
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై ఈనాడు దినపత్రిక ఇచ్చిన కథనంపై ఏపీ రాష్ట్ర గనుల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఒక పారదర్శక విధానం రూపొందించి అమలు చేస్తుంటే.. అపోహ, అసత్య కథనాన్ని ఈనాడు ఇచ్చిందని పేర్కొంది. ఈ మేరకు గురువారం రాష్ట్ర గనులశాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏపీ ఇసుక ఆపరేషన్స్‌పై ‘‘ఇసుకకు టెండరు పెట్టింది సీఎంవోనా?’’ అనే శీర్షికన ఓ కథనం ఈనాడులో ప్రచురితమైంది. అయితే అందులో ఉన్నవి అవాస్తవాలేనని వీజీ వెంకటరెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అనుమతులు లేకుండానే పలు జిల్లాల్లో అక్రమ దందా అంటూ అర్థం లేని రాతలు రాయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇసుక విధానాన్ని పారదర్శకంగా రూపొందించి మరీ అమలు చేస్తోందని, పొంతనలేని అంశాలతో ఈనాడు అసత్య కథనాన్ని వండివార్చిందని అన్నారాయన.
‘‘రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్యాకేజీల్లో ఇసుకకు గతంలో టెండర్లు నిర్వహించాం. ఈ టెండర్లలో జెపీ సంస్థ సక్సెస్ ఫుల్ బిడ్డర్ గా ఎంపికయ్యింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా ఇసుక ఆపరేషన్స్ జరిగాయి. తిరిగి టెండర్లు నిర్వహించే వరకు ఇదే సంస్థ రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ చేస్తోంది. మరోవైపు కేంద్రప్రభుత్వరంగ సంస్థ MSTC ద్వారా ఇసుక ఆపరేషన్స్ కోసం మరోసారి టెండర్ల ప్రక్రియను నిర్వహిస్తున్నాం. ఇంకా ఈ ప్రక్రియ పూర్తికాలేదు. అప్పటి వరకు పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ద్వారానే ఇసుక ఆపరేషన్స్ జరుగుతాయి. గతంలోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాం.
.. వర్షాకాలంలో ఇసుక ఆపరేషన్స్ నిలిచిపోయాయి. ఎండాకాలంలో జేపీ సంస్థ ద్వారా తవ్వి, స్టాక్ యార్డ్లలో నిల్వ చేసిన ఇసుక విక్రయాలు కొనసాగుతున్నాయి. అలాగే తిరిగి ఇసుక తవ్వకాలు చేసేందుకు వీలుగా అనుమతి ఉన్న రీచ్‌ల్లో పాత కాంట్రాక్టింగ్ ఏజెన్సీ ఇసుక తవ్వకాలకు సిద్దమవుతోంది. కానీ, దీనంతటిని వక్రీకరిస్తూ.. బయటి వ్యక్తులు ఎవరో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, సీఎంవో నుంచి మాకు అనుమతి ఉందని వారు చెబుతున్నారంటూ ఈనాడు దినపత్రిక కథనాన్ని ప్రచురించడం ఎంత వరకు సమంజసం?’’ అని ప్రకటనలో ఆయన ప్రశ్నించారు.
.. ‘ఇసుక ఆపరేషన్స్‌కు గనులశాఖ నుంచి అనుమతులు మంజూరవుతాయి. మైనింగ్ రంగంలో ఉన్నప్రతి ఒక్కరికీ ఇది తెలుసు. అటువంటిది సీఎంవో అనుమతితో ఇసుక తవ్వుతున్నామని ఎలా అంటారు?. ఒక అంశంపై వార్తాకథనం ప్రచురించే సందర్భంలో కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఇటువంటి అసత్య కథనాలను ఎలా ప్రచురిస్తారు? ’అని ఈనాడుపై ఆయన మండిపడ్డారు.
‘‘గతంలో ఉచిత ఇసుక విధానం పేరుతో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా జేబులు నింపుకుంది. ఆరోజు ఈనాడు దినపత్రికకు ఆ అక్రమాలు కనిపించలేదా? జగన్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ఇసుక విధానంను తీసుకువచ్చారు. ప్రజలకు అందుబాటు ధరలో.. పైగా వర్షాకాలంలోనూ ఇసుక కొరత లేకుండా ఇసుకను అందిస్తున్నారు. ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా కేంద్రప్రభుత్వ రంగ సంస్థ, మినిరత్న గా గుర్తింపు పొందిన MSTC ద్వారా ఇసుక టెండర్లు నిర్వహణ జరగుతోంది. ఆసక్తి ఉన్న ఎవరైనా సరే ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం ఉంది. అయితే వాస్తవాలు ఇలా ఉంటే.. జిల్లాల్లో అక్రమ ఇసుక దందా జరుగుతోందని, పులివెందుల నేత సోదరుల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, జిల్లా కో ఇంఛార్జిని నియమించారని.. ఈనాడు పత్రిక తన ఊహలన్నింటినీ పోగు చేసి అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించింది. ఇకనైనా మరోసారి ఇలాంటి కథనాలు ఇస్తే.. ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ప్రకటనలో రాష్ట్ర గనులశాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment