కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు.. డీడ్ల రద్దుకు ముందు నోటీసులు తప్పనిసరి
బాధితుల వాదనలు విని తీరాలన్న న్యాయమూర్తి
సాక్షి, అమరావతి: రిజిస్టర్డ్ సేల్‌డీడ్ల రద్దు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిజిస్టర్డ్ సేల్‌డీడ్లను రద్దు చేసే ముందు బాధితులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏకపక్ష రిజిస్టర్డ్ సేల్‌డీడ్ల రద్దు వల్ల ఆస్తిపై హక్కు కోల్పోయే బాధితులకు తమ వాదన వినిపించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే కాక, ఏకపక్ష అధికార వినియోగమేనని తేల్చి చెప్పింది.
ఇందుకు సంబంధించిన నిబంధన ఏదీ రిజిస్ట్రేషన్ రూల్స్‌లో నిర్ధిష్టంగా లేకపోయినప్పటికీ, అది రూల్స్‌లో ఉన్నట్టుగానే భావించి అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ‘ఏపీ రిజిస్ట్రేషన్ రూల్స్ 26(కె)(1) ప్రకారం సేల్‌డీడ్లను రద్దు చేయాలంటే.. సేల్‌డీడ్లలో పేర్కొన్న ఆస్తులు ప్రభుత్వ/అసైన్డ్/దేవదాయ లేదా రిజిస్టర్ చేయడానికి వీల్లేని భూములు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉండాలి.
అప్పుడే ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిన సివిల్ కోర్టు/ప్రభుత్వ అధికారి సంబంధిత ఆస్తుల సేల్‌డీడ్లను రద్దు చేయడం సాధ్యమవుతుంది. రిజిస్టర్డ్ సేల్‌డీడ్లలో పేర్కొన్న ఆస్తులు పైన పేర్కొన్న కేటగిరీలో ఉన్నట్టు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోతే, సేల్‌డీడ్ల రద్దుకు రూల్ 26(కె)(1) వర్తించదు. ఈ రూల్‌లో ఎక్కడా ఆస్తి స్వభావంపై అధికారులు విచారణ చేపట్టాలని లేదు.
సేల్‌డీడ్లలోని భూమి ఫలానా భూమి అంటూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే.. దాని ఆధారంగా అధికారాన్ని ఉపయోగించవచ్చని మాత్రమే ఉంది. సేల్‌డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసు ఇచ్చి, వారి వాదనలు వినాలని రూల్స్‌లో లేదు కాబట్టి, దానిని అలా వదిలేయాలా? దీనికి సుప్రీంకోర్టు గతంలో ఓ కేసులో సమాధానం చెప్పింది.
నోటీసులు ఇచ్చి వాదనలు వినే అవసరం గురించి రూల్స్‌లో లేకుంటే.. ఆ రూల్స్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అధికారుల చర్యలను ఏకపక్షంగా ప్రకటించాలని కోరవచ్చని ఆ తీర్పులో చెప్పింది. అందువల్ల సేల్‌డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినాలని రూల్స్‌లో లేకపోయినా.. అది రూల్స్‌లో ఉన్నట్లే భావించాలి’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు.
సేల్‌డీడ్ల రద్దుపై న్యాయ పోరాటం
విశాఖ జిల్లా సబ్బవరం మండలం గాలి భీమవరం గ్రామానికి చెందిన జోరీగల బంగారం తనకు ఇరువాడ, అసకపల్లి గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలో ఉన్న 4.90 ఎకరాల భూమిని జి.నాగేశ్వరరావు, ఎన్.రమణ, షేక్ ఆసీఫ్ పాషాలకు 2013లో విక్రయించారు. సబ్బవరం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. అధికారులు సేల్‌డీడ్లు కూడా జారీ చేశారు.
2014లో ఆ సేల్‌డీడ్లను అధికారులు రద్దు చేశారు. దీనిని సవాల్ చేస్తూ బంగారం తదితరులు 2014లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల జస్టిస్ రఘునందన్‌రావు తుది విచారణ జరిపి పైవిధంగా తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment