sitanagaram mandal
-
విజ్ఞానపదం
200 మంది జానపద కళాకారుల అభిరుచి ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శనలకు ప్రశంసలు ప్రభుత్వ పథకాలపై విస్తత ప్రచారం పండగలు, సంబరాల్లో పల్లెల్లో ప్రదర్శనలు సీతానగరం: పండగలొస్తే జానపదం ఘల్లుమంటుంది. ప్రతి గుండె ఝల్లుమంటుంది. పాటల వాన కురిసిపోతుంది. ప్రతి గడప పరవశించిపోతుంది. పల్లె జనం మురిసిపోతుంది. పూట గడవకపోయినా పాటతోనే ప్రయాణం సాగిపోతోంది. పైసలు రాలకపోయినా ప్రశంసలతో కడుపు నిండిపోతోంది. ప్రభుత్వాదరణ లేకపోయినా కళకే అంకితమవుతోంది. ఒకటా.. రెండా.. తప్పెటగుళ్లు, మరగాల నత్యం, కోలాటం, బిందెల నత్యం, చిడతలు.. ఒకరా.. ఇద్దరా 200 మంది కళాకారులు. సీతానగరం మండలానికి వన్నె తెచ్చారు. ఆధునిక ప్రపంచంలోనూ ఉనికి నిలబెట్టుకునేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. పుట్టినా.. గిట్టినా.. శుభకార్యాలు జరిగినా జానపద కళాకారులకు పిలుపు వస్తుంది. అమ్మవారి పండుగలు, ప్రజా ప్రతినిధుల ఊరేగింపు, సంబరాలు, పర్వదినాల్లో ఊపిరి సలపనంత డిమాండ్ ఉంటుంది. తప్పెటగుళ్ళు, మరగాలు, కోలాటలు, బిందెల నత్యం, చిడతలాటలు చూసి పల్లె జనం పరశించిపోతారు. రైతులు వరి ఆకు తీతలు, వరిఉభాలు, చెరకు జడల కట్టు, గోగు తీసే పనుల్లో నిమగ్నమైనప్పుడు కష్టం మరిచిపోయేందుకు.. మనోల్లాసం కలిగించేందుకు జానపద గీతాలు అలపిస్తారు. గ్రామాల్లో ఎవరింట్లోనైనా మతి చెందాక.. కొన్ని తరాలు గడిచాక ఎవరికీ గుర్తుండరు. కానీ బుడగ జంగాల కళాకారులకు వారంతా గుర్తుంటారు. గ్రామాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ మూడుతరాల చిట్టాను పాటగా ఆలపిస్తారు. చిన్నారాయుడుపేట, చినంకలాం గ్రామాల్లో బుడగ జంగాల కుటుంబాలున్నాయి. రాష్ట్రస్థాయిలో బిందెల నత్యానికి గుర్తింపు రామవరం గ్రామంలో శిక్షణ పొందిన బిందెల నత్యం కళాకారులు రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ తరపున విజయనగరం జిల్లా పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్ ఘడ్, ఉత్తరాంచల్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో కళాకారులు ప్రదర్శనలిచ్చి సత్కారాలు పొందారు. ఏ గ్రామానికెళ్లినా కళాకారులే కొత్తవలస, బళ్లకష్ణాపురం, గెడ్డలుప్పి, గాదెవలస బూర్జ, లక్ష్మీపురం, ఏగోటివలస, పెదబోగిలి, పాపమ్మవలస గ్రామాల్లో యాదవ కులస్తులంతా తప్పిటగుళ్ళు జానపద కళాకారులే. యాదవ కులస్తులు ఆరాధ్య దైవంగా కొలిచే సింహాద్రప్పన్న,lఎల్లమ్మ తల్లి, దుర్గతల్లి, విఘ్నేశ్వరస్వామి, ఆంజనేయస్వామి పేరిట కూర్చిన పాటలతో జానపద కళాప్రదర్శనలు ఇస్తారు. రామవరం, బళ్లకష్ణాపురం, తామరకండి, కష్ణారాయపురం గ్రామాల్లో బిందెల నత్యం కళాకారులున్నారు. తామరకండి, బళ్లకష్ణాపురం గ్రామాల్లో భాగవతం, చిడతలు, కోలాటాలను ప్రదర్శించే కళాకారులున్నారు. తామరకండిలో వంశపారంపర్యంగా వత్తిని స్వీకరిస్తున్న జముకుల కళాకారులున్నారు. జమికల పరికరంతో వేసవిలో పనులు లేని సమయాల్లో రాత్రి పూట రామమందిరాలు, రచ్చబండల వద్ద ప్రదర్శనలు ఇవ్వడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం చేయడం, అంటువ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రదర్శనల రూపాల్లో ప్రజలకు పాటల రూపంలో విడమరిచి చెబుతారు. అందరినీ అలరించే ఈ కళాకారులు ఆర్థికంగా ఎదుగూబొదుగూ లేకపోవడమే పెద్ద విషాదం. ప్రభుత్వాదరణ లేదు :అల్లు గంగులు, తప్పెటగుళ్ళ కళాకారుడు, గాదెలవలస ఏటా సింహాద్రప్పన్న సన్నిధిలో కులవత్తికి మూలమైన తప్పిట గుళ్ల ప్రదర్శనలు ఇస్తాం. అనంతరం గ్రామాల్లో నిర్వహించే జాతర్లలో పాల్గొంటాం. మా కళను ప్రజలు ఆదరిస్తున్నా ప్రభుత్వ ఆదరణకు మాత్రం నోచుకోలేకపోయాం. పింఛన్లకు అర్జీ పెట్టినా స్పందన లేదు: బేత సత్యనారాయణ, అధ్యక్షుడు, సీతానగరం మండల కళాకారుల సంఘం హిందూ ధర్మ సంప్రదాయానికి అనుగుణంగా బిందెలు, నాగినీ నత్యంలో 200 మందికి శిక్షణ ఇచ్చాం. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రదర్శనలు ఇస్తున్న కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. నేను 26 ఏళ్ల క్రితం కళాకారుడిగా ప్రయాణం ప్రారంభించాను. బిందెలు, చిడతల నత్యం చేస్తాను. మా కళాకారుల పిల్లలకు బిందెలు, చిడతల నత్యంలో శిక్షణ ఇస్తున్నాను. ఎందరో సినీ దర్శకుల ప్రశంసలు పొందాను. మండలంలో అర్హులైన కళాకారులకు పింఛన్లు మంజూరు చేయమని 15 అర్జీలను అధికారులకు అందజేసినా ఇంతవరకూ స్పందించలేదు. కళాకారులకు పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం శ్రద్ధ వహించాలి. -
ఏ నంబరూ మనుగడలో లేదు!
పనిచేయని బీఎస్ఎన్ఎల్ వ్యవస్థ మొరాయిస్తున్న ల్యాండ్లైన్లు, నెట్ సర్వీసులు బంధువుల క్షేమ సమాచారాలు తెలియక ఆందోళన పడకేసిన మీసేవ కేంద్రాలు సీతానగరం: మండలంలో బీఎస్ఎన్ఎల్ టెలీఫోన్ ఎక్సేS్చంజ్ పరిధిలోని ల్యాండ్లైన్లు, బీఎస్ఎన్ఎల్ నెట్ సర్వీసులు పనిచేయక వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతానికి చెందినవారు ఎందరో ఉద్యోగాలు, చదువుల కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్నారు. ల్యాండ్లైన్లు, నెట్ పనిచేయకపోవడంతో వారితో మాట్లాడాలన్నా, మెయిల్ పంపించాలన్నా వీలవక అవస్థలు పడుతున్నారు. రెండున్నర దశాబ్దాలుగా సుమారు 450 కుటుంబాలు దూర ప్రాంతాల్లోని తమ పిల్లల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు, గృహావసరాలకు, 350 మంది వ్యాపార అవసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవస సర్వీసుల కోసం మొత్తం 800 బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లను ఏర్పాటు చేసుకుని వినియోగించేవారు. దీంతో బీఎస్ఎన్ఎల్ యాజమాన్యానికి ఆదాయం కూడా బాగుండేది. రెండేళ్లుగా బీఎస్ఎన్ఎల్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో విసుగెత్తిన వినియోగదారులు ఇతర సర్వీసుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం 200 బీఎస్ఎన్ఎల్ సర్వీసులు మాత్రమే మండలంలో ఉన్నాయి. అవికూడా పది రోజులుగా పనిచేయకపోవడంతో వినియోగదారులు అసంతృప్తికి గురవుతున్నారు. పదిహేను రోజుల క్రితం పిడుగుపాటుతో ఎక్సేS్చంజ్ మూలకు చేరింది. మరమ్మతుల అనంతరం నాలుగు రోజులు పనిచేసింది. అప్పటినుంచి పది రోజులుగా పూర్తిగా మొరాయిస్తోంది. సమాచారం తెలియడం లేదు: బి.శంకరరావు, గుచ్చిమి మా ల్యాడ్ ఫోన్ నెలరోజులుగా పనిచేయడం లేదు. కుటుంబ సబ్యులంతా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఫోన్ పని చేయకపోవడంతో వారినుంచి సమాచారం అందక ఇబ్బంది పడుతున్నాం. తక్షణమే ల్యాడ్లైన్కు మరమ్మతులు చేయాలి. పనిచేయని మీ సేవ కేంద్రాలు: ఎన్ రామకృష్ణ, సీడీసీ చైర్మన్, బీకే పురం లచ్చయ్యపేట మీ సేవ కేంద్రంలో నెట్ సర్వీసు పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నాను. తహసీల్దార్ కార్యలయం నుంచి వన్‌బి అవసర వచ్చింది. కానీ నెట్ పనిచేయకపోవడంతో వన్‌బీ లేక బ్యాంక్ వారు రుణాలు ఇవ్వడం లేదు. తక్షణమే మీ సేవ కేంద్రాల్లో నెట్ పనిచేసేలా బీఎస్ఎన్ఎల్ అధికారులు చర్యలు తీసుకోవాలి. -
మాఫియా వెనకడుగు
సీతానగరం (రాజానగరం) : ప్రజల్లో సహనం నశించి తిరుగుబాటు చేస్తే వారి ముందు ఎటువంటి శక్తులైనా తలవాల్చవలసిందేననే విషయాన్ని సీతానగరం మండలంలోని ఏటిపట్టు పరీవాహక ప్రాంతాల ప్రజలు నిరూపించారు. నాలుగు మాసాలుగా చెలరేగిపోయిన ఇసుక మాఫియా శుక్రవారం తోకముడిచింది. రాజమండ్రి - సీతానగరం ప్రధాన రహదారి, ఏటిగట్టు రోడ్లమీద నిత్యం రయ్ మంటూ దూసుకుపోయే వందలాది ఇసుక లారీల జాడే లేకుండా పోయింది. గోవరిలోని ఇసుక అక్రమ రవాణా పై ‘సాక్షి’లో వస్తున్న కథనాలకు తోడు ప్రజలు కూడా తిరుగుబాటు చేయడంతో ఇసుక తవ్వకాలను నిలిపివేయక తప్పలేదు. ఆలస్యంగానైనా ప్రజాగ్రహాన్ని గుర్తించిన మైనింగ్ శాఖ, విజిలెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు సీతానగరం మండలం సింగవరంలోని ఇసుక ర్యాంప్‌కి శుక్రవారం చేరుకుని తనిఖీలు చేయడంతో ఇసుక మాఫియా తోక ముడవక తప్పలేదు. దీంతో సింగవరం వద్ద గురువారం 18 గంటల పాటు నిర్విరామంగా ఆందోళన చేసిన ఐదు గ్రామాల ప్రజలు కొంత ఊరట చెందారు. అనుమతుల కంటే నాలుగు రెట్ల ఇసుకను తోడేశారు సింగవరంలో ఒక రైతుకు చెందిన ఏడెకరాల లంక భూమిలో ఉన్న ఇసుక మేటలను తొలగించుకునేందుకు మైనింగ్ శాఖ గత జూన్ నెలలో అనుమతి ఇచ్చింది. అయితే అధికార పార్టీలోని కొంతమంది పెద్దల అండదండలు ఉన్న ఇసుక మాఫియా ఆ ఏడెకరాల్లోనే కాకుండా గోదావరిలోని ఇసుకను కూడా తోడేస్తూ, ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన కోట్లాది రూపాయలను మింగేసింది. దీనిపై ‘సాక్షి’లో వార్తా కథనాలుగా రావడంతో కదలివచ్చిన యంత్రాంగం చేసిన సర్వేలు, వేసిన కొలతలు కూడా నిజమని తేల్చాయి. ఆ ఏడెకరాల్లో సుమారు 84 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఇసుకను తవ్వేందుకు అనుమతి ఉండగా నాలుగు రె ట్లు అధికంగా ఇసుకను తోడేసినట్టు అధికార్లు గ్రహించారు. వివరాలను చెప్పేందుకు నిరాకరించిన మైనింగ్, ఇతర శాఖల అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. పది రోజుల్లో పెద్ద రీచ్‌లపై నిర్ణయం సాక్షి, రాజమండ్రి: జిల్లాలో పర్యావరణ అనుమతులు లభించకపోవడంతో 27 పెద్ద రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిచి పోయాయని, వీటిపై పది రోజుల్లో ప్రభుత్వం స్పష్టత రావచ్చని కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లపై రాజమండ్రిలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేసేందుకు శుక్రవారం వచ్చిన ఆమె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పది రోజుల్లో జిల్లాలోని 27 రీచ్‌ల్లో కూడా ఇసుక తవ్వకాలు ప్రారంభం కాగలవని ఆశిస్తున్నానన్నారు. పర్యావరణ అనుమతులు అవసరం లేని సుద్ద్దగెడ్డ, పంపా, ఏలేరు, తాండవ ఏరుల పరిధిలో శుక్రవారం నుంచి ఇసుక తవ్వకాలు ప్రారంభం అయ్యాయన్నారు. -
రమణమ్మ.. నీదెంత పెద్ద మనసమ్మా!
బొబ్బర లంక: అనుకున్నది సాధించాలంటే ఎంతో ఆత్మవిశ్వాసం... అంతకుమించి దాన్ని సాధించేందుకు ధృడ సంకల్పం అవసరం. సమాజానికి సేవ చేయాలంటే ఎంతో పెద్దమనసు కావాలి. బతుకుదెరువు కోసం చిరువ్యాపారం చేసుకునే ఓ వృద్ధురాలు తోటి ప్రజల కోసం తను కూడబెట్టినదంతా కరిగించింది. సేవ చేయాలంటే అధికారమో, డబ్బో అవసరంలేదని సాటి మనిషికి సాయమందించాలనే తాపత్రయం ఉంటే చాలని చాటిచెప్పింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బర లంకలో నివసించే రమణమ్మ... చిరుతిళ్లు, గుగ్గిళ్లు, ఒడియాలు అమ్ముకుంటూ జీవిస్తోంది. భర్త వదిలేయడంతో అక్క, తమ్ముళ్లతో కాలం వెళ్లదీసేది. ఒక్కరోజూ చేసే పనికి దూరమయ్యేది కాదు రమణమ్మ. చిన్న సంఘటనతో తమ్ముడు ఆమెను విడిచి ఎక్కడికో వెళ్లిపోయాడు. తమ్ముడికోసం ఏళ్ల తరబడి ఎదురు చూసింది. అతడు మాత్రం తిరిగిరాలేదు, ఏమయ్యాడో తెలియలేదు. ఎండైనా...వానైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా గుగ్గిళ్లు, ఒడియాలు అమ్మడం మానలేదు రమణమ్మ. రాజమండ్రిలోని గౌతమీ జీవకారుణ్య సంఘానికి విరాళంగా ఇస్తే... పిల్లలకు భోజనం పెడతారని ఎవరో చెప్పారామెకు. తాను కూడబెట్టిన డబ్బులో 30వేలు ఆ సంస్థకు విరాళంగా ఇచ్చేసింది. గ్రామంలో చిరుతిళ్లు అమ్మే వృద్ధురాలు 30 వేలు ఓ సంస్థకు విరాళం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రమణమ్మ ఆశయం అక్కడితో ఆగిపోలేదు. మళ్లీ రూపాయి, రూపాయి కూడబెట్టడం మొదలు పెట్టింది. లక్షరూపాయలు వరకూ కూడబెట్టింది. గ్రామపెద్దను కలిసి, ఊళ్లో బస్టాపు నిర్మించాలని కోరింది. ఆమె ఆశయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. రెక్కలు ముక్కలు చేసుకుని తమ కళ్లముందు కష్టపడిన వృద్ధురాలు గ్రామానికి చేస్తున్న సహాయం చూసి చలించిపోయారు. ఆమె కోరిక మేరకు ఒక్క పైసా వృథా కాకుండా గ్రామంలో బస్టాప్ నిర్మించారు. జీవితమంతా కష్టపడి సంపాదించిన సొమ్ముతో నిర్మించిన బస్టాండుకు తాను ఎంతగానో అభిమానించిన తమ్ముడి పేరు పెట్టుకుంది రమణమ్మ. జీవిత చరమాంకంలో తనకుంటూ పైసా కూడా ఉంచుకోకుండా గ్రామంకోసం ఖర్చుపెట్టడంపై ఆనందంవ్యక్తం చేస్తోంది. ఎండలో ప్రయాణికులు ఇబ్బందిపడకుండా ఉండేందుకే బస్ షెల్టర్ ఏర్పాటు చేశానని చెపుతోంది. ఏడుపదులు పైబడిన వయసులోనూ రమణమ్మ తన పనులు తానే చేసుకుంటోంది. ఒంటరిగా జీవిస్తూ గ్రామంలో తిరుగుతూ చిరుతిళ్లు అమ్ముతూనే ఉంది. ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుంది కదా ఎందుకింకా కష్టపడతావని ఆమెను అడిగితే ఒకటే సమాధానం చెపుతుంది. పని చేయడం తనకు అలవాటని డబ్బు కూడపెడితే మరో మంచి పనికి ఆవి పనికి వస్తాయంటోంది. ఆమె ఆశయానికి గ్రామస్థులు కూడా సహకరిస్తున్నారు. ఏ ఆధారం లేని ఆ వృద్ధురాలికి అండగా ఉంటున్నారు. ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచన ఏ కొద్దిమందికో ఉంటుంది. ఆలోచన వచ్చినా ఆచరణలో ఎందుకొచ్చిన కష్టంలే అని వదిలేసేవారే ఎక్కువమంది. కానీ వయసు మీదపడుతున్నా శరీరం సహకరించకున్నా ఇతరుల కోసం జీవితం ధారపోసే రమణమ్మలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి వారికి ఆమె ఆదర్శనమడంలో సందేహం లేదు.