అవినీతికి పరాకాష్ట | High Court comments on AP government | Sakshi
Sakshi News home page

అవినీతికి పరాకాష్ట

Published Thu, Jul 26 2018 2:55 AM | Last Updated on Fri, Aug 31 2018 8:57 PM

High Court comments on AP government - Sakshi

ఏపీలోని నడికుడి నుంచి 4.70 లక్షల టన్నులు, కోనంకి నుంచి 5.75 లక్షల టన్నులు, కేశానుపల్లి నుంచి 2.10 లక్షల టన్నులు తరలిపోయిందని అధికారులే చెబుతున్నారు. మరి మీరేమో జాతి సంపద దోచుకున్న అసలైన వ్యక్తులను వదిలేసి.. బతుకుదెరువు కోసం కూలి పనులు చేసుకుంటున్న అనామకులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేస్తారా?.. ఇలాంటి చర్యలను మేం ఎంతమాత్రం ఆమోదించబోం. ఏపీలో
లక్షల టన్నుల ఖనిజ సంపద తరలిపోయింది. అవినీతికి ఇది పరాకాష్ట. దీనిపై కాగ్‌చే విచారణ జరిపిస్తాం. అధికారంలో ఉన్న వ్యక్తులు, అధికారులు ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారు.

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌ చేస్తూ విలువైన ఖనిజాన్ని తరలించుకుపోతుంటే ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. కూలీలపై కేసులు పెట్టి అసలు వ్యక్తులను వదిలేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనింగ్‌ శాఖ అధికారుల విచారణ తీరును కూడా తీవ్రంగా ఆక్షేపిస్తూ.. లేని నల్లపిల్లి కోసం చీకటి గదిలో వెతికినట్లు ఉందంటూ మండిపడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో గుంటూరు జిల్లా కోనంకి, నడికుడి, కేశానుపల్లి ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో తదుపరి ఏం చర్యలు తీసుకోవచ్చో తెలియజేయాలంటూ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌), సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), కేంద్ర గనుల శాఖను ఆదేశించింది. ఇందులో భాగంగా వారిని ఈ కేసులో సుమోటోగా (తనంతట తాను) ప్రతివాదులుగా చేర్చింది. అంతేకాక అక్రమ మైనింగ్‌ ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు నోటీసులు జారీచేసింది. ఆయన వాదనలను వినదలిచామని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో తదుపరి చర్యలు ఏమైనా తీసుకుని ఉంటే.. ఆ వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.  
 
– కోర్టు వద్దన్నా.. యరపతినేని అక్రమ మైనింగ్‌ చేస్తూనే ఉన్నారు 
ఎటువంటి అనుమతులూ తీసుకోకుండా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. స్థానిక నేతలతో కలిసి పిడుగురాళ్ల, నడికుడి, కేశనుపల్లి, దాచేపల్లి, కొండమోడులతో పాటు మరికొన్ని గ్రామాల్లో యథేచ్ఛగా లైమ్‌స్టోన్‌ తవ్వకాలు జరుపుతున్నారని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పిడుగురాళ్లకు చెందిన కె.గురవాచారి 2015లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అప్పటి ధర్మాసనం అక్రమ మైనింగ్‌ను నిలుపుదల చేయించడంతో పాటు బాధ్యులను గుర్తించి వారి నుంచి అక్రమ మైనింగ్‌ వల్ల కలిగిన నష్టాన్ని వసూలు చేయాలంటూ అధికారులను ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని, ఎమ్మెల్యే శ్రీనివాసరావు లైమ్‌స్టోన్‌ తవ్వకాలను కొనసాగిస్తూనే ఉన్నారని, రూ.31 కోట్ల మేరకు ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ చార్జీలు ఎగవేశారంటూ.. మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు బుధవారం దానిని మరోసారి విచారించింది.  
 
– కూలీలపై కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారు..  
పిటిషనర్‌ తరుఫు న్యాయవాది ఎన్‌వీ సుమంత్‌ వాదనలు వినిపిస్తూ.. కోనంకి, నడికుడి, కేశనుపల్లి ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతున్నట్టు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) అధికారుల గుర్తించినట్లు తెలిపారు. ఇందుకు బాధ్యులను చేస్తూ కొందరు స్థానికులకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేసిన లోకాయుక్త అధికారులు తమ నివేదికలో.. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పేరును ప్రస్తావించినా.. మైనింగ్‌ అధికారులు మాత్రం పెద్దల జోలికి వెళ్లకుండా స్థానికంగా పనిచేసే నలుగురు కూలీలపై కేసులు పెట్టి చేతులు దులుపుకొన్నారని వివరించారు. కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం.. బాధ్యుల నుంచి దోచుకున్న సొమ్మును వసూలు చేసే విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. తర్వాత ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపిస్తూ.. అక్రమ మైనింగ్‌ చేస్తున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, రెండు ట్రాక్టర్లను జప్తు చేసినట్లు వివరించారు.  
 
– అసలైనవారిని వదిలేసి అనామకులపై కేసులా? 
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఎంత మందిపై కేసు నమోదు చేశారు.. ఎంత మందిపై విచారణ ప్రారంభించారు.. ఎన్ని టన్నుల ఖనిజం అక్రమంగా తరలిపోయింది.. ఈ వివరాల సంగతేంటని ప్రశ్నించింది. ‘నడికుడి నుంచి 4.70 లక్షల టన్నులు, కోనంకి నుంచి 5.75 లక్షల టన్నులు, కేశనుపల్లి నుంచి 2.10 లక్షల టన్నులు తరలిపోయిందని అధికారులే చెబుతున్నారు. మరి మీరేమో ముగ్గురు, నలుగురు కూలీలపై కేసులు పెట్టినట్లున్నారు. ఆ ముగ్గురు నలుగురికి ఇంత పెద్ద స్థాయిలో రాత్రికి రాత్రే ఖనిజం తరలించడం సాధ్యమయ్యే పనేనా?! అవినీతికి ఇది పరాకాష్ట. జాతి సంపదను దోచేస్తున్న వారిపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు సీరియస్‌గా వ్యవహరించడం లేదు. అక్రమ మైనింగ్‌ చేసినట్లు గుర్తించిన వారికి ఎటువంటి డిమాండ్‌ నోటీసులూ ఇవ్వలేదు. జరిగిన నష్టాన్ని రాబట్టేందుకు ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే.. అధికారులు కచ్చితంగా అవినీతికి పాల్పడినట్టే. అటువంటి అవినీతిపరులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. బతుకుదెరువు కోసం కూలి పనులు చేసుకుంటున్న వాళ్లపై కేసులు పెట్టిన అధికారులు.. ఖనిజ సంపద దోచుకున్న వారిపై పెట్టరా? అసలైన వ్యక్తులను వదిలేసి.. అనామకులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేసి విచారణ చేస్తారా? ఇటువంటి చర్యలను మేం ఎంతమాత్రం ఆమోదించబోం. ఈ కేసులోని వివరాలను పరిశీలిస్తే.. లక్షల టన్నుల ఖనిజ సంపద తరలిపోయింది. దీనిపై కాగ్‌చే విచారణ జరిపిస్తాం. అధికారంలో ఉన్న వ్యక్తులు, గనులశాఖ అధికారులు ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేశారు’ అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement