ఇసుక అక్రమ రవాణాదారులకు ఏడాది జైలు శిక్ష
Published Fri, Sep 2 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
వరంగల్ లీగల్ : అనుమతులు లేకుండా ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నేరం రుజువు కావడంతో వివిధ గ్రామాలకు చెందిన 13 మందికి ఒక సంవత్సర ం జైలు శిక్ష విధిస్తూ గురువారం మూడవ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి కె.అజేష్‌కుమార్ తీర్పు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... మామునూర్ పోలీసు స్టేషన్ పీఎస్సై బి.వెంకటరావు తన సిబ్బందితో కలిసి 2012 మార్చి 2న సాయంత్రం బొల్లికుంట క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. అదే సమయంలో ఏడు ట్రాక్టర్లు ఇసుక లోడుతో వచ్చాయి. వాటిని నిలిపివేసి విచారించగా ముందురోజు అర్ధరాత్రి నందనం గ్రామ సమీపంలో ఆకేరువాగు నుంచి అక్రమంగా ఇసుక నింపుకొని అధిక ధరకు అమ్ముకోవడానికి వరంగల్ నగరానికి తరలిస్తున్నట్లు చెప్పారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. ట్రాక్టర్ల డ్రైవర్లు యజమానులైన గుజ్జుల రవీంద్రాచారి, తుల రాంబాబు, ఎండీ గఫూర్, బి.నీలకంఠ, కంజర్ల స్వామి, చొల్లేటి గోపాల్‌రెడ్డి, కంజర్ల కుమారస్వామి, చెవ్వ రాజారాం, మాధారపు శ్రీధర్, దాసు సంజీవరెడ్డి, చిదిరాల అనిల్, మునిగాల కుమారస్వామి, కలకోట అనిల్, అలుగునూరి యాకయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో 13 మందికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ జడ్జి అజేష్‌కుమార్ తీర్పు వెల్లడించారు. ఇందులో 14వ నిందితుడు యాకయ్య మృతిచెందాడు. కేసును ఎస్సై ఆంజనేయులు పరిశోధించగా సాక్షులను కానిస్టేబుల్ జి.నరేందర్ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ జి.భద్రాద్రి వాదించారు.
Advertisement