మాఫియా వెనకడుగు
సీతానగరం (రాజానగరం) : ప్రజల్లో సహనం నశించి తిరుగుబాటు చేస్తే వారి ముందు ఎటువంటి శక్తులైనా తలవాల్చవలసిందేననే విషయాన్ని సీతానగరం మండలంలోని ఏటిపట్టు పరీవాహక ప్రాంతాల ప్రజలు నిరూపించారు. నాలుగు మాసాలుగా చెలరేగిపోయిన ఇసుక మాఫియా శుక్రవారం తోకముడిచింది. రాజమండ్రి - సీతానగరం ప్రధాన రహదారి, ఏటిగట్టు రోడ్లమీద నిత్యం రయ్ మంటూ దూసుకుపోయే వందలాది ఇసుక లారీల జాడే లేకుండా పోయింది.
గోవరిలోని ఇసుక అక్రమ రవాణా పై ‘సాక్షి’లో వస్తున్న కథనాలకు తోడు ప్రజలు కూడా తిరుగుబాటు చేయడంతో ఇసుక తవ్వకాలను నిలిపివేయక తప్పలేదు. ఆలస్యంగానైనా ప్రజాగ్రహాన్ని గుర్తించిన మైనింగ్ శాఖ, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు సీతానగరం మండలం సింగవరంలోని ఇసుక ర్యాంప్‌కి శుక్రవారం చేరుకుని తనిఖీలు చేయడంతో ఇసుక మాఫియా తోక ముడవక తప్పలేదు. దీంతో సింగవరం వద్ద గురువారం 18 గంటల పాటు నిర్విరామంగా ఆందోళన చేసిన ఐదు గ్రామాల ప్రజలు కొంత ఊరట చెందారు.
అనుమతుల కంటే నాలుగు రెట్ల ఇసుకను తోడేశారు
సింగవరంలో ఒక రైతుకు చెందిన ఏడెకరాల లంక భూమిలో ఉన్న ఇసుక మేటలను తొలగించుకునేందుకు మైనింగ్ శాఖ గత జూన్ నెలలో అనుమతి ఇచ్చింది. అయితే అధికార పార్టీలోని కొంతమంది పెద్దల అండదండలు ఉన్న ఇసుక మాఫియా ఆ ఏడెకరాల్లోనే కాకుండా గోదావరిలోని ఇసుకను కూడా తోడేస్తూ, ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన కోట్లాది రూపాయలను మింగేసింది. దీనిపై ‘సాక్షి’లో వార్తా కథనాలుగా రావడంతో కదలివచ్చిన యంత్రాంగం చేసిన సర్వేలు, వేసిన కొలతలు కూడా నిజమని తేల్చాయి. ఆ ఏడెకరాల్లో సుమారు 84 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఇసుకను తవ్వేందుకు అనుమతి ఉండగా నాలుగు రె ట్లు అధికంగా ఇసుకను తోడేసినట్టు అధికార్లు గ్రహించారు. వివరాలను చెప్పేందుకు నిరాకరించిన మైనింగ్, ఇతర శాఖల అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు.
పది రోజుల్లో పెద్ద రీచ్‌లపై నిర్ణయం
సాక్షి, రాజమండ్రి: జిల్లాలో పర్యావరణ అనుమతులు లభించకపోవడంతో 27 పెద్ద రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిచి పోయాయని, వీటిపై పది రోజుల్లో ప్రభుత్వం స్పష్టత రావచ్చని కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై రాజమండ్రిలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేసేందుకు శుక్రవారం వచ్చిన ఆమె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పది రోజుల్లో జిల్లాలోని 27 రీచ్‌ల్లో కూడా ఇసుక తవ్వకాలు ప్రారంభం కాగలవని ఆశిస్తున్నానన్నారు. పర్యావరణ అనుమతులు అవసరం లేని సుద్ద్దగెడ్డ, పంపా, ఏలేరు, తాండవ ఏరుల పరిధిలో శుక్రవారం నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభం అయ్యాయన్నారు.