ఆర్డీఓనా.. మజాకా
► కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్
► మైనింగ్ అనుమతులు లేకుండానే గ్రావెల్ రవాణాకు అనుమతిచ్చిన వైనం
► ఆర్డీఓపై హైకోర్టులో కేసుకు రంగం సిద్ధం
కలెక్టర్ జానకి ఆదేశాలను బేఖాతర్ చేశారు. మైనింగ్ అనుమతి లేకుండానే గ్రావెల్ రవాణాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జీఓఎంఎస్-2ను ఉల్లంఘించారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని రామచంద్రాపురం, వవ్వేరు, పెనుబల్లి నుంచి గ్రావెల్ రవాణా చేసుకోవచ్చని నిబంధనలకు వ్యతిరేకంగా నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. మైనింగ్ అనుమతి లేకుండా గ్రావెల్ రవాణాకు ఆదేశాలిచ్చిన ఆర్డీఓపై ప్రజలు హైకోర్టులో కేసు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే లోకాయుక్తకు ఫిర్యాదు పంపారు. దీనిపై సాక్షి ప్రత్యేక కథనం.
బుచ్చిరెడ్డిపాళెం : మండలంలో గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. జనవరి 12వ తేదీన రామచంద్రాపురంలో గ్రావెల్ రవాణా చేయాలని చూడగా స్థానిక రైతు పిడుగు శ్రీనివాసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి పెనుబల్లి తిప్ప నుంచి మళ్లీ అక్రమార్కులు గ్రావెల్ రవాణా చేయడం ప్రారంభించారు. దీనిపై స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా రవాణాను ఆపేయాలని సూచించారు. రవాణా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో అప్పటి తహశీల్దార్ వీఆర్వోలందరికీ కలెక్టర్ ఆదేశాలను వివరించి, గ్రావెల్ రవాణా జరగకుండా చూడాలని ఆదేశించారు. ఆర్డీఓ వెంకటేశ్వర్లు కూడా ఎవరికీ గ్రావెల్ రవాణాకు అనుమతి ఇవ్వలేదని, మైనింగ్ అనుమతి తప్పనిసరని తెలిపారు.
ప్రస్తుతం జరిగిందిలా..
గత తహశీల్దార్ ఉన్న సమయంలో అక్రమ రవాణా జరగకపోవడంతో ఆయన బదిలీ కావడం అక్రమార్కులకు బాగా కలిసి వచ్చింది. ప్రస్తుత తహశీల్దార్ ప్రేమ్‌చంద్ సాల్మన్‌కు ఎఫ్‌డీఆర్ పనుల నిమిత్తం గ్రావెల్ కావాలని దరఖాస్తు అందింది. దరఖాస్తులో ఎక్కడి నుంచి, ఏ సర్వే నంబర్లో ఎంత స్థలంలో, స్థలం నిషేధిత స్థలమా కాదా అనే వివరాలు లేవు. అయినా తహశీల్దార్ ఆర్డీఓకు సిఫార్సు చేశారు. ఈ దరఖాస్తును పూర్తి స్థాయిలో ఆర్డీఓ పరిశీలించకుండానే మైనింగ్‌కు పంపారు. వివరాలు పూర్తిగా లేకపోవడంతో మైనింగ్ అధికారులు వెనక్కి పంపినట్లు తెలిసింది.
అధికార దుర్వినియోగం
మైనింగ్ శాఖ అనుమతి లేకుండా గ్రావెల్ అనుమతి ఇవ్వకూడదన్న నిబంధనలు పట్టించుకోని ఆర్డీఓ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వని విధంగా ప్రత్యేకంగా గ్రావెల్ రవాణాకు తాత్కాలిక అనుమతి ఇచ్చారు. కలెక్టర్‌కు తెలియకుండా, మైనింగ్‌శాఖ అనుమతి లేకుండా మండలంలోని పెనుబల్లి, వవ్వేరు, రామచంద్రాపురం నుంచి గ్రావెల్ రవాణా చేసుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఏయే సర్వే నంబర్లు, అవి ప్రభుత్వ భూమి లేదా ప్రైవేటు భూమి అన్న విషయాన్ని ఉత్తర్వుల్లో పొందుపరచలేదు.
పరిశీలించిన దాఖలాలు లేవు
కలెక్టర్ చైర్మన్‌గా, మైనింగ్ ఏడీ కన్వీనర్‌గా, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా అటవీశాఖాధికారి, పొల్యూషన్ బోర్డు అధికారి, తహశీల్దార్‌తో కూడిన కమిటీ నివేదికతో గ్రావెల్ రవాణా తదితరాలు జరగాల్సి ఉంది. ఆర్డీఓ, మైనింగ్ ఏడీ, జిల్లా అటవీశాఖాధికారి జాయింట్ ఇన్‌స్పెక్షన్‌తో గ్రావెల్ రవాణా ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి 30 రోజుల్లో జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలి. ఆర్డీఓ ఇచ్చిన ఉత్వర్వులకు సంబంధించి ప్రాంతాల్లో మైనింగ్, అటవీశాఖాధికారుల పరిశీలన జరిగిన దాఖలాలు లేవు. తమ ప్రాంతాల్లో గ్రావెల్ రవాణా వద్దని మొత్తుకున్నా వినకుండా, ప్రజాభిప్రాయం సేకరించకుండా, జీఓను ఉల్లంఘించడంపై ప్రజలు ఆర్డీఓ వెంకటేశ్వర్లుపై హైకోర్టులో కేసు దాఖలు చేయనున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ జానకి గ్రావెల్ రవాణాలో అధికారులు పాల్పడుతున్న అధికార దుర్వినియోగం, అవినీతి అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తిప్ప తవ్వితే మునక తప్పదు :
పెనుబల్లి తిప్పలో తవ్వకాలు జరిపితే, తుపాన్ల సమయంలో గ్రామం మునగక తప్పదు. చారిత్రాత్మకమైన ప్రదేశాన్ని సర్వనాశనం చేయడం తగదు. సహజవనరులు దోపిడీకి గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. ఆర్డీఓ ఉత్తర్వులపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం. - చేవూరి వినయ్‌నారాయణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు
ఎఫ్‌డీఆర్ పనులకు అనుమతి ఇచ్చాం :
ఎఫ్‌డీఆర్ పనులకు గ్రావెల్ రవాణా చేసుకోమని అనుమతిచ్చాం. మైనింగ్ అనుమతి అవసరం లేదు. తాత్కాలిక అనుమతిస్తూ ఉత్వర్వులు జారీ చేశా. -కె.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ, నెల్లూరు