illegal sand transportation
-
అక్రమ రవాణాపై ప్రభుత్వ కొరడా..
సాక్షి, అమరావతి : అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నకిలీ ఐడీలతో ఇసుక బకింగ్ చేస్తున్న వారిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా పలువురు ఇసుక బ్రోకర్లు పెద్ద మొత్తంలో ఇసుక కొనుగొలు చేస్తుండటంతో పోలీసులు, మైనింగ్ అధికారులు ఆన్లైన్ ఐపీ అడ్రస్ ద్వారా వీరిని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరుకు చెందిన కిశోర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ. 1,27,000 విలువ గల ఇసుకను కీశోర్ నకిలీ ఐడీతో బుక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతని నుంచి 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గన్నవరానికి చెందిన దుర్గారావుపై మరో కేసు నమోదు చేశారు. బినామీ పేర్లతో దుర్గారావు 3 లక్షల 80 వేల ఇసుక బుక్ చేసినట్లు తెలిపారు. మీ సేవ ఆపరేటర్‌గా పనిచేస్తూ నకిలీ బుకింగ్ చేసిన దుర్గారావుపై కేసు నమెదు చేశారు. -
ఇసుక అక్రమ రవాణాదారులకు ఏడాది జైలు శిక్ష
వరంగల్ లీగల్ : అనుమతులు లేకుండా ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నేరం రుజువు కావడంతో వివిధ గ్రామాలకు చెందిన 13 మందికి ఒక సంవత్సర ం జైలు శిక్ష విధిస్తూ గురువారం మూడవ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి కె.అజేష్‌కుమార్ తీర్పు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... మామునూర్ పోలీసు స్టేషన్ పీఎస్సై బి.వెంకటరావు తన సిబ్బందితో కలిసి 2012 మార్చి 2న సాయంత్రం బొల్లికుంట క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. అదే సమయంలో ఏడు ట్రాక్టర్లు ఇసుక లోడుతో వచ్చాయి. వాటిని నిలిపివేసి విచారించగా ముందురోజు అర్ధరాత్రి నందనం గ్రామ సమీపంలో ఆకేరువాగు నుంచి అక్రమంగా ఇసుక నింపుకొని అధిక ధరకు అమ్ముకోవడానికి వరంగల్ నగరానికి తరలిస్తున్నట్లు చెప్పారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. ట్రాక్టర్ల డ్రైవర్లు యజమానులైన గుజ్జుల రవీంద్రాచారి, తుల రాంబాబు, ఎండీ గఫూర్, బి.నీలకంఠ, కంజర్ల స్వామి, చొల్లేటి గోపాల్‌రెడ్డి, కంజర్ల కుమారస్వామి, చెవ్వ రాజారాం, మాధారపు శ్రీధర్, దాసు సంజీవరెడ్డి, చిదిరాల అనిల్, మునిగాల కుమారస్వామి, కలకోట అనిల్, అలుగునూరి యాకయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో 13 మందికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ జడ్జి అజేష్‌కుమార్ తీర్పు వెల్లడించారు. ఇందులో 14వ నిందితుడు యాకయ్య మృతిచెందాడు. కేసును ఎస్సై ఆంజనేయులు పరిశోధించగా సాక్షులను కానిస్టేబుల్ జి.నరేందర్ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ జి.భద్రాద్రి వాదించారు. -
అధికారం అండతో...
రూ. లక్షలాది విలువగల ఇసుక తరలింపు వనజాక్షి ఘటనతో మౌనం వహించిన రెవెన్యూశాఖ పాలకొండ : అమాంతంగా పెరిగిన ఇసుక ధరలు పచ్చచొక్కాలకు లక్షలాది రూపాయలు అర్జించే కల్పతరువుగా మారింది. పాలకొండ మండలంలో నిరాంటకంగా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నా అధికారులు నిద్రనటిస్తున్నారు. డివిజన్ కేంద్రంలో ప్రభుత్వం ఇసుక ర్యాంపులను గతంలో తలవరం, అన్నవరం గ్రామాల వద్ద ఏర్పాటు చేసింది. ఇక్కడ ఇసుక నిల్వలు పూర్తి కావడంతో ర్యాంపులు మూసేశారు. ఐదు మండలాలతోపాటు విశాఖనగరానికి ఇక్కడి నుంచే ఇసుక వెళ్లాల్సి ఉండటంతో అమాంతంగా ఇసుక ధరలు పెరిగాయి. ఇదే అదనుగా అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న వారు దోపిడీకి తెరతీశారు. మండలంలోని గోపాలపురం కేంద్రంగా దర్జాగా ఇసుక ర్యాంపును ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు విలువ చేసే ఇసుకను తరలిస్తున్నారు. మొదట్లో రాత్రి పూట అరకొర వాహనాలతో ఇసుక తరలించే వారు. ప్రస్తుతం రోజూ రాత్రి 8గంటల నుంచి వేకువ జాము 4 గంటల వరకు నిరాంటంకంగా 20 ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు ఇసుకను రూ.3వేలు నుంచి రూ.4వేలు వరకు విక్రయిస్తున్నారు. ఇందులో పాలకొండ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొంతంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఇసుకను తరలిస్తున్నారు. దీన్ని ఎవరూ ప్రశ్నించినా బెదిరింపులకు దిగుతున్నారు. రెవెన్యూ మౌనం ఇంత భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం మౌనం వహించింది. ఇటీవల కృష్ణ జిల్లా ముసునూరు మండలంలో తహశీల్దారు వనజాక్షి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడం, ఆమెపై దాడి చేసిన సంఘటనపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రే అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సాహిస్తున్నారని తామెందకు కోరి కష్టాలు తెచ్చుకోవడమని మౌనం వహించినట్టు తెలుస్తోంది. కాగా దీనిపై ఆర్డీవో సాల్మన్‌రాజు మాట్లాడుతూ ఇకపై దాడులు సాగిస్తామని తెలిపారు. -
మాఫియా వెనకడుగు
సీతానగరం (రాజానగరం) : ప్రజల్లో సహనం నశించి తిరుగుబాటు చేస్తే వారి ముందు ఎటువంటి శక్తులైనా తలవాల్చవలసిందేననే విషయాన్ని సీతానగరం మండలంలోని ఏటిపట్టు పరీవాహక ప్రాంతాల ప్రజలు నిరూపించారు. నాలుగు మాసాలుగా చెలరేగిపోయిన ఇసుక మాఫియా శుక్రవారం తోకముడిచింది. రాజమండ్రి - సీతానగరం ప్రధాన రహదారి, ఏటిగట్టు రోడ్లమీద నిత్యం రయ్ మంటూ దూసుకుపోయే వందలాది ఇసుక లారీల జాడే లేకుండా పోయింది. గోవరిలోని ఇసుక అక్రమ రవాణా పై ‘సాక్షి’లో వస్తున్న కథనాలకు తోడు ప్రజలు కూడా తిరుగుబాటు చేయడంతో ఇసుక తవ్వకాలను నిలిపివేయక తప్పలేదు. ఆలస్యంగానైనా ప్రజాగ్రహాన్ని గుర్తించిన మైనింగ్ శాఖ, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు సీతానగరం మండలం సింగవరంలోని ఇసుక ర్యాంప్‌కి శుక్రవారం చేరుకుని తనిఖీలు చేయడంతో ఇసుక మాఫియా తోక ముడవక తప్పలేదు. దీంతో సింగవరం వద్ద గురువారం 18 గంటల పాటు నిర్విరామంగా ఆందోళన చేసిన ఐదు గ్రామాల ప్రజలు కొంత ఊరట చెందారు. అనుమతుల కంటే నాలుగు రెట్ల ఇసుకను తోడేశారు సింగవరంలో ఒక రైతుకు చెందిన ఏడెకరాల లంక భూమిలో ఉన్న ఇసుక మేటలను తొలగించుకునేందుకు మైనింగ్ శాఖ గత జూన్ నెలలో అనుమతి ఇచ్చింది. అయితే అధికార పార్టీలోని కొంతమంది పెద్దల అండదండలు ఉన్న ఇసుక మాఫియా ఆ ఏడెకరాల్లోనే కాకుండా గోదావరిలోని ఇసుకను కూడా తోడేస్తూ, ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన కోట్లాది రూపాయలను మింగేసింది. దీనిపై ‘సాక్షి’లో వార్తా కథనాలుగా రావడంతో కదలివచ్చిన యంత్రాంగం చేసిన సర్వేలు, వేసిన కొలతలు కూడా నిజమని తేల్చాయి. ఆ ఏడెకరాల్లో సుమారు 84 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఇసుకను తవ్వేందుకు అనుమతి ఉండగా నాలుగు రె ట్లు అధికంగా ఇసుకను తోడేసినట్టు అధికార్లు గ్రహించారు. వివరాలను చెప్పేందుకు నిరాకరించిన మైనింగ్, ఇతర శాఖల అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. పది రోజుల్లో పెద్ద రీచ్‌లపై నిర్ణయం సాక్షి, రాజమండ్రి: జిల్లాలో పర్యావరణ అనుమతులు లభించకపోవడంతో 27 పెద్ద రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిచి పోయాయని, వీటిపై పది రోజుల్లో ప్రభుత్వం స్పష్టత రావచ్చని కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై రాజమండ్రిలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేసేందుకు శుక్రవారం వచ్చిన ఆమె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పది రోజుల్లో జిల్లాలోని 27 రీచ్‌ల్లో కూడా ఇసుక తవ్వకాలు ప్రారంభం కాగలవని ఆశిస్తున్నానన్నారు. పర్యావరణ అనుమతులు అవసరం లేని సుద్ద్దగెడ్డ, పంపా, ఏలేరు, తాండవ ఏరుల పరిధిలో శుక్రవారం నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభం అయ్యాయన్నారు. -
ఇసుక క్వారీ..మాఫియా స్వారీ
యథేచ్ఛగా రవాణా పట్టించుకోని గనులశాఖ తూతూ మంత్రంగా దాడులు పాలసీ ప్రకటించని ప్రభుత్వం మూడేళ్లుగా జరగని రీచ్‌ల వేలం ఏటా రూ.కోట్లలో ఖజానాకు నష్టం విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇసుక విధానం ఖరారు చేయకపోవడంతో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. జిల్లాలోని పలు ప్రాంతాలలో పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా సాగిపోతోంది. కొద్ది సంవత్సరాలుగా ప్రభుత్వ ఇసుక క్వారీలకు వేలం నిర్వహించకపోవడం వీరికి బాగా కలిసొచ్చింది. జిల్లాలో నిర్మాణ అవసరాలకు గాను ఇటు శ్రీకాకుళం అటు రాజమండ్రిలపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా రవాణా చార్జిలు తడిసి మోపెడయి ఇసుక రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దీనిని సాకుగా తీసుకున్న ఇసుక మాఫియా పలు నదీ పరివాహక ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తోంది. రోజూ అధికసంఖ్యలో లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తరలించుకుపోతున్నారు. విజిలెన్స్ అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా పూర్తిస్థాయిలో ఇసుక అక్రమ రవాణా అరికట్టే నాథుడే కరువయ్యాడు. జిల్లాలోని శారద, వరాహ, తాండవ నది పరివాహక ప్రాంతాలు ఇసుకమాఫియా అడ్డాలుగా మారిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. దేవరాపల్లి మండలంలోని వేచలం, కలిగొట్ల, తిమిరం, తెనుగుబూడి, కొల్లివానిపాలెం, దేవరాపల్లి ఆనుకుని వున్న శారదానది కాజ్వే పక్కన రోజూ ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. స్థానిక అధికారులు లారీకి రూ.15 వేలు, ట్రాక్టర్‌కి రూ.5వేలు వంతున ముడుపులు తీసుకుని వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే శారదానదిలో అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా గవరవరం, బొడ్డేరు బ్రిడ్జిలు కూలిపోవడం తెలిసిందే. ఇక ఇసుక తవ్వకాల పుణ్యమా అని తారువా, తెనుగుబూడి బ్రిడ్జిల పరిస్థితి ఆందోళన కరంగా వుంది. శారదానది కాజ్వే ప్రతి ఏడాదీ వర్షాల సమయంలో కొట్టుకుపోతున్న దుస్థితి నెలకొంది. ఇసుక తవ్వకాల కారణంగా పర్యావరణానికి, భూగర్భ జలాలకు ప్రమాదం అని తెలిసినా అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేవరాపల్లి మండలం చింతలపూడి, కోటవురట్ల మండలం కొత్తగొట్టివాడ క్వారీలకు 2011లో వేలం నిర్వహించగా ప్రభుత్వానికి 5.67 కోట్ల ఆదాయం రావడం తెలిసిందే. వాల్టా చట్టంలోని అంశాలు, ఇసుక తవ్వకంలో యంత్రాల వాడకూడదనే నిబంధన, క్వారీలకు గడువు ముగియడం వంటి పలు కారణాల వల్ల మూడు సంవత్సరాలుగా జిల్లాలో ఇసుక క్వారీలకు వేలం నిర్వహించలేదని దుస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వ ఆదాయానికి గండి పడగా, ఇసుక మాఫియా మాత్రం రెండుచేతులా సంపాదించుకుంటోంది. నగరంలో రెండు యూనిట్ (తోపుడు ఆటో)ల ఇసుక ధర ఇటీవలే రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెరిగింది. దీనితో భవన నిర్మాణం భారంగా మారింది. ఇసుక పాలసీ ప్రభుత్వం త్వరగా ప్రకటిస్తే క్వారీలు అందుబాటులోకి వచ్చాక ఇసుక మాఫియాను అరికట్టవచ్చని పలువురు అంటున్నారు. మండల కమిటీలదే బాధ్యత ఆయా మండలాలలో ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి మండల స్థాయిలో తహశీల్దార్, ఎస్ఐ, వీఏఓలతో కమిటీలు వున్నాయి. అక్రమ ఇసుక రవాణా అరికట్టాల్సిన బాధ్యత ఈ కమిటీలపైనే వుంది. జీఓ-186 ప్రకారం ఆయా ప్రాంతాలలో లభించే ఇసుక అక్కడి అవసరాలకే వినియోగించాల్సి వుంది. ఇందిరమ్మ లబ్ధిదారులు ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు వుంది. - భగవంతరెడ్డి, డెప్యూటీ డెరైక్టర్, గనులు భూగర్భశాఖ, విశాఖపట్నం