సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓ వర్గం మీడియా అరాచకం సృష్టిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం గుంటూరు జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి కోర్టుకు నివేదించింది. స్వార్థ, రాజకీయ, వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా వ్యక్తుల, ప్రభుత్వ, దర్యాప్తు సంస్థల ప్రతిష్టను దెబ్బ తీసేందుకు నిస్సిగ్గుగా ఆ మీడియా వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు వివరించారు.
వ్యక్తులు, ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలే లక్ష్యంగా తప్పుడు కథనాలు రాయడం, మీడియా ట్రయల్ నిర్వహించడం, తీర్పులిచ్చేయడం వంటి అరాచకాలకు ఆ మీడియా అడ్డాగా మారిందన్నారు. ప్రజా ప్రభుత్వాలను కూలదోసేందుకు తప్పుడు కథనాలను వండి వారుస్తోందని చెప్పారు. దర్యాప్తు సంస్థలను సైతం వదిలిపెట్టడంలేదని, తప్పుడు, బెదిరింపు కథనాలతో వాటి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
పత్రికా స్వేచ్ఛను అడ్డంపెట్టుకుని చట్టం నుంచి తప్పించుకునేందుకు మార్గదర్శి యాజమాన్యం ప్రయత్నిస్తోందన్నారు. వ్యక్తులను, ప్రభుత్వాన్ని, దర్యాప్తు సంస్థలను నాశనం చేయాలని చూస్తున్న ఈనాడు, దాని యాజమాన్యం విషయంలో తాము మౌనంగా చూస్తూ ఉండబోమన్నారు. చట్టానికి లోబడి ఏం చేయాలో అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో భాగాంగానే మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈనాడు, వాటి యాజమాన్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన కోర్టుకు వివరించారు.
న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టించేందుకు కూడా ఆ మీడియా వెనుకాడటం లేదన్నారు. టీవీల్లో చర్చల పేరుతో న్యాయమూర్తులను లంచగొండులుగా చిత్రీకరిస్తోందని వివరించారు. ప్రజాస్వామ్య, ప్రజా ప్రభుత్వాల మనుగడ కోసం ఇలాంటి తీరుకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన ఫిర్యాదును విచారణకు స్వీకరించి, నిందితులకు సమన్లు జారీ చేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వ ఫిర్యాదును పరిశీలించిన ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి వైవీఎస్‌బీజీ పార్థసారథి తదుపరి చర్యల నిమిత్తం విచారణను వాయిదా వేశారు.
వాదనల బాధ్యతను పొన్నవోలుకు అప్పగించిన ప్రభుత్వం..
ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్ట విరుద్ధ కార్యకలాపాలు, నిధుల మళ్లింపుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్న ఏపీ సీఐడీపై ఈనాడు దినపత్రిక యాజమాన్యం అసత్య కథనాలు ప్రచురిస్తోంది. ఇందులో భాగంగా మార్గదర్శిపై భారీ కుట్ర అంటూ ఇటీవల ఓ కథనం ప్రచురించింది.
సీఐడీపై పలు అసత్య ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈనాడు, రామోజీరావు, ఈనాడు ఎడిటర్, ఇతరులపై సీఆర్‌పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. గుంటూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసే ఫిర్యాదులో వాదనలు వినిపించే బాధ్యతలను ఏఏజీ సుధాకర్‌రెడ్డికి అప్పగించింది.
నిందితులుగా రామోజీరావు, కిరణ్, శైలజాకిరణ్ తదితరులు
ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగా గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మంగళవారం ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఇందులో ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, ఆ సంస్థ డైరెక్టర్ చెరుకూరి రామోజీరావు, ఆయన కుమారుడు కిరణ్, కోడలు శైలజా కిరణ్, ఈనాడు ఎడిటర్ నాగేశ్వరరావు, ఆ పత్రిక పాత్రికేయులు విశ్వప్రసాద్, ఎం.నరసింహారెడ్డి, కనపర్తి శ్రీనివాస్‌లను నిందితులుగా పేర్కొన్నారు. ఫిర్యాదుతో ఈనాడు ప్రచురించిన కథనం, ఫిర్యాదుల కాపీలు, ఎఫ్‌ఐఆర్‌లు, రామోజీరావు, కిరణ్‌ల వాంగ్మూలం, శైలజ రిమాండ్ రిపోర్టులు జత చేశారు.
ఫిర్యాదులోని ముఖ్యాంశాలు..
ఈనాడు ప్రచురిస్తున్న తప్పుడు, పరువు నష్టం కథనాల విషయంలో చూసీ చూడనట్లు ఉంటే, వారికి మరింత ధైర్యాన్ని ఇచ్చినట్లే అవుతుంది. నిందితులు వారికి మాత్రమే పరువు, ప్రతిష్టలున్నాయన్న భ్రమలో బతుకుతున్నారు. వారికి వారే చట్టంగా భావిస్తున్నారు. చట్ట ప్రకారం వారి ఫేమ్‌ను ఎవరు ప్రశ్నించినా వారిని ఫ్రేమ్‌లో ఇరికిస్తారు. వారిని ఎవరూ తాకకూడదన్న రీతిలో వారి తీరు ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి అధికారానికి, శక్తికి కోట బురుజులా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
దశాబ్దాలుగా ప్రభుత్వ యంత్రంగాలు మార్గదర్శి అక్రమాలకు ఆశ్రయం కల్పించాయి. మొదటిసారి ఏపీ సీఐడీ తనకు అందిన ఫిర్యాదుల ఆధారంగా వారి అత్యంత శక్తివంతమైన రక్షిత సామ్రాజ్యంపై దర్యాప్తు మొదలుపెట్టింది. దీని ఫలితంగానే సీఐడీపై ఈనాడు ఏప్రిల్ 13న తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఈనాడు వంటి ఓ వర్గం మీడియాకు పాత్రికేయం వృత్తికంటే వ్యాపారం అయిపోయింది.’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఫిర్యాదులో వివరించారు.
కర్త, కర్మ, క్రియ రామోజీరావే
‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, ఉషాకిరణ్ మూవీస్, కలోరమా ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితరాలకు రామోజీరావే కర్త, కర్మ, క్రియ. ప్రజల నాడిని, మనస్సులను ఆయనకు కావాల్సిన విధంగా మార్చగలనని రామోజీరావు భావిస్తుంటారు. సీఐడీ మనోస్థైర్యాన్ని దెబ్బతీసి, దాని పేరు ప్రతిష్టలను మంటగలపడాన్ని రామోజీరావు తదితరులు పిల్లాటగా భావిస్తున్నారు.
వారి ప్రయోజనాలకు అతికేలా, ప్రతిష్టాత్మక సంస్థ సీఐడీపై తప్పుడు, పరువు నష్టం కలిగించే కథనాన్ని ప్రచురించారు. సీఐడీపై యుద్ధం ప్రకటించారు. రామోజీరావు, ఆయన కుమారుడు, కోడలిని రక్షించేందుకు మిగిలిన నిందితులు సాయం చేశారు. ఈ తప్పుడు కథనంలో నిందితులందరికీ పాత్ర ఉంది.’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రామోజీరావును చట్టం ముందు నిలబెడతాం: ఏఏజీ
పత్రికా స్వేచ్ఛ ముసుగులో ప్రభుత్వ, ప్రజల స్వేచ్ఛను హరిస్తామంటే రామోజీరావును రాష్ట్ర ప్రభుత్వం తరఫున చట్టం ముందు నిలబెడతామని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిపై ఎలాంటి కక్ష లేదని తెలిపారు. అక్రమ వ్యాపారం చేసినా న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు గానీ ప్రశ్నించకూడదన్న రీతిలో రామోజీరావు, మార్గదర్శి యాజమాన్యం వ్యవహరిస్తున్నారన్నారు.
ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదంటూ విచిత్ర వాదన చేస్తున్నారని తెలిపారు. చిట్‌ఫండ్ సంస్థ చర్యలు అక్రమమని ప్రభుత్వం గానీ, దర్యాప్తు సంస్థలు గానీ గుర్తిస్తే ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టవచ్చని వివరించారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తన అడుగులకు మడుగులొత్తాలని రామోజీ భావిస్తారని, లేదంటే తన ఈనాడు ద్వారా విషపూరిత, బ్లాక్ మెయిల్ కథనాలను ప్రచురించి, ప్రజల మనస్సులను కలుషితం చేస్తారన్నారు. రెండు రోజుల్లో మరో క్రిమినల్ కేసు కూడా దాఖలు చేస్తామని తెలిపారు.
ఎస్టేట్‌ను కాపాడుకునేందుకు ఫోర్త్ ఎస్టేట్‌ను వాడుకుంటున్నారు..
‘చిట్‌ఫండ్ చట్ట నిబంధనల అమలులో భాగంగా విజయవాడ, గుంటూరు, అనంతపురం, నర్సరావుపేట, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నంలలోని చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. పలు ఉల్లంఘనలను, అక్రమాలను గుర్తించారు. మార్గదర్శి.. చిట్ మొత్తాలను నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ ఖాతాలకు బదిలీ చేసింది.
సెక్యూరిటీ ముసుగులో డిపాజిట్లు ఆమోదించింది. బ్యాలెన్స్ షీట్‌లను కూడా సమర్పించలేదు. దీంతో రిజిస్ట్రార్లు సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదులు ఇచ్చారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్, రామోజీరావు, కిరణ్, శైలజా కిరణ్ తదితరులపై కేసులు నమోదు చేశారు. దీన్ని భరించలేని రామోజీరావు తదితరులు మీడియా ముసుగులో ఈనాడులో తప్పుడు కథనాలతో సీఐడీపై విషం చిమ్మారు.
తమ ఎస్టేట్‌ను కాపాడుకునేందుకు ఫోర్త్ ఎస్టేట్‌ను వాడుకుంటున్నారు. వారి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్న దుగ్దతోనే ఇదంతా చేశారు. సీఐడీకి పక్షపాతాన్ని ఆపాదిస్తున్నారు. దర్యాప్తులో అడ్డంకులు సృష్టిస్తున్నారు. వారి యజమాని, కుటుంబ సభ్యుల ప్రయోజనాలు ప్రభావితం అయినప్పుడు, వారి గొంతుక అయిన ఈనాడు క్రోధాగ్నితో వారి ప్రయోజనాలకు అతికేలా తప్పుడు, పరువు నష్టం కలిగించేలా విషపూరిత కథనాలు ప్రచురిస్తుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించి నిందితులకు సమన్లు జారీ చేయాలని ప్రార్థిస్తున్నాం’ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన ఫిర్యాదులో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment