granet
-
కరిగిపోతున్న ప్రకృతి సంపద: అప్పుడలా.. ఇప్పుడిలా!
సాక్షి, కరీనంగర్: ప్రకృతి సంపద కరిగిపోతోంది.. ఆహ్లాదం పంచే గుట్టలు కనుమరుగవుతున్నాయి.. గ్రానైట్, క్రషింగ్ తదితర చర్యలతో అంతరించిపోతోంది. సహజసిద్ధమైన గుట్టలపై ఉన్న చెట్ల సంపద కూడా తరిగిపోతుంది. గుట్టలు తవ్వి అక్రమార్కులు రూ.లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు. పెద్ద మొత్తంలో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. క్వారీలు, క్రషర్ల పేరుతో అలనాటి పచ్చదనం కాస్త కాంట్రాక్టర్లకు పసిడి తనంగా మారిపోతుంది. అక్రమార్కుల చేతిలో కొండలు, గుట్టలు రోజురో జుకూ కరిగిపోతున్నాయి. 2017 లో సగం వరకు ‘సాక్షి’ కెమెరాకు కనిపించిన బసంత్‌నగర్ సమీపంలోని అతిపెద్ద గుట్ట క్రషింగ్‌తో ఆగస్టు 2, 2021 వరకు ఇలా అడుగంటి అంతరించిపోతోంది.. మరో నాలుగేళ్లకు ఇక్కడ గుట్ట ఉండేదట అని చెప్పుకోవాల్సిన వస్తోందని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు అనుకుంటున్నారు. క్వారీలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. పర్యావరణానికి తీరని నష్టం వాటిలుతున్న ఎవ్వరూ పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అక్రమ తవ్వకాలు జోరుగానే సాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులకు మాత్రం పట్టింపులేకుండా పోతుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
గాడిన పడిన గ్రానైట్
చీమకుర్తి: జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దానితో పాటు విదేశీ మార్కెట్‌కు డిమాండ్ వచ్చింది. ఇప్పటి వరకు ప్రధాన ఎగుమతి దేశంగా చైనా మాత్రమే ఉండేది. ఇటీవల ఈజిప్ట్, వియత్నాం, బంగ్లాదేశ్ దేశాలకు కూడా గ్రానైట్ ఎగుమతి చేస్తున్నారు. రెండేళ్ల కిందటి వరకు రూ.67 నుంచి రూ.68 ఉండే డాలర్ రేటు ఏడాదిగా రూ.71 నుంచి రూ.72 మధ్య ఉంటుంది. దాని వలన క్యూబిక్ మీటర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ గ్రానైట్ రాయి 1000 డాలర్ల వరకు పలుకుతోంది. ఇది ఇండియన్ కరెన్సీలో సరాసరి రూ.72 వేల ధర పలుకుతోంది. లోకల్ గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా ఇటీవల అధికం కావడం, లోకల్ మార్కెట్ డిమాండ్ పెరిగింది. అదను కుదరటంతో ప్రభుత్వం కూడా గ్రానైట్ నుంచి రావలసిన రాయల్టీని ముక్కుపిండి వసూలు చేస్తోంది. దీంతో జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఏడాదికి రూ.200 కోట్లు పైనే ఆదాయం సమకూరుతోంది. ఏటా పెరుగుతున్న రాయల్టీ ఆదాయం.. బ్లాక్ గెలాక్సీ గ్రానైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ నుంచి మూడేళ్లుగా తీసిన రాళ్ల పరిమాణం కూడా పెరుగుతున్నట్టు మైన్స్ కార్యాలయం నుంచి సేకరించిన గణాంకాలను పరిశీలిస్తే అవగతమవుతోంది. వాటి మీద వచ్చే రాయల్టీ ఆదాయం ఏటికేడు పెరుగుతున్నట్లు గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. 2016–17లో బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌ను 4.09 లక్షల క్యూబిక్ మీటర్లు రాయిని క్వారీ నుంచి తీయగా, 2017–18లో 4.5 లక్షల క్యూబిక్ మీటర్లు రాయిని తీశారు. ఈ ఆర్ధిక సంవత్సరం అంటే 2018–19లో జనవరి నాటికే 3.9 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి తీశారు. ఇంకా ఫిబ్రవరి, మార్చి నెలల్లో మరో 80 వేల క్యూబిక్ మీటర్లు తీసే అవకాశం ఉంది. దానితో ఈ సంవత్సరం 4.71 లక్షల క్యూబిక్ మీటర్లు రాయి వస్తుంది. తీసిన రాయిపై ప్రభుత్వం వసూలు చేసే రాయల్టీ ప్రకారం 2016–17లో రూ.131 కోట్లు, 2017–18లో రూ.135 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది 2018–19లో ఇప్పటికే గడిచిన జనవరి నాటికి రూ.122 కోట్లు ఆదాయం వచ్చింది. నెలకు సరాసరిన రూ.14 కోట్లు ఆదాయం వస్తున్నందున మిగిలిన రెండు నెలలకు కలిపితే మొత్తం రూ.150 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన గత మూడేళ్లతో పోల్చుకుంటే ఒక్క బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ ద్వారానే రూ.131 కోట్ల నుంచి ఏకంగా రూ.150 కోట్లకు ఆదాయం పెరిగింది. ఇక బ్లాక్ గ్రానైట్ ద్వారా రూ.17 కోట్లు, కలర్ గ్రానైట్ ద్వారా రూ.25 కోట్లు ఆదాయం వస్తోంది. మూడు రకాల గ్రానైట్ల నుంచి రూ.192 కోట్లు ఆదాయం సమకూరుతోంది. ఇక ఖాళీగా ఉన్న గ్రానైట్ భూములను లీజులకు ఇచ్చిన వాటి నుంచి డెడ్‌రెంట్ వసూలు చేస్తారు. క్వారీలకు ఇచ్చిన భూములు, రోడ్డు మెటల్, గ్రావెల్ నుంచి డెడ్‌రెంట్ ద్వారా కనీసం రూ.10 కోట్లు ఆదాయం వస్తున్నట్లు మైన్స్ అధికారుల ద్వారా గణాంకాలు ధృవీకరిస్తున్నాయి. అన్ని కలిపితే జిల్లాలోని గ్రానైట్ ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.200 కోట్లు పైనే ఆదాయం కేవలం రాయల్టీ ద్వారా వస్తున్నట్టు స్పష్టమవుతోంది. బ్లాకుల వారీగా రాయల్టీ రేట్లు.. గ్రానైట్ రాళ్లకు వాటి పరిమాణాన్ని బట్టి రాయల్టీని వసూలు చేస్తారు. సూపర్ గ్యాంగ్సా, మినీ గ్యాంగ్సా, కట్టర్‌సైజ్, ఖండాస్ అనే నాలుగు రకాలుగా విభజిస్తారు. బ్లాక్ గెలాక్సీ, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ రాళ్లకు వేర్వేరుగా రాయల్టీని చెల్లించాల్సి వుంటుంది. ఇప్పుడు వసూలు చేసే రాయల్టీ ధరలను 2015 నవంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. వాస్తవానికి రాయల్టీ ధరలను ప్రతి మూడేళ్లకు ఒకసారి సమీక్షించాల్సి ఉంటుంది. అమలు చేస్తున్న ధరలు మూడేళ్లయిలైనా వాటిని అలాగే అమలు చేస్తున్నారు. -
గ్రానైట్ అక్రమాలను అరికట్టాలి
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా మంకమ్మతోట : జిల్లాలో అనుమతులు లేకుండా, అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు చేపట్టడాన్ని అరికట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కెనపల్లి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రానైట్ అక్రమ క్వారీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో అనుమతులు లేకుండా గ్రానైట్ తవ్వకాలు చేపడుతుంటే రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖనిజ సంపదను దోపిడిచేస్తూ భూమిపై జీవరాశులకు నిలువలేకుండా చేస్తున్నా మాఫియాను అడ్డుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వారీల్లో బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల శబ్ద, వాయు కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు సైతం ముప్పు ఉందన్నారు. జిల్లాలో 613 గ్రానైట్ క్వారీలకు అనుమతి ఉంటే 800 వరకు క్వారీలు నడుస్తున్నాయన్నాని తెలిపారు. గ్రానైట్ అక్రమ తరలింపును అడ్డుకునేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. మైన్స్ ఎండీ కార్యాలయాన్ని కలెక్టరేట్ సముదాయంలోకి మార్చాలన్నారు. పదేళ్లుగా సాగుతున్న గ్రానైట్ అక్రమ దందాపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ కె.నగేష్, సెగ్గెం రాజేష్, సొల్లు అజయ్‌వర్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వరాల శ్రీనివాస్, గాలి ప్రశాంత్‌బాబు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మోకెనపెల్లి రాజమ్మ, సంయుక్త కార్యదర్శి గడ్డం జలజరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు దేవరనేణి వేణుమాధవ్‌రావు, వినుకొండ రామకృష్ణరెడ్డి, మందరాజేష్, నాయకులు సిరి రవి, జక్కుల యాదగిరి, సాన రాజన్న, దుబ్బాక సంపత్, గండి శ్యామ్, కంది వెంకటరమణారెడ్డి, బండమీది అంజయ్య, పావురాల కనుకయ్య, చొక్కాల రాము, గంటుక సంపత్ పాల్గొన్నారు.