సాక్షి, అమరావతి: ఎవరైనా తప్పు చేస్తుంటే తప్పని చెప్పాలి. నేరం చేస్తే నేరమని చెప్పాలి. ఈనాడు పత్రిక నేరమే కరెక్టు అంటుంది. తప్పులు చక్కగా చేయొచ్చంటుంది. తప్పు చేసే వాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వేధింపులంటూ రాతల్లో రోత పుట్టిస్తుంది. రాష్ట్రంలో ‘మైనింగ్’పై ఇలాంటి రోత కథనమే మరొకటి రాసింది.
రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌ను నిరోధించేందుకు గనుల శాఖ చేపట్టిన తనిఖీలు, విధిస్తున్న జరిమానాలపైనా వక్రభాష్యాలు చెబుతోంది. అడ్డగోలుగా గనులను కొల్లగొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకుంటే కక్ష సాధింపుగా, వేధింపులుగా చిత్రీకరిస్తోంది.
ఇలా అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ సోమవారం ఓ తప్పుడు కథనం ప్రచురించింది. మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణ, తనిఖీలు గనుల శాఖ ప్రధాన విధి. దాన్ని కూడా తప్పు పడుతూ ఈనాడు పత్రిక రాజకీయాలు అంటగడుతోంది. అక్రమ క్వారీయింగ్ చేసే వారు రాజకీయ నేతలైతే వారికి మినహాయింపు ఇవ్వాలనే ధోరణిలో వాదిస్తోంది. మైనింగ్ అక్రమార్కులపై ఆ పత్రిక ఒక్క ముక్క రాయకపోగా, అక్రమార్కులను ప్రోత్సహించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ఇవీ వాస్తవాలు
► నెల్లూరు జిల్లాలో 5 ఎకరాలు లీజుకు తీసుకుని దాదాపు 50 ఎకరాల్లో అక్రమంగా తవ్వేస్తుంటే స్థానికులు ఫిర్యాదు చేశారు. గనుల శాఖ అధికారులు అక్కడ క్వారీలో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కళ్లు చెదిరే దారుణాలు, అక్రమ తవ్వకాలు బయటపడ్డాయి. వాటన్నింటి విలువ రూ.142 కోట్లుగా తేలింది. ఆ మొత్తాన్ని అధికారులు జరిమానాగా విధించారు. ఈ చర్య ఈనాడుకు తప్పుగా, కక్ష సాధింపుగా కనపడుతోంది.
► సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని ఎన్‌హెచ్ – 42లో ముదిగుబ్బ బైపాస్ ప్రాంతంలో నితిన్ సాయి సంస్థ రోడ్డు నిర్మాణంలో అడ్డుగా ఉన్న కొండ ప్రాంతాన్ని తొలుస్తోంది. దాన్నుంచి వచ్చిన రాయిని మొబైల్ క్రషర్ ద్వారా బయటికి తరలించి, విక్రయిస్తోంది.
ఈ సమాచారం తెలిసి గనుల శాఖ అధికారులు తనిఖీ చేశారు. సుమారు రూ.15 కోట్ల విలువైన మెటల్‌ను అక్రమంగా విక్రయించినట్లు తేలింది. దీనిపై చర్యలు తీసుకోవడాన్ని తప్పుపట్టడం ఈనాడు వక్రనీతికి అద్దం పడుతోందని గనుల శాఖాధికారులు వ్యాఖ్యానిస్తన్నారు.
► అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్ వద్ద ఉన్న కొన్ని కంకర క్వారీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. గతంలో వాటికి జరిమానాలు విధిస్తూ అధికారులు నోటీసులిచ్చారు. వీటిపై కొందరు కోర్టుకు వెళ్లారు. అక్కడ వారి వాదన చెల్లలేదు. జరిమానాలు చెల్లించకపోవడం, న్యాయస్థానాల నుంచి కూడా అనుకూలంగా ఉత్తర్వులు రాకపోవడంతో చాలా క్వారీల్లో మైనింగ్ జరగడంలేదు.
దీన్ని కూడా ఆ పత్రిక వక్రీకరించింది. క్వారీలను వేధిస్తున్నారంటూ అడ్డగోలుగా రాసింది. గన్నవరం, గుడివాడ ప్రాంతాల్లోనూ అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదులు రావడంతో గనుల శాఖ తనిఖీ చేసింది. ఉల్లంఘనలు బయటపడడంతో కేసులు నమోదు చేసింది. ఇది కూడా ఈనాడుకు కక్ష సాధింపుగా కనపడింది. అక్రమాలను నిస్సిగ్గుగా సమర్ధించింది.
అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నాం
విజిలెన్స్ స్క్వాడ్‌లతో అక్రమ మైనింగ్‌పై ఉక్కు పాదం మోపుతుంటే దాన్ని వక్రీకరిస్తూ కథనాలు రాయడం సరికాదు. మైనింగ్ అక్రమాలపై టోల్ ఫ్రీ నంబర్ 1800 5994599 కు వచ్చే అన్ని ఫిర్యాదులపైనా తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటున్నాం. 2014 – 2019 మధ్య అక్రమ మైనింగ్‌పై కేవలం 424 కేసులు నమోదైతే, 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్లలోనే 786 కేసులు నమోదు చేశాం.
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు రాజకీయ ఉద్దేశాలను ఆపాదించేలా ఈనాడు పత్రిక కథనం ప్రచురించడం దారుణం. అక్రమ మైనింగ్‌పై గనుల శాఖ చర్యలు తీసుకోవడం నేరమా? తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేయడాన్ని వేధింపుల కింద ఈనాడు పత్రిక చిత్రీకరిస్తోంది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటే రాజకీయ దురుద్దేశాలను అంటగడతారా? ఇటువంటి తప్పుడు కథనాల వల్ల ఉద్యోగుల మనోస్థైర్యం దెబ్బతింటుంది.
– మైనింగ్ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment