బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు
సరఫరాలో ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నెంబర్ : 18005994599
ఉచిత ఇసుక విధానం అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త ఇసుక విధానాన్ని వచ్చేనెల 11 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు.. దీని బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇసుకకు సంబంధించిన ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ 18005994599, ఈ మెయిల్ dmgapsandcomplaints@yahoo.comను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఇసుక విధానంపై బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా ఉచిత ఇసుక విధానంపై అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. ఇసుక రవాణ ఛార్జీలను నిర్ణయించి ఆ వివరాలను ప్రజలకు తెలిసేలా చేయాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్లు రోజూ నివేదికలివ్వాలి..
ఇక ఉచిత ఇసుక సరఫరాపై ప్రతిరోజూ జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇవ్వాలని, అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడిచేసే బాధ్యత వారిదేనని చంద్రబాబు స్పష్టంచేశారు. ఇసుక వినియోగదారుల బుకింగ్, రవాణా వ్యవస్థలను మరింత సులభతరం చేసేలా ప్రణాళికలు సిద్ధంచేయాలని, స్టాక్ పాయింట్ల వద్ద రద్దీని నివారించాలన్నారు. బుకింగ్ ఇన్వాయిస్ లేకుండా లారీలు స్టాక్ పాయింట్ల వద్దకు వెళ్లకుండా చూడాలని.. వాటి తనిఖీ కోసం స్టాక్ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వెంటనే మార్గదర్శకాలు జారీ : సీఎస్
ఇక నూతన ఇసుక విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను వెంటనే జారీచేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు. సీఎం సమీక్షకు ముందు ఆయన జిల్లా కలెక్టర్లు, గనుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకం, రవాణాకు సంబంధించిన ధరలను కలెక్టర్లు నిర్ధారించాలని, అంతకుమించి విక్రయించినట్లు ఫిర్యాదులొస్తే సహించేదిలేదని ఆయన స్పష్టంచేశారు. అంతేగాక.. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసిన వాహనాలకు ఏ తేదీన ఏ సమయంలో ఇసుకను తీసుకువెళ్లాలనేది స్పష్టంగా స్లాట్లు కేటాయించాలన్నారు.
ఇసుక వాహనాలకు ప్రత్యేక నెంబరు..
గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా మాట్లాడుతూ.. గురువారం జిల్లాల్లోని ట్రాన్సుపోర్టర్లు అందరినీ పిలిచి ఇసుక రవాణాకు వినియోగించే వాహనాలకు ఒక ప్రత్యేక యూనిక్ నంబరును కేటాయించాలని చెప్పారు. ఆ వాహనాలు మాత్రమే ఇసుక రవాణాకు ఉపయోగించాలని స్పష్టంచేశారు. అలాగే, ప్రతి రీచ్ వద్ద పోలీస్ చెక్‌పోస్టును ఏర్పాటుచేయాలని ఎస్పీలను ఆదేశించారు. ఇసుక విధానానికి జేసీని కంట్రోలింగ్ అధికారిగా నియమించాలన్నారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ మైనింగ్ వంటివి ఎక్కడ జరిగినా అందుకు ఆయా జిల్లా కలెక్టర్, ఎస్పీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ముకేశ్‌కుమార్ మీనా స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment