రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు! | Illegal activities of Ramoji Rao Revealed with Margadarsi Scam | Sakshi
Sakshi News home page

రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్లు..18 ఏళ్లుగా జిత్తులు!

Published Thu, Nov 7 2024 4:19 AM | Last Updated on Thu, Nov 7 2024 4:19 AM

Illegal activities of Ramoji Rao Revealed with Margadarsi Scam

2006 నవంబర్‌ 6న మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అక్రమాలపై ఉండవల్లి ఫిర్యాదు  

వెలుగులోకి రామోజీ చట్ట విరుద్ధ కార్యకలాపాలు..

1997 నుంచి 2006 వరకు రూ.2,610 కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ 

తాము ఆర్‌బీఐ చట్ట పరిధిలోకి రామంటూ దబాయింపు 

పిటిషన్లపై పిటిషన్లు వేస్తూ అడుగడుగునా అడ్డంకులు.. విభజన హడావుడిలో ఉండగా రామోజీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు

దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉండవల్లి, ఏపీ ప్రభుత్వం 

హైకోర్టు తీర్పును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం 

సుప్రీం ఆదేశాలతో తిరిగి విచారణ మొదలుపెట్టిన తెలంగాణ హైకోర్టు 

మొదటిసారి కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి వాదనలు.. నేడు మరోసారి విచారణ 

ఉల్లంఘనలు రుజువైతే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు జరిమానా  

చట్టపరమైన చర్యల కోసం కింది కోర్టులో అదీకృత అధికారి ఫిర్యాదు చేస్తే దానిపై పిటిషన్‌..!  
వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కమిషన్‌ను నియమిస్తే పిటిషన్‌...!  
అధీకృత అధికారిని నియమిస్తే పిటిషన్‌..!  
కేసు వాదించడానికి స్పెషల్‌ పీపీని నియమిస్తే పిటిషన్‌!  
కింది కోర్టు విచారణకు స్వీకరిస్తే పిటిషన్‌...!  
వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తే పిటిషన్‌..!  
హైకోర్టు జోక్యానికి నిరాకరిస్తే సుప్రీంకోర్టులో పిటిషన్‌...!!  

సాక్షి, అమరావతి: ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ, స్టేల మీద స్టేలు పొందుతూ మార్గదర్శి, రామోజీరావు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. దాని ఫలితంగానే గత 18 ఏళ్లుగా కేసు కొనసాగుతూ వస్తోంది. ప్రజల నుంచి ఏకంగా రూ.2,610 కోట్ల మేర డిపాజిట్లను అక్రమంగా వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని కర్త రామోజీరావు బండారం 2006 నవంబర్‌ 6న బట్టబయలైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చట్టం సెక్షన్‌ 45 ఎస్‌కు విరుద్ధంగా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడంపై ప్రజల ముందు నిలబెట్టిన రోజు అది. 

ఇంత భారీ మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి అడ్డంగా దొరికిపోయిన మార్గదర్శి, రామోజీరావు చట్టం నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రతి దశలోనూ విచారణను అడ్డుకుంటూ వచ్చారు. అయితే ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7వ తేదీన మరోసారి విచారణ జరపనుంది. ఆర్‌బీఐ చట్టం సెక్షన్‌ 45 ఎస్‌కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు స్వీకరించిందా? లేదా? అనే విషయాన్ని తేల్చనుంది. చట్ట విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించినట్లు తేలితే వసూలు చేసిన రూ.2,610 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని జరిమానాగా చెల్లించాల్సి ఉంటుంది. 

అటు అక్రమ డిపాజిట్లు.. ఇటు నష్టాలంటూ 
రామోజీరావు 1972లో హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ఏర్పాటు చేశారు. 1997 కేంద్ర చట్టం ప్రకారం హెచ్‌యూఎఫ్‌ లాంటి అన్‌ ఇన్‌ కార్పొరేటెడ్‌ (చట్టపరంగా ఓ కంపెనీగా రిజిష్టర్‌ కాకుండా వ్యాపారం చేసేవి) సంస్థలు వ్యాపార కార్యకలాపాల కోసం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం నిషిద్ధం. అయితే దీన్ని ఖాతరు చేయకుండా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ఆర్‌బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించి 1997 నుంచి 2006 మార్చి నాటికి 2.75 లక్షల మంది డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.2,610.38 కోట్లు అక్రమంగా వసూలు చేసింది. ఇంత భారీగా డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఆశ్చర్యకరంగా 2006 మార్చి నాటికి రూ.1,369.47 కోట్లను వృద్ధి చెందుతున్న నష్టాలుగా చూపింది. తద్వారా 50 శాతం మంది డిపాజిటర్లకు డిపాజిట్లు చెల్లించలేని పరిస్థితికి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ చేరింది.  

డొంక కదిల్చిన ఉండవల్లి... 
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ద్వారా రామోజీ చట్ట విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించడంపై అప్పటి కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ 2006 నవంబర్‌ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేశారు. మార్గదర్శి అక్రమాల తీరును బహిర్గతం చేశారు. ఇదే సమయంలో ఆ డిపాజిట్ల వివరాలను ఆర్‌బీఐ అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపడంతోపాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ నుంచి వివరణ కోరింది. వాస్తవానికి 1997లోనే డిపాజిట్ల సేకరణపై మార్గదర్శి స్పష్టత కోరగా ప్రజల నుంచి అలా సేకరించడం చట్ట విరుద్ధమని ఆర్‌బీఐ అప్పుడే స్పష్టం చేసింది. అయినా సరే పట్టించుకోకుండా మార్గదర్శి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారో అప్పుడు మళ్లీ ఆర్‌బీఐ దీనిపై స్పందించింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఆర్‌బీఐ స్పష్టంగా చెప్పింది.  

రంగాచారి, కృష్ణరాజు నియామకం..  
డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్‌బీఐ చేతులెత్తేయడంతో చట్ట ప్రకారం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముందుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అక్రమాలపై నిగ్గు తేల్చి నివేదిక ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు (ఫైనాన్స్‌) ఎన్‌.రంగాచారిని, చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేసేందుకు, తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఐపీఎస్‌ టి.కృష్ణరాజును అ«దీకృత అధికారిగా నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ నియామకాలను సవాలు చేస్తూ రామోజీ 2006లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం 2007లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్‌ను కొట్టేసింది. 

ఐటీ శాఖ నుంచి సేకరించిన రంగాచారి.. 
డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రంగాచారి నిర్వహించిన విచారణకు రామోజీరావు, మార్గదర్శి సహకరించకుండా కార్యాలయాల్లో తనిఖీలకు అడ్డంకులు సృష్టించారు. తమ పిటిషన్లు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నాయని, డాక్యుమెంట్లు ఇచ్చేది లేదంటూ మొండికేశారు. దీంతో రంగాచారి ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ నుంచి తెప్పించుకున్నారు. ఆర్‌బీఐ చట్టం సెక్షన్‌ 45(ఎస్‌)కు విరుద్ధంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం నిజమేనని పేర్కొంటూ 2007 ఫిబ్రవరి 19న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వడ్డీ చెల్లించే అలవాటే మార్గదర్శికి లేదని, ఒత్తిడి చేస్తేనే చెల్లిస్తుందంటూ ఓ డిపాజిటర్‌ హైకోర్టుకు నివేదించటాన్ని తన నివేదికలో పొందుపరిచారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉందని, అది డిపాజిట్లను తిరిగి చెల్లించే స్థితిలో లేదని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు.  

రామోజీ పెట్టుబడి రూపాయైనా లేదు.. 
మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ద్వారా ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లను రామోజీ తన అనుబంధ కంపెనీలకు మళ్లించడమే నష్టాలకు ప్రధాన కారణమని రంగాచారి తన విచారణలో తేల్చారు. 2000, ఆ తరువాత బ్యాలెన్స్‌ షీట్‌లను గమనిస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో రామోజీ ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లతోనే మార్గదర్శిని నడిపారని నిగ్గు తేల్చారు.    

కోర్టు అనుమతితో తనిఖీలు.. 
మరోవైపు ఈ కేసులో అదీకృత అధికారిగా నియమితులైన కృష్ణరాజు కోర్టు అనుమతితో  మార్గదర్శి ఫైనాన్షియర్స్‌లో తనిఖీలు చేశారు. దీన్ని సవాలు చేస్తూ మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ 14.3.2007న కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనిపై రామోజీ హైకోర్టును ఆశ్రయించగా కింది కోర్టు ఇచ్చిన సెర్చ్‌ వారెంట్‌ను నిలుపుదల చేసింది. ఈ క్రమంలో చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావులను ప్రాసిక్యూట్‌ చేయాలని కోరుతూ అ«దీకృత అధికారి టి.కృష్ణరాజు 2008 జనవరి 23న నాంపల్లి మొదటి అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో ఫిర్యాదు (సీసీ నెంబర్‌ 540) చేశారు. దీన్ని కొట్టి వేయాలంటూ అదే ఏడాది రామోజీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.  

జస్టిస్‌ రజనీ స్టేతో మూలపడిన కేసు.. 
దీంతో దిక్కుతోచని రామోజీ 2010లో ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. అ«దీకృత అధికారి ఇచ్చిన ఫిర్యాదులో విచారణను సెక్షన్‌ 45(ఎస్‌)(1), 45(ఎస్‌)(2), 58బీ(5ఏ) రెడ్‌ విత్‌ సెక్షన్‌ 58(ఈ)లకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ నాంపల్లి కోర్టు 2011లో ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులపై మార్గదర్శి, రామోజీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్‌బీఐ చట్టం పరిధిలోకి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ రాదంటూ వాదించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ మార్గదర్శిపై కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ 20.7. 2011న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.‘‘స్టే’’ వల్ల కేసు అప్పటి నుంచి మూలనపడిపోయింది. అటు తరువాత వచ్చిన ప్రభుత్వాలు రామోజీ గుప్పిట్లో ఉండటంతో మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు.  

