చీమకుర్తి: జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దానితో పాటు విదేశీ మార్కెట్‌కు డిమాండ్ వచ్చింది. ఇప్పటి వరకు ప్రధాన ఎగుమతి దేశంగా చైనా మాత్రమే ఉండేది. ఇటీవల ఈజిప్ట్, వియత్నాం, బంగ్లాదేశ్ దేశాలకు కూడా గ్రానైట్ ఎగుమతి చేస్తున్నారు. రెండేళ్ల కిందటి వరకు రూ.67 నుంచి రూ.68 ఉండే డాలర్ రేటు ఏడాదిగా రూ.71 నుంచి రూ.72 మధ్య ఉంటుంది. దాని వలన క్యూబిక్ మీటర్ ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ గ్రానైట్ రాయి 1000 డాలర్ల వరకు పలుకుతోంది. ఇది ఇండియన్ కరెన్సీలో సరాసరి రూ.72 వేల ధర పలుకుతోంది. లోకల్ గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా ఇటీవల అధికం కావడం, లోకల్ మార్కెట్ డిమాండ్ పెరిగింది. అదను కుదరటంతో ప్రభుత్వం కూడా గ్రానైట్ నుంచి రావలసిన రాయల్టీని ముక్కుపిండి వసూలు చేస్తోంది. దీంతో జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఏడాదికి రూ.200 కోట్లు పైనే ఆదాయం సమకూరుతోంది.
ఏటా పెరుగుతున్న రాయల్టీ ఆదాయం..
బ్లాక్ గెలాక్సీ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ నుంచి మూడేళ్లుగా తీసిన రాళ్ల పరిమాణం కూడా పెరుగుతున్నట్టు మైన్స్ కార్యాలయం నుంచి సేకరించిన గణాంకాలను పరిశీలిస్తే అవగతమవుతోంది. వాటి మీద వచ్చే రాయల్టీ ఆదాయం ఏటికేడు పెరుగుతున్నట్లు గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. 2016–17లో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌ను 4.09 లక్షల క్యూబిక్ మీటర్లు రాయిని క్వారీ నుంచి తీయగా, 2017–18లో 4.5 లక్షల క్యూబిక్ మీటర్లు రాయిని తీశారు. ఈ ఆర్ధిక సంవత్సరం అంటే 2018–19లో జనవరి నాటికే 3.9 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి తీశారు. ఇంకా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 80 వేల క్యూబిక్ మీటర్లు తీసే అవకాశం ఉంది. దానితో ఈ సంవత్సరం 4.71 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి వస్తుంది. తీసిన రాయిపై ప్రభుత్వం వసూలు చేసే రాయల్టీ ప్రకారం 2016–17లో రూ.131 కోట్లు, 2017–18లో రూ.135 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 2018–19లో ఇప్పటికే గడిచిన జనవరి నాటికి రూ.122 కోట్లు ఆదాయం వచ్చింది.
నెలకు సరాసరిన రూ.14 కోట్లు ఆదాయం వస్తున్నందున మిగిలిన రెండు నెలలకు కలిపితే మొత్తం రూ.150 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన గత మూడేళ్లతో పోల్చుకుంటే ఒక్క బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ద్వారానే రూ.131 కోట్ల నుంచి ఏకంగా రూ.150 కోట్లకు ఆదాయం పెరిగింది. ఇక బ్లాక్ గ్రానైట్ ద్వారా రూ.17 కోట్లు, కలర్ గ్రానైట్ ద్వారా రూ.25 కోట్లు ఆదాయం వస్తోంది. మూడు రకాల గ్రానైట్‌ల నుంచి రూ.192 కోట్లు ఆదాయం సమకూరుతోంది. ఇక ఖాళీగా ఉన్న గ్రానైట్ భూములను లీజులకు ఇచ్చిన వాటి నుంచి డెడ్‌రెంట్ వసూలు చేస్తారు. క్వారీలకు ఇచ్చిన భూములు, రోడ్డు మెటల్, గ్రావెల్ నుంచి డెడ్‌రెంట్ ద్వారా కనీసం రూ.10 కోట్లు ఆదాయం వస్తున్నట్లు మైన్స్ అధికారుల ద్వారా గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. అన్ని కలిపితే జిల్లాలోని గ్రానైట్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.200 కోట్లు పైనే ఆదాయం కేవలం రాయల్టీ ద్వారా వస్తున్నట్టు స్పష్టమవుతోంది.
బ్లాకుల వారీగా రాయల్టీ రేట్లు..
గ్రానైట్ రాళ్లకు వాటి పరిమాణాన్ని బట్టి రాయల్టీని వసూలు చేస్తారు. సూపర్ గ్యాంగ్‌సా, మినీ గ్యాంగ్‌సా, కట్టర్‌సైజ్, ఖండాస్ అనే నాలుగు రకాలుగా విభజిస్తారు. బ్లాక్ గెలాక్సీ, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ రాళ్లకు వేర్వేరుగా రాయల్టీని చెల్లించాల్సి వుంటుంది. ఇప్పుడు వసూలు చేసే రాయల్టీ ధరలను 2015 నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. వాస్తవానికి రాయల్టీ ధరలను ప్రతి మూడేళ్లకు ఒకసారి సమీక్షించాల్సి ఉంటుంది. అమలు చేస్తున్న ధరలు మూడేళ్లయిలైనా వాటిని అలాగే అమలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment