో శ్రీకాకుళంలోని బంధువుల ఇంటిలో ♦ విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు పరిశీలన ♦ విశాఖ నగర పరిధి ఎంవీపీ కాలనీలోని సెక్టార్ –3లోని శివాజీ ఇల్లు ♦ ఉషోదయ కూడలిలో ఆయన సోదరుడు బాలాజీ ఇల్లు ♦ పీఎం పాలెం ఆఖరు బస్టాపునకు సమీపంలోని బావమరిది చంద్రశేఖర్ ఇంటిలో -
‘బాబు’ల కనుసన్నల్లోనే.. బాక్సైట్ మాఫియా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తూర్పు కనుమలుగా పరిగణించే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొండల్లో వందల కోట్ల టన్నులకుపైగా విలువైన బాక్సైట్ ఖనిజ నిక్షేపాలున్నాయి. దేశంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వ రంగ సంస్థలకే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అనుమతులివ్వడానికి వీల్లేదు. ఖనిజంలో అల్యూమినియం 40 శాతం లోపు ఉంటే లేటరైట్‌గా, అంతకు మించి ఉంటే బాక్సైట్గానూ పరిగణిస్తారు. లేటరైట్‌ను సిమెంటు తయారీకి, బాక్సైట్‌ను అల్యూమినియం తయారీకి వినియోగిస్తారు. 2014కి ముందు విశాఖలో తవ్వకాలకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అనుమతులు ఇవ్వలేదు. బాక్సైట్ తవ్వకాలకే కాదు లేటరైట్ తవ్వకాలకూ నాటి ప్రభుత్వాలు అంగీకరించలేదు. 2014లో టీడీపీ సర్కారు కొలువుదీరిన వెంటనే ఖనిజాసురులకు రెక్కలు వచ్చేశాయి. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే కుమారుడు, తూర్పు గోదావరి జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు చెందిన నాయకుడు, విశాఖ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుమారుడు, మరో మంత్రి అల్లుడు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు కలసి ఓ ముఠాగా తయారై తమ బినామీలతో మైనింగ్ కోసం దరఖాస్తు చేయించారు. నాతవరం మండలం సరుగుడు పంచాయతీ సుందరకోట గ్రామంలో అల్యూమినియం 40 శాతం లోపే ఉందని, అందువల్ల తమకు లేటరైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వాలంటూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన సింగం భవానీతో మైనింగ్ శాఖకు దరఖాస్తు చేయించారు. 2010లో ఆమె దరఖాస్తును తిరస్కరించిన మైనింగ్ శాఖ 2014లో మాత్రం సుందరకోటలో 4.97 హెక్టార్లలో 20 ఏళ్ల పాటు తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. మంత్రి అనుచరులకు లీజులు ఇదే క్రమంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పిట్టాచలం గ్రామస్తుడు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడు కిల్లో లోవరాజుకు 2015లో తొరడ గ్రామంలో 20 ఏళ్ల పాటు లేటరైట్ తవ్వకాలకు లీజు అనుమతులిచ్చారు. బమిడికలొద్దు గ్రామంలో 121 హెక్టార్ల విస్తీర్ణంలో లేటరైట్ తవ్వకాలకు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడు జర్తా లక్ష్మణరావుకు కూడా లీజు అనుమతిలిచ్చారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలు.. విశాఖ మన్యంలోనూ కొన్నాళ్లుగా తవ్వకాలు సాగిస్తున్నారు. చింతపల్లి మండంలం రాజుపాకలు, గూడెంకొత్త వీధిలో జడుమూరు. చాపరాతి పాలెం, రంపుల వద్ద కొండలు తొలిచేస్తున్నారు. భూ కుంభకోణాల్లో ప్రధానంగా పేరు వినిపించిన ఓ మంత్రి అల్లుడు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు, అతడి సన్నిహితులు కలిసి కొన్నేళ్లుగా మన్యంలోని కొండల్లో మైనింగ్ చేస్తున్నారు. వీరంతా లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నారనే విషయాన్ని గనుల శాఖ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అవి బాక్సైట్ నిల్వలేనన్న గనులశాఖ విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడులో ఉన్న నిక్షేపాలు లేటరైట్ గనులు కావని అవి బాక్సైట్ నిల్వలేనని గనుల శాఖ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడ లభ్యమయ్యే ఖనిజంలో 44 శాతానికి పైగా బాక్సైట్ ఉన్నట్టు తేల్చింది. కానీ గత నాలుగున్నరేళ్లుగా లేటరైట్ పేరిటే బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నారు. ఇలా వీరందరికీ తవ్వుకునేందుకు లీజులు ఇప్పించిన సర్కారు పెద్దలు ఓ కచ్చితమైన నిబంధన విధించారు. ఎవరు ఎక్కడ ఎంత తవ్వుకున్నా చివరకు మెటీరియల్ మాత్రం ‘ఆండ్రు మినరల్స్’కే విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంత్రి లోకేష్ దగ్గరుండి మరీ ఈ పంచాయితీ చేసినట్టు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మైనింగ్ వ్యాపారవేత్త వెల్లడించారు. ఆండ్రూ దోచిందెంత..? మార్కెట్లో టన్ను లేటరైట్ రూ.850 దాకా ఉండగా బాక్సైట్ రూ.1,700 నుంచి రూ.1,800 వరకు ధర పలుకుతోంది. అంటే లేటరైట్ కంటే బాక్సైట్తోనే రెట్టింపు ఆదాయం లభిస్తోందని అర్ధమవుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ జిల్లాలో మైనింగ్ శాఖ అనుమతించిన ప్రాంతాల్లో తవ్విన మొత్తం సుమారు 2 కోట్ల టన్నులకుపైనే ఉంటుందని అంచనా. ఆండ్రు మినరల్స్ గత నాలుగున్నరేళ్లలో నెలకు సగటున 4 లక్షల టన్నుల బాక్సైట్‌ను కొనుగోలు చేసి అల్యూమినియం కర్మాగారాలకు విక్రయిస్తోందని ఓ మైనింగ్ వ్యాపారి ‘సాక్షి’ ప్రతినిధికి వెల్లడించారు. అంటే సగటున ఏడాదికి 48 లక్షలు... నాలుగున్నరేళ్లలో సుమారు 2 కోట్ల టన్నులకుపైనే క్రయవిక్రయాలు చేసిందని అంచనా. ఈ లెక్కన రూ.3,000 కోట్లకుపైగా టర్నోవర్ చేసి ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇందులో సింహభాగం వాటా ముఖ్యనేత, అధికార పార్టీ ముఖ్యులకు ఉండటంతో ఈ దోపిడీ యథేచ్చగా సాగుతోంది. ఆండ్రు మినరల్స్ లేటరైట్ పేరిట టన్నుకు రూ.200 రాయల్టీ, రూ.37 పన్ను, 5 శాతం జీఎస్టీ మాత్రమే చెల్లిస్తూ రెట్టింపు విలువైన బాక్సైట్‌ను తరలిస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా బడా‘బాబు’కు రూ.వందల కోట్లు నజరానాగా ఇవ్వడంతోపాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయం ఆండ్రూ రమేష్‌బాబు భరించేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. అందువల్లే మన్యం సహా తూర్పు కనుమల్లో బాక్సైట్ నిక్షేపాలను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నా ప్రభుత్వ పెద్దలు ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొంటున్నారు. ఎవరీ ‘ఆండ్రూ’..? తూర్పుగోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన ఆండ్రు రమేష్‌బాబు తొలుత పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో స్టోన్క్రషర్గా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. తూర్పు గోదావరి జిల్లాలోని మహేశ్వరి మినరల్స్ సంబంధీకులతో తొలుత సన్నిహితంగా మెలిగి ఆ తర్వాత వారితో విభేదించాడు. అనంతరం మైనింగ్ రంగంలోకి దిగిన రమేష్‌బాబు తన సోదరుడు ఆండ్రు శ్రీనివాస్ అలియాస్ బాబీతో కలిసి ఆండ్రూ మినరల్స్ స్థాపించి స్వల్ప కాలంలోనే మైనింగ్ మాఫియాగా అవతరించాడు. తూర్పు గోదావరి జిల్లా వంతాడ రిజర్వ్ ఫారెస్ట్‌లోని ఏలేశ్వరంలో గనులు లీజుకు తీసుకుని తవ్వకాలు మొదలుపెట్టిన రమేష్‌బాబు 2014 తర్వాత ఈ నాలుగున్నరేళ్లలోనే తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్న బాక్సైట్ కొండలపై గుత్తాధిపత్యం సాధించాడు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎవరు, ఎక్కడ మైనింగ్ చేసినా రమేష్‌బాబుకే విక్రయించాలని మంత్రి లోకేష్ దగ్గరుండి పంచాయితీ చేశారు. ఆండ్రూ మినరల్స్‌కు అమ్మాలని షరతు విధించడంతోపాటు గనులశాఖ ఆంక్షలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వుకోవచ్చని అడ్డగోలుగా అనుమతులిచ్చేశారు. దీంతో ఎవరు ఎక్కడ తవ్వకాలు చేపట్టినా మెటీరియల్ మాత్రం ఆండ్రు మినరల్స్‌కే విక్రయిస్తూ వస్తున్నారు. పచ్చని తూర్పు కనుమల్లో అధికారం అండతో మైనింగ్ మాఫియా గాండ్రిస్తోంది! టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లుగా లేటరైట్ ముసుగులో ఇక్కడ సాగిస్తున్న ఖనిజ దోపిడీ, విచ్చలవిడి అమ్మకాలు చూస్తే ఇదంతా బడా‘బాబు’ల డైరెక్షన్లో సాధ్యమనే సంగతి బోధపడుతోంది. గిరిజనులను బినామీలుగా చేసుకుని.. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వి పోస్తూ.. గోరంత అనుమతులతో కొండలకు కొండలు కరిగించేసి కోట్లు కొల్లగొడుతున్న అధికార పార్టీ నేతలు, మంత్రుల కుమారులు ఇక్కడ తవ్విన ఖనిజాన్ని కేవలం ఒక్కడికే కట్టబెట్టాలి. ఆ ఒక్కడే అన్నీ కొనుగోలు చేసి సిమెంట్ ఫ్యాక్టరీలు, స్టీల్ ఫ్యాక్టరీలకు విక్రయించుకుని భారీగా వెనకేసుకుంటున్నాడు. ఆ ఒక్కడికే గుత్తాధిపత్యం కట్టబెట్టినందుకు పెద్ద‘బాబు’కు రూ.వందల కోట్లు నజరానాగా ఇవ్వడంతోపాటు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఖర్చును భరించేలా ఒప్పందం కుదిరింది. ఇంతకీ ఆ ఒక్కడు ఎవరు..? అతడి గుత్తాధిపత్యం గుట్టు ఏమిటి? అనే తెలియాలంటే పూర్తి కథనంలోకి వెళ్లాల్సిందే. ఆయనకే ఎందుకు అమ్ముతున్నారో తెలియదు ‘విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతి పరిధిలోని గ్రామాల్లో మైనింగ్ చేస్తున్న ఖనిజాన్ని లీజుదారులందరూ ఆండ్రూ మినరల్స్‌కే విక్రయిస్తున్నారనే విషయం నాకూ తెలిసింది. వాస్తవానికి లీజుల వరకే మా ప్రమేయం ఉంటుంది. మైనింగ్ తర్వాత మెటీరియల్ ఎవరికి అమ్ముకుంటారో మాకు సంబంధం లేదు. గతంలో కొన్ని ఫ్యాక్టరీలకు నేరుగా విక్రయించారు. కానీ ఇప్పుడు ఆండ్రుకే అమ్ముతున్న విషయం వాస్తవమే. అది ఎందుకో మాకు తెలియదు. మాకు ఆ అవసరం లేదు కూడా.’ – శివాజీ, మైనింగ్ శాఖ సహాయ సంచాలకులు(ఏడీ) -
తవ్వుకో.. దోచుకో..
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లాలో మరోసారి అక్రమ మైనింగ్‌కు ద్వారాలు తెరుచుకున్నాయి. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒత్తిడికి తలొగ్గిన మైనింగ్ శాఖ అధికారులు గుంటూరు, దాచేపల్లి ప్రాంతాల్లో ఏడు గనుల (మొజాయిక్ చిప్స్) ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధానంగా మైన్స్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్, ఎక్స్‌ప్లోజివ్స్ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ నుంచి అనుమతులు లేకుండానే రెండు రోజులుగా తవ్వకాలు సాగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని వేమవరంలోని మరో గనిలో కూడా తవ్వకాలకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలో టీడీపీ నేత సాగిస్తున్న అక్రమ మైనింగ్‌పై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, గురవాచారిలు ఇటీవల హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాత్ర ఉందని, ఎంతమేరకు అక్రమ మైనింగ్ జరిగిందీ తేల్చి, రాయల్టీ, పెనాల్టీ వసూలు చేసి అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మైనింగ్ అధికారులు అనుమతులు లేని గనులను మూసి వేయించారు. ప్రభుత్వం సీబీసీఐడీ విచారణ జరిపిస్తోంది. ఇదిలా ఉండగానే మరోసారి అక్రమ మైనింగ్‌కు తెరతీయడం అక్రమార్కుల బరితెగింపునకు నిదర్శనం. ఈ విషయమై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలెక్టర్ కోన శశిధర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే గనులను మూసి వేయించాలని కోరారు. పేలుడు పదార్థాల వినియోగంపై విచారించరా? అక్రమ మైనింగ్‌పై మైన్స్ ఇండస్ట్రియల్ సెక్రటరీ నివేదిక తెప్పించుకొని 31 లక్షల టన్నుల మేరకు అక్రమ మైనింగ్ జరిగినట్లు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. దీనికి సంబంధించి రాయల్టీ, పెనాల్టీతో కలిపి రూ.129 కోట్లు వసూలు చేస్తామని చెప్పారు. అయితే మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 98 లక్షల టన్నుల మేరకు అక్రమ మైనింగ్ జరిగినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా ఆధారాలతో కోర్టుకు నివేదించారు. రాయల్టీ, పెనాల్టీ రూ.546 కోట్ల మేరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని, ఇంతగా అక్రమ మైనింగ్ సాగడానికి వినియోగించిన పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని కోర్టును అభ్యర్థించారు. కాగా, ఈ విషయమై ఏ విచారణా జరగడం లేదు. దీంతో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పీఏసీ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలు సీఐడీ అడిషనల్ డీజీని కలిసి సమగ్ర విచారణ చేయాలని నెల క్రితం రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. హైకోర్టు నివేదించిన అఫిడవిట్ ప్రకారం 31 లక్షల టన్నుల ఖనిజం వెలికి తీసేందుకు, 3 వేల టన్నుల అమ్మోనియం నైట్రేట్, 35 లక్షల ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 15.50 లక్షల జిలెటిన్ స్టిక్స్ అవసరం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు మార్కెట్లోకి సరఫరా అవుతుంటే, ప్రత్యేకించి నక్సలైట్ల మూలాలు ఉన్న పల్నాడు ప్రాంతంలో రక్షణకే ప్రమాద సూచిక అవుతుంది. ఈ పేలుడు పదార్థాలు లభ్యమైన దూరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో రాష్ట్ర రాజధాని ఉంది. ఈ పరిణామాలు రాజధాని ఉనికికే ప్రమాదంగా మారే ప్రమాదం ఉంది. ఈ విషయంలో పోలీసు, రెవెన్యూ శాఖల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ దిశగా విచారించాల్సిన సీబీసీఐడీ కేవలం కూలీలు, మిల్లర్లు, కార్మికులను మాత్రమే టార్గెట్ చేయడం గమనార్హం. అనుమతులు తప్పనిసరి.. గనుల్లో తవ్వకాలు జరపాలంటే అనుమతులు తప్పనిసరి. ఇందులో మేట్లు, మేనేజర్లను నియమించుకోవాలి. మైనింగ్ తవ్వేటప్పుడు, మైన్ పరిస్థితిని వీరు పరిశీలించాలి. మైన్ లోతుకు పోయేకొద్దీ బెంచ్ వదులుకుంటూ తవ్వాలి. ఆ నియమాన్ని మైన్ యజమానులు పాటించకుండా ఇష్టారాజ్యంగా తవ్వుతున్నారు. మేట్స్ సర్టిఫికెట్తో బ్లాస్టింగ్ చేసుకోవచ్చు. వీరికి డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోసివ్స్ అనుమతి తప్పనిసరి. వారు ఎంతమేర పేలుడు పదార్థాలు వినియోగించిందీ రిటర్న్ పంపాలి. లీజు హోల్డర్, లైసెన్స్ హోల్డర్ అగ్రిమెంట్‌తో మైన్స్ ప్రారంభించేందుకు అవకాశం లేదు. నిబంధనల మేరకే అనుమతులు నిబంధనల మేరకే గనులు ప్రారంభించేందుకు అనుమతి ఇస్తున్నాం. ఎక్స్‌ప్లోజివ్స్ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ నుంచి అనుమతి రాలేదు. అందు కోసం వాటికి కొంత సమయం ఇచ్చాం. లైసెన్స్ హోల్డర్, లీజు హోల్డర్‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఖనిజం వెలికితీతలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటాం. – శ్రీనివాసకుమార్, మైనింగ్ ఏడీ -
అవినీతికి పరాకాష్ట
ఏపీలోని నడికుడి నుంచి 4.70 లక్షల టన్నులు, కోనంకి నుంచి 5.75 లక్షల టన్నులు, కేశానుపల్లి నుంచి 2.10 లక్షల టన్నులు తరలిపోయిందని అధికారులే చెబుతున్నారు. మరి మీరేమో జాతి సంపద దోచుకున్న అసలైన వ్యక్తులను వదిలేసి.. బతుకుదెరువు కోసం కూలి పనులు చేసుకుంటున్న అనామకులపై ఎఫ్ఐఆర్లు నమోదుచేస్తారా?.. ఇలాంటి చర్యలను మేం ఎంతమాత్రం ఆమోదించబోం. ఏపీలో లక్షల టన్నుల ఖనిజ సంపద తరలిపోయింది. అవినీతికి ఇది పరాకాష్ట. దీనిపై కాగ్‌చే విచారణ జరిపిస్తాం. అధికారంలో ఉన్న వ్యక్తులు, అధికారులు ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారు. సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేస్తూ విలువైన ఖనిజాన్ని తరలించుకుపోతుంటే ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. కూలీలపై కేసులు పెట్టి అసలు వ్యక్తులను వదిలేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనింగ్ శాఖ అధికారుల విచారణ తీరును కూడా తీవ్రంగా ఆక్షేపిస్తూ.. లేని నల్లపిల్లి కోసం చీకటి గదిలో వెతికినట్లు ఉందంటూ మండిపడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గుంటూరు జిల్లా కోనంకి, నడికుడి, కేశానుపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంలో తదుపరి ఏం చర్యలు తీసుకోవచ్చో తెలియజేయాలంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), కేంద్ర గనుల శాఖను ఆదేశించింది. ఇందులో భాగంగా వారిని ఈ కేసులో సుమోటోగా (తనంతట తాను) ప్రతివాదులుగా చేర్చింది. అంతేకాక అక్రమ మైనింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు నోటీసులు జారీచేసింది. ఆయన వాదనలను వినదలిచామని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి చర్యలు ఏమైనా తీసుకుని ఉంటే.. ఆ వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. – కోర్టు వద్దన్నా.. యరపతినేని అక్రమ మైనింగ్ చేస్తూనే ఉన్నారు ఎటువంటి అనుమతులూ తీసుకోకుండా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. స్థానిక నేతలతో కలిసి పిడుగురాళ్ల, నడికుడి, కేశనుపల్లి, దాచేపల్లి, కొండమోడులతో పాటు మరికొన్ని గ్రామాల్లో యథేచ్ఛగా లైమ్‌స్టోన్ తవ్వకాలు జరుపుతున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పిడుగురాళ్లకు చెందిన కె.గురవాచారి 2015లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అప్పటి ధర్మాసనం అక్రమ మైనింగ్‌ను నిలుపుదల చేయించడంతో పాటు బాధ్యులను గుర్తించి వారి నుంచి అక్రమ మైనింగ్ వల్ల కలిగిన నష్టాన్ని వసూలు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని, ఎమ్మెల్యే శ్రీనివాసరావు లైమ్‌స్టోన్ తవ్వకాలను కొనసాగిస్తూనే ఉన్నారని, రూ.31 కోట్ల మేరకు ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ చార్జీలు ఎగవేశారంటూ.. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు బుధవారం దానిని మరోసారి విచారించింది. – కూలీలపై కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారు.. పిటిషనర్ తరుఫు న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. కోనంకి, నడికుడి, కేశనుపల్లి ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్టు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారుల గుర్తించినట్లు తెలిపారు. ఇందుకు బాధ్యులను చేస్తూ కొందరు స్థానికులకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేసిన లోకాయుక్త అధికారులు తమ నివేదికలో.. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేరును ప్రస్తావించినా.. మైనింగ్ అధికారులు మాత్రం పెద్దల జోలికి వెళ్లకుండా స్థానికంగా పనిచేసే నలుగురు కూలీలపై కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారని వివరించారు. కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం.. బాధ్యుల నుంచి దోచుకున్న సొమ్మును వసూలు చేసే విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. తర్వాత ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపిస్తూ.. అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, రెండు ట్రాక్టర్లను జప్తు చేసినట్లు వివరించారు. – అసలైనవారిని వదిలేసి అనామకులపై కేసులా? ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఎంత మందిపై కేసు నమోదు చేశారు.. ఎంత మందిపై విచారణ ప్రారంభించారు.. ఎన్ని టన్నుల ఖనిజం అక్రమంగా తరలిపోయింది.. ఈ వివరాల సంగతేంటని ప్రశ్నించింది. ‘నడికుడి నుంచి 4.70 లక్షల టన్నులు, కోనంకి నుంచి 5.75 లక్షల టన్నులు, కేశనుపల్లి నుంచి 2.10 లక్షల టన్నులు తరలిపోయిందని అధికారులే చెబుతున్నారు. మరి మీరేమో ముగ్గురు, నలుగురు కూలీలపై కేసులు పెట్టినట్లున్నారు. ఆ ముగ్గురు నలుగురికి ఇంత పెద్ద స్థాయిలో రాత్రికి రాత్రే ఖనిజం తరలించడం సాధ్యమయ్యే పనేనా?! అవినీతికి ఇది పరాకాష్ట. జాతి సంపదను దోచేస్తున్న వారిపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు సీరియస్‌గా వ్యవహరించడం లేదు. అక్రమ మైనింగ్ చేసినట్లు గుర్తించిన వారికి ఎటువంటి డిమాండ్ నోటీసులూ ఇవ్వలేదు. జరిగిన నష్టాన్ని రాబట్టేందుకు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే.. అధికారులు కచ్చితంగా అవినీతికి పాల్పడినట్టే. అటువంటి అవినీతిపరులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. బతుకుదెరువు కోసం కూలి పనులు చేసుకుంటున్న వాళ్లపై కేసులు పెట్టిన అధికారులు.. ఖనిజ సంపద దోచుకున్న వారిపై పెట్టరా? అసలైన వ్యక్తులను వదిలేసి.. అనామకులపై ఎఫ్ఐఆర్లు నమోదుచేసి విచారణ చేస్తారా? ఇటువంటి చర్యలను మేం ఎంతమాత్రం ఆమోదించబోం. ఈ కేసులోని వివరాలను పరిశీలిస్తే.. లక్షల టన్నుల ఖనిజ సంపద తరలిపోయింది. దీనిపై కాగ్‌చే విచారణ జరిపిస్తాం. అధికారంలో ఉన్న వ్యక్తులు, గనులశాఖ అధికారులు ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారు’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. -
‘అక్రమ మైనింగ్ సమాజానికి ప్రమాదకరం’
సాక్షి, హైదరాబాద్: సమాజానికి అక్రమ మైనింగ్ ప్రమాదకారిగా మారిందని హైకోర్టు అభిప్రాయపడింది. అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న అక్ర మ మైనింగ్ వల్ల తీవ్ర స్థాయిలో పర్యావరణం ప్రభావితమవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించట్లేదని, ఎవరు తేలిగ్గా తీసుకున్నా తాము మాత్రం తేలిగ్గా తీసుకునేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ బ్లాకుల కొలతలను తక్కువగా చూపుతూ పలు గ్రానైట్ సంస్థలు భారీ మొత్తంలో వందల కోట్ల రూపాయల మేర సీనరేజీని ఎగవేశాయంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారం పై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, గనులశాఖ డైరెక్టర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌తో పాటు సీనరేజీ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్వేతా ఏజెన్సీస్, శ్వేతా గ్రానైట్స్, ఏఎస్ షిప్పింగ్, జేఎం బాక్సి కంపెనీ, మైథిలీ ఆదిత్య, కేవీఆర్ ఏజెన్సీస్, అరవింద్ ఏజెన్సీస్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
గనుల శాఖలో 477 లీజులు రద్దు
సాక్షి, హైదరాబాద్: గనుల శాఖ అనుమతి తీసుకుని కార్యకలాపాలు చేపట్టని లీజులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఏడాది కాలంగా రాష్ట్రవ్యాప్తంగా 477 లీజులకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించడం లేదని గుర్తించి.. వాటిని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇక వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో గనుల శాఖ అధికారులు 354 తనిఖీలు నిర్వహించి.. 79 చోట్ల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారు. దీంతో వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ఈ మేరకు రాష్ట్రంలో గనుల శాఖ కార్యకలాపాలపై శుక్రవారం మంత్రి కె.తారకరామారావు సమీక్షించారు. అక్రమ మైనింగ్‌ను కట్టడి చేయాలని, ఇందుకు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించండి గనుల శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. గనుల పర్యవేక్షణలో జియోఫెన్సింగ్, జియో ట్యాగింగ్, ఉపగ్రహ చిత్రాల వినియోగం, డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేయాలన్నారు. త్వరలో తీసుకురానున్న మైనింగ్ పాలసీలో దేశంలోని అత్యుత్తమ విధానాలను అమలుచేయాలని, ఆ పాలసీని చట్టరూపంలో తీసుకువస్తామన్నారు. ఈ–వేలం విధానంలో గనుల, ఇసుక రీచ్‌ల లీజులు కేటాయించాలని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక రాష్ట్రంలో సున్నపురాయి గనుల లీజుపైనా చర్చిం చారు. వాటికి జాతీయ స్థాయిలో కాకుండా అంతర్జాతీయస్థాయి వేలం నిర్వహించాలని చెప్పారు. రాక్ శాండ్ వినియోగం పెంచండి పర్యావరణ సమతుల్యత కోసం రాక్ శాండ్ (రాతి ఇసుక) వినియోగాన్ని పెంచాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం వివిధ శాఖల పరిధిలో చేపట్టిన నిర్మాణాల్లో దాని వినియోగం పెంచాలని, ఇందుకోసం ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. టీఎస్ఎండీసీ సైతం రాక్ శాండ్ క్రషర్ల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. పలు జిల్లాల్లో చేపట్టిన శాండ్ టాక్సీ విధానం విజయవంతమైందని, దానిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఒక్క ఫోన్ కాల్‌తో రాష్ట్రం లోని ఎవరికైనా ఏయే ధరల్లో ఇసుక లభిస్తుందో తెలిసేలా కొత్త విధానం రూపొందించాలని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ ఆదాయ లక్ష్యాన్ని సాధించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,166 కోట్ల ఆదాయ లక్ష్యం పెట్టుకోగా.. మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా ఫిబ్రవరి నెలాఖరు నాటికే సుమారు రూ.3,500 కోట్లు (110 శాతం) ఆదాయం వచ్చిందన్నారు. ఇసుక ఆదాయలక్ష్యం రూ.388 కోట్లుకాగా.. రూ.538 కోట్లు (139శాతం) సమకూరినట్లు తెలిపారు. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపిందని, అందువల్లే ఆదాయం కూడా పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. -
గనుల శాఖలో అవినీతి చేప
విశాఖ క్రైం: సర్వేయర్ డి.మురళీకృష్ణ అంబేడ్కర్ లంచావతారమెత్తాడు. క్వారీ లీజు అనుమతి కోసం రూ.50 లంచం డిమాండ్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నగరంలో ఉషోదయ జంక్షన్ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గనులు, భూగర్భశాఖ సంచాలకుని కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు వలపన్ని ఆయనను పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ తెలిపిన వివరాలిలా.. పరవాడ మండలం రావాడ గ్రామానికి చెందిన డి.నీలకంఠం 2011లో రావాడ గ్రామంలోని సర్వే నంబర్ 418లోని రెండు హెక్టార్లలో క్వారీ లీజు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతుల కోసం అప్పటి నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఈ నెల 28న సర్వే చేయడానికి వస్తానని సర్వేయర్ మురళీకృష్ణ చెప్పాడు. అయితే సర్వే అనుకూలంగా చేసి క్వారీ మంజూరయ్యేలా చేయడానికి రూ.50 వేలు అవుతుందని చెప్పాడు. అంత ఇచ్చుకోలేనని నీలకంఠం చెప్పినా ఆయన వినిపించుకోలేదు. చేసేదిలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గనులు, భూగర్భశాఖ కార్యాలయంలో మురళీకృష్ణ అంబేడ్కర్‌కు దరఖాస్తుదారుడు రూ. 50 వేలు లంచం ఇచ్చాడు. మురళీకృష్ణ ఆ డబ్బులు తీసుకొని టేబుల్ డెస్క్‌లో పెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న రూ.50 వేలు(500 నోట్లు) నగదును సీజ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. 2008లో టెక్కలిలో ఉద్యోగం 2008లో శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఏపీ గనులు, భూగర్భ శాఖ సంచాలకుని కార్యాలయంలో సర్వేయర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి 2012లో అనకాపల్లికి బదిలీ అయ్యారు. అక్కడ 2015 జూలై వరకు పని చేసి, ఆగస్టులో విశాఖలోని భూగర్భశాఖ సంచాలకుని కార్యాలయానికి సర్వేయర్‌గా బదిలీపై వచ్చాడు. అప్పటి నుంచి ఉన్నతాధికారికి దగ్గరై కార్యాలయంలో మురళీకృష్ణ అన్నీతానై చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. క్వారీలకు సంబంధించిన సర్వే చేయాలంటే ఆయనదే కీలకపాత్ర అని కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విలువైన డ్యాక్యుమెంట్లు లభ్యం అనకాపల్లి: అనకాపల్లిలోని సర్వేయర్ డి.మురళీకృష్ణ అంబేడ్కర్ ఇంట్లో ఏసీబీ అధికారులు చేసిన తనిఖీల్లో పలు డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ సోదాలు జరిగాయి. అచ్యుతాపురంలో ఓ ఆస్తికి సంబంధించిన రూ.16 లక్ష ల విలువ చేసే పత్రాలు, అనకాపల్లిలో ఇంటి పత్రాలు లభించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగి నాగరాజు ఇంట్లో రూ.60 లక్షల విలువ గల పత్రాలు దొరికినట్టు చెప్పారు. పత్రాలను పరిశీలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. విస్తృతంగా సోదాలు విశాఖలోని మూడు చోట్ల ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేశారు. అనకాపల్లిలోని ఆర్టీసీ కాలనీ గిరిజా టవర్స్‌లోని ఫ్లాట్ నంబర్–309లో నివాసం ఉంటున్న సర్వేయర్ డి.మురళీకృష్ణ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కార్యాలయంలో డాక్యుమెంట్లు పరిశీలించారు. క్వారీలకు సంబంధించిన ప్లాన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో తోటి ఉద్యోగులను విచారించారు. అలాగే విశాఖలో ఉంటున్న మురళీకృష్ణ స్నేహితుడు, విశ్రాంత ఉద్యోగి నాగరాజు ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐలు గణేష్, రమేష్, మూర్తి, సిబ్బంది ఈ దాడులు చేశారు. -
లేటరైట్ ముసుగులో బాక్సైట్ లూటీ
-
రూ.30 వేల కోట్ల స్వాహాకు సర్కారు పెద్దల స్కెచ్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.30 వేల కోట్ల లూటీకి సర్కారు పెద్దలు స్కెచ్ వేశారు. విశాఖ జిల్లాలో లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీకి పక్కాగా వ్యూహం పన్నారు. అత్యంత విలువైన బాక్సైట్ ఖనిజం తవ్వకాలకు నిబంధనల ప్రకారం అనుమతుల్లేవు. దీంతో అక్కడున్న ఖనిజం బాక్సైట్ కాదు, లేటరైట్ అంటూ ధ్రువపత్రాలు తెచ్చుకుని తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకు మినీ మైనింగ్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ ముసుగులో లీజులు దక్కించుకునేందుకు 30 మంది బినామీలతో దరఖాస్తులు చేయించారు. ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న ఆ ఫైల్‌కు నేడో రేపో ఆమోదముద్ర పడనుంది. విశాఖ జిల్లాలో ఒక్క పంచాయతీలోనే రూ.30 వేల కోట్లకు పైగా విలువైన బాక్సైట్‌ను కొల్లగొట్టేందుకు సాగుతున్న కుతంత్రమిది.. విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీలోని సుందరకోట, అసనగిరి, బమిడికలొద్ది, తొరడ గ్రామాల్లో 2 కోట్ల టన్నులకు పైగా బాక్సైట్ ఖనిజ నిక్షేపాలున్నాయి. దేశంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వరంగ సంస్థలకే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు అనుమతులివ్వడానికి వీల్లేదు. ముడి ఖనిజంలో అల్యూమినియం 40 శాతంలోపు ఉంటే లేటరైట్‌గా, అంతకు మించి ఉంటే బాక్సైట్‌గా పరిగణిస్తారు. లేటరైట్‌ను సిమెంట్ తయారీలో, బాక్సైట్‌ను అల్యూమినియం తయారీకి ఉపయోగిస్తారు. నాలుగేళ్లలో ఖనిజం మారిపోయింది సుందరకోట గ్రామంలోని ఖనిజంలో అల్యూమినియం 40 శాతంలోపే ఉందని, అందువల్ల తమకు లేటరైట్ తవ్వకాలకు అనుమతివ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన సింగం భవానీ గతంలో మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అధికారులు అక్కడున్నది లేటరైట్ కాదు, బాక్సైట్ అని నిర్ధారించారు. ఆమె దరఖాస్తును 2010 ఏప్రిల్‌లో తిరస్కరించారు. కానీ, విచిత్రంగా నాలుగేళ్ల అనంతరం ఆ ప్రాంతంలో ఉన్నది లేటరైట్‌గా పేర్కొంటూ అధికారులు 2014 ఫిబ్రవరి 3న సుందరకో టలో 4.97 హెక్టార్లలో 20 ఏళ్లపాటు తవ్వకాల కు ఆమెకు అనుమతులిచ్చేశారు. దీంతో అప్పటి నుంచి లీజుదారు లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వేస్తున్నారు. ఒడిశాలోని వేదాంత అల్యూమినియం కర్మాగారానికి సరఫరా చేస్తున్నారు. దాదాపు 1.50 లక్షల టన్నుల బాక్సైట్‌ను తవ్వి తరలించేశారని అంచనా. వాటాలివ్వకుంటే అంతేమరి! 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పెద్దల కళ్లు బాక్సైట్ నిక్షేపాలపై పడ్డాయి. లీజుదారు సింగం భవానీని భారీగా వాటాలడిగారు. బేరం కుదరకపోవడంతో అధికార బలం ప్రయోగించారు. భవానీకి అనుకూలంగా పంచాయతీ సర్పంచ్ ఏకపక్షంగా ఎన్ఓసీ ఇచ్చారంటూ టీడీపీ నేతలు అప్పటి కలెక్టర్ యువరాజ్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన కలెక్టర్ పంచాయతీ తీర్మానం బోగస్ అని తేల్చారు. 2015 డిసెంబర్లో భవానీ లీజును రద్దు చేశారు. కానీ, బమిడికలొద్ది, తొరడ గ్రామాల్లో తవ్వకాలకు టీడీపీ నేతల బినామీలు చేసుకున్న దరఖాస్తులకు మాత్రం అనుమతిలిచ్చేశారు. తేలని వాటాలు.. ఆగిన తవ్వకాలు తొరడలో 20 లక్షల టన్నుల ఖనిజ నిల్వలున్న 25 హెక్టార్లను విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పిట్టాచలం గ్రామస్తుడు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడు కిల్లో లోవరాజుకు 2015లో 20 ఏళ్లపాటు లేటరైట్ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారు. దాంతో అప్పటినుంచి అక్కడ లేటరైట్ పేరిట బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక బమిడికలొద్దిలో 121 హెక్టార్ల విస్తీర్ణంలో లేటరైట్ తవ్వకాలకు విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అనుచరుడు జర్తా లక్ష్మణరావుకు లీజు అనుమతిలిచ్చారు. ఈ లీజు విషయంలో టీడీపీ నేతల మధ్య వాటాల కోసం విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటాల వంచాయతీ తేలకపోవడంతో తవ్వకాలు మొదలు కాలేదు. లేటరైట్కే లీజులిచ్చాం.. ‘‘విశాఖ జిల్లా సరుగుడు పంచాయతీ పరిధిలో ఉన్నది లేటరైట్గానే గుర్తించి తవ్వకాలకు అనుమతులిచ్చాం. గతంలో ఆ ప్రాంతంలో ఉన్నది లేటరైట్ కాదు, బాక్సైట్ అని మైనింగ్ శాఖ ఇచ్చిన ఉత్తర్వుల గురించి నాకు తెలియదు. ప్రస్తుతం తొరడ గ్రామంలో లేటరైట్ మైనింగ్ జరుగుతున్న మాట వాస్తవమే’’ – సూర్యచంద్రరావు, అసిస్టెంట్ డైరెక్టర్, మైనింగ్ శాఖ -
రెచ్చిపోతున్న పచ్చ మాఫియా
తిరుమనకొండను తవ్వి గ్రావెల్ అక్రమ తరలింపు అధికార పార్టీ అండదండలు పట్టించుకోని అధికారులు మండల కేంద్రం సంగానికి కూతవేటు దూరంలో ఉన్న తిరుమనకొండను తవ్వి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. కొందరు పచ్చ కార్యకర్తలు మాఫియాగా ఏర్పడి ఇక్కడి నుంచి అక్రమంగా గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమనకొండపై ఏకంగా యంత్రాలను పెట్టి భారీగా గోతులు తీసి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సంగం(ఆత్మకూరు): సంగం, బుచ్చి మండలాల్లో గ్రావెల్‌కు మంచి డిమాండ్ ఉండడంతో కొందరు పచ్చ కార్యకర్తలు అక్రమంగా తిరుమనకొండను తవ్వేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని, ఎవరూ ప్రవేశించడానికి వీలు లేదంటూ సంగం తహసీల్దారు రామాంజనేయులు బోర్డులు ఏర్పాటు చేసినా మాఫియా గ్రావెల్ తరలింపులను ఆపలేదు. ఈ బోర్డులు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. సంగం సర్వే నెం.252/ఏ2లో 15 ఎకరాల తిరుమనకొండ ప్రభుత్వ భూమిగా ఉంది. గత కొంతకాలంగా ఇక్కడ గ్రావెల్‌ను అక్రమంగా తరిలిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు గత వారంలో ధైర్యం చేసి ఒక జేసీబీ యంత్రాన్ని, 10 ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న వీటిపై కేసులు నమోదు చేసే ధైర్యం చేయలేకపోయారు. అధికార పార్టీ స్థానిక నేతల నుంచి మంత్రుల స్థాయి వరకు ఫోన్లు, బెదరింపులు వస్తుండడంతో వీటిని వదిలేశారు. అధికార పార్టీ నేతల బెదిరింపులతో తిరుమనకొండ వైపు చూడడానికి అధికారులు సాహసం చేయడం లేదు. దీంతో రెచ్చిపోతున్న పచ్చగ్రావెల్ మాఫియా భారీగా గ్రావెల్‌ను తరలిస్తుంది. యథేచ్ఛగా తరలింపు ఏకంగా తిరుమనకొండ పైకి రహదారి ఏర్పాటు చేసి మరీ యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నారు. పగలు, రాత్రి ఈ గ్రావెల్ తరలింపు వల్ల దుమ్ము విపరీతంగా వచ్చి ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికంగా నివాసమున్న దళితులు వాపోతున్నారు. ట్రాక్టర్ గ్రావెల్‌ను సంగానికి తరలించడానికి రూ.1000, బుచ్చిరెడ్డిపాళేనికి అయితే రూ.1500 వసూలు చేస్తున్నారు. రోజుకు 100 ట్రిప్పులు గ్రావెల్ తరలిపోతున్నట్లు తెలుస్తోంది. లక్షల్లో చేతులు మారుతున్నాయి. గ్రావెల్ తరలింపును అడ్డుకోవాల్సిన మైనింగ్ శాఖ మాత్రం ఇటు వైపు దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇప్పటికే మైనింగ్ శాఖకు నెలసరి మామూళ్లు ఇచ్చేలా గ్రావెల్ మాఫియా ఏర్పాటు చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖ పనిచేయకుండా నెలసరి మామూళ్ల మత్తులో జోగుతూ తరలింపుదారులకు సహకరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ ముత్యాలరాజు స్పందించి ప్రభుత్వ భూముల్లో అక్రమ గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తప్పవు తిరుమనకొండ ప్రాంతం పూర్తిగా ప్రభుత్వ భూమి. దీనిలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అక్కడ బోర్డులు ఏర్పాటు చేశాం. అయినా అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. – రామాంజనేయులు, తహసీల్దారు, సంగం -
సాగునీటి సవాళ్లు
- ప్రాజెక్టులకు సేకరించాల్సిన భూమి ఇంకా లక్ష ఎకరాలు - 14 వేల ఎకరాలకు రావాల్సిన అటవీ అనుమతులు - భారీగా విద్యుత్, ఇసుక అవసరాలు - నేడు ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష - మైనింగ్, అటవీ, భగీరథ, భూసేకరణ, విద్యుత్ అధికారులతో భేటీ సాక్షి, హైదరాబాద్: ఇంకా లక్ష ఎకరాలకుపైగా భూసేకరణ.. 14 వేల ఎకరాలకు అటవీ అనుమతులు.. దాదాపు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక.. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టుల అవసరాలివీ! ఈ భారీ అవసరాలు తీర్చేదెలా? ఇప్పటిదాకా పెండిం గ్లో ఉన్న సమస్యలేంటి? ఈ అంశాలన్నింటిపై గురువారం నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఉన్నతాధికారులతో సమీక్ష చేయనున్నారు. భూసేకరణ, పరిహారం, అటవీ అనుమతులు, విద్యుత్ చార్జీల చెల్లింపు అంశాలపై చర్చించనున్నారు. రెవెన్యూ, అటవీ, ట్రాన్స్‌కో, మిషన్ భగీరథ, మైనింగ్ అధికారులు ఇందులో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు శాఖల వారీగా సమీక్ష చేయనున్నారు. సమన్వయమే అసలు సమస్య రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ప్రాజెక్టులకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోంది. మొత్తం 32 భారీ, మధ్య తరహా ప్రాజెక్టు పనులకు రూ.95,717 కోట్లకు ఒప్పందాలు కుదుర్చుకోగా.. ఇందులో ఇప్పటివరకు రూ.35,416 కోట్లు ఖర్చయ్యాయి. అందులో 2004లో చేపట్టిన ప్రాజెక్టుల కింద 29.19 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం ఉంది. అందులో ఇప్పటివరకు 8 నుంచి 9 లక్షల ఎకరాల ఆయకట్టు మాత్రమే సాగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, రాజీవ్ భీమా, కోయిల్‌సాగర్, నల్లగొండలోని ఏఎమ్మార్పీ, వరంగల్‌లోని దేవాదుల, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండలకు సాగునీరు ఇచ్చే ఎస్సారెస్పీ-2, వరద కాలువ, కరీంనగర్‌లోని ఎల్లంపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలు 80 శాతం పూర్తయ్యాయి. అయితే భూసేకరణ, అటవీ అనుమతుల సమస్యల కారణంగా పూర్తి ఆయకట్టుకు నీరివ్వలేకపోతున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయ లేమితో ఈ సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులను సైతం భూసేకరణ సమస్య వేధిస్తోంది. కాళేశ్వరం కింద వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే నీళ్లివ్వాలంటే ఇంకా 45 వేల ఎకరాల భూమి సేకరించాలి. పాలమూరులో భూసేకరణ జాప్యంతో పనులు కదలడం లేదు. అటవీ అనుమతులేవి? రాష్ట్రంలో 8 ప్రాజెక్టుల పరిధిలో అటవీ భూముల సమస్య నెలకొంది. ఈ ప్రాజెక్టుల కింద 14,331 ఎకరాలకు అటవీ అనుమతులు పొందాల్సి ఉంది. ఇందులో దేవాదుల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ వంటి ప్రాజెక్టులు దాదాపు ఎనిమిదేళ్ల కిందటే మొదలుపెట్టినా.. ఇంతవరకు అనుమతులు లభించలేదు. చాలా ప్రాజెక్టుల పరిధిలో డీజీపీఎస్ సర్వే పూర్తి కాకపోవడం, అటవీ భూమికి సమానమైన భూమిని చూపకపోవడం, కొన్నిచోట్ల ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచే ప్రతిపాదనలు రాకపోవడం, మరికొన్ని చోట్ల ప్రత్యామ్నాయంగా చూపిన భూమి ఇదివరకే ప్రభుత్వం ఇతరులకు కట్టబెట్టి పట్టాలివ్వడం వంటి సమస్యలున్నాయి. దీంతో ఆ ప్రాజెక్టులు ముందుకు కదలడం లేదు. ఇక ప్రాజెక్టుల నిర్మాణానికి ఇసుక అవసరాలు ఏకంగా 1.87 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర ఉన్నాయి. ఈ మేరకు ఇసుక అనుమతులు పొందడానికి తంటాలు పడాల్సి వస్తోంది. దీంతో ఇటీవలే మైనింగ్ శాఖ నేరుగా నీటి పారుదల శాఖే ఇసుకను తీసుకునే వెసులుబాటు ఇచ్చింది. -
ప్రాజెక్టులకు ఇసుక కష్టాలు తీరినట్లే
నేరుగా ఆ శాఖే ఇసుక తీసుకునే వెసులుబాటు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక కు కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో తరహాలో మైనింగ్ శాఖ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇసుక రీచ్‌లు కేటాయించడం, తర్వాత అక్కడి నుంచి ఇసుక తరలించడమనే విధానానికి మంగళం పాడుతూ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. నేరుగా నీటి పారుదల శాఖే ఇసుకను తీసుకునే వెసులుబాటు కల్పించింది. పాత విధానంలో ఇసుక కేటాయింపులకు ఆరు నెలలకు మించి సమయం పట్టి, ప్రాజెక్టుల నిర్మాణాలు ఆలస్యం అవుతుండడమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని పేర్కొంది. కొత్త మార్గదర్శకాలతో ఊపిరి ఇప్పటివరకు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమయ్యే ఇసుకను సమకూర్చుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కాంట్రాక్టర్లపైనే ఉంది. అధికారులు కేవలం ఇసుక తవ్వకాలకు అనువుగా ఉండే క్వారీలను గుర్తించడం మాత్రమే చేసేవారు. మైనింగ్ శాఖ ఇసుక క్వారీలను గుర్తించి, ఎంత లభ్యతగా ఉందో జిల్లా కలెక్టర్‌కు నివేదించేది. దానికి అనుగుణంగా కలెక్టర్ క్వారీల కేటాయింపు చేసేవారు. ఈ మొత్తం ప్రక్రియకు నెలల గడువు పడుతుండటం, పలుమార్లు రీచ్‌లు కేటాయించినా ఇసుక లభ్యత లేకపోవడంతో ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. ఇక సీనరేజీ చార్జీల కింద క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.600 వరకు చెల్లించడంతోపాటు స్థానిక గ్రామాల నేతలు, ఇతర ప్రజా ప్రతినిధులు వసూలు చేసే ముడుపులతో క్యూబిక్ మీటర్‌కు రూ.1,500 వరకు ఖర్చవుతోందని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. వీటన్నింటి నేపథ్యంలో నేరుగా నీటి పారుదల శాఖ ఇసుక తీసుకునే వెసులుబాటు కల్పించారు. దీని ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఇక నుంచి నీటి పారుదల శాఖ సొంతంగా వెలికితీసి వినియోగించుకునేలా రాష్ట్ర ఇసుక పాలసీకి సవరణలు చేశారు. దీంతోపాటు రిజర్వాయర్లు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో మేట వేసిన ఇసుకను వెలికితీసి కేవలం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు మాత్రమే వినియోగించాలి. నీటి పారుదల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జీపీఎస్ ద్వారా ఇసుక మేటలను గుర్తిం చాక మైనింగ్ ఏడీ, ఇరిగేషన్ ఈఈలు సంయుక్తంగా హద్దులను నిర్ణయించాలి. మేటలను తొలగించడం ద్వారా లభించే ఇసుక పరిమాణం లెక్కించి, జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది. ఇసుక వెలికితీతలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడటంతో పాటు, పరిమాణానికి అనుగుణంగా సీనరేజీ చార్జీలను మైనింగ్ విభాగానికి చెల్లించాల్సిన బాధ్యతను ఇరిగేషన్ ఈఈకి చూసుకోవాల్సి ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టుల్లో మేటల తొలగింపు ద్వారా వచ్చే ఇసుకను ఇతరులకు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తారు. ఈ నిర్ణయంతో ప్రాజెక్టులకు ఇసుక కొరత తగ్గుతుందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. 1.72 కోట్ల క్యూబిక్ మీటర్లు అవసరం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 1.72 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక అవసరం. ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు చేరడం, గోదావరిలో నీరు పారుతుండడంతో ఇసుక లభిస్తుందా అన్న సందేహాలున్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు పనులకే 1.25 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. డిండికి 27 లక్షలు, ఏఎమ్మార్పీకి 5.5 ల క్షలు, దేవాదులకు 4 లక్షలు, కిన్నెరసానికి 2.5 లక్షలు, సీతారామ ఎత్తిపోతలకు 1.1 లక్షలు, మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నె ట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌లకు 1.28 లక్షలు, పెన్‌గంగ 2 లక్షలు, ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులకు 2.4 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం. -
ఒకేరోజు 93 మంది ఉద్యోగుల బదిలీ
* ‘మైనింగ్’లో భారీగా బదిలీలు * డీడీ స్థాయి నుంచి టెక్నికల్ అసిస్టెంట్ల వరకు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ గనులు, భూగర్భ వనరుల శాఖలో ఉద్యోగులను పెద్ద ఎత్తున బదిలీ చేశారు. మైనింగ్ విభాగంలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న వివిధ స్థాయిలకు చెందిన 93 మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన ఉద్యోగులు తక్షణమే రిలీవ్ అయి నూతన పోస్టింగుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ అయిన వారిలో ఇద్దరు డిప్యూటీ డెరైక్టర్లు, 13 మంది అసిస్టెంట్ డెరైక్టర్లు, 14 మంది అసిస్టెంట్ జియాలజిస్టులు, 30 మంది రాయల్టీ ఇన్స్పెక్టర్లు, 34 మంది టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు. వరంగల్‌లో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న కె.లక్ష్మణ్‌బాబును నిజామాబాద్‌కు, రాష్ట్ర కార్యాలయంలో పనిచేస్తున్న కె.యాదగిరిని వరంగల్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరితో పాటు తాండూరు, మిర్యాలగూడ, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ (విజిలెన్స్), జడ్చర్ల, కొత్తగూడెం, నిజామాబాద్‌లలో పనిచేస్తున్న అసిస్టెంట్ డెరైక్టర్లను బదిలీ చేశారు. ఇటీవల మహబూబ్‌నగర్ అసిస్టెంట్ డెరైక్టర్‌ను సస్పెండ్ చేయగా.. ఆయన స్థానంలో హెడ్ ఆఫీసులో పనిచేస్తున్న జె.అమరేందర్‌రావుకు పోస్టింగు ఇచ్చారు. మైనింగ్‌పై కేటీఆర్ ప్రత్యేక దృష్టి ఈ ఏడాది ఏప్రిల్ 26న మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్య తలు చేపట్టిన నాటి నుంచి కేటీఆర్.. శాఖ పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. 2015-16లో మైనింగ్ ద్వారా రూ.2700 కోట్ల ఆదాయం సమకూరగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4వేల కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. మైనింగ్ అధికారులు, సిబ్బంది పనితీరుపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. అక్రమ మైనింగ్‌ను నివారించడంలో విఫలమైన మహబూబ్‌నగర్ అసిస్టెంట్ డెరైక్టర్, రాయల్టీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో మైనింగ్ అక్రమాలపై విచారణకు ఆదేశించిన మంత్రి కేటీఆర్.. తాజాగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో అక్రమ మైనింగ్ తీరును స్వయంగా పరిశీలిం చారు. మైనింగ్ విభాగాన్ని గాడిన పెట్టేందుకు.. ఒకే చోట ఏళ్ల తరబడి తిష్టవేసిన వివరాలను సేకరించాల్సిందిగా నెల క్రితం మైనింగ్ విభాగం డెరైక్టర్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం భారీ సంఖ్యలో ఉద్యోగుల బదిలీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
మైనింగ్‌లో భారీ బదిలీలు
జిల్లా ఏడీగా ప్రదీప్‌కుమార్ కరీంనగర్ విజిలెన్స్ ఏడీగా బలదాసు డీడీగా కె.యాదగిరి నియామకం వరంగల్ : భూగర్భ వనరుల శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ఈ శాఖలో పనిచేసే జిల్లా అధికారులందరూ బదిలీ అయ్యారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి మైనింగ్ శాఖ ఉన్నతాధికారి డిప్యూటీ డైరెక్టర్(డీడీ) వరంగల్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తారు. ఈ మేరకు మైనింగ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న కె.యాదగిరి వరంగల్ డీడీగా నియమితులయ్యారు. ప్రస్తుతం వరంగల్ డీడీగా ఉన్న కె.లక్ష్మణ్‌బాబు నిజామాబాద్ డీడీగా బదిలీ అయ్యారు. వరంగల్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టరు(ఏడీ)గా ఎ.ప్రదీప్‌కుమార్ నియమితులయ్యారు. ప్రదీప్‌కుమార్ ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఏడీగా పని చేస్తున్నారు. వరంగల్ ఏడీగా పని చేస్తున్న ఎం.బాలదాసు కరీంనగర్ జిల్లాలో మైనింగ్ విజిలెన్స్ విభాగం ఏడీగా బదిలీ అయ్యారు. వరంగల్ డీడీ కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్టుగా పని చేస్తున్న బి.సత్యనారాయణ నల్లగొండ విజిలెన్స్ విభాగానికి, నల్లగొండ జిల్లా విజిలెన్స్ విభాగంలో పని చేస్తున్న పి.శ్రీనివాస్ వరంగల్ డీడీ కార్యాలయంలో అసిస్టెంట్ జియాలజిస్టుగా బదిలీపై రానున్నారు. అలాగే, మిర్యాలగూడ ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్.బాలు వరంగల్ డీడీ కార్యాలయంలో రాయల్టీ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్.క్రాంతికుమార్ నిజామాబాద్ ఏడీ కార్యాలయానికి, మహబూబాబాబ్ విజిలెన్స్ ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న ఎస్.గంగాధరరావు ఖమ్మం ఏడీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఎం.సురేఖ వరంగల్ ఏడీ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని డీడీ కార్యాలయంలో పనిచేస్తున్న కె.ఆనంద్ వరంగల్‌కు, వరంగల్‌లో పనిచేస్తున్న ఎం.సత్యనారాయణ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు. అలాగే, వరంగల్ ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న జి.విజయకుమార్ మంచిర్యాల ఏడీ కార్యాలయానికి, వరంగల్ డీడీ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న సీహెచ్.రామమూర్తి నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏడీ కార్యాలయానికి, ఎ.నాగలక్ష్మి వరంగల్ ఏడీ కార్యాలయానికి, ఎం.డీ.రసూలొద్దీన్ కరీంనగర్ ఏడీ విజిలెన్స్‌కు, ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న సంతోష్ హైదరాబాద్‌లోని డీడీ కార్యాలయానికి, హైదరాబాద్ డీడీ కార్యాలయంలో పనిచేస్తున్న పి.నాగరాజు వరంగల్ డీడీ కార్యాలయానికి, కొత్తగూడెం ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న పి.శోభారాణి వరంగల్ డీడీ కార్యాలయానికి, కరీంనగర్ ఏడీ కార్యాలయంలో పనిచేస్తున్న బి.ఆనంద్‌కుమార్ స్టీఫెన్సన్ వరంగల్ ఏడీ కార్యాలయంలో నియమితులయ్యారు. -
1.72 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక
- ప్రాజెక్టుల పూర్తికి అవసరమని ప్రభుత్వం అంచనా - నీటిపారుదల, మైనింగ్‌శాఖలతో హరీశ్, కేటీఆర్‌ల సమీక్ష - యుద్ధప్రాతిపదికన ఇసుక రీచ్‌లను గుర్తించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఇసుక రీచ్‌లను యుద్ధప్రాతిపదికన గుర్తించాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, పరిశ్రమలు, మైనింగ్‌శాఖల మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజె క్టులతోపాటు ప్రతిపాదిత ప్రాజెక్టులకు ప్యాకేజీలవారీగా ఇసుక అవసరాలపై నీటిపారుదల, మైనింగ్‌శాఖల అధికారులతో హరీశ్, కేటీఆర్‌లు శనివారం సచివాలయంలో సంయుక్తంగా సమీక్షించారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి 1.72 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని అంచనా వేశారు. ఆదిలాబాద్ జిల్లా పెన్‌గంగ మొదలుకుని కరీంనగర్ జిల్లా గౌరవల్లి, గండిపల్లి, వరంగల్ జిల్లా దేవాదుల, నల్లగొండ జిల్లా ఎఎంఆర్ ప్రాజెక్టు, పెండ్లిపాకల, ఉదయసముద్రం, డిండి తదితర ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక పరిమాణంపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపారు. ప్రాజెక్టులకు సమీపంలోనే ఇసుక రీచ్‌లను గుర్తించాలని.. ఇసుక రీచ్‌లకు సంబంధించి జిల్లాలవారీగా రెండు రోజుల్లో మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. మిడ్‌మానేరు ప్రాజెక్టులో ఈ ఏడాది మూడు టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సి ఉన్నందున.. ప్రాజెక్టులోని ఇసుకను తరలించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని 9వ ప్యాకేజీ, రంగనాయకి సాగర్, అనంతగిరి ప్రాజెక్టులకు అవసరమైన 7 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను 45 రోజుల్లో తరలించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇసుక తరలింపులో అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని హరీశ్, కేటీఆర్‌లు ఆదేశించారు. ఇసుక రీచ్‌ల నుంచి ప్రాజెక్టు వద్దకు ఇసుకను రవాణా చేసే ట్రక్కులు, ఇతర వాహనాలకు జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసు, రెవెన్యూ అధికార యంత్రాంగం సహకారాన్ని తీసుకోవాలన్నారు. మైనింగ్ మంత్రిగా హరీశ్‌రావు చేపట్టిన చర్యలతో మైనింగ్ విభాగం ఆదాయం 45 శాతం పెరిగిందని కేటీఆర్ ప్రశంసించారు. మైనింగ్ ఆదాయాన్ని ఈ ఏడాది రెట్టింపు చేసే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామన్నారు. భూసేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి... ఇంజనీరింగ్ ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై హరీశ్‌రావు ప్యాకేజీలవారీగా సమీక్షించారు. భూసేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, భూసేకరణ సమస్యలను అధిగమించేందుకు రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలన్నారు. పనితీరు సరిగాలేని కిందిస్థాయి సిబ్బంది, ఇంజనీర్లను మార్చుకుని తమ బృందంలో సమర్థులను ఎంపిక చేసుకునే వెసులుబాటును చీఫ్ ఇంజనీర్లకు ఇస్తున్నామన్నారు. ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి అన్ని అంశాలపై సీఈలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సమావేశంలో నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, కార్యదర్శి వికాస్‌రాజ్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, టీఎస్ఎండీసీ ఎండీ ఇలంబర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీఓనా.. మజాకా
► కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ ► మైనింగ్ అనుమతులు లేకుండానే గ్రావెల్ రవాణాకు అనుమతిచ్చిన వైనం ► ఆర్డీఓపై హైకోర్టులో కేసుకు రంగం సిద్ధం కలెక్టర్ జానకి ఆదేశాలను బేఖాతర్ చేశారు. మైనింగ్ అనుమతి లేకుండానే గ్రావెల్ రవాణాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జీఓఎంఎస్-2ను ఉల్లంఘించారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని రామచంద్రాపురం, వవ్వేరు, పెనుబల్లి నుంచి గ్రావెల్ రవాణా చేసుకోవచ్చని నిబంధనలకు వ్యతిరేకంగా నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్ అనుమతి లేకుండా గ్రావెల్ రవాణాకు ఆదేశాలిచ్చిన ఆర్డీఓపై ప్రజలు హైకోర్టులో కేసు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే లోకాయుక్తకు ఫిర్యాదు పంపారు. దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. బుచ్చిరెడ్డిపాళెం : మండలంలో గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. జనవరి 12వ తేదీన రామచంద్రాపురంలో గ్రావెల్ రవాణా చేయాలని చూడగా స్థానిక రైతు పిడుగు శ్రీనివాసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి పెనుబల్లి తిప్ప నుంచి మళ్లీ అక్రమార్కులు గ్రావెల్ రవాణా చేయడం ప్రారంభించారు. దీనిపై స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా రవాణాను ఆపేయాలని సూచించారు. రవాణా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో అప్పటి తహశీల్దార్ వీఆర్వోలందరికీ కలెక్టర్ ఆదేశాలను వివరించి, గ్రావెల్ రవాణా జరగకుండా చూడాలని ఆదేశించారు. ఆర్డీఓ వెంకటేశ్వర్లు కూడా ఎవరికీ గ్రావెల్ రవాణాకు అనుమతి ఇవ్వలేదని, మైనింగ్ అనుమతి తప్పనిసరని తెలిపారు. ప్రస్తుతం జరిగిందిలా.. గత తహశీల్దార్ ఉన్న సమయంలో అక్రమ రవాణా జరగకపోవడంతో ఆయన బదిలీ కావడం అక్రమార్కులకు బాగా కలిసి వచ్చింది. ప్రస్తుత తహశీల్దార్ ప్రేమ్‌చంద్ సాల్మన్‌కు ఎఫ్డీఆర్ పనుల నిమిత్తం గ్రావెల్ కావాలని దరఖాస్తు అందింది. దరఖాస్తులో ఎక్కడి నుంచి, ఏ సర్వే నంబర్లో ఎంత స్థలంలో, స్థలం నిషేధిత స్థలమా కాదా అనే వివరాలు లేవు. అయినా తహశీల్దార్ ఆర్డీఓకు సిఫార్సు చేశారు. ఈ దరఖాస్తును పూర్తి స్థాయిలో ఆర్డీఓ పరిశీలించకుండానే మైనింగ్‌కు పంపారు. వివరాలు పూర్తిగా లేకపోవడంతో మైనింగ్ అధికారులు వెనక్కి పంపినట్లు తెలిసింది. అధికార దుర్వినియోగం మైనింగ్ శాఖ అనుమతి లేకుండా గ్రావెల్ అనుమతి ఇవ్వకూడదన్న నిబంధనలు పట్టించుకోని ఆర్డీఓ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వని విధంగా ప్రత్యేకంగా గ్రావెల్ రవాణాకు తాత్కాలిక అనుమతి ఇచ్చారు. కలెక్టర్‌కు తెలియకుండా, మైనింగ్‌శాఖ అనుమతి లేకుండా మండలంలోని పెనుబల్లి, వవ్వేరు, రామచంద్రాపురం నుంచి గ్రావెల్ రవాణా చేసుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఏయే సర్వే నంబర్లు, అవి ప్రభుత్వ భూమి లేదా ప్రైవేటు భూమి అన్న విషయాన్ని ఉత్తర్వుల్లో పొందుపరచలేదు. పరిశీలించిన దాఖలాలు లేవు కలెక్టర్ చైర్మన్‌గా, మైనింగ్ ఏడీ కన్వీనర్‌గా, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా అటవీశాఖాధికారి, పొల్యూషన్ బోర్డు అధికారి, తహశీల్దార్‌తో కూడిన కమిటీ నివేదికతో గ్రావెల్ రవాణా తదితరాలు జరగాల్సి ఉంది. ఆర్డీఓ, మైనింగ్ ఏడీ, జిల్లా అటవీశాఖాధికారి జాయింట్ ఇన్స్పెక్షన్తో గ్రావెల్ రవాణా ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి 30 రోజుల్లో జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలి. ఆర్డీఓ ఇచ్చిన ఉత్వర్వులకు సంబంధించి ప్రాంతాల్లో మైనింగ్, అటవీశాఖాధికారుల పరిశీలన జరిగిన దాఖలాలు లేవు. తమ ప్రాంతాల్లో గ్రావెల్ రవాణా వద్దని మొత్తుకున్నా వినకుండా, ప్రజాభిప్రాయం సేకరించకుండా, జీఓను ఉల్లంఘించడంపై ప్రజలు ఆర్డీఓ వెంకటేశ్వర్లుపై హైకోర్టులో కేసు దాఖలు చేయనున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ జానకి గ్రావెల్ రవాణాలో అధికారులు పాల్పడుతున్న అధికార దుర్వినియోగం, అవినీతి అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తిప్ప తవ్వితే మునక తప్పదు : పెనుబల్లి తిప్పలో తవ్వకాలు జరిపితే, తుపాన్ల సమయంలో గ్రామం మునగక తప్పదు. చారిత్రాత్మకమైన ప్రదేశాన్ని సర్వనాశనం చేయడం తగదు. సహజవనరులు దోపిడీకి గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. ఆర్డీఓ ఉత్తర్వులపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం. - చేవూరి వినయ్‌నారాయణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఎఫ్డీఆర్ పనులకు అనుమతి ఇచ్చాం : ఎఫ్డీఆర్ పనులకు గ్రావెల్ రవాణా చేసుకోమని అనుమతిచ్చాం. మైనింగ్ అనుమతి అవసరం లేదు. తాత్కాలిక అనుమతిస్తూ ఉత్వర్వులు జారీ చేశా. -కె.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ, నెల్లూరు -
ఇ(సు)క ‘ఫ్రీ’గా దోపిడీ
ఇసుకతో పచ్చనేతలకు కాసుల పంటే ఉచితం పేరిట‘దేశం’ నేతల దందా దళారులకు మేలు..పేదలకు మోత.. రవాణా, లోడింగ్, అన్లోడింగ్ పేరుతో లూటీ నిన్నటి వరకు డ్వాక్రా మాటున దోపిడీ... ఇక ఉచితం పేరుతో లూటీ.. నిత్యావసర చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన ఇసుకను నిరుపేదలు..ప్రభుత్వావసరాలకు ఉచితంగా ఇవ్వ నున్నట్టు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. అడుగడుగునా ఆంక్షలు ఉన్నప్పుడే అడ్డగోలుగా నదులు..వాగులు..వంకల్లోని ఇసుకను దోచుకుతిన్నారు. ఇప్పుడు ఆయుధంలా మారిన ‘ఉచితం’ను అడ్డంపెట్టుకుని పేదల మాటున నదీ గర్భాలను సైతం అడ్డూ..అదుపు లేకుండా తూట్లు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం: జిల్లాలో ఇసుక విషయమై మైనింగ్‌శాఖ జనవరిలో ప్రత్యేకంగా సర్వే చేపట్టింది. నారాయణరాజుపేట రీచ్‌లో 10 వేలు, కాశీపట్నం రీచ్‌లో 15వేలు, కైలాసపట్నం రీచ్‌లో 14వేల క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్టు నిర్ధారించింది. తాండవ రిజర్వాయర్‌లో పూడిక తీత ద్వారా వెలికి తీసే ఇసుక 62,470 క్యూబిక్‌మీటర్లు వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇలా మొత్తంమ్మీద జిల్లాలో ప్రస్తుత సీజన్లో రూ.లక్ష క్యూబిక్ మీటర్లు ఇసుక అందుబాటులోఉంది. గతంలో ఇలాగే నోటిఫై చేసిన 25 రీచ్‌ల్లో 3.5లక్షల క్యూ.మీ.ఇసుక ఉన్నట్టు లెక్క తేలిస్తే ఏకంగా ఐదున్నర లక్షల క్యూ.మీ.లకు పైగా ఇసుకను తవ్వేశారు. ఇంకా తవ్వుతూనే ఉన్నారు. తాజాగా లక్ష క్యూ.మీ. ఇసుక అందుబాటులో ఉందంటే ఇక ఏ స్థాయిలో తవ్వకాలు జరుపుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలా జిల్లాలో గోస్తని, వరహా, శారదా నదుల రూపురేఖలే మారిపోయాయి. ఇక వాగులు..వంకలైతే ఇసుకతవ్వకాల వల్ల దిశ మారిపోయి వంకరటింకరగా ప్రవిహ స్తున్నాయి. దళారీలను ఆశ్రయించాల్సిందే.. సాధారణంగా వ్యక్తిగత అవసరాల కోసం పేదలు, ప్రభుత్వాసవసరాలకు కాంట్రాక్టర్లు, అధికారులు నేరుగా ఇసుక తవ్వే అవకాశం ఉండదు. వీరంతా ఎప్పటిలాగే వ్యాపారులపైనే ఆధారపడాలి. ప్రస్తుతం క్యూబిక్ మీటర్ రూ.550 కాగా రవాణా, లోడింగ్ అన్లోడింగ్ కలిపి యూనిట్ (3 క్యూ.మీ.) ఇసుకను ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.1700లు చెల్లించాల్సి ఉంది. ఇసుక కొరతను ఆసరాగా చేసుకుని యూనిట్ ఇసుకను రూ.2,500నుంచిరూ.3వేల వరకువిక్రయిస్తున్నారు. కొత్త విధానంలో ఇసుక ఫ్రీగా ఇస్తున్నప్పటికీ లోడింగ్, అన్లోడింగ్, రవాణా చార్జీలను భరించాల్సిందే. ప్రస్తుతం జిల్లాలో నిర్మాణానికి అనువైన ఇసుక లేకపోవడంతో శ్రీకాకుళం, గోదావరి జిల్లాల నుంచి దిగుమతి అవుతున్న ఇసుకపైనే ఆధారపడుతున్నారు. ఒక వేళ నిజంగా రీచ్‌ల వద్ద ఎలాంటి రుసుం వసూలు చేయక పోయినప్పటికీ జిల్లాలోని ఇసుకనే ఇతర జిల్లాల నుంచి తీసుకొస్తున్నట్టుగా చెబుతూ లోడింగ్, అన్లోడింగ్, దూరాభారాన్ని బట్టి రవాణా చార్జీలు కలిపి భారీగానే వసూలు చేసే అవకాశాలున్నాయి. ఇసుక పంపిణీ బాధ్యత కూడా జన్మభూమి కమిటీలకు అప్పగించనుండ డంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. వీరిని అడ్డంపెట్టుకుని స్థానిక టీడీపీ ప్రజాప్రతి నిధులు అడ్డంగా దోచుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఒక వైపు ఇసుక మాఫియా.. మరో వైపు టీడీపీ నేతలు పేదల పేరిట అడ్డగోలుగా తవ్వకాలు సాగించి దర్జాగా సొమ్ముచేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాటి రూపురేఖలు మారిపోతాయి ఇప్పటికే చాలా వరకు వాగులు..వంకలు ఎండిపోతున్నాయి. మరోనెలరోజుల్లో జిల్లా లోని నదుల్లో కూడా నీటి ప్రవాహం పూర్తిగా అడుగంటి పోతుంది. దీంతో బయట కొచ్చే ఇసుకను ఇష్టమొచ్చినట్టుగా తవ్వే అవకాశం ఉంది. జిల్లాలో నదులన్నీ థర్డ్ ఆర్డర్ పరిధిలోనివే. వాటిలో ఇసుకతవ్వకాల కోసం స్థానిక పంచాయతీల నుంచి అనుమతులు తీసుకుంటే చాలు. పూడిక తీత ద్వారా వెలికి తీసే ఇసుక తవ్వకాలతో తాండవ రిజర్వాయర్‌కు ముప్పువాటిల్లే అవకాశాలు లేకపోలేదు. ఇక నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థలకు సీనరేజ్‌లో వాటాలు దక్కేవి. ప్రస్తుతం సీనరేజ్ వసూళ్లను పూర్తిగా నిలిపివేస్తే ఆ మేరకు వాటి ఆదాయానికి గండిపడే అవకాశం ఉంది. ఉచితంపై నిఘా ఉంటుంది ఇసుకను నిత్యావసరాల చట్టం పరిధిలోకి తీసుకొచ్చి పేదలు, ప్రభుత్వావసరాలకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు రాలేదు. ఎంత ఉచితంగా ఇచ్చినా..తవ్వకాలు..అమ్మకాలపై ఆయా శాఖల నిఘా ఉంటుంది. -సూర్యచంద్రరావు, ఏడీ, మైన్స్, -
మాఫియాకు మరింత రీచ్
ఇసుక రీచ్‌ల వేలానికి సర్కారు నిర్ణయం అధికార పార్టీ సిండి‘కేట్ల’గురి డ్వాక్రా సంఘాలకు అన్యాయం విశాఖపట్నం: డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌ల కేటాయింపు మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలింది. ప్రారంభంలో రీచ్‌లను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారంటూ డ్వాక్రా సంఘాలకు కితాబిచ్చిన సర్కారు.. ఆ తరువాత తమ నాయకుల అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు సంఘాలపై బురద జల్లింది. ‘సెర్ఫ్’ నుంచి రీచ్‌ల నిర్వహణ బాధ్యతను మైనింగ్ శాఖకు అప్పగించారు. ఏడాది తిరక్కుండానే రీచ్‌ల కేటాయింపును పాత పద్ధతిలో వేలం పాటల ద్వారా కేటాయించాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం మాఫియాకు మరింత ఊతమిస్తోంది. ఫిబ్రవరి కల్లా రీచ్‌ల కేటాయింపు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సిండి‘కేట్లు’ రంగంలోకి దిగుతున్నారు.జిల్లాలో 2014 డిసెంబర్లో డీ నోటిఫై చేసిన 25 రీచ్‌లను దశల వారీగా డ్వాక్రా సంఘాలకు కేటాయించారు. తొలుత ఆదాయంలో 25 శాతం డ్వాక్రా సంఘాలకు ఇస్తామని నమ్మబలికి చివరకు క్యూబిక్ మీటర్‌కు రూ.25ల చొప్పున వేతనం ముట్టజెప్పారు. ఆ మొత్తం కూడా ఇంకా పూర్తి స్థాయిలో వారికి జమకాలేదు. పరాకాష్టకు చేరిన అవినీతి డ్వాక్రా సంఘాల మాటున 25 రీచ్‌ల్లో మూడు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికి తీయగా, అనధికారికంగా అధికార పార్టీ నేతలు మరో మూడులక్షల క్యూ.మీ. వరకు పిండేశారు. శారద, వరహా, తాండవ తదితర నదీ పరీవాహక ప్రాంతాలకు తూట్లు పొడిచారు. ఏటిగట్లను ధ్వంసం చేశారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా తవ్వకాలు సాగించి అందినకాడికి దోచుకుతిన్నారు.కావాలనే ఇసుకకు కృత్రిమ కొరత సృష్టిస్తూ మూడు యూనిట్ల లారీ ఏకంగా పాతిక వేలు పలికేలా చేశారు. దీంతో సామాన్యులకు ఇసుక గగన కుసుమంగా మారేలా చేశారు. లక్షలాది మంది నిర్మాణ రంగ కూలీలకు పనుల్లేకుండా అల్లాడిపోయారు. పొరుగు జిల్లాల నుంచి రప్పించిన ఇసుకను కూడా తమ గుప్పెట్లో పెట్టుకుని దండిగా సొమ్ము చేసుకున్నారు. ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.25కోట్ల ఆదాయం వస్తే పచ్చనేతల జేబుల్లోకి మరో పాతిక కోట్ల వరకు చేరినట్టు విజిలెన్స్ వర్గాల అంచనా. చేజిక్కించుకునేందుకు వ్యూహం ఏడాదిగా సెర్ఫ్ అధీనంలో ఉన్న ఇసుక రీచ్‌లను ఈ నెల 2న మైనింగ్ శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాలు విడుదల కాలేదనే సాకుతో ఇప్పటి వరకు మైనింగ్ శాఖ రీచ్‌లను స్వాధీనం చేసుకోలేదు. తాజాగా రెండు రోజుల కిందట రాష్ర్ట కేబినెట్ రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇసుక రీచ్‌లను వేలం పాటల ద్వారా కేటాయించాలని తీసుకున్న నిర్ణయంతో ఇసుక మాఫియాకు రెడ్‌కార్పెట్ పరిచినట్టయింది. గతంలో మాదిరిగానే సిండికేట్లుగా ఏర్పడి రీచ్‌లను తమపరం చేసుకునేందుకు ఇసుకాసురులు అప్పుడే వ్యూహం రచిస్తున్నారు. గతంలో ఇసుక వ్యాపారులు మాత్రమే వేలం పాటల్లో పాల్గొనే వారు. అయితే త్వరలో జరుగనున్న రీచ్‌ల వేలం పాటల్లో మెజార్టీ రీచ్‌లను చేజిక్కించుకోవాలని అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. విధివిధానాలు విడుదలైన తర్వాత వేలం పాటల నిర్వహణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వారం పదిరోజుల్లో ఇసుక రీచ్‌ల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. -
యరపతినేనికి చెక్!
సాక్షి ప్రతినిధి, గుంటూరు : గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నిర్వహిస్తున్న సున్నపురాయి అక్రమ దందాపై ప్రభుత్వశాఖల ముట్టడి ప్రారంభమైంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఈ దందాపై ప్రత్యేక నివేదికను రూపొందించనున్నాయి. లోకాయుక్త నియమించనున్న కమిటీ దీనిపై పూర్తి వివరాలు సేకరించనుంది. ఒకేసారి యరపతినేని చుట్టూ ముడి బిగిస్తుండటంతో ఇప్పటివరకు సహకరించిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు, సిబ్బంది పక్కకు తప్పుకొన్నాయి. దీంతో 20 రోజుల నుంచి అక్రమ మైనింగ్ నిలిచింది. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్, మైనింగ్ విభాగాలకు చెందిన అధికారులు గత శుక్రవారం పిడుగురాళ్ల, దాచేపల్లిలోని క్వారీలను పరిశీలించి వివరాలు సేకరించారు. యరపతినేని అక్రమ సున్నపురాయి తవ్వకం, తరలింపుపై వైఎస్సార్ సీపీ బీసీసెల్ నేత గురువాచారి హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతకుముందే ఆ నియోజకవర్గ ఇన్చార్జి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, యరపతినేని అక్రమ మైనింగ్‌పై ఆందోళన నిర్వహించారు. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు సాక్ష్యాధారాలతో వినతిపత్రాలు అందచేశారు. స్పందించకపోవడంతో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతోపాటు అక్రమ మైనింగ్, సున్నపురాయి కంపెనీల విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లుల కాపీలను ఇచ్చారు. ఆ ప్రాంతంలో అధికారిక మైనింగ్ లేకపోయినా క్వారీల్లో 30 నుంచి 40 అడుగుల లోతులో సున్నపురాయి తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫొటో, వీడియో క్లిప్పింగ్‌లను లోకాయుక్తకు అం దచేశారు. ఫిర్యాదుకు లోకాయుక్త స్పందించి ఒక కమిటీని ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలోని సభ్యులు త్వరలో ఇక్కడి అక్రమ క్వారీయింగ్‌ను పరిశీలించి లోకాయుక్తకు నివేదిక ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త అక్టోబరు 5 వ తేదీలోపు అక్రమ క్వారీయింగ్‌పై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ సంచాలకులను ఆదేశించింది. రహస్య నివేదిక .. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివిధ ప్రభుత్వశాఖలతోపాటు టీడీపీలోని కొందరు ముఖ్యులు ఇచ్చిన రహస్య నివేదికలో రెండు ప్రధాన సూచనలు చేసినట్టు తెలుస్తోంది. గురజాల నియోజకవర్గంలో సున్నపురాయి తీయడానికి అవకాశం ఉన్న భూములను గుర్తించి, వాటిని పారదర్శకంగా లీజుకు ఇవ్వాలని సూచించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు పెద్దసంఖ్యలో ముందుకు వచ్చే అవకాశం ఉందని, వారంతా యరపతినేని దందాను నిలువరించే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా మద్యం వ్యాపారుల్లో కొంతమంది యరపతినేనికి వాటాలు ఇవ్వడానికి విముఖత వ్యక్తం చేశారని, అదేవిధంగా లీజుకు ముందుకు వచ్చే వ్యాపారులు కూడా యరపతినేని ప్రతిపాదనలు వ్యతిరేకించే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. కుదరని పక్షంలో గురజాల నియోజకవర్గంలో మిగిలిన సున్నపురాయి క్వారీలను రాష్ర్ట ఖనిజాభివృద్ధి సంస్థకు స్వాధీనం చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఇలా యరపతినేని ఆగడాలను నిలువరించే అవకాశం ఉంటుందని, లేకుంటే ఇక్కడ విధులు నిర్వహించడం కష్టంగా ఉందని పలు ప్రభుత్వశాఖలు నివేదికలిచ్చినట్టు తెలుస్తోంది. చర్యలకు డిమాండ్.. అక్రమ మైనింగ్ దందాకు పాల్పడిన ఎమ్మెల్యే యరపతినేనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
లేటరైట్ దోచేస్తుంటే మీరేం చేస్తున్నారు?
కాకినాడ క్రైం/ప్రత్తిపాడు : ‘ఓ కంపెనీ లక్షల టన్నుల లేటరైట్ దోచుకుపోతుంటే మీరేం చేస్తున్నారు? ఇలాగైతే ఎలా? అక్రమ మైనింగ్‌ను అడ్డుకోలేరా? సామాన్యులు ట్రాక్టర్ ఇసుక తీసుకెళ్తుంటే సవాలక్ష నిబంధనలు విధించి అడ్డుకుంటారే! మరి దేశ సంపదను దోచుకుపోతుంటే అనుమతులు ఎలా ఇచ్చారు? గనులవద్ద చెక్‌పోస్టు, వేయింగ్ మిషన్ ఎక్కడ ఉన్నాయి?’ అంటూ రాష్ట్ర శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ భూమా నాగిరెడ్డి రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖల అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రత్తిపాడు మండలం వంతాడ, చింతలూరు గ్రామాల్లో మహేశ్వరి మినరల్స్ చేపట్టిన మైనింగ్ కార్యకలాపాల్లో అనేక అక్రమాలు బయటపడ్డాయి. పలుమార్లు తనిఖీలు, సర్వేలు జరిగాయి. ఈ నేపథ్యంలో చైర్మన్ భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు (రామచంద్రపురం), బొండా ఉమా మహేశ్వరరావు (విజయవాడ సెంట్రల్), ఎ.సురేష్ కుమార్ (సంతనూతలపాడు) ఆయా మైనింగ్ ప్రదేశాల్లో మంగళవారం విచారణ చేపట్టారు. ఆయా ప్రాంతాలను స్వయంగా పరిశీలించి, స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మాస్టర్ ప్లాన్, మైనింగ్ ప్లాన్, ట్రాన్స్‌పోర్టు ప్లాన్ కూడా లేకపోవడాన్ని భూమా గుర్తించారు. డంపింగ్ యార్డును కూడా ప్లాన్‌లో చూపించాలని చెప్పారు. ఎటువంటి ప్లాన్లూ లేకుండా కనీసం లీజుకిచ్చిన మైనింగ్ ప్రాంతం బౌండరీలను కూడా గుర్తించకుండా అనుమతులు ఎలా ఇచ్చారని మైన్స ఏడీ సీహెచ్ సూర్యచంద్రరావును నిలదీశారు. ‘సంవత్సరానికి ఎన్ని టన్నుల మెటీరియల్ ఎగుమతి అవుతుంది? ఎంత ట్యాక్స్ కడుతున్నారు’ అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనం వృథా కావడానికి ప్రభుత్వాధికారులే తలుపులు బార్లా తెరిచారనడానికి ఇది నిదర్శనమన్నారు. లీజుదారు ఇచ్చిన సమాచారాన్నే మైనింగ్ అధికారులు తమకు ఇస్తున్నారని, వారివద్ద సమాచారం లేకపోవడం ప్రతిచోటా జరుగుతోందని అన్నారు. చింతలూరులో మూడుసార్లు సర్వే చేసిన అధికారులు 500 ఎకరాలు మాత్రమే చూపించారని, తాజాగా జాయింట్ కలెక్టర్ నిర్వహించిన సర్వేలో 739 ఎకరాల్లో గనులు తవ్వుతున్నట్లు వెల్లడైందని భూమా అన్నారు. అధికారులంతా కంపెనీకి అమ్ముడు పోయారని విమర్శించారు. రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖల జాయింట్ ఇన్స్పెక్షన్ జరగకుండానే గనులు లీజుకివ్వడాన్ని తప్పుబట్టారు. ‘గనుల తవ్వకం ప్రారంభమయ్యాక ఒక్కో పత్రం, అనుమతి పత్రం తయారు చేయడం మొదలుపెట్టారా?’ అని ప్రశ్నించారు. వంతాడలో అటవీ అనుమతులు లేకుండా రహదారి ఏర్పాటు చేసినట్టు వచ్చిన ఫిర్యాదుపై సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండుకట్టెలు పట్టుకువెళ్లేవారిపై కేసులు పెట్టి వేధించడం మాత్రం తెలుసంటూ ఎద్దేవా చేశారు. అవకతవకల నేపథ్యంలో వంతాడ క్వారినీ గతంలో టీడీపీ, కాంగ్రెస్, ప్రజారాజ్యం, సీపీఐ, సీపీఎం తదితర పార్టీల నేతలు సందర్శించారని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తెలిపారు. మైనింగ్‌వల్ల రహదారులు ధ్వంసమవుతున్నాయని, ధ్వని, వాతావరణ కాలుష్యం ఏర్పడుతోందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిలిదేవి సత్తిరాజు, గున్నాబత్తుల రాజబాబు కమిటీకి ఫిర్యాదు చేశారు. వంతాడలో 11 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరిగిందని లింగపల్లి సత్యనారాయణ తదితరులు కమిటీకి వివరించారు. చింతలూరు క్వారీలో ముగ్గురు 200 ఎకరాల లీజులు పొందారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కర్రి మురళి, మైలపల్లి సత్యనారాయణ చెప్పారు. లీజులో లేని 30 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. ఒక్కో ఎమ్మార్వో ఒక్కో రకంగా ఇచ్చిన ఎన్ఓసీలను కూడా కమిటీ తప్పు పట్టింది. వీటన్నిటిపై సమగ్ర సమాచారంతో కాకినాడలో బుధవారం కమిటీ ముందు హాజరు కావాలని మైన్స్, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులను భూమా ఆదేశించారు. అక్రమ తవ్వకాలవల్ల దుర్వినియోగమైన ప్రజాధనం రికవరీపై ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు, తుని ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, డీఎఫ్ఓ టీవీ సుబ్బారెడ్డి, సబ్ డివిజన్ ఫారెస్టు ఆఫీసర్ వీవీ సుభద్రాదేవి, మైన్స్ జేడీ కేవీఎల్ నరసింహరెడ్డి, డీడీ పి.కోటేశ్వరరాజు, మైన్స్ విజిలెన్స ఎ.డి. కె.సుబ్బారావు, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, తహశీల్దార్ గిడుతూరి సత్య వరప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొల్లపల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కుల భరతం పడతాం
ఎంట్రీ ట్యాక్స్ ఎగ్గొట్టి తిరుగుతున్న తెలంగాణ వాహనాలపై చర్యలు : ఎస్పీ చింతలపూడి : ప్రవేశ పన్ను కట్టకుండా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తున్న అక్రమ వాహనాలపై కొరడా ఝుళిపించడానికి జిల్లా ఎస్పీ భరత్ భూషణ్ సిద్ధమయ్యారు. ‘ఎంట్రీ ట్యాక్స్ ఎగ్గొట్టి ఏపీలోకి’ శీర్షికన శనివారం ‘సాక్షి’ దినపత్రిలో వచ్చిన కథనానికి ఎస్పీ తీవ్రంగా స్పందించారు. ఏపీలోకి వచ్చే గ్రానైట్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు. ట్యాక్స్ కట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఉపేక్షించేది లేదన్నారు. ఏపీ చెక్ పోస్ట్‌లో ట్యాక్స్ కట్టకుండా దొడ్డి దారిన రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలపై ఇక నుంచి నిఘా పెడతామన్నారు. ఏఏ రూట్లలో ఈ వాహనాలు దారి మళ్లిస్తున్నారో విచారణ జరుపుతామన్నారు. అవసరం అయినచోట కొత్త చెక్ పోస్టులు ఏర్పాటు చేసేలా సంబంధిత రవాణా శాఖ, మైనింగ్ శాఖ అధికారులతో సంప్రదిస్తానని చెప్పారు. తెలంగాణ నుంచి వస్తున్న భారీ గ్రానైట్ వాహనాల నుంచి ఎంట్రీ ట్యాక్స్ కట్టించాల్సిన బాధ్యత రవాణా శాఖదేనన్నారు. పోలీస్ అధికారులతో పాటు మిగిలిన డిపార్ట్మెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ నుంచి వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయడంలో తీసుకోవలసిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎంట్రీ ట్యాక్స్ కట్టించడానికి అవసరమైతే రవాణా శాఖ అధికారులకు పోలీసులు కూడా సహకరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. -
పనితీరే కొలమానం
మాఫియా ఆగడాలను అరికట్టండి బదిలీల్లో మంత్రుల జోక్యం ఉండదు సమావేశంలో మంత్రి దేవినేని మైనింగ్ శాఖ అధికారుల పనితీరుపై అసహనం విజయవాడ : ఉద్యోగులంతా రాజీపడకుండా పారదర్శకంగా పనిచేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హితవు పలికారు. ఉద్యోగుల బదిలీలకు పనితీరే కొలమానమని, ఉద్యోగుల బదిలీ వ్యవహరంలో మంత్రుల జోక్యం ఉండదని సృష్టం చేశారు. బుధవారం స్థానిక నీటి పారుదల శాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు, చేపట్టనున్న కార్యక్రమాలపై మంత్రులు సమావేశంలో చర్చించారు. శాఖల వారీగా అధికారులు ఆయా శాఖల గురించి సమావేశంలో వివరించగా మంత్రి దేవినేని పలు శాఖల అధికారుల తీరుపై ఆగ్రహం, అసహనం వక్తం చేశారు. మంత్రి దేవినేని మాట్లాడుతూ ఉద్యోగులు అవినీతికి దూరంగా పూర్తి పారదర్శకతతో పనిచేయాలని హితవు పలికారు. రాష్ట్ర రాజధాని ఇక్కడే నిర్మితం కానున్న నేపథ్యంలో వివిధ శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులు, ఇతర కార్యక్రమాల వివరాలపై అధికారులు పూర్తిస్థాయిలో నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పథకాలపై, ఇతర అభివృద్ధి పనులపై తప్పనిసరిగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లు అధికారులంతా అవినీతికి దూరంగా పనిచేయాలని ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో అందిన 5.40 లక్షల దరఖాస్తులు పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దీనికోసం అధికారులంతా పూర్తిస్థాయిలో తమకు సహకరించాలని కోరారు. విద్యుత్ శాఖపై మాట్లాడుతూ సబ్-స్టేషన్ల నిర్మాణం, వీటీ పీఎస్ కొత్త విద్యుత్ లైన్‌కు అవసరమైన భూసేకరణ, ఇతర కార్యక్రమాలను రెవెన్యూ అధికారుల సమన్వయంతో పూర్తిచేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌పై మాట్లాడుతూ 970 పంచాయతీలకుగానూ 400 మంది అధికారులు మాత్రమే ఉన్నారని, జిల్లా కలెక్టర్‌తో సంప్రదించి పారదర్శకంగా వీఆర్వోల బదిలీలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జిల్లావైద్య ఆరోగ్య శాఖపై మాట్లాడుతూ జిల్లాలో 178 మెడికల్ ఆఫీసర్ పోస్ట్‌లకు గానూ 44 మంది మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు. ఖాళీలున్న 534 ఏఎన్ఎం పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై మాట్లాడుతూ గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో 9 స్థానం వచ్చిందని, వచ్చే సంవత్సరం మెదటి మూడు స్థానాల్లో ఉండడానికి విశేషంగా కృషిచేయాలని సూచించారు జిల్లా పౌరసరఫరాలశాఖ,మార్కెటింగ్శాఖపై మాట్లాడారు. రైతులకు సుబాబుల బకాయిలు ఎగ్గొట్టిన వారిపై పోలీసుల సహకారంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మైనింగ్ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ, వీజీటీఎం ఉడా, ఇతర విభాగాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్దె అనూరాధ, విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడారు. కలెక్టర్ రఘు నందన్‌రావు మాట్లాడుతూ ఈపాస్ విధానంతో ఆధార్‌ను అనుసంధానం చేసి ప్రభుత్వ పథ కాలను ప్రజలకందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జేసీ మురళీ, విజయవాడ సీపీ ఏబీ వెంకటేశ్వరరావు , ఉడా వైస్ చైర్మన్ పి.ఉషాకుమారి, ఎస్పీ విజయ్‌కుమార్, సబ్‌కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లాముఖ్య ప్రణాళికాధికారి శర్మ, ఇరిగేషన చీఫ్ ఇంజినీర్ సుధాకర్, డ్వామా పీడీ మధులత, డీఎంహెచ్‌వో నాగ మల్లేశ్వరి, డీపీవో నాగరాజు వర్మ, వివిధ విభాగాల ముఖ్య అధికారులు పాల్గొన్నారు. -
ఇసుక రీచ్‌ల్లో కాంట్రాక్టర్ హల్చల్
* పెత్తనమంతా ఆయనదే..! * పేరుకే డ్వాక్రా మహిళల నిర్వహణ * నిబంధనలకు విరుద్ధంగా అయినవిల్లి మండల రీచ్‌లు * నోరు మెదపని అధికారులు * ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన గ్రామీణులు అమలాపురం టౌన్/అయినవిల్లి : ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అప్పగించిన ఇసుకరీచ్‌ల్లో వాస్తవానికి రాజకీయ అండ ఉన్న పెత్తందారులు, పెట్టుబడిదారుల హవా నడుస్తోంది. వారి కనుసన్నల్లోనే వాటి నిర్వహణ నడుస్తోంది. ఫలితంగా మహిళలు ఏమీ చేయలేని అసహాయులుగా మిగిలిపోతున్నారు. దీనికి అయినవిల్లి మండలంలోని అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం రీచ్‌లే సజీవ సాక్ష్యాలు. ఈ రీచ్‌లను కాకినాడకు చెందిన లారీల సప్లయి కాంట్రాక్టర్, ఇసుక వ్యాపారి హస్తగతం చేసుకుని హల్చల్ చేస్తున్నారు. రీచ్ నిర్వహణ బాధ్యతలను అధికారికంగా తీసుకున్న డ్వాక్రా మహిళలు రీచ్ వద్ద నామ్‌కే వాస్తుగా మిగిలిపోయారు. సదురు కాంట్రాక్టర్‌కు అయినవిల్లి మండలానికి చెందిన ఓ మండల స్థాయి ప్రజాపతినిధి, కొందరు టీడీపీ నాయకులు అండగా నిలిచారు. అలాగే మండలానికి చెందిన కొందరు అధికారులు, డీఆర్డీఏ అధికారి ఒకరు కూడా ఆ కాంట్రాక్టర్ అడుగులకు మడుగులొత్తుతున్నారు. దీంతో ఇసుక తవ్వకాలు, రవాణాలో కాంట్రాక్టర్ చెలరేగిపోతున్నారు. ఇసుక ట్రాక్టర్లకు డీడీలు ఇచ్చే విషయంలోనూ అవకతవకలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికే కాదు, డ్వాక్రా మహిళల ఉపాధికీ గండికొడుతున్నారు. దీంతో అయినవిల్లిలంకకు చెందిన కొందరు ప్రజలు డ్వాక్రా మహిళలను డమ్మీ చేసి వారి ముసుగులో ఇసుక రవాణాలో అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. డీడీ రూపంలో చేస్తున్న మోసాలను ఉటంకిస్తూ ఆ గ్రామస్తులు కొందరు గురువారం రాత్రి అమలాపురం ఆర్డీవో జి.గణేష్‌కుమార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు కూడా. ప్రభుత్వ సిబ్బంది, కాంట్రాక్టరు కుమ్మక్కై ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఇదే మండలంలోని కొండుకుదురు ఇసుక రీచ్‌లో గురువారం రాత్రి సమయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వటంతోపాటు అక్రమంగా తరలిస్తున్న పరిణామాలపై కూడా ఆ గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొండుకుదురు రీచ్‌లోనూ ఆ కాంట్రాక్టర్ పెత్తనం సాగుతోందని విమర్శించారు. అవకతవకలు ఇలా... ఇసుక రీచ్‌ల్లో ఇసుక పొందాలంటే తొలుత యూనిట్ రూ. రెండు వేలు వంతున డీడీ తీసి ఇవ్వాలి. అలాగే మైనింగ్ శాఖకు సంబంధించి బిల్లు కూడా ఉండాలి. అయినవిల్లిలంక, వీరవల్లిపల్లి, కొండుకొదురు రీచ్‌ల్లో సదరు కాంట్రాక్టర్ రాజకీయ అండతో మైనింగ్ బిల్లుపై తేదీలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. ఆ ఇసుకుకు సంబంధించిన డీడీలు ఉండటం లేదు. దీంతో అయినవిల్లిలంక గ్రామస్తులు ర్యాంపు నుంచి ఇసుకతో వెళుతున్న వాహనాన్ని గురువారం అడ్డుకుని డీడీ ఏదని ప్రశ్నించారు. సిబ్బందిని నిలదీశారు. అలాగే మైనింగ్ బిల్లుపై తేదీ లేకపోవడాన్ని కూడా గమనించారు. ఈ ఆధారాలతోనే ఆ గ్రామస్తులు ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఎప్పుడైతే గ్రామస్తులు ఇసుక వాహనాలను అడ్డుకుని అవతవకలను గుర్తించారో, ఆ విషయం క్షణాల మీద ఆ కాంట్రాక్టర్‌కు తెలిసిపోయింది. దీంతో కేవలం ఆరగంట సమయంలో ఆ వాహనాల్లోని ఇసుకకు డీడీలను అధికారులకు చూపించారు. అయినప్పటికీ ఆ కాంట్రాక్టర్ ఇసుక అక్రమాలకు శుక్రవారం కూడా కొనసాగించారు. అధికారులు ఆకస్మిక తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం శుక్రవారం సాయంత్రం గుప్పుమనటంతో అప్పటికే అయినవిల్లిలంక రీచ్‌లో లోడ్ అయిన లారీల్లోంచి ఇసుకను ఆదరాబాదరాగా దించేశారు. ఈ లారీలన్నీ మైనింగ్ బిల్లులు సక్రమంగా లేకపోవటంవల్లే అక్రమార్కులు లారీల్లోంచి ఆకస్మికంగా అన్లోడ్ చేసేసి అధికారులకు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. గత కొన్ని రోజులుగా ఈ అవతవకలు జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో అడ్డుకునే నాథుడే కరవయ్యాడు. అక్కడ డీఆర్డీఏ అధికారుల నిఘా కాదు కదా! కనీస పర్యవేక్షణ కూడా లేదు. గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు కాబట్టి ఆ అక్రమాలు వెలుగు చూశాయి. గత కొన్ని రోజులుగా ఇలా ఎన్ని యూనిట్ల ఇసుక డీడీలు లేకుండా పక్కదారి పట్టాయో అంచనా వేయవచ్చు. ఒక డీడీ చూపించి అదే డీడీ పేరుతో పలు వాహనాలను ఇసుకతో పక్కదారి పట్టిస్తున్నారని అయినవిల్లిలంక గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఆర్డీవో గణేష్‌కుమార్ అయినవిల్లి మండలంలోని ఇసుక రీచ్‌లపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలు నేపథ్యంలో తానే స్వయంగా తనిఖీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
మాఫియా వెనకడుగు
సీతానగరం (రాజానగరం) : ప్రజల్లో సహనం నశించి తిరుగుబాటు చేస్తే వారి ముందు ఎటువంటి శక్తులైనా తలవాల్చవలసిందేననే విషయాన్ని సీతానగరం మండలంలోని ఏటిపట్టు పరీవాహక ప్రాంతాల ప్రజలు నిరూపించారు. నాలుగు మాసాలుగా చెలరేగిపోయిన ఇసుక మాఫియా శుక్రవారం తోకముడిచింది. రాజమండ్రి - సీతానగరం ప్రధాన రహదారి, ఏటిగట్టు రోడ్లమీద నిత్యం రయ్ మంటూ దూసుకుపోయే వందలాది ఇసుక లారీల జాడే లేకుండా పోయింది. గోవరిలోని ఇసుక అక్రమ రవాణా పై ‘సాక్షి’లో వస్తున్న కథనాలకు తోడు ప్రజలు కూడా తిరుగుబాటు చేయడంతో ఇసుక తవ్వకాలను నిలిపివేయక తప్పలేదు. ఆలస్యంగానైనా ప్రజాగ్రహాన్ని గుర్తించిన మైనింగ్ శాఖ, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు సీతానగరం మండలం సింగవరంలోని ఇసుక ర్యాంప్‌కి శుక్రవారం చేరుకుని తనిఖీలు చేయడంతో ఇసుక మాఫియా తోక ముడవక తప్పలేదు. దీంతో సింగవరం వద్ద గురువారం 18 గంటల పాటు నిర్విరామంగా ఆందోళన చేసిన ఐదు గ్రామాల ప్రజలు కొంత ఊరట చెందారు. అనుమతుల కంటే నాలుగు రెట్ల ఇసుకను తోడేశారు సింగవరంలో ఒక రైతుకు చెందిన ఏడెకరాల లంక భూమిలో ఉన్న ఇసుక మేటలను తొలగించుకునేందుకు మైనింగ్ శాఖ గత జూన్ నెలలో అనుమతి ఇచ్చింది. అయితే అధికార పార్టీలోని కొంతమంది పెద్దల అండదండలు ఉన్న ఇసుక మాఫియా ఆ ఏడెకరాల్లోనే కాకుండా గోదావరిలోని ఇసుకను కూడా తోడేస్తూ, ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన కోట్లాది రూపాయలను మింగేసింది. దీనిపై ‘సాక్షి’లో వార్తా కథనాలుగా రావడంతో కదలివచ్చిన యంత్రాంగం చేసిన సర్వేలు, వేసిన కొలతలు కూడా నిజమని తేల్చాయి. ఆ ఏడెకరాల్లో సుమారు 84 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఇసుకను తవ్వేందుకు అనుమతి ఉండగా నాలుగు రె ట్లు అధికంగా ఇసుకను తోడేసినట్టు అధికార్లు గ్రహించారు. వివరాలను చెప్పేందుకు నిరాకరించిన మైనింగ్, ఇతర శాఖల అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. పది రోజుల్లో పెద్ద రీచ్‌లపై నిర్ణయం సాక్షి, రాజమండ్రి: జిల్లాలో పర్యావరణ అనుమతులు లభించకపోవడంతో 27 పెద్ద రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిచి పోయాయని, వీటిపై పది రోజుల్లో ప్రభుత్వం స్పష్టత రావచ్చని కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై రాజమండ్రిలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేసేందుకు శుక్రవారం వచ్చిన ఆమె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పది రోజుల్లో జిల్లాలోని 27 రీచ్‌ల్లో కూడా ఇసుక తవ్వకాలు ప్రారంభం కాగలవని ఆశిస్తున్నానన్నారు. పర్యావరణ అనుమతులు అవసరం లేని సుద్ద్దగెడ్డ, పంపా, ఏలేరు, తాండవ ఏరుల పరిధిలో శుక్రవారం నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభం అయ్యాయన్నారు. -
కథలు చెప్పొద్దు!
సాక్షి, అనంతపురం : ‘నాకు కాకమ్మ కథలు చెప్పకండి.. మీ సంగతి నాకు మొత్తం తెలుసు.. అసలు మీ వల్లే శాఖకు చెడ్డపేరు వస్తోంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ గురించి బయట ఎవర్ని కదిపినా ఒకటే మాట..అవినీతి.. అవినీతి.. ఎందుకిలా? అంతా మీ వల్లే.. నిబంధనలను తుంగలో తొక్కి మీ ఇష్టానుసారం టెండర్లు పిలవడం, నాసిరకం సరుకులు కొనడం.. రివ్యూ మీటింగ్‌లలో మేము ప్రశ్నిస్తే మా కళ్లకు గంతలు కట్టాలని చూస్తారు.. మరోసారి నేను జిల్లాకు వచ్చినప్పుడు అవినీతి అనే మాట వినిపించిందా.. చెప్పను చేసి చూపిస్తా’ అంటూ స్త్రీ శిశు సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, భూగర్భ గనుల శాఖ మంత్రి పీతల సుజాత అధికారులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంగళవారం జిల్లాలోని రామగిరి గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన తర్వాత అనంతపురం చేరుకున్న ఆమె డ్వామా హాలులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మైనింగ్ శాఖ అధికారులతో వేర్వేరుగా సమీక్షించారు. తొలుత స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి.. జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా సీడీపీఓల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..‘మిమ్మల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు నాయుడు మీ ఉద్యోగ విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచారు. అయితే మీరు మాత్రం అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఏ జిల్లాకు వెళ్లినా మేడమ్.. సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి.. గుడ్లు మురిగిపోతున్నాయి.. సైజు చిన్నగా ఉంటున్నాయి అన్న ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. కనీసం మీ జిల్లాలోనైనా ఆ ఫిర్యాదులు రాాకుంటే బాగుంటుందని అని అనుకుంటే ఇక్కడా అవే ఫిర్యాదులు. సీడీపీవోలు క్షేత్ర స్థాయికి వెళ్లకుండా కార్యాలయాల్లోనే కూర్చుంటున్నారు. అది ఇక కుదరదు. ప్రతి ఒక్క సీడీపీఓ కచ్చితంగా క్షేత్ర స్థాయికి వెళ్లి కేంద్రాలను పరిశీలించాలి. మీరు వెళ్తే కదా.. కేంద్రాలకు కార్యకర్తలు వస్తున్నారా? లేదా? అని తెలిసేది. మీరు వెళ్లరు.. వారు కేంద్రాలకు రారు.. పని భారమంతా ఆయాలపై వదిలేసి ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ కూర్చుండిపోతున్నారు. గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ.. వారిని కేంద్రాలలో లబ్ధిదారులుగా చేర్పించాలి. వారితో పాటు చిన్నారులకు పౌష్టికాహారం సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను కార్పొరేట్ స్థాయి కాన్వెంట్లుగా తీర్చిదిద్దాలని చూస్తుంటే మీరేమో.. వాటిని పట్టించుకోకుండా మీ ఇష్టానుసారంగా చేస్తున్నారు. అసలు కేంద్రాలను ఏబీసీడీ గ్రేడ్లుగా విభజించాలని ఎవరు చెప్పారు? అన్ని కేంద్రాలను ఒకే దృష్టితో చూడండి.. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ఇచ్చే పౌష్టికాహారం నాణ్యతగా ఉండేలా చూడండి’ అంటూ మంత్రి ఆదేశించారు. ‘జిల్లాలో ఇద్దరు మంత్రులున్నారు.. అయినా మీకు బొత్తిగా భయం అనేది లేకుండా పోయింది. మీరు కూడా ఐసీడీఎస్ పనితీరుపై సిబ్బందితో సమీక్షలు జరుపుతూ ఉండండి’ అంటూ అక్కడే ఉన్న కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్‌ను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని 10 ప్రాజెక్టుల పరిధిలో అమలవుతున్న అమృతహస్తం పథకం ద్వారా గర్బిణీలు, బాలింతలకు సకాలంలో సరుకులు అందజేయాలని, సరుకుల్లో నాణ్యత లోపించినట్లు తెలిస్తే.. ఇక అంతే అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. సరుకుల్లో నాణ్యత లోపించినా, గుడ్ల సైజు తగ్గినా వెంటనే కాంట్రాక్టర్‌ను ప్రశ్నించాలన్నారు. నెలకు 2 కోట్ల కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నారే.. వాటిలో ఎన్ని బాగున్నాయో ఏనాడైనా ఆలోచించారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. జిల్లాలో అంగన్వాడీ భవనాలకు సంబంధించి నిధులు మంజూరు చేయించిన వెంటనే కలెక్టర్‌తో సంప్రదించి, అవసరమై స్థలసేకరణ చేసి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘మీరు బాగా పనిచేయండి.. మీకు ఏం కావాలో మాకు చెప్పండి.. ఏం చేస్తే శాఖపై ఉన్న అవినీతి మరక పోతుందో చెప్పండి.. మేం స్వీకరిస్తాము. నాకు కావాల్సింది ఒక్కటే.. ఇకపై స్త్రీశిశుసంక్షేమ శాఖలో అవినీతి అనే మాటకు తావుండకూడదు. మీరు బాగా పనిచేయండి..నాకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి’ అని మంత్రి సూచించారు. ఈ సందర్బంగా ఐసీడీఎస్ పీడీ జుబేదా బేగం శాఖలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లోనే కేంద్రాలు నిర్వహిస్తున్నామన్నారు. 118 మంది హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. -
‘ఓఎంసీ’లో నిందితులుగా సబిత, కృపానందం
నేడు సీబీఐ ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో గనుల శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ మాజీ కార్యదర్శి కృపానందంలను నిందితులుగా సీబీఐ చేర్చనుంది. వీరిద్దర్నీ నిందితులుగా చేర్చనున్నట్లు సీబీఐ సోమవారం కోర్టుకు మెమో రూపంలో సమాచారం ఇచ్చింది. ఈ మేరకు బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ఇప్పటికే కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ రాజగోపాల్ సహా పలువురు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే దర్యాప్తు పూర్తయినట్లు పేర్కొంటూ సీబీఐ సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో సబిత, కృపానందం పేర్లను పేర్కొన్నట్లు తెలిసింది. -
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత
ఏటీ అగ్రహారం, న్యూస్‌లైన్ అరే గోవిందు...పోయిన ఆదివారం మనం ఇక్కడికి వచ్చినపుడు గ్రావెల్ క్వారీలేదే! ఇప్పుడేంటి ఇంత పెద్ద లోయ కనిపిస్తోంది! చూడు రాము అక్రమ క్వారీయింగ్ చేసేవారికి ఒక్క రాత్రి చాలు అది ప్రభుత్వ భూమైనా, ఫారెస్ట్ భూమైనా రాత్రికి రాత్రి నాలుగైదు పొక్లెయిన్లు పెట్టి లోతుగా తవ్వేసి ట్రాక్టర్లు, లారీల ద్వారా తరలించేయడానికి... ఇది ఈ ఇద్దరి సంభాషణే కాదు.. పేరేచర్ల, పలకలూరు, అమీనాబాద్, కొండవీడు, బోయపాలెం తదితర ప్రాంతాల్లో నిత్యం ఏదో ఓ చోట ఇలాంటి సంభాషణలే వినిపిస్తున్నాయి. జిల్లాలో మైనింగ్, ఫారెస్ట్ అధికారుల సమన్వయ లోపం గ్రావెల్ మాఫియాకు వరంగా మారింది. రాత్రికి రాత్రి ట్రాక్టర్లు, లారీలు పెట్టి ప్రభుత్వ భూమి, అటవీ భూమి అనే తేడాలేకుండా తవ్వేస్తున్నారు. చిన్న గాటుతో ప్రారంభించి నీటి ఊటలు వచ్చేవరకూ వందల అడుగుల మేర తవ్వేస్తున్నారు. రాత్రికి రాత్రే లక్షలు గడిస్తూ ప్రభుత్వాదాయానికి భారీగా గండి కొడుతున్నారు. నిత్యం నిఘా కొనసాగించాల్సిన మైనింగ్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించకపోవటమే ఈ పరిస్థితికి కారణం. పలకలూరు, పేరేచర్ల ప్రాంతాల్లో మైనింగ్ అధికారులకు, ఫారెస్టు అధికారులకు నెలవారీ మామూళ్లు చెల్లిస్తూ అక్రమ క్వారీయింగ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ మాజీ మంత్రి అనుచరులు ఆయన పేరు చెప్పి మైనింగ్ అధికారులను బెదిరింపులకు గురిచేస్తూ పేరేచర్ల పరిసర ప్రాంతాల్లో అక్రమ క్వారీలు నడుపుతున్నారని తెలిసింది. గుంటూరు రూరల్ మండలంలోని చిన్న పలకలూరు, పెద్ద పలకలూరు గ్రామాల్లో ఓ మాజీ సర్పంచ్ తనయుడు అక్రమంగా ప్రభుత్వ భూముల్లో క్వారీలు నిర్వహించి కోట్లు గడించారని, అంతేకాకుండా ప్రభుత్వ భూములను సైతం ప్లాట్లుగా విభజించి అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడని విమర్శలున్నాయి. పేరేచర్ల ప్రాంతాల్లో కూడా అతను ప్రజా ప్రతినిధుల సాయంతో ఫారెస్టు భూముల్లో సైతం అక్రమ క్వారీ నిర్వహిస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. అదేమని అడిగిన వారికి కాంగ్రెస్‌కు చెందిన ఓ సీనియర్ మాజీ మంత్రి పేరుతో బెదిరింపులకు దిగడం పరిపాటిగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రజాప్రతినిధులను ఎదిరించలేక అధికారులు వారిచ్చే తాయిలాలకు తలొగ్గి మిన్నకుండిపోయారు. యెడ్లపాడు మండలం బోయపాలెం, వంకాయలపాడు గ్రామాల్లో అనధికారికంగా గ్రావెల్ క్వారీలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కొండవీడు కోట సరిహద్దు ప్రాంతంలో గ్రామ పెద్దగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ అటవీశాఖ భూముల్లో సైతం యథేచ్ఛగా తవ్వి సొమ్ము చేసుకున్నాడని విమర్శలున్నాయి. అలాగే కొత్తపాలెం మాజీ సర్పంచ్ మరికొందరు కలిసి గ్రామంలోని కొండల్లోనే కాకుండా అమీనాబాద్ గ్రామ సరిహద్దులో అనుమతులు లేకుండానే క్వారీ కొనసాగించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అమీనాబాద్‌లో మాజీ మంత్రి పేరు చెప్పుకుని ఓ యువకుడు 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని క్వారీ కొనసాగించటంతోపాటు అందుకు పంచాయతీ తీర్మానం కావాలని గ్రామ పెద్దలపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ఐతే మరో వర్గానికి చెందిన గ్రామస్తులు అందుకు నిరాకరించటంతోపాటు క్వారీ కొనసాగిస్తే సహించేదిలేదని హెచ్చరించటంతో రాత్రుళ్లు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇన్ని జరుగుతున్నా అటు ఫారెస్టు అధికారులు, మైనింగ్ అధికారులు తొంగి చూడకపోవటం నెలవారీ మామూళ్లే కారణమని ఆయాప్రాంతాల వాసులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాదికారులు దృష్టి సారించి మాఫియాపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
‘అక్రమ’ సిలికా.. నీరు ఊరదిక..
గూడూరు, న్యూస్‌లైన్: సిలికా పేరు చెప్పగానే గుర్తొచ్చేది గూడూరు ప్రాంతం. గిరాకీ పెరిగి సిరులు కురుపిస్తుండటంతో సిలికా అడ్డగోలు తవ్వకాలు ఇటీవల అధికమయ్యాయి. మైన్ య జమానుల స్వార్థం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆ ప్రాంతంలో జీవనదుల్లా ఉన్న సొనకాలువలు ఇంకిపోయి కనుమరుగవుతున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట సాగు పశ్నార్థకం గా మారింది. ఏటా మూడు పంటలు పండే పొ లాలు.. పాలకుల నిర్లక్ష్యంతో ప్రస్తుతానికి ఒక కారుకే పరిమితమయ్యాయి. ఆ ప్రాంతాల్లో ప ర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటోంది. నియోజకవర్గంలోని చిల్లకూరు, కోట మండలాల్లో సుమారు 2వేల ఎకరాల్లో సిలికా భూములు ఉన్నాయి. కోట మండలంలోని కర్లపూడి, సిద్ధవరం, కొత్తపట్నం పంచాయతీల పరిధినూ, చిల్లకూరు మండంలోని బల్లవోలు, తూర్పుకనుపూరు, చింతవరం, వరగలి, మోమిడి, ఏరూరు, వేళ్లపాళెం, ఆద్దేపూడి, కొమరావారిపాళెం, మన్నేగుంట తదితర గ్రామాల్లో సిలికా గనులు విస్తారంగా ఉన్నాయి. సిలికాను ఉపయోగించి ఉక్కు, గాజు, కంప్యూటర్ చిప్స్‌ను తయారు చేస్తుండటంతో సిలికాకు మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో సిలికా తవ్వకాలకు అనుమతి కొంతైతే, అక్రమంగా తరలించేది కొండంత. గనుల శాఖాధికారుల నుంచి అనుమతులు పొందిన గనుల యజమానులకు హద్దులను నేటికీ చూపలేదు. అనుమతులు పొందిన భూముల పక్కనే ప్రభుత్వ భూములు విస్తారంగా ఉండటంతో అక్రమార్కులు తమ భూముల్లోని సిలికాను పక్కన పెట్టి ముందుగా ప్రభుత్వ భూముల్లోని సిలికాను తవ్వేస్తున్నారు. చిల్లకూరు మండలంలోని బల్లవోలు, మన్నేగుంట, తూర్పుకనుపూరు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న సర్వేనంబరు 1లో ఉన్న ప్రభుత్వ భూముల గుండా సిలికాను అడ్డగోలుగా తవ్వుతూ రాత్రికి రాత్రే లారీల్లో తరలిస్తున్నా మైనింగ్ శాఖ నిద్రపోతోంది. కోట, చిల్లకూరు మండలాల్లో 72 గనులకు ఆ శాఖాధికారులు అనుమతులిచ్చారు. వాటిలో 10 గనులకు 2013వ సంవత్సరంతోనే లీజుదారులకు అనుమతుల కాలపరిమితి ముగిసింది. అయినా ఇప్పటికీ తవ్వకాలు సాగిస్తూనే ఉన్నారు. ఐదువేల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకమే... నిబంధనలకు విరుద్ధంగా సిలికాను యంత్రాలతో తవ్వేస్తుండటంతో సొనకాలువ ఎండిపోయి కోట, చిల్లకూరు మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం కానున్నాయి. గతంలో సొనకాలువను ఆధారంగా చేసుకుని ఈ భూముల్లో వరి, వేరుశనగ, పుచ్చ తదితర పంటలను కాలానుగుణంగా మూడు కార్లు పండించే వారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సిలికాను 10 అడుగుల మేర మాత్రమే తవ్వాల్సి ఉన్నా యంత్రాలతో సుమారు 30 అడుగుల వరకు తవ్వుతున్నారు. సిలికా అడ్డగోలు తవ్వకాలతో సొనకాలువల్లో నీరు ఉండకపోవడంతో కేవలం ఒక్కకారు మాత్రమే పండుతోంది. నిబంధనలకు విరుద్ధంగా సిలికా తవ్వకాలు యంత్రాలతో సాగితే భవిష్యత్‌లో పంటలు పండేది అనుమానమే. కోర్టు ఆదేశాలూ బేఖాతర్.. సిలికా గనుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగిస్తుండటంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తడంతోపాటు కాలుష్యంబారిన పడుతున్నామని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సిలికా గనుల్లో అక్రమ తవ్వకాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టడంతోపాటు, కాలుష్య నివారణకుఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలు ఇవ్వాలని కోర్టు మైనింగ్ శాఖను ఆదేశించింది. కాలుష్యానికి కారణాలైన సిలికా అక్రమ తవ్వకాలను, రవాణాను అడ్డుకుని మైనింగ్ అధికారులు నివేదిక సమర్పించాల్సిందిపోయి, సిలికా గనుల యజమానులకు పర్మిట్ల మంజూరులో మాత్రమే కోత విధించి చేతులు దులుపుకున్నారు. దీంతో సిలికా అక్రమ రవాణా కొనసాగుతోంది. అక్రమ సిలికా తరలింపుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. అయితే తమకు ముడుపులు అందుతుండటంతో గనుల శాఖ అధికారులు అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది.