అధికారం అండతో...
రూ. లక్షలాది విలువగల ఇసుక తరలింపు
వనజాక్షి ఘటనతో మౌనం వహించిన రెవెన్యూశాఖ
పాలకొండ : అమాంతంగా పెరిగిన ఇసుక ధరలు పచ్చచొక్కాలకు లక్షలాది రూపాయలు అర్జించే కల్పతరువుగా మారింది. పాలకొండ మండలంలో నిరాంటకంగా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నా అధికారులు నిద్రనటిస్తున్నారు. డివిజన్ కేంద్రంలో ప్రభుత్వం ఇసుక ర్యాంపులను గతంలో తలవరం, అన్నవరం గ్రామాల వద్ద ఏర్పాటు చేసింది. ఇక్కడ ఇసుక నిల్వలు పూర్తి కావడంతో ర్యాంపులు మూసేశారు. ఐదు మండలాలతోపాటు విశాఖనగరానికి ఇక్కడి నుంచే ఇసుక వెళ్లాల్సి ఉండటంతో అమాంతంగా ఇసుక ధరలు పెరిగాయి. ఇదే అదనుగా అధికార పార్టీ నేతల అండదండలు ఉన్న వారు దోపిడీకి తెరతీశారు. మండలంలోని గోపాలపురం కేంద్రంగా దర్జాగా ఇసుక ర్యాంపును ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు విలువ చేసే ఇసుకను తరలిస్తున్నారు. మొదట్లో రాత్రి పూట అరకొర వాహనాలతో ఇసుక తరలించే వారు. ప్రస్తుతం రోజూ రాత్రి 8గంటల నుంచి వేకువ జాము 4 గంటల వరకు నిరాంటంకంగా 20 ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరు ఇసుకను రూ.3వేలు నుంచి రూ.4వేలు వరకు విక్రయిస్తున్నారు. ఇందులో పాలకొండ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నారు. సొంతంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి ఇసుకను తరలిస్తున్నారు. దీన్ని ఎవరూ ప్రశ్నించినా బెదిరింపులకు దిగుతున్నారు.
రెవెన్యూ మౌనం
ఇంత భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ యంత్రాంగం మౌనం వహించింది. ఇటీవల కృష్ణ జిల్లా ముసునూరు మండలంలో తహశీల్దారు వనజాక్షి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడం, ఆమెపై దాడి చేసిన సంఘటనపై సాక్షాత్తూ ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రే అక్రమ ఇసుక రవాణాను ప్రోత్సాహిస్తున్నారని తామెందకు కోరి కష్టాలు తెచ్చుకోవడమని మౌనం వహించినట్టు తెలుస్తోంది. కాగా దీనిపై ఆర్డీవో సాల్మన్‌రాజు మాట్లాడుతూ ఇకపై దాడులు సాగిస్తామని తెలిపారు.