విచారణ.. తీర్పు.. ఒకే రోజు 
ఉమ్మడి హైకోర్టు విభజన 1.1.2019న జరిగింది. 31.12.2018 ఉమ్మడి హైకోర్టుకు చివరి రోజు. అటు న్యాయవాదులు ఇటు న్యాయమూర్తులు అందరూ భావోద్వేగ వాతావరణంలో ఉన్నారు. కేసుల విచారణపై దృష్టి సారించలేని పరిస్థితిని రామోజీరావు తనకు అనుకూలంగా మలచుకున్నారు. నాంపల్లి కోర్టులో అ«దీకృత కృష్ణరాజు చేసిన ఫిర్యాదును కొట్టేయాలంటూ 2011లో తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను రామోజీ విచారణకు తెప్పించారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ విచారణ జరిపారు. 

రామోజీరావు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రాను రంగంలోకి దించారు. లూథ్రా వాదనలు విన్న జస్టిస్‌ రజనీ ఇంత పెద్ద కేసులో అదే రోజు అంటే 31వతేదీన తీర్పు కూడా ఇచ్చేశారు. రామోజీ, మార్గదర్శి వాదనను సమర్ధించారు. హెచ్‌యూఎఫ్‌.. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌ 45ఎస్‌ పరిధిలోకి రాదని జస్టిస్‌ రజనీ తన తీర్పులో తేల్చేశారు. మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్‌ చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో అధీకృత అధికారి కృష్ణరాజు దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ తీర్పునిచ్చారు.  

ఇంత పెద్ద కేసులో ఒకే రోజు విచారణ జరిపి అదే రోజు తీర్పునివ్వడం అరుదైన ఘటన. అసలు ఈ కేసు విచారణకు వచ్చినట్లు గానీ, న్యాయమూర్తి ఈ విధంగా తీర్పునిచ్చినట్లుగానీ ఎవరూ గుర్తించలేదు. అటు తరువాత కొద్ది నెలలకు ఈ తీర్పు వెలుగు చూసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. జస్టిస్‌ రజనీ తీర్పుపై మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం. అటు తరువాత మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అప్రమత్తమై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2019 డిసెంబర్‌ 17న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం ఇంప్లీడ్‌ అయింది. 

హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీం.. 
హైకోర్టు తీర్పులో కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు 19.9.2020న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం17.8.2022న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అటు ఉండవల్లి అరుణ్‌ కుమార్, ఏపీ ప్రభుత్వం, ఇటు మార్గదర్శి, రామోజీరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు 2020 నుంచి విచారిస్తూ వచ్చింది. 

మార్గదర్శి, రామోజీరావు చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు విచారణ సందర్భంగా ఆర్‌బీఐ న్యాయవాది మౌఖికంగా కోర్టుకు తెలిపారు. చివరగా ఈ ఏడాది ఏప్రిల్‌ 9న సుప్రీంకోర్టు ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను ప్రాసిక్యూట్‌ చేయాలని కోరుతూ అదీకృత అధికారి కృష్ణరాజు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తేలప్రోలు రజనీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. 

కేసుల కొట్టివేతకు సుప్రీం నిరాకరణ.. 
డిపాజిట్లు తిరిగి ఇచ్చేశాం కాబట్టి తనపై కేసులు కొట్టేయాలంటూ ఇదే సమయంలో రామోజీ, మార్గర్శి ఫైనాన్షియర్స్‌ చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చట్ట విరుద్ధంగా సేకరించిన డిపాజిట్లపై నిగ్గు తేలాల్సిందేనని.. మార్గదర్శి, రామోజీకి అనుకూలంగా హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నామని స్పష్టం చేసింది. కేసు లోతుల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని, సీనియర్‌ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని  తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తాజాగా విచారణ జరిపి ఆరు నెలల్లో విచారణను ముగించాలని, సేకరించిన డిపాజిట్లకు సంబంధించి పబ్లిక్‌ నోటీసు ఇవ్వాలని తెలిపింది.  

తిరిగి విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు... 
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది జూన్‌లో తిరిగి విచారణ ప్రారంభించింది. విచారణ జరుగుతుండగానే రామోజీరావు మరణించగా ఆయన స్థానంలో హెచ్‌యూఎఫ్‌ కర్తగా తనను చేర్చాలని రామోజీ కుమారుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పలు దఫాలు వాయిదాల అనంతరం పూర్తిస్థాయి వాదనల నిమిత్తం ఈ నెల 7న విచారణ చేపట్టనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement