అనుమతి లేదు.. నిషేధాజ్ఞలు వర్తించవు.. రోజుల తరబడి తవ్వకాలు.. వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుక తరలింపు.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. రోడ్లు పాడవుతున్నాయి.. రైతులు అడ్డుకుంటే దాడులు.. అధికారులు వస్తే డబ్బులతో సమాధానం.. ఇదీ ఆకేరువాగు పరిసరాల్లో
ఇసుక దందా జరుగుతున్న తీరు..
వర్ధన్నపేట: ఆకేరువాగు అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. వాగుకు ఇరువైపులా ఉన్న అసైన్డ్, ప్రైవేట్ భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూ రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. వర్ధన్నపేట పరిసర ప్రాంతాల నుంచి నిత్యం సుమారు 500 ట్రాక్టర్లలో ఇసుకను నగరానికి తరలిస్తున్నారు. ఏళ్ల తరబడి చేపట్టిన తవ్వకాలతో వాగులో ఇసుక నిల్వలు తగ్గిపోయాయి. దీంతో వాగుకు ఇరువైపుల ఉన్న మట్టిని తవ్వి ఫిల్టర్ చేసి ఇసుకను వెలికితీస్తున్నారు. ఇందు కోసం వాగులోనే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనర్హం. ఇలా ఫిల్లర్ చేసినందుకు ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ.1600 వసూలు చేస్తున్నారు. ఇందులో కూలీలకు రూ.600, ఇసుకకు రూ.1000 ఖర్చు చేస్తున్నారు. ఇసుకను ఫిల్టర్ చేయడానికి బోరుబావుల నీటిని వినియోగిస్తున్నారు. ఆ నీటితో మట్టిని వేరుచేసి నాణ్యమైన ఇసుకనను ట్రాక్టర్లలో నింపుతున్నారు. ఇలా తయారీ చేసిన ట్రాక్టర్ ఇసుకను వరంగల్‌లో రూ.4వేల నుంచి రూ.4500 పైగా విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో నెలకు రూ.6కోట్లపైగా అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం.
యథేచ్ఛగా తవ్వకాలు..
వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ఇసుక దందా యథేచ్చగా సాగుతోంది. మైనింగ్‌ను తలపించే స్థాయిలో తవ్వకాలు చేపట్టి ఇసుకను తోడేస్తున్నారు. వర్ధన్నపేట, ఇల్లంద, ల్యాబర్తి, పర్వతగిరి, కల్లెడ, నారాయణపురం శివారుతండాల్లో ఇసుక కోసం ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. అడ్డదారుల ద్వారా ఇసుకను వరంగల్‌కు తరలించడానికి వాహనదారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకుని సాఫీగా రవాణా కొనసాగిస్తున్నారు.
దాడులు చేస్తున్నా తగ్గని దందా..
ఇటీవల కాలంలో అధికారులపై వస్తున్న ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు ఆకేరువాగులో దాడులు నిర్వహిస్తున్నారు. ఈనెల 4న వాగులో ఆకస్మిక దాడులు నిర్వహించి వర్ధన్నపేట తహసిల్దార్ కనుకయ్య 12 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. అలాగే 24న ఇల్లంద వాగులో దాడులు చేసి 10 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులతో ఆకేరువాగులో జరుగుతున్న ఇసుక ఫిల్టర్ దందా వెలుగుచూసింది.
క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం
ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి ఆకస్మిక దాడులు చేస్తున్నాం. కొన్ని గ్రామాల్లో ఇసుక రవాణా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది. గతంలో పలుమార్లు దాడులు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసి కొంత వరకు అరికట్టాం. స్పెషల్ క్యాంపెయిన్‌గా దాడులు చేసి పూర్తి స్థాయిలో అరికడుతాం. అవసరమైతే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తాం.
– కనకయ్య, తహసీల్దార్, వర్ధన్నపేట
ఇసుక దందా ఇలా..
రోజుకు 500 ట్రాక్టర్లు(సుమారు)
ట్రాక్టర్ ఇసుక ఫిల్టర్‌కు రూ.1000
కూలీలకు చెల్లించేది రూ.600
వరంగల్‌లో విక్రయిస్తున్న ధర రూ.4,500
ప్రతి రోజూ వ్యాపారం రూ.20లక్షలు
Comments
Please login to add a commentAdd a comment