Akeru vagu
-
భూమి రాళ్లపాలు బతుకు రోడ్డుపాలు!
తిరుమలాయపాలెం: అకస్మాత్తు వరదలతో ఇళ్లు నీట మునిగి, సామగ్రి అంతా కోల్పోవడమే కాదు.. జీవనాధారమైన పంట పొలాలనూ కోల్పోయిన దుస్థితి నెలకొంది. పచ్చని పంటలతో కళకళలాడే భూములను ఆకేరు వరద రాత్రికి రాత్రే బీడు భూములుగా మార్చేసింది. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరదను చూసి కట్టుబట్టలతో పరుగెత్తిన గిరిజనులు.. వరద తగ్గాక వచ్చి చూసేసరికి ఇళ్లు, సామగ్రి అంతా నాశనమయ్యాయి. దాన్ని ఏదోలా దిగమింగుకుని పొలాల వద్దకు వెళ్లి చూసిన రైతులు.. అక్కడంతా రాళ్లురప్పలు, ఇసుక మేటలే కనిపించడంతో ఆవేదనతో కన్నీట మునిగిపోయారు. అసలు ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలియనంతగా మారిపోవడాన్ని తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. రాకాసి తండాను తుడిచిపెట్టిన ఆకేరు 70 కుటుంబాలు ఉన్న రాకాసితండాకు పక్కనే ఆకేరు ప్రవహిస్తుంది. సాగునీరు అందుబాటులో ఉండటంతో.. ఇక్కడి గిరిజన రైతులు మిర్చి, పత్తి, వరి పండిస్తారు. కానీ మునుపెన్నడూ లేనంతగా ఆకేరు పోటెత్తడంతో వరద గ్రామాన్ని చుట్టుముట్టింది. గిరిజనులంతా ఎక్కడికక్కడ వదిలేసి సమీపంలోని గుట్టలపైకి చేరుకున్నారు. ఆ వరద కొద్ది గంటల్లోనే చాలా ఇళ్లను నేలమట్టం చేసింది. ధాన్యం, బియ్యం, నిత్యావసరాలు, ఇతర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. పొలాలన్నీ మాయం.. సారవంతమైన ఆకేరు పరీవాహక గ్రామాల్లోని వ్యవసాయ భూములు వరదతో ఆనవాళ్లు కోల్పోయాయి. తిరుమలాయపాలెం మండలంలోని హైదర్‌సాయిపేట, రావిచెట్టుతండా, తూర్పుతండా, అజీ్మరాతండా, రాకాసితండా, బీసురాజుపల్లితండా, రమణా తండాల పరిధిలో వెయ్యి ఎకరాలకుపైగా భూములు నామరూపాల్లేకుండా రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయి. సాగునీటి బోర్లు, మోటార్లు, పైపులు కూడా జాడ లేకుండా పోయాయి. మరోవైపు బీరోలు, బంధంపల్లి చెరువులకు గండ్లు పడి.. దిగువన ఉన్న పంట భూముల్లో ఇసుక మేటలు వేసింది. ఈ భూములను తిరిగి సాగుయోగ్యంగా మార్చాలంటే.. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తామంటున్న అరకొర సాయం ఎలా కాపాడుతుందని ప్రశి్నస్తున్నారు.పచ్చని పొలంలో.. ఇసుక, రాళ్ల మేటలుఇయన పేరు పోతుగంటి సహదేవ్. తిరుమలాయపాలెం మండలం రాకాసితండాకు చెందిన ఈయన నాలుగున్నర ఎకరాల్లో వరిసాగు చేశారు. నెల రోజుల క్రితమే నాట్లు వేయగా.. ఇటీవలే కలుపు తీసి ఎరువులు వేశాడు. కానీ ఆకేరు వరదతో కళ్లముందే పొలం నామరూపాలు లేకుండా పోయింది. అంతా ఇసుక, రాళ్ల మేటలు వేసింది. అదంతా తొలగించాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుందని సహదేవ్ వాపోతున్నారు. భార్య పుస్తెలతాడు కుదువ పెట్టిన డబ్బులతో పంటకు పెట్టుబడి పెట్టానని.. ఆ పంటా పోయి, ఇప్పట్లో పంటలు పండించే పరిస్థితీ లేక.. ఎలా బతకాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇకపై బతికేదెట్లా? అజ్మీరా తండాకు చెందిన బోడ దాసు ఐదెకరాల్లో వరిసాగు చేశాడు. సాగు నీటికి ఇబ్బంది లేకపోవడంతో ముందుగానే నాట్లు వేశాడు. పచ్చగా కళకళలాడుతున్న వరి పంట ఒక్కరోజులోనే తుడిచి పెట్టుకుపోయింది. పొలంలో ఇసుక మేటలు వేసింది. ఆయన భార్య మరణించగా.. కుమారుడు శోభన్ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు, దివ్యాంగురాలైన కుమార్తెకు వివాహం చేశాడు. ఇప్పుడు పొలం దెబ్బతినడంతో ఇకపై బతికేదెట్లాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.రాళ్ల కుప్పలు కాదు.. వరి పొలమే! ఈ చిత్రంలో కుప్పలుకుప్పలుగా రాళ్లతో నిండి కనిపిస్తున్నది వ్యవసాయ భూమే! ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా వద్ద ఆకేరు వాగు వరద ఉధృతికి.. పొలంలో సారమంతా కొట్టుకుపోయి ఇలా రాళ్లు, రప్పలు మిగిలాయి. ఇకపై ఎలాంటి పంటలూ పండించలేకుండా తయారైంది. -
ఫిల్టర్ ఇసుక..!
అనుమతి లేదు.. నిషేధాజ్ఞలు వర్తించవు.. రోజుల తరబడి తవ్వకాలు.. వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక తరలింపు.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. రోడ్లు పాడవుతున్నాయి.. రైతులు అడ్డుకుంటే దాడులు.. అధికారులు వస్తే డబ్బులతో సమాధానం.. ఇదీ ఆకేరువాగు పరిసరాల్లో ఇసుక దందా జరుగుతున్న తీరు.. వర్ధన్నపేట: ఆకేరువాగు అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. వాగుకు ఇరువైపులా ఉన్న అసైన్డ్, ప్రైవేట్ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూ రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. వర్ధన్నపేట పరిసర ప్రాంతాల నుంచి నిత్యం సుమారు 500 ట్రాక్టర్లలో ఇసుకను నగరానికి తరలిస్తున్నారు. ఏళ్ల తరబడి చేపట్టిన తవ్వకాలతో వాగులో ఇసుక నిల్వలు తగ్గిపోయాయి. దీంతో వాగుకు ఇరువైపుల ఉన్న మట్టిని తవ్వి ఫిల్టర్ చేసి ఇసుకను వెలికితీస్తున్నారు. ఇందు కోసం వాగులోనే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనర్హం. ఇలా ఫిల్లర్ చేసినందుకు ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.1600 వసూలు చేస్తున్నారు. ఇందులో కూలీలకు రూ.600, ఇసుకకు రూ.1000 ఖర్చు చేస్తున్నారు. ఇసుకను ఫిల్టర్ చేయడానికి బోరుబావుల నీటిని వినియోగిస్తున్నారు. ఆ నీటితో మట్టిని వేరుచేసి నాణ్యమైన ఇసుకనను ట్రాక్టర్లలో నింపుతున్నారు. ఇలా తయారీ చేసిన ట్రాక్టర్ ఇసుకను వరంగల్‌లో రూ.4వేల నుంచి రూ.4500 పైగా విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో నెలకు రూ.6కోట్లపైగా అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. యథేచ్ఛగా తవ్వకాలు.. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ఇసుక దందా యథేచ్చగా సాగుతోంది. మైనింగ్‌ను తలపించే స్థాయిలో తవ్వకాలు చేపట్టి ఇసుకను తోడేస్తున్నారు. వర్ధన్నపేట, ఇల్లంద, ల్యాబర్తి, పర్వతగిరి, కల్లెడ, నారాయణపురం శివారుతండాల్లో ఇసుక కోసం ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. అడ్డదారుల ద్వారా ఇసుకను వరంగల్‌కు తరలించడానికి వాహనదారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకుని సాఫీగా రవాణా కొనసాగిస్తున్నారు. దాడులు చేస్తున్నా తగ్గని దందా.. ఇటీవల కాలంలో అధికారులపై వస్తున్న ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు ఆకేరువాగులో దాడులు నిర్వహిస్తున్నారు. ఈనెల 4న వాగులో ఆకస్మిక దాడులు నిర్వహించి వర్ధన్నపేట తహసిల్దార్ కనుకయ్య 12 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అలాగే 24న ఇల్లంద వాగులో దాడులు చేసి 10 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులతో ఆకేరువాగులో జరుగుతున్న ఇసుక ఫిల్టర్ దందా వెలుగుచూసింది. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి ఆకస్మిక దాడులు చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో ఇసుక రవాణా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది. గతంలో పలుమార్లు దాడులు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసి కొంత వరకు అరికట్టాం. స్పెషల్ క్యాంపెయిన్‌గా దాడులు చేసి పూర్తి స్థాయిలో అరికడుతాం. అవసరమైతే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తాం. – కనకయ్య, తహసీల్దార్, వర్ధన్నపేట ఇసుక దందా ఇలా.. రోజుకు 500 ట్రాక్టర్లు(సుమారు) ట్రాక్టర్ ఇసుక ఫిల్టర్‌కు రూ.1000 కూలీలకు చెల్లించేది రూ.600 వరంగల్‌లో విక్రయిస్తున్న ధర రూ.4,500 ప్రతి రోజూ వ్యాపారం రూ.20లక్షలు -
ఇసుక అక్రమ రవాణాదారులకు ఏడాది జైలు శిక్ష
వరంగల్ లీగల్ : అనుమతులు లేకుండా ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నేరం రుజువు కావడంతో వివిధ గ్రామాలకు చెందిన 13 మందికి ఒక సంవత్సర ం జైలు శిక్ష విధిస్తూ గురువారం మూడవ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి కె.అజేష్‌కుమార్ తీర్పు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం... మామునూర్ పోలీసు స్టేషన్ పీఎస్సై బి.వెంకటరావు తన సిబ్బందితో కలిసి 2012 మార్చి 2న సాయంత్రం బొల్లికుంట క్రాస్‌రోడ్డు వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. అదే సమయంలో ఏడు ట్రాక్టర్లు ఇసుక లోడుతో వచ్చాయి. వాటిని నిలిపివేసి విచారించగా ముందురోజు అర్ధరాత్రి నందనం గ్రామ సమీపంలో ఆకేరువాగు నుంచి అక్రమంగా ఇసుక నింపుకొని అధిక ధరకు అమ్ముకోవడానికి వరంగల్ నగరానికి తరలిస్తున్నట్లు చెప్పారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చి పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. ట్రాక్టర్ల డ్రైవర్లు యజమానులైన గుజ్జుల రవీంద్రాచారి, తుల రాంబాబు, ఎండీ గఫూర్, బి.నీలకంఠ, కంజర్ల స్వామి, చొల్లేటి గోపాల్‌రెడ్డి, కంజర్ల కుమారస్వామి, చెవ్వ రాజారాం, మాధారపు శ్రీధర్, దాసు సంజీవరెడ్డి, చిదిరాల అనిల్, మునిగాల కుమారస్వామి, కలకోట అనిల్, అలుగునూరి యాకయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో 13 మందికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ జడ్జి అజేష్‌కుమార్ తీర్పు వెల్లడించారు. ఇందులో 14వ నిందితుడు యాకయ్య మృతిచెందాడు. కేసును ఎస్సై ఆంజనేయులు పరిశోధించగా సాక్షులను కానిస్టేబుల్ జి.నరేందర్ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ జి.భద్రాద్రి వాదించారు.