అసలే ఇళ్లు, సామగ్రి అంతా నీట మునిగి నష్టపోయిన గిరిజనులు
దానికితోడు జీవనాధారమైన పొలాలూ రాళ్ల పాలు కావడంపై ఆవేదన
ఆకేరు వాగు ఉధృతితో వెయ్యి ఎకరాలకుపైగా భూముల్లో ఇసుక, రాళ్ల మేటలు
అవి సాగుకు పనికొచ్చేలా చేయాలంటే లక్షల రూపాయలు వెచి్చంచాల్సిన దుస్థితి
ఏం చేయాలో, ఎలా బతకాలో తెలియడం లేదంటూ ఆందోళన
తిరుమలాయపాలెం: అకస్మాత్తు వరదలతో ఇళ్లు నీట మునిగి, సామగ్రి అంతా కోల్పోవడమే కాదు.. జీవనాధారమైన పంట పొలాలనూ కోల్పోయిన దుస్థితి నెలకొంది. పచ్చని పంటలతో కళకళలాడే భూములను ఆకేరు వరద రాత్రికి రాత్రే బీడు భూములుగా మార్చేసింది. ఒక్కసారిగా చుట్టుముట్టిన వరదను చూసి కట్టుబట్టలతో పరుగెత్తిన గిరిజనులు.. వరద తగ్గాక వచ్చి చూసేసరికి ఇళ్లు, సామగ్రి అంతా నాశనమయ్యాయి. దాన్ని ఏదోలా దిగమింగుకుని పొలాల వద్దకు వెళ్లి చూసిన రైతులు.. అక్కడంతా రాళ్లురప్పలు, ఇసుక మేటలే కనిపించడంతో ఆవేదనతో కన్నీట మునిగిపోయారు. అసలు ఎవరి భూమి ఎక్కడ ఉందో తెలియనంతగా మారిపోవడాన్ని తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు.
రాకాసి తండాను తుడిచిపెట్టిన ఆకేరు
70 కుటుంబాలు ఉన్న రాకాసితండాకు పక్కనే ఆకేరు ప్రవహిస్తుంది. సాగునీరు అందుబాటులో ఉండటంతో.. ఇక్కడి గిరిజన రైతులు మిర్చి, పత్తి, వరి పండిస్తారు. కానీ మునుపెన్నడూ లేనంతగా ఆకేరు పోటెత్తడంతో వరద గ్రామాన్ని చుట్టుముట్టింది. గిరిజనులంతా ఎక్కడికక్కడ వదిలేసి సమీపంలోని గుట్టలపైకి చేరుకున్నారు. ఆ వరద కొద్ది గంటల్లోనే చాలా ఇళ్లను నేలమట్టం చేసింది. ధాన్యం, బియ్యం, నిత్యావసరాలు, ఇతర వస్తువులన్నీ కొట్టుకుపోయాయి.
పొలాలన్నీ మాయం..
సారవంతమైన ఆకేరు పరీవాహక గ్రామాల్లోని వ్యవసాయ భూములు వరదతో ఆనవాళ్లు కోల్పోయాయి. తిరుమలాయపాలెం మండలంలోని హైదర్‌సాయిపేట, రావిచెట్టుతండా, తూర్పుతండా, అజీ్మరాతండా, రాకాసితండా, బీసురాజుపల్లితండా, రమణా తండాల పరిధిలో వెయ్యి ఎకరాలకుపైగా భూములు నామరూపాల్లేకుండా రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయి. సాగునీటి బోర్లు, మోటార్లు, పైపులు కూడా జాడ లేకుండా పోయాయి. మరోవైపు బీరోలు, బంధంపల్లి చెరువులకు గండ్లు పడి.. దిగువన ఉన్న పంట భూముల్లో ఇసుక మేటలు వేసింది. ఈ భూములను తిరిగి సాగుయోగ్యంగా మార్చాలంటే.. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇస్తామంటున్న అరకొర సాయం ఎలా కాపాడుతుందని ప్రశి్నస్తున్నారు.
పచ్చని పొలంలో.. ఇసుక, రాళ్ల మేటలు
ఇయన పేరు పోతుగంటి సహదేవ్. తిరుమలాయపాలెం మండలం రాకాసితండాకు చెందిన ఈయన నాలుగున్నర ఎకరాల్లో వరిసాగు చేశారు. నెల రోజుల క్రితమే నాట్లు వేయగా.. ఇటీవలే కలుపు తీసి ఎరువులు వేశాడు. కానీ ఆకేరు వరదతో కళ్లముందే పొలం నామరూపాలు లేకుండా పోయింది. అంతా ఇసుక, రాళ్ల మేటలు వేసింది. అదంతా తొలగించాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుందని సహదేవ్ వాపోతున్నారు. భార్య పుస్తెలతాడు కుదువ పెట్టిన డబ్బులతో పంటకు పెట్టుబడి పెట్టానని.. ఆ పంటా పోయి, ఇప్పట్లో పంటలు పండించే పరిస్థితీ లేక.. ఎలా బతకాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై బతికేదెట్లా?
అజ్మీరా తండాకు చెందిన బోడ దాసు ఐదెకరాల్లో వరిసాగు చేశాడు. సాగు నీటికి ఇబ్బంది లేకపోవడంతో ముందుగానే నాట్లు వేశాడు. పచ్చగా కళకళలాడుతున్న వరి పంట ఒక్కరోజులోనే తుడిచి పెట్టుకుపోయింది. పొలంలో ఇసుక మేటలు వేసింది. ఆయన భార్య మరణించగా.. కుమారుడు శోభన్ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు, దివ్యాంగురాలైన కుమార్తెకు వివాహం చేశాడు. ఇప్పుడు పొలం దెబ్బతినడంతో ఇకపై బతికేదెట్లాగని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
రాళ్ల కుప్పలు కాదు.. వరి పొలమే!
ఈ చిత్రంలో కుప్పలుకుప్పలుగా రాళ్లతో నిండి కనిపిస్తున్నది వ్యవసాయ భూమే! ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాకాసితండా వద్ద ఆకేరు వాగు వరద ఉధృతికి.. పొలంలో సారమంతా కొట్టుకుపోయి ఇలా రాళ్లు, రప్పలు మిగిలాయి. ఇకపై ఎలాంటి పంటలూ పండించలేకుండా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment