సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న తరహా ఖనిజాల తవ్వకాల లీజులను వేలం ద్వారా మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త మైనింగ్ విధానాన్ని హైకోర్టు సమర్ధించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణలను గ్రానైట్ ఖనిజానికి వర్తింపజేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించి, గ్రానైట్ గనులకు వేలం నిర్వహించకుండా ఆదేశాలివ్వాలన్న ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ అభ్యర్థనను తోసిపుచ్చింది.
వేలం ద్వారా లీజులు మంజూరు చేయడం వల్ల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుందని, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్న సుప్రీం కోర్టు తీర్పును హైకోర్టు గుర్తు చేసింది. కేంద్రం తీసుకొచ్చిన గ్రానైట్ నిబంధనలు, రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన చిన్న తరహా ఖనిజాల వేలం నిబంధనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్న ఫెడరేషన్ వాదనను హైకోర్టు తిరస్కరించింది. ‘మైనింగ్ లీజు ఎలా ఇవ్వాలన్న విషయాన్ని గ్రానైట్ నిబంధనలు చెప్పడంలేదు.
మొదట వచ్చిన వారికి మొదట అన్న సూత్రం ప్రకారం లీజు మంజూరు గురించి ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ చెబుతున్నాయి. ఈ నిబంధనల ప్రకారమే గ్రానైట్ లీజు మంజూరు చేస్తూ వచ్చారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వేలం ద్వారా చిన్న తరహా ఖనిజాల లీజు మంజూరు నిబంధనలు కేంద్రం గ్రానైట్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు తీర్పు వెలువరించారు.
వేలం ద్వారా మైనింగ్ లీజులు కేటాయించేలా ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలను ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ, సాయి దుర్గా మినరల్స్ హైకోర్టులో సవాలు చేశాయి. గ్రానైట్ లీజుకు కొత్త వేలం నిబంధనలు వర్తించవని, అందువల్ల వేలం వేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని కోరాయి. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు తీర్పునిచ్చారు.
‘ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ రూల్స్ 2022 అమల్లోకి రావడానికి ముందు మైనింగ్ లీజు కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నీ చెల్లుబాటు కావన్న కొత్త వేలం నిబంధనల్లోని రూల్ 12(5)(డీ)పై పిటిషనర్లు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ నిబంధన కేంద్రం తీసుకొచ్చిన గ్రానైట్ రూల్స్‌కు విరుద్ధమని చెబుతున్నారు. ఈ వాదన సరికాదు. కొత్త వేలం నిబంధనలు కేంద్ర ప్రభుత్వ గ్రానైట్ రూల్స్‌కు ఎంతమాత్రం విరుద్ధం కాదు.
దరఖాస్తులను ఈ విధంగా చెల్లుబాటు కావని చెప్పే నిబంధన ఏదీ కేంద్ర గ్రానైట్ రూల్స్‌లో లేదు. రాష్ట్ర ప్రభుత్వ కొత్త వేలం నిబంధనల్లోని రూల్ 12(5)(హెచ్)(9)(ఐ) ప్రకారం గ్రానైట్ క్వారీ లీజు గడువు గరిష్టంగా 20 ఏళ్లు. అదే కేంద్ర గ్రానైట్ నిబంధనల్లోని రూల్ 6 ప్రకారం లీజు గడువు 30 ఏళ్లు. అంతేకాక గ్రానైట్ రూల్స్‌లో రెన్యువల్‌కు అవకాశం ఉంది. ఆ అవకాశం కొత్త వేలం నిబంధనల్లో లేదు.
ఒకే అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ఉన్నప్పుడు అందులో కేంద్ర ప్రభుత్వ నిబంధనలే చెల్లుబాటు అవుతాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూల్ 12(5)(హెచ్)(9)(ఐ) గ్రానైట్ క్వారీ లీజుకు వర్తించదు.
గ్రానైట్ రూల్స్ ప్రకారం లీజు మంజూరు ప్రాంతంలో గ్రానైట్ ఉన్నట్లు ప్రభుత్వం తగిన ఆధారాలు చూపాలి. ఈ నిబంధన కొత్త వేలం నిబంధనల్లో లేదు. ఈ విషయంలో ప్రభుత్వం గ్రానైట్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే బాధిత వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు’ అని జస్టిస్ రఘునందన్‌రావు తన తీర్పులో పేర్కొన్నారు.
గ్రానైట్ గనుల లీజులకు ఈ వేలం కరెక్టే
Published Sun, Oct 2 2022 4:20 AM | Last Updated on Sun, Oct 2 2022 8:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment