స్టాక్ యార్డుల్లో టీడీపీ శ్రేణులదే పెత్తనం
ఒకే బిల్లుపై రెండు, మూడు ట్రిప్పులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ పెద్దలే ఇసుకాసురుల అవతారమెత్తారు. ఎన్టీఆర్ జిల్లాలోని స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలను యథేచ్ఛగా తోడేస్తున్నారు. టీడీపీ శ్రేణుల వాహనాల్లో మాత్రమే ఇసుక లోడ్ చేస్తూ కాసులు దండుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కానర్ వద్ద తిష్టవేసి భవన నిర్మాణదారులకు ఇసుక దొరకనివ్వడం లేదు.
స్టాక్ పాయింట్లలో స్కానర్లు పని చేయడం లేదని బుకాయిస్తూ సామాన్యులకు ఇసుక దొరక్కుండా చేస్తున్నారు. ఇదేమని ఉద్యోగులు ప్రశ్నిస్తే.. ఉద్యోగం చేయాలంటే తాము చెప్పింది వినాలని, లేకపోతే ఉద్యోగం ఉండదని బెదిరిస్తున్నారు. దీంతో అక్కడ పనిచేస్తున్న రెవెన్యూ, మైనింగ్ శాఖల కిందిస్థాయి ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహించలేమని వాపోతున్నారు.
రవాణా వాహనాలూ వారివే
నందిగామ సమీపంలోని కీసర స్టాక్ యార్డు పూర్తిగా నందిగామ మండల టీడీపీ నేత చేతుల్లో ఉంది. అక్కడ ఇసుక లోడుచేసే జేసీబీలు మొదలు ఇసుక రవాణాచేసే వాహనాలన్నీ టీడీపీ నేతలవే ఉండేలా పెత్తనం చేస్తున్నారు. వాస్తవానికి కూపన్ తీసుకున్నా.. అనధికారికంగా ప్రొక్లెయిన్ ఉపయోగించి రూ.700 వసూలు చేస్తున్నారు. విజయవాడ చుట్టుపక్కల నుంచి వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్నారు.
తాము చెప్పిన వారికే ఇసుకపోయాలని అక్కడి సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి పరిస్థితే అనుమంచిపల్లె స్టాకు యార్డు వద్ద నెలకొంది. గ్రామస్థులు కొందరు మహిళలకు కూలీ ఇచ్చి క్యూలో నిలబెట్టి కూపన్లు పొందుతున్నారు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కీసర స్టాక్ యార్డు నుంచి భారీ ఎత్తున ఇసుకను లోడ్ చేసి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారు.
ఒకే బిల్లుపై మూడు ట్రిప్పులు
టీడీపీ నేతలు స్టాక్ పాయింట్ల వద్ద తిష్టవేసి ఉదయం 20 వేల టన్నులకు ఒక బిల్లు తీసుకుంటున్నారు. ఆ బిల్లుతో ఇసుకను లోడ్ చేయించుకుని విజయవాడ పరిసర ప్రాంతాలకు మూడుసార్లు రవాణా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
20 టన్నులకు బదులు 36 టన్నుల వరకు లోడ్ చేసుకుని ఇసుకను లూటీ చేస్తున్నారు. టీడీపీ నేతలు, ప్రొక్లెయిన్ యజమాని కలసి ఒక్కో లారీ టిప్పర్‌కు అదనంగా ఇసుకను లోడ్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో డంపింగ్ యార్డుల వద్ద నిల్వ ఉంచిన ఇసుకను టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు.
47 వేల టన్నులకు పైగా విక్రయం
ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 7న ఉచిత ఇసుక ప్రారంభం కాగా.. అప్పటికి 5,54,361 టన్నుల ఇసుక నిల్వలు ఉండేవి. ఇప్పటికే దాదాపు 47 వేల టన్నులకు పైగా స్టాక్ యార్డుల నుంచి తరలించేశారు. రోజుకు 8 వేల నుంచి 9 వేల టన్నుల ఇసుక జిల్లాలోని యార్డుల నుంచి తరలిపోతోంది. ప్రస్తుత ఇసుక నిల్వలు కేవలం 30 నుంచి 40 రోజుల మాత్రమే సరిపోతాయి. వర్షాకాలంలో నది నుంచి ఇసుక తీసేందుకు ఇబ్బంది ఏర్పడుతుంది.
ఈ లోపు సిల్ట్ లేదా ఓపెన్ రీచ్‌లను గుర్తించకపోతే ఇసుక కొరత ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది టీడీపీ నేతలు ముందస్తుగానే యార్డుల నుంచి ఇసుకను డంప్ చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలో 8 స్టాకు యార్డులున్నాయి. కృష్ణా జిల్లా స్టాకు యార్డులో ఇసుక నిల్వలు లేవు. ఎన్టీఆర్ జిల్లా నుంచే కృష్ణా జిల్లాకు ఇసుక తీసుకెళ్లాల్సి వస్తోంది.
‘అక్రమ ఇసుక’లో మా వాటా ఏదీ?
» శ్రీకాకుళం జిల్లా పెద్దసవళాపురంలో టీడీపీ సీనియర్ల ఆక్రోశం
» వంశధార నదిలో కొనసాగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు
» అక్రమ ఇసుక రవాణా అవకాశం చోటామోటా కార్యకర్తలకు అప్పగింత
» తమకూ వాటా ఇవ్వాలంటూ నాయకులపై సీనియర్ల ఒత్తిళ్లు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అక్రమ ఇసుక తవ్వకాలు, వసూళ్లు, రవాణాలో తమకు వాటా ఇవ్వడం లేదంటూ టీడీపీ సీనియర్ కార్యకర్తలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి టీడీపీకి సేవ చేసిన తమను పక్కనపెట్టి.. ఎన్నికలకు నెల రోజుల ముందు పార్టీలో చేరిన చోటామోటా కార్యకర్తలకు అవినీతిలో భాగస్వామ్యం కల్పించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక దందాలో తమకూ వాటా ఇవ్వాలంటూ నాయకులపై ఒత్తిడి చేస్తున్నారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలోని పెద్దసవళాపురం వద్ద ఉన్న వంశధార నదిలో నుంచి ఎలాంటి అనుమతి లేకుండా టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు.
ఈ ఇసుకను ప్రతి రోజూ దాదాపు 20 ట్రాక్టర్ల ద్వారా.. వెన్నెలవలస వద్ద గల ఆశ్రమ పాఠశాల సమీప ప్రదేశానికి తరలించి నిల్వ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఆ ఇసుకను ఇష్టారీతిన అమ్మేస్తున్నారు. ఇసుక కోసం వచ్చే ప్రతి ట్రాక్టర్ నుంచి రూ.100, టైరు బండ్ల నుంచి రూ.50 చొప్పున టీడీపీ కార్యకర్తలు వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక దందా, రవాణాను నెల రోజుల కిందట పార్టీలో చేరిన వారికి అప్పగించారంటూ స్థానిక టీడీపీ సీనియర్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య లుకలుకలు వచ్చి.. ఈ వ్యవహారం బయటపడింది.
దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు సమాచారం ఇవ్వడంతో ఆమదాలవలస, బూర్జ, సరుబుజ్జిలి పోలీసులు మంగళవారం ఉదయం ఇసుక ర్యాంపు వద్దకు చేరుకున్నారు. కానీ అప్పటికే సమాచారం లీక్ అవ్వడంతో తెలుగు తమ్ముళ్లు ఇసుక రవాణా నిలిపేశారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ రమేశ్‌బాబును ప్రశ్నించగా.. ప్రతి రోజు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. మండలంలో ఇసుక ర్యాంపుల నిర్వహణకు ఇప్పటివరకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
పెనుమూడి రేవులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు
»రెవెన్యూ మంత్రి అండతో రెచ్చిపోతున్న కూటమి నేతలు
» చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
రేపల్లె రూరల్: బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెనుమూడి రేవులో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అండదండలతో కూటమి నేతలు అక్రమార్జనకు తెగబడుతున్నారు. అనుమతి లేకుండా రేవు లోపలకు చొరబడి పడవల ద్వారా ఇసుకను తీసుకొచ్చి ట్రాక్టర్లలో లోడ్ చేసి పరిసర ప్రాంతాల్లో యథేచ్ఛగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. మూడు రోజులుగా అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. రేవు వద్ద ట్రాక్టర్లలో లోడ్ చేసినందుకు రూ.1500 నగదు, రేవు వద్ద నుంచి రేపల్లె పట్టణానికి చేరవేస్తే రూ.2500 నుంచి రూ.3000 వరకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తే దూరాన్ని బట్టి మరింత నగదు వసూలు చేస్తున్నారు.
ఒక పక్క ఉచిత ఇసుక విధానం అంటూనే మరో వైపు పెనుమూడి రీచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వి అమ్ముకుంటున్నారని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని అరికట్టాల్సిన రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటంలేదని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై తహసీల్దార్ రవీంద్ర వివరణ ఇస్తూ పెనుమూడి ఇసుక రీచ్‌లో అక్రమంగా ఇసుక తవ్వుతున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. రీచ్ వద్ద తనిఖీలు నిర్వహించాలని ఇప్పటికే గ్రామ రెవెన్యూ అధికారిని ఆదేశించామని తెలిపారు. తవ్వకాలను అడ్డుకోవటంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